close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రిలయన్స్‌ ‘కురుక్షేత్రం’!

రిలయన్స్‌ ‘కురుక్షేత్రం’!

తమ ఉద్యోగుల్ని యుద్ధం చేయమంటోంది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. ఈ యుద్ధం పోటీ సంస్థలపైన చేసేది కాదు... సంస్థ స్తబ్దతపైన చేసే మార్పు యుద్ధం, వృథాలపైన చేసే ఆదా యుద్ధం, అనుసరణపైన చేసే ఆవిష్కరణల యుద్ధం... దీనిపేరు ‘మిషన్‌ కురుక్షేత్ర’!

గ్రోత్‌ ఈజ్‌ లైఫ్‌(ఎదుగుదలతోనే మనుగడ)... రిలయన్స్‌ సంస్థ నినాదమిది. సంస్థ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఈ అంశాన్ని బలంగా నమ్ముతారు. ఆయన నిత్య విద్యార్థి. టెలికామ్‌ రంగంలో అడుగు పెట్టాలనుకున్నపుడు ‘కోర్సోరా’ వెబ్‌పోర్టల్‌లో ఆ విభాగానికి సంబంధించిన కోర్సులు చేశారు. రిలయన్స్‌ని ప్రపంచంలోనే అత్యంత వినూత్న ఆవిష్కరణల కంపెనీగా తీర్చిదిద్దాలనేది ఆయన లక్ష్యం. అందుకోసమే ‘రిలయన్స్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌’ విభాగాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు కంపెనీ ఏయే రంగాల్లో అడుగుపెట్టొచ్చో ఈ కౌన్సిల్‌ ఛైర్మన్‌కు సలహా ఇస్తుంది. ఇందులోనూ మళ్లీ ప్రత్యేక విభాగాలున్నాయి. ఆ విభాగాల్లో కీలకమైనది ‘మిషన్‌ కురుక్షేత్ర’. రఘునాథ్‌ మషేల్కర్‌ దీని సారథి. ప్రభుత్వ రంగంలోని సీఎస్‌ఐఆర్‌(కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌)కి డైరెక్టర్‌ జనరల్‌గా పని చేశారు మషేల్కర్‌. ఈయన ప్రస్తుతం రిలయన్స్‌ బోర్డు సభ్యుడు కూడా. ఉన్నత స్థాయిలో ఉన్నవారే కాకుండా సాధారణ ఉద్యోగులూ కంపెనీ ఎదుగుదలకు ఆలోచనల్ని చెప్పేలా ప్రోత్సహించడమే కురుక్షేత్ర ఉద్దేశం. ఆ ఆలోచనలు సంస్థని కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెట్టేలా అయినా, ఉన్న వ్యాపారాల్ని ఇంకా మెరుగ్గా చేపట్టేలా అయినా ఉండాలనేది నియమం.

మాంద్యంతో మొదలు
2008 ఆర్థిక మాంద్యం సమయంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న లీమన్‌ బ్రదర్స్‌ లాంటి కంపెనీలు కూడా దివాలా తీశాయి. అప్పుడే అలాంటి ఒడుదొడుకులకు అతీతంగా రిలయన్స్‌ని తీర్చిదిద్దాలనుకున్నారు ముఖేష్‌. సృజనాత్మకత, వినూత్నత, కాలానుకూల మార్పులు... ఈ మూడింటినీ ప్రోత్సహించేలా మిషన్‌ కురుక్షేత్ర ప్రాజెక్టుని 2010లో ప్రారంభించారు. దానివల్ల కొంత మార్పు వచ్చింది. కొన్ని అత్యవసర ప్రాజెక్టుల కారణంగా రెండేళ్లు దాన్ని పక్కన పెట్టి 2014లో పునఃప్రారంభించారు. కురుక్షేత్ర ... స్తబ్దతపైన ప్రకటించిన యుద్ధంగా చెబుతారు మషేల్కర్‌. కేవలం ఆలోచనల బ్యాంకుగానే కాకుండా వాటిని ఆచరణలోకి తెచ్చే వేదికగానూ దీన్ని రూపొందించారు. చాలా కంపెనీల్లో ఇలాంటి పద్ధతి ఉన్నా, దానికోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ప్రారంభించడమూ, ఆలోచనలు ఆచరణ దశకు వచ్చేంతవరకూ సాగే ప్రయాణాన్ని తెలియజేయడమూ ఇక్కడ మాత్రమే జరుగుతోంది. వృథాను తగ్గించడం... అది ఆర్థిక వనరులైనా, మానవ వనరులైనా, సంస్థ ప్రాజెక్టుల్ని గరిష్ఠ స్థాయిలో అమలు చేయడం... మొదలైనవి కురుక్షేత్ర లక్ష్యాలు. కురుక్షేత్రలో భాగంగా ప్రతి ఉద్యోగీ తమ ఆలోచనల్ని పంచుకోవచ్చు. ఒకసారి ఆలోచన పంపాక అది ఏ దశలో ఉందన్న విషయాన్ని మిషన్‌ కురుక్షేత్ర ఆప్‌, వెబ్‌ పోర్టల్‌లలో చూడొచ్చు. ఒక విభాగంలో పనిచేసేవారు సంస్థకు చెందిన ఇతర విభాగాలకు సంబంధించిన అంశాలపైనా తమ ఆలోచనల్ని పంపొచ్చు. ఏదైనా విభాగం గురించి ఆలోచనను పంపినపుడు ఆ విభాగంలోని వారు దాన్ని క్షుణ్నంగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు తమ విభాగంలోని ఉన్నతాధికారులకు కాకుండా ప్రత్యేక అధికారులకు ఈ ఆలోచనల్ని పంపిస్తారు. ఎంపిక కాని వాటిని మర్యాదపూర్వకంగానే చెబుతారు. ఉద్యోగుల నుంచీ దీనికి మంచి స్పందన వచ్చింది. 2014 నుంచి ఇప్పటివరకూ 18వేల ఆలోచనలను దీనిద్వారా ఉద్యోగులు పంచుకున్నారు. అంటే నెలకు దాదాపు 500 ఆలోచనలు వచ్చాయన్నమాట. వీటిలోంచి 3500 ఆలోచనల్ని ఆచరణ కోసం ఎంపికచేశారు. అందులో 64 శాతం ఆలోచన స్థాయి దాటి ఆచరణ పరంగా ఏదో ఒక దశలో ఉన్నాయి. మున్ముందు ఆలోచనల సంఖ్యతోపాటు వాటి ఆచరణతో జరిగే మార్పు కూడా పెరగనుందంటారు మషేల్కర్‌.

అవార్డులూ ఉన్నాయ్‌...
మిషన్‌ ‘కురుక్షేత్ర’లో పాల్గొనే ఉద్యోగులకు ఏటా అవార్డుల్నీ అందిస్తున్నారు. ఈ అవార్డులకు మహాభారతంలోని పాత్రల పేర్లు ఉండటం మరో ప్రత్యేకత. వినూత్నమైన ఆలోచన చెప్పి, దాంతో చెప్పుకోదగిన స్థాయిలో కంపెనీలో మార్పు వస్తే ఆ ఉద్యోగిని ప్రధానమైన ‘కృష్ణ’ అవార్డుకి ఎంపికచేస్తారు. తమ విభాగంలో కాకుండా ఇతర విభాగాలకు సంబంధించిన అంశాల్లో ఆలోచనలు పంచుకొని అవి ఆచరణలోకి వస్తే వారికి ‘కర్ణ’, గరిష్ఠంగా లాభాలు తెచ్చే ఆలోచన ఇచ్చిన ఉద్యోగికి ‘యుక్తి’, ఉద్యోగుల ఆలోచనల్ని ఎంపికచేసి వాటిని ఆచరణలో పెట్టే సీనియర్‌ ఉద్యోగులకు ‘ఛాంపియన్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌’, తమ విభాగాల్లో మిషన్‌ కురుక్షేత్ర ఆలోచనలతో మార్పు తెచ్చిన మేనేజర్లకి ‘సేనాపతి’ ... మొదలైన అవార్డుల్ని అందిస్తారు.

ఇప్పటికే కంపెనీ అభివృద్ధిలో కురుక్షేత్ర చెప్పుకోదగిన మార్పులు తెచ్చింది. ఒక ఉద్యోగి ఈథేన్‌ సరఫరా పైప్‌లైన్‌ గురించి చేసిన ఓ ఆలోచన కంపెనీకి రూ.90 కోట్లు మిగిల్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 31వేల కోట్ల లాభాలు గడించింది. అందులో కురుక్షేత్రకూ తగిన వాటా ఉందంటారు మషేల్కర్‌. ఐడియా జీవితాన్నే కాదు, సంస్థల్నీ మార్చేస్తుందన్నమాట!


 

కాలికి చెప్పు.. ఆ వూళ్లొ తప్పు!

మండే ఎండల్లో చెప్పుల్లేకుండా కిలోమీటరు నడవగలరా... అదీ కాళ్లు కాలుతున్నాయనే బాధను కళ్లలో కనిపించనీయకుండా... తొందరపడి అసాధ్యం అనేయకండి. చిత్తూరు జిల్లాలోని ఆ గ్రామాల్లో పెద్దల నుంచి పిల్లల వరకూ ఎవరైనా ఈ పనిని సునాయాసంగా చేసెయ్యగలరు. వాళ్లసలెప్పుడూ చెప్పులు వేసుకోరు మరి.

నతోనే ఉంటారు. మనలానే ఉంటారు. వాళ్లూ తెలుగు ప్రజలే. కానీ వారి ఆచారవ్యవహారాల గురించి తెలిస్తే మాత్రం నాగరిక సమాజం అవాక్కవాల్సిందే. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, పాకాల మండలంలోని వేమయ్య ఇండ్లు, ఐరాల మండలంలోని దేవర ఇండ్లు గ్రామాల పరిస్థితి. ఇక్కడ నివసించే పాల ఏకిరి జాతి ప్రజల జీవన శైలి ఎంత భిన్నంగా ఉంటుందన్నది ఆ గ్రామాల పొలిమేరల్లోకి అడుగు పెడితేనే తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ వూళ్లలో అడుగు పెట్టాలంటే ఎవరైనా పొలిమేరల్లోనే చెప్పులు తీసెయ్యాలి. గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోకూడదన్నది అక్కడి ప్రజలు అత్యంత నిష్ఠగా పాటించే సంప్రదాయం. ఇక, ఈ వూళ్లలో పుట్టినవారైతే పిల్లల దగ్గర్నుంచి వృద్ధుల వరకూ జీవితాంతం చెప్పులో కాలు పెట్టకూడదనేది మరో నియమం. అందుకే, వారు వందల కిలోమీటర్ల దూర ప్రయాణం చెయ్యాల్సొచ్చినా చెప్పుల్లేకుండానే తిరిగేస్తుంటారు. చెప్పులేసుకుంటే వచ్చే నష్టమేంటని ఎవరైనా అడిగితే ‘గ్రామంలో ఉన్న కులదైవం ఆగ్రహిస్తాడు. ప్రాణాపాయం తప్పదు’ అంటారు. ఇంతకీ వారి ఆరాధ్య దైవం ఎవరో తెలుసా... సాక్షాత్తూ వేంకటేశ్వరస్వామి వారే. ఇంకా విచిత్రం ఏంటంటే... స్థానికంగా ఉన్న తిరుమలకు దేశం నలుమూలల నుంచీ భక్తులు వస్తుంటారు కానీ వేమయ్య ఇండ్లు, దేవర ఇండ్లు ప్రజలు తిరుమలలో అడుగు పెట్టరు. తమ గ్రామంలో ఉన్న వేంకటేశ్వరుని ఆలయానికే వెళ్తారు. ఇక, మామూలుగా ఎవరైనా గుళ్లొకి మాత్రమే చెప్పులు వేసుకెళ్లరు. కానీ తమ వూళ్లొ స్వామి వారి ఆలయం ఉందన్న కారణంతో వీళ్లు ఎవరినీ గ్రామంలోకి చెప్పులు వేసుకు రానివ్వరు.

చదువూ మానేస్తున్నారు
వేమయ్య ఇండ్లు, దేవర ఇండ్లు గ్రామాల్లో పాదరక్షలు వేసుకోకూడదనే ఆచారాన్ని ఏ స్థాయిలో పాటిస్తున్నారంటే... పాఠశాలల్లో యూనిఫామ్‌లో భాగంగా చెప్పులు తప్పనిసరి అంటే ఇక్కడివారు పిల్లల చదువునూ మాన్పించేస్తున్నారు. చాలామంది అలాగే చదువుకి దూరమయ్యారు. ఒకరిద్దరు మాత్రం వూరిబయటికెళ్లాక చెప్పులు వేసుకుని తిరిగొచ్చేటపుడు మళ్లీ వాటిని పొలిమేరల్లో దాచి వస్తున్నారు. ‘సంప్రదాయం కారణంగా నాకెంతో ఇష్టమైన చదువుని పక్కన పెట్టలేక వూరి బయటికెళ్లాక చెప్పులు వేసుకుని కాలేజీకి వెళ్తున్నా’ అంటాడు ఎంబీయే చదువుతున్న మనోహర. ఈ గ్రామాలకు కోడళ్లుగా వచ్చే మహిళలు కూడా ఇక్కడి పద్ధతుల్ని తు.చ తప్పకుండా పాటించాల్సిందే. ఇక ఎప్పుడూ చెప్పులు వేసుకోరు కాబట్టి, వేమయ్య ఇండ్లు, దేవర ఇండ్లు గ్రామస్థుల పాదాలు రాటు దేలిపోయి ఎంత ఎండలో నడిచినా వేడిగా అనిపించదట. కానీ గ్రామస్థుల బంధువులెవరైనా వస్తే మాత్రం చెప్పుల్లేకుండా నడవడానికి నానాతంటాలూ పడుతుంటారట. ఈ రెండు గ్రామాల్లో ఇలాంటి నమ్మకాలు మరెన్నో ఉన్నాయి. ఇక్కడి ప్రజలు బయటివారు వండిన వేటినీ ముట్టరు. అందుకే, వూరు దాటి వెళ్తే వెంట కచ్చితంగా నీరు, తినడానిక్కావల్సిన పదార్థాల్నీ పట్టుకెళ్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో దూరప్రాంతాలకు వెళ్లి నాలుగైదు రోజులుండాల్సి వచ్చినా ఏ పండ్లతోనో కడుపు నింపుకుంటారు తప్ప ఎక్కడా భోజనాన్ని ముట్టరు. ‘ఓసారి పనిమీద హైదరాబాదు వెళ్లి తిరిగొచ్చేసరికి నాలుగురోజులు పట్టింది. పండ్లు తిని గడిపా కానీ బయట ఎక్కడా మెతుకు ముట్టలేదు’ అంటాడు గ్రామానికి చెందిన 80ఏళ్ల ఎర్రన్న. దగ్గరి బంధువుల ఇళ్లకు వెళ్లినపుడు వాళ్లు కొత్త కుండలో వండిపెడితే మాత్రం తింటారు. ఆఖరికి ఈ గ్రామాల్లోని పెద్దలు తమ పిల్లల్ని ప్రాథమిక పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజనాన్ని కూడా తిననివ్వరు. ప్రభుత్వ బడుల్లో చదువుకోవడానికి వెళ్లేవారు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేస్తారు. అన్నట్లూ వీరికి మరో పట్టింపు కూడా ఉంది. బయటివారెవరైనా తమను ముట్టుకుంటే మైలపడిపోయినట్లూ భావిస్తారు. అందుకే, ఎక్కడికైనా వెళ్తే ఇంటిబయటే స్నానం చేసి లోపలికెళ్తారు. బడి నుంచి మధ్యాహ్నం భోజనానికి వచ్చిన పిల్లలకూ బయటే కూర్చోబెట్టి అన్నం పెడతారు.

నెల నెలా శిక్షే
వేమయ్య ఇండ్లు, దేవర ఇండ్లు గ్రామాల్లో ఉన్న మరో వింత కట్టుబాటు గురించి తెలిస్తే ఈ కాలంలో కూడా మహిళల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారా... అని ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడి మహిళలు బహిష్టు సమయంలో వూరి బయట ఏర్పాటు చేసిన చిన్నపాటి పాకల్లోనే ఉండాలట. ఎండా వానా పగలూ రాత్రీ పురుగు పామూ... ఏది ఏమైనా ఆ నియమం తప్పడానికి వీల్లేదు. తొలిసారి పుష్పవతి అయిన అమ్మాయిలైతే 12 రోజులపాటూ అక్కణ్నుంచి కదలకూడదు. ఇంట్లో వాళ్లు రోజుకి రెండుమూడు సార్లు భోజనం ఇచ్చి వెళ్లిపోతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గ్రామాల్లో ఎన్నో వింత ఆచారాలు. సంప్రదాయం పేరుతో స్వయంగా గ్రామస్థులే అభివృద్ధికి దూరంగా ఉండిపోతున్నారు. ఇప్పటికీ అక్కడ అన్నీ పూరి గుడిసెలే. ప్రభుత్వ పక్కా ఇళ్లు మంజూరైనా గృహ నిర్మాణాలకు వేరేవాళ్లు గ్రామాల్లోకి రావడం ఇష్టం లేక వాటిని వదులుకున్నారు.
ఇంకా ఇలాంటి ఆచారాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..!

- కరీముల్లా షేక్‌, ఈనాడు, చిత్తూరు
ఫొటోలు: చొప్పా సుబ్రమణ్యం

 

రజనీ కోసం.. నేర్చారు తమిళం!

ఇష్టమైన హీరో సినిమా విడుదలైతే ఏం చేస్తారు? తొలిరోజు, తొలి ప్రదర్శనకు బ్లాకులో అయినా టికెట్‌ కొనుక్కుని చూసేస్తారు కదా! ఆ హీరో విదేశీయుడైతే..? వీసా తీసుకుని విమానం టికెట్‌ కొనుక్కుని విదేశాలకెళ్లి సినిమా చూసి రాగలరా?
జపాన్‌ వాళ్లయితే అలాగే చేస్తారు మరి!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఏనాడూ జపాన్‌ వెళ్లలేదు. కానీ అక్కడి ఆయన అభిమానులు మాత్రం చాలాసార్లు ఇండియా వచ్చారు. రజనీ సినిమా చూడడానికి! వీలైతే ఆయనతో ఓ ఫొటో దిగడానికి. ‘కబాలి’ సినిమా విడుదల రోజున చెన్నై థియేటర్ల వద్ద రజనీ ఫ్యాన్స్‌ సందడిలో జపాన్‌ నుంచి వచ్చినవారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేవలం ఓ సినిమా చూడడానికి ఇంత దూరం వచ్చారంటే వారికెంత అభిమానం ఉండాలి? ఆ అభిమానానికి దారి తీసిన పరిస్థితులేమిటో టోక్యోలో రజనీ ఫ్యాన్స్‌ క్లబ్‌ తొలి సభ్యురాలి మాటల్లో చూడండి...

‘ముత్తు’ మత్తు ఇది!
‘నా పేరు నొరికో ఇనగాకి. 1998లో రజనీకాంత్‌ సినిమా ‘ముత్తు’ తొలిసారి జపాన్‌లో విడుదలైంది. అప్పటికి మా దృష్టిలో రజనీకాంత్‌ అంటే ఓ మామూలు మధ్యవయసు హీరో, అంతే. పోస్టర్లమీద అందమైన అమ్మాయి మీనా మొహం చూసి చాలామంది థియేటర్‌కి వెళ్లారు. ఆ తర్వాత కొన్ని వారాలపాటు వెళ్తూనే ఉన్నారు. ఎప్పుడూ థియేటర్‌కెళ్లి సినిమా చూడనివారు కూడా ఆ సినిమా చూశారు. రజనీ నవ్వూ స్టైలూ స్క్రీన్‌ ప్రెజెన్స్‌... అన్నీ మా మనసు దోచేశాయి. ఆ తర్వాత కొన్ని బాలీవుడ్‌ సినిమాలు విడుదలైనా దేనికీ అంత వ్యాపారం జరగలేదు. ‘ముత్తు’ కేవలం హిట్‌ సినిమా కాదు, అది ఒక సంచలనం. థియేటర్లలో 23 వారాలు ఆడింది. ప్రైవేటు టీవీ ఛానల్స్‌తో పాటు జాతీయ టెలివిజన్‌లో కూడా ఆ చిత్రం ప్రసారమైంది. డీవీడీలు కొనుక్కున్నాం. నిజానికి అప్పుడు నేను ఉద్యోగం కోల్పోయి విచారంగా ఉన్నా. సినిమా చూసిన కొన్నాళ్లకే ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత రజనీ సినిమా చూసినప్పుడల్లా నాకు జీవితంలో ఏదో ఒక సానుకూల అంశం కన్పిస్తోంది. అలా రజనీ నాకు గురువయ్యాడు. చెన్నై వెళ్లి ‘బాబా’ చూశా. ‘చంద్రముఖి’ చూడడానికి సింగపూర్‌, ‘శివాజీ’ కోసం కౌలాలంపూర్‌... తిరుగుతూనే ఉన్నా. ప్రతిసారీ నాకో మంచి అవకాశం వస్తూనే ఉంది. రజనీ సినిమాలు మా దగ్గర విడుదల కాకపోయినా నాలాంటి అభిమానులు ఏదోరకంగా వాటిని చూస్తారు. ఆ సినిమాలు జపాన్‌లో విడుదల కాకపోవడం మార్కెటింగ్‌ లోపమే...’ అంటుంది ఇనగాకి.

జపాన్‌లో రజనీకాంత్‌ పేరు తెలియని వారుండరు. ప్రజాదరణలో ఆయనని ‘టైటానిక్‌’ హీరో లియోనార్డొ డికాప్రియోతో పోల్చింది న్యూస్‌వీక్‌ పత్రిక. ‘ముత్తు’ సినిమాపై అక్కడి అభిమానులు పీహెచ్‌డీ స్థాయి సమీక్షలు రాయగలరు. ఒక్కొక్కరూ సినిమాను ఎన్నిసార్లు చూశారో కానీ సాంకేతికత, ఎడిటింగ్‌, పాటలు, నృత్యాలు... అన్ని అంశాలనూ ఎంతో నిశితంగా విశ్లేషిస్తారు. ఆంగ్లం రాని వారు కూడా తమిళ డైలాగులు తడుముకోకుండా చెబుతారు. వారి సోషల్‌ మీడియా ఖాతాల్లో రజనీ డైలాగుల డబ్‌స్మాష్‌ వీడియోలు లెక్కలేనన్ని. 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జపాన్‌ వెళ్లారు. వారి పార్లమెంటులో ప్రసంగిస్తూ ఆయన ‘ముత్తు’ ప్రస్తావన తేగా సభ్యులందరూ పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఆ ఒక్క సంఘటన చాలు రజనీ పట్ల జపనీయులకు ఎంత క్రేజ్‌ ఉందో చెప్పడానికి.

ఇటీవల రజనీ ‘బాషా’ సినిమాని రెండోసారి అన్ని దేశాల్లోనూ విడుదల చేశారు. తరచూ చెన్నై వచ్చి వెళ్తున్న జపాన్‌ అభిమానులు అచ్చం ఇక్కడి అభిమానుల్ని అనుకరిస్తూ బాషా విడుదలైన థియేటర్ల వద్ద రజనీ కటౌట్లకు పాలాభిషేకాలు చేశారట.

ఆటో దిగుమతి చేసుకుని...
హిరొయొషి టకెడా రజనీ బొమ్మ ఉన్న టీషర్టు, దాని మీద ఖాకీ షర్టు వేసుకుంటాడు. ఇండియా నుంచి ప్రత్యేకంగా ఓ ఆటోను దిగుమతి చేసుకున్నాడు. అందులోనే తిరుగుతాడు. రజనీలా తలెగరేసి నృత్యం చేస్తాడు. రజనీ సినిమా మేనరిజాలన్నీ ప్రాక్టీసు చేసి ప్రదర్శిస్తూ ఉంటాడు. తమిళం నేర్చుకున్నాడు. స్నేహితుడితో కలిసి ‘మసాలావాలా’ పేరుతో దక్షిణ భారతీయ వంటకాల రెస్టరెంట్‌ నడుపుతున్నాడు. వంటకాలే కాదు, అక్కడ వడ్డన కూడా అరటి ఆకుల్లోనే. మికన్‌ అనే అభిమాని యువతీయువకులకు భారతీయ సినిమా నృత్యాలను నేర్పిస్తుంది. అట్సుకో అనే మరో అభిమాని హెన్నా ఆర్టిస్టుగా రాణిస్తోంది. ఒక్క టోక్యోలోనే రజనీ ఫ్యాన్‌ క్లబ్‌లో 3వేల మంది సభ్యులున్నారు. ఒసాకా, కోబె తదితర నగరాల్లోనూ రజనీ అభిమాన సంఘాలున్నాయి.

జపనీయుల సంస్కృతికి మూలమైన బౌద్ధం భారతదేశం నుంచి దిగుమతి అయిందే. ఇప్పుడు ఆ వారసత్వాన్ని రజనీ కొనసాగిస్తున్నాడంటూ అక్కడి పెద్దలు వ్యాఖ్యానించడం విశేషం. హీరో మీద అభిమానంతో తమ సంస్కృతీ సంప్రదాయాలను పక్కన పెట్టి మరీ కొత్త జీవనశైలిని అనుకరిస్తున్న ఈ జపనీయులు సినిమా హీరోల్లో రజనీకాంత్‌ ఎంత ప్రత్యేకమో, ఆయన అభిమానుల్లో మేమూ అంతే ప్రత్యేకం అని చాటుతున్నారు కదూ.


 

3 లక్షలు వెనక్కివమన్నారు...
17లక్షలు ఎదురిచ్చారు!

దేశభక్తితోనో, భుక్తికోసమో... సైన్యంలో చేరతారు యువకులు. విధినిర్వహణలో ప్రాణాలూ అర్పిస్తారు. ఆ తర్వాత? కన్నబిడ్డను కోల్పోయి తల్లిదండ్రులూ, భాగస్వామిని కోల్పోయి భార్యా పడే కష్టాలు ఇన్నీ అన్నీ కావు. ప్రభుత్వం నుంచి అందాల్సినవేంటో వారికి తెలియదు. ఎలా బతకాలో అర్థం కాదు. అలాంటి అమాయకులకు అండగా నిలుస్తోంది హైదరాబాద్‌లోని ఈ సంస్థ.

షాహీన్‌ సుల్తానా భర్త భారత సైనికుడిగా చైనా, పాకిస్థాన్‌లతో జరిగిన మూడు యుద్ధాల్లో పాల్గొన్నారు. 45 ఏళ్లకే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన ఆ తర్వాత మూడు నెల్లకే గుండెనొప్పితో మరణించారు. 1974 నాటి సంగతిది. 36 ఏళ్ల వయసులో ఒంటరైన సుల్తానా వచ్చే కొద్దిపాటి పింఛన్‌కి తోడు ఓ ప్రీÏస్కూల్‌ నిర్వహిస్తూ పిల్లలిద్దర్నీ చదివించి పెద్దచేశారు. ప్రస్తుతం ఒంటరిగా హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆమెకు 2016లో ఓ నోటీసు అందింది. ఆమెకు పెన్షన్‌ ఎక్కువగా చెల్లించామనీ రూ.3 లక్షలు తిరిగి చెల్లించమనీ దాని సారాంశం. అది చూసి హతాశురాలైన సుల్తానా న్యాయం చేయమంటూ అధికారులను సంప్రదించారు. మాజీ జనరల్‌ యోగి శర్మ ఆ వృద్ధురాలిని టీసేవా సంఘం వద్దకు తీసుకెళ్లారు. వారు సుల్తానా భర్త మొయిదు కేసు పూర్తి వివరాలు సేకరించారు. 26 ఏళ్ల రికార్డులూ రసీదులూ అన్నీ తిరగేస్తే తేలిందేమిటంటే ఆమెకే రూ.17 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉందని. ఆ వివరాలన్నీ తెలుపుతూ బ్యాంకువారికీ, పింఛను కార్యాలయానికీ లేఖలు రాసి టీసేవా సంఘం సుల్తానాకి న్యాయంగా అందవలసిన బకాయిలు మొత్తం అందేలా చేసింది. వారి సహాయమే లేకపోతే తనకు జరిగిన అన్యాయం ఎప్పటికీ తెలిసేది కాదనీ, పైగా వాళ్లు అడిగిన 3 లక్షలు చెల్లించడానికి తాను చాలా అవస్థ పడాల్సి వచ్చేదనీ అంటారు సుల్తానా.

ఇలాంటివారు ఎందరో...
విజయనగరం జిల్లాకి చెందిన శ్రీవాణి భర్త 2010లో కశ్మీర్‌లో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం నుంచి అందే సహాయం ఏమిటో ఎలా తీసుకోవాలో ఆమెకు తెలియదు. టీసేవా సంఘం ఆ సహాయాలన్నీ అందేలా చేసింది. విరాళాల రూపంలో కొంత డబ్బు సేకరించి ఇచ్చింది. ఆమెకు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగం, పిల్లలకు పాఠశాలల్లో సీట్లు... ఇలా అన్ని ఏర్పాట్లూ చేసింది. డెహ్రాడూన్‌కి చెందిన సుబేదార్‌ ఛేత్రి విధినిర్వహణలో ప్రాణం కోల్పోయారు. తక్కువ పెన్షన్‌తో ఇద్దరు పిల్లలతో అతని భార్య పడుతున్న అవస్థలు చూసి ఓ సైన్యాధికారి టీసేవ దృష్టికి తెచ్చారు. టీసేవ సభ్యులు డెహ్రాడూన్‌ వెళ్లి ఛేత్రికి సంబంధించిన రికార్డులన్నీ పరిశీలించి అతని భార్యకు రావాల్సిన రూ.15లక్షల బకాయిలను ఇప్పించారు. కూర్గ్‌కి చెందిన కావేరి, కార్గిల్‌ వీరుడి భార్య శకుంతలా భండార్కర్‌, కేరళకు చెందిన తంకమ్మ, సల్మా ఘోరి, రంజనీ మోహన్‌... ఇలా ఎందరో అమర వీరుల కుటుంబాలకు చెందినవారు టీసేవా సంఘం సహాయంతో ప్రభుత్వం నుంచి తమకు న్యాయంగా అందాల్సిన నిధులను అందుకున్నారు. అలా ఇప్పటివరకూ 102 కుటుంబాలకు రూ.3.45 కోట్ల బకాయిలను ఇప్పించింది టీసేవ.

ఏమిటీ టీసేవ?
హైదరాబాదులో రెండేళ్ల క్రితమే ఏర్పడిన ఈ త్రివిధ దళాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం(ట్రైసర్వీసెస్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌) తక్కువ సమయంలోనే తెలుగురాష్ట్రాల్లోనే కాక దేశంలోని ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్నవారినీ ఆదుకుంటున్న తీరు అభినందనీయం. దేశవ్యాప్తంగా ఈ సంఘంలో 6,500 మంది మాజీ సైనికులు సభ్యులయ్యారు. త్రివిధ దళాల్లో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకూ, విశ్రాంత సైనికులకూ అందాల్సిన అన్నిరకాల సహాయాలూ సరిగా అందేలా వీరు చర్యలు తీసుకుంటున్నారు.

పదిహేను మంది విశ్రాంత సైనికాధికారులూ, కెప్టెన్‌ ఆనంద్‌ భార్య పింకీ ఆనంద్‌ కలిసి టీసేవా సంఘాన్ని ఏర్పాటుచేశారు. మారుమూల పల్లెల నుంచి ఎందరో యువకులు సైన్యంలో చేరతారనీ, వారికి దేశభక్తితో ప్రాణాలర్పించడమే తెలుసు కానీ ఆ తర్వాత తమ కుటుంబాల పరిస్థితి గురించి ఆలోచించడం తెలియదనీ అంటారు వీరు. అలాంటి వారి కుటుంబసభ్యులకు తమకు న్యాయంగా ప్రభుత్వంనుంచి ఏయే సదుపాయాలు లభిస్తాయో కూడా తెలియదనీ చాలామంది నామమాత్రపు పింఛనుతో నిస్సహాయంగా గడుపుతున్నారనీ టీసేవ సభ్యులు తెలిపారు. వారి తరఫున బ్యాంకులతో, త్రివిధ దళాల రికార్డు ఆఫీసులు, పింఛను కార్యాలయ అధికారులతో మాట్లాడి న్యాయంగా అందాల్సిన పింఛను, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు టీసేవ సభ్యులు కృషిచేస్తున్నారు. అవసరమైన చోట రక్షణదళాల ట్రైబ్యునల్‌ వద్దా సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటమూ చేస్తున్నారు.

ఆరో సీపీసీ అవార్డ్సు, ఒకే హోదా- ఒకే పింఛను విధానాల్లో భాగంగా రావాల్సిన ప్రయోజనాల మదింపులో కచ్చితమైన సమాచారాన్ని అందించడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటుచేశారు. సైనికుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రావలసిన సొమ్ము ఇప్పించడంతోనే వీరు తమ బాధ్యత తీరిపోయిందనుకోవడం లేదు. అవసరమైన చోట తామే చొరవ చూపి విరాళాలు సేకరించి మరీ ఆర్థికసాయం అందిస్తున్నారు. అనాథాశ్రమాలకూ, వృద్ధాశ్రమాలకూ, పాఠశాలలకూ కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న వీరు అభినందనీయులు కదూ.