close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మెల్‌బోర్న్‌ మెరుపులు చూడాల్సిందే!

మెల్‌బోర్న్‌ మెరుపులు చూడాల్సిందే!

ఒకటోసారి... రెండోసారి... వరసగా ఏడోసారి కూడా ‘ద ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌’ సంస్థ నిర్వహించే అధ్యయనంలో జీవన ప్రమాణాలపరంగా నివసించదగ్గ నగరాల్లో తొలి స్థానంలో నిలిచింది మెల్‌బోర్న్‌. ‘వరల్డ్‌ మోస్ట్‌ లివబుల్‌ సిటీ’గా పేరొందిన ఆ కాస్మొపాలిటన్‌ నగరంలోనూ ఆ చుట్టుపక్కలా చూడదగ్గ ప్రదేశాలతోబాటు, అక్కడి ప్రజల జీవనశైలి గురించి మనతో పంచుకుంటున్నారు ఇటీవలే అక్కడకు వెళ్లొచ్చిన హైదరాబాద్‌ వాసి షేక్‌ బషీరున్నీసా బేగం.

హైదరాబాద్‌ నుంచి మలేషియన్‌ ఎయిర్‌వేస్‌లో బయలుదేరి కౌలాలంపూర్‌కి చేరుకున్నాం. అక్కడి నుంచి మరో విమానంలో మెల్‌బోర్న్‌కు చేరుకున్నాం. చెకింగ్‌ పూర్తిచేసుకుని, బయటకు రాగానే చల్లనిగాలి చుట్టుముట్టింది. 45 నిమిషాల్లో మా అబ్బాయి ఇంటికి చేరుకున్నాం.

ఆస్ట్రేలియా వాసులు గర్వించే అత్యుత్తమ నగరాల్లో మెల్‌బోర్న్‌ ఒకటి. అక్కడ ప్రవహించే ‘యారా’ నదికి రెండువైపులా ప్రణాళికాబద్ధంగాకట్టిన నగరమిది. ఆ నదిపై 1880లో నిర్మించిన ప్రిన్సెస్‌ బ్రిడ్జి అత్యంత ఆకర్షణీయంగా సందర్శకుల్ని ఆకర్షిస్తుంటుంది. యారా నదిమీద మొత్తం 64 వంతెనలు నిర్మించారట. ఆ నదీతీరంలోని రెస్టరెంట్లలో టీ తాగుతూ ఆ పరిసర సౌందర్యాన్ని ఆస్వాదించడం ఎంతో హాయిగా అనిపించింది.

నగర కేంద్రభాగం ‘సిటీ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌(సీబీడీ)’లో ప్రభుత్వ కార్యాలయాలూ, వ్యాపార కేంద్రాలూ, బ్యాంకులూ, రెస్టరెంట్లూ, ఐటీ కంపెనీలూ కొలువుదీరిన బహుళ అంతస్తుల భవనాలు గొప్ప వాస్తుశైలితో సందర్శకుల్ని కట్టిపడేస్తాయి. లక్షమందికి పైగా వీక్షించేలా మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియాన్నీ, టెన్నిస్‌ కోర్టుల్నీ పచ్చని పరిసరాల మధ్య అత్యాధునికంగా నిర్మించారు. రహదారులకి ఇరువైపులా పెరిగిన చెట్లూ పూలమొక్కల అలంకరణలూ సందర్శకుల్ని సేదతీరుస్తాయి. అక్కడి ప్రజలు క్రమశిక్షణతో లైన్‌ తప్పకుండా ప్రయాణించడం చూస్తుంటే ముచ్చటగా అనిపించింది.

పరికించి చూడటం నేరం!
ఈ నగరం భిన్న దేశాలూ జాతులూ మతాలూ సంస్కృతుల సమాహారం. దాదాపు రెండు వందల దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు అక్కడ నివసిస్తున్నారు. భారతీయులూ పాకిస్థానీలూ ఆఫ్ఘన్లూ యూరోపియన్లూ చైనీయులూ జపనీయులూ... ఇలా ఎందరో అక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నారు. దుస్తులూ ఆహారపుటలవాట్లూ ఎవరివి వారివే. ఎవరూ ఒకరినొకరు ఆక్షేపించుకోరు. ఎవరైనా ఒకరిని తేరిపార చూడటం, కామెంట్‌ చేయడం అక్కడ చట్టరీత్యా నేరం.

మెల్‌బోర్న్‌ సిటీ సెంటర్‌కు దాదాపు 20 కి.మీ. దూరంలో సబ్‌ అర్బన్‌ కౌన్సిల్స్‌ ఉంటాయి. కౌన్సిల్‌ సభ్యులే ఆయా ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు వేస్తుంటారు. పెద్దపెద్ద ఆవరణల్లో చుట్టూ క్రోటన్‌మొక్కలూ పూలమొక్కల మధ్యలో అందంగా కట్టిన చెక్క ఇళ్లు కనువిందు చేస్తుంటాయి. ప్రతి ఇంటిలోనూ తడి చెత్త వేసేందుకూ ప్లాస్టిక్‌ వ్యర్థాలకీ వేర్వేరుగా డస్ట్‌బిన్లు ఉంటాయి. ఇంటికి తాళాలు వేయకుండానే వెళ్లిపోయేవాళ్లం. అక్కడ నేరాల సంఖ్య జీరో. నగరంలో ప్రమాదాల శాతం చాలా తక్కువ. సీబీడీ దగ్గర ఉన్న రైల్వేస్టేషన్‌లో భూఉపరితలంలో రైల్వే ట్రాక్స్‌తోబాటు భూగర్భంలో మూడు అంచెలుగా ఒకదాని కింద ఒకటిగా మెట్రో రైళ్లు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ నిర్మాణాన్ని 1900 సంవత్సరంలోనే నిర్మించారట. ప్రయాణికుల సౌకర్యార్థం రైళ్ల రాకపోకల వివరాలు తెలిపే డిజిటల్‌ బోర్డులు మెరుస్తూ ఉంటాయి. అందులో చూపిన సమయానికి ఒక్క సెకను కూడా తేడా లేకుండా రైళ్లు ప్రయాణిస్తాయి. సాంకేతికంగానే కాదు, పరిసరాలను సైతం అదే స్థాయిలో పరిశుభ్రంగా ఉంచేందుకు ఎక్కడికక్కడ ప్లాట్‌ఫామ్‌మీద డస్ట్‌బిన్‌లను పెట్టారు. అక్కడ ఎక్కడా కాస్త కూడా చెత్త లేదు. సూటూబూటూ ధరించినవాళ్లు కూడా లాప్‌ట్యాప్‌లతో కింద కూర్చుని రైలు వచ్చేదాకా పనిచేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈగలూ దోమల్లాంటి క్రిమికీటకాలు మచ్చుకైనా కనిపించలేదు. పౌరులు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఎంత బాగుంటుందో అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనమే మెల్‌బోర్న్‌.

ఇరవై గంటలూ నిద్రే!
ఒకరోజు మేం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉన్న స్కై హై కొండమీద ఏర్పాటుచేసిన పార్కును చూసేందుకు వెళ్లాం. అక్కడ ఫౌంటెయిన్‌లా అమర్చిన రెండున్నర టన్నుల ఇనుపగ్లోబుని చూశాం. ఇది నీటి వత్తిడి కారణంగా గుండ్రంగా తిరుగుతుంటుంది. ‘ఫర్‌ పీస్‌ అండ్‌ యూనిటీ ఆఫ్‌ పీపుల్‌’ అనే నినాదంతో దానిమీద మానవహారం చెక్కారు. ఆ కొండమీద నుంచి సూర్యాస్తమయాన్ని చూసేందుకు ఎంతోమంది వచ్చారు. అక్కడ ఉన్న పార్కులోని రాతిబొమ్మలూ, పూలమొక్కలూ చూసి మైమరచిపోయాం. మర్నాడు ‘మూన్‌లిట్‌ శాంక్చ్యువరీ’కి వెళ్లాం. రంగురంగుల చిలకలూ పక్షులూ ఈమూ పక్షులూ మమ్మల్ని చూసి దగ్గరకు వచ్చాయి. వాటి ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ‘సందర్శకులు పక్షులకు ఆహారం ఇవ్వకూడదు’ అని అక్కడి బోర్డులమీద రాసి ఉంది. ఇరవై గంటలపాటు నిద్రపోయి కేవలం నాలుగు గంటలు మాత్రమే మేల్కొని ఉండే కోలా జంతువులు యూకలిప్టస్‌ ఆకులు తింటూ ముద్దుముద్దుగా కనిపించాయి. బుల్లి మొహం, చిన్ని చిన్ని ముందుకాళ్లు, దృఢమైన వెనక కాళ్లతో గెంతుతుండే కంగారూలనూ చూసి ఆనందించాం.

తరవాతి రోజు మెల్‌బోర్న్‌ నగరం నుంచి 125 కి.మీ. దూరంలో ఉన్న ఫిలిప్స్‌ ఐల్యాండ్‌కు వెళ్లాం. సముద్రంలో నిర్మించిన వంతెన పైన కారులో ప్రయాణించి మనం ఆ ద్వీపానికి చేరుకోవచ్చు. అక్కడ ‘నాంది’ అనే సముద్రజీవుల పరిశోధక కేంద్రం ఉంది. అక్కడే పర్వతాలమీద నిర్మించిన చెక్కదారిపై నడుస్తూ వెళ్లి పైనుంచి పసిఫిక్‌ మహా సముద్ర అందాలను చూస్తూ ఉండిపోయాం.

పక్కింటి పెంగ్విన్లతో ముచ్చట్లు!
నాంది కేంద్రం నుంచి పదిహేను నిమిషాలు ప్రయాణించి, పెంగ్విన్‌ పెరేడ్‌ సెంటర్‌కు చేరుకున్నాం. ఆన్‌లైన్‌లో ముందుగానే గైడ్‌ను బుక్‌ చేసుకున్నాం. అక్కడకు వెళ్లగానే మాకు నిర్దేశించిన గైడ్‌, బైనాక్యులర్లూ ఫోల్డబుల్‌ సీట్లూ ఇచ్చి కూర్చోమని, పెంగ్విన్‌ పక్షుల జీవన విధానం గురించీ వాటిమీద జరుగుతున్న పరిశోధనల గురించీ వివరించింది. సూర్యాస్తమయం తరవాత పెంగ్విన్‌ పక్షులు వేలాదిగా తీరం నుంచి నడుచుకుంటూ సమూహంగా నెమ్మదిగా కొండపైకి వస్తోన్న దృశ్యం ఎంతో అద్భుతంగా తోచింది. అవి నిర్మించిన గూళ్లకే అవి చేరుకున్నాయి. పిల్లలకు ఆహారాన్ని అందించి పక్క గూళ్ల పక్షులతో ముచ్చటించడం చూస్తే ఆశ్చర్యం కలిగింది. అవి నెలరోజులపాటు సముద్రంలో వేటాడి, చేపల్ని తిని, నెలరోజులపాటు భూమ్మీదకు వచ్చి గూటిలో గడుపుతాయట.

కాకులు దూరని కారడవిలో...
అక్కడ నివసిస్తున్న ఓ తెలుగు కుటుంబంతో కలిసి ‘గ్రేట్‌ ఓషన్‌ రోడ్‌’కు ప్రయాణమయ్యాం. పసిఫిక్‌ మహాసముద్ర తీరం వెంబడి ఉన్న రోడ్డుమీద కారులో ప్రయాణిస్తూ బెల్స్‌ బీచ్‌, క్యాంప్‌బెల్‌ టౌన్‌, యాంగిల్‌ సీ బీచ్‌... వంటి బీచ్‌లన్నింటినీ మధ్యమధ్యలో ఆగి చూశాం. తరవాత ట్రిప్లెట్‌ వాటర్‌ఫాల్స్‌కు బయలుదేరాం. ఆ జలపాతం దగ్గరకు వెళ్లడమే ఓ సాహసం. అది చిక్కని కారడవిలో ఉంది. కాస్త భయమనిపించినా ఆ ప్రాంతం అంతా ప్రభుత్వ అధీనంలో ఉంది కాబట్టి ధైర్యంగా ముందుకెళ్లాం. జలపాతం దగ్గర మెట్లు నిర్మించారు. వాటిమీదుగా కిందికి దిగి, జలపాత ప్రవాహాన్ని చూశాం. మర్నాడు ట్వెల్వ్‌ ఎపాజల్స్‌ అనే ప్రాంతానికి చేరుకున్నాం. అప్పటికే పార్కింగు వేలాది వాహనాలతో నిండిపోయింది. వివిధ దేశాల నుంచి వచ్చిన యాత్రికులతో ఆ ప్రాంతం కోలాహలంగా ఉంది. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి పసిఫిక్‌ మహా సముద్రపు దక్షిణాది అలలూ బలమైన గాలుల తాకిడికి కోతకు గురయిన పర్వతాలు సముద్రంలో ముక్కలుగా వేర్వేరుగా ఉన్నాయి. సముద్రపు అలలు భూభాగాన్ని ఢీకొనడం చూస్తుంటే అపార జలరాశి ముందు మనమెంత అల్పులమో కదా అనిపించింది.

మర్నాడు నేషనల్‌ ఆర్ట్‌ గ్యాలరీని సందర్శించాం. యూరోపియన్లూ ఆసియన్లకు చెందిన కళాత్మక వస్తువులూ ఆభరణాలూ చిత్రపటాలూ కోట్ల రూపాయల ఖరీదు చేసే పాలరాతి బొమ్మల్నీ అక్కడ ఎంతో భద్రంగా అమర్చారు. ఒక విభాగంలో మనదేశానికి చెందిన ఆభరణాలూ శివలింగాలూ రాతి తోరణాలూ సాలభంజికలూ చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాం.

మరోరోజు మెల్‌బోర్న్‌లోని రాయల్‌ ఆర్కేడ్‌ను సందర్శించాం. అది అత్యంత ప్రాచీన కట్టడం. అక్కడ రత్నాభరణాల దుకాణాల్లో నగల ధరలు సంపన్నులకే తలతిరిగేలా ఉన్నాయి. తరవాత స్టార్‌బక్స్‌ అనే ప్రపంచ ప్రఖ్యాత బ్రాండెడ్‌ కాఫీషాపులో కాఫీని ఆస్వాదించి, వీధి చివరల్లోని గోడలమీద చిత్రకారులు గీసిన గ్రాఫిటీ(గోడబొమ్మలు)ని చూశాం. ప్రముఖ వ్యాపారసంస్థ క్రౌన్‌ వారి కేసినోనీ సందర్శించాం. విలాసవంతమైన ఆ భవనంలో సంపన్నులతోబాటు మధ్యతరగతివారూ జూదం ఆడుతుంటారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి సందర్శకులను అనుమతిస్తారు. అక్కడ తొంభైశాతం మంది మహిళా ఉద్యోగులే. మర్నాడు లిస్టర్‌ఫీల్డ్‌ లేక్‌కు వెళ్లాం. చెరువు చుట్టూ ఉన్న చెక్క కుర్చీలూ బెంచీల్లో సందర్శకులు కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.

ఆరోగ్యరహస్యం!
ఆస్ట్రేలియన్లు ఎంతో దృఢంగా ఉంటారు. క్రీడలకూ వ్యాయామానికీ ఎక్కువ సమయం కేటాయించడమే వారి ఆరోగ్య రహస్యం. వారమంతా శ్రమించడం, వారాంతాల్లో కుటుంబసమేతంగా క్రీడల్లో పాల్గొనడం వారి అలవాటు. పిల్లలూ యువతా అంతా సైక్లింగ్‌, స్కేటింగ్‌, సర్ఫింగ్‌, హార్స్‌ రైడింగ్‌... వంటివి నేర్చుకుంటూ కనిపిస్తారు. వృద్ధులు జాగింగ్‌ చేస్తుంటారు. పార్కుల్లో సరస్సుల తీరాల్లో కుటుంబసమేతంగా బార్బిక్యూ తరహా వంటలు చేసుకుంటూ ఎంజాయ్‌ చేస్తుంటారు. అక్కడ లైసెన్సు పొందిన షాపింగు మాల్స్‌లోనూ రెస్టరెంట్లలోనూ మాత్రమే ఆహారపదార్థాలు విక్రయిస్తారు. కల్తీ జరిగిందని ఎక్కడైనా నిర్ధారణ అయితే వెంటనే లైసెన్సులు రద్దయిపోవడంతోబాటు భారీ జరిమానా విధిస్తారు. ఆహార నాణ్యతా ప్రమాణాలు మెరుగ్గా ఉండటానికి అక్కడి చట్టాల అమలే ప్రధాన కారణం.

ఆస్ట్రేలియా విస్తీర్ణం మనదేశానికి మూడురెట్లు ఎక్కువ. జనసాంద్రత మాత్రం చాలా తక్కువ. జనాభా రెండున్నర కోట్లకు లోపే. అందుకే అక్కడివారికి సహజవనరులు సమృద్ధిగా అందుతున్నాయి. పచ్చని కొండలూ లోయలతో అలరారే ఆ ప్రాంతంలో దుమ్మూధూళీ ఉండదు. అందుకే అక్కడ ఎంత ప్రయాణించినా అలసట రాదు. శబ్దకాలుష్యం సున్నా. వాహనాలు హారన్లు ఉపయోగించకూడదు. దేవాలయాలూ మసీదులూ చర్చిలూ ఎక్కువగానే ఉంటాయి. కానీ ఎక్కడా మైక్‌ పెట్టకూడదు. పసిపిల్లలకీ వృద్ధులకీ ఆరోగ్యం కోసం అక్కడ ఎన్నో ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. సంవత్సరానికి రెండుమూడు నెలలే వేసవికాలం. అత్యధిక ఉష్ణోగ్రత 36 డిగ్రీలు. అక్కడి ప్రజలు వేసవిలో అల్ట్రావయొలెట్‌ కిరణాల నుంచి రక్షణకోసం కళ్లద్దాల్నీ గొడుగుల్నీ తప్పనిసరిగా వాడతారు. మిగిలిన నెలల్లో వాతావరణం చల్లగా ఉంటుంది.

అందమైన ప్రకృతి ఒడిలో కాలుష్యరహితంగా సంపూర్ణ ఆరోగ్యంగా క్రమశిక్షణతో ఇష్టంగా పనులు చేసుకుంటూ ఎవరి విశ్వాసాలకు ఎవరూ అడ్డు రాకుండా శాంతియుతంగా జీవిస్తోన్న అక్కడి ప్రజల్ని చూస్తుంటే ప్రపంచపటంలో మెల్‌బోర్న్‌ మేటి నగరం అనడంలో ఆశ్చర్యమేముంది అనిపించింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.