close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
దారి దోపిడి?

దారి దోపిడి?
- రాయపెద్ది వివేకానంద్‌

‘‘అర్ధరాత్రి ఎటూ కాకుండా కారు ఇక్కడ ఆపేశారేంటి?’’ నిద్రలోంచి బయటకు రాలేని కన్నుల్ని బరువుగా తెరుస్తూ అడిగింది రమ. గర్ర్‌ర్ర్‌ర్ర్‌... గర్ర్‌ర్ర్‌ర్ర్‌... గర్ర్‌ర్ర్‌ర్ర్‌మని కుదుపులిచ్చి ఆగిపోయింది కారు.
ఎక్కడ ఉన్నామో అర్థంకాలేదు. నగరానికి కనీసం ఓ నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉండుంటాం.
కారెందుకు ఆగిందో నాకూ అంతుచిక్కలేదు. టాంకులో పెట్రోలు ఫుల్లుగా ఉంది. దూర ప్రయాణమని చెప్పి ముందుగా సర్వీసింగ్‌ చేయించి తెచ్చాను. అంతా భేషుగ్గా ఉందని పెద్ద సర్టిఫికేట్‌ కూడా ఇచ్చాడు సర్వీస్‌ ఇంజినీర్‌, ప్రయాణానికి ముందే. స్నేహితుడి కూతురి వివాహానికి బయలుదేరాం - పెళ్ళి బెంగుళూర్‌లో.

‘‘చూడండి ఏమయిందో ఇంజిన్లో’’ సూచన చేసింది రమ, కారు మొరాయించిందని తెల్సి. నాకు తెలిసిన మేరా చూశాను, సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌ వెలుగులో అప్పటికే రెండు పర్యాయాలు. జబ్బు చేసిన పేషెంట్లని బాగుచేయటం తెలుసు కానీ కారు మొరాయిస్తే ఏం చేయాలో తెలియదు నాకు.

‘గుండెల్ని మార్చగల ధీశాలి’ అని చమత్కారంగా మిత్రుల చేత పిలవబడే కార్డియాలజిస్టుని నేను. కారు టైర్‌ మాత్రం మార్చగలను అవసరమైతే, అంతకుమించి నాకేమీ తెలియదు కారు రిపేర్‌ గురించి. వెనక సీట్లో నిద్రపోతున్న మా అమ్మాయి కావ్యకి ఇంకా మెలకువ రాలేదు.

సెల్‌ఫోన్‌లో సిగ్నల్‌ü్స లేవు - రెండు సిమ్స్‌ తాలూకు నెట్‌వర్క్‌లలో కూడా.

కాలం స్తంభించిపోయిన అనుభూతి.

ఆ రాత్రి కాళరాత్రి అవబోతోంది అన్న అనుమానం చూచాయగా కలిగినా- రైల్లోనో, విమానంలోనో ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకుని ఉండేవాణ్ణేమో. ఓ భయానక, ఉత్కంఠభరితమైన చలన చిత్రానికి సరిపడా అనుభవాల్ని మూటగట్టుకున్నాం ఆ రాత్రి. కడపలో పాత మిత్రుల్ని కలసి, నందలూరు సౌమ్యనాథస్వామి గుడి చూసుకుని, బెంగుళూర్‌ హైవేకి షార్ట్‌కట్‌ అని ఎవరో ఇచ్చిన సలహా మేరకు ఈ దారిలో వచ్చాం. సిగ్నల్స్‌ లేకపోవటం వల్ల, నేవిగేషన్‌ సహకరించటం లేదు. అత్యంత ఆధునికమైన ఈ కారు ఈ క్షణంలో ఒక గూడులాగా ఉపయోగపడుతోంది అంతే..! నిర్మానుష్యమైన ఆ నిశీధిలో మెడకీ చేతులకీ నిండుగా ధరించిన బంగారు ఆభరణాలని ఒకసారి భయంగా చూసుకుంది రమ.

‘ఇప్పుడెలాగండీ?’ అన్న ప్రశ్న ఆమె కళ్ళతోనే అడుగుతోంది.

బయట పుచ్చపువ్వులా వెన్నెల. రోడ్డుకి అటూ ఇటూ ఎంత దూరం చూసినా రాళ్ళూరప్పలే తప్ప పిచ్చిమొక్కలు కూడా కనిపించటం లేదు. ఎడారి ప్రాంతంలాగా ఉంది.

వాహనాలు కాదు కదా... మానవ సంచారం కూడా కనిపించటం లేదు. ఏం చేయాలో పాలుబోని స్థితి.

‘‘ఎక్కడిదాకా వచ్చాం నాన్నా? ఏంటీ, ఏసీ పనిచేయటం లేదా?’’ వెనుక సీట్లోంచి చిన్నగా ప్రశ్నించింది కావ్య.

తనకు సమాధానం చెప్పటానికి తలతిప్పి వెనక్కి తిరిగిన నేను, వెనక అద్దంలోంచి బయట కనిపించిన దృశ్యానికి ఆనందపడ్డాను. ఓ పదడుగుల దూరంలో ఓ మనిషి.

నడివయస్కుడు అతను. ఇటే వస్తున్నాడు నెమ్మదిగా. కాయపాటు శరీరం, ముతక పంచె, చొక్కా... అతన్ని చూడగానే పల్లెటూరివాడని తెలిసిపోతోంది. నా మనసెందుకో కీడు శంకించింది. మరో మనిషి తోడు అనే నా ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు.

ఆ రాత్రి మాకు నరకం చూపబోయేది అతడే అని నాకు నిర్ధారణగా తెలియకున్నా, ఒక విధమైన భయమైతే కలిగింది. అద్దాలన్నీ మూసేసి సెంట్రల్‌ లాకింగ్‌ వేసేశాను.

అతడు తన మానాన తానెళుతున్న బాటసారేమో, దగ్గర్లో ఉన్న ఏదైనా పల్లెకి చెందినవాడేమో... అలాగే నడుచుకుంటూ కారు పక్కనుంచే ముందుకు వెళ్ళిపోయాడు. పిలుద్దామా అని అన్పించింది. కారు దాటి ఓ నాలుగయిదడుగులు ముందుకు వెళ్ళినవాడల్లా ఎందుకో ఆగి, మళ్ళీ వెనక్కు తిరిగి కారు దగ్గరికి వచ్చాడు.

మూసేసిన కారు కిటికీ అద్దానికి దగ్గరగా ముఖం చేర్చి లోనికి తేరిపారా చూసే ప్రయత్నం చేశాడు. అద్దానికి అటు అతడు- ఇటు నేను.

లోపలి దృశ్యం మరింత స్పష్టంగా కనపడ్డానికి, తన రెండు అరచేతుల్ని చెంపల పక్కగా కళ్ళకి అటూఇటూ అడ్డుగా పెట్టుకుని అద్దానికి మరింత దగ్గరగా చేర్చాడు తన మొహాన్ని.

అతని వూపిరి తగిలినంత మేరా అద్దంపైన నీటి ఆవిరి ఏర్పడుతోంది.

లోపలి పరిస్థితి అతనికి స్పష్టాతిస్పష్టంగా తెలిసిపోయింది.

‘ఎవరు మీరు... ఇక్కడెందుకున్నారు?’ అని సైగలతో అడిగాడు. మేమేమీ బదులు చెప్పే ప్రయత్నం చేయలేదు.

నా ప్రవర్తన నాకే హేతుబద్ధంగా అనిపించటం లేదు. నిర్మానుష్యమైన ఆ రాత్రి సమయంలో కారు మొరాయించి, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, ఒక మనిషి తోడు కనిపించగానే ఆనందంతో ఎగిరి గంతేసి, ఆ గుర్తు తెలియని ప్రదేశంలోంచి బయటపడే మార్గం గురించి ఆలోచించాలి వాస్తవానికి. కానీ అర్ధరహితమైన భయంతో వింతగా ప్రవర్తిస్తున్న నన్ను చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది.

కానీ, నా భయాలు మరీ అర్ధరహితమైనవికావని నాకే తెలియవచ్చింది మరికాసేపటికి. నాలుగు కిటికీ అద్దాల వద్దకూ వచ్చి, టక్‌టక్‌మని వేళ్ళతో కొట్టి, మమ్మల్ని పలకరించే ప్రయత్నం చేసి, మేమేం స్పందించకపోయేసరికి, విసుగెత్తి తన దారిన తాను వెళ్ళిపోయాడా అగంతకుడు.

‘అమ్మయ్య, వెళ్ళిపోయాడు’ ఒక్కసారిగా నిట్టూర్చాం కారులో ఉన్న ముగ్గురం.

‘‘అసలేమయింది నాన్నా, ఎక్కడున్నాం మనం? ఎందుకని ఇక్కడ ఆగాం? బెంగుళూరు ఇంకా ఎంత దూరముంది?’’ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించింది కావ్య. ఆ ప్రశ్నలలో ఏ ఒక్క ప్రశ్నకీ నా దగ్గర కచ్చితమైన సమాధానం లేదు.

‘‘ఏం భయంలేదు బంగారూ, ఏదో చిన్న రిపేరు... నువ్వు పడుకో, అంతా సర్దుకుంటుంది’’ అని ధైర్యం చెబుతున్నాను.

ఎవరూ వూహించని విధంగా అప్పుడు జరిగింది ఆ సంఘటన-

‘‘నాన్నా’’ అని కావ్య కేక వేయటం, భళ్ళున కిటికీ అద్దం బద్దలుకావటం ఏకకాలంలో జరిగాయి.

మేం గమనించనే లేదు, అతడు ఈలోగా తిరిగి ఎప్పుడు వచ్చాడో!

ఈసారి రావటమే చేతిలో ఓ గొడ్డలితో వచ్చాడు.

ముందుకు వెళ్ళిపోయినవాడు వెళ్ళినట్టే వెళ్ళి, చేతిలో ఓ గొడ్డలి పట్టుకొచ్చాడన్నమాట. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, రావటమే తడవుగా దాడిచేశాడు. నేనున్నవైపు కాకుండా మా ఆవిడ ఉన్నవైపు కిటికీ అద్దాల్ని గొడ్డలితో ఒక్క దెబ్బతో బద్దలు కొట్టేశాడు.

ఏమరుపాటుగా ఉందో ఏమో, ఒక్కసారిగా ఉలిక్కిపడింది రమ- ఈ అనుకోని ఉపద్రవానికి. గొడ్డలిని వేగంగా అద్దంపై మోదటం వల్ల, అద్దం పగిలిన తర్వాత కూడా అదే వేగంతో గొడ్డలి కారు లోపలికి కొంత దూరం వచ్చేసింది. అదే వేగంతో రమ చెవి పైభాగంలో తలను తాకి ఆగింది, ‘ధడ్‌’మన్న చప్పుడుతో.

ఆడవాళ్ళిద్దరి కేకలతో కారు మారుమోగిపోయింది. జలజలమని రాలిపడ్డాయి అద్దంముక్కలు. అతడు ఆలస్యం చేయకుండా చేయి లోనికి జొనిపి రమ మెడలోని నగల్ని ఒడిసిపట్టుకున్నాడు. ఆ వెన్నెల వెలుగులో అతడి మొహం నాకు చూచాయగా కనిపిస్తోంది. అప్రమత్తంగా నన్నే చూస్తున్నా, అతడి మొహంపై ఓ విధమైన తెగింపూ, కళ్ళలో ఓ విధమైన కసీ కనిపిస్తున్నాయి.

అంత ఖరీదైన నగల్ని ఒక్కసారిగా చూడటంవల్లనో, లేదా ఉద్వేగంవల్లనో తెలియదు కానీ అతడి చేయి వణకటం గమనించాను.

రమ ఒక విధమైన అయోమయంలో ఉంది. ఆమె ఎడమ చెంప మీదుగా ధారాపాతంగా రక్తం స్రవిస్తోంది.

మెడలో ఉన్నవీ చేతికి ధరించినవీ చెవికున్నవీ అన్నీ వలిచి వాడి చేతిలో పెట్టింది.

అతడు నన్నే చూస్తున్నాడు అప్రమత్తంగా. నాకు అతడిపై కోపం రావటంలేదు చిత్రంగా. అతడిని చూసి భయం కలగటం లేదు విచిత్రంగా. ఇందాకటి వరకూ ఏ వ్యక్తిని చూసి, ఎందుకైనా మంచిదని అద్దాల్ని బిగించి కూర్చుండిపోయానో, ఏ వ్యక్తినుండి కీడు శంకించానో, ఏ వ్యక్తినయితే అవాయిడ్‌ చేయాలని అభిలషించానో... ఇప్పుడు అదే వ్యక్తి నా కళ్ళముందే తన నిజస్వరూపాన్ని బహిర్గతపరుస్తూంటే భయం స్థానే- జాలీ, కోపం స్థానే- దయా నాలో కలుగుతున్నాయి.

అతడు అదే వూపులో వెనుక కిటికీ అద్దం బద్దలుకొట్టి కావ్య నగలు లాక్కున్నాడు.

గాయమైన తలకి చీరకొంగు అదిమి పెట్టుకుని గట్టిగా మూలుగుతోంది రమ.

నేను తనకి కాస్త దగ్గరగా జరిగి సాయం చేయబోయాను.

‘‘కదలకు’’ గట్టిగా హూంకరించాడు అతడు వెనుక కిటికీ అద్దంలోంచి తల లోపలికి పెట్టి.

అతడి కంఠాన్ని మొదటిసారిగా విన్నాం.

అది తెలుగే అయినా ఓ విధమైన కన్నడ యాసతో మాట్లాడాడు. నేను మిన్నకుండిపోయాను.

ఈలోగా- అతడు నేనున్న వైపుకి వచ్చాడు.

అతడు వూహించని విధంగా నేను కారు డోర్‌ తీసుకుని కారు దిగి నిలబడ్డాను.

అతడు కాస్త అయోమయానికి గురయ్యాడు.

నేనలా అతడు వూహించని విధంగా, అతడికి భయపడకుండా కారు దిగి ధైర్యంగా నిలబడటంతో అతడు మరింత అప్రమత్తమయ్యాడు.

‘‘కదిలావంటే చంపేస్తా, నీ దగ్గరున్నవన్నీ ఇచ్చేయి’’ ఓ చేతిలో గొడ్డల్ని ఎత్తి పట్టుకుని ఓ రెండడుగుల దూరంలో నిలబడి హెచ్చరించాడు.

అర్ధరాత్రి, వూరుకాని వూరు, నిస్సహాయులం. ఇలాంటి స్థితిలో ఉన్న మమ్మల్ని చూస్తే సంస్కారవంతుడైన వాడికి సాయం చేయాలనే ఆలోచన కలుగుతుంది.

అలాకాకుండా మమ్మల్ని దోచుకోవాలనే ఆలోచన పశుతుల్యునికే కలుగుతుంది.

కానీ, అతడు కరడుగట్టిన దోపిడిదారుడు కాదు అని అతడిచేతి వణుకు నాకు చెబుతోంది.

ఓ కోల్డ్‌బ్లడెడ్‌ క్రిమినల్‌లాకాక, ముందర అతడే బెంబేలెత్తిపోతున్నాడు.

నగల్ని గుంజేస్తే మా ఆవిడ మెడ ఒరుసుకుపోయి గాయం అవుతుందని, తానే ఒలిచి ఇచ్చే వెసులుబాటు కల్పించాడు.

చేతికొన వేలితో సైతం ఆడవాళ్ళని తాకలేదు. మాకు అతడు జారీచేస్తున్న హెచ్చరికలు అతడి భయాన్ని తెలుపుతున్నాయేగానీ, నాకు భయాన్ని కలిగించటం లేదు.

చిన్నపాటి జాగ్రత్త కూడా తీసుకోవట్లేదు అతడు. స్టీరింగ్‌ సీట్‌ పక్కన రోడ్డుపైన స్థిరంగా నిల్చొని ఉన్నాను నేను. వెనుక డోర్‌ పక్కగా, అతడు నా ఎదురుగా నిల్చొని ఉన్నాడు చేతిలో గొడ్డలితో. ఒక్క ఉదుటున మా అమ్మాయి గనుక కారు డోర్‌ ఓపెన్‌ చేసిందంటే అతడు కిందపడిపోవటం ఖాయం. కిందపడినా పడకపోయినా అతడు కంగారుపడటం తథ్యం. ఆ కాస్త వెసులుబాటు చాలు నాకు, అతడిపై ఆధిపత్యం సాధించటానికి.

ఏసీ గదుల్లో పుట్టి, ఏసీ గదుల్లో పెరిగిన నా యాభైఏళ్ళ తెల్లటి సుకుమారమైన రూపం అతడికి బహుశా నేనలా దాడిచేయలేనేమోననే భరోసా ఇచ్చుంటుంది. యోగా ధ్యానం నిత్యం చేసుకునే నేను - కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ కలిగిన నేను - అనుకుంటే అతడిని క్షణాలలో నిలువరించగలను.

‘‘ఏం ఇవ్వమంటావు?’’ చిరునవ్వుతో అడిగాను.

కళ్ళతోనే నా వాచీ, ఉంగరం ఇవ్వమని అడిగాడు.

ఇచ్చాను. నా వాచీ విలువే ఉంటుంది- ఓ అయిదారు లక్షలు. మెడలో గొలుసూ, పర్సూ కూడా అడిగి తీసుకున్నాడు.

అతడు వూహించినట్టు కరెన్సీ నోట్లు పెద్దగా ఏం లేవు అందులో. ఉన్న అయిదారు నోట్లనీ తీసుకుని పర్సు నాపై విసిరాడు. ఇంటర్నేషనల్లీ వేలిడ్‌ క్రెడిట్‌కార్డ్స్‌ అతడికి ఉపయోగపడవు, పైగా అతడికి వాటి విలువ అర్థంకాలేదు కూడా. ఉండుండి అతడి చూపు వెనుక సీటులో ఉంచిన స్టీల్‌ క్యాన్స్‌, హాట్‌ప్యాక్‌లపైన పడుతోంది.

అతడి చూపుల్ని చదవగలిగాను.

‘‘నువ్వు కడుపునిండా అన్నం తిని ఎన్ని రోజులయింది...ఆకలేస్తోందా... కాస్త అన్నం తింటావా?’’ అసంకల్పితంగా అడిగేశాను.

అతడు ఉలిక్కిపడ్డాడు. నా వంక అయోమయంగా చూశాడు.

మా మిత్రుడి భార్య గత రాత్రి రెండు స్టీల్‌ క్యాన్లలో- బిసిబేళిబాత్‌, పెరుగన్నం, జంతికలు... ఇలా ఎన్నో పదార్థాలు ‘వద్దు, వద్దం’టున్నా కట్టిచ్చింది. మేమున్నది ముగ్గురం. ఆమె కట్టిచ్చినవి ఓ పదిమందికి సరిపోతాయంటే అతిశయోక్తి కాదు.

‘‘కావ్యా, ఓ ప్లేట్లో బిసిబేళిబాత్‌ పెట్టివ్వమ్మా’’ చెప్పాను.

అతడు నన్ను అనుమానంగా చూశాడు. నేనప్పుడు స్వయంగా ఓ రెండు ముద్దలు తీసుకుని నా నోట్లో పెట్టుకున్నాను. అందులో అనుమానించదగ్గ విషపదార్థాలేవీ లేవని అతడికి రూఢీ అయింది.

గబుక్కున ప్లేట్‌ లాక్కుని అలాగే రోడ్డు మీద కూర్చుని తినటం ప్రారంభించాడు.

ఓ చల్లటి గాలి కెరటం మమ్మల్ని స్పృశించింది.

ఎక్కడో దూరంగా, ఓ రైలు కూత మంద్రంగా వినిపించింది. అతడు ఆబగా ఓ జంతువులా ఆహారాన్ని తింటున్నాడు. అతడి మూతి చుట్టూ అంటుకుంటున్న మెతుకుల్ని పట్టించుకోవటం లేదు, జలజలమని రాలిపడుతున్న మెతుకుల్ని పట్టించుకోవటం లేదు- చూపంతా నాపైనే. అనుమానంగా నన్నే చూస్తూ, ఆబగా నోట్లో కుక్కుకుంటున్నాడు.

బాగా ఆకలి మీదున్న ఆవు, మనం కర్ర తీసుకుని తరిమేలోగా బయట ఆరేసిన బియ్యాన్ని ఎలా ఆత్రంగా తింటుందో, కర్ర తీసుకున్న మనల్ని ఎలా భయంభయంగా చూస్తుందో అలా చూస్తూ ముక్కునా నోటా ఆహారాన్ని కుక్కుకుంటున్నాడు.

నాకున్న ఆస్తిలో అతడు దోచుకున్నది ఏపాటిదీ కాదు. నా కారే కోటిన్నర పైచిలుకు. అలాంటి కార్లు అయిదారు ఉన్నాయి నావద్ద.

‘మనపట్ల మనం చూపించుకోగలిగే అతి పెద్ద స్వార్థపు చర్య; ఇతరులని మనస్ఫూర్తిగా క్షమించగలగటం’ అన్న గురువుగారి వాక్యాలు నా అణువణువునా నిండి ఉండటం వల్లననుకుంటా అతడిపట్ల నాకు కోపం కలగటంలేదు.

ఈలోగా కారు దిగి వచ్చిన కావ్య అతడికి మరోమారు వడ్డించింది.

మగతగా కళ్ళు మూసుకుని సీటులోనే వాలిపోయిన రమని పలకరించాను. కారు ముందునుండి వెళ్ళి తన సీటు పక్కకువచ్చి నిల్చొని, తన చేయి నా చేతిలోకి తీసుకుని నాడి చూశాను.

ఈలోగా నా ఫస్ట్‌ఎయిడ్‌ కిట్‌ అందించింది కావ్య.

రమ ముఖంపైన నీళ్ళు చిలకరించి స్పృహ తెప్పించాను.

‘‘రమా, నథింగ్‌ టు వర్రీ’’ అంటూ తన గాయాన్ని క్లీన్‌ చేసి కట్టుకట్టాను.

నొప్పి తగ్గే ఇంజెక్షన్‌ చేసి ‘‘ఓ అరగంట పడుకో’’ అని చెప్పి ఇటు తిరిగాను.

ఎవ్వరం వూహించని విధంగా అప్పుడు జరిగింది ఆ సంఘటన.

తను దోచుకున్న నగలన్నీ రమ ఒడిలో పోసేసి నా కాళ్ళమీద పడిపోయాడు అతడు.

‘‘అయ్యా, నేను దొంగని కాదయ్యా, దొంగని కాదు... నేను రైతుని’’ వెక్కివెక్కి ఏడుస్తున్నాడు అతడు.

అలాగే ఏడుస్తూ నాలుగడుగులు వెనక్కు నడిచి ఆకాశంలోకి చూస్తూ కనపడని దేవుణ్ణి నిందిస్తూ బిగ్గరగా అరుస్తూ ఏడుస్తూ అతడు చేసిన నిందారోపణలు మనసున్న వారిని ఎవర్నయినా కదిలిస్తాయి.

‘‘మేం వర్షాన్ని చూసి నాలుగేండ్ల పైనే అయిపోయింది, వాన చుక్కలేదు, బావులు ఎండిపోయాయి. బోరుబావుల్లో నీటిచుక్క లేదు. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని బోరుబావి వేయించే ప్రయత్నం అయిదారుసార్లు చేశాను. సుద్దముక్కపొడి తప్ప నీటిచుక్క లేదు- ఎన్ని అడుగుల లోతుకుపోయినా. అయ్యా, ఈ రోడ్డుకి అటూ ఇటూ కనిపిస్తున్న ఈ ఎడారిలాంటి నేల ఒకప్పుడు మాకు బంగారం పండించిన పొలాలయ్యా. చక్కగా వేరుశెనగ, పత్తి అన్నీ పండించుకునేవాళ్ళం. నాసిరకం కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, పనిచేయని పురుగుల మందులు, పెరిగిపోతున్న అప్పులు, వడ్డీలు... ఇలా ఒకటి కాదయ్యా... ‘కర్ణుడి చావుకి వెయ్యి కారణాలు’ అన్నట్టు మా ఈ దుస్థితికి కారణాలు అనేకం.

చాలామంది బొంబాయికీ, దుబాయికీ దిన కూలీలుగా వలస వెళ్ళిపోయారు.

ఆత్మహత్య చేసుకోవటానికి చాలా ధైర్యం కావాలని సామెత, ఆ ప్రకారం తీసుకుంటే మా గ్రామంలో ధైర్యవంతులు ఎక్కువయ్యారు ఇటీవల.

అలా చావలేక, ఇటు బతకలేక చస్తూ బతుకు వెళ్ళదీస్తున్న వారిలో నేనొకణ్ణి.

నేను దొంగని కాదయ్యా రైతుని. రైతుకే అన్నంపెట్టి అన్నదాతవయ్యావయ్యా! నిన్ను దోచుకున్నందుకు నన్ను క్షమించు’’ అంటూ మోకాళ్ళ మీద కూర్చుండిపోయి ఏడుస్తూనే ఉన్నాడు. ఉండుండి కంటికి కనిపించని దేవుణ్ణి చూస్తూ ‘‘నన్ను దొంగని చేశావు కదరా దేవుడా!’’ అంటూ రోదించాడు.

రమ ఒడిలోంచి- అతడు వెనక్కి ఇచ్చేసిన నగల్ని తీసుకుని వెళ్ళి అతని చేతిలోనే పెట్టాను.

అతని భుజాల్ని పట్టి లేపి గాఢంగా కౌగిలించుకున్నాను. అతడి గుండె సవ్వడి నాకు తెలుస్తోంది. హార్ట్‌ స్పెషలిస్ట్‌ని కదా!

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు