close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ గణపతిని నిమజ్జనం చేయరు!

ఈ గణపతిని నిమజ్జనం చేయరు!

బొజ్జగణపయ్యకు తొమ్మిది రోజులూ ధూపదీప నైవేద్యాలతో వైభవంగా పూజలు చేసి చివరి రోజున నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం మనకు ఆనవాయితీ. కానీ ఒక వూళ్లొ మాత్రం వినాయకుడికి అలాగే పూజలు చేస్తారు కానీ, నిమజ్జనం చేయరు. చెక్కతో చేసిన ఈ గణపతి కేవలం నవరాత్రుల్లో మాత్రమే దర్శనమిస్తాడు. మహారాష్ట్రలోని పాలజ్‌లో కొలువైన ఈ స్వామిని చూసేందుకు ఈ తొమ్మిది రోజులూ లక్షల జనం బారులు తీరుతారు.

డాదికోసారి గణపతి నవరాత్రులొస్తాయి. రకరకాల ఆకృతుల్లో బోలెడు రంగుల్లో గణేశ్‌ బొమ్మలు దొరుకుతాయి. ఇంటికో బుజ్జి గణపతి కొలువుతీరితే మండపాన్ని బట్టి ఆకాశమెత్తువీ కొలువుతీరతాయి. కానీ మహారాష్ట్రలోని పాలజ్‌ వాసులకు మాత్రం గణపతి నవరాత్రులంటే తమ వూళ్లొని చెక్క వినాయకుడే గుర్తొస్తాడు. ఆయన్నే తమ కష్టాలను తీర్చేవాడిగా కొలుస్తారు. ఒకసారి గణపతి నవరాత్రులకు పెట్టిన బొమ్మనే అరవై ఏళ్లుగా వాళ్లు కొలుస్తున్నారు. ఎంతో భక్తితో ఆయనకు గుడికట్టి పూజలు చేస్తున్నారు. నవరాత్రుల్లో మాత్రమే ఆయన దర్శనం లభిస్తుండటంతో దేశం నలుమూలల నుంచీ భక్తులు ఆ గ్రామానికి బారులు తీరుతున్నారు. ఆయనే మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్‌ జిల్లా పాలజ్‌ గ్రామంలో కొలువైన సంకటహర గణపతి. తెలంగాణాలోని ఆదిలాబాద్‌ జిల్లాకు సరిహద్దులో ఉంటుందీ గ్రామం.

మొదటి గణపతి...
మొదట్లో అన్ని గ్రామాల్లాగే పాలజ్‌లోనూ వినాయక నవరాత్రులు జరిపి స్వామిని నిమజ్జనం చేసేవారు. అయితే 1948 ప్రాంతంలో నాందేడ్‌ జిల్లాతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో విపరీతమైన కరవు వచ్చింది. దాంతోపాటూ పాలజ్‌లో కలరా వ్యాపించి విపరీతంగా జనం మరణించారు. అయితే నవరాత్రుల సందర్భంగా గణపతిని నిమజ్జనం చేయడమే ఇందుకు కారణమై ఉంటుందని గ్రామ ప్రజలు భావించారు. అందుకే అక్కడి ఒక స్వామీజీ సూచనల మేరకు కొయ్యబొమ్మలకు ప్రఖ్యాతి చెందిన నిర్మల్‌ పట్టణానికి వెళ్లి మంచి కలపతో నాలుగడుగుల ఎత్తున వినాయకుడి చెక్క విగ్రహాన్ని చేయించారు గ్రామస్థులు. దాన్ని తీసుకువచ్చి అర్చనలు చేశారు. విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా తమ వూరిలోనే శాశ్వతంగా నిలుపుకోవాలన్నది వాళ్ల ఆలోచన. అందుకే ఆ స్వామికి గుడికట్టారు. ఆ విగ్రహాన్ని గ్రామంలోకి తెచ్చుకున్న తర్వాత ఆ ప్రాంతం వెనువెంటనే పాడిపంటలతో కళకళలాడిందట. కలరా మహమ్మారి కూడా వూరి నుంచి దూరమైందట. కరవు సమయంలో గోదావరిలో నీళ్లు లేకపోవడంతో ఒక బురద గుంటలో గణపతిని నిమజ్జనం చేయాల్సి వచ్చిందనీ, అలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఉండటానికే చెక్క గణపతిని నిలుపుకున్నారనీ మరో కథ ప్రచారంలో ఉంది.

ఆ తొమ్మిది రోజులే...
పాలజ్‌లోని గణపతి దేవాలయంలోని చెక్కగణపతిని ఎప్పుడంటే అప్పుడు దర్శనం చేసుకోలేం. కేవలం గణపతి నవరాత్రుల సందర్భంగా మాత్రమే ఆ విగ్రహాన్ని బయటకు తీసి అర్చనలు జరుపుతారు పూజారులు. ఆ సమయంలో స్వామిని చూసేందుకు తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా స్వామిని కొలుస్తారు. నవరాత్రుల సమయంలో స్వామితో పాటు మరో చిన్న మట్టి విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తారు. దాన్ని గోదావరిలో నిమజ్జనం చేసి ఆ నీళ్లను తెచ్చి స్వామి మీద చల్లుతారు. తర్వాత ఆ విగ్రహాన్ని తీసి ప్రత్యేకమైన గదిలో భద్రపరుస్తారు. విగ్రహాన్ని మళ్లీ బయటకు తీసేది గణేశ్‌ చతుర్థికే. మిగతా ఏడాదంతా స్వామి స్థానంలో ఆ విగ్రహపు ఫొటోను ఉంచి పూజలు నిర్వహిస్తారు. నవరాత్రుల సమయంలో వూళ్లొ ఎవరూ మాంసాహారాన్ని వండరు. దాదాపు 75 శాతం యువతీ యువకులంతా ఈ రోజుల్లో ఉపవాసాలు చేస్తారు.

సౌకర్యాలు...
దట్టమైన అటవీప్రాంతంలో గోదావరి పాయల వెంట మనోహరంగా కొలువై ఉంది పాలజ్‌ దేవాలయం. స్వామి మహిమ వూరూరా ప్రచారమవుతుండటంతో పాలజ్‌కి వచ్చే భక్తుల సంఖ్య ఏటికేటికీ పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మంచి నీటి ప్లాంటును ఏర్పాటు చేసి, పులిహోరను ఉచిత ప్రసాదంగా పంచుతోంది కమిటీ. ఆలయం దగ్గర పెద్ద భోజన హాళ్లున్నాయి. అలాగే భక్తులు సేద తీరేందుకు విశ్రాంతి మందిరాలూ అందుబాటులో ఉన్నాయి. పాలజ్‌ తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌ జిల్లా భైంసాకు సుమారు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ల నుంచి భైంసాకు బస్సులుంటాయి. అక్కడి నుంచి పాలజ్‌కు తరచుగా బస్సులు నడుస్తుంటాయి. పాలజ్‌ పేరుకి మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నా ఆ గ్రామంలో తెలుగువారే ఎక్కువ. అందుకే స్వామిని దర్శించుకునేవారిలో మనవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.