close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సొంతానికి బైబిల్‌ ఉంటే మరణశిక్షే!

సొంతానికి బైబిల్‌ ఉంటే మరణశిక్షే!

ఉత్తర కొరియా... ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది అణు పరీక్షలే. ఖండాంతర క్షిపణి పరీక్షలతో అమెరికా, దక్షిణ కొరియాలతో సహా ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోన్న నియంతల పాలనే. ఐక్యరాజ్యసమితి ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా, వ్యవహరిస్తోన్న ఆ దేశాధ్యక్షుడి తీరుతెన్నుల గురించి పక్కన బెడితే, ఆ దేశ స్థితిగతుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో అక్కడ పర్యటించిన సికింద్రాబాద్‌ వాస్తవ్యులైన కోనేరు గోపాలకృష్ణ అనుభవాలు...

త్తర కొరియాను సందర్శించుకోవాలంటే ఎవరైనా సరే చైనా నుంచే ప్రయాణించాలి. అదీ అనుమతించబడిన ట్రావెల్‌ ఏజెన్సీల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మేం కూడా హైదరాబాద్‌ నుంచి బీజింగ్‌కి వెళ్లి ఒకరోజు అక్కడ ఉండి, మర్నాడు బీజింగ్‌ విమానాశ్రయంలో ఉత్తర కొరియా అధికారిక విమానమైన ఎయిర్‌ కోర్యో ఎక్కి, రాజధాని నగరం ప్యాంగ్యాంగ్‌కి చేరుకున్నాం. ముందురోజే అక్కడ మేం తప్పక పాటించాల్సిన నియమాల గురించి మా గైడ్‌ చెప్పాడు.

కళ్లన్నీ మనమీదే!
ఎయిర్‌పోర్టు నుంచే ట్రావెల్‌ ఏజెన్సీ ఏర్పాటుచేసిన బస్సులో మా పర్యటన మొదలైంది. అందులో డ్రైవర్‌తోబాటు ఇంగ్లిష్‌ బాగా మాట్లాడగలిగిన గైడ్‌, ప్రభుత్వం నియమించిన అధికారిక మైండరు ఉన్నారు. ఈ మైండరు, మేం ఎక్కడికి వెళితే అక్కడకు మావెంటే వచ్చాడు. చివరకు మనం బస చేసిన హోటళ్లలోనే ఉంటూ నిరంతరం మనల్ని గమనిస్తూనే ఉంటాడు.

ముందుగా మేం ‘ఆర్ట్స్‌ ఆఫ్‌ రీయునిఫికేషన్‌’ అనే ప్రదేశానికి వెళ్లాం. ఇది ఉత్తర, దక్షిణ కొరియాల ఏకీకరణను కాంక్షిస్తూ కిమ్‌ఇల్‌-సంగ్‌(తొలి అధ్యక్షుడు) కట్టిన స్మారక చిహ్నం. అక్కడ మనం ఏ ప్రదేశంలోనయినా ఫొటోలు దిగాలంటే గైడ్‌ అనుమతి తప్పనిసరి. మిలిటరీ ప్రదేశాలనూ, సైనికులనూ, పౌరులనూ క్లోజ్‌అప్‌లో ఫొటోలు తియ్యకూడదు. అక్కడి నుంచి నేరుగా సాయంత్రానికి మమ్మల్ని ర్యాన్‌గాంగ్‌ హోటల్‌కి తీసుకెళ్లారు. ఆ హోటల్‌ గేటు దాటి మనంతట మనం బయటకు వెళ్లకూడదు. హోటల్లో కూడా ఎవరితోనూ రాజకీయపరమైన చర్చలుగానీ, వారి నాయకులైన కిమ్‌లను కించపరిచే వ్యాఖ్యలుగానీ చేయకూడదు. ఉత్తర కొరియా ప్రజలు వారి నాయకులపట్ల దైవ సమానమైన భక్తి భావన కలిగి ఉండాలి. దానికి చిహ్నంగా ప్రతివారూ చొక్కాపై ఆ దేశ వ్యవస్థాపకుడైన కిమ్‌ సంగ్‌ బొమ్మ ఉన్న బ్యాడ్జ్‌ను ధరిస్తారు. అక్కడ దొంగతనాలు ఎక్కువ. జనం జేబుల్లో విలువైన వస్తువులేవీ ఉండవు. దాంతో దొంగలు ఆ బ్యాడ్జినే కొట్టేసి, బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మేస్తుంటారు. అది లేకుండా వాళ్లు పబ్లిగ్గా తిరగకూడదు మరి. అక్కడ ప్రైవేటు వాహనాలు అరుదు. పబ్లిక్‌ వాహనాల్లోనే తిరగాలి. అదీ ఒక వూరినుంచి మరో వూరికి వెళ్లాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.

సంగ్‌ క్యాలెండరు!
ప్రతి కార్యాలయంలోనూ ఇంట్లోనూ గోడమీద కిమ్‌ సంగ్‌, ఆయన వారసుడైన కిమ్‌ జోంగ్‌ల బొమ్మలు తప్పకుండా ఉంటాయి. చివరకు మా హోటల్‌ రూమ్‌లోనూ కిమ్‌ల గురించిన క్యాలెండరు ఉంది. దీన్ని జూచె క్యాలెండర్‌ అంటారు. కిమ్‌సంగ్‌ పుట్టినతేదీ, 15 ఏప్రిల్‌ 1912 ఆధారంగా దీన్ని రూపొందించారట. ఆ రాత్రికి కొరియా ప్రత్యేక వంటకమైన కోల్డ్‌ నూడుల్స్‌ తిని, విశ్రమించాం.

మర్నాడు ఉదయం మేం ఉత్తర-దక్షిణ కొరియాల సరిహద్దు ప్రాంతమైన పాన్‌ మున్‌ జోంకి బయలుదేరాం. ఇక్కడే డీ మిలిటరైజ్‌డ్‌ జోన్‌ ఉంది. ఇరు కొరియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది ఇక్కడే. అయితే ఇది శాంతి ఒప్పందం కాదు. కాబట్టి సాంకేతికపరంగా 1950లో మొదలైన కొరియా యుద్ధం నేటికీ కొనసాగుతున్నట్లే. ఇరు దేశాల సైనికులు నాలుగు నుంచి ఐదు మీటర్ల దూరంలో ఎదురెదురుగా నిల్చుని కనిపిస్తారు. మాలాగే దక్షిణ కొరియాకి వచ్చిన యాత్రికులు మాకు ఎదురుగా సరిహద్దు రేఖ ఆవలినుంచి కనిపిస్తారు. ఇక్కడ మాత్రం సైనికుల ఫొటోలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కొంతసేపు అక్కడ గడిపిన తరవాత దగ్గరలో ఉన్న కేసాంగ్‌ కోర్యో మూజియంను సందర్శించాం. ఇక్కడ ప్రాచీనకాలం నాటి కోర్యో రాజులకు సంబంధించిన వస్తువులూ ఆయుధాలూ భద్రపరిచారు. పక్కనే ఉన్న ప్రాచీన కన్ఫ్యూషియస్‌ విశ్వవిద్యాలయాన్ని కూడా చూసి అక్కడే ఉన్న రెస్టరెంట్లో సంప్రదాయబద్ధమైన పాన్‌ సన్‌ గి భోజనం చేసి ప్యాంగ్యాంగ్‌కు బయలుదేరాం. ఆ సాయంత్రం ప్యాంగ్యాంగ్‌లోని మెట్రో స్టేషన్‌కి వెళ్లాం. ఇది ప్రపంచంలోకెల్లా లోతైన మెట్రోస్టేషన్‌. ప్రతి స్టేషనులోనూ వీధి కూడళ్లలోనూ మొజాయిక్‌ రాళ్లతో చేసిన పెద్ద సైజు కిమ్‌ల బొమ్మలు కనిపిస్తాయి. ప్రతి 3.5 కిలోమీటర్లకీ కిమ్‌సంగ్‌ది ఓ విగ్రహమైనా ఉంటుంది. ఇలా దాదాపు 34 వేల విగ్రహాలు ఉన్నట్లు అంచనా. అంటే జనాభాలో ప్రతి 750 మందికి ఓ సంగ్‌ విగ్రహం ఉందన్నమాట.

కటింగుల్లోనూ కటింగే!
అక్కడ నుంచి గోల్దేన్‌ లేన్‌ బౌలింగ్‌ సెంటర్‌కు వెళ్లాం. ఇది ప్యాంగ్యాంగ్‌ పౌరుల వినోదానికి ఉద్దేశించిన పార్కు. ఇక్కడ మాత్రమే మేం కొరియా ప్రజలను దగ్గరగా చూడగలిగాం. ప్రస్తుత అధ్యక్షుడైన కిమ్‌ జోంగ్‌-ఉన్‌ జీన్స్‌నీ ముక్కులూ చెవులూ కుట్టించుకోవడాన్నీ నిషేధించాడు. దాంతో జీన్స్‌ వేసుకున్నవాళ్లు కనిపించరు. సెలూన్లలో ప్రభుత్వం అనుమతించిన హెయిర్‌ కట్‌లు మాత్రమే బోర్డులో ఉంటాయి. వాటిలోంచే చేయించుకోవాలి. అందుకే దాదాపు అందరి కటింగులూ ఒకేలా ఉంటాయి. ఉత్తర కొరియాలో క్రిస్టియన్లు ఉన్నప్పటికీ కూడా సొంతానికి బైబిలు కలిగి ఉన్నా; దక్షిణ కొరియా సినిమాలు చూసినా, అశ్లీల చిత్రాలను సరఫరా చేసినా మరణశిక్ష తప్పదట. ఆయా కారణాలతో 2013లో కావాలని అందరూ చూస్తుండగా 80 మందిని కాల్చేశారట. కానీ మనమెంతో నేరంగా భావించే గంజాయి పెంచడం, వాడకం, సరఫరా అక్కడ చట్టబద్ధమే. ఉత్తర కొరియాలో ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్లు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించే వాళ్ల సంఖ్య చాలా తక్కువ. సుమారు రెండున్నర కోట్ల జనాభాలో దాదాపు రెండువేల మంది కూడా ఉండరు. అది కూడా వాళ్లదైన రెడ్‌ స్టార్‌ అనే ఆపరేటింగ్‌ వ్యవస్థనే వాడతారు.

మర్నాడు ఉదయం కుమ్‌-సుసాన్‌ గ్రాండ్‌ ప్యాలెస్‌కు బయలుదేరాం. ఇది ఓ రాజప్రాసాదం. ఇక్కడ చనిపోయిన కిమ్‌ఇల్‌-సంగ్‌, ఆయన కొడుకు కిమ్‌జోంగ్‌-ఇల్‌ల మృతదేహాలను పాడవకుండా ఎంబామింగ్‌ చేసి ప్రదర్శిస్తారు. కొరియా ప్రజలూ సందర్శకులూ వీటిని తప్పనిసరిగా సందర్శిస్తుంటారు. అయితే ఇక్కడ ఫొటోలు నిషిద్ధం. మధ్యాహ్న సమయానికి మన్సుదే గ్రాండ్‌ మాన్యుమెంట్‌కు చేరుకున్నాం. అక్కడ కిమ్‌ఇల్‌-సంగ్‌, కిమ్‌జోంగ్‌-ఇల్‌ల 22 మీటర్ల ఎత్తైన ఇత్తడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. వాటికి గౌరవ వందనం చేసి కిమ్‌ఇల్‌-సంగ్‌ జన్మస్థలమైన మంగోంగ్‌-దే కి వెళ్లాం. ఈ కొండ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడే కిమ్‌ ఇల్‌ సంగ్‌ తల్లిదండ్రుల ఇల్లూ, వారు వాడిన వస్తువులూ ప్రదర్శనకు ఉంచారు.

అక్కడి నుంచి విక్టరీ ఫాదర్‌ ల్యాండ్‌ మెమోరియల్‌ వార్‌ అనే మ్యూజియానికి చేరుకున్నాం. కొరియా- అమెరికా యుద్ధంలో స్వాధీనం చేసుకున్న అమెరికా ట్యాంకులూ యుద్ధ విమానాల శకలాలను అక్కడ ప్రదర్శించారు. యుద్ధానంతరం కొరియాపై గూఢచర్యం చేస్తూ పట్టుబడిన పెబ్లో అనే అమెరికా యుద్ధనౌకను అక్కడ ఉంచారు.

మరుసటి రోజు మేమంతా ప్యాంగ్యాంగ్‌ పర్యటనకి బయలుదేరాం. సోషలిస్టు దేశం కాబట్టి భారీ దుకాణాలూ షాపింగుమాల్సూ కనిపించలేదు. ప్రత్యేకంగా విదేశీ యాత్రికుల కోసమే కేటాయించిన షాపులకి తీసుకెళ్లారు. వాటిలో ధరలన్నీ చైనీస్‌ యెన్‌లలో కానీ యూరోలలోకానీ ఉంటాయి. వాటిల్లో సామాన్య కొరియా ప్రజలు కొనలేరు.

ఉత్తర కొరియా కరెన్సీ వోన్‌. దీని విలువ మన కరెన్సీకన్నా తక్కువ. ఒక్క రూపాయి 14.09 వోన్‌లతో సమానం. వాళ్ల కరెన్సీని పర్యటకులు వాడటానికి కూడా ఇవ్వరు. మధ్యాహ్నం కొరియన్‌ బీరు ఫ్యాక్టరీనీ హైస్కూల్‌నూ సందర్శించాం. అక్కడి స్కూల్లో ఇంగ్లిషు క్లాసు జరుగుతున్నప్పుడు విద్యార్థులతో కాసేపు గడిపాం. ఆ దేశం నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధించినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే కొరియా నాయకుల గురించి తప్ప వాళ్లకు బయటి ప్రపంచం గురించిన అవగాహన తక్కువ. చివరకు ఉత్తరం రాయాలన్నా ముందు ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఎటెర్నిటీ’ కిమ్‌ సంగ్‌, ‘డియర్‌ లీడర్‌’ కిమ్‌ జోంగ్‌ ఇల్‌ అని మొదలుపెట్టాల్సిందేనట. కిమ్‌ జోంగ్‌-ఇల్‌ ఆకాశంలో రెండు ఇంద్రధనుస్సులు ఏర్పడిన సమయంలో పుట్టాడనీ, ఆయన పుట్టిన వేళలో ఆకాశంలో ఓ తార ఆవిర్భవించిందనీ, ఆరు నెలలకే నడవడం, మాట్లాడటం చేశాడనీ, మనసుతోనే వాతావరణాన్ని శాసిస్తాడనీ... ఇలా దేవుడిలా కీర్తిస్తూ ఆయన జీవితం గురించి ప్రభుత్వం పుస్తకాలూ విడుదల చేసిందట. అక్కడి ప్రభుత్వం ఇప్పటికీ మరణించిన సంగ్‌ పేరుతో అధికారిక పత్రాలను జారీచేస్తుంటుంది. సంగ్‌, జోంగ్‌లు మరణించిన తేదీలైన జులై 8, డిసెంబరు 17న పుట్టినవాళ్లు ఆ రెండు రోజుల్లో పుట్టినరోజుని జరుపుకోరు. ఆ కారణంతోనే లక్షమంది ఆ మరుసటి రోజుల్లో జరుపుకుంటున్నారట.

వూపిరి పీల్చుకున్నాం!
చివరగా ఆ రోజు సాయంత్రానికి జూచే టవర్‌ చేరుకున్నాం. జూచే తత్త్వానికి ప్రతీకగా నిలిచిన ఈ స్మారకాన్ని ప్రపంచంలోనే ఎత్తైన రాతి స్థూపంగా అభివర్ణించారు. కిమ్‌ ఇల్‌-సంగ్‌ రూపొందించిన స్వావలంబన సిద్ధాంతాన్నే జూచే తత్త్వం అంటారు. ఈ స్థూపం ప్రాంగణంలో భారత్‌ నుంచి 1971లో ఓ యూత్‌ స్టడీ గ్రూప్‌ ఈ జూచే తత్త్వాన్ని అధ్యయనం చేయడానికి ఇక్కడికి వచ్చినట్లుగా అక్కడ ఓ శిలాఫలకం ఉంది. ఈ టవర్‌ మీద నుంచి ప్యాంగ్యాంగ్‌ నగరం మొత్తాన్ని కొద్దిసేపు వీక్షించి ఫొటోలు తీసుకుని తిరిగి మా హోటల్‌కు వెళ్లి మర్నాడు తిరుగు ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకుని, ఆ రాత్రికి విశ్రమించాం.ప్యాంగ్యాంగ్‌ నుంచి బీజింగ్‌ వరకూ మా తిరుగు ప్రయాణాన్ని రైల్లో బుక్‌ చేసుకున్నాం. మార్గమధ్యంలో వచ్చే స్టేషన్లలో కంపార్టుమెంట్లో నుంచి బయటకు దిగడానికి అనుమతించరు. ఉత్తర కొరియా-చైనా సరిహద్దు సినుఇజు స్టేషన్‌కు చేరగానే అక్కడి సెక్యూరిటీ గార్డులు మా పాసుపోర్టులూ సామాన్లూ కెమెరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కెమెరాల్లో అభ్యంతరకర ఫోటోలు ఉంటే డిలీట్‌ చేసేస్తారు. అక్కడ ఇమ్మిగ్రేషన్‌ సెంటర్‌లో అవన్నీ అయ్యాక కొరియా- చైనాల స్నేహ వారధి యాలు నది వంతెన దాటి, రైలు చైనాలోని డాన్‌డోంగ్‌ స్టేషన్‌కి చేరగానే మా బృందంలోని సభ్యులమంతా హమ్మయ్య అనుకుంటూ వూపిరి పీల్చుకున్నాం. అక్కడ నుంచి బీజింగ్‌ ద్వారా హైదరాబాద్‌కు తిరిగొచ్చాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.