close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మహేంద్రగిరి.. ఎంత బాగుందో..!

మహేంద్రగిరి.. ఎంత బాగుందో..!

‘ప్రకృతిలో మమేకమై కొండాకోనల్లో పర్యటించాలన్నా, మేఘాలమీద నడుస్తున్నట్లో గాల్లో తేలుతున్నట్లో ఉన్న అనుభూతిని సొంతం చేసుకోవాలన్నా, సాహసయాత్రలు చేయాలనుకున్నా... మహేంద్రగిరి ఎక్కాల్సిందే’ అంటున్నారు ఇటీవలే అక్కడికెళ్లొచ్చిన శ్రీకాకుళవాసి గేదెల భరత్‌కుమార్‌.

డిశాలోనే రెండో అత్యంత ఎత్తైన శిఖరమైన మహేంద్రగిరి పర్వతాన్ని మిత్రులమంతా కలిసి అధిరోహించాలనుకున్నాం. ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లాలోని డియోమలి పర్వతం తర్వాత ఆ రాష్ట్రంలో రెండో అత్యంత ఎత్తైన పర్వతం మహేంద్రగిరే. సముద్రమట్టానికి 4925అడుగుల ఎత్తులో తూర్పుకనుమల్లో ఉన్న ఆ పర్వతాన్ని ఎక్కేందుకు మేము ఒడిశాలోని గజపతి జిల్లా కేంద్రమైన పర్లాఖెమొండికి చేరుకున్నాం. అక్కడినుంచి మూడు బైకులమీద 66 కి.మీ దూరంలోని మహేంద్రగిరి ప్రాంతానికి బయలుదేరాం. ఏడోమైలు, లంజిపొదొరో, జిరంగో, కొయ్‌పూర్‌, మడవ తదితర గ్రామాలు దాటి ముందుకు సాగాం. వంకరలు తిరిగిన ప్రమాదకరమైన ఘాట్‌రోడ్డు అది. నేల నుంచి నింగి వరకూ పచ్చదనం పరుచుకుందా అనిపించేంతగా అబ్బురపరిచే ఎత్తైన కొండలూ, దారిపొడవునా కనిపించే సెలయేర్లూ, కొండలమీద నుంచి ఉరికే జలపాతాల సోయగాల్ని చూస్తూ 44 కి.మీ మేర సాగిన మా బైకు ప్రయాణం సాహసభరితంగా అనిపించింది.

మడవ గ్రామం దాటాక బుర్ఖత్‌ సమీపంలోని ఓ సాధువు ఆశ్రమం దగ్గర మా బైకులను నిలిపి కాలినడకన బయలుదేరాం. మూడు వైపులా ఎత్తైన కొండల్నీ కనుచూపుమేరలోని కొండలన్నింటినీ మింగేసిన మేఘాలను చూసి మంత్రముగ్ధులయ్యాం. అప్పటికే అక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఆ వర్షంలో తడుస్తూనే నిటారుగా ఉన్న ఆ కొండల్ని ఎక్కుతూ ముందుకెళ్లాం. కొంతసేపటికి వర్షం తగ్గుముఖం పట్టింది. మహేంద్రగిరి శిఖరాన్ని చేరుకునే క్రమంలో చిన్న చిన్న కొండలెన్నో ఎక్కాం. ఎత్తుకు చేరుతున్న కొద్దీ మేఘాల నడుమ నడుస్తున్నట్లూ ఆకాశాన్ని అందుకున్నట్లూ గాలిలో తేలుతున్నట్లూ అనుభూతి చెందాం.

సూర్యాస్తమయ సమయానికి మేం మహేంద్రగిరిపైకి చేరుకున్నాం. పచ్చదనంతో నిండిన కొండలను ముద్దాడే నీలాకాశంలో కనువిందు చేసే సూర్యాస్తమయ దృశ్యాల్ని కమ్ముకొస్తున్న చిరుచీకట్లు మెల్లమెల్లగా మింగేయసాగాయి. ఆ అందాల్ని చూస్తూనే ముందుకు సాగాం. చిక్కని చీకటి అడవంతా పరచుకుంది. సుదూరంలోని పలు గ్రామాలూ, పట్టణాల్లో రాత్రి పూట వెలిగి ఉన్న వీధి దీపాలు మిణుగురు పురుగుల గుంపులా కనిపించాయి. ఆ చీకటివెలుగుల దోబూచులాటలో అలా నడుస్తూనే ఉన్నాం. దారిపొడవునా పక్షులూ కీచురాళ్ల చిరుశబ్దాలు వీనులవిందు చేశాయి. అలా మధ్యాహ్నం మూడు గంటలకు మొదలైన మా నడక, రాత్రి తొమ్మిది గంటలవరకూ సాగి, ఎట్టకేలకు అక్కడున్న బాబా కుటీరానికి చేరుకున్నాం. మా బృందంలో సభ్యుడైన కోరాడ కృష్ణప్రసాద్‌కు ఆ ప్రాంతం చిరపరిచితం కావడం, గతంలో ఆయన అక్కడికి పలుమార్లు వెళ్లి ఉండటంతో చీకటిపడినా నడకమార్గంలో మేం ఎక్కడా దారి తప్పలేదు.

ఈ దట్టమైన అరణ్యంలో పర్వతశిఖరంపైన చిన్న కుటీరాన్ని ఏర్పాటుచేసుకుని గత పదిహేనేళ్లుగా ప్రఫుల్లబాబా ఒక్కరే నివాసం ఉంటున్నారు. ఓ యాగశాలను ఏర్పాటు చేసుకుని పదిహేనేళ్లుగా నిత్య హోమం నిర్వహిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఆదివాసీలే ఆయనకు అవసరమైన నిత్యావసరాలను అప్పుడప్పుడూ కింది నుంచి పైకి చేరవేస్తుంటారు.

ఆయన యాగశాల ఎదురుగా ఉన్న మట్టికుటీరంలో ఆ రాత్రికి పడుకున్నాం. అప్పటికే అక్కడ కుండపోతగా వర్షం కురుస్తోంది. మరోవైపు చలిగాలి మమ్మల్ని వణికించేస్తోంది. మాతో పాటు దుప్పట్లు తీసుకుని వెళ్లినా అక్కడి చలి నుంచి అవి ఎంతమాత్రమూ కాపాడలేకపోయాయి. దీంతో బాబా తన దగ్గరున్న రగ్గులు కప్పుకోమని ఇచ్చారు. వాటిని కప్పుకొని చలినుంచి రక్షణ పొందాం.

ఆధ్యాత్మిక కేంద్రం!
ఏడాది పొడవునా మానవ సంచారమే కనిపించని ఈ ప్రాంతం, మహాశివరాత్రి ముందు రోజు మాత్రం భక్తులతో నిండిపోతుంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబంగా తదితర రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు కాలినడకన తరలివచ్చి, శివలింగాలను దర్శించుకుంటారు. ముందురోజు రాత్రికే కొండపైకి చేరుకుని అక్కడే చెట్లూ, పొదల మాటున బస చేస్తారు. చలికాలం కావడంతో ఆ సమయంలో ఎటువైపు చూసినా నెగళ్లే కనిపిస్తుంటాయి. ఇటీవల కాలంలో కార్తీక మాసంలోనూ ఈ ప్రాంతాన్ని సందర్శించే భక్తుల సంఖ్య పెరిగింది. ఈ పర్వతంపైనే పరశురాముడు తపస్సు చేశాడనీ చెబుతారు. అందుకు ప్రతీకగా రెండు దశాబ్దాల కిందట ఈ పర్వత శిఖరంపైన పరశురాముడి విగ్రహాన్నీ ఏర్పాటుచేశారు. ధ్యానం, యోగాభ్యాసానికి అనుకూలప్రదేశం కావడంతో వాటి సాధన కోసం వస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరిగింది. అలా వచ్చేవారిలో చాలామందికి బాబా మట్టికుటీరమే శరణ్యం. కానీ అది చాలా చిన్నది. అయినా వచ్చేవాళ్లు వంటసామగ్రి వెంట తెచ్చుకుని అక్కడే వండుకుని నిద్రిస్తుంటారు.

పాండవుల ఆలయాలు
మర్నాడు ఉదయం నిద్రలేవగానే బయటకు వచ్చి చూస్తే మంచుపొరలు చీల్చుకుంటూ వెలుగులు చిమ్మే సూర్యోదయం అనిర్వచనీయ అనుభూతిని మిగిల్చింది. సమీపంలోని బంగాళాఖాతం తీరమూ, గ్రామాలూ, పట్టణాలు అన్నీ కలిసి ప్రకృతి కాన్వస్‌పైన చిత్రకారుడు వేసిన చిత్రాలను తలపించాయి.మేం బస చేసిన ఆశ్రమానికి సమీపంలోనే పాండవుల ఆలయాలు ఉన్నాయి. వనవాసం సమయంలో పాండవులు కొంతకాలం ఇక్కడ జీవించారనీ, అప్పుడు ఈ ఆలయాలను నిర్మించారనీ చెబుతారు. కుంతి, ధర్మరాజు, భీముడి ఆలయాలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలినవి శిథిలమయ్యాయట. ఈ ఆలయాలన్నింటిలోనూ శివలింగాలే ఉన్నాయి. 30 అడుగుల ఎత్తులో ఉన్న కుంతీ ఆలయాన్ని అత్యంత అరుదైన రాతికట్టుతో నిర్మించారు. దీని వాస్తునిర్మాణం ఓడ్ర శిల్పాన్ని పోలి ఉంది. ఆలయం భూమి లోపలికి దిగినట్లు కనిపిస్తుంది. మెట్లు దిగి లోపలికి వెళ్లాం. ఆలయం ముఖద్వారం పశ్చిమదిశలో ఉంది. ఆలయం వెలుపలి భాగంలో తూర్పున కుమారస్వామి, ఉత్తరాన పార్వతీదేవి, దక్షిణాన విఘ్నేశ్వరుని విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం ఎదురుగా రెండు పురాతన బావులున్నాయి. ఎత్తైన కొండమీద వాటిని ఎలా తవ్వారన్న ఆలోచన ఆశ్చర్యానికి గురిచేసింది.

కుంతీ మందిరం నుంచి ఉత్తరదిశలో ఉన్న కొండపైన ధర్మరాజు ఆలయం ఉంది. ఈ పర్వతంపైన ఉన్న ఆలయాలన్నింటిలోకి ఇదే పెద్దది. దీనికి పశ్చిమదిశలో ముఖద్వారం ఉంటుంది. భక్తులు దీన్ని యుధిష్ఠర ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణం కళింగ నిర్మాణ శైలిలోని త్రిరథ ఆకారాన్ని పోలి ఉందని చరిత్రకారుల అభిప్రాయం. ఆలయం పక్కనుంచి పారే సెలయేటి సవ్వడి మమ్మల్ని చాలాసేపు అక్కడి నుంచి కదలనివ్వలేదు. ధర్మరాజు ఆలయం ఎదురుగా ఉన్న మరో కొండ శిఖరంపైన భీముడి ఆలయాన్ని కేవలం అయిదు భారీ రాళ్లతో నిర్మించారు. ఆ ఆలయం లోపలికి వెళ్లడానికి చిన్న సందు మాత్రమే ఉంటుంది. మహేంద్రగిరి పర్వతంపైన ఉన్న అన్ని ఆలయాల్లో ఇదే పురాతనమైనది. క్రీ.శ.ఆరో శతాబ్దానికి ముందే ఈ ఆలయాలు వెలుగులోకి వచ్చాయనేది చరిత్రకారుల అభిప్రాయం. ఈ పర్వతం కొసన ఉన్న ఓ కొండపైన జగన్నాథస్వామి ఆలయం ఉంది. దీన్ని దారుబ్రహ్మ ఆలయంగా పిలుస్తారు. చుట్టూ చెట్లూ వాటి మధ్య రాళ్లూరప్పలతో కూడిన అత్యంత క్లిష్టమైన మార్గంలో ఆ ఆలయానికి చేరుకున్నాం.

మహేంద్రతనయ నది జన్మస్థలం
స్నానపానాదులు ముగించుకుని మహేంద్ర తనయగా పిలిచే నది పుట్టిన ప్రదేశం చూడ్డానికి వెళ్లాం. ఒడిశాలోని గజపతి, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాల్లోని వేల ఎకరాలకు తాగు, సాగునీరును అందించే మహేంద్రతనయ ఈ పర్వతంలోనే పుట్టింది. అయితే అది ఎక్కడన్నది కచ్చితంగా చెప్పలేం. దాని ఆనవాళ్లుగా అనేక ప్రవాహాలు చూపిస్తారు. ఎందుకంటే మహేంద్రగిరి పర్వతంపైన ఏడాదిపొడవునా వర్షం కురుస్తూనే ఉంటుంది. ఈ వర్షపు నీరు ఆ కొండపైన అనేక సెలయేర్లుగా, జలపాతాలుగా పారి కిందికి వచ్చేసరికి నది రూపును సంతరించుకుని, రెండు పాయలుగా విడిపోతుంది. ఒక పాయ శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వైపు సాగి, 70 కి.మీ మేర ప్రవహించి గొట్టా బ్యారేజీ వద్ద వంశధార నదిలో కలిస్తే, మరో పాయ మందసవైపుగా సాగి 40 కి.మీ.మేర ప్రవహించి బారువవద్ద సముద్రంలో కలుస్తుంది.

జీవవైవిధ్యానికి కేంద్రం
మహేంద్రగిరి జీవవైవిధ్యానికీ కేంద్రమే. నెమళ్లు, ఎగిరే ఉడుతలు, రాక్షస తొండలు, ఏనుగులు, మచ్చల జింకలు, మైనాలు వంటి అనేక రకాల అరుదైన జీవజాలానికి ఇది నివాస కేంద్రం. దాదాపు 1200 రకాల జాతులకు చెందిన మొక్కలు ఈ పర్వతంపైన ఉన్నాయని ఒడిశా జీవవైవిధ్య మండలి నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఒడిశా రాష్ట్రంలోని వివిధ పుష్పజాతులకు చెందిన మొక్కల్లో 35 శాతం మొక్కలకు మహేంద్రగిరి ఆవాస కేంద్రమని గుర్తించారు. దాదాపు 300కు పైగా ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడ లభిస్తాయి. అతి త్వరగా అంతరించిపోతున్న, అత్యంత అరుదైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇప్పటికీ ఈ పర్వతంపైన లభిస్తున్నాయి.

అక్కడ పూటపూటకీ ఆకాశంలో రంగులు మారిపోసాగాయి. తొలిసంధ్యలో పక్కన ఏముందో కనిపించనంతగా దట్టంగా కమ్మేసిన మంచూ, అంతలోనే చురుక్కుమనిపించే సూర్యోదయం, ఉన్నట్టుండి భోరున కురిసే వర్షమూ సాయంసంధ్యా సమయానికి ఆహ్లాదాన్ని పంచే శీతగాలులూ రాత్రికి ఎముకలు కొరికేసే చలీ... ఇలా ఒక్క రోజులోనే అనుభవంలోకి వచ్చిన అక్కడి వాతావరణానికి అచ్చెరువొందుతూనే పర్వతం మొత్తాన్నీ చుట్టి ఆ సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యాం.

ఎలా వెళ్లాలి?
మహేంద్రగిరిని పర్యటించాలనుకునేవాళ్లకి అక్కడ బస చేయడానికి తగిన సదుపాయాలు లేవు. కాబట్టి ఒడిశాలోని గజపతి జిల్లా కేంద్రమైన పర్లాఖెమొండికి చేరుకుంటే అక్కడ బస చేయడానికి లాడ్జీలు అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి 200 కి.మీ దూరంలో, భువనేశ్వర్‌ నుంచి 285 కి.మీ దూరంలోనూ పర్లాఖెమొండి ఉంది. ఒడిశాలోని బ్రహ్మపురం రైల్వేస్టేషన్‌ నుంచి 120 కి.మీ., శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్‌ నుంచి 40 కి.మీ దూరం ప్రయాణించీ పర్లాఖెమొండి చేరుకోవచ్చు. పర్లాఖెమొండి నుంచి మహేంద్రగిరికి వెళ్లాలంటే ప్రైవేటు వాహనాల్లో వెళ్లొచ్చు. లేదా కొయిన్‌పూర్‌ వరకూ ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించొచ్చు. వ్యక్తిగత వాహనాల్లో వెళితే బుర్ఖత్‌ వరకూ చేరుకోవచ్చు. అక్కడ వాహనాలను నిలిపేసి కాలినడకన ఎక్కాల్సిందే. కొయినపూర్‌లో అటవీశాఖ అతిథిగృహం ఉంది. అక్కడ నలుగురు బస చేసేందుకు వీలుంటుంది. అక్కడ కూడా వాహనాలను నిలిపి కాలినడకన పర్వతాన్ని ఎక్కొచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.