close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రేమసూత్రం

ప్రేమసూత్రం
నరెడ్ల అచ్యుతరామం

సాయంకాలం నాలుగున్నరవుతోంది. నాతో మాట్లాడుతూ కూర్చున్న అక్క చటాలున లేచి ‘‘పరిమళా, ఈ సన్నజాజులు మాల కడుతూ ఉండు, నేను స్నానం చేసి వస్తాను. మీ బావగారు వచ్చే టైమయింది... పిల్లలూ మీరు హోమ్‌వర్కు పూర్తిచేయండి’’ అని చెప్పింది హడావుడిగా లోపలికెళ్తూ. ‘‘అప్పుడే ఎక్కడక్కా, ఆఫీసు అయిదు గంటలకైపోతే ఏ ఆరింటికో ఏడింటికో నిదానంగా అన్ని పనులూ చక్కబెట్టుకొని వస్తారు. మా ఆయన్ని చూస్తున్నాను కదా... ఒక్కరోజూ పెందరాడే వచ్చిన పాపాన పోలేదు’’ అన్నాను.

‘‘లేదురా, మీ బావగారు 5.15 కల్లా ఇంటి దగ్గరుంటారు’’ అనేసి, వెళ్ళి స్నానం ముగించి ముస్తాబై వచ్చింది. ఎంతో అందంగా ఉంది అక్క. నాకంటే పదిహేనేళ్ళుపెద్దది. కానీ, ముప్ఫై ఏళ్ళకు మించి కనపడదు. నేనిచ్చిన సన్నజాజి మాల తలలో పెట్టుకుంటే మరింత బాగుంది. ఇంతలో బండి హారన్‌ వినిపించింది. గేటుకేసి చూస్తే బావగారు! టైము చూస్తే 5.15. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది.

‘‘గుడ్‌ ఈవెనింగ్‌ సార్‌, ఈరోజు మీకో సర్‌ప్రైజ్‌. మనింటికెవరొచ్చారో చెప్పుకోండి చూద్దాం’’ అంటూ అక్క నాకు చాటుగా నిలబడింది.

‘‘వెరీగుడ్‌ ఈవెనింగ్‌ మాలా. పరిమళ వచ్చుండవచ్చు’’ అన్నారు బావగారు.

‘‘ఎలా చెప్పగలిగారు బావగారూ?’’ ఆశ్చర్యంగా అడిగాను.

‘‘మీ అక్క ముఖం మతాబులా వెలిగిపోతుంటే ఆ మాత్రం వూహించలేనా ఏంటి’’ అన్నారు నవ్వుతూ.

‘‘మీరు త్వరగా ఫ్రెష్‌ అయి రండి, పకోడీలు చల్లారకుండా’’ అంటూ అక్క బావగారికి లుంగీ టవలూ ఇచ్చింది.

‘‘ఈరోజు పిక్చర్‌కు వెళ్దాం, త్వరగా రెడీ అవ్వండి’’ అని బావగారనగానే పిల్లలు కేరింతలు కొట్టారు.

ఇంటర్వెల్‌లో బావగారు అందరికీ పాప్‌కార్న్‌లూ డ్రింకులూ తెచ్చారు.

భోజనాల దగ్గర అక్క అందరికీ కొసరికొసరి వడ్డించింది.

‘‘పరిమళా, ప్రయాణం చేసొచ్చి బాగా అలిసిపోయి ఉంటావు, పడుకో. పిల్లలూ... పిన్నిని ప్రశ్నలతో వేధించకుండా పడుకోండి. గుడ్‌నైట్‌’’ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అక్క. పిల్లలూ నేనూ మరో గదిలో పడుకున్నాం.

* * *

ఎంతసేపైనా నాకు నిద్ర రావడం లేదు. అక్క జీవితం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు! మరి నా జీవితం ఎందుకిలా ఉంది? నా లోపమా... సురేష్‌ లోపమా? ఎప్పుడూ నామీద అజమాయిషీ చెలాయించాలని చూస్తాడు. భార్యంటే అణిగిమణిగి ఉండాలంటాడు. ప్రతి చిన్న విషయానికీ పెద్ద రభసా వాదనా. ఛ! ఛ! పెళ్ళైన రెండేళ్ళకే లైఫ్‌ బోరు కొట్టేస్తోంది. ఇలాంటి ఆనందకరమైన రోజు ఒక్కటి కూడా గడిపింది లేదు. ఈ వయసులో కూడా అక్కా బావగారూ ఎంత ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘ఏదో ఉపాయం ఉంది. అక్కనడగాలి’ అనుకున్నాను.

* * *

‘‘గుడ్‌ మార్నింగ్‌ మాస్టారూ’’ అక్క మాట వినపడింది.

‘‘వెరీగుడ్‌ మార్నింగ్‌. అప్పుడే తెల్లారిందా? ఆ... మాలా, కాలు కొంచెం బెణికిందన్నావు, ఎలా ఉంది? కాస్త ఆయిల్‌ రాస్తాను ఇలా కూర్చో’’ పిలిచారు బావగారు.

‘‘ఫరవాలేదండీ, తగ్గిపోయింది’’ అంటున్నా వినకుండా,

‘‘అదేం కుదరదమ్మలూ, నువ్వు రావలసిందే’’ అంటూ బావగారు అక్కను దగ్గరకు తీసుకుని మెల్లగా మంచం మీద కూర్చోబెట్టి ఆయిల్‌ మర్దనా చేస్తున్నారు. గాలికెగిరిన కర్టెన్‌ పక్కనుంచి కన్పించిన ఈ దృశ్యం నాకెంతో ముచ్చటగా అనిపించింది. ఒక్కసారి గతం గుర్తుకొచ్చింది. తను ఒకసారి గుమ్మం తగిలి పడిపోయింది. అక్కడే ఉన్న సురేష్‌ తనకు చేయందించి లేపుతాడనుకుంది.

‘కొంచెం చూసుకుని నడవచ్చు గదా. టేబుల్‌ మీద జండూబామ్‌ ఉంది, రాసుకో. నాకు ఆఫీసుకు టైమవుతోంది. తొందరగా కేరియర్‌ సర్దు’ అనేసి స్నానానికి వెళ్ళిపోయాడు.

తనకు చిర్రెత్తుకొచ్చింది. సానుభూతిలేదు సరిగదా... ఆర్డర్లు. అందుకే అంటారు ‘పుణ్యంకొద్దీ పురుషుడని’ అనిపించింది.

‘‘పరిమళా, స్నానంచేసి రా, టిఫిను చేద్దువుగాని. మీ బావగార్ని ఆఫీసుకు పంపి వస్తాను’’ అక్క పిలుపుతో వర్తమానంలోకి వచ్చాను.

హాల్లో అక్కా నేనూ తీరుబడిగా టిఫిన్‌ చేస్తున్నాం. ‘‘వూఁ, ఎలా ఉంది సంసారం? సురేష్‌ ఎలా ఉంటాడు? ఏం ఇబ్బంది లేదు గదా?’’ అడిగింది అక్క.

‘‘ఏం చెప్పమంటావు అక్కా, ‘మూడు దెబ్బలాటలూ ఆరు అలకలూ’ అన్నట్టు ఉంది మా కాపురం. బావగారంతటి సౌమ్యుడూ మంచివాడూ కాదు సురేష్‌. అతని దృష్టిలో భార్యంటే జీతంలేని పనిమనిషి. ఇంచుమించు రెండు రోజులకొకసారి ఏదో విషయంలో వాదన తప్పదు. నా వ్యక్తిత్వాన్నీ ఆత్మగౌరవాన్నీ కించపరిస్తే నేనూరుకోలేను గదా. దాంతో ఎడమొహం, పెడమొహం. ఎంఎస్‌సీ చేసినదాన్ని హాయిగా ఏ యూనివర్సిటీలోనో పీహెచ్‌డీ చేసి మంచి ఉద్యోగం చేసుకునే బదులు, ఈ రొంపిలో పడ్డాను’’ అంటుంటే, ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది.

‘‘పిచ్చిపిల్లా, బాధపడకు. కాస్త ఫ్రెష్‌ అయి రా! నీతో చాలా విషయాలు మాట్లాడాలి’’ అనగానే లేచివెళ్ళి మొహం కడుక్కుని వచ్చాను.

‘‘జీవితానికి పరిపూర్ణత డబ్బుతోనో హోదాతోనో రాదు పరిమళా. ఎంత పెద్ద చదువులు చదివినా, ఎంతటి ఉన్నత స్థానానికి వెళ్ళినా - వివాహం, పిల్లలూ, బంధాలూ ఇవన్నీ లేకపోతే జీవితం పరిపూర్ణత చెందినట్టు కాదు. పెళ్ళైన స్త్రీ మరో ఇంటికి వెళుతుంది. అక్కడి వ్యక్తులతో ప్రేమ, అనుబంధం పెంచుకుని వారితో పాలలో నీళ్ళలా కలిసిపోవాలి. గుమ్మం ఎత్తు తక్కువగా ఉంటే తల కాస్త వంచి నడుస్తాం. అది అవమానం కాదు, తల దించుకోవడమూ కాదు. వ్యక్తిత్వం, ఆత్మగౌరవం... శరీరానికిగానీ ఆత్మకుగానీ అంటని పదాలు. అహంకారంవల్ల కలిగే ఈ భావనలు మనల్ని అందరి నుంచీ వేరు చేస్తాయిగానీ కలపవు. ఎవరి జీవితం ఎంత కాలమో ఎవరికీ తెలియదు. ఈ స్వల్పకాలంలో, సంఘర్షణలతో జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడం అవసరమా?’’ అడిగింది అక్క.

‘‘లేదక్కా, నేను తనకి కట్టుబానిసననుకుంటాడు. నామీద అనుక్షణం అధికారం చెలాయించాలనుకుంటాడు. నిజానికి అతను నాకు బానిసగా ఉండాలి. ఎందుకంటే నేను కట్నమిచ్చి అతన్ని కొనుక్కున్నాను గనుక’’ అన్నాను కోపంగా.

‘‘ఆ... అదే నేను చెప్పేది. ఇటువంటి అభిప్రాయాలు రైలుపట్టాల లాంటివి. ఎక్కడా కలవవు. వివాహంలో భర్త భార్యకు తాళికట్టి ఒక బంధాన్ని ఏర్పరుస్తాడు. తరవాత భార్య భర్తకు ప్రేమసూత్రంతో మూడుముళ్ళు వేయాలి. అప్పుడది ఎప్పటికీ విడివడని బంధం అవుతుంది. నువ్వు ప్రేమ పంచితే నీకు తిరిగి ప్రేమ వస్తుంది. ద్వేషం, కోపం పంచితే తిరిగి అవే వస్తాయి. వివాహమైన స్త్రీ ఎలా ఉండాలో పెద్దలు చెప్పారు. పనులు చేసేటప్పుడు దాసిలా ఉండాలట. ‘నేను పనిమనిషినా’ అని అనుకోకూడదు. దాసి ఎంత వినయంగా, నమ్మకంగా పనిచేస్తే అంతగా తన యజమానురాలి నుండి ప్రేమ పొందుతూ తన అవసరాలు తీర్చుకుంటుంది. సలహాలిచ్చేటప్పుడు మంత్రిలా ఉండాలి. అంటే ఆ సలహాలు మొత్తం మన కుటుంబానికి మేలు చేయాలి. అన్నం పెట్టేటప్పుడు తల్లి తన కొడుకు ఎంతిచ్చాడు, తనను ఎలా చూస్తున్నాడని ఆలోచించదుగా. తృప్తిగా రుచికరంగా భోజనం పెడితే ఆ భర్త తన భార్యలో తల్లిని చూస్తాడు. ఏ స్త్రీ అయితే పడకగదిలో భర్తను మురిపించి, వశం చేసుకుంటుందో ఆమె ఉత్తమ స్త్రీ అనేదే ‘శయనేషు రంభా’ అన్నదానికి అర్థం. ఇవన్నీ మన పూర్వులు పాటించేవారు కనుకే వారికి విడాకుల సమస్యలు లేవు. మరి ఇప్పటివాళ్ళు పెళ్ళైన మూడు నెలలకే లాయర్లను కలుస్తున్నారు. ఇవన్నీ కేవలం భర్త కోసమేననుకుంటే పొరపాటే. వీటన్నిటిలో స్త్రీ సౌఖ్యం, ఆనందం కూడా అంతర్లీనమై ఉన్నాయి. నీ భర్త నీ వశం కావాలంటే ముందు నువ్వు అతని వశమవ్వాలి. వాదనల వల్ల ఒరిగేదేమీ లేదు. ఒకరి అజ్ఞానాన్నీ అహంకారాన్నీ మరొకరికి ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం తప్ప. నిరంతరం ఘర్షణపడితే ఇంట్లో సుఖమూ శాంతీ ఎక్కడినుంచొస్తాయి. మన పిల్లలకు మంచీ చెడూ ఎలా చెప్పగలం? వివాహమైన స్త్రీ రెండు కుటుంబాలకు వారధి. ఎంతసేపూ అవతలివారు మారాలనుకుంటాంగానీ మనమెందుకు మారకూడదు?

ఇప్పటి మీ బావగారికీ ఒకప్పటి బావగారికీ ఎంతో తేడా ఉంది. అప్పట్లో తనూ అంతే. ప్రతిదానికీ కోపమే, వాదనే. కానీ నేను ఏనాడూ ఎదురు వాదించలేదు. ద్వేషంతో వాదనతో దూరం జరగకుండా ఆయన ఏదంటే అలాగే చేస్తూ ప్రేమతో సర్దుబాటుతో దగ్గరయ్యాను. ఎంతో ప్రయత్నంతో ఆయన్ని ఇలా మార్చుకున్నాను. ఇప్పుడు ఇద్దరం ఒకేసారి టిఫిన్‌ చేస్తాం. భోజనం చేస్తూ కుటుంబ విషయాలు మాట్లాడుకుంటాం. రాత్రయ్యేసరికి ఇష్టంగా పడకను చేరతాం. ఆ సాన్నిహిత్యం ఎంతో ప్రేమనూ అనుబంధాన్నీ పెంచుతుంది. అప్పుడు ఒకరి లోపాలు మరొకరికి కనపడవు. సెలవైతే ఆయన వంటగది వదలరు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్తాం. ప్రతిరోజూ ఆఫీసు నుండి కనీసం రెండుసార్లైనా ఫోన్‌ చేస్తారు. నా సలహా తీసుకోకుండా, నాకిష్టం లేకుండా ఏ పనీ చేయరు. ఇప్పుడు చెప్పు, నేను ఇలా ఉన్నందువల్ల నా ఆత్మగౌరవానికేమైనా భంగం కలిగిందా? నా పిల్లలూ భర్తా ఆయన తరఫువారూ నన్నెంతో అభిమానిస్తారు. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటున్నాననుకుంటూ నీకూ సురేష్‌కూ ఆత్మశాంతి లేకుండా, అత్తమామలకు మనశ్శాంతి లేకుండా గడపడం మంచిదా... ప్రేమతో అతణ్ణి కొంగున ముడేసుకోవడం మంచిదా? నువ్వే ఆలోచించు, ఛాయిస్‌ ఈజ్‌ యువర్స్‌’’ అక్క ముగించింది.

నా మనసును కమ్మిన పొరలేవో తొలగినట్లయింది. అమాంతం అక్కను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాను.

‘‘ఎంత బాగా చెప్పావు అక్కా! జీవితమంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. సురేష్‌ వచ్చి బ్రతిమిలాడి తీసుకెళ్తే తప్ప- ఎన్నాళ్ళైనా సరే వెళ్ళొద్దనుకున్నాను. కానీ రేపే బయల్దేరతాను. ‘నిజంగా గెలవడమంటే ఇష్టంగా ఓడడమంతే’ అని ఏదో పాటలో విని, ‘అదేంటీ’ అనుకున్నాను. ‘భార్యాభర్తల మధ్య గెలుపోటములు ఉండవు- సర్దుబాట్లు తప్ప’ అని ఇప్పుడర్థమైంది. ఇన్నాళ్ళూ నేను ప్రతి చిన్నదానికీ వాదిస్తూ, వాదనలో గెలిచాననుకుంటూ అనుబంధాల అల్లికలో ఓడిపోయాను. ఇకపై అలాకాదు, మొండి వాదనతో మాటల్లోకాక సర్దుబాటుతో జీవితంలో గెలుస్తాను. నీ సలహా పాటించి అతి త్వరలో సురేష్‌ మనసు గెలుచుకుని ఇద్దరమూ కలిసి నీ ఆశీస్సుల కోసం వస్తాం, చూస్తుండు...’’ ధీమాగా చెప్పిన నన్ను నవ్వుతూ చూస్తూ,

‘‘మా పరిమళ బంగారు తల్లి. ఇలా చెబితే అలా అల్లుకుపోతుంది’’ అంది అక్క నా భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.