close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మీ బట్టలు మేం ఉతికిస్తాం!

మీ బట్టలు మేం ఉతికిస్తాం!

వారాంతాలంటే కొందరికి సినిమాలూ, షికార్లూ, కుటుంబంతో కాలక్షేపం... మరికొందరికి ఆ వారం వేసిన బట్టల్ని ఉతికి, ఆరబెట్టి, ఇస్త్రీ చేసుకోవడంతోనే సరిపోతుంది. ‘ఇకపైన ఆ పనిని మాకు అప్పగించేసి మీ విలువైన సమయాన్ని ఇష్టమైన పనులకు కేటాయించండి’ అంటోంది పీకేసీ లాండ్రీ సొల్యూషన్స్‌.

ప్రేమంత్‌ కుందుర్తి, చైతన్య అమ్మినేని... ఇద్దరూ స్నేహితులు. ఎంబీఏ చేసిన వీరు సొంత కంపెనీ పెట్టాలనుకున్నారు. అందుకు ఉద్యోగ అనుభవం ఉంటే మంచిదని ప్రేమంత్‌ ‘సైనోడ్‌ ఇండియా’ సంస్థలో, చైతన్య ‘నిసాన్‌ ఇండియా మోటార్స్‌’లో కొన్నాళ్లు పనిచేశారు. మరోవైపు వ్యాపారం గురించి ఆలోచించేవారు. ఆ సమయంలో దాదాపు 20 వరకూ ఆలోచనలు చర్చకు వచ్చాయి. చివరకు లాండ్రీ సేవల విభాగంలో అడుగు పెట్టాలనుకున్నారు. 2015లో డిసెంబరులో పీకేసీ లాండ్రీని ప్రారంభించి, హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ ప్రాంతంలో సర్వీసులు అందించడం మొదలుపెట్టారు. దీనికోసం వెబ్‌సైట్‌(పీకేసీలాండ్రీస్‌డాట్‌కామ్‌), ఆప్‌కూడా తీసుకొచ్చారు. బట్టల్ని ఉతికి ఇస్త్రీ చేసివ్వడం, ఇస్త్రీ, డ్రై క్లీనింగ్‌, డైయింగ్‌, డార్నింగ్‌... వీరందించే సేవల్లో ఉన్నాయి. ఆన్‌లైన్లో లాండ్రి సేవలకు అలవాటు పడ్డానికి స్థానికులకు దాదాపు ఆరు నెలలు పట్టింది. ఆ తర్వాత ఆన్‌లైన్లోకంటే కూడా చాలామంది ఫోన్లు చేసి ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ‘వినియోగదారులు ఫోన్‌ చేయడానికి కారణం, బట్టల్ని ఎప్పుడు తిరిగిస్తారో తెలుసుకునే వీలుండటమే’నంటారు ప్రేమంత్‌. వినియోగదారులు ఫోన్‌ చేస్తే వారి ఇంటికి వెళ్లి బట్టలు తీసుకొని తిరిగి ఇంటి దగ్గరకే అందిస్తారు వీరు. మరోవైపు సేవల్ని విస్తరించడానికి గేటెడ్‌ కమ్యూనిటీలూ, విల్లాలూ, కాలనీ సంఘాలతో మాట్లాడేవారు. తమ సేవలు మిగిలిన వారికి ఎలా భిన్నమైనవో వివరించేవారు. తమ ప్లాంట్‌లకు పిలిచి ప్రత్యక్షంగా చూపేవారు. అక్కడ పరిశుభ్రమైన నీరు, నాణ్యమైన డిటర్జెంట్‌లూ, రసాయనాలతోపాటు సరికొత్త యంత్రాలు కూడా ఉండేవి. ఆ తేడా గమనించి చాలామంది పీకేసీ సేవల్ని పొందడానికి ఆసక్తి చూపేవారు. ఏడాది తిరిగేసరికి హెయిర్‌ సెలూన్లూ, బొటిక్‌లూ, స్పాలూ, హోటళ్లూ, రిసార్టులూ వీరి ఖాతాదారుల జాబితాలో చేరాయి.

సొంత ప్లాంట్లు
ఇప్పుడైతే ఆప్‌, వెబ్‌సైట్‌, ఫోన్‌లతోపాటు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ పేజీద్వారా తెలియజేసి పీకేసీ సేవలు పొందే వీలుంది. వినియోగదారుడు సమాచారమిచ్చిన గంటలో సంస్థ ప్రతినిధి వెళ్లి బట్టల్ని తీసుకుంటారు. పెట్టుబడి పరిమితుల దృష్ట్యా మొదట్లో దుస్తుల్ని సేకరించి ప్లాంట్‌లను నిర్వహించే సంస్థలకు ఇచ్చేది పీకేసీ. అప్పటివరకూ ఆయా ప్లాంట్‌ల సామర్థ్యం మేరకు ఆర్డర్లు తీసుకునేవారు. ఆ దశలో రెండు ప్లాంట్ల యజమానులు వాటిని అమ్మాలనుకున్నట్టు పీకేసీకి చెప్పారు. దాంతో వాటిని సొంతం చేసుకున్నారు. ఈ రెండు ప్లాంట్లూ ఒకదానికొకటి దూరంగా ఉండటంతో మార్కెట్‌ను విస్తరించుకోగలిగారు. లాండ్రీ సేవల్లో నాణ్యతతోపాటు సమయానికి అందించడం కూడా ముఖ్యం. చాలా ప్లాంట్‌లు ఆదివారం నాడు పనిచేయవు. వినియోగదారులు కోరిన టైమ్‌కి అందివ్వాలంటే సెలవు రోజుల్లోనూ పనిచేయాలి. ఆ ప్లాంట్‌లు సొంతమయ్యాకే అది సాధ్యమైంది. ఇప్పుడు రెండు, మూడు షిఫ్టుల్లోనూ పనిచేస్తున్నారు. సిబ్బంది కొరత ఉంటే వ్యవస్థాపకులే రాత్రుళ్లు పనిచేసేవారు. ప్రస్తుతం ఈ సంస్థలో 50 మంది వరకూ ఉద్యోగులున్నారు. వీరి సేవల్ని దాదాపు హైదరాబాద్‌ మొత్తానికి విస్తరించారు. ‘మేం దుస్తుల రకాన్ని బట్టి వేర్వేరు పద్ధతుల్లో శుభ్రం చేస్తాం. దానివల్ల వాటి మన్నిక పెరుగుతుంది. ఈ రంగంలో పోటీపడాలంటే నాణ్యమైన సేవలు అందివ్వడం ఒక్కటే మార్గం. దానివల్ల అంతిమంగా అసంఘటితంగా ఉన్న రూ.2లక్షల కోట్ల లాండ్రీ పరిశ్రమకు మేలు జరుగుతుంది’ అంటారు ప్రేమంత్‌. సాధారణంగా వర్షాకాలంలో బట్టలు ఉతికి ఆరేయడానికి ఇళ్లల్లో ఇబ్బంది అవుతుంది. ప్లాంట్‌లలో వాషర్‌, స్పిన్నర్‌, డ్రైయర్లు ఉంటాయి కాబట్టి వీరికది సమస్య కాదు. అందుకే ఈ కాలంలో డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందంటారు ప్రేమంత్‌.

ఫ్రాంచైజీ ఇస్తారు
పీకేసీ విస్తరణకు పెట్టుబడుల్ని వెంచర్‌ క్యాపిటలిస్టులూ, ఏంజిల్‌ ఇన్వెస్టర్ల నుంచి కాకుండా స్నేహితులూ, బంధువుల నుంచి తీసుకుంటున్నారు. అలా ప్రేమంత్‌, చైతన్యలకు శ్రీకాంత్‌, సుజిత్‌ తోడయ్యారు. వీరిద్దరూ సంస్థలో ఉద్యోగులుగానూ ఉన్నారు. స్థానికంగా యజమాని ఉంటే సంస్థ నిర్వహణ, విస్తరణకు బాగుంటుందని ఫ్రాంచైజీలు ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే సంగారెడ్డిలో ఒక ఫ్రాంచైజీని ఏర్పాటుచేశారు. విజయవాడ, పుణె, బెంగళూరులలో ఫ్రాంచైజీల గురించి చర్చలు నడుస్తున్నాయి. ప్లాంట్‌నీ, సిబ్బందినీ ఏర్పాటుచేసుకుంటే సాంకేతిక సేవలూ, నిర్వహణ ప్రణాళిక అమలులో వారికి శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం పీకేసీకి దాదాపు 2000 మంది వినియోగదారులున్నారు. 10కిపైగా స్పాలూ, ఏడు గృహ సముదాయాలతో పనిచేస్తున్నారు. నిర్మాణ సంస్థలు గృహ సముదాయాల్లో పీకేసీకి చోటిస్తున్నాయి. కొన్నయితే ప్లాంట్‌ని ఏర్పాటుచేసి దాని నిర్వహణను పీకేసీకి అప్పగిస్తున్నాయి. కొన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లూ ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. పీకేసీ నెలకు ఏడెనిమిది లక్షల రూపాయల వ్యాపారం చేస్తోంది. ఏడాదిలో దాన్ని రెండు మూడు రెట్లు చేయాలనేది వీరి లక్ష్యం. అంతవరకూ విశ్రమించేది లేదంటున్నారు పీకేసీ వ్యవస్థాపకులు.


 

ఇవి... కల్తీ లేని పాలు!

కల్తీలేని పాలను తాగాలంటే..? పాడి రైతు జీవితాల్లో వెలుగు నింపాలంటే..? పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే..? ఈ ప్రశ్నలకు ఓ రైతుబిడ్డ సమాధానమే ‘రియల్‌మిల్క్‌’!

ప్రకాశం జిల్లా అడవిపాలేనికి చెందిన శ్రీనివాస్‌ సాఫ్ట్‌వేర్‌ నిపుణుడిగా పనిచేశాడు. రైతు కుటుంబానికి చెందిన అతడు వ్యవసాయమూ చేస్తుండేవాడు. వాళ్లకు పాడి కూడా ఉండేది. ఉద్యోగంలో చేరాక వూళ్లొ పెద్ద డెయిరీ ఫామ్‌ను ఏర్పాటు చేశాడు. అతడి తమ్ముడు దీన్ని చూసుకునేవాడు. ఫాం నిర్వహణ కోసం ఏటా లక్షల్లో ఖర్చు చేస్తుండేవాళ్లు. కానీ ఎప్పుడూ లాభాలు వచ్చింది లేదు. ‘రైతులందరిదీ ఇదే పరిస్థితా...’ అన్న సందేహం వచ్చింది శ్రీనివాస్‌కి. దీంతో మూడేళ్ల కిందట సొంతూరికి తిరిగొచ్చి వెయ్యి మందికి పైగా రైతులను కలిశాడు. 90శాతం రైతులది ఇదే పరిస్థితి అని తెలుసుకొని దీనికో పరిష్కారం చూపాలనుకున్నాడు.

సమస్యను గుర్తించి..
పశువుల ఖరీదు, మేత, కూలీలు, అనారోగ్య సమస్యలు... ఇవన్నీ బేరీజు వేసుకుంటే లీటరు ఆవు పాల ఉత్పత్తికి రైతుకు సగటున రూ.30, గేదె పాలకు రూ.45 వరకూ అవుతోంది. కానీ డెయిరీల నుంచి రైతుకు ఆవు పాలకు రూ.22, గేదె పాలకు రూ.35-40 వస్తోంది.

అంటే లీటరుపైన రూ.5-10 వరకూ నష్టమే ఉంటోంది. రైతుకు మంచి ధరను చెల్లిస్తూనే ఒక గేదెనూ, ఆవునూ ఇంటిలో పెంచుకుంటే ఎంత నాణ్యమైన పాలను తాగుతారో, అంతకు మించిన నాణ్యతతో పాలను వినియోగదారులకు అందివ్వాలనుకున్నాడు శ్రీనివాస్‌. దీనికోసం ఓ ప్రణాళిక సిద్ధం చేశాడు. అవసరమైతే ప్రారంభంలో నష్టాల్ని భరించడానికి సిద్ధమయ్యాడు. ‘తాము ఉత్పత్తిచేసే పాలు ఎంతకు కొనుగోలు చేస్తున్నారనేది రైతుకు తెలియాలి. అలాగే వినియోగదారులకూ రైతు వివరాలు అందించాలి అప్పుడే పారదర్శకంగా ఉంటుంద’ని భావించాడు. దీనికోసం ‘రియల్‌మిల్క్‌’ పేరుతో ఓ వెబ్‌సైట్‌నూ, యాప్‌నీ అభివృద్ధి చేయించాడు. రైతులు రియల్‌మిల్క్‌లో నమోదు కావాలంటే పశువులకు కలుషితం కాని నీరూ, నాణ్యమైన మేత, ఉండేందుకు మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి. ఏ మందులు పడితే అవి వాడకూడదు. వీటిపైన రియల్‌మిల్క్‌ సిబ్బంది రైతులకు వారంపాటు శిక్షణ ఇచ్చి, మరో 15 రోజులు దగ్గరుండి పర్యవేక్షిస్తారు. మంచి మేతను కొని వేయడం ఖర్చుతో కూడినది, పాల ధర మాత్రం అంత లేదు. అయితే, ఆరోగ్యంగా ఉన్న పశువులు 13 నెలలకు ఒకసారి కచ్చితంగా ఈతకు వస్తాయి, వాటి పాల దిగుబడి ఎక్కువ కాలం ఉంటుంది... వీటిపైనా రైతులకు అవగాహన కల్పించారు. సభ్యత్వం తీసుకున్న రైతుకు డెయిరీలు ఇచ్చే ధరకు రెట్టింపు ధర అందిస్తున్నారు. ఆవుపాలకు రియల్‌మిల్క్‌లో రూ.50 ఇస్తున్నారు. గేదెపాలకు రూ.60 ఇస్తున్నారు. గృహావసరాలకే కాకుండా హోటళ్లూ, ఆసుపత్రులూ, స్కూళ్లూ, బేకరీలూ... ఇలా, పాలు అవసరమైనవాళ్లు ఎవరైనా వెబ్‌సైట్‌ (realmilk.co.in) లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు. బయట మార్కెట్‌లో వెన్న తీయని పాలకు ఎంత ధర ఉందో రియల్‌ మిల్క్‌నీ అంతే ధరకు అందిస్తారు. సంస్థ నిర్వహణకు వినియోగదారుల నుంచి లీటరు గేదెపాలకు రూ.2 సర్వీసు ఛార్జిగా తీసుకుంటారు. రైతులు రియల్‌ మిల్క్‌ నుంచి పొందే శిక్షణ, పశు వైద్య సదుపాయం, తదితర సేవలకుగానూ తమకు వచ్చే రూ.60లో నాలుగు రూపాయలు ఆ సంస్థకు చెల్లిస్తారు. వీటితోనే ప్రస్తుతం సంస్థ నిర్వహణ చేపడుతున్నారు. ఒక్కో లీటర్‌కు రూ.7-8 నిర్వహణ ఖర్చవుతోంది. సంస్థకు వచ్చేది లీటురుపైన ఆరు రూపాయలు మాత్రమే. రైతులు మరో రూపాయి తీసుకోమంటున్నా, ‘మేం వ్యాపారం కోసం రాలేదు. ఓ వ్యవస్థను సృష్టించాలనే సంకల్పంతో వచ్చాం. ఈ విషయంలో రాజీపడితే లక్ష్యం మరచిపోయినట్టే’ అంటారు శ్రీనివాస్‌.

ఆరు వేల లీటర్లు...
రైతు నుంచి ఆవు, నాటు ఆవు, గేదె పాలను వేర్వేరు క్యాన్లలో సేకరిస్తారు. డెలివరీ చేయాల్సిన దూరం పది కిలోమీటర్లు దాటకుండా ఉండేలా చూస్తారు. ఒకవేళ వినియోగదారుడు పాలకు ఆర్డర్‌ ఇచ్చినా ఆ దగ్గర్లో రియల్‌మిల్క్‌ రైతు ఉంటేనే అందజేస్తారు. పాలను రైతునుంచి సేకరించిన మూడు గంటల్లోగా కొనుగోలుదారునికి అందిస్తారు. పాలు వచ్చిన అరగంటలోపే కాచి ఉంచుకోమని చెబుతారు. నాటు ఆవు పాలలో ఉండే పోషకాల దృష్ట్యా వాటికి మంచి డిమాండ్‌ ఉంది. అందుకే రియల్‌ మిల్క్‌ వాటిని లీటరు రూ.80కి అందిస్తోంది. డెయిరీలు రైతులకు నాటు ఆవుపాలకూ రూ.22 ఇస్తుండగా రియల్‌ మిల్క్‌ రూ.60 ఇస్తోంది. ధర అధికంగా రావడంతో రైతులూ దేశీ జాతిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పాలు తక్కువగా దొరకడం వల్ల సేకరణ చాలా ఖర్చుతో కూడుకున్నదనీ, వీటి ఉత్పత్తి పెరిగితే రైతుకే పూర్తి మొత్తం అందిస్తామనీ చెబుతారు శ్రీనివాస్‌. ప్రస్తుతం రియల్‌మిల్క్‌ కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే పనిచేస్తోంది. ఇక్కడ ఆరు వేల లీటర్ల పాలను నిత్యం సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం 400మంది నమోదిత రైతులున్నారు. భవిష్యత్తులో దక్షిణ భారతదేశమంతటికీ విస్తరించి ‘గొడ్డుకు పెట్టిందీ, భూమికి పెట్టిందీ ఎక్కడికీ పోద’నే తన నమ్మకాన్ని... నిజం చేసి చూపిస్తానంటున్నాడు శ్రీనివాస్‌!

- మరిశర్ల జగదీష్‌, ఈనాడు అమరావతి, ఫొటోలు: మరిడయ్య

 

 

ఆటకు సిద్ధమవుతున్నారిలా!

క్రీడాకారులకు ఆట ఎంత ముఖ్యమో ఫిట్‌నెస్‌ కూడా అంతే! మన క్రికెట్‌ జట్టు శ్రీలంక తాజా పర్యటన విజయవంతమవడంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ కూడా ఒక కారణం. కొందరు టీమ్‌ ఇండియా ఆటగాళ్లు ఆహారం, వ్యాయామాల విషయంలో ఎలాంటి నియమాలు పాటిస్తారో తెలుసా!

ఎండు ఫలాలే బలం!

టీమ్‌ ఇండియాలో ఫిట్‌నెస్‌ అంటే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీదే అంటున్నారంతా. ఒకప్పుడు బటర్‌ చికెన్‌, మటన్‌ రోల్స్‌ని ఇష్టంగా తినేవాడు కోహ్లి. కానీ ఇపుడు వాటికి చాలా దూరం. బ్రేక్‌ఫాస్ట్‌కి ల్యాంబ్‌ చాప్స్‌, సాల్మన్‌ ఫిష్‌ తింటాడు. లంచ్‌, డిన్నర్‌లలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉండే పాస్తా, ఓట్‌మీల్‌, స్పాగెట్టీ, ఆలూ, స్వీట్‌ కార్న్‌, రాజ్మా, అలాగే ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండే ఫిష్‌, ఎగ్‌వైట్‌, చికెన్‌ సోయాబీన్స్‌, పప్పులూ తింటాడు. వీటితోపాటు డ్రైఫ్రూట్స్‌, నట్స్‌ ఎక్కువగా తీసుకుంటాడు. వ్యాయామానికీ తగినంత ప్రాధాన్యమిస్తూ ఉదయం ఆరింటికే జిమ్‌లో ఉంటాడు. స్టామినా పెంచుకోడానికి కార్డియో, మజిల్‌ పవర్‌ పెంచుకోవడానికి బరువులెత్తడం చేస్తాడు. రోజూ రెండు గంటలూ, వారంలో అయిదురోజులూ తప్పనిసరిగా జిమ్‌ చేస్తాడు. ఫిట్‌నెస్‌తో మానసికంగానూ బలంగా తయారయ్యానంటాడు.

బ్యాడ్మింటన్‌ ఆడుతూ

‘లైఫ్‌ని ఎంజాయ్‌ చేయడం ముఖ్యమే కానీ, అందరూ తినే పదార్థాల్ని క్రీడాకారులు తినకూడదు’ అని చెప్పే ఎం.ఎస్‌.ధోనీ, బ్రేక్‌ఫాస్ట్‌గా పిండి పదార్థాలతో చేసే పారిడ్జ్‌లో పండ్లూ, నట్స్‌ వేసుకొని తింటాడు. తర్వాత ఓ గ్లాసు పాలు తాగుతాడు. లంచ్‌, డిన్నర్‌ మాత్రం రోటీల్ని పప్పు, చికెన్‌ కర్రీతో తింటాడు. లంచ్‌ సమయంలో యోగర్ట్‌ తీసుకుంటాడు. మధ్యలో ఎప్పుడైనా చికెన్‌ శాండ్‌విచ్‌, వెజ్‌ సలాడ్‌ తింటాడు. మ్యాచ్‌ రోజున ప్రొటీన్‌ డ్రింకులూ, తాజా పండ్ల రసాలూ తాగుతాడు. ధోనీ జిమ్‌లో కష్టపడటానికి ఎక్కువగా ఇష్టపడడు. పర్యటనల మధ్య ఖాళీ దొరికితే బ్యాడ్మింటన్‌ ఆడతాడు. దాంతో చురుగ్గా కదలగలగడంతోపాటు చూపు కూడా మెరుగవుతుందంటాడు. అలాగే ఫుట్‌బాల్‌ ఆడటమన్నా ఇష్టమే. వికెట్‌ కీపర్‌గా ధోనీ మైదానంలోనే శారీరకంగా చాలా కష్టపడాల్సి వస్తుంది. అయినా కూడా మజిల్‌ పవర్‌ పెంచుకోవడానికి మ్యాచ్‌లు జరిగేటపుడు బరువులెత్తే వ్యాయామాలు చేస్తాడు.

పదింటికే నిద్ర

నిద్ర, ఆహారం, వ్యాయామాల్లో క్రమశిక్షణతో ఉండటంవల్ల తన ఆట పూర్తిగా మారిపోయిందంటాడు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య. బ్రేక్‌ఫాస్ట్‌లోనూ లంచ్‌లోనూ ప్రొటీన్స్‌, కార్బోహైడ్రేట్‌ü్స, ఫైబర్‌ ఉండేట్టు చూసుకుంటాడు పాండ్య. రాత్రిళ్లు అన్నం, చపాతీలూ తినకుండా చికెన్‌ ఐటమ్‌ లేదా ప్రొటీన్‌ సప్లిమెంట్‌ తీసుకుంటాడు. పదింటికి నిద్రపోయి వేకువనే లేచి ఉత్సాహంగా వర్కవుట్‌ ప్రారంభిస్తాడు. మ్యాచ్‌లు లేనపుడు కూడా కొన్నిసార్లు రోజంతా వ్యాయామానికే కేటాయిస్తాడు.

ఆమ్లెట్‌ తప్పనిసరి!

గుడ్డుతో చేసిన వంటకాల్ని ఎక్కువగా తీసుకుంటాడు రోహిత్‌ శర్మ. వాటిలోనూ ఆమ్లెట్‌ అంటే ఇష్టం. శరీరానికి కావల్సిన ప్రొటీన్‌ ఎగ్స్‌ ద్వారానే తీసుకుంటాడు. నూట్రిషనిస్టు సలహాతో కార్బోహైడ్రేట్స్‌ పూర్తిగా తగ్గించేశాడు. నిద్రకు కూడా బాగా ప్రాధాన్యమిస్తాడు. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఓట్సూ, పాలూ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటాడు. ఇంకా ప్రొటీన్‌ డ్రింక్స్‌ తాగుతాడు. కొన్నాళ్ల కిందటి వరకూ బరువు తగ్గించుకోవడానికి కష్టపడిన రోహిత్‌, రాత్రి ఎనిమిదిలోపే డిన్నర్‌ చేసే అలవాటుతో బరువుని నియంత్రణకు తెచ్చుకోగలిగాడు. క్రమం తప్పకుండా వ్యాయామాలూ, యోగా చేస్తాడు. ఆయిల్‌ ఫుడ్‌కి పూర్తిగా దూరం.

యోగా చేయాల్సిందే!

వారంలో అయిదు రోజులు జిమ్‌ కచ్చితంగా చేస్తాడు శిఖర్‌ ధావన్‌. మూడు రోజులు వెయిట్‌ ట్రైనింగ్‌కీ, రెండ్రోజులు కార్డియో సెషన్స్‌కీ కేటాయిస్తాడు. వీటితోపాటు స్విమ్మింగ్‌, రన్నింగ్‌, యోగా తప్పనిసరి. మ్యాచ్‌లు లేని రోజున విశ్రాంతి కోసం పగటిపూట ఒక గంట నిద్రపోతాడు. ఆహారం విషయానికొస్తే విటమిన్లు బాగా ఉండే శాకాహారం తీసుకుంటాడు. ముఖ్యంగా ఉడకబెట్టిన కాయగూరలు తింటాడు. తందూరీ చికెన్‌, ఫిష్‌, బ్రకోలీ తరచూ తింటాడు. ధావన్‌కి ఆలూ పరాఠాలూ, చికెన్‌ కర్రీ, దోశ, మటన్‌ రోగన్‌జోష్‌ అంటే ఇష్టం. అవి తిన్నరోజున జిమ్‌లో ఇంకా ఎక్కువ శ్రమిస్తాడు.


 

తాతలు చూపిన ‘బాటా’లో!

‘బాటా’ అనగానే గుర్తొచ్చేవి... ఒకటి పాదరక్షలూ, రెండు చివర తొమ్ముదులుండే ధరలు. 123 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ యాజమాన్యంలో నాలుగో తరం వ్యక్తి థామస్‌ ఆర్చర్‌ బాటా. తండ్రీ, తాతల బాటలో నడుస్తున్న ఆర్చర్‌ గురించి కొన్ని విశేషాలు...

భారతదేశంలో ఏ మూల ఉన్నవారికైనా బాటా చెప్పుల్ని అందుబాటులో ఉంచడమే నా లక్ష్యం... అంటాడు బాటా యువ వారసుడూ, సంస్థ ‘గ్లోబల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌’ అయిన 29 ఏళ్ల ఆర్చర్‌ బాటా. ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ నుంచి రాజనీతిశాస్త్రంలో పీజీ చేసిన ఆర్చర్‌ అయిదేళ్లకిందట కంపెనీలో మేనేజర్‌గా చేరాడు. ప్రస్తుతం గ్లోబల్‌ మార్కెటింగ్‌ బాధ్యతలు చేపడుతూ డిజిటల్‌, డిజైన్‌... విభాగాల్లో భారీ మార్పులు తెచ్చే పనిలో ఉన్నాడు.

భారత్‌లో బాటా
ఆర్చర్‌ ముత్తాత థామస్‌ బాటా 123 ఏళ్ల కిందట చెక్‌ రిపబ్లిక్‌లోని సొంతూరు గ్లిన్‌లో పాదరక్షల తయారీ కంపెనీని ప్రారంభించారు. 1932లో బాటా భారత్‌లో అడుగుపెట్టింది. కోల్‌కతా సమీపంలో చిన్న సంస్థగా మొదలైన బాటాకు ఈరోజు దేశంలో 1200 దుకాణాలున్నాయి. ‘చాలామంది బాటాని భారతీయ కంపెనీయే అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ బాటా పాదరక్షలు వాడని వారంటూ ఉండరు. ఇప్పటికీ ఇండియాలో అడుగుపెట్టిన ప్రతిసారీ నా పాస్‌పోర్ట్‌ని ఒకటికి రెండుసార్లు చూస్తారు. నేను భారతీయుణ్ని కాదంటే వాళ్లు నమ్మరు. బాటా భారతీయ బ్రాండ్‌ కాదని తెలియగానే షాకవుతారు. ఈ విషయంలో నేనెంతో గర్వపడతా... ఎందుకంటే, భారతీయుల హృదయాల్లో మేమంతగా చోటు సంపాదించినందుకు. కానీ నిజానికి బాటాలో భారతీయత ఉంది. దశాబ్దాలుగా కంపెనీ ఇక్కడ ఉంది. బాటాతో భారతీయులకు ఉన్న అనుబంధం ప్రపంచంలో మిగతా దేశాలవారికి లేదనే చెప్పాలి’ అంటారు ఆర్చర్‌. ప్రపంచవ్యాప్తంగా బాటా ఖాతాదారుల్లో మూడింట రెండొంతులు మహిళలే. భారత్‌లో మాత్రం మహిళలకంటే పురుషులే ఎక్కువ. స్విట్జర్లాండ్‌లోని లాసనెలో సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో బాటా అడుగులు కనిపిస్తాయి. వీరి పాదరక్షల డిజైనింగ్‌ ప్రధానంగా ఐరోపాలోనే జరుగుతుండగా వాటి తయారీ యూనిట్‌లు మాత్రం ఇటలీ, భారత్‌, ఇండోనేషియా, చైనాలలో ఉన్నాయి. భారత్‌లో అతిపెద్ద తయారీ కేంద్రం ఉంది. ఈమధ్య ప్రతి దేశంలోనూ డిజైనింగ్‌ బృందాల్ని ఏర్పాటుచేస్తున్నారు.

నాలుగు తరాలు...
‘బాటా కుటుంబం నాలుగు తరాలుగా ఇదే రంగంలో ఉంది. ఇది సాధారణ విషయమేమీ కాదు. ఎన్నో అంశాలు మమ్మల్ని ఇక్కడివరకూ తీసుకువచ్చాయి. వాటిని కొనసాగిస్తూనే విధానాల్లో కాలానుగుణమైన మార్పులు చేపడతాం. మా విధానాల్లో మారనివంటూ ఉన్నాయంటే, అవి మా విలువలు మాత్రమే’ అంటారు ఆర్చర్‌. తన ముత్తాత ఒక అసాధారణ వ్యక్తిగా జీవించారనీ, ఆయన గురించి అందరూ చెప్పుకోవడం విన్నాననీ చెప్పే ఆర్చర్‌ తాను ఎక్కువగా తాతయ్య థామస్‌ని చూసి నేర్చుకున్నానంటాడు. ‘వ్యాపారంలో సమస్యల గురించి ఆందోళన వద్దు. ఓటమికి భయపడకు. భయపడితే ఓడినట్టే’ అని తాతయ్య చెప్పేవారు. నేనెప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటాను. నేను సానుకూలంగా ఉంటే నా బృందంలో ఉన్నవారు అసాధ్యమనుకున్నవాటిని కూడా సుసాధ్యం చేయగలరు’ అంటాడు ఆర్చర్‌. బాటాలో ప్రస్తుతం ఆర్చర్‌తోపాటు మరొకరు మాత్రమే ఆ కుటుంబం నుంచి ఉన్నారు. ఆర్చర్‌ తండ్రి గతేడాదే బాటా నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకొని స్థిరాస్తి వ్యాపారంవైపు వెళ్లారు.

డిజిటల్‌ వైపుగా...
ఏటా 22కోట్ల జతల పాదరక్షల్ని తయారుచేస్తోంది బాటా. వీటిలో సగం సొంతవి కాగా, మిగతా సగం భాగస్వామ్య కంపెనీలవి. ‘ఖాతాదారుల అలవాట్లకు తగ్గట్టుగా మా బ్రాండ్‌నీ తీర్చుదిద్దుతున్నాం. డిజిటల్‌వైపు త్వరితగతిన అడుగులు వేస్తున్నాం’ అని చెప్పే ఆర్చర్‌, ఈ-కామర్స్‌ పోర్టళ్ల తరహాలో పూర్తిగా డిజిటల్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్లో ఉంటూనే దుకాణాలనూ పెంచుతామంటాడు. ‘పాదరక్షలకు సంబంధించి ఒక క్లిష్టత ఉంది. వాటిని అందంగా డిజైన్‌ చేస్తే వినియోగానికి అంత అనువుగా ఉండవు. అదే వినియోగానికి అనువుగా తయారుచేస్తే అందంగా ఉండవు. ఈ పరిస్థితిని సరిచేసేందుకు మా డిజైనింగ్‌ బృందం నిరంతరాయంగా పనిచేస్తుంది’ అంటాడు ఆర్చర్‌. వివిధ దేశాల్లో ‘యంగ్‌ డిజైనర్స్‌ కాంపిటీషన్‌’ను పెడుతూ... యువ డిజైనర్లని పాదరక్షల డిజైనింగ్‌ వైపు ఆకర్షిస్తోందీ సంస్థ. ‘పాదరక్షలకు సంబంధించిన మరో సమస్య పొడుగు, పొట్టి పాదాలు ఉన్నవారికి ఉత్పత్తులు అందించడం. నా షూ సైజు పదకొండున్నర అంగుళాలు. నాకు నచ్చిన షూ అంత సులభంగా దొరకదు’ అని తన సొంత అనుభవాన్నీ చెబుతాడు. దీనికి పరిష్కారంగా పెద్ద సైజు షూల వెరైటీలని దుకాణాల్లో కొద్ది మొత్తంలో ఉంచి, ఆన్‌లైన్లో మాత్రం ఎక్కువ మొత్తంలో పెట్టాలనుకుంటున్నట్లు చెబుతాడు. ‘బాటా... పెద్దవాళ్ల బ్రాండ్‌’ అనే ముద్ర ఉందనే ఆర్చర్‌ ట్రెండీగా ఉండే మోడల్స్‌ తెచ్చి ఆ ముద్రని పోగొడతామంటాడు.

కంపెనీ మార్కెటింగ్‌ ప్రధాన కార్యాలయాన్ని ఏడాది కిందట స్వదేశం చెక్‌ రిపబ్లిక్‌కు తీసుకెళ్లాడు ఆర్చర్‌. ప్రేగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆ బృందంలో పది దేశాలకు చెందిన 20 మంది సభ్యులున్నారు. ‘దేశం, మతం, వయసు, ఆలోచనలు... వేర్వేరుగా ఉన్నవాళ్లు నా జట్టులో ఉన్నారు. మున్ముందు ఇక్కడికి మరింత మంది వస్తారు. ఇక్కడి చిన్న ప్రపంచం మొత్తం ప్రపంచానికి సేవలు అందిస్తుంది’ అని చెబుతాడు ఆర్చర్‌.


 

‘పాండానానీ’కి రూ.2లక్షల జీతం!

ప్రపంచంలోకెల్లా ఉత్తమ ఉద్యోగం ఏదీ అంటే- ‘ఆస్ట్రేలియా పగడపుదీవుల సంరక్షకుడు/సంరక్షకురాలు’ అని చెబితే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ‘పాండా నానీ’దే వరల్డ్‌ బెస్ట్‌ అండ్‌ ఫన్‌ జాబ్‌ అంటున్నారు. ఎందుకో తెలుసా..?