close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బొమ్మంటే బొమ్మా కాదు...

బొమ్మంటే బొమ్మా కాదు...

దసరా పండగ సందడి అంతా ఇంతా కాదు. నవరాత్రులు ప్రారంభమవుతుంటే, ఓ పక్క అమ్మవారి గుళ్లలో ప్రత్యేక పూజలు మొదలవుతాయి. మరో పక్క వీధివీధికీ బతుకమ్మలు కొలువుదీరతాయి. ఇక ఇంటింటా ముస్తాబయ్యే బొమ్మల కొలువుల సంగతి చెప్పనే అక్కర్లేదు. విడివిడిగా చూస్తేనే ముద్దులు మూటగట్టే బొమ్మలు, ఒక్కచోట చేరితే ఆ అందమే వేరు. బొమ్మలకొలువు పేర్చే ఇళ్లలో తరాలనాటి బొమ్మలుంటాయి. ఏడాదికో కొత్తదీ వచ్చి చేరుతుంది. అయితే విడివిడి బొమ్మలే కాదు ఒక దృశ్యాన్ని కళ్లముందు ఆవిష్కరించేలానూ రకరకాల బొమ్మలు వస్తున్నాయి. ఆ అందాల్ని మీ ఇంటి కొలువులోనూ చేర్చొచ్చేమో, ఓ సారి చూడండి మరి!

కొన్ని బాగుంటాయి... తరాలు మారినా, ఏళ్లు గడిచినా, ఎన్ని కొత్తలు మన జీవితాల్లో వచ్చి చేరినా. బామ్మ మనతో భద్రంగా దాచిన పెట్టెలోని బొమ్మల్ని తుడిపించి వరుసలో పెట్టడం, కొత్త కోడలు వచ్చినప్పుడు ఓ బొమ్మల జతను ఆమెకిచ్చి వాటిని బోలెడు చేయాలని చెప్పడం, ఇంట్లో చిట్టి తల్లితో మళ్లీ బొమ్మలకొలువు పేరంటం చేయించడం... ఎవరు ఎన్నిసార్లు గుర్తుచేసుకున్నా హాయిగా అనిపించే ఇలాంటి జ్ఞాపకాల్ని మనకు ఈ పండగలు మాత్రమే మిగల్చగలవు. అందుకే ఏ ఏటికాయేడు మరింత ఉత్సాహంగా వేడుకలు చేసుకుంటుంటాం. దసరా పండగకు ప్రత్యేకంగా పేర్చే బొమ్మలకొలువుకు మన సంప్రదాయంలో విశిష్ట స్థానముంది. అమ్మవార్లను వేడుకొని ఆయా బొమ్మల్ని కొలువు దీర్చడంతో పాటు మనలోని సృజనకు పదును పెట్టే మరో కోణమూ ఇందులో దాగుంది. రోజులు మారుతూ ఉంటే అందులో పేర్చే బొమ్మలూ కొత్త మార్పుల్ని అందిపుచ్చుకుంటున్నాయి. ఒకప్పుడు విడివిడి బొమ్మలుగా మనం పేర్చుకునేవి కాస్తా చక్కగా ఓ అర్థవంతమైన దృశ్యాన్ని చూపేవాటిగా రూపుదిద్దుకుంటున్నాయి. బావి దగ్గర ఆడపిల్లలూ, పెళ్లిలో తెర పట్టే సీనూ, సీమంతపు పేరంటాళ్లూ... ఇలా ఒక్కో బొమ్మా ఒక్కో అర్థవంతమైన దృశ్యంగా తయారవుతోంది.

అన్ని రకాలూ...
చాలా కాలం నుంచీ ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ల దగ్గర దేవుడి బొమ్మలు రకరకాలవి ఉంటాయి. వీటిలో దశావతారాలు మరీ ప్రత్యేకం. అయితే వీటికి భిన్నంగా మన నిత్య జీవితంలో కనిపించే విభిన్న సందర్భాలను ప్రతిబింబించేలా బొమ్మలు తయారవుతున్నాయి. పల్లెటూళ్లలో కనిపించే చక్కని దృశ్యాలూ వీటిలో నిక్షిప్తమవుతున్నాయి. ఈ తరహా బొమ్మల్లో కొన్ని సెట్లుగా ఉండి మనం వరుసలో అమర్చుకోవలసినవి ఉంటే మరికొన్ని అచ్చంగా ఒక దృశ్యమంతా ఒకే బొమ్మలో ఒదిగిపోయేవి ఉంటున్నాయి. ధాన్యాలూ, చిరుతిళ్లూ అమ్మేవాళ్లూ, వరినాట్లు వేస్తున్న స్త్రీలూ, సహపంక్తి భోజనాలను కూడా ఈ బొమ్మల్లో మనం చూడొచ్చు. తరగతి గదిలో పాఠాలు వింటున్న పిల్లలూ, మైదానంలో క్రికెట్‌ టీమ్‌, ఫుట్‌బాల్‌ ఆడుతున్న ఆటగాళ్లున్న దృశ్యాల్ని కళ్లకు కట్టే బొమ్మలూ దొరుకుతున్నాయి. చెక్కా, మట్టీ, కాగితపు గుజ్జూ... ఇలా వివిధ రకాలతో తయారైన బొమ్మలు ఇందులో వస్తున్నాయి. చూడగానే ఆకట్టుకునేలా విభిన్న రంగుల కలబోతగా వీటిని తయారు చేస్తున్నారు. నిజానికి బొమ్మల కొలువు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల్లోనూ బాగా ప్రసిద్ధం. అందుకే ఒక్కో ప్రాంతపు ఆచారాలకు సంబంధించి ఆయా చోట్ల జరిగే పెళ్లి తంతులూ, బారసాలల్లాంటి వేడుకల్ని దృష్టిలో ఉంచుకునీ వీటిని రూపుదిద్దుతున్నారు. ఎంచక్కా ఈ బొమ్మల్ని మనం ఎప్పటి నుంచో అమర్చుకునే దేవుడి బొమ్మలతో కలగలిపి కొలువుదీర్చవచ్చు. లేదంటే ఈ తరహా బొమ్మలకు మనం పేర్చే కొలువులో ప్రత్యేకంగా కొంత చోటు కేటాయించుకోవచ్చు. ఏదేమైనా, మన బొమ్మల కొలువుకి కొత్తందాన్ని తీసుకురావడం వీటి ప్రత్యేకత. బొమ్మలకొలువు సెట్‌, గోలు డాల్‌ సెట్‌ అని నెట్లో వెతికితే ఇలాంటి బొమ్మలు ఎన్నో రకాలు కనిపిస్తాయి. మనకు నచ్చినవాటిని కొనుక్కోవడమే. ఈ దసరాకి మీ కొత్త బొమ్మ వీటిలో ఏదైనా ఒకటి కావచ్చు, ఎంచుకోండి మరి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.