close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అతడు-ఆమె

అతడు-ఆమె
చెంగల్వ బొడ్డపాటి రామలక్ష్మి 

ప్రియమైన మీకు,
ఎలా ఉన్నారు? వేళకి తింటున్నారా? మీరు అద్దెకుంటున్న ఇల్లు సౌకర్యంగా ఉందా? ఆఫీసులో అందరూ బాగా పరిచయమై ఉంటారనుకుంటున్నాను. మీకు హోటల్‌ భోజనం పడదుగా, రోజూ చేతులు కాల్చుకుంటున్నారా?

ఇక్కడ నేనూ పిల్లలూ క్షేమం. ఈతరం పిల్లలను పెంచటం, వారి మనోభావాలను అర్థంచేసుకోవటం చాలా కష్టమనిపిస్తోందండీ! మీరు ఉద్యోగరీత్యా దూరంగా వెళ్ళాక వీళ్ళ పెంపకం నాకో సవాలుగా తయారైంది. మీరిచ్చిన స్ఫూర్తితో, ధైర్యంతో నా బాధ్యతను సక్రమంగా నెరవేర్చటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను.

శ్రావ్య డిగ్రీ రెండో సంవత్సరం రిజల్ట్స్‌ వచ్చాయి. అత్తెసరు మార్కులు అన్నీ. అది కోరుకున్న కాలేజీలోనే చేర్పించాం. మనలా మన పిల్లలు కష్టపడకూడదని అది కావాలన్న సౌకర్యాలన్నీ అమర్చాం. తెలివితేటలుండీ చదవగలిగీ కూడా ఎందుకిలా చేసిందో అర్థం కావట్లేదు. గట్టిగా కేకలేస్తే కోపంతో ఏం చేస్తుందోనని భయం. నెమ్మదిగా నచ్చచెప్తుంటే ఎదురు తిరుగుతోంది.

ఇక, శరత్‌ అయితే- ఎప్పుడూ స్నేహితులూ ఫోన్లలోనే గడిపేస్తున్నాడు. వాడి చదువూ అంతంతమాత్రంగానే ఉంది. వీళ్ళకి మనమివ్వగలిగిన ఆస్తి చదువేకదండీ! ఈమాత్రం అవకాశం లేక ఎంతమంది పిల్లలు ఎలా కష్టపడుతున్నారో వీళ్ళకి ఎలా తెలుస్తుంది? చెప్పినా వినరు. ఇలాంటి చదువులతో వీళ్ళకి మంచి ఉద్యోగాలేం వస్తాయి? పెళ్ళిళ్ళెలా అవుతాయి? మీరున్నంత వరకూ మీరే వీళ్ళ చదువునోకంట కనిపెడుతూ ఉండేవారు. నాకు ఉద్యోగం, ఇంటిపనులతోనే సరిపోయేది. ఇప్పుడు ఈ అదనపు బాధ్యత నన్ను చాలా భయపెడుతోంది. అన్నట్టు, మన పనమ్మాయి జయమ్మ కొడుకు వెంకటేశు బాగా చదువుతూ తొంభై పైన మార్కులు తెచ్చుకుంటున్నాడు. మనం కడుతున్న ఫీజులూ, పుస్తకాల ఖర్చును సార్థకం చేస్తున్నాడు. అదొక్కటే కాస్త తృప్తి.

మీకు ముఖ్యంగా ఇప్పుడు రాయటమెందుకంటే- పెద్దమ్మాయి శుభ వచ్చి నాలుగు రోజులయిందండీ. పెళ్ళయి ఏడాది కూడా కాలేదు. భర్తతో గొడవపడి వచ్చేసింది. మామూలుగా అందరి ఇళ్ళలో జరిగే చిన్నచిన్న విషయాలకే తగాదాపడి వచ్చేసిందండీ. ‘నేను వెళ్ళను, నా ఉద్యోగం నాకుంది’ అంటుంది.

వాళ్ళది ప్రేమ వివాహం. ఇద్దరూ ఇష్టపడుతున్నారనీ అది సుఖపడుతుందనీ వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి ఎంతో ఖర్చుతో ఘనంగా చేశాం కదండీ. వ్యక్తిత్వమంటే ఇదేనా! ఒకరిమాట ఒకరు గౌరవించుకోకుండా పట్టుదలలతో కాపురం కూల్చుకోవటమేనా? ప్రేమకర్థం వీళ్ళకి తెలుసా?

మనదీ ప్రేమ వివాహమే కదండీ. మీకు గుర్తుందా... మన ప్రేమ మీ ఉత్తరంతోనే మొదలైంది. మనం ఒకే క్లాసులో చదువుతున్నా ఎప్పుడూ మాట్లాడుకోలేదు. మీరు ఒకరోజు మీ ఇష్టాన్ని తెలియజేస్తూ లెటర్‌ రాసి నా పుస్తకంలో పెట్టారు. అప్పటినుండీ పరస్పరం రాసుకున్న లేఖల ద్వారానే మన ప్రేమ దినదిన ప్రవర్థమానమై పెళ్ళిదాకా వచ్చింది. ఎదురుగా ఉంటూనే ఉత్తరాల ద్వారా మనోభావాలను వ్యక్తం చేయటం ఒక అందమైన అనుభూతి కదా.

ఇప్పుడు ఉద్యోగరీత్యా మీరు చాలా దూరంలో ఉండటం, పిల్లల చదువుకోసం నేనిక్కడే ఉండిపోవటం వల్ల ఉత్తరం రాసే అవసరం, అవకాశం వచ్చాయి కానీ, లేకపోతే ఈ రోజుల్లో ఉత్తరాలెవరు రాస్తున్నారు చెప్పండి. ఏమైనా, చాలా రోజుల తరవాత ఇలా రాస్తుంటే కొత్తగా ఉంది. మీతో ఫోన్‌లో కూడా మాట్లాడొచ్చనుకోండీ, అయినా ఉత్తరాల ద్వారా మనసు వ్యక్తం చేయటం మనకిద్దరికీ ఇష్టమైన అంశం కాబట్టి ఇలా రాస్తున్నాను.

పెళ్ళయిన కొత్తలో మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో మీకు గుర్తుందా? నేనైతే ఎప్పటికీ మర్చిపోను. మనలాంటి పరిస్థితులు మన పిల్లలకి లేవు. అయినా సర్దుకోలేకపోతున్నారు. వాళ్ళకి అంతగా ఇష్టంలేకపోయినా చేసుకున్నామని కొత్తలో మా అమ్మా నాన్నా మీతో సరిగా మాట్లాడకపోయినా, మీరు బాధనంతా మనసులోనే దాచుకుని వాళ్ళలో మార్పు వచ్చేదాకా నిరీక్షించారు. మీ మంచితనంతో వాళ్ళ మనసును గెలుచుకున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళకి కొడుకుకన్నా ఎక్కువ.

భార్యాభర్తలన్నాక చిన్నచిన్న అభిప్రాయభేదాలూ కీచులాటలూ లేకుండా ఎలా ఉంటాయి? అలా లేకపోతే అది కాపురం ఎలా అవుతుంది? రెండు రోజులు కోపంతో మాట్లాడుకోకుండా తరవాత మాట కలుపుకోవటంలోని ఆనందం, ఎడబాటులోని మాధుర్యం ఎంత బాగుంటుంది? ఒకరి ఇష్టాలకోసం మరొకరు సర్దుకుపోవటంలో ఎంత సంతోషం ఉంటుంది!

మీకు గుర్తుందా- ఎప్పుడూ ఎంత దూరాలైనా బస్సుల్లోనే ప్రయాణించే మీరు, నేను మీ జీవితంలోకి వచ్చాక, నాకు బస్సు ప్రయాణం పడదనీ చిన్నచిన్న వూళ్ళకి కూడా నాతో రైల్లోనే వచ్చేవారు. తోపులాటలు- అందునా పండుగలూ పర్వదినాలలో రద్దీలో క్యూలో తోసుకోవడం- మీకసలు ఇష్టం ఉండదు. కానీ, నాకోసం నాతోపాటు తప్పకుండా గుడికి వచ్చేవారు. మీ అయిష్టాన్ని ఎప్పుడూ వ్యక్తం చేయలేదు.

ఇప్పుడు శుక్రవారం అమ్మవారి గుడికి ఒంటరిగా వెళుతుంటే- భౌతికంగా పక్కన మీరు లేరనే బాధ ఒక పక్కా, మనసులో నాతోపాటే మీరు వస్తున్న ఆనందం మరోపక్క!

భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమ, అవగాహనల గురించి శుభకి చెప్పటానికి ప్రయత్నిస్తే- ‘మీ కాలం వేరమ్మా, తనకు నచ్చేట్లు నేనెందుకు ఉండాలి’ అంటూ విసుక్కుంటోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్కడ మీరు ఒంటరిగా ఉన్నారు. ఈ విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టంలేదు కానీ- ఎవరితో పంచుకోను మీతో తప్ప! మీరిప్పుడప్పుడే రావటం కుదరదు, ఆఫీసులో పని ఒత్తిడి బాగా ఉంది అన్నారుగా, ఒకసారి పిల్లలతో ఫోన్‌లో మాట్లాడతారా?

ఆఫీసు నుంచి అలసివచ్చి అన్ని పనులూ మీరే చేసుకోవాలి. మీ ఆరోగ్యం జాగ్రత్త! వేళకి భోజనం చేయండి. మీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఉండనా మరి!

ప్రేమతో
మీ సుజా

ప్రియమైన నీకు,
నీ ఉత్తరం- నువ్వే నా ఎదురుగా ఉండి చదువుతున్నట్లుగా ఉంది... పాత సినిమాలలో చూపిస్తారే అలా అన్నమాట!

రోజూ ఉదయమే లేచి వంట చేసుకోవాలంటే ఎంత విసుగ్గా ఉంటోందో. ఉదయమే స్టవ్‌ వెలిగిస్తుంటే నువ్వు బాగా గుర్తొస్తావు. ఒంట్లో బాగున్నా లేకపోయినా నువ్వే వంటింటి పనంతా చేసుకునేదానివి. నిజంగా ఆడవాళ్ళెంత గొప్పవాళ్ళొ కదా. ఎంత శ్రమపడతారు! ఎంత సర్దుకుపోతారు!

ఇంటిపని, ఉద్యోగం, పిల్లల పెంపకంతో నువ్వెంత సతమతమవుతున్నావో అర్థమవుతోంది. తెలివితేటలూ జ్ఞాపకశక్తీ లేకపోతే వీళ్ళకి చదువురాదులే అని సరిపెట్టుకునేవాళ్ళం. వీళ్ళకి అన్నీ ఉండి చదువుకోవలసిన వయసులో చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది వాళ్ళ తప్పుకాదు- వాళ్ళ వయసుది. ఈ దశలో ఉండే కోరికలకూ స్నేహాలకూ వ్యామోహాలకూ వాళ్ళు అతీతులు కారు. ఇంతకుముందు వరకూ మన పిల్లలు బాగానే చదివేవారు. కొంచెం గాడి తప్పుతున్నట్లున్నారు. వాళ్ళతో ఉన్న వాళ్ళ స్నేహితులు ఎలాంటివారో గమనిస్తూ ఉండు.

పిల్లల ఈ వయసులోనే మనం వాళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలి. బరువంతా నీ ఒక్కదానిమీద వదిలేసి ఇలా రావలసి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. అయినా, మానసికంగా నేనెప్పుడూ నీతోనే ఉంటానుగా! స్నేహితులూ, చుట్టూ ఉన్న సమాజం ప్రభావం ఎంత ఉన్నా మన ఇంటి క్రమశిక్షణా, మన భావాల ప్రభావం పిల్లలపై తప్పక ఉంటుంది. వాళ్ళతో నేను మాట్లాడతాన్లే. నేను వచ్చినప్పుడు మనిద్దరం కలిసి చదువూ జీవితపు విలువలను గురించి అర్థమయ్యేలా చెపుదాం. నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోకు.

మనిద్దరం ఎంతో కష్టపడి నిర్మించుకున్న అందమైన పొదరిల్లు మన కుటుంబం! దీనికి ప్రేమ, అనురాగం, మమత, అనుబంధాలే పునాదులు. దీనిని ఎప్పుడూ పచ్చగా చక్కగా ఉండేటట్లు చూసుకోవలసిన బాధ్యత మనదే.

నీ ఉత్తరం చదువుతుంటే మన పెళ్ళయిన తొలి రోజులూ, నీ అమాయకమైన ముగ్ధమనోహర రూపం కళ్ళముందు కదలాడుతున్నాయి. పెళ్ళికి ముందు ఉత్తరాలు రాసుకోవటం అలవాటైపోయి, పెళ్ళయ్యాక నువ్వు తమాషాగా నేను ఆఫీసుకి వెళుతుంటే ఉత్తరం రాసి కవరులో పెట్టి నా జేబులో పెట్టేదానివి. నేను ఆఫీసులో చదువుకుని సమాధానం రాసి, ఇంటికి వచ్చాక టేబుల్‌ మీద పెట్టేవాణ్ణి. ఇలా చాలా రోజులు రాసుకున్నాం కదూ! అదో వింత అనుభూతి! నీ లేఖలోని అంశాలు నీ ఎదుట ప్రస్తావిస్తే సిగ్గుల మొగ్గయిపోయేదానివి. అది చూస్తూ నేను నవ్వుకునేవాణ్ణి. మన చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి ఆనందంగా గడిపేశాం కదూ. ప్రేమ మహిమ అదే!

కొత్తలో పెద్దవాళ్ళ వల్ల ఎన్ని ఇబ్బందులెదురైనా మనం పెద్దగా పట్టించుకోలేదు. మనం ఒకరికొకరం తోడుగా నిలబడ్డాం. మొదటి సంవత్సరం నువ్వెన్ని ఇబ్బందులు పడ్డావ్‌! అమ్మా, అక్కయ్యలూ నీమీద ఎంత పెత్తనం చలాయించినా నోరు విప్పకుండా సహనంగా చిరునవ్వుతో భరించావు. నేనెప్పుడైనా కోపంతో ఆవేశపడబోయినా నన్ను మాట్లాడొద్దని బతిమాలేదానివి.

ఒక ఆడపిల్ల పెళ్ళయ్యాక తన పుట్టింటి వాళ్ళందరినీ వదిలి మెట్టినింటికి వచ్చినప్పుడు వాళ్ళు ఆమె బెరుకునూ కొత్తనూ పోగొడుతూ తమలో కలుపుకోవాలి. కానీ, చాలామంది అలా చేయరు. ఇదే అవకాశం అనుకుని కొత్త కోడలిని సతాయిస్తారు. అత్తాకోడళ్ళ మధ్య దూరం పెరిగిపోతుంది. మావాళ్ళూ అలాగే ప్రవర్తించారు. నువ్వు చదువుకున్నదానివి, సహనమున్నదానివి. నీ ఓర్పుతో వాళ్ళ మనసులను మార్చి ఇంటిల్లిపాదికీ అభిమానపాత్రురాలివయ్యావు.

నేను భోజనప్రియుణ్ణి. నాకు వంట బాగా రుచికరంగా ఉంటే కానీ తినలేను. వంట చేయటం రాదని నేను కూడా నిన్ను విసుక్కుని ఉంటాను. కానీ, నువ్వు నాకిష్టమైనవన్నీ నేర్చుకుని చేసిపెట్టావు. నాలో నీకు నచ్చని విషయాల్ని సున్నితంగా, మనసు గాయపడకుండా ‘ఇలా ఉంటే బాగుంటుంది’ అన్నట్టు సూచనప్రాయంగా చెప్పేదానివి. నీలోని ‘నొప్పించక, తానొవ్వక’ అనే లక్షణం నాకు చాలా ఇష్టం.

మనం మొదట్లో ఏమనుకున్నాం... ప్రతి పెళ్ళిరోజునాడు- ఆ ఏడాదిలో మనమధ్య వచ్చిన భేదాభిప్రాయాలనూ మనం చేసిన పొరపాట్లనూ గుర్తుచేసుకుంటూ- అటువంటివి పునరావృతం కాకుండా, ఒకరినొకరం అర్థం చేసుకుంటూ ఉన్నంతలో ఆనందంగా, తృప్తిగా జీవించాలనుకున్నాం. ప్రతి పెళ్ళిరోజునూ హోటల్‌లో తిని, సినిమా చూసి మామూలుగా సాదాసీదాగా గడపటం కాకుండా ఆరోజు ఏదో ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి, అక్కడ వారితో కాసేపు గడిపి, వాళ్ళు తినేవేవైనా ఇచ్చి రావాలనుకున్నాం. ఇన్నేళ్ళుగా అలాగే చేస్తున్నాం.

సంసార రథానికి భార్యాభర్తలు రెండు చక్రాల్లాంటివాళ్ళు. రెండు చక్రాలూ సమంగా పనిచేస్తేనే రథం సజావుగా సాగుతుంది. ఏడాదికేడాదికీ మనమధ్య అవగాహన పెరుగుతున్నదనీ అదే అర్థవంతమైన దాంపత్యానికి పునాది అనీ మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.

మన అల్లుడు భాస్కర్‌ మంచివాడు. ఆలోచనాపరుడు. మన శుభకు కొంచెం ఆవేశం ఎక్కువ. ఏదో మాటామాటా అనుకుని ఉంటారు. వాళ్ళమధ్య ఈ దూరం పెరగకూడదు. నేను వాళ్ళిద్దరితో విడివిడిగా మాట్లాడతాను. వీలైనంత త్వరలో సెలవుపెట్టి వస్తాను. ఇద్దరం కలిసి పరిస్థితులు చక్కబెడదాం. ధైర్యంగా, నిశ్చింతగా ఉండు, సరేనా. ఉంటా మరి.

ప్రేమతో
నీ శివ

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.