close
ఇవేంటో చెప్పుకోండి..!

ఇవేంటో చెప్పుకోండి..!

‘చేపను ఒళ్లొ పెట్టుకుని కూర్చున్నారేంటీ, దివాన్‌ కాట్‌, సోఫాల మీద కూరగాయలూ కోళ్లూ ఉన్నాయేంటీ...’ ఈ త్రీడీ ప్రింటెడ్‌ కుషన్లను చూడగానే ఇంటికొచ్చినవారెవరైనా ఓ నిమిషం ఇలా ఆలోచిస్తూ ఉండిపోవాల్సిందే. అవును, ఇక్కడ కనిపించేవి ముమ్మాటికీ కుషన్లే. రకరకాల పండ్లూ కూరగాయలూ చేపలూ కోళ్లూ ఇతర జంతువుల రూపాల్లో బుల్లి దిండ్లను తయారుచేసి, వాటికి ఆయా రూపాల్లో ఉన్న త్రీడీ కవర్లను తొడగడంతో చూసేవారికి అవిలా దర్శనమిస్తాయి. మీరూ మీ ఇంటిని వీటితో అలంకరించాలనుకుంటున్నారా... అయితే, ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్‌ అలీ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్డరిచ్చేయండి.

బ్యాగు మీద రోజుకో ఫొటో!

డిజిటల్‌ ఫొటో ఫ్రేముల్లోలా బ్యాక్‌ప్యాక్‌ బ్యాగుల పైన కూడా రోజుకో కొత్త ఫొటోను ప్రదర్శించే వీలుంటే ఎంతబాగుంటుందో కదూ... అంతే మరి, ఫోన్లో ఎన్ని మంచి ఫొటోలున్నా పనిగట్టుకుని కనిపించినవారందరికీ చూపించలేం. అదే బ్యాక్‌ప్యాక్‌ మీద అప్‌లోడ్‌ చేస్తే అందరూ చూస్తారు... అదెలా సాధ్యం అని ఆలోచించాల్సిన అవసరం లేదు... ఈ పాప్‌-ఐ బ్యాగును కొనుక్కుంటే చాలు. దీని ముందుభాగంలో ఆప్‌తో పనిచేసే ‘ఈ-పేపర్‌’ స్క్రీన్‌ ఉంటుంది. మన ఫోన్‌లో ఉన్న ఏ ఫొటోనైనా దానిమీద వాల్‌పేపర్‌లా పెట్టుకోవచ్చు. ఇంకేముందీ, ఎప్పటికపుడు బ్యాగు లుక్కుని మార్చేయొచ్చు, వెనక వచ్చేవాళ్లు పిలిచి మరీ పొగిడేలా చెయ్యొచ్చు. మీరూ ఫిదా అయిపోయారా ఈ బ్యాగుకి..?

ఇంటికెళ్లేసరికే వండేస్తుంది

ఆఫీసు నుంచి అలసిపోయి ఎప్పుడో ఇంటికొస్తాం. లేదంటే బయటికెళ్లి ఏ రాత్రో ఇల్లు చేరతాం. ఆ సమయంలో అలసిపోయి ఉండి, అన్నం వండుకుని తినాలన్నా కష్టంగానే అనిపిస్తుంది. అలాకాకుండా ఇంట్లో ఎవరూ లేకపోయినా మనం వెళ్లేసరికి వేడి వేడి అన్నం రెడీగా ఉంటే ఎంత బాగుంటుందో కదా... ఆ పనే చేసిపెడుతుంది ఈ ‘రైస్‌ వైజ్‌’ కుక్కర్‌. దీని పైభాగంలో 1.5 కిలోల పొడి బియ్యాన్నీ, ఐదు లీటర్ల నీటినీ నిల్వ చేసే వెసులుబాటు ఉంటుంది. ఇక, మనం ఫోన్‌లోని ఆప్‌ సహాయంతో ఎన్ని కప్పుల బియ్యం ఏ సమయానికి ఉడకాలీ అని సెట్‌ చేసుకుంటే చాలు, రొబోటిక్‌ టెక్నాలజీతో పనిచేసే ఈ కుక్కర్‌ దానంతటదే సరిపడా బియ్యాన్ని తీసుకుని కడిగి, ఆ నీటిని బయటకు వదిలి, కొలతల ప్రకారం మళ్లీ నీటిని పోసుకుని చెప్పిన సమయానికి అన్నాన్ని వండి ఉంచేస్తుంది. ఇంకేముందీ ఇంటికి రాగానే వేడివేడి అన్నాన్ని హాయిగా తినేయొచ్చు. ఎప్పటికపుడు కావల్సినంత నీరు తీసుకునేలా ఈ కుక్కర్‌లో నీటిని నిల్వ చేసే భాగాన్ని పంపుకి అనుసంధానించి ఉంచుకునే వెసులుబాటు కూడా ఉంది. త్వరలోనే ఇది మార్కెట్లోకి వస్తుందట.

ఈ షూకి అన్నీ తెలుసు

షూని తొడుక్కోగానే దానంతటదే కాలి సైజుకి తగ్గట్లూ టైట్‌ అయితే, చలిగా ఉన్నపుడు పాదాలకు వెచ్చదనాన్నిస్తే, రోజు మొత్తంలో మనం ఎంత దూరం ఎన్ని అడుగులు నడిచామో గుర్తించి ఆ విషయాలతోపాటు ఎన్ని క్యాలరీలు కరిగించామో కూడా తెలియజేస్తే ఎంత బాగుంటుందో కదూ... అలాంటిదే ఈ డిజిటü సోల్‌ షూ. సెన్సర్లుండే ఈ షూ ఆప్‌ సాయంతో పైన చెప్పినవన్నీ చేసేస్తుంది. షూ లోపల మనకు ఎంత ఉష్ణోగ్రత కావాలో ఆప్‌తో మనమే సెట్‌ చేసుకోవచ్చు కూడా. ఇక, రోజుమొత్తమ్మీద ఎన్ని క్యాలరీలు కరిగించామన్న విషయం కూడా ఆప్‌లో కనిపిస్తుంది. ఈ ఏడాదిలోనే ఈ షూని మార్కెట్లోకి తీసుకొస్తారట.

ముడుచుకోవడానికీ బటనే!

వర్షాకాలంలో ఏదున్నా లేకపోయినా గొడుగు మాత్రం తప్పనిసరి. ఇక, బటన్‌ నొక్కగానే తెరుచుకునే గొడుగుల్ని వాడుతున్న ప్రతిసారీ ‘అవి బటన్‌తోనే ముడుచుకునే వీలుకూడా ఉంటే బాగుండును’ అని మనం అనుకోవడమూ సాధారణమే. కానీ ఇకమీదట ఇలా అనుకోవాల్సిన పనిలేదు. అలాంటి గొడుగులు మార్కెట్లోకి వచ్చేశాయి మరి. ‘ఫుల్లీ ఆటోమేటిక్‌ ఆటో ఓపెన్‌, క్లోజ్‌ అంబ్రెల్లా’ పేరుతో వచ్చే ఈ గొడుగుల హ్యాండిల్‌కి ఉన్న ఒక బటన్‌ని నొక్కితే గొడుగు తెరుచుకుంటుంది, మరోటి నొక్కితే చిటికెలో ముడుచుకుంటుంది. ఆన్‌లైన్‌లో దొరుకుతున్న ఇవి రకరకాల రంగులూ సైజుల్లోనూ వస్తున్నాయి.

కీ చెయిన్‌తో ఛార్జింగ్‌

ఖాళీ దొరికితే చాలు స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలూ ఫొటోలూ చూడటం, ఇంటర్నెట్‌లో ఇతర పనులు చేసుకోవడం లాంటివి చేస్తుంటాం. అలాంటపుడు ఫోన్‌ ఛార్జింగ్‌ త్వరగా అయిపోతుంటుంది. కానీ ప్రయాణాల్లో ఉన్నపుడు వెంటనే ఛార్జింగ్‌ పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఈ సమస్యకు పరిష్కారంగానే పవర్‌ బ్యాంకులు వస్తున్నాయి. అయితే, అవి కాస్త పెద్దగా ఉండి పాకెట్‌లో పెట్టుకోవడానికీ వెళ్లిన ప్రతిచోటుకీ తీసుకెళ్లేందుకు వీలుండదు. ఆ ఇబ్బందిలేకుండా వచ్చిందే ఈ ‘మిక్స్‌బిన్‌ హార్ట్‌ షేప్డ్‌ ఛార్జర్‌’. చిన్నగా కీచెయిన్‌తో సహా ఉండే ఈ పవర్‌బ్యాంకుకి తాళాలు తగిలిస్తే ఎప్పుడూ మనతోనే ఉంటుంది కాబట్టి, ఎప్పుడు కావాలంటే అపుడు ఫోన్‌కి ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు.

చిటికెలో బ్యాగుని మార్చేయొచ్చు

ఫ్యాషన్‌ అనో సౌకర్యం అనో బయటికెళ్లేటపుడు ఒకటీ, పార్టీలకెళ్లేటపుడు ఇంకోటీ ఆఫీస్‌కెళ్లేటపుడు మరోటీ అంటూ బ్యాగుల్ని మారుస్తాం. కానీ అలా మార్చిన ప్రతిసారీ వస్తువులన్నిటినీ కొత్త బ్యాగులో పొందిగ్గా సర్దుకోవాలంటే పెద్దపని. దాన్ని చిటికెలో చేసేందుకు వచ్చిందే ‘ద బ్యాగ్‌ ఎక్ఛేంజ్‌’. ఎనిమిది చిన్నా పెద్దా పాకెట్లతో ఉండే దీన్లో మన వస్తువులన్నిటినీ సర్దుకుని బ్యాగులో పెట్టుకుంటే, మరో బ్యాగులోకి మార్చాలనుకున్నపుడు దాంతో పాటుగా తీసి పెట్టేసుకోవచ్చు. బ్యాగులో ఎక్కువ అరలు కావాలనుకునేవారికీ ఇది బాగా ఉపయోగపడుతుంది.

అలంకరణ మరో మెట్టెక్కింది

ఇంట్లోని గోడల్నీ కిటికీలనూ వంటగదుల్నీ... ఇలా మూల మూలనూ అందంగా మార్చేందుకు రకరకాల అలంకరణ వస్తువులు మార్కెట్లోకి వస్తున్నాయి. మరి మెట్లను మాత్రం వూరికే ఎందుకొదిలేయాలి... అందుకే, వాటినీ చూడముచ్చటగా మార్చేస్తున్నాయి త్రీడీ స్టెయిర్‌ స్టిక్కర్లు. ఏ మెట్టుకా మెట్టుకి విడిగా వచ్చే వీటిని మనింట్లో మెట్ల సైజుకి తగ్గట్లూ ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు. ఆశ్చర్యం ఏంటంటే ఈ స్టిక్కర్లన్నిటినీ అక్కడిచ్చిన వరుసలో మెట్టుకీ మెట్టుకీ మధ్య అంటిస్తే మొత్తంగా చూసినపుడు ఓ సీనరీలా కనిపిస్తుంది. ఎగసిపడే జలపాతాలు మెట్లమీది నుంచి కిందికి దూకుతున్నట్లూ, సాగర తీరం ఇంటి మధ్యకొచ్చేసినట్లూ, నెమలి పింఛాలు ఓ చోట పోగుపడినట్లూ... కనిపించే ఈ అందాలన్నీ ఆ స్టిక్కర్లు తెచ్చినవే.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.