close
బుల్లెట్‌... దూసుకుపోతోంది..!

బుల్లెట్‌... దూసుకుపోతోంది..!

తార్రోడ్లూ మట్టిరోడ్లూ... కొండలూ గుట్టలూ... వాగులూ వంకలూ...దారేదయినా, దూరమెంతయినా సరే, ‘బుల్లెట్‌’లా దూసుకుపోవడం దాని ప్రత్యేకత. అందుకే అప్పుడూ ఇప్పుడూ మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోతూ సంచలనం సృష్టిస్తోంది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఉరఫ్‌ బుల్లెట్‌... మనదైన దేశీ బైక్‌..!

‘భారీ బైకుల్లో కింగ్‌...’ అనగానే చాలామంది ఠక్కున హార్లీ డేవిడ్‌సన్‌ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ధరలో దానికి సాటి లేదు మరి. కానీ అమ్మకాల్లో బుల్లెట్‌ జోష్‌ ముందు అది చతికిలపడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా హార్లీ-డేవిడ్‌సన్‌ బైక్‌లు సుమారు 2,50,000 వరకూ అమ్ముడుపోతూ రెండో స్థానంలో ఉంటే, ఏకంగా 7,00,000 బైక్‌లతో రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ అగ్రస్థానంలో నిలిచి, ‘బుల్లెట్టు...నా సౌండే వేరు’ అంటోంది. అవునుమరి, ‘డుగ్‌ డుగ్‌ డుగ్‌ డుగ్‌...’ అంటూ వచ్చే ఆ శబ్దం వింటే చాలు.... నడక రాని బుడతల నుంచి మంచమెక్కిన తాతయ్యల వరకూ కిక్కెక్కిపోతారు. ఇక, కుర్రాళ్ల సంగతి చెప్పేదేముంది... దాన్ని చూశారంటే చాలు, ఇలా ఎక్కడం అలా దూసుకుపోవడమే. తుపాకీలా డిజైన్‌ చేసిన బుల్లెట్‌ చూస్తే, ఏ వయసువాళ్లకయినా మనసు గుర్రంలా దౌడుతీయడం ఖాయం. పెద్దగా ఒకలాంటి వింత ధ్వని చేసే ఇంజినే దాని ప్రత్యేకత.

నిజానికి స్ట్రెయిట్‌ బ్యాక్‌ సీటుతో కచ్చారోడ్లమీద సైతం నడపడానికి సౌకర్యంగా ఉన్నప్పటికీ అప్పట్లో దీన్ని కొద్దిమంది మాత్రమే కొనేవారు. ఇష్టంఉన్నా ఖరీదు ఎక్కువనో, బరువుగా ఉందనో, బండికి తగ్గ కండలు లేవనో ఇలా భిన్న కారణాలతో అంతా బుల్లెట్టును నడిపే సాహసం చేసేవారు కాదు, రాజసం కోరుకునేవాళ్లు తప్ప. క్రమంగా ఎలక్ట్రిక్‌ స్టార్టర్‌, ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌, ఫైవ్‌ స్పీడ్‌ గేర్‌ బాక్సులు... ఇలా అనేక అదనపు హంగుల్ని సంతరించుకున్న బుల్లెట్‌, అనేకమందికి నేస్తంగా మారింది. అదీగాక, కేవలం సుమారు రూ.1.64 లక్షలతో ‘హిమాలయన్‌’ పేరుతో మనదేశంలో మొదటి అడ్వెంచర్‌ బైక్‌ను తయారుచేయడంతో యువతకు మరింత నచ్చేసింది. దాంతో పట్టణాలూ నగరాల్లో బుల్లెట్‌ బాబులంతా గ్రూపులుగానూ క్లబ్బులుగానూ ఏర్పడి, సామాజిక చైతన్యంకోసం రేసుల్లో పాల్గొంటూ, సాహసయాత్రలు చేస్తూ ‘తమ రూటే వేరు’ అని లోకానికి చాటుతుంటారు. పైగా ఇతర బ్రాండెడ్‌ వాటితో పోలిస్తే భారీ బైకుల్లో దీని ధరే తక్కువ. సుమారు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ఖరీదులోనే అనేక మోడళ్లు దొరకడం ఒక కారణమైతే, ఎక్కడా సంక్లిష్టత లేకుండా ఎంతో సాదాగా ఉండే డిజైన్‌వల్ల ఎవరికి అనుగుణంగా వారు సులభంగా మార్చుకోగలగడం కూడా ఇది అందరికీ దగ్గర కావడానికి మరో కారణం. ఒక్క మనదేశంలోనే నెలకు 60వేలకి పైగా బైకులు అమ్ముడుపోతున్నాయి. దాంతో రెట్టించిన ఉత్సాహంతో త్వరలోనే 750సిసి, 1000సిసి ఇంజిన్లతోనూ సరికొత్త మోడళ్లతోనూ కుర్రాళ్లకు కొత్త కిక్కివ్వబోతుంది.

సైనికుల బైక్‌!
నేడు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌గా లోకమంతా పరిచయమైన ఈ కంపెనీ, 1893లో ఇంగ్లాండ్‌లో ఎన్‌ఫీల్డ్‌ సైకిల్‌ కంపెనీ పేరుతో మొదలైంది. తరవాత రైఫిళ్ల తయారీకీ పేరొందిన ఈ కంపెనీ, 1901లో మొదటి బైక్‌ను తయారుచేసింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రక్షణదళాలకోసం తేలికపాటి మోటారుసైకిళ్లను కేవలం 60 కిలోల బరువూ, 125 సిసి టూ స్ట్రోక్‌ ఇంజిన్‌తో ‘ఫ్లయింగ్‌ ఫ్లీ’ పేరుతో తయారుచేసి, పారాచూట్‌ల ద్వారా సైనికులకి అందించేదట. ఆ తరవాత ఇది చెన్నైకి చెందిన మద్రాసు మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని, ‘ఎన్‌ఫీల్డ్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో ‘మేడ్‌ లైక్‌ గన్‌, గోస్‌ లైక్‌ బుల్లెట్‌...’ అనే స్లోగన్‌తో మోటారుసైకిళ్లను తయారుచేసింది.

1965లో భారత ప్రభుత్వం సరిహద్దుల్లో పెట్రోలింగ్‌కోసం దాదాపు 800 పైగా 350 సి.సి. బుల్లెట్‌ బైక్‌లను కొనుగోలు చేయడంతో బుల్లెట్టు భారతీయ ఆర్మీ, పోలీసు దళాల అనధికారిక మోటారుసైకిల్‌గానూ; జాతీయ పర్వదినాల్లో రక్షణదళాలు ఈ బైకులమీద విన్యాసాలు ప్రదర్శించడంతో భారత జాతీయ బైక్‌గానూ ప్రాచుర్యం పొందింది. 1994లో ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ పూర్తిగా మనదేశానికి చెందిన ఐషర్‌ కంపెనీ హస్తగతమై, ‘రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌’ బ్రాండ్‌తో ‘బిల్ట్‌ లైక్‌ ఎ గన్‌’ నినాదంతో మోటారుసైకిళ్లను రూపొందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చెందింది. మోటారుసైకిళ్ల తయారీలోనే అత్యంత ప్రాచీనమైన ఈ కంపెనీ, ప్రస్తుతం మనదేశం నుంచి సుమారు 45 దేశాలకు బైక్‌లను ఎగుమతి చేస్తుండటం విశేషం. రోజురోజుకీ పెరుగుతోన్న డిమాండ్‌ దృష్ట్యా వచ్చే ఏడాదికి అదనంగా మరో రెండు లక్షలు అంటే మొత్తం 9 లక్షలకు పైగా బైకులు తయారుచేయాలనుకుంటోందా కంపెనీ. కొన్ని మోడళ్లకోసం ఏడాదిపాటు వేచి మరీ కొంటున్నారంటే బుల్లెట్టు క్రేజేంటో తెలుస్తోంది. అందుకే ‘హార్లీకి ఆ కంపెనీ లోగోను టాటూ రూపంలో వేసుకునే అభిమానులు మాత్రమే ఉంటే, గర్ల్‌ఫ్రెండ్‌ కన్నా ఎక్కువగా ప్రేమించగలిగే వీరాభిమానులు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కే సొంతం’ అంటుంటారు బైకు హీరోలు. సో, బైక్‌ బాబులంతా బుల్లెట్‌కు దాసోహులే అనడంలో నో డౌట్‌.

బుల్లెట్టా... మజాకా..!

బుల్లెట్‌ను ఇష్టపడేవాళ్లందరికీ బైకుమీద మోజుండకపోవచ్చు. కానీ బైకు ప్రియులంతా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఆరాధకులే అన్నది మాత్రం కాదనలేని సత్యం. అందునా పాతకాలంనాటి రెట్రో లుక్‌తో ఉండే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకుల్లో- మోడలేదయినా అటు అమ్మాయిల్నీ అబ్బాయిల్నీ ఇట్టే కట్టి పడేస్తుంది. వాటిల్లో అత్యధిక ప్రాచుర్యం పొందిన తొలి పది బైకులమీదా ఓ లుక్కేద్దామా...

1. రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ 350 యుసిఇ: ఇంజిన్‌: 346 సిసి, వేగం: గంటకి 100 కి.మీ. ధర: రూ.1,12,500(ఎక్స్‌ షోరూమ్‌ ధర)


 

2 ఎలక్ట్రా: ఇంజిన్‌: 346 సిసి, వేగం: గంటకి 120 కి.మీ., ధర: రూ.1,26,500


 

3. క్లాసిక్‌ 350: ఇంజిన్‌: 346 సిసి, వేగం: గంటకి 130 కి.మీ., ధర: రూ.1,35,000


 

4. థండర్‌బర్డ్‌ 350: ఇంజిన్‌: 346 సిసి, వేగం: గంటకి 130 కి.మీ., ధర: రూ. 1,45,000


 

5. బుల్లెట్‌ 500: ఇంజిన్‌: 499 సిసి., వేగం: గంటకి 135 కి.మీ., ధర: రూ. 1,65,000


 

6. క్లాసిక్‌ 500: ఇంజిన్‌: 499 సిసి, వేగం: గంటకి 130 కి.మీ., ధర: రూ. 1,75,000


 

7. క్లాసిక్‌ 500 డెజర్ట్‌ స్టార్మ్‌: ఇంజిన్‌: 499 సిసి, వేగం: గంటకి 130 కి.మీ., ధర: రూ. 1,78,000


 

8. క్లాసిక్‌ 500 క్రోమ్‌: ఇంజిన్‌: 499 సిసి, వేగం: గంటకి 130 కి.మీ., ధర: రూ. 1,85,000


 

9. థండర్‌బర్డ్‌ 500: ఇంజిన్‌: 499 సిసి, వేగం: గంటకి 130 కి.మీ., ధర: రూ. 1,87,000


 

10. కాంటినెంటల్‌ జిటి 535: ఇంజిన్‌: 535 సిసి సింగిల్‌ సిలిండర్‌, వేగం: గంటకి 145 కి.మీ., ధర: రూ. 2,08,000

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.