close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందుకే... ఉద్యోగం అంటే భయం!

అందుకే... ఉద్యోగం అంటే భయం!

ఎంసీఏ చదవడానికి హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఆ కుర్రాడు చదువుకి మధ్యలోనే ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. సినిమాల్లోకి వెళ్లి దర్శకుడయ్యాడు. ‘అందాల రాక్షసి’తో అందరి ప్రశంసలూ అందుకొని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో హిట్‌ కొట్టేశాడు. తాజాగా ‘లై’తో మరో హిట్‌ అందుకున్న ఆ యువ దర్శకుడు హను... హనుమంతరావు రాఘవపూడి. సినిమా సినిమాతో కెరీర్‌లో పైపైకి వెళ్తున్న హను తన జర్నీ గురించి చెబుతున్నాడిలా...

చిన్నప్పట్నుంచీ చదువులో ముందుండేవాణ్ని, 80-90 శాతం మార్కులు వచ్చేవి. అమ్మ సూర్యకుమారి, జ్యుడీషియల్‌ డిపార్ట్‌మెంట్‌లో, నాన్న సన్యాసిరావు, సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగాలు చేసేవారు. నేను పుట్టింది సత్తుపల్లిలో. పెరిగిందంతా కొత్తగూడెంలో. చదువుకున్నదీ అక్కడే. అమ్మానాన్న ఇద్దరూ ఉద్యోగులే కావడంవల్ల స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి ఉండేవి. అన్నయ్య, నేను, తమ్ముడు... తాళాలు తీసి మా పనులు మేమే చేసుకునేవాళ్లం. మా తిండి మేమే పెట్టుకొని తినేవాళ్లం. అప్పుడే ఉద్యోగం అంటే ఒకరకమైన విరక్తి వచ్చింది. ఒక చోట కూర్చొని చేసే పనిమీద అనాసక్తి ఏర్పడింది. డిగ్రీ తర్వాత ఎంసీఏ చేయడానికి హైదరాబాద్‌ వచ్చాను. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ కాలేజీకి వెళ్లేవాణ్ని. కానీ ఏదో అసంతృప్తి. మాది మధ్య తరగతి కుటుంబం. పుస్తకాలే తిండి పెడతాయి అన్నట్టు పెంచారు. ఎంసీఏ చదువుతున్నానే కానీ, రోజులు గడుస్తున్నకొద్దీ ఉద్యోగం చేయాల్సి వస్తుందనే భయం పట్టుకుంది. బాగా ఆలోచించి సెకండ్‌ ఇయర్‌కి వచ్చాక ఇక చదవలేనని అమ్మానాన్నలకి చెప్పాను. ‘మరేం చేస్తావ’న్న వాళ్ల ప్రశ్నకు సమాధానం లేదపుడు. అన్నయ్య మాత్రం ‘ఏం చేస్తావో నువ్వే నిర్ణయించుకొని చెప్పు’ అన్నాడు.

‘అమృత’ ఘడియలు
చిన్నప్పట్నుంచీ వేదం, పురాణాలూ, ఇతిహాసాలూ చదివించేవారు నాన్న. ఆపైన తెలుగు సాహిత్యం చదవడమూ అలవాటైంది. కాలేజీకి వచ్చేసరికి పాటలూ, పద్యాలూ, చిన్న కథలూ రాసేవాణ్ని. ఫ్రెండ్స్‌లో ఒకరు ‘జూబ్లీహిల్స్‌లో సినిమా వాళ్లు ఉంటారు. ఓసారి వెళ్లి ప్రయత్నించి చూడు’అని చెబితే వెళ్లాను. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ సమీపంలో ఓ ఇంటి దగ్గర షూటింగ్‌ హడావుడి ఉంది. వెళ్లి చూశాను. ‘అమృతం’ సీరియల్‌ తీస్తున్నారక్కడ. నాకెవరూ తెలీదు. చంద్రశేఖర్‌ ఏలేటి గారు అందరికీ అన్నీ చెబుతుంటే వెళ్లి కలిసి, ‘ఎంసీఏ చదువుకుంటున్నాను, సినిమా అంటే ఆసక్తి’ అని ఇంకా నా గురించి చెప్పాను. ఆయన డైరెక్టర్‌ కాబట్టి నేను డైరక్షన్‌ డిపార్ట్‌మెంటüలో చేరడానికి వచ్చాననుకున్నారు. ‘ఇంట్లోవాళ్లు ఏం అనరా’ అని అడిగారు. మరో రెండేళ్లు చదివినా డబ్బు, సమయం వృథా అనిపిస్తున్నాయని ఇంట్లోనూ చెప్పానన్నాను. ‘కథలు రాశాను అంటున్నావు, ఏవైనా ఆలోచనలు ఉంటే చెప్పు. రెండ్రోజుల తర్వాత కనిపించు’ అన్నారు. తర్వాత వెళ్లి నా దగ్గరున్న మూడు ఆలోచనల్ని చెబితే బావున్నాయన్నారు. ‘నీకు ఇక్కడ భవిష్యత్తు ఉంటుంది. కానీ ఎంత సీరియస్‌గా పనిచేస్తావనేదానిపైనే విజయావకాశాలు ఉంటాయి’ అని చెప్పారు. అలా 2001లో అమృతం సీరియల్‌కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కుదిరాను. ఆ సీరియల్‌కి చందూగారు పది ఎపిసోడ్లు డైరెక్షన్‌ చేశారు. రమా రాజమౌళి కూడా అప్పుడక్కడ అసిస్టెంట్‌ డైరెక్టర్‌. చందూతో ప్రత్యక్షంగా పనిచేస్తూ నేర్చుకుంటూనే గున్నం గంగరాజు, రాజమౌళి గార్ల పనితీరుని పరోక్షంగా చూశాను. గంగరాజుగారితో పది నిమిషాలు మాట్లాడితే ఏదో ఒకటి కొత్తగా తెలుసుకుంటాం. కొత్తవాణ్నయినా అందరూ ప్రోత్సహించేవారు.

సినిమాలే సినిమాలు
అమృతం తర్వాత చందు గారి దగ్గర ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’ సినిమాలకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. ఓరోజు మాటల్లో ‘సినిమాలకు పనిచేసినంత మాత్రాన డైరెక్టర్‌ కాలేవు. వేరే సినిమాలూ చూస్తుండు’ అని సలహా ఇచ్చారు చందూ. అప్పటివరకూ థియేటర్లలో రిలీజయ్యే సినిమాల్నే చూసేవాణ్ని. కానీ అసలైన సినిమా ప్రపంచం తెలీదు. చందూ దగ్గర చాలా పెద్ద డీవీడీ కలెక్షన్‌ ఉండేది. వాటిలోంచి కొన్ని తీసుకొని రోజూ మూడేసి సినిమాలు చూసేవాణ్ని. అవి చూశాక ఈ సినిమా ప్రపంచంలో నా స్థానం ఎక్కడో అర్థమైంది. ఎన్నో గొప్ప సినిమాలు. కనీసం వాటి పేర్లు కూడా తెలీదే! ‘శంకరాభరణం’, ‘రోజా’ నాకు బాగా నచ్చిన సినిమాలు. వాటిని ఎన్నిసార్లు చూశానో నాకే తెలీదు. ఇంకా మిగతా హీరోల సినిమాల్నీ చూసేవాణ్ని. కానీ ఇరాన్‌, కొరియా, జపాన్‌, హాలీవుడ్‌ సినిమాల్ని చూడ్డం మొదలుపెట్టాక సినిమా లోతు తెలిసింది. అప్పుడే చెన్నైలో మంచి డీవీడీలు దొరుకుతాయంటే నేను దాచుకున్నవీ, అన్నయ్య ఇచ్చినవీ కలిపి రూ.20వేలు పట్టుకెళ్లాను. అక్కడ రకరకాల డీవీడీల్ని చూస్తుంటే సినిమాలు తీయడం కాదు, వాటిని చూస్తూనే బతికేయొచ్చనుకున్నా. అదే సమయంలో అంత పెద్ద సముద్రంలో నేనెక్కడన్న ప్రశ్న మొదలైంది. నా ఆత్మవిశ్వాసం పాతాళానికి పడిపోయింది. తర్వాత కూడా చెన్నై వెళ్లి డీవీడీలు కొని తెచ్చేవాణ్ని. ఇదంతా అయ్యేసరికి చందూగారి మూడో సినిమా ‘ఒక్కడున్నాడు’ వరకూ వచ్చేశాం. నాతోపాటు ఆయన దగ్గర అసిస్టెంట్‌లుగా పనిచేసే రాధాకృష్ణ, సుధీర్‌... మణికొండలో అపార్ట్‌మెంట్‌ అద్దెకు తీసుకొని ఉండేవాళ్లం. హోమ్‌ థియేటర్‌ ఒకటి కొనుక్కొని అందులో సినిమాలు చూసేవాళ్లం. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వాటితోనే కొన్ని నెలలు గడిపేవాళ్లం. నచ్చిన సినిమాల్ని రకరకాలుగా చూసేవాళ్లం. సౌండ్‌ వింటూ విజువల్స్‌ వూహిస్తూ, మ్యూట్‌లో పెట్టి విజువల్స్‌ గమనిస్తూ నోట్సు రాసుకునేవాళ్లం. అవే మాకు పాఠాలయ్యాయి.

షార్ట్‌ఫిల్మ్‌తో ఫేమస్‌
చందూగారి దగ్గర ‘ఒక్కడున్నాడు’కి అసిస్టెంట్‌గా పనిచేస్తున్నపుడే 2005-06 ప్రాంతంలో ‘ఐ యామ్‌ ఫేమస్‌’ పేరుతో షార్ట్‌ఫిల్మ్‌ తీశాను. ఎయిడ్స్‌ బాధితురాలైన ఓ చిన్నారి కథ అది. మొదటి ప్రయత్నం కాబట్టి ఎక్కడా రాజీలేకుండా తీయాలనుకున్నాను. సముద్రం, చర్చి, స్కూల్‌... రకరకాల లొకేషన్లు చూసుకున్నాను. అప్పటికి డిజిటల్‌ కెమెరాలు ఇంకా రాలేదు. కెమెరామేన్‌ సెంథిల్‌ ఫ్రీగా నెగెటివ్‌ రీల్‌ సమకూర్చారు. రమా రాజమౌళి గారు లక్షాయాభైవేలు ఇచ్చారు. ప్రసాద్‌ ల్యాబ్‌ వాళ్లు ఎడిటింగ్‌కు సాయం చేశారు. మరి కొందరు స్నేహితులు డబ్బు పెట్టారు. అప్పట్లో దానికి రూ.3.5 లక్షలు ఖర్చయింది. దానికి మంచి గుర్తింపు వచ్చింది. రాజమౌళి గారు కూడా ఆ షార్ట్‌ఫిల్మ్‌ చూసి మెచ్చుకున్నారు. చందు దగ్గర హను అనే మంచి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఉన్నాడనే గుర్తింపు వచ్చింది. ఆ సమయంలో చందూ చెబితే నిర్మాత ఎం.ఎస్‌.రాజుగారిని కలిశాను. మామధ్య కథా చర్చలు జరిగాయి. అప్పటికి నాకు 26-27 ఏళ్లు. అది వర్కవుట్‌ కాలేదు. కానీ ఆయనతో ఇప్పటికీ మంచి అనుబంధం ఉంది.

మొదటి సినిమా
చందూగారితో ‘ప్రయాణం’ షూటింగ్‌ చివరకు వచ్చిన దశలో సినిమా చేద్దామని ఒక కథ రాశా. నా స్నేహితుడు సుధీర్‌ నిర్మాతగా ఉంటానన్నాడు. క్రైమ్‌ కామెడీ, మంచి కథ. కానీ బడ్జెట్‌ ఎక్కువవుతుందని ఆపేశాం. తర్వాత తక్కువ బడ్జెట్‌లో ఒక ప్రేమకథ తీయాలనుకున్నాను. అదే ‘అందాల రాక్షసి’. సూర్యచంద్రులు పురుషులై, భూమి స్త్రీ అయితే, వారి మధ్యలో ప్రేమ పుడితే ఎలా ఉంటుందని వూహించి కాలేజీ రోజుల్లో కథ రాసుకున్నాను. దాని ఆధారంగా సినిమా కథ అల్లుకున్నాను. సుధీర్‌ నిర్మాతగా సినిమా మొదలు పెట్టాం. సాయి కొర్రపాటి, రాజమౌళి తర్వాత ఆ సినిమాకి నిర్మాతలుగా ఉన్నారు. నాతోపాటు నటీనటులకీ, టెక్నీషియన్లకీ, అసిస్టెంట్‌ డైరెక్టర్లకీ అదే మొదటి సినిమా. చాలా కష్టపడ్డాం. కథ పరంగా మంచి హిట్‌. కానీ డబ్బులు రాలేదు. ఇప్పటికీ వారంలో ఒకసారైనా ఆ సినిమా గురించి ఎవరో ఒకరు మాట్లాడతారు. ఆ సినిమా తర్వాత మూడేళ్లు చాలా కథలు రాశాను. నా దృష్టిలో ఒక కథ రాసుకున్నానంటే, ఆ సినిమా తీసేసినట్టే, అంతలా సిద్ధం చేసుకుంటాను.

నానీ వల్లనే
నిజానికి ‘అందాల రాక్షసి’ కథ మొదట నానీకి చెప్పాను. తనకీ నచ్చింది కానీ, ఎందుకో చేయలేదు. అప్పట్నుంచీ మా మధ్య ఓ అనుబంధం ఉంది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ కథని నానీకి వినిపించాను. తను ఓకే అన్నాక 14రీల్స్‌ నిర్మాణానికి ముందుకొచ్చింది. మా సినిమా ఓకే అనుకున్నాక నానీవి ‘భలేభలే మగాడివోయ్‌’, ‘ఎవడే సుబ్రమణ్యం’ వచ్చాయి. రెండూ హిట్‌ అయ్యాయి. మాది చాలా భిన్నమైన కథ. కత్తి అంటే భయపడేవాడు రావణుడి లాంటి వ్యక్తి చెల్లినే ప్రేమిస్తాడు. చివరకు వాడెలా విజయం సాధిస్తాడనేదే కథ. నానీ నటన కథని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. మా సినిమా కూడా హిట్‌ అయింది. పరిశ్రమలో చాలామందిని చూశాను కానీ నానీ ఎంతో ప్రత్యేకం. నటుడిగా హిట్‌, ఫ్లాప్‌ల దశ దాటేశాడు. ఆ సినిమా సక్సెస్‌ తర్వాత నాకు పెళ్లయింది. జీవితం ఒక గాడిలో పడింది. నానీకే ఆ క్రెడిట్‌ దక్కుతుంది.

అమెరికాలో ‘లై’
సినిమాకి సెట్‌ వేయడం నాకు నచ్చదు. నా కథలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ముఖ్యమైన సీన్లు బయటి వాతావరణంలోనే జరుగుతాయి. సెట్‌లో సీన్లు తీస్తే ఏదో కృతకంగా ఉంటుంది. అందుకే ‘లై’ సినిమాని అమెరికాలో నిజమైన లొకేషన్లలో తీశాం. అదో సాహసోపేత జర్నీ. సినిమాలో 80 శాతం అమెరికాలోనే షూట్‌ చేశాం. ఈ ఏడాది ఏప్రిల్‌లో అక్కడికి వెళ్లాం. 75 రోజుల షూటింగ్‌. రోజూ 20 గంటలు పనిచేశాం. ఓసారి విరామం లేకుండా పూర్తిగా మూడు రోజులు షూటింగ్‌ స్పాట్‌లోనే ఉండిపోయాం. మరోసారి మైనస్‌ ఎనిమిది డిగ్రీల సెల్సియస్‌లో పనిచేశాం. అసిస్టెంట్‌ డైరెక్టర్‌కీ, ఆర్ట్‌ డైరెక్టర్‌కీ వీసాలు రాలేదు. అయినా కష్టపడ్డాం. సినిమాకి వచ్చిన స్పందనతో ఇప్పుడు హ్యాపీగా ఫీలవుతున్నా. ఒక మంచి ఇంగ్లిష్‌ సినిమా తెలుగు కథతో చూసినట్లు ఉంటుంది. ఈ సినిమాతో నితిన్‌ రూపంలో నాకు మరో మంచి మిత్రుడు దొరికాడు. సినిమా పరంగానే కాదు, వ్యక్తిగతంగానూ క్లోజ్‌ అయ్యాం. మేం ‘సర్‌’ అని పిలుచుకోవడం దగ్గర మొదలుపెట్టి ‘అరె’, ‘ఒరె’ అన్నంత క్లోజ్‌ అయిపోయాం. హీరోయిన్‌ మేఘా ఆకాశ్‌ నన్ను ‘అన్నయ్యా’ అని పిలిచేది. ఈ సినిమాతో నాకో చెల్లెలు కూడా దొరికింది. ఎడిటర్‌ శేఖర్‌, సినిమాటోగ్రఫర్‌ యువరాజ్‌- అందరం ఒక కుటుంబం అయిపోయాం.

‘లై’ షూటింగ్‌ సమయంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశాం. సినిమా తీయడానికి ముందే 45రోజులపాటు అమెరికాలో ఉండి లొకేషన్లు చూసుకున్నాం. దాంతో అప్పుడే సినిమాని నేనూ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ యువరాజ్‌ చూసినట్టనిపించింది. నిర్మాతలు కూడా బాగా మద్దతు ఇచ్చారు. ఈ సినిమాకి ఒక సంగీత విద్వాంసుడు కావాలనుకున్నాను. అలాంటివారిలో నేను అందుకోగలిగినవారిలో మణిశర్మ కనిపించారు. ఆయనీ సినిమాకి ప్రాణం పెట్టారు. ‘లై’ని ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్‌కి మూడ్రోజులు ముందు మాకు అబ్బాయి పుట్టాడు. నా భార్య అమూల్య... డాక్టర్‌. మాది పెద్దలు కుదిర్చిన సంబంధమే. తను నన్ను ఎంతో అర్థం చేసుకోబట్టే ‘లై’ని విజయవంతంగా పూర్తిచేశాను. ‘లై’ సక్సెస్‌ అమూల్యకే చెందుతుంది. ఎందుకంటే నేను దగ్గర లేకపోయినా అర్థం చేసుకోగలిగింది. సినిమాకీ సినిమాకీ మధ్య ఖాళీ దొరికితే సినిమాలు చూస్తాను. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను. మరో పక్క బాబుని చూసుకుంటున్నా!

ఇంకొంత

అమ్మ వాళ్లది రాజమండ్రి, నాన్నది విజయనగరం. పెళ్లయ్యాక ఇద్దరూ కొత్తగూడెంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మాతో ఉంటున్నారు.

* అన్నయ్య సీతారామప్రసాద్‌ శర్మ డెలాయిట్‌లో పని చేస్తున్నాడు. తమ్ముడు ప్రకాశం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అన్నయ్య అంటే ఇప్పటికీ భయం. తనే నా ధైర్యం కూడా. ఇప్పటికీ గైడెన్స్‌ ఇస్తాడు. నా సక్సెస్‌లో సగం పాత్ర ఆయనదే!

* సినిమాల్లోకి వచ్చాక రాధాకృష్ణ, సుధీర్‌, ఎస్సార్‌ శేఖర్‌ మంచి స్నేహితులయ్యారు.

* పెళ్లి అయ్యాక అమూల్యమీద డిపెండ్‌ అవడం మొదలుపెట్టాను.

* గతేడాది ఆగస్టు 27న పెళ్లయింది. ఈ ఆగస్టు 8న అబ్బాయి పుట్టాడు.

* చంద్రశేఖర్‌ ఏలేటి లేకపోతే నేను లేను. సినిమాలపరంగా ఆయన గైడెన్స్‌ ఎప్పటికీ తీసుకుంటాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.