close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బాలీవుడ్‌లో తెలుగు దర్శకులు!

బాలీవుడ్‌లో తెలుగు దర్శకులు!

షోర్‌ ఇన్‌ ద సిటీ, గో గోవా గాన్‌, ఏ జెంటిల్‌మన్‌... ఈ బాలీవుడ్‌ సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇవి తెలుగు దర్శకులు తీసిన సినిమాలు. ‘బాలీవుడ్‌లో తెలుగు దర్శకులా’ అని ఆశ్చర్యపోతున్నారా, అవును, తెలుగు దర్శకులే. ‘రాజ్‌ అండ్‌ డీకే’గా పేరు సంపాదించిన ఆ దర్శక ద్వయం రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే తెలుగువారే. వీరి బాలీవుడ్‌ ప్రయాణం గురించి వాళ్ల మాటల్లోనే తెలుసుకుందాం!

రాజ్‌: నేను పుట్టి పెరిగింది తిరుపతిలో. నాన్న కృష్ణమూర్తి, ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ రమాదేవి, అక్కడ పద్మావతి కాలేజీలో ప్రొఫెసర్‌. అన్నమయ్య పాటలు పాడే ప్రముఖ గాయని శోభ రాజ్‌ నాకు చిన్నమ్మ. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. కృష్ణ అక్కడే పరిచయం.

డీకే: మా సొంతూరు చిత్తూరు. నాన్న కుప్పుస్వామి, అమ్మ శాంత. నాన్న న్యాయవాది. నా చిన్నపుడే చనిపోయారు. అమ్మ ప్రభుత్వోద్యోగి. ఇప్పుడు రిటైరైంది. ఇంటర్‌ వరకూ చిత్తూరులోనే చదువుకున్నాను. తర్వాత తిరుపతిలో కంప్యూటర్స్‌లో ఇంజినీరింగ్‌ చేశాను. సినిమాలు చూడటం అందరిలాగే మాకూ ఇష్టం. కాలేజీ రోజుల్లో సినిమాలు చూసి వాటి గురించి చర్చించుకునేవాళ్లం. అలా చూసిన వాటిలో శివ, గీతాంజలి, క్షణక్షణం మాపైన బాగా ప్రభావం చూపాయి.

అమెరికాలో ఉద్యోగం
రాజ్‌: ఇంజినీరింగ్‌ తర్వాత ఇద్దరం అమెరికాలో మాస్టర్స్‌ చేసి ఆపైన ఉద్యోగాల్లో చేరాం. మూడు నాలుగేళ్లయ్యాక ఉద్యోగం బోర్‌ కొట్టేసింది. ఉద్యోగంలో స్థిరపడ్డాం కాబట్టి పెళ్లి చేస్తారు. ఆపైన ఇల్లు కొనడం, పిల్లలు... ఆ రొటీన్‌ కళ్ల ముందు కనిపించింది. జీవితం ఇక అందరిలానే అనిపించింది. అమెరికాలోనూ సినిమాలు చూసేవాళ్లం. ‘ఉద్యోగం కాకపోతే’ అని ఆలోచించినపుడు మాకు సినిమానే గుర్తొచ్చింది. నిజానికి ప్రతి భారతీయుడిలో సినిమా మేకర్‌ ఉంటాడనేది మా ఉద్దేశం. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ సినిమా ఆలోచనలు ఉంటాయి.

డీకే: మామూలుగా సినిమాల్లోకి రావాలంటే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేయనిదే, డైరెక్టర్‌గా అవకాశాలు రావు. దానికి చాలా సమయం పడుతుంది. అలా లైన్లో నిల్చోవడం మాకు ఇష్టంలేదు. అందుకే అమెరికాలోనే వారాంతాల్లో సినిమా ప్రయత్నాల్లో ఉండేవాళ్లం. సినిమాలపైన జరిగే సదస్సులకు వెళ్లేవాళ్లం. అప్పటికి ‘షార్ట్‌ ఫిల్మ్స్‌’ కాన్సెప్ట్‌ ఇంకా రాలేదు. కెమెరాలు కొని స్వల్ప నిడివి సినిమాలు తీసేవాళ్లం. వాటికి స్నేహితుల నుంచి మంచి స్పందన వచ్చేది. దాంతో మా ఆత్మవిశ్వాసం పెరిగింది. అలా తీసిన వాటిలో ‘జెస్ట్‌ మి’ని సినిమా ఫెస్టివల్స్‌కి పంపిస్తే బాగా గుర్తింపు వచ్చింది. మా సినిమాలకి ఎడిటింగ్‌, సంగీతం అన్నీ మేమే చేసేవాళ్లం. దాంతో సాంకేతికంగా చాలా విషయాలు తెలిశాయి. ఆ అనుభవంతో ఇప్పుడు మేం సాంకేతిక నిపుణుల దగ్గర కూర్చొని ఎడిటింగ్‌, కలర్‌ గ్రేడింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌, సౌండ్‌ మిక్సింగ్‌- అన్నీ మాకు కావాల్సినట్టు చేయించుకుంటాం.

రాజ్‌: ఫీచర్‌ ఫిల్మ్‌ సొంతంగా తీసేంత డబ్బు మా దగ్గరలేదు. నిర్మాతని పట్టుకోవడమూ కష్టమే అని తెలుసు. అందుకని తక్కువ బడ్జెట్‌లో ఓ సినిమా తీయడానికి ప్లాన్‌ చేశాం. మేమిద్దరం పొదుపు చేసుకున్న డబ్బుకి తోడు మరో 10మంది స్నేహితులతో కలిసి ప్రవాస భారతీయుల జీవనశైలి నేపథ్యంతో ‘ఫ్లేవర్స్‌’ అనే సినిమా తీశాం. అది ఎన్‌ఆర్‌ఐ వర్గాలకు పిచ్చిగా నచ్చింది. ఓసారి ఇండియా వస్తుంటే విమానంలో మా వెనక సీట్లో ఉన్నవాళ్లు దానిగురించే మాట్లాడుకుంటున్నారు. చూస్తే ఫ్లైట్‌లో ఆ సినిమా వేశారు. ఇప్పటికీ స్టార్‌ వరల్డ్‌లో తరచూ వస్తుంటుంది.

డీకే: ఫ్లేవర్స్‌ ప్రధానంగా ఇంగ్లిష్‌లో తీసిన సినిమా అయినా కూడా హిందీ, తెలుగు డైలాగులూ ఉంటాయి. సంగీతం కూడా మూడు సంస్కృతుల్ని ప్రతిబింబిస్తుంది. ఒక ఫార్ములాలా తీయకుండా ప్రయోగం చేశాం. ఆ సినిమాని టోక్యో, ఇటలీ, హవాయీ లాంటి అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించాం. అప్పుడే ఇండియా వచ్చేయాలనుకున్నాం. కానీ సరిపడా డబ్బులేదు. ఎప్పటికీ డబ్బు కోసం రాజీ పడి సినిమాలు తీయకూడదు అనుకున్నాం. అందుకని మరికొన్నాళ్లు ఉద్యోగాల్లో కొనసాగాం.

నాగార్జున రమ్మన్నారు
రాజ్‌: నాగార్జున గారు ‘ఫ్లేవర్స్‌’ చూసి అమెరికాలో ఉన్న మాకు ఫోన్‌ చేసి ఇండియా వచ్చి కలవమన్నారు. నాగ్‌ ప్రయోగాలకు సిద్ధపడే హీరో, అందుకని వచ్చి ఆయనకి ఒక కథ చెప్పాం. ఆ సమయంలో అశ్వినీదత్‌ గారిని కలిసి మరో కథ వినిపించాం. అవి చర్చల దశలో ఉన్నపుడే ముంబయిలో జరిగిన ఓ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి వెళ్లాం. అక్కడ ఫ్లేవర్స్‌ ప్రదర్శించారు. ముంబయి వెళ్లడం అదే మొదటిసారి. చాలా మంది మమ్మల్ని పలకరించారు. ‘హిందీలో ఎప్పుడు తీస్తారు’ అని అడిగారు. అప్పటివరకూ మాకు బాలీవుడ్‌ ఆలోచనే లేదు. ముంబయిలో కొందరు స్నేహితులున్నారు. వాళ్లు కూడా వాళ్లింట్లో కొన్నాళ్లు ఉండి సినిమా ప్రయత్నాలు చేయమన్నారు.

డీకే: ముంబయి వాతావరణం చాలా చిత్రంగా అనిపించింది. ఆ మహానగరంలో కోటీశ్వరులూ, మధ్య తరగతి, పేదలూ... పక్కపక్కనే ఉంటారు. అయినా ఎవరి ప్రపంచం వారిది. ఆ నేపథ్యంతో ‘షోర్‌ ఇన్‌ ద సిటీ’ అనే కథ రాశాం. అలాంటి కథతో ఇండియాలో అప్పటివరకూ ఎవరూ సినిమా తీయలేదు. ఆ కథని ఒప్పించడం కష్టమవుతుందని అర్థమైంది. అప్పటికి మా దగ్గర మరో కథ సిద్ధంగా ఉంది. 1999లో వెలుగుచూసిన క్రికెట్‌ బెట్టింగ్‌ నేపథ్యంతో ఆ కథ రాశాం. దానికోసం నటీనటుల్నీ, నిర్మాతల్నీ సంప్రదించాం. మాకు అప్పటికి హిందీ అంతగా రాదు, అమెరికా యాసలో ఇంగ్లిష్‌ మాట్లాడుతుంటే, ‘మీకు అసలు సినిమా అంటే తెలుసా’ అన్నట్టు చూసేవారు. మరోవైపు తెలుగులో అనుకున్న ప్రాజెక్టులు కాలేదు. ముంబయిలో అలా ఖాళీగా ఉండటం కష్టమనిపించింది. దాంతో నాలుగు నెలల తర్వాత మళ్లీ అమెరికా వెళ్లి ఓ ఐటీ కన్సల్టెన్సీ ప్రారంభించాం. అక్కడ ఉంటూనే మధ్య మధ్యలో వచ్చి ఇక్కడ ప్రయత్నాలు చేసేవాళ్లం.

బాలీవుడ్‌లో మొదలు
డీకే: రెండేళ్లు ఆదాయం లేకపోయినా కూడా బతికేందుకు సరిపోయేంత డబ్బు సంపాదించి 2007లో తిరిగి ఇండియా వచ్చాం.

అనుపమ్‌ మిత్తల్‌ అని మా స్నేహితుడు ముందుకు రావడంతో క్రికెట్‌ బెట్టింగ్‌ కథ ‘99’ పేరుతో తీశాం. 2009లో రిలీజై బాగా ఆడింది. ఈరోజుల్లో సినిమా రెండు వారాలు ఆడటం గొప్ప విషయం. అది ఏడు వారాలు ఆడింది. తర్వాత పెద్దగా కష్టపడకుండానే క్రైమ్‌ కామెడీ అయిన ‘షోర్‌ ఇన్‌ ద సిటీ’కి అవకాశం వచ్చింది. ఆ సినిమా నిర్మాణానికి బాలాజీ ఫిల్మ్స్‌ ముందుకు వచ్చింది. అది బాగా వసూళ్లు రాబట్టింది. ‘షోర్‌ ఇన్‌ ద సిటీ’ లాంటి సినిమాలు చేయమని తర్వాత చాలామంది అడిగారు. కానీ ఒకేలాంటి సినిమాలు చేస్తే మూసలో పడిపోతామని చేయలేదు.

రాజ్‌: మొదటి రెండు కథలకూ భిన్నంగా ఈసారి ఫన్నీ, క్రేజీ నేపథ్యంతో కథ రాసుకున్నాం. దాన్ని సైఫ్‌ అలీ ఖాన్‌కి వినిపిస్తే... ఆయనే నటించి నిర్మిస్తామన్నారు. అదే ‘గో గోవా గాన్‌’. తర్వాత కార్పొరేట్‌ సంస్థలూ దీని నిర్మాణంలో భాగమయ్యాయి. ఆ సినిమాతో ‘జాంబీ కామెడీ’ అనే కాన్సెప్ట్‌ని బాలీవుడ్‌కి పరిచయం చేశాం. అదో రకం దెయ్యాల కథ. సినిమా హిట్‌. యువతకి బాగా నచ్చింది. ఇప్పటికీ పార్ట్‌-2 తీయమని అడుగుతుంటారు. మాకు సీక్వెల్స్‌పైన అంత ఆసక్తి లేదు. దీనికి మాత్రం మినహాయింపు ఇచ్చి తీద్దామనుకుంటున్నాం. చూడాలి! గో గోవా... తర్వాత ‘హ్యాపీ ఎండింగ్‌’ అని సైఫ్‌తోనే మరో సినిమా తీశాం. అది అనుకున్నంత హిట్‌ కాలేదు. తాజాగా సిదార్థ మల్హోత్రా హీరోగా ‘ఏ జెంటిల్‌మన్‌’ తీశాం. యాక్షన్‌, కామెడీ ప్రధానంగా ఉండే ఈ సినిమా కూడా హిట్‌ అయింది.

టాలీవుడ్‌లో నిర్మాతలుగా
రాజ్‌: సిరాజ్‌ అని మా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కొన్నాళ్ల కిందట ఓ కథ చెప్పాడు. మేమూ, హీరో నానీ కలిసి ఆ సినిమా నిర్మించాం. అదే ‘డీ ఫర్‌ దోపిడీ’. టాలీవుడ్‌లో దర్శకులుగా కాకుండా ముందు నిర్మాతలుగా అడుగు పెట్టామన్నమాట. మేం వాణిజ్య ప్రకటనలూ తీస్తుంటాం. వాటిని ఎక్కువగా హైదరాబాద్‌లోనే షూట్‌ చేస్తాం. ఇక్కడ పనిచేయడం ఎంతో హాయిగా ఉంటుంది. ఫుడ్‌ పరంగా ఇండియాలో హైదరాబాదే బెస్ట్‌.

డీకే: ఎప్పటికైనా తెలుగులో సినిమా తీస్తాం. అలాగని ఏదో ఒకటి తీసేయాలన్న తొందర మాకు లేదు. ఇప్పటికే చిరంజీవి, మహేష్‌బాబులను కలిసి కథలు వినిపించాం. కానీ అవి వర్కవుట్‌ కాలేదు. ఆ లోటు తీర్చుకోవడానికి మా సినిమాల్లో తెలుగుదనం కనిపించేలా సీన్లు సృష్టిస్తాం. ‘గో గోవా గాన్‌’ ఫస్ట్‌ సీన్లోనే చిరంజీవి పాట వినిపిస్తుంది.

పేర్లు రెండు... బ్రాండ్‌ ఒకటి
రాజ్‌: ఇద్దరు డైరెక్టర్లని పిలిచి ఒక సినిమా తీయమంటే వాళ్లు కచ్చితంగా కొట్టుకొని వెళ్లిపోతారు. మా సంగతి వేరు. మా ఆలోచనలూ, అభిరుచులూ, భావోద్వేగాలూ ఒకేలా ఉంటాయి. మేం ముందు ఫ్రెండ్స్‌, క్లాస్‌మేట్స్‌. మొదట్నుంచీ ప్రతి ప్రాజెక్టుకీ కలిసే పనిచేస్తున్నాం. ఇద్దరం అన్న ఫీలింగ్‌ రాదు. నిర్మొహమాటంగా చర్చించుకొని నిర్ణయం తీసుకుంటాం. నేను రాసే సీన్లు తనకు చూపించి అభిప్రాయం అడగుతాను. అలాగే తను రాసింది చూపిస్తే నా అభిప్రాయం చెబుతాను.

డీకే: మా ఇద్దరి నేపథ్యం దాదాపు ఒకటే. ఒక ఐడియా వస్తే దానిపైన భిన్న కోణాల్లో చర్చిస్తాం. ఒక్కోసారి ఆ కథ ఫైనల్‌ కావడానికి ఏడాది పడుతుంది. మా దగ్గర ఎప్పుడూ నాలుగైదు కథలు సిద్ధంగా ఉంటాయి. లైన్‌ ఓకే అనుకున్నాక రెండు మూడు నెలల్లో స్క్రిప్టు సిద్ధం చేసుకుంటాం. ఇద్దరమూ సెట్‌లో ఉండి పనుల్ని పంచుకుంటాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ సమయంలో ఒకరు వీఎఫ్‌ఎక్స్‌ పనులు చూస్తుంటే ఇంకొకరం మిక్సింగ్‌ చూస్తాం. మమ్మల్ని చూసి బయటవాళ్లు జెలస్‌గా ఫీలవుతుంటారు. ఇద్దరం ఇప్పటివరకూ ఆరు సినిమాలకి పనిచేశాం. వాటికి ‘రాజ్‌ అండ్‌ డీకే’ సినిమాలుగానే గుర్తింపు ఉంది.

సినిమా అమ్మాయిలే
రాజ్‌: ప్రస్తుతానికి ఇద్దరం ముంబయిలోనే ఇల్లుకొనుక్కొని స్థిరపడ్డాం. నేను ఆఫీసుకి రోజూ వెళ్లను. ముంబయిలో ఎక్కడ కొత్తగా కాఫీషాప్‌ తెరిచినా అక్కడకి వెళ్లి రోజంతా గడుపుతాను. ఏదైనా కేఫ్‌ వెరైటీగా ఉందంటే వెళ్లి చూసొస్తాను. నచ్చితే అక్కడే కూర్చొని స్క్రిప్టు రాసుకుంటాను. ఒకసారి సినిమా మొదలైతే, అదే ప్రపంచం. లేనపుడు సంగీతం వింటాను. సంగీతంలో నాకు ప్రవేశం ఉంది. ఇంకా ఖాళీ దొరికితే సైక్లింగ్‌కి వెళ్తాను. నాకు పెళ్లయి రెండేళ్లవుతోంది. నా శ్రీమతి షామలీ డే. తను బెంగాలీ. సినిమాల్లో క్రియేటివ్‌ డైరెక్టర్‌. రంగ్‌దే బసంతి, ఓంకార, దబాంగ్‌-2 సినిమాలకు దర్శకత్వ విభాగంలో పనిచేసింది. పెళ్లికి ముందు మాతో ఒక సినిమాకి పనిచేసింది.

డీకే: నా శ్రీమతి అనూరాధ. తను బాలీవుడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఉత్తరాదివాళ్లు. నాకు సినిమాలే జీవితం. నా హాబీయే వృత్తి. మేం సినిమాలు తీయనపుడు వేరొకరి సినిమాలు చూస్తాను. ఇప్పుడు వెబ్‌ సిరీస్‌లు ఎక్కువగా వస్తున్నాయి. ఆ ట్రెండ్‌ని గమనిస్తున్నాను. ఎందుకంటే మా నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ అదే. అమెజాన్‌తో 10 ఎపిసోడ్లు ఉండే ఒక వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాం. ఇప్పటివరకూ రెండు గంటల్లో ముగిసే కథల్నే చెబుతూ వచ్చాం. ఇప్పుడు ఆరేడు గంటల కథ తీస్తున్నాం. ఇది తీయడానికి ఏడాది పడుతుంది. ఆ తర్వాతే కొత్త సినిమా!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.