close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సర్దుబాటు

సర్దుబాటు
జ్యోతి సుంకరణం

‘‘మా ఆనందరావ్‌ బాబాయ్‌ కోడలు పుట్టింటికి వెళ్ళిపోయిందట’’ ఆఫీసు నుండి ఇంటికి వస్తూనే సోఫాలో కూలబడుతూ నీరసంగా చెప్పాడు సాగర్‌ భార్య ఉమతో.

‘‘ఏంటీ, పుట్టింటికి వెళ్ళిపోయిందా..? అంటే...’’ ఆశ్చర్యంగా అడిగింది మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ ఉమ.

‘‘అంటే, అదే... ఇక కాపురం చెయ్యనూ అని వెళ్ళిపోయి, విడాకుల నోటీసు పంపించిందట’’ అన్నాడు సాగర్‌ బాధగా.

‘‘అయ్యో, అదేంటండీ... నిన్నగాక మొన్నటి వరకు వాళ్ళ పెళ్ళి కబుర్లే చెప్పుకుంటున్నాం... అంతలోనే విడాకులా... ఎవరు చెప్పారీ విషయం... మీ బాబాయ్‌ ఫోన్‌ చేశారా?’’ అడిగింది ఉమ తను కూడా బాధపడుతూ.

‘‘వాళ్ళ ఫ్లాట్‌లోనే ఉండే మా కొలీగ్‌ చెప్పాడు. చూశావా, ఇంత జరిగినా మా బాబాయ్‌ చూచాయగానైనా ఈ విషయం నాతో చెప్పలేదు. పైగా ఈ సంబంధం కుదిర్చినవాణ్ణి నేను’’ అన్నాడు సాగర్‌ ఫీలవుతూ.

‘‘అవున్నిజమే కానీ అసలు ఏం జరిగి ఉంటుందంటారు... నిన్నగాక మొన్న పెళ్ళైనవారు అప్పుడే విడాకులదాకా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందంటారూ...’’ అంటూ ఆలోచిస్తూ తను కూడా సోఫాలో కూలబడింది ఉమ.

‘‘అదే నాకూ అసలు అర్థంకావటం లేదు. అసలు నిజమేంటో కూడా తెలీదు. నేను రేపే బాబాయ్‌ ఇంటికి వెళ్ళి విషయమేంటో కనుక్కొస్తాను’’ అన్నాడు సాగర్‌.

‘‘వాళ్ళేం మనకు చెప్పలేదు కదా, అలాంటిది మనం డైరెక్ట్‌గా వెళ్ళి అడిగేస్తే బావుంటుందా?’’ అంది ఉమ సందేహంగా.

‘‘వాళ్ళు చెప్పకపోతేనేం, విషయం తెలిసి కూడా నాకేం సంబంధంలేనట్లు ఎలా ఉండిపోతాను... పెళ్ళి కుదర్చడానికి ఎన్నిసార్లు వారి ఇరుకుటుంబాల మధ్యా రాయబారాలు నడిపానో, ఈరోజు అది విచ్ఛిన్నం కాకుండా చూడటానికి కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను’’ అన్నాడు ఓ దృఢసంకల్పంతో సోఫాలో నుండి పైకిలేస్తూ సాగర్‌.

* * *

కాలింగ్‌బెల్‌ వినిపించడంతో డోర్‌ తీసి ‘‘ఆ... నువ్వా... రా, లోపలికి’’ అంటూ గుమ్మంలో నిలబడ్డ సాగర్‌ని చూసి చేదు మింగినట్లుగా మొహం పెట్టి లోపలికి ఆహ్వానించాడు ఆనందరావ్‌.

లోపల కూర్చున్న పావుగంటకి ‘‘నువ్వా సాగర్‌, బావున్నావా? మీ ఆవిడా పిల్లలూ అంతా బావున్నారా?’’ అంటూ లోపల నుండి చేతులు తుడుచుకుంటూ వచ్చింది ఆనందరావ్‌ భార్య సీత. సాగర్‌ను చూసి ఒక బలవంతపు నవ్వు నవ్వి తను కూడా ఓ కుర్చీలో కూర్చుంటూ ‘‘అసలు నిన్నే రమ్మని ఫోన్‌ చేద్దామనుకుంటున్నాం... ఇంతలో నువ్వే వచ్చావ్‌’’ అంది.

‘‘నేనో విషయం విన్నాను... అది నిజమో కాదో తెలుసుకుందామని వచ్చాను’’ ఇక నాన్చుడు వ్యవహారం ఎందుకని సూటిగా విషయంలోకి వచ్చేస్తూ అడిగాడు సాగర్‌, వచ్చి పావుగంటైనా పెదవి విప్పకుండా పేపర్లో తలదూర్చిన ఆనందరావ్‌ బాబాయ్‌ని చూస్తూ.

ఆ మాటకి ‘‘ఒరేయ్‌, నిన్ను నమ్మి ఆ కుటుంబంతో సంబంధం కలుపుకున్నాం, మాకు తగిన శాస్తి జరిగింది’’ ఆవేశంగా పేపర్‌ మడిచి పక్కన పడేస్తూ అన్నాడు ఆనందరావు.

‘‘అదేంటి, ఇందులో నేనేం చేశాను, మంచి కుటుంబం, మంచిపిల్ల. అసలు ఇంతకీ ఏం జరిగిందో చెప్పు బాబాయ్‌’’ అన్నాడు సాగర్‌, మొదట కోపం తెచ్చుకున్నా తర్వాత అనునయంగా.

దాంతో మొగుడూ పెళ్ళాం ఇద్దరూ కలిసి- ‘‘ఆ పిల్లకి అసలు మంచీ మర్యాదా లేదు. పెద్దవాళ్ళంటే గౌరవం లేదు. భర్తంటే అసలు ప్రేమాభిమానాలే లేవు. అయ్యో... రోజూ కాదు, ఏ పండగనాడో, పబ్బంనాడో కాస్త ఉదయాన్నే లేచి స్నానం చేయమంటే పేద్ధ రాద్ధాంతం చేస్తుంది. రాత్రి పొద్దుపోయే దాకా ఫోన్లో ఛాటింగులూ, వీకెండ్‌ పార్టీలూ. తను సంపాదించిన జీతమంతా తనిష్టంట. దాంతో ఏం చేస్తావని అడిగే హక్కు మొగుడికి కూడా లేదట. రాత్రి ఏ పదింటికో ఆఫీసు నుండి రావడం, వస్తూనే తన గదిలోకి దూరి తలుపేసుకోవడం...’’ ఇలా ఓ పేద్ధ చేంతాడంత చిట్టా విప్పారు- ఓ గంటకు పైగానే.

విన్నంతసేపూ విన్న సాగర్‌ ‘‘ఇవన్నీ సరేరా, ముందు నువ్వేం అనుకుంటున్నావో చెప్పు’’ అని అడిగాడు ఈ మాటల మధ్యలోనే తన పక్కనవచ్చి కూర్చున్న వివేక్‌ని.

‘‘నేను అనేదేముంది అన్నయ్యా, అమ్మా నాన్నా ఫేస్‌ చేసింది కొంచెమే. నేను అయితే నరకం చూశాను’’ అన్నాడు వివేక్‌ తట్టుకోలేనట్లు మొహంపెడుతూ.

‘‘అంటే ఏంటి... కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పు’’ అన్నాడు సాగర్‌.

దానికి విసుగ్గా మొహంపెట్టి ‘‘తనకి విపరీతమైన ‘ఇగో’, అది భరించడం నావల్ల కాదు’’ అన్నాడు.

సాగర్‌ కాసేపు ఏం మాట్లాడకుండా ఉండి, ఆ తర్వాత ‘‘బాబాయ్‌, నేనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. జరిగిందేదో జరిగింది... ఇక మీదట మీకు నచ్చే విధంగా ఉండమని నచ్చచెప్పి తీసుకొస్తాను’’ అన్నాడు బుజ్జగింపుగా.

‘‘ఓరినీ... అమాయకత్వమూ నువ్వూనూ... ఆ పిల్ల అలా వినే రకం కాదురా, జగమొండి. అయినా వద్దురా బాబూ చాలు. ఎవరో నచ్చచెప్పారని ఇక్కడికి వచ్చి ఇక్కడేదైనా చేసుకుందనుకో- మా కుటుంబం మొత్తం జైలు పాలవుతాం. ఇప్పటికి బజార్నపడ్డది చాలు’’ అన్నాడు ఆనందరావ్‌ చేతులు రెండూ పైకెత్తేస్తూ.

‘‘వదిలెయ్యి అన్నాయ్‌, ఇదంతా ముగిసిపోయిన కథ’’ అని ఈజీగా అనేసి విజిల్‌ వేసుకుంటూ బైటకి వెళ్ళిపోయాడు వివేక్‌.

* * *

‘‘ఆడపిల్లని ఇచ్చినవాళ్ళమని అన్నిటికీ అణిగిమణిగి ఉండే రోజులు పోయాయి. మా పిల్లని పెద్ద చదువులు చదివించి, అతి గారంగా, అపురూపంగా పెంచుకున్నది ఎవరింటికోపోయి బానిస బతుకు బతకడానికి కాదు కదా, మీరే చెప్పండి’’ నిలదీసింది అన్నపూర్ణ ఆవేశంగా సాగర్‌ని.

‘‘అదేంటండీ, అలా అనుకుంటే ఎలా? మీరూ ఓ ఇంటి ఆడపిల్లే కదా... ఆ రోజుల్లో మరి మీరు సర్దుకుపోలేదా అత్తారింటికి వచ్చి. మీరు మాత్రం చిన్నా పెద్దా గొడవలూ సమస్యలూ రాకుండానే జీవితం గడిచిపోయిందా?’’ అన్నాడు సాగర్‌ తను కూడా కాస్తంత ఆవేశంగానే.

‘‘బావుంది... ఆ రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. అయినా, మా పిల్ల మనసు విరిగిపోయింది, ఆ కుర్రాడి ప్రవర్తనతో. ఇక మాకూ వాళ్ళకీ కుదరదు’’ అని తెగేసి చెప్పేసింది అన్నపూర్ణమ్మ.

‘‘మావాడేం అంత చెడ్డవాడు కాదు. ఏవో కొన్ని ‘మిస్‌ అండర్‌స్టాండింగ్స్‌’ వలన ఇంతవరకూ వచ్చింది కానీ, అసలు అందరం కూర్చుని మాట్లాడుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందేమో’’ ఆశాజనకంగా అన్నాడు సాగర్‌.

ఆ మాటలకి అంతవరకూ అక్కడే కూర్చుని ఈ మాటలన్నీ వింటున్న ధరణి ‘‘ఏవో ‘మిస్‌ అండర్‌స్టాండింగ్స్‌’ కాదండీ, అతని ప్రవర్తన మీకేం తెలుసు. అతనొక్కడనేం కాదు, వాళ్ళందరూ అంతే. ఇన్ని రోజులూ నేనెంత టార్చర్‌ అనుభవించానో తెలుసా? ఆఫీసులో పని ఎక్కువై, ఇంటికి లేట్‌గా వస్తే అదొక తప్పా? ఏదో వారమంతా అలసిపోతాం, వీకెండ్స్‌లో సరదాగా ఒకరోజు ఫ్రెండ్స్‌తో గడిపితే అదీ పెద్ద నేరమేనా? నేనేమిటీ, నా చదువేంటీ? రోజూ ఇంటిపనీ, వంటపనీ చేసుకుంటూ కూర్చుంటే నా కెరీర్‌ ఏమవుతుందీ, నా టార్గెట్స్‌ ఎలా కంప్లీట్‌ అవుతాయి? వాళ్ళకి ఇంటికి ఓ కోడలు కాదు కావాల్సింది, ఒక రోబో కావాలి. దానికీ ఏ ఫీలింగ్స్‌ లేకుండా చెప్పిందల్లా చెయ్యాలి. కూర్చుని మాట్లాడుకోవడం కాదు కదా... ఇకమీదట నా వాల్యుబుల్‌ టైమ్‌లో ఒక్క సెకను కూడా వాళ్ళకోసం వేస్ట్‌ చేయదలచుకోలేదు. అంత ‘పేషన్స్‌’ అసలు నాకు లేదు... దట్సాల్‌’’ అంటూ లోపలికి వెళ్ళిపోయింది విసురుగా, సహనశీలి, భూమాత పేరు పెట్టుకున్న ధరణి.

‘మరి మీరేం అంటారు’ అన్నట్లు ధరణి తండ్రి విశ్వనాథ్‌ మొహంలోకి చూశాడు సాగర్‌.

దానికి సమాధానంగా ‘‘మనమేం చేస్తాం, ఇప్పటి పిల్లలకి అన్నీ తెలుసు. మనం కన్విన్స్‌ చేస్తే కన్విన్స్‌ అయ్యే స్టేజీలో లేరు వాళ్ళు. ఇప్పటివరకూ జరిగిందేదో పీడకల అనుకుని మర్చిపోవడమే’’ అంటూ ఇక మాట్లాడటానికేం లేదు అన్నట్లు పెదవి విరుస్తూ పైకి లేచాడు.

* * *

‘‘ఏవండీ చూశారా, ‘చక్కటి జంట విడిపోయారు, వాళ్ళ జీవితాలేంటో, వాళ్ళ భవిష్యత్‌ ఏంటో’ అంటూ వాళ్ళని కన్నవాళ్ళకన్నా మీరెక్కువ బెంగ పెట్టుకుని బాధపడిపోయారు ఈ ఆర్నెల్లుగా. ఇప్పుడు చూడండి... చక్కగా ఇలా విడాకులు రావడమేంటీ అలాగ చెరొకళ్ళనీ చేసేసుకుని మళ్ళీ ఫ్రెష్‌గా సంసారాలు మొదలుపెట్టడానికి రెడీ అయిపోయారు’’ అంది ఉమ, సాగర్‌ చేతిలో అటు వివేక్‌, ఇటు ధరణిల పెళ్ళి పత్రికలను విడివిడిగా చూస్తూ.

‘‘ఏంటో ఈ కాలం... పెళ్ళిళ్ళు చేసుకోవడం - అక్కర్లేదనుకుంటే విడిపోవడం ఇంత మామూలు అయిపోయిందా - అనుకుంటే చాలా బాధగా ఉంది. పిల్లలు సరే ఆవేశపడతారు, కానీ బుద్ధులు చెప్పాల్సిన పెద్దలే ముందూ వెనకా ఆలోచించకుండా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. వివేక్‌, ధరణీలు ఇద్దరినీ కలిపి వారి వివాహబంధం చెడిపోకుండా చూడాలని ఎంత ప్రయత్నించానో నీకూ తెలుసుకదా. ఎవరిమటుకు వారే ‘తప్పు అవతలి వారిదే’నంటూ విడిపోవడమే ధ్యేయంగా పెట్టుకుని నిందలు వేసుకున్నారు. పోనీ, అంత విడిపోయే సమస్యలా అంటే కానే కావు’’ అన్నాడు సాగర్‌ చాలా బాధగా.

‘‘ఒక్క వివేక్‌, ధరణీలే కాదు, చాలా జంటలు ఎంత హడావుడిగా విడిపోతున్నారో మళ్ళీ అంతే హడావుడిగా ఇంకోళ్ళని చేసుకుంటున్నారు. ఆ ఇంకోళ్ళతో కూడా అడ్జస్ట్‌ అవ్వలేకపోతే ఏం చేస్తారో?’’ సాలోచనగా అంది ఉమ.

‘‘ఆ... అలాంటి చికాకులు రాకుండా ఉంటాయనే ఇపుడు కొత్తగా ఓ ట్రెండ్‌ నడుస్తోందిగా... అదే- ‘సహజీవనం’. స్టైల్‌గా చెప్పాలంటే ‘లివింగ్‌ టుగెదర్‌’. అదయితే బంధాలూ బాధ్యతలూ ఉండవ్‌. కావలిస్తే కలిసి ఉండొచ్చు లేదంటే విడిపోవచ్చు. ఏంటో, ఎక్కడుందో లోపం... అన్ని దేశాలవాళ్ళూ మన వివాహ వ్యవస్థని మెచ్చుకుని ఆచరిస్తుంటే, మనం మాత్రం దాన్ని ఎలా నాశనం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాం. దేశం ఎటుపోతోందో, మన భవిష్యత్తు తరాలు ఎటు వెళతాయో’’ అని సాగర్‌ అంటూండగానే-

‘‘అమ్మా... అమ్మా...’’ అంటూ విసురుగా వచ్చి వీపుకున్న స్కూల్‌ బ్యాగ్‌ని ధన్‌మని కిందకు పడేస్తూ ‘‘రేపటి నుండి ఈ స్కూల్‌కి నేను వెళ్ళనమ్మా’’ అంది ఏడుపు గొంతుతో సాగర్‌, ఉమల గారాలపట్టి పన్నెండేళ్ళ సుజీ.

‘‘ఏంటి తల్లీ ఏమయిందీ, రెండు నెలలే కదా అయింది ఈ స్కూల్లో జాయినయి, అప్పుడే ఏమొచ్చింది?’’ అన్నాడు కాస్త విసుగ్గా సాగర్‌.

‘‘వద్దు నాన్నా, నాకీ స్కూలు వద్దు... వద్దంటే వద్దు. రేపట్నుంచీ నేను వెళ్ళనంతే’’ అంటూ కాళ్ళు విసురుగా నేలకేసి కొడ్తూ తన గదిలోకి పోయింది.

‘‘ఏంటి ఉమా... బోల్డంత ఫీజులు కట్టి మొన్నే జాయిన్‌ చేశాం, సడన్‌గా వెళ్ళనంటుందేంటి?’’ అన్నాడు సాగర్‌, వెళ్ళిపోతున్న కూతురి వైపు గాభరాగా చూస్తూ.

‘‘అదేం సడన్‌గా అనటంలేదు, జాయిన్‌ చేసిన పది రోజుల నుండీ ఆ స్కూల్‌ నచ్చలేదని పోరు పెడుతూనే ఉంది. ఏం చేస్తాం, ఇష్టం లేదంటోంది కదా... అయినా ఫస్ట్‌ టర్మ్‌ ఫీజు మాత్రమే కట్టాం కదా, పోతేపోయిందనుకుని వేరే స్కూల్‌- దానికి నచ్చినదాంట్లో జాయిన్‌ చేద్దాం. మనకు దగ్గర్లోనే ఇంకో స్కూల్‌ ఉంది కదా’’ అంది ధీమాగా ఉమ.

‘‘అది కూడా నచ్చకపోతే’’ కాస్త కోపంగా అరిచినట్లు అడిగాడు సాగర్‌.

‘‘ఏంటీ, అంత సీరియస్‌ అవుతున్నారు. దానికి నచ్చలేదన్నా- రోజూ ఏడుస్తూ వెళుతున్నా ఆ స్కూల్‌కే పంపించాల్సిన అవసరమేంటి, దగ్గరలో మరొక స్కూల్‌ అందుబాటులో ఉండగా. డబ్బు పోతుందనుకుంటే ఎలాగ... పిల్ల సంతోషంగా ఉండటమే కదా కావాలి’’ అంది ఉమ కూడా కాస్త కోపంగా.

ఆ మాటలకి సాగర్‌ కాసేపు మౌనంగా ఉండి, ఆ తర్వాత దీర్ఘంగా నిట్టూరుస్తూ ‘‘అదీ సంగతి... నాకు ఇప్పుడు అర్థం అవుతోంది- అవకాశం, అందుబాటు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇందులో అడ్జస్ట్‌ అవ్వమని మనం చెప్పట్లేదన్నమాట. ఇది కాకపోతే ఇంకోటి, అదీ కాకపోతే మరొకటి... ఈరోజు చదువూ, బట్టల విషయంలో అయిందీ, రేపు పెళ్ళి విషయంలోనూ అవుతుంది’’ అన్నాడు.

‘‘అదేంటి, ఇంత చిన్న విషయాన్ని అంత పెద్ద విషయాలతో పోలుస్తారు’’ అంది ఉమ విసుగ్గా.

‘‘లేదు ఉమా, ఇవాళ చిన్న విషయమనీ, మనకి పెద్దగా ఇబ్బందిలేనిదనీ తేలిగ్గా తీసుకుంటున్నాం కాబట్టే ఇప్పటి పిల్లలకి దేని విలువా తెలీటం లేదు. కొత్తగా వెళ్ళినపుడు ఏదైనా పూర్తిగా నచ్చకపోవచ్చు. కొన్ని రోజులు ఓపికపట్టి ‘అడ్జస్ట్‌’ అయితే, అది మనది అన్న సొంత భావన కలుగుతుంది. దాంతో నెమ్మదినెమ్మదిగా అక్కడ అన్నీ నచ్చడం మొదలవుతాయి’’ అన్నాడు సాగర్‌.

‘‘ఏ విషయాన్ని ఏ విషయంతో పోలుస్తున్నారు. దానికి ఇష్టంలేని స్కూల్‌కి ఇపుడు బలవంతంగా పంపిస్తారా?’’ అంది ఉమ.

‘‘లేదు, దాన్ని బలవంతంగా పంపించను. ఇష్టపడి వెళ్ళే విధంగా మారుస్తాను. రేపట్నుంచీ తరచుగా దానితోపాటు స్కూల్‌కి వెళ్ళి అక్కడ ఏం నచ్చలేదో, ఎందుకు నచ్చలేదో తెలుసుకుంటాను. అందుకు కారణాలేంటో దానికీ అర్థమయ్యేలా వివరంగా చెప్తాను. దాని మనసులోని అపోహలన్నీ తొలగించి ఆనందంగా వెళ్ళేలాగా చూస్తాను. ఇప్పుడు ఈ వయసులోనుంచే సర్దుకుపోవడం, నలుగురితో షేర్‌ చేసుకోవడం లాంటివి అలవాటుచేస్తే భవిష్యత్తులో తొందరపాటు నిర్ణయాలూ, ఆవేశపు ఆలోచనలూ చేయకుండా జీవితాలను ఆనందమయం చేసుకోగలుగుతారు. విడాకులూ వివాహ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం- ఇవన్నీ ఈ తరం పిల్లల ఆలోచనలంటూ మొత్తం వాళ్ళమీదకు తోసెయ్యడం కరెక్ట్‌ కాదు. వాళ్ళకు చిన్నప్పట్నుంచీ ఒకటి నచ్చకపోతే ఇంకోటీ, ఇంకోటి నచ్చకపోతే మరోటీ అనే ఛాయిస్‌ల మీద పెంచి, ‘యూజ్‌ అండ్‌ త్రో’ వస్తువులనే కొని ఇస్తూ, దేని విలువా తెలియకుండా సర్దుబాటు అన్నమాటే లేకుండా పెంచుతున్న పెద్దలదే తప్పంతా. ఇకమీదట మనమైనా బాధ్యతగల తల్లిదండ్రులుగా ‘ఛాయిస్‌ అండ్‌ యూజ్‌ అండ్‌ త్రో’ సిస్టమ్‌లో కాకుండా, ‘అడ్జస్ట్‌మెంట్‌ అండ్‌ రిపేర్‌’ సిస్టమ్‌లో పిల్లల్ని పెంచుదాం’’ అంటూ, కూతురు అడ్డదిడ్డంగా పడేసి వెళ్ళిన స్కూలు బ్యాగుని తీసి సక్రమంగా పెట్టాడు సాగర్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.