close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కెరటాలు

కెరటాలు
- భాగవతుల రమాదేవి

కాలింగ్‌బెల్‌ చప్పుడుకి పూజ చేసుకుంటున్న పద్మ తలుపు తీసి చూసింది. ఎదురుగా ఇంతకుముందు ఎప్పుడూ చూడని అమ్మాయి కన్పించేసరికి ‘‘ఎవరు కావాలమ్మా’’ అని అడిగింది.

‘‘సారీ ఆంటీ, ఇంత పొద్దుటే వచ్చి మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్నట్లున్నాను. నా పేరు క్రాంతి. మీ ఎదురుగా ఉన్న ఇంట్లోకి రేపు వస్తున్నాము. ఏదైనా సాయం కావాల్సొస్తే మిమ్మల్ని అడగమని మా ఇంటి ఓనరుగారు చెప్పారు. మీరు ఏమీ అనుకోకపోతే చిన్న హెల్ప్‌ చేయగలరా ఆంటీ’’ మర్యాదగా అడిగింది ఆ అమ్మాయి.

‘‘ఫరవాలేదమ్మా, ఏం కావాలో చెప్పు’’ అడిగింది పద్మ.

‘‘రేపటి నుంచీ మాకు పాలు కావాలి ఆంటీ, వీలుంటే ఎవరైనా పని అమ్మాయి కూడా దొరికితే చూసిపెట్టగలరా? సారీ, మొదటిరోజే ఇన్ని పనులు మీకు చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి. కొత్తగా వచ్చాం కదా, ఇంకా ఎవరూ పరిచయం కాలేదు’’ నొచ్చుకున్నట్లుగా చెప్పింది క్రాంతి.

‘‘ఫరవాలేదమ్మా, ఇంత చిన్న పనికి అంత బాధపడనక్కరలేదు. బయట నిలబడే మాట్లాడుతున్నావు. మొదటిసారి మా ఇంటికి వచ్చావు, కాఫీ తాగి వెళ్దువుగానీ’’ ఆహ్వానించింది పద్మ.

‘‘సారీ ఆంటీ, కింద మావారు నాకోసం ఎదురుచూస్తుంటారు. ఆఫీసు దగ్గరని ఇక్కడ ఇల్లు తీసుకున్నాం. ఆఫీసు టైము అయిపోయింది, రేపు కలుస్తాం’’ హడావుడిగా వెళ్ళిపోయింది క్రాంతి.

మాటకిముందు ఒకసారీ వెనక ఒకసారీ ‘సారీ’ చెప్పడం ఈ అమ్మాయికి అలవాటు కాబోలు. అయినా సరదాగానే ఉంది కాబట్టి త్వరగా కలిసిపోగలదు. తనకి మళ్ళీ టైమ్‌పాస్‌ అవుతుంది అనుకుంది పద్మ.

ఆరోజు పనమ్మాయి రాగానే ‘‘ఎదురింట్లో పని చేయడానికి ఒక అమ్మాయి కావాలట. ఎవరైనా ఉన్నారా?’’ అని అడగ్గానే,

‘‘వేరేవాళ్ళు ఎందుకమ్మా, నేనే చేసుకుంటాను’’ అని చెప్పి, ఒక సమస్యని పరిష్కారం చేసింది.

ఇక పాలబ్బాయికి చెప్తే ఆ పని కూడా అయిపోతుంది అని ఫోను చేయడానికి లేచింది పద్మ.

మర్నాడు అన్నట్టుగానే ఇంట్లో సామాన్లతోపాటు దిగారు క్రాంతి వాళ్ళు. ఒక గంటసేపు తరవాత పాలు పట్టుకుని వెళ్ళి, ‘‘ఏమైనా సాయం కావాలమ్మా’’ అని పద్మ అడిగేసరికి-

‘‘థ్యాంక్‌ü్స ఆంటీ, ఇప్పుడే టిఫిన్‌ తిని వచ్చాం. మధ్యాహ్నం భోజనం మా ఫ్రెండు ఒకమ్మాయి తెచ్చిపెడతానంది. కాబట్టి వంటపని కూడా లేదు. అన్నట్టు... మావారిని పరిచయం చేయలేదు కదూ, ఈయనే మావారు... పేరు ప్రదీప్‌. చాలా తక్కువ మాట్లాడతాడు. అయినా మా ఆయన వంతు కూడా నేనే మాట్లాడుతూ మీకు బోరు కొట్టిస్తాలెండి’’ నవ్వుతూ చెప్పింది క్రాంతి.

‘‘అంత బోరు కొట్టించేంత మాట్లాడటానికి మీకు టైమ్‌ ఎక్కడుంటుందమ్మా. శని, ఆదివారాలు సెలవులు ఉన్నా మీ షాపింగులూ సినిమాలూ మీకు ఉండనే ఉంటాయి. ఇక్కడ మొత్తం పాతిక ఇళ్ళు ఉన్నా అందరూ మీలాగా ఉద్యోగాలు చేస్తున్నవారే. మాలాంటి పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నా మనవలతో బిజీగా ఉంటారు. ఎప్పుడో కలిసినప్పుడు ‘హలో’ అని పలకరించుకోవడం తప్ప, ఒకరింటికి ఒకరు రావటం అనేది కుదరదు’’ అంటున్న పద్మ మాటల్ని మధ్యలోనే ఆపేసి,

‘‘మీరు అలా అనుకోకండి ఆంటీ, నేను పొద్దుటే వెళ్ళి ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాను. ప్రదీప్‌ కాస్త లేటుగా వెళ్ళి రాత్రి తొమ్మిది గంటలకి వస్తాడు. కాబట్టి ఆఫీసు నుంచి డైరెక్టుగా మీ ఇంటికే వచ్చేస్తాను’’ భయపెడుతున్నట్టు హాస్యంగా చెప్తున్న క్రాంతి మాటలకి నవ్వుకుంది పద్మ.

భర్త ఇంట్లో ఉన్నా ఆయన పుస్తకాలు చదవడం, టీవీలో న్యూస్‌ చూస్తూ కాలక్షేపం చేయడమేగానీ, ఎక్కువగా మాట్లాడటం అలవాటు లేదు కాబట్టి పద్మకి ఇంట్లో కాలక్షేపం చేయడం కష్టంగానే ఉంటుంది. సిటీలో అన్నదమ్ములూ అక్కాచెల్లెళ్ళూ వాళ్ళ పిల్లలూ ఉన్నా రోజూ కలుసుకోవడమంటే ఒక వూరి నుంచి ఇంకో వూరు వెళ్ళినట్లే ఉంటుంది.

క్రాంతి అన్నట్టుగానే రోజూ రాత్రి ఆరు గంటలకి వచ్చి, ఒక గంటసేపు కూర్చొని కబుర్లు చెప్పి వెళ్ళేది. తనకి ఒక పెళ్ళైన అన్నయ్య అమెరికాలో ఉంటున్నాడనీ, అమ్మా నాన్నలు ఆరు నెలలు అక్కడా, ఆరు నెలలు ఇక్కడా ఉంటారనీ చెప్పింది.

ఇక ప్రదీప్‌కి ఒక చెల్లెలు ఉందనీ, ఈమధ్యే ఒక పాప పుట్టిందనీ, ప్రదీప్‌కి వాళ్ళ అమ్మా, నాన్నా, చెల్లెలూ అంటే చాలా ఇష్టమనీ చెప్పింది.

‘‘అసలు మా అత్తయ్యా, మావయ్యల్ని మాతోనే ఉండమని చెప్పాను ఆంటీ. ‘మీరిద్దరూ ఉద్యోగాలకి వెళ్ళిపోతే మాకేం తోస్తుంది, ఇక్కడైతే మనవాళ్ళంతా ఉన్నారు. మేము ఎక్కడికీ రాం’ అని కచ్చితంగా చెప్పేశారు ఆంటీ. అందుకే, నెలకి ఒకసారి మేమే వెళ్ళివస్తాం. మావారికేమో వాళ్ళమ్మగారు చేసిన వంటలు ఇష్టం. నాకు ఇంకా వంట చేయడం బాగా అలవాటు కాలేదు ఆంటీ. పెళ్ళి అయి ఎనిమిది నెలలు అయినా ఇంకా ప్రాక్టీసులోనే ఉన్నావంటూ వెక్కిరిస్తాడు ఆంటీ. మీ దగ్గర అన్ని వంటలూ నేర్చుకుని మా ఆయనకి సర్‌ప్రైజ్‌ చేస్తా’’నంటూ గలగలా మాట్లాడే క్రాంతి కబుర్లతో పద్మకి రోజులు బాగానే గడిచిపోయేవి. ఇలా వాళ్ళిద్దరి అనుబంధం ఒక నాలుగు నెలలు సాఫీగా సాగిపోయింది.

కారణం తెలీలేదుగానీ క్రాంతి రెండు రోజులుగా బయటకు రాకపోవడాన్ని పద్మ గ్రహించినా ఇంట్లో చుట్టాలతో బిజీగా ఉండటంతో అంతగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఏదో విధంగా తీరుబాటు చేసుకుని మర్నాడు చుట్టాలు వెళ్ళిపోయాక వెళ్ళి పలకరించి రావాలనుకుంది. కానీ, ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకి ప్రదీప్‌ వచ్చి తలుపుకొట్టి ‘‘ఆంటీ, అర్జంటుగా మా ఇంటికి రండి’’ అంటూ కంగారుగా పిలిచేసరికి క్రాంతికి ఏమైందోనన్న భయంతో వాళ్ళింటికి వెళ్ళింది పద్మ.

పద్మ వెళ్ళేసరికి క్రాంతి మంచం మీద పడుకొని ఉంది. పద్మని చూసి లేచి కూర్చుందిగానీ పలకరించలేదు. పక్కనే సూట్‌కేసులు రెండు సర్ది ఉన్నాయి.

‘‘ఏమైంది ప్రదీప్‌, ఎవరికైనా ఒంట్లో బాగోలేదని ఫోను వచ్చిందా, అర్జంటుగా వూరు వెళ్తున్నారా?’’ ఆత్రుతగా అడుగుతున్న పద్మ ప్రశ్నలకి,

‘‘లేదు ఆంటీ, నేను ఏదో చిన్నమాట అడిగేసరికి నామీద కోపంతో క్రాంతి ఇంటి నుంచి వెళ్ళిపోతానని గొడవ చేస్తోంది. క్రాంతివాళ్ళ అమ్మగారూ నాన్నగారూ కూడా ప్రస్తుతం వూర్లో లేరు. క్రాంతి ఇప్పుడు ప్రెగ్నెంటని అనుమానంగా ఉంది ఆంటీ. ఈ టైములో ఇలా మొండితనం చేస్తోంది, మీరైనా చెప్పండి ఆంటీ’’ దాదాపు ఏడుస్తున్నట్టుగా చెప్పాడు ప్రదీప్‌.

‘‘నువ్వన్నది చిన్నమాట అని నువ్వు అనుకుంటే సరిపోతుందా, దానికి నేను ఎంత హర్ట్‌ అవుతానోనని నువ్వు ఆలోచించావా’’ కోపంతో వూగిపోతూ అడిగింది క్రాంతి.

‘‘మీకు తెలీదు ఆంటీ, ఈయన నన్ను ఎంత కంట్రోల్లో ఉంచుదామని అనుకుంటున్నాడో - మూడు రోజుల కిందట మా ఫ్రెండు తన పెళ్ళికోసం నగలు కొనుక్కుంటానంటే నగల దుకాణానికి వెళ్ళాం. అక్కడ నాకు ఒక నెక్లెస్‌ సెట్‌ బాగుందన్పించి తీసుకున్నాను. ఈయనగారికి చెప్దామనుకుంటే ఆఫీసులో మీటింగులో ఉన్నట్లు మెసేజ్‌ వచ్చింది. నేను సంపాదించుకుంటున్న డబ్బుతో నాకిష్టమైనది కొనుక్కునే రైటు నాకు లేదా ఆంటీ? మొన్నటికి మొన్న కారు కొందామని కూడబెట్టినదంతా విజయవాడలో ఏదో స్థలం అమ్మకానికి వచ్చిందని వాళ్ళ నాన్నగారు చెప్తే ఉన్నదంతా వూడ్చి ఇచ్చేశాడు. తన చెల్లెలికీ, వాళ్ళబాబుకీ ఏవేవో కొని పంపిస్తూనే ఉంటాడు.. నేనేమైనా పట్టించుకున్నానా? ఇప్పుడంత అర్జంటుగా స్థలం కొనకపోతేనేం, ‘కారు’ అవసరం కదా, నా మాట విన్పించుకోలేదు. నేను సరదాపడి ఒక నెక్లెస్‌ నా డబ్బుతో కొనుక్కుంటే మాత్రం- ‘అది కొనడం అంత అవసరమా?’ అని నన్ను అడుగుతున్నాడు.’’ ‘నా డబ్బు’ అనే మాటని ఒత్తి పలుకుతూ ఆవేశంతో చెప్పింది క్రాంతి.

‘‘అదికాదు ఆంటీ, మొన్న విజయవాడలో నాన్న ఫ్రెండు ఒకాయన కొంచెం తక్కువ ఖరీదుకే తన స్థలం నాన్నకి కావలిస్తే అమ్ముతానని చెప్పారట. మళ్ళీ అటువంటి అవకాశం రాదని తను రిటైర్‌ అయిన తరవాత వచ్చిన డబ్బులు కొంత ఇస్తాననీ, నన్ను కూడా కొంచెం డబ్బు పంపించమనీ నాన్నగారు ఫోన్‌ చేశారు ఆంటీ. ఆ స్థలం కూడా మా ఇద్దరి పేరునే రిజిస్టర్‌ చేయించారు.

లోను తీసుకుని కారు కొందామనే అనుకుంటున్నాను ఆంటీ, తన నెక్లెస్‌ రెండు లక్షలుపెట్టి కొన్నాననేసరికి ‘అది ఇప్పుడు అంత అవసరమా?’ అని అడిగాను. కానీ, ఈ మాటకి తను అంతలా ఫీల్‌ అవుతుందని అనుకోలేదు. అప్పటినుంచీ నేను అన్న మాటకి బాధపడుతూ క్షమించమని అడుగుతూనే ఉన్నాను ఆంటీ. మరోసారి మీముందు కూడా తనకి ‘సారీ’ చెప్తున్నా, తనకి నచ్చచెప్పండి ఆంటీ’’ చాలా ఫీల్‌ అవుతూ చెప్పాడు ప్రదీప్‌.

‘‘వద్దు ఆంటీ, నన్ను ఎవరూ బలవంత పెట్టకండి. నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేదిలేదు. ఆయన సంపాదన ఆయనిష్టం. నేను సంపాదించుకున్నదానితో ఎవరిమీదా ఆధారపడకుండా బతగ్గలను’’ ఎవరిమాటా విన్పించుకోకుండా చెప్పింది క్రాంతి.

‘‘చూడమ్మా క్రాంతీ, ఎన్నోసార్లు నువ్వు నాతో మీ అమ్మతో చెప్పినట్లు చనువుగా ఎన్నో చెప్పుకున్నావు. అదే అభిప్రాయంతో ఈరోజు మా జీవితంలో జరిగిన ఒక సంఘటన నీకు చెప్తాను. అది విన్న తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేద్దువుగాని’’ అని చెప్పడం మొదలుపెట్టింది పద్మ.

‘‘మీరు ఇంటికి వచ్చిన కొత్తలో ‘ఆంటీ, మీ పిల్లలు మీ దగ్గరలేరా?’ అని నువ్వు అడిగినప్పుడు ‘మాకు పిల్లలే లేర’ని నేను నీకు అబద్ధం చెప్పాను. కానీ, మాకు నీలాంటి ఒక కూతురు ఉండేది. నీలాగే చలాకీగా ఉండేది. పేరు శాంతి. ఎంత తెలివైందో అంత మొండి పట్టుదల కూడా తనలో ఉండేది. దానికి కారణం మీ అంకుల్‌- దానికి చేసిన గారాం కావచ్చు. అది ఏది అడిగినా ‘లేదు’ అని చెప్పేవారు కాదు. ‘మరీ అంత ముద్దు చెయ్యకండి’ అని నేను వారించినా ‘ఒక్కగానొక్క పిల్లకి ఆ మాత్రం ముద్దూ ముచ్చటా చెయ్యొద్దా’ అని నన్ను వారించేవారు.

ఇంజినీరింగు చదవడం పూర్తి అయిన తరవాత మేం పెళ్ళి ప్రస్తావన తన దగ్గర తెచ్చినప్పుడు ‘నేనే మీకు చెప్దామనుకుంటున్నానమ్మా, నేను నాతోపాటు చదువుకున్న రవిని పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను. ఇద్దరికీ నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉంది. మీరు కులం, గోత్రం అని పట్టించుకుని ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే మేమే రిజిస్టరు పెళ్ళి చేసుకుంటాం. రవి వాళ్ళ అమ్మా నాన్నా ఒప్పుకున్నారట. మీరు ఒప్పుకోరని నాకు కచ్చితంగా తెలుసు, అయినా నేను నా నిర్ణయాన్ని మార్చుకోను’ అన్న మా అమ్మాయి పెళ్ళికి మొదట నేను ఒప్పుకోకపోయినా, ‘కాలంతోపాటు మనం మారాలి’ అంటూ మీ అంకుల్‌ నన్ను ఒప్పించారు. తన ఇష్టప్రకారమే పెళ్ళి చేశాం. పెళ్ళైన తర్వాత బెంగుళూరులో జాబ్‌ వచ్చిందని ఇద్దరూ బెంగుళూరు వెళ్ళిపోయారు.

రోజూ ఫోనులో మాట్లాడుతూ, వీలున్నప్పుడు వచ్చి మమ్మల్ని చూసి వెళ్తుండేవారు. ఇలా ఆరు నెలలు దాని కాపురం బాగానే సాగిపోయింది. ఒకరోజు పొద్దుటే హఠాత్తుగా వచ్చిన మా అమ్మాయిని చూసి ‘ఏమ్మా, ఫోను కూడా చెయ్యకుండా ఇంత సడన్‌గా వచ్చావు. మమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేద్దామనుకున్నావా?’ అన్న మా మాటల్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజంతా అలాగే గడిచిపోయింది. దాని తీరు చూస్తుంటే ఏదో జరగరానిది జరిగిందని మాకు అన్పించినా దాన్ని రెట్టించి అడగలేదు.

మర్నాడు మాత్రం తను వాళ్ళాయన్ని వదిలిపెట్టి వచ్చేశాననీ, ఇక్కడే ఏదో జాబులో జాయిన్‌ అవుతాననీ చెప్తుంటే నేనూ, అంకుల్‌ నోటమాట రాక అలాగే ఉండిపోయాం.

కారణం అడిగితే ‘జాగ్రత్తలు తీసుకున్నా, అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చేసిందనీ, తనకి ఇప్పుడే పిల్లల్ని కనడం ఇష్టంలేక- అబ్బాయి ఎంత చెప్తున్నా ఒప్పుకోకుండా అబార్షన్‌ చేయించుకున్నాననీ, దానికోసం ఇద్దరూ గొడవపడి తను ఇక్కడకి వచ్చేశాననీ’ చెప్పింది. తను చెప్పిన మాటల్లో అసలు తన తప్పేలేదన్నట్టుగా మాట్లాడుతున్న మా అమ్మాయి మాటలకి మేమిద్దరం విస్తుపోయాం. ‘పోనీ మాకు ముందే ఈ విషయం చెప్పివుంటే మేమైనా కొన్నాళ్ళు ఆ పుట్టినవాళ్ళని పెంచి పెద్దచేసేవాళ్ళం కదా, అనవసరంగా తొందరపడి అబార్షను ఎందుకు చేయించుకున్నావమ్మా’ అని అడిగాను బాధగా.

‘మీరే కాదు మా అత్తగారూ మామగారూ కూడా ఇలాగే అడుగుతారని నాకు తెల్సుగానీ, ఈ వయసులో మా పిల్లల్ని పెంచవలసిన అవసరం మీకు అనవసరమన్పించింది. ఈరోజు కాకపోతే మరో మూడేళ్ళ తర్వాత పిల్లల్ని కంటాం కదా. ఆ మాత్రం దానికి తన మాటే వినాలన్న పట్టుదలతో నాతో వాదన పెట్టుకున్నాడు.’

తను చేసిన తప్పును సమర్థించుకుంటూ మాట్లాడుతున్న మాటలకి బాధపడ్డా, దాన్ని కన్నపాపానికి, తను చేసిన పనుల్ని కూడా సమర్థించవలసి వచ్చినందుకు బాధపడ్డాం.

ఎవరికి వారు అహంభావంతో ఎంత నచ్చచెప్పినా వినకుండా విడాకులు తీసుకున్నారు. మూడు రోజుల ముచ్చటగా మారిన మా అమ్మాయి సంసారాన్ని తలచుకుంటూ మాలో మేము కుమిలిపోయేవాళ్ళంగానీ దానిముందు ఏమీ మాట్లాడలేకపోయేవాళ్ళం.

మళ్ళీ ఇక్కడే మరో కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఉద్యోగంలో చేరిన మూడు నెలలకే కంపెనీవాళ్ళు దాన్ని రెండేళ్ళు అమెరికా పంపిస్తున్నట్టు చెప్పినప్పుడు తనకి కాస్త మార్పు ఉంటుందని మేం సంతోషించాం. ఒక సంవత్సరం తరవాత ‘అమ్మా, ఇక్కడ నాతోపాటు పనిచేస్తున్న అబ్బాయిని పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను. మన ఇండియావాడే, భయపడకండి. వీలుంటే రావడానికి ట్రై చేయండి’ అంటూ చెప్పింది. తను చెప్పిన మాటలకి ‘ఔను, కాదు’ అనే రెండు పదాలు చెప్పే అవకాశం కూడా మాకు ఇచ్చేదికాదు. అంకుల్‌కి ఒంట్లో బాగోలేని కారణంగా మేము దాని దగ్గరకు వెళ్ళలేకపోయాం. ఈసారి అయినా దాని జీవితం బాగుపడాలని వెయ్యి దేవుళ్ళకి మొక్కుకున్నాం.

కానీ, ఎప్పుడో మేము చేసుకున్న పాపాలకి ఆ దేవుడు అడుగడుగునా మాకు పరీక్షలు పెడుతూనే ఉన్నాడు.

పెళ్ళైన మూడు నెలలకి తెలిసిందట- ఆ అబ్బాయికి అంతకుముందే పెళ్ళి అయిందనీ, ఇండియాలో భార్యా పిల్లలూ ఉన్నారనీ. తనకి ముందు ఈ విషయం చెప్పలేదని మాకు ఫోను చేసి చెప్పింది.

మాకు షాకు మీద షాకు. చచ్చిపోదామనిపించినా, శాంతి గుర్తొచ్చి తెగించలేకపోయేవాళ్ళం.

ఇండియా వచ్చిన తర్వాత శాంతిలో మునుపటి ఉత్సాహం, చలాకీతనం అన్నీ పోయాయి. మాతో కూడా మాట్లాడేది కాదు. బలవంతంగా అన్నం తినిపిస్తే తినేది. అంకుల్‌ కూడా బాగా డీలాపడిపోయారు. వాళ్ళిద్దరి కోసం లేని ధైర్యం తెచ్చుకునేదాన్ని నేను.

అప్పుడప్పుడూ నా దగ్గరకి వచ్చి ‘అమ్మా, నువ్వు చెప్పినట్టు నాకు తొందరపాటు ఎక్కువ కదా... ఇగో కూడా చాలా ఉంది కదా! ఆ రోజు మీరంతా చెప్పినట్లు వింటే బాబో, పాపో నాకు ఉండేవారు కదా’ అంటూ వెక్కివెక్కి ఏడ్చే శాంతిని ఓదార్చటం కష్టమైపోయేది.

ఆరు నెలల తరవాత కాస్త కోలుకున్నట్టే అన్పించింది. ‘మళ్ళీ ఉద్యోగానికి వెళ్తానమ్మా’ అని చెప్పినప్పుడు- పోనీలే పనిలోపడితే అన్నీ మరిచిపోతుందని మేం ‘సరే’ అన్నాం.

ఒకరోజు అంకుల్‌కి ఒంట్లో బాగోలేక నేనూ, ఆయనా హాస్పిటల్‌కి వెళ్ళాం. ఇంటికి తిరిగివచ్చిన మాకు శాంతి ఫ్యానుకి ఉరి వేసుకుని వేలాడుతూ కన్పించింది. తను జీవితం మీద విరక్తితో ఆ పని చేసినట్టూ, దీనిలో ఎవరి ప్రమేయం లేదనీ లెటర్‌ రాసిపెట్టింది.

వాళ్ళ నాన్నకి కూడా ఉత్తరం రాస్తూ ‘నాన్నా, మీరు చేసిన ముద్దునీ, గారాన్నీ అలుసుగా తీసుకుని మీ మాటల్నీ, అమ్మ మాటల్నీ వినకుండా నా ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటూ నాకు సంతోషం లేకుండా, మీకూ లేకుండా చేశాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకు కూతురిగా పుట్టి, ఈసారి మీరు చెప్పినట్టు వింటూ హ్యాపీగా ఉంటాను నాన్నా. నామీద బెంగతో మీరూ, అమ్మా ఏ తొందరపాటు నిర్ణయం తీసుకున్నా నా ఆత్మకి కూడా శాంతి ఉండ’దంటూ రాసి పెట్టింది.

క్రాంతీ, ఇది జరిగిన తరవాత నాకూ అంకుల్‌కీ ఇక బతకాలని అన్పించలేదు. అంకుల్‌కి వెంటనే హార్ట్‌ఎటాక్‌ వచ్చి అతికష్టంమీద బతికి బయటపడ్డారు. శాంతి ఆఖరిమాట కోసం విగతజీవుల్లాగా ఇద్దరం బతుకుతున్నాం. ఇది జరిగి నాలుగేళ్ళు అయినా నిన్న మొన్న జరిగినట్లే మాకు అన్పిస్తూ ఉంటుంది.

నిన్ను చూసిన మొదటిరోజే శాంతిని చూసినట్టు ఫీల్‌ అయ్యాం నేనూ అంకుల్‌. నువ్వు మాట్లాడుతుంటే తను మాట్లాడినట్టే ఉండేది. అందుకే అంకుల్‌ కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడకపోయినా నీతో మాట్లాడుతూ ఉండేవారు.

కానీ, ఈరోజు నువ్వు కూడా మా శాంతిలాగే తొందరపడుతున్నట్టుగా అన్పించి, ఈ విషయాలన్నీ నీకు చెప్పాలనిపించి చెప్పాను. మీరు చదువుకుని, మంచి ఉద్యోగాలు చేస్తున్నా ఆలోచనాశక్తిని కోల్పోయి అహంకారాన్ని పెంచుకుంటున్నారు. మేమూ చదువుకుని ఉద్యోగాలు చేసిన వాళ్ళమే. కానీ పెద్దవాళ్ళు ఏం చెప్పినా ‘మీకేం తెల్సు’ అని ప్రశ్నించకుండా ‘అనుభవంతో చెప్పింది వినాలి’ అని ఆలోచించేవాళ్ళం.

మేం చదువుకోలేదా, ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సంపాదించుకోవటం లేదా అన్న ‘ఇగో’తో మీ జీవితాల్ని నాశనం చేసుకుని కని పెంచిన తల్లిదండ్రులకి సుఖసంతోషాలు లేకుండా చేస్తున్నారు. ఆత్మాభిమానం ఉండటం మంచిదే కానీ అహంభావం పెంచుకోవడం సరికాదు.

నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక్కసారి మీ అమ్మా నాన్నల్ని గుర్తుకుతెచ్చుకో. మీరు సుఖసంతోషాలతో ఉంటే, మా ఆఖరి జీవితం ఆనందంగా గడుస్తుంది. ఇదే నేను చెప్పే ఆఖరిమాట. నీ దగ్గరున్న చనువుతో చెప్పాను, మరేం అనుకోకు’’ అని నిర్ణయం ఆమెకే విడిచిపెట్టి ఇంటికి తిరిగివచ్చింది పద్మ.

మర్నాడు పొద్దున్నే ఎప్పటిలా ఆఫీసుకి బయలుదేరిన క్రాంతిని చూసి సంతోషపడింది పద్మ. వూరి నుంచి వచ్చిన క్రాంతి తల్లిదండ్రులు ‘‘ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం, మా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టారు’’ అని చేతులు జోడిస్తే-

‘‘నేను మాత్రం మరో ఏడు నెలల్లో ఒక బుల్లి శాంతిని తెచ్చి, ఆంటీ చేతుల్లోపెట్టి ఇంకా రుణాన్ని పెంచుకుంటానమ్మా. మీకు ముందే చెప్తున్నా ఆంటీ, మా బేబీని ఏ క్రెష్‌లోనూ జాయిన్‌ చేయను. మా అమ్మా నాన్నలుగానీ, అత్తయ్యా మావయ్యలుగానీ పర్మనెంట్‌గా మా దగ్గర ఉండరు కాబట్టి, అది మీ ఇంట్లోనే ఉంటుంది. దానికి చిన్నప్పటి నుంచే అన్ని బుద్ధులూ నేర్పించి, మాలా కాకుండా మంచి అమ్మాయిలా తయారుచేయాలి’’ అంటున్న క్రాంతి మాటలకి అందరూ నవ్వుకున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.