close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పరుసవేది

పరుసవేది
జి.లక్ష్మి

‘‘తనే రాణీ అంటే, ఇందాక చెప్పలా మన రూమ్మేటని’’ కిందకి హాస్టలు గేటువైపు చూస్తూ అంది సుధ. అప్రయత్నంగా అటు చూశాను. హాఫ్‌వైట్‌ కాటన్‌ చీరలో ఉన్న ఒక అమ్మాయి బండిమీద ఉన్న అబ్బాయివైపు తిరిగి ఏదో మాట్లాడుతోంది. ట్రాన్స్‌ఫర్‌ మీద

హైదరాబాదు వచ్చి ఈరోజే వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్లో చేరాను. నాకు హైదరాబాదు కొత్త. గవర్నమెంటు హాస్టల్‌ అయితే ఎంతోకొంత సెక్యూరిటీ ఉంటుందని అన్నయ్య అందులో చేర్పించాడు. ఫీజులూ అవీ కట్టిన తర్వాత వార్డెన్‌ - సుధని పిలిపించి మీ రూమ్మేటని అప్పగించింది.

సాయంత్రం టీ తాగుతూ బాల్కనీ దగ్గర నిలబడ్డాం. అంతకుముందే చెప్పింది సుధ- రాణీ గురించి. ‘మేం ఇద్దరంకాక రూమ్‌లో రాణీ కూడా ఉంటుందనీ, తనది రాజమండ్రి దగ్గర ఏదో వూరనీ.’

‘‘అతనెవరు?’’ అనాలోచితంగా అడిగేశాను.

‘‘తను రఫీ అని... రాణీ ఫ్రెండ్‌. ఆఫీసు నుంచి రోజూ డ్రాప్‌ చేస్తాడు’’ గొంతు తగ్గించి అంది సుధ. ఆ గొంతులో ఏదో తేడా ధ్వనించింది.

టైము ఆరున్నర అవుతోంది. అమ్మాయిలు ఒక్కొక్కళ్ళూ హాస్టల్‌ చేరుతున్నారు. కొందరు ఆటోల్లో, కొందరు నడిచీ, ఇద్దరు ముగ్గురు అబ్బాయిల బళ్ళమీదా దిగారు. వచ్చిన అబ్బాయిలు గేటు బైట రోడ్డుమీద నిలబడి మాట్లాడుతున్నారు. కాసేపట్లో రాణీ పైకి వచ్చింది. సుధని చూసి కళ్ళెగరేసి నవ్వి ‘‘ఆఫీసుకి వెళ్ళలేదా?’’ అని అడిగింది.

‘‘పొద్దున నీతో వెళ్తానని చెప్పానా, తర్వాత వెళ్ళబుద్ధికాక ఉండిపోయాను. అన్నట్టు, తను ‘రజని’ అని మన కొత్త రూమ్మేటు. బ్యాంకులో జాబ్‌. ట్రాన్స్‌ఫర్‌ మీద వచ్చారు. రజనీగారూ, తను రాణీ’’ సుధ పరిచయం చేసింది.

‘‘బ్యాంకులో జాబ్‌ అయి ఉండీ... ఈ దరిద్రపు హాస్టల్‌ ఎందుకండీ బాబూ. ఏదో మాలాంటి ప్రైవేటు వాళ్ళకంటే తప్పదు. ఇక్కడ ఒకపూట ఫుడ్డు తింటే చాలు, జీవితం మీద విరక్తి పుడుతుంది. ఏదో కాస్త ఫీజు తక్కువని ఉండడంగానీ...’’ రాణీ ప్రవాహంలా గలగలా మాట్లాడుతోంది. చామనఛాయతో కళగా ఉన్న మొహమూ ఒత్తయిన జుట్టూ తేటగా ప్రశాంతంగా ఉన్న కళ్ళూ... చూడగానే నాకు రాణీ నచ్చినట్టు అనిపించింది. పొద్దుటినుంచీ చూస్తున్న సుధకన్నా రాణీలో ఏదో తెలియని ఆత్మీయత కనిపించింది.

‘‘సెక్యూరిటీ ఉంటుందని అన్నయ్య ఇందులో చేర్చాడు. నాకు హైదరాబాద్‌ పూర్తిగా కొత్త. అంతకుముందు మద్రాస్‌లో ఉండేవాళ్ళం’’ మొహమాటంగా చెప్పాను.

‘‘కొత్తా లేదు పాతా లేదు. తర్వాతన్నా హాస్టల్‌ మారిపోండి. మంచి హాస్టల్‌ ఏదో నేను కనుక్కొని చెబుతాను’’ అంది రాణీ.

అప్పటికి నవ్వేసి వూరుకున్నాను. అయితే తర్వాత కూడా హాస్టల్‌ మారలేకపోయాను. దానికి కారణం రాణీనే.

రాణీ చెప్పినట్లు నిజంగానే హాస్టల్లో తిండి ఘోరంగా ఉంది. సుద్దల్లాంటి ఇడ్లీలూ కట్టెల్లాంటి చపాతీలూ రుచీపచీ లేని కూరలూ... వాళ్ళు అలా పెట్టి వెళ్ళడం, నిమిషంలోనే అవన్నీ చెత్త బక్కెట్లలోకి చేరిపోవడం... ఏదో తిన్నామనిపించి కెలికి అలాగే వదిలేయడం, రూమ్‌లోని అరటిపళ్ళతోనో బిస్కెట్లతోనో పొట్ట నింపుకోవడం... ఇది రోజువారీ దినచర్యగా మారిపోయింది.

హాస్టల్లో చేరిన మూడోరోజు సాయంత్రం హాస్టల్‌కి రాగానే ‘‘ఇవాళ బంగాళాదుంప వేపుడు చేసుకుందామా?’’ అంది రాణీ.

‘‘ఎలా?!’’ అన్నాను నేను ఆశ్చర్యంగా.

రాణీ నవ్వి మంచం కింద నుంచీ స్టవ్‌ బైటకు తీసి ‘‘ఇలా’’ అంది. అప్పటివరకూ దాన్ని నేను గమనించలేదు. మంచంమీద దుప్పటి నేలమీద వరకూ వేలాడుతూ ఎందుకు ఉందో అప్పుడు అర్థమైంది.

‘‘ఈ సందు చివర కూరగాయల కొట్టు ఉంది. వెళ్దాం వస్తారా?’’ రాణీ అడిగింది. అప్పటికింకా సుధ రాలేదు.

‘‘కూర అంటే- గిన్నెలు, నూనె, ఉప్పు, కారం... అన్నీ ఉండాలి కదా’’ అన్నాను చెప్పులేసుకుంటూ.

‘‘మీకెందుకు రండి’’ అంది రాణీ.

కూరగాయల అమ్మాయి రాణీని చూడగానే ‘‘అమ్మగారూ, పచ్చి టొమాటోలు వచ్చినాయి, ఇమ్మంటారా?’’ అని అడిగింది.

‘‘పచ్చి టొమాటోలా? సరే, ఇవ్వు. కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కూడా ఇవ్వు’’ అని నావైపు తిరిగి పచ్చి టొమాటోలో అల్లంవెల్లుల్లి వేసి కూర చేస్తే అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా తిన్నారా?’’ అని అడిగింది.

పచ్చి టొమాటో ఎప్పుడన్నా పచ్చడిగా తినడమే కానీ కూర చేస్తారని నాకు తెలీదు. లేదన్నట్టు తల అడ్డంగా వూపాను.

‘‘ఇవాళ మీకు తినిపిస్తాను చూడండి’’ ఉత్సాహంగా అంది రాణి.

తర్వాత కొన్ని మంచం కిందనుంచీ, కొన్ని కింద ఉన్న వంటవాళ్ళనుంచీ తెచ్చిన సరుకులతో ఎలా చేసిందో కానీ అరగంటలో అంతా ముగించి మళ్ళీ స్టవ్‌ మంచం కింద దాచేసింది. హాస్టల్లో అలా వంట చేసుకోవడం నిషిద్ధం అంట. వార్డెన్‌ చూస్తే ఫైన్‌ వేస్తుందట. అందుకే రహస్యంగా ఏ మూడు నాలుగు రోజులకో ఒకసారి ఇలా వండుకుంటుంటారట.

డైనింగ్‌కి కిందకు వెళ్ళకుండా అన్నం, కూరలూ మేముండే థర్డ్‌ఫ్లోర్‌లోకి తెచ్చుకునే తినేవాళ్ళం. ఆరోజు కూడా అలాగే పళ్ళాల్లో అన్నం పెట్టించుకుని పైకి తెచ్చుకుని వేడివేడి టొమాటో కూరతో తింటుంటే కళ్ళముందు స్వర్గం కనిపించింది. ఒక మామూలు కూరతో కూడా అన్నం తినడాన్ని అంత ఎంజాయ్‌ చేయొచ్చని మొదటిసారిగా తెలిసింది. ముగ్గురం అరకిలో కూర ఆనవాలు కూడా లేకుండా ఖాళీ చేసేశాం. తర్వాత ఎన్నోసార్లు బంగాళాదుంపలు, బెండకాయలు, వంకాయలు లాంటి మామూలు కూరల్ని అపురూపంగా నోట్లో నీళ్ళూరేలా వండుకుని వర్ణించుకుని వర్ణించుకుని తినేవాళ్ళం. ఆ రుచి నిజానికి కూరలది కూడా కాదు... ఆ సమయానిదీ, ఆ సందర్భానిదీ, తినే మా రహస్య ఉత్సాహానిదీ.

ఆ రోజు పౌర్ణమి. బాల్కనీలో కూర్చుని మాట్లాడుకుంటున్నాం. పరిసరాలన్నీ పండు వెన్నెల్లో తడిసి తన్మయమైపోతున్నాయి. ఉన్నట్టుండి ‘‘ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను’’ అని రాణీ కిందకు వెళ్ళింది. చేతుల్లో ఏదో పట్టుకుని మా రూమ్‌లోకి వెళ్ళింది. అయిదు నిమిషాల్లో టీ గ్లాసుల్తో బాల్కనీలో ప్రత్యక్షమైంది. ఎక్కడివంటే నవ్వి గ్లాసు చేతుల్లో పెట్టింది. తర్వాత చాలా వర్షం రాత్రుళ్ళనీ శీతాకాలపు గడ్డకట్టించే చలి రాత్రుళ్ళనీ వెన్నెల రాత్రుళ్ళనీ రాణీ వేడివేడి చాయ్‌ తాలూకు సువాసనలతో నింపింది. ఒక్క మాటలో చెప్పాలంటే... కటకటాలు మినహాగా జైలు జీవితం లాంటి ఆ దుర్భరమైన హాస్టలు జీవితాన్ని రాణీ తన సమక్షంతో వెలిగించింది. జీవితం ఎంత దుర్భరంగా ఉన్నా చిన్నచిన్న ఆనందాలతో దాన్ని సంతోషంగా చేసుకోవచ్చని రాణీ ద్వారా ఆ కొద్ది రోజుల్లోనే నేను నేర్చుకోగలిగాను.

‘‘రఫీ కచ్చితంగా రాణీని చేసుకోడు చూస్తుండు. వాడేదో పెద్ద ఇంద్రుడూ చంద్రుడూ అని రాణీ నమ్ముతోంది. నేను ఒకసారి చూచాయగా అంటే ‘రఫీ అలాంటివాడు కాదు... నాకు తెలుసులే’ అనేసింది. ఇంకేం చెబుతాం, ఇలాంటివి ఒకరు చెబితే తెలిసేవి కావు... ఎవళ్ళకి వాళ్ళు తెలుసుకోవాల్సిందే’’ రాణీ లేనప్పుడు ఒకసారి సుధ నాతో అంది.

‘‘రఫీని పెళ్ళి చేసుకోవడం రాణీవాళ్ళ పేరెంట్స్‌కి ఇష్టమేనా?’’

‘‘వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, రాణీ మొండిపట్టు పట్టుకుని కూర్చుంటే? నీ ఇష్టం అని వదిలేశారు. రఫీ వాళ్ళ అమ్మకే వాళ్ళ బంధువులమ్మాయిని చేసుకోవాలని ఉందట. ఇవన్నీ తెలిసి కూడా రాణీ అతన్ని గుడ్డిగా నమ్ముతుంది. నీకు ఇంకో విషయం తెలుసా... వాళ్ళిద్దరి మధ్యా రిలేషన్‌ కూడా ఉంది. రాణీ అప్పుడప్పుడు ఆదివారాలు బైటకు వెళుతుంది చూడు... అతని దగ్గరికే’’ సుధ గొంతు తగ్గించి రహస్యం చెబుతున్నట్టు అంది.

నేను వెంటనే ఏం మాట్లాడలేకపోయాను. సుధ చెబుతున్న దానిలో అబద్ధం ఏదీ లేదని నాకు తెలుసు. రాణీ మాటల్నిబట్టి ఆ విషయం కొంత నేనూ గ్రహించాను. ఆ రఫీ అనే అతను నాక్కూడా ఏ మాత్రం నచ్చలేదు. ఒకసారి రాణీ అతన్ని పరిచయం చేసింది. అతని కళ్ళు ఒక క్షణం కూడా స్థిరంగా నిలవడం లేదు. మేం మాట్లాడుతున్నంతసేపూ అతను అలాగే ఉన్నాడు. నాకెందుకో రాణీకి అతని మీదున్నంత ఇష్టం అతనికి రాణీ మీద లేదని స్పష్టంగా అనిపించింది.

అదే రాణీ అయితే, మేం ఏం మాట్లాడుకుంటున్నా ‘అదే మా రఫీ అయితే’ అంటూ అతని ప్రస్తావన తేకుండా ఉండేదికాదు. రఫీ గురించి మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళూ, ముఖమూ సంతోషంతో వెలిగిపోతూ ఉండేవి. రాణీ గురించి నేను భయపడినదల్లా ఒకటే- ‘రఫీ రాణీని పెళ్ళి చేసుకోడన్నా’ నాకు బాధనిపించలేదు కానీ, ‘ఒకవేళ అదే జరిగితే రాణీ ఏమైపోతుందో’ అని భయమనిపించింది. తను ఆ దెబ్బని ఎంతవరకూ తట్టుకుని నిలబడగలదు అని. ఏ అఘాయిత్యానికైనా పాల్పడుతుందేమో అని అప్పుడప్పుడూ భయం కూడా వేసేది.

నాకు హైదరాబాదులోని ఇంకో బ్రాంచీకి ట్రాన్స్‌ఫర్‌ అయింది. హాస్టల్‌ వూరికి ఈ చివర అయితే, బ్యాంకు వూరికి ఆ చివర. వూళ్ళొ వూళ్ళొనే రెండు గంటల ప్రయాణం. మధ్యలో వూపిరి పీల్చుకోనివ్వని ట్రాఫిక్‌. ట్రాఫిక్‌ కారణంగా రోజూ బ్యాంకుకు లేటు. సాయంత్రం నీరసం. ఆ టెన్షన్‌ తట్టుకోవడం కష్టమనిపించింది. అన్నయ్య వచ్చి హాస్టల్‌ మార్పించాడు. అయిష్టంగానే మారక తప్పలేదు. కొత్త హాస్టల్లో నాకు మరో ‘రాణీ’ దొరకలేదు. మొదట్లో అప్పుడప్పుడూ రాణీ దగ్గరికి వెళ్ళి వస్తుండేదాన్ని. రాణీ కూడా ఒకసారి నా దగ్గరికి వచ్చింది. రాణీని చూసినప్పుడల్లా నేను కోల్పోయిన ఆ సంతోష క్షణాలు నాకు గుర్తొస్తుండేవి.

కొత్త హాస్టల్‌కి వచ్చిన మూడు నెలల తర్వాత ఓ రోజు సుధ ఫోన్‌ చేసింది. ‘‘రజనీ, చూశావా... అచ్చంగా నేను చెప్పినట్టే జరిగింది. ఆ రఫీగాడు రాణీని చేసుకోవడంలేదు. వాళ్ళ చుట్టాలమ్మాయిని చేసుకోబోతున్నాడు. త్వరలోనే వాళ్ళ పెళ్ళి’’ సుధ గొంతులో బాధకన్నా తను అన్నది నిజమవుతోందన్న ఉత్సాహం కనిపించింది. ఒక్క క్షణం మనసు చివుక్కుమంది.

ఆ తర్వాత ఆదివారం రాణీ దగ్గరికి వెళ్ళాను. రాణీ నన్ను చూసి నవ్వుతూ ఎదురొచ్చింది. నవ్వులో ఎప్పటిలా హుషారు లేదు.

‘‘రా రజనీ, నేనే నీకు ఫోన్‌ చేద్దామనుకుంటున్నాను... ఈ ఆదివారం రాకూడదూ అని’’ రాణీ అంది.

సుధని బైటకు వెళ్ళనిచ్చి అప్పుడు మాట్లాడింది ఆ విషయం.

‘‘నీకో సంగతి చెప్పాలి రజనీ, రఫీ వాళ్ళ చుట్టాల అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడు. వచ్చేవారంలోనే పెళ్ళి.’’

నేను వెంటనే మాట్లాడలేకపోయాను. నిజానికి ఏం మాట్లాడాలో కూడా తెలీని సందర్భం అది.

‘‘ఎందుకో చెప్పలేను కానీ, ఇది ఇలాగే జరుగుతుందని నాకు అనిపించింది రాణీ. నువ్వు ఏమన్నా అనుకుంటావేమో అని చెప్పలేకపోయాను’’ కాసేపు మౌనం తర్వాత అన్నాను.

‘‘ఏం చేస్తాం, దురదృష్టవంతుడు. తనకి రాసిపెట్టి లేదు’’ తనలో తను అనుకుంటున్నట్టు నెమ్మదిగా అంది.

నేను ఆశ్చర్యంగా చూశాను... దురదృష్టవంతురాల్ని అనడానికి బదులుగా పొరపాటుగా అందా అని. నా చూపు గమనించి చిన్నగా నవ్వింది.

‘‘ఒక ఆడపిల్ల తన గుండె నిండుగా, నిండు మనసుతో ప్రేమిస్తే, ఆ ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో తెలుసా రజనీ? అమాయకమైన ఆ ప్రేమ అమృతంతో సమానం. అలాంటి ప్రేమను తను పోగొట్టుకున్నాడు కదా. అది దురదృష్టంకాక ఇంకేంటి? నా గుండెల్లో రఫీ అంటే ఎంత ప్రేమ ఉందో తెలుసా? కన్నతల్లిలా చూసుకోగల భార్య దొరకడం ఎంత అదృష్టం? మూర్ఖుడు, ఆ అదృష్టాన్ని చేతులారా పోగొట్టుకున్నాడు. రేపు వాళ్ళ అమ్మ చెప్పిన అమ్మాయిని చేసుకోవచ్చు. ఆ అమ్మాయి ఒక మామూలు భార్య అవుతుంది తప్ప, రాణీ కాలేదుగా. రఫీని చూస్తే నాకు జాలేస్తోంది రజనీ. కోపం వచ్చేదానికన్నా జాలే ఎక్కువగా ఉంది. తను పోగొట్టుకున్నదేంటో తనకు ఇప్పుడు తెలియదు. రఫీ కాదన్నంత మాత్రాన నేనేదో అయిపోతానా? నన్ను పోగొట్టుకోవడం తన దురదృష్టం కానీ నా దురదృష్టం కాదు’’ తనలో తను మాట్లాడుకుంటున్నట్లు నిదానంగా ఒక్కొక్క మాటా అంది రాణీ. ఆ మాటల్లో కొట్టొచ్చినట్టున్న ఆత్మవిశ్వాసం. రాణీని చూసి నిజంగా ఆశ్చర్యం వేసింది. ఒక్కసారిగా నా గుండె తేలికగా అయిపోయింది.

నిజమే, రఫీ పోగొట్టుకున్నది ఎంత అమూల్యమో నాకు తెలుసు. అందరికీ ఉండేది ఒకేలాంటి జీవితం. అయితే దాన్ని ఆనందంతో నింపుకోవడం మాత్రం ఎవళ్ళకి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఆ పరుసవేది విద్యను పట్టుకోగలిగినవాడు ఎడారుల్లో కూడా వసంతం పూయించగలడు, బంగారం పండించగలడు. ఆ పరుసవేది విద్య రాణీకి తెలుసు. అలాంటి రాణీని పోగొట్టుకోవడం నిజంగా రఫీ దురదృష్టంకాక ఇంకేంటి?!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.