close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఒక వాచీ మోదీ తీసుకెళ్లారు!

రెండు డిన్నర్‌ సెట్లు, 
ఒక వాచీ మోదీ తీసుకెళ్లారు!

మనిషి జీవితంలో కానుకలది అపురూపమైన స్థానం. మనస్ఫూర్తిగా ఇచ్చే కానుక వెల అమూల్యం. అందుకే మన ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లినా ఆ దేశాధ్యక్షుల కోసం ఏరి కోరి ప్రత్యేకమైన కానుకలు తీసుకెళ్తారు. రెండు దేశాల సంస్కృతీ సంబంధాలను ప్రతిబింబించేలా ఉంటాయి ఆ కానుకలు. అలాగే విదేశీ పర్యటనలకు వెళ్లిన మన దేశ ప్రముఖులకూ అద్భుతమైన కానుకలు లభిస్తుంటాయి. అవన్నీ ఏం చేస్తారో తెలుసా?

‘ఈ వాచీ నేను టెంత్‌ ఫస్ట్‌క్లాస్‌లో పాసైనప్పుడు మా నాన్న కొనిచ్చారు...’
‘వ్యాసరచనలో స్కూల్‌ ఫస్ట్‌ వచ్చినప్పుడు మా ప్రిన్సిపాల్‌ ఇచ్చిన పెన్‌ ఇది...’
ఈ మాటలు చెప్పేవారి మొహం ఆనాటి జ్ఞాపకాలతో ఎలా వెలిగిపోతుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బహుమతులన్నీ మనసుని మధురస్మృతుల్లోకి తీసుకెళ్తాయి కాబట్టే వాటికి వెలకట్టలేం.

జ్ఞాపకాల ఖజానా
తోషాఖానా...ఈ పదానికి అర్థం ‘ఖజానా’. ఒకప్పుడు యువరాజులూ రాకుమారులూ ప్రతిభాపాటవాలు ప్రదర్శించినప్పుడు లభించిన బహుమతులనూ విదేశాలు సందర్శించినప్పుడు అక్కడి వారు గౌరవంతో ఇచ్చిన కానుకలనూ ఈ తోషాఖానాలో భద్రపరిచేవారు. అతిథులు వచ్చినపుడు వారికి దీనిని చూపించడం రాకుమారుల హోదాకు చిహ్నంగా ఉండేది. రాజులూ రాజ్యాలూ పోయినా పలు దేశాల ప్రభుత్వాలు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి.

మన దేశంలో బ్రిటిష్‌ పాలకులు ఉన్నప్పుడే తోషాఖానా ప్రారంభమైంది. ఈస్టిండియా కంపెనీ అధికారులు నియమం ప్రకారం తమకు వచ్చిన కానుకలను తోషాఖానాలో జమ చేసేవారు. మళ్లీ ఎవరికైనా బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు వీటిల్లోనుంచే ఎంచుకుని ఇచ్చేవారు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటి మన ప్రభుత్వ తోషాఖానా నడుస్తోంది. మంత్రులూ ఉన్నతాధికారులూ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు తమకు వచ్చిన కానుకలను ఇక్కడ జమ చేయాలి. ప్రతి వస్తువుకీ తోషాఖానా అధికారులు విలువ కడతారు. నియమం ప్రకారం రూ.5వేల కన్నా తక్కువ విలువగల కానుకలను గ్రహీతలు ఇళ్లకు తీసుకెళ్లవచ్చు. ఐదువేల కన్నా ఎక్కువ విలువ గల కానుకలను తీసుకెళ్లాలనుకుంటే మాత్రం ఎంత ఎక్కువుంటే అంత తోషాఖానాకు చెల్లించి తీసుకెళ్లవచ్చు. ఇళ్లకు తీసుకెళ్లని కానుకలన్నీ ఈ తోషాఖానాలోనే ఉండిపోతాయి. వెయ్యి రూపాయల ఖరీదుచేసే టిష్యూ బాక్స్‌తో మొదలుపెట్టి లక్షల ఖరీదైన రోలెక్స్‌ వాచీల వరకూ ఇక్కడ ఉన్నాయి. ఎక్కువగా కళాఖండాలూ, పెయింటింగులూ ఉంటాయి.

మోదీ మెచ్చిన గడియారం
ప్రధాని మోదీకి ఈ మధ్య కాలంలో లభించిన కానుకలలో ఆయనకు బాగా నచ్చింది ‘హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌’ కాన్‌సెప్ట్‌తో బ్రిటిష్‌ కంపెనీ ‘సెకొండ’ తయారుచేసిన ఓ రిస్ట్‌ వాచీ. దాని విలువ రూ.3500 మాత్రమే కావడంతో దాన్నీ రూ.వెయ్యి విలువ గల ఓ పింగాణీ అలంకరణ వస్తువునీ ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఈ మధ్య కాలంలో తోషాఖానాలో 83 వస్తువులు జమ అయ్యాయి. తోషాఖానా రికార్డుల ప్రకారం మోదీ డబ్బు కట్టి మరీ ఇంటికి తీసుకెళ్లిన బహుమతులు ఏమిటంటే... రూ.10వేల విలువ గల రెండు డిన్నర్‌ సెట్లు, రూ.15వేలు విలువ గల ఒక తివాచీ. గత ఏడాది మోదీకి లభించిన కానుకల్లో చెప్పుకోదగ్గవి రూ.1,80,000 విలువ గల సీకో ఆస్ట్రాన్‌ వాచ్‌, నగిషీలు చెక్కిన చైనా పింగాణీ పాత్ర, ‘వన్‌ లా అండ్‌ కాన్‌స్టిట్యూషన్‌’ పేరున్న రెండు పుస్తకాలు.

పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌ తనకు వచ్చిన పలు కానుకలనుంచి 101 వస్తువులను మాత్రమే ఇంటికి తీసుకెళ్లారు. వాటిల్లో 10 పెయింటింగ్స్‌, నగిషీలు చెక్కిన వెండి ఏనుగు, బోస్‌ సౌండ్‌ సిస్టమ్‌, పిజెట్‌ గోల్డ్‌ ప్లేటెడ్‌ లేడీస్‌ రిస్ట్‌వాచ్‌ ఉన్నాయి. ఆయన తీసుకెళ్లిన కానుకల్లో ఐదువేలకన్నా ఎక్కువ విలువైనవి ఏడు మాత్రమే.

విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ తనకు వచ్చిన బహుమతులన్నీ తోషాఖానాకే అప్పజెబుతారు. తరచుగా విదేశీ ప్రయాణాలు చేసే ఆ శాఖ సహాయమంత్రి ఎంజె అక్బర్‌కి ఎక్కువగా కానుకలు వస్తాయి కానీ ఆయన కొన్ని అలంకరణ వస్తువుల్ని మాత్రమే ఇంటికి తీసుకెళ్లారు. మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా తనకు వచ్చిన కానుకలన్నీ తోషాఖానాకే అప్పగిస్తారు. ప్రధాని దగ్గర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న వినయ్‌ కవాత్రా అత్యంత ఖరీదైన (రూ.1,60,000) రోలెక్స్‌ ఆయిస్టర్‌ వాచీని కూడా తోషాఖానాకే అందజేశారు. మరో అధికారి సుబ్బరాయుడు తనకు కానుకగా వచ్చిన ఆపిల్‌ ఐపాడ్‌ ఎయిర్‌ని ఇంటికి తీసుకెళ్లడానికి రూ.37వేలు చెల్లించాల్సి వచ్చింది. మంత్రులైనా అధికారులైనా అరుదుగా మాత్రమే విలువైన వస్తువులను ఇళ్లకు తీసుకెళతారు.

ఈ కానుకలు ఒకసారి తోషాఖానాలో జమ అయిన తర్వాత అవి ఎక్కడినుంచి వచ్చాయన్న విషయాన్ని అధికారులు బహిర్గతపరచరు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల మీద ప్రభావం పడకూడదన్న కారణంతోనే ఈ నియమాన్ని పాటిస్తారు. ప్రతి మూడు నెలలకోసారి మొత్తం జమ అయిన వస్తువుల జాబితాను విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.


 

మార్స్‌ మీద కాలనీ కట్టేస్తాం...

రెండు రోబోలు మాట్లాడుకున్నాయి. శాస్త్రవేత్తలు వాటికి నేర్పిన భాషలో కాదు! పైగా వారి ఆదేశాలను అవి పెడచెవిన పెట్టాయి. దాంతో బెంబేలెత్తిన శాస్త్రవేత్తలు మొత్తానికి ఆ వ్యవస్థనే షట్‌డౌన్‌ చేశారు. ఫేస్‌బుక్‌ చేపట్టిన కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ప్రాజెక్టులో జరిగిన ఈ సంఘటనపై వార్తలు బయటకు రాగానే అందరూ ‘ఎలాన్‌ మస్క్‌ చెప్పిందే నిజమైంది...’ అన్నారు. ఎవరీ ఎలాన్‌ మస్క్‌? ఏం చెప్పారాయన?

కృత్రిమ మేధస్సు... దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పరిశోధనలు జరుగుతున్నాయో అంతగా చర్చా జరుగుతోంది. ఫేస్‌బుక్‌ కార్యాలయంలో జరిగిన సంఘటనకు కొద్ది రోజులముందే కృత్రిమమేధపై పరిశోధనలకు నియంత్రణ, రక్షణ చర్యలు అవసరమన్న టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ అభిప్రాయాన్ని జుకర్‌బర్గ్‌ ఖండించారు. ఇది అనవసరంగా భయపెట్టడమేనన్నారు. ట్విటర్‌లో వీరిద్దరి సంభాషణ తర్వాతే ఫేస్‌బుక్‌ కార్యాలయంలో రోబోలు మాట వినని సంఘటన జరిగింది.

ఇటీవల హైపర్‌లూప్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ టెక్నాలజీస్‌ సంస్థ వ్యవస్థాపకులు మనదేశంలో పర్యటించారు. వారితో భేటీ అయిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏపీలో ఆ తరహా రవాణా వ్యవస్థ అవకాశాలను పరిశీలిస్తామన్నారు. ఈ హైపర్‌లూప్‌ అన్న ఆలోచనని మొదట ప్రకటించింది ఎలాన్‌ మస్క్‌. ఒకప్పుడు ఆయన ఏం మాట్లాడినా అందరూ అపనమ్మకంగా చూసినవారే. కానీ అవే ఒకటొకటిగా ఇప్పుడు నిజమవుతున్నాయి.

మనుషులు గ్రహాంతరయానం చేసే రోజుల్ని వూహిస్తున్న మస్క్‌ మరో యాభై ఏళ్లలో అంగారక గ్రహం మీద పది లక్షల మందితో పూర్తి స్థాయి కాలనీ ఏర్పడుతుందనీ అలా వెళ్లకపోతే భూమిపైన మానవజాతి మనుగడ సాగించలేదనీ జోస్యం చెబుతారు. అంతేకాదు, 2023లో మార్స్‌కి ప్రయాణికులను పంపే ప్రణాళికనూ ఆయన సిద్ధం చేశారు. మార్స్‌కి ప్రయాణం ఎంత మజాగా ఉంటుందో ఆయన వర్ణించి చెబుతుంటే సైన్స్‌ఫిక్షన్‌ సినిమా చూసినట్లే ఉంటుంది.

* ఆఫ్రికాలో పుట్టి పెరిగి అమెరికాలో స్థిరపడిన ఎలాన్‌ మస్క్‌ వ్యాపారవేత్త, పెట్టుబడిదారు, ఇంజినీరు, ఆవిష్కర్త. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా వ్యవస్థాపకుడిగా, సీఈవో, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసరుగా ఆయన చాలామందికి తెలుసు. అంతే కాదు, స్పేస్‌ఎక్స్‌ సంస్థ సహవ్యవస్థాపకుడు. ఓపెన్‌ఏఐ (కృత్రిమమేధపై పరిశోధన సంస్థ) కో చైర్మన్‌, పేపాల్‌, న్యూరలింక్‌ సహవ్యవస్థాపకుడు. సోలార్‌ సిటీ, జిప్‌ -2 ... ఇలా చాలా కంపెనీలతో ఆయనకు సంబంధం ఉంది. ప్రపంచ సంపన్నుల జాబితాలో తొలి వందమందిలో ఉంటారు.

* ఒక్క వ్యక్తి ఇన్ని కంపెనీల బాధ్యతలు ఎలా చూసుకుంటారంటే... మస్క్‌ ఆరు గంటలే పడుకుంటారు. ఉదయం ఏడింటికి నిద్రలేచి స్నానం చేసి టిఫిన్‌ తినకుండానే ఆఫీసుకు బయల్దేరతారు. మధ్యలో టైం ఉందనుకుంటే ఒక ఆమ్లెట్‌ తిని కాఫీ తాగుతారు. సోమ, శుక్రవారాలు స్పేస్‌ ఎక్స్‌ కార్యాలయంలో, మధ్యలో మూడు రోజులూ టెస్లాలో పనిచేస్తారు. ఏదైనా సమావేశంలో మాట్లాడుతూనే మధ్యాహ్న భోజనం ఐదు నిమిషాల్లో పూర్తిచేస్తారు. ఫోన్‌ కాల్స్‌ అసలు తీసుకోరు. వారానికి 85 నుంచి 100 గంటలు పనిచేస్తారు. 80 శాతం పనిగంటలు ఆయనకు ఇష్టమైన ఇంజినీరింగ్‌, డిజైన్‌ పనుల్లోనే గడుపుతారు.

* మస్క్‌ రెండుపెళ్లిళ్లూ విడాకులకు దారితీశాయి. మొదటి భార్య ద్వారా ఐదుగురు కుమారులు. వారాంతాల్లో వారితో గడుపుతారు.

ఆ సమయంలోనూ ఈ మెయిల్స్‌ చూసుకోవడమో, మరో పనో కూడా చేస్తూనే ఉంటారు. ఒక్క పనే చేస్తే తనకు సమయం సరిపోదని చెప్తారు మల్టిటాస్కింగ్‌ నిపుణుడైన మస్క్‌.

* వారాంతాలూ, రాత్రివేళ జరిగే బిజినెస్‌ డిన్నర్లు చాలు కడుపునిండా తినడానికి అంటారాయన. వారానికి రెండు మూడుసార్లు జిమ్‌కి వెళ్తారు. పుస్తక పఠనం అన్నా ఇష్టమే. ద లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌ లాంటి పుస్తకాలూ, శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు చదువుతారు.

* ఈయనే ఇలా పనిచేస్తుంటే ఇక ఆయన దగ్గర పనిచేసేవారి పరిస్థితేంటి అంటారా? మస్క్‌ దగ్గర పనిచేయడమంటే సైన్యంలో ప్రత్యేక దళంలో పనిచేస్తున్నట్లేనట. ఇతరులు అసాధ్యమనుకున్నదే వారు చేస్తారు మరి. ఏ పనైనా ఫలానా సమయంలో, పరిమిత ఖర్చుతో సాధ్యంకాదని ఎవరైనా చెప్తే ఆయనకు ఇష్టం ఉండదు. అనుకున్న షెడ్యూలు ప్రకారం దాన్ని చేసి చూపించగలడాయన. పని అయ్యేవరకూ శని, ఆదివారాలు సైతం పనిచేయడం, ఆఫీసులో బల్లల మీదే నిద్రపోవడం... మామూలే.

* ఇటీవలే టెస్లా మోడల్‌ 3 కారుని మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఈ కారుకి 4 లక్షల అడ్వాన్సు రిజర్వేషన్లు ఉన్నాయి. వచ్చే ఏడాదికల్లా 5లక్షల కార్లను తయారుచేయాలన్నది సంస్థ లక్ష్యం. అయితే అందుకు సిబ్బంది ఐదు రెట్లు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది.

* వైఫల్యాన్ని ఒక అవకాశంగా భావిస్తారాయన. ఏదీ విఫలం కాలేదంటే అర్థం మనం సృజనాత్మకంగా ఆలోచించడం లేదని... అంటారు. భవిష్యత్తులో మానవాళి ఎదుర్కొనే సమస్యలేమిటో ఆలోచించి తదనుగుణంగా పనిచేయాలి కానీ డబ్బు సంపాదించడానికి తేలిక మార్గం వెదుక్కుని కాదు... అనే మస్క్‌ తన సంపదను అందుకే వినియోగిస్తానంటారు.

* టెస్లా కంపెనీ ప్రకటనలు ఇవ్వదు. దీనిపై ఓ బాలిక ట్విటర్‌లో ఆయనకో సలహా ఇచ్చింది. ప్రజలనుంచి ప్రకటనలను ఆహ్వానిస్తే బాగుంటుంది కదా అని. ఆయన ఆ సలహా స్వీకరించడమే కాదు, వెంటనే పోటీ ప్రకటించారు. నచ్చినవాటికి బహుమతులూ ఇచ్చారు.

* తనని తాను సగం డెమోక్రాట్‌నీ, సగం రిపబ్లికన్‌నీ అని చెప్పుకొనే మస్క్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్తలో అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా ఉండేవారు. పారిస్‌ ఒప్పందంపై ట్రంప్‌ నిర్ణయం నేపథ్యంలో మస్క్‌ ఆ కమిటీ నుంచి వైదొలగారు.


 

మాట్లాడలేకపోతేనేం... సినిమా తీస్తారు!

సినిమా దృశ్యశ్రవణ మాధ్యమం. ఆ రెండిటిలో ఏ ఒక్కటి లోపించినా అర్థం అసంపూర్ణమే. కానీ జీవితమే నిశ్శబ్ద చిత్రమైనా తాము చెప్పదలచుకున్నది అందరికీ అర్థమయ్యేలా చెప్పడంతో పాటు తమను తాము ఏడురంగుల హరివిల్లుమీద ఆవిష్కరించుకుంటోంది ఈ బృందం. పేరు డెఫ్‌ రెయిన్‌బో ఫిల్మ్స్‌. ప్రవృత్తి లఘుచిత్రాలు తీయడం.

విద్యావంతుడైన ఓ యువకుడు పార్కులో జంటలుగా తిరుగుతున్నవారిని చూసి తనకీ ఓ గర్ల్‌ఫ్రెండ్‌ ఉంటే బాగుంటుందనుకుంటాడు. పార్కులో బల్ల మీద ఓ యువతి ఒంటరిగా కన్పిస్తుంది. హుందాగా ఆమె దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకోబోతాడు. ఆమె గుర్తించదు, ఇంతలో మరో అమ్మాయి వచ్చి ఆమెను తీసుకెళ్తుంది. వారి సంభాషణ తీరు చూసి ఆమె అంధురాలు, బధిరురాలు కూడానని అర్థమై యువకుని మనసు చిన్నబోతుంది. ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటాడు. ఇంతలో మరో అమ్మాయి వచ్చి కాస్త దూరంగా కూర్చుని ఫోనులో చాట్‌ చేస్తుంటుంది. యువకుడు హలో చెప్తే ఆమె కోపంగా చూస్తుంది. మాటరాని అతడి సంకేత భాషను అపార్థం చేసుకున్న ఆమె ఆవేశంగా అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఇతరులకు ఫిర్యాదు చేస్తుంది. అది చూసి యువకుడి మనసు వికలమైపోతుంది. తానేమీ అమర్యాదగా ప్రవర్తించలేదు. అపరిచితులతో తన గురించి ఫిర్యాదు చేసిన ఆమె తనతో సంభాషించడానికి ఎందుకు ప్రయత్నించలేదు, ఎందుకు తనని అర్థం చేసుకోలేదు... అతడిలో ఎన్నో ప్రశ్నలు, ఎంతో వేదన.

పై సంఘటనలో ఆ యువకుడి అనుభవం అతడిని ఆత్మన్యూనతకు గురిచేస్తే దానికి బాధ్యులెవరు? వైకల్యం ఉన్నవారిని అర్థం చేసుకుని, జనజీవన స్రవంతిలో కలుపుకోవాలంటే ఎదుటివారే చొరవ చూపాలి. అప్పుడే వారు ఆత్మగౌరవంతో మనగలుగుతారు... అన్న సందేశంతో ముగిసే ఈ షార్ట్‌ఫిల్మ్‌ను తీసింది డెఫ్‌ రెయిన్‌బో ఫిల్మ్స్‌ బృందం. సామాజిక చైతన్యం, విలువలపై ఇలాంటి ఎన్నో చిత్రాలను ఈ బృందం తీసింది.

అభిరుచే కలిపింది
హైదరాబాద్‌లోని ‘లా మకాన్‌’లో ఓ సాయంత్రం వేళ. 20-45 ఏళ్ల మధ్య వయస్కులు 30 మంది దాకా ఉన్నారక్కడ. వారంతా అక్కడ కలుసుకునేలా చేసింది భౌతికంగా వారి వైకల్యమైతే, ప్రవృత్తిపరంగా వారి సృజనశక్తి. వారందరి అభిరుచీ ఒకటే. పదినిమిషాల వ్యవధిలో అందంగా, అర్థవంతంగా సమాజానికి ఏదో చెప్పాలి. అలాగని వారు చిత్రనిర్మాణంలో సుశిక్షితులనుకుంటే పొరపాటే. ఎలాంటి శిక్షణా లేకుండా, మామూలు కెమెరాలతోనే వారు తీస్తున్న చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. ఆలోచింపజేస్తున్నాయి. వారీ రంగంలోకి రావడానికి కారణం... మన చిత్రపరిశ్రమే!

సినిమాల్లో మూగచెవిటి వారిని చిత్రీకరిస్తున్న తీరూ హాస్యం కోసం వైకల్యాన్ని ఉపయోగించడం వారికి ఆవేదన కలిగించింది. దేశంలో దాదాపు రెండు కోట్లమంది మూగ, చెవిటి వారున్నారు. వారి గురించి సరైన సినిమాలు అరుదే. దశాబ్దం క్రితం వచ్చిన ‘బ్లాక్‌’ సినిమా ఎన్నో ప్రశంసలు అందుకుంది. అమెరికన్‌ సైన్‌ లాంగ్వేజి వాడడంతో ఆ సినిమాలో ఇక్కడివారెవరూ తమను తాము చూసుకోలేకపోయారు. భారతీయ సైన్‌ లాంగ్వేజ్‌కీ దానికీ చాలా తేడా ఉంది. ఈ అంశాలన్నీ సయ్యద్‌ ఫరూఖ్‌ నిజాంను ఆలోచింపజేశాయి. ఫరూఖ్‌, అతని భార్యా కూడా మూగవారూ, బధిరులే. కామర్స్‌లో డిగ్రీ చదివిన ఫరూఖ్‌ కోల్‌కతాలో భారతీయ సైన్‌ లాంగ్వేజిలో శిక్షణ పొందారు. తనలాంటి వారందరినీ ఒక్కచోట చేర్చి వారిలోని సృజనకు పట్టంకట్టాలన్న ఆలోచనతో మూడేళ్ల క్రితం డెఫ్‌ రెయిన్‌బో ఫిల్మ్స్‌ సంస్థను ప్రారంభించారు. ఇప్పటికే పలు చిత్రాలు తీసిన ఈ బృందం త్వరలో సొంత యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది.

నలుగురితో కలిసినప్పుడే...
‘మాట్లాడలేనంత మాత్రాన మాకు అభిప్రాయాలు లేవని కాదుగా? మూగ బధిరులైన వారెందరో సృజనాత్మక రంగాల్లో రాణిస్తున్నారు. తగిన ప్రోత్సాహం లభిస్తేనే వారి శక్తియుక్తులు సమాజానికి ఉపయోగపడతాయి. మా ఇంట్లో నన్నెప్పుడూ వేరుగా చూడలేదు. స్కూలు మాత్రమే వేరుగా ఉండేది. మిగతా అన్ని సమయాల్లో నేను నలుగురితో కలిసి ఉండేలా జాగ్రత్త తీసుకునేది అమ్మ. అన్నయ్యా చెల్లెళ్లూ అలాగే చూసేవారు. వారంతా నాలో నింపిన స్థైర్యమే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. కానీ చాలా ఇళ్లలో ఇలాంటి వాతావరణం ఉండదు’ అంటారు ఫరూఖ్‌. తండ్రితో వ్యాపారబాధ్యతలు పంచుకుంటూనే అతడు చిత్రనిర్మాణ వ్యవహారాలూ చూస్తున్నారు. ఫరూఖ్‌ ఇద్దరు కుమార్తెలతో సహా కుటుంబసభ్యులందరికీ సంకేత భాష అర్థమవుతుంది. ఇంకా వివరంగా ఏమన్నా చెప్పాలనుకుంటే ఆంగ్లంలో రాసి చూపిస్తారు.

కలలు సాకారం చేసుకోవడంలోనే కాదు, నిజానికి వీరికి నిత్యజీవితమూ సవాలుగానే ఉంటుంది. ‘మూగ, చెవిటివారి వైకల్యం పైకి కన్పించదు కాబట్టి ఎవరూ గుర్తించలేరు. దాంతో సంభాషణ కష్టమవుతుంది. చదువుకున్నా ఉద్యోగాలు దొరకవు. ఇప్పుడిప్పుడే కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. సోమాజిగూడ కేఎఫ్‌సీలో సిబ్బంది చాలామంది ఇలాంటి వారే ఉన్నారు’ అని చెప్పారు ఫరూఖ్‌ సోదరుడు సయ్యద్‌ మక్సూద్‌. ఇలాంటి పలు విషయాలను సున్నితంగా, సృజనాత్మకంగా తమ లఘుచిత్రాల ద్వారా చూపుతోంది ఫరూఖ్‌ బృందం. డెఫ్‌ రెయిన్‌బో ఫిల్మ్స్‌ ఆధ్వర్యంలో చిత్రనిర్మాణం గురించే కాక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి కూడా ఫరూఖ్‌ తరచూ వర్కుషాపులు నిర్వహిస్తుంటారు. ఆత్మవిశ్వాసంతో తమను తాము నిరూపించుకుంటున్న డెఫ్‌ రెయిన్‌బో ఫిల్మ్స్‌ బృందం అభినందనీయులు కదూ!


 

ఇచట సంతోషం కొలవబడును

ఒకప్పుడు సంపదను మాత్రమే అభివృద్ధికి కొలమానంగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని ఆనందానికీ ఇస్తున్నారు. మనిషి ఎంత ఆనందంగా ఉంటే అంత అభివృద్ధి చెందినట్టుగా లెక్కిస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు సైతం ప్రజలను ఆనందంగా ఉంచడానికి ఏకంగా మంత్రిత్వ శాఖలనే ఏర్పాటు చేస్తున్నాయి. దేశ పురోగతిని ఆనందంతోనే కొలుస్తున్నాయి. ఇప్పటివరకూ విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ ఒరవడి ఇప్పుడు భారతదేశానికీ విస్తరించింది.

రోటీ..కపడా.. మకాన్‌.. సామాన్యులకు ఈ మూడూ కల్పించడానికే ప్రభుత్వాలు పనిచేస్తాయన్నది పాత మాట. వీటితోపాటు ఆనందాన్ని కూడా అందించడమే రాజ్యం లక్ష్యమన్నది నేటి మాట. దీన్ని ఆచరించి చూపేందుకు మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కొత్తగా మినిస్ట్రీ ఆఫ్‌ హ్యాపీనెస్‌ (ఆనంద మంత్రిత్వశాఖ) ఏర్పాటు చేశాయి. ప్రజలు ఆనందంగా జీవించడానికి కావల్సిన వాతావరణాన్ని సృష్టించడం దీని ముఖ్యఉద్దేశం. ఆనందం అనేది సంపదతోనో, ఖరీదైన వస్తువులతోనో కాకుండా మానసిక ప్రశాంతత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, కాబట్టి దానికి సంబంధించిన కార్యక్రమాలను రూపొందిస్తారు. ప్రజల ఆనందాన్ని కొలిచే కొలమానాలు తయారుచేయడం, వీటిని ప్రామాణికంగా తీసుకుని రాష్ట్ర తలసరి ఆనందాన్ని (స్టేట్‌ గ్రాస్‌ హ్యాపీనెస్‌) లెక్కించడం లాంటి కార్యక్రమాలను ఈ శాఖ చేపడుతుంది.

రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను చూసి చలించిన మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, భూటాన్‌ స్ఫూర్తితో ఓ కొత్త ఆనంద మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. రాజ్య ఆనంద్‌ సంస్థాన్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఈ శాఖకు సంబంధించిన విధివిధానాలను ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పర్యవేక్షిస్తారు. దేశంలోనే ఇలాంటి ఓ శాఖను ఏర్పరచిన తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్‌.

ఆంధ్రప్రదేశ్‌లో...
సన్‌రైజ్‌ ఏపీ విజన్‌ 2029లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆనంద మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధీనంలో ఈ శాఖ ఉంటుంది. మానసిక, శారీరక ఆరోగ్యం, విద్య, సమయపాలన వంటి అంశాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల జీవన విధానం మెరుగుపడి, ఆనందంతో జీవించేలా చేయడం దీని విధి. ఆనందంగా ఉండాలంటే ఏమేం చేయాలో సర్వే చేసి, కొన్ని ప్రమాణాలను నిర్దేశిస్తారు. వాటి ఆధారంగా చేపట్టవలసిన కార్యక్రమాలను రూపొందిస్తారు. ప్రజలను ఆనందంగా ఉంచాలన్న ఉద్దేశంతో ఇటీవలే హ్యాపీ సండే కార్యక్రమాన్ని ప్రారంభించి, పల్లెలూ, పట్టణాల్లో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలనూ ఇందులో భాగం చేశారు. ఈ శాఖ ఆధ్వర్యంలోనే సంక్రాంతి, రంజాన్‌, క్రిస్మస్‌ మొదలైన పండగల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కానుకలనూ అందిస్తోంది.

ఎలా పనిచేస్తుందంటే..
రాష్ట్ర తలసరి ఆనందాన్ని లెక్కించడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. వీటితోపాటు ఆనందాన్ని పెంపొందించడానికి కార్యాచరణ ప్రణాళికలను కూడా రూపొందిస్తుంది. ఆనందానికి సంబంధించిన వివిధ సర్వేలనూ, నిపుణుల అభిప్రాయాలనూ సేకరిస్తుంది. యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం, వివిధ కళలను ప్రోత్సహించడం... ఇలా సుమారు డెబ్భై రకాల కార్యక్రమాలను చేపడుతుంది. రాష్ట్రంలోని వయోవృద్ధులను ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకెళ్లడం లాంటి కార్యక్రమాలను కొత్తగా రూపొందిస్తుంది.

హ్యాపీ మినిస్ట్రీకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఆ శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుంటారు. రాష్ట్ర ప్రజలు ఇందులో వలంటీర్లుగా చేరొచ్చు. ఇలా చేరినవారు గ్రామాలకూ, పాఠశాలలకూ వెళ్లి ఆనంద్‌ ఉత్సవ్‌, హ్యాపీ వీక్‌ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. వీటిలో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లూ ఇస్తారు.

క్యాలెండర్‌తో ఆనందం..
విజయాన్ని సాధించినపుడు లేదా ఏదైనా లక్ష్యానికి చేరువైనపుడు ఆనందం కలగడం సహజం. దీన్ని ఆధారంగా చేసుకునే ఏడాదంతా ఆనందంగా ఎలా ఉండాలో చెబుతూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఒక క్యాలెండర్‌ను రూపొందించింది. వలంటీర్ల ద్వారా ఈ క్యాలెండర్‌ను ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఆటలు ఆడటం, కృతజ్ఞతలు తెలపడం, నేర్చుకోవడం, లక్ష్యాలు నిర్దేశించుకోవడం...ఇలా ప్రతీ నెలనూ ఒక కొత్త పనికి అంకితం చేస్తూ ఆ నెలలో పూర్తిచేయాల్సిన చిన్నచిన్న లక్ష్యాలను పేర్కొంటారు. అంతేకాకుండా ఒక రోజులో ఎన్ని పనులు పూర్తిచేశారో తెలిపేలా టిక్‌ మార్కులు పెట్టుకోవాలి. నెల గడిచిన తర్వాత ఎన్ని ఎక్కువ టిక్‌మార్కులు వస్తే మీరు అంత సంతోషాన్ని పొందినట్లుగా లెక్కిస్తారు.

ఆనందానికీ కొలత...
ఆనందానికి ప్రమాణం ఏమిటి? అసలు దాన్ని ఎలా కొలవాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగానే ఐక్యరాజ్య సమితి ఆరు అంశాలతో కూడిన ఒక జాబితాను రూపొందించింది. ఆరోగ్యకర జీవన ప్రమాణాలు, తలసరి స్థూల జాతీయోత్పత్తి, స్వేచ్ఛ, దాతృత్వం, సామాజిక భద్రత, అవినీతి రాహిత్యం లాంటి అంశాలు ఇందులో ఉంటాయి. వీటి ఆధారంగానే ఐరాస 155 దేశాల్లో ఓ సర్వేను నిర్వహించింది. ఇందులో మొదటి స్థానంలో నార్వే నిలిచింది. భారతదేశం 122వ స్థానంలో ఉంది. మన పొరుగుదేశాలైన పాకిస్థాన్‌ 80, నేపాల్‌ 99 స్థానాల్లో ఉన్నాయి. ఆనందానికి మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వాలు భవిష్యత్తులో ప్రజలకు ఆనందాన్ని పంచడమే మా ప్రధాన అజెండా అని చెబుతాయేమో!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.