close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కుర్రాళ్ల కోసం మోదీ పుస్తకం!

కుర్రాళ్ల కోసం మోదీ పుస్తకం!

నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ... దేశానికి ప్రధానమంత్రి, ఓ మంచి వక్త, తెలివైన రాజకీయ వ్యూహకర్త, తిరుగులేని నాయకుడు... ఇప్పుడు వీటన్నింటి పక్కన ‘గొప్ప రచయిత’ అన్న పదాన్నీ జోడించాలి. విద్యార్థులను ఉద్దేశించి మోదీ రాసిన ఓ పుస్తకం త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. ఇప్పటిదాకా దేశంలోనే అత్యధిక కాపీలతో అచ్చవుతున్న పుస్తకం కూడా అదే. గతంలోనూ అనేక పుస్తకాల ద్వారా ఆయనలోని రచయితని మోదీ బయటపెట్టారు.

క్యాబినెట్‌ మీటింగులూ, విదేశీ పర్యటనలూ, బహిరంగ సభలూ, అధికార కార్యకలాపాలూ... ఇలా క్షణం తీరికలేకుండా గడిపే మోదీ, ఇటీవల విద్యార్థులను ఉద్దేశించి ఓ పుస్తకాన్ని రాశానని చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. నిత్యం బిజీగా ఉండే వ్యక్తి పుస్తకం కోసం సమయం కేటాయించడం అభినందనీయమని అరుణ్‌జైట్లీ, సురేశ్‌ ప్రభు లాంటి కొందరు ప్రముఖులు ప్రశంసించారు. పుస్తకంలో ఆయన ప్రస్తావించిన అంశాల గురించి తెలుసుకున్న ‘పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌజ్‌’ ప్రచురణ సంస్థ దేశంలోనే అత్యధికంగా ఒకేసారి పది లక్షలకుపైగా కాపీలను వేర్వేరు భాషల్లో అచ్చేయడానికి ముందుకొచ్చింది. గతంలోనూ ప్రధానులుగా పనిచేసిన చాలామంది పుస్తకాలు రాసినా, పదవిలో ఉండగానే ఆ పని చేస్తున్న తొలి వ్యక్తి మోదీనే.

* పదో తరగతి, ఇంటర్‌... విద్యార్థులు ఎక్కువ ఒత్తిడికి గురయ్యే దశ ఇది. ఆ వయసులో పిల్లలు మానసికంగా కాస్త బలహీనంగా ఉంటారంటారు మోదీ. అందుకే ఆ వయసు వాళ్లకు సంబంధించిన అంశాలకే తన కొత్త పుస్తకంలో ప్రాధాన్యమిచ్చారు. పరీక్షల ఒత్తిడీ, ఇతర ఆకర్షణలూ, వాటిని జయించే విధానం, మార్కులకూ తెలివితేటలకూ ఉన్న వ్యత్యాసం, భవిష్యత్తుకి సిద్ధమవ్వాల్సిన తీరూ... ఇలా అనేక అంశాలను మోదీ తన పుస్తకంలో స్పృశించారు. సాధారణ వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లా కాకుండా విద్యార్థులతో, వాళ్ల తల్లిదండ్రులతో తానే మాట్లాడుతున్నట్లుగా ఉండేలా తన నిజజీవిత అనుభవాలనే పుస్తకంలో ప్రస్తావించారట. ‘నా మనసుకు దగ్గరగా ఉన్న అంశాన్నే రచన కోసం ఎంచుకున్నా. దేశ భవిష్యత్తులో యువత పాత్రపైన నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. అవేంటో ఈ పుస్తకం ద్వారా పంచుకోబోతున్నా. ఇది చదివాక యువత నన్నో మంచి స్నేహితుడిలా భావిస్తారు’ అని పుస్తకం గురించి ప్రస్తావిస్తూ మోదీ తన మనసులో మాట బయటపెట్టారు.

* ప్రధానిగా మారాక మోదీకి ఇదే తొలిపుస్తకమైనా, గతంలో డజనుకుపైగా పుస్తకాలను రచించారు. తల్లిప్రేమా, ప్రకృతీ, వాతావరణ మార్పులూ, పేదరికం ఇలా భిన్నమైన అంశాలపైన పుస్తకాలు రాసి వైవిధ్య రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. కవిత్వంలోనూ ఆయనది అందెవేసిన చేయే. ప్రసంగాల్లో తన కవితలనూ వినిపించే మోదీ, కేవలం కవితలతోనూ పుస్తకాలను తీసుకొచ్చారు.

* ‘సాక్షి భావ్‌’... తాను రాసిన పుస్తకాల్లో తనకు బాగా దగ్గరైన పుస్తకం ఇదేనంటారు మోదీ. నిజానికి మోదీ వ్యక్తిగత డైరీకి పుస్తక రూపమే ‘సాక్షిభావ్‌’. గతంలో తన ఆలోచనలని కవితల రూపంలో డైరీలో రాసుకొని, ఆర్నెల్ల తరవాత ఆ డైరీని కాల్చేయడం మోదీకి అలవాటుగా ఉండేదిట. కానీ ఆయన దగ్గరి స్నేహితులు కొందరు ఓసారి డైరీని కాల్చొద్దని వారించి, అందులోని కవితలను పుస్తకంగా తీసుకొచ్చారు. అదే ‘సాక్షి భావ్‌. దాన్ని చదివితే తన ఆలోచనలు ఎలా ఉంటాయో అర్థమవుతుందంటారు మోదీ.

* ‘ఆపత్‌కాల్‌ మే గుజరాత్‌’... దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో పాతికేళ్ల కుర్రాడిగా తాను అనుభవించిన ఆవేదనను ఈ పుస్తకంలో మోదీ ప్రస్తావించారు. ‘జ్యోతి పుంజ్‌’... కాంతిరేఖలు అన్న అర్థం వచ్చే ఈ పుస్తకంలో తనను బాగా ప్రభావితం చేసిన పదహారు మంది ఆరెస్సెస్‌ సభ్యుల గురించి తెలిపారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన రాసిన తొలి పుస్తకమిది. ‘కన్వీనియంట్‌ యాక్షన్‌- కంటిన్యుటీ ఫర్‌ చేంజ్‌’... వాతావరణ మార్పులూ, వాటిని ఎదుర్కోడానికి దేశం చేస్తున్న ప్రయత్నాల గురించి ఆంగ్లంలో రాసిన ఈ పుస్తకాన్ని రెండేళ్ల క్రితం ప్యారిస్‌లో ఆవిష్కరించారు. ‘భావ్‌ యాత్ర’... ప్రకృతీ, భారతీయ సంప్రదాయాల ఔన్నత్యం గురించి కవితల రూపంలో వివరించే పుస్తకమిది. అమ్మ ప్రేమ గురించి తెలియజేస్తూ ‘ప్రేమ్‌ తీర్థ్‌’, దేశభక్తీ, పేదరికం, రైతుల సాదకబాధకాలను ప్రస్తావించే గుజరాతీ పుస్తకం ‘ఆంఖ్‌ ఆ ధన్య చే’, చదువుపైన తన అభిప్రాయాల్ని తెలియజేసే ‘ది యోగా ఆఫ్‌ ఎడ్యుకేషన్‌’... ఇలా రకరకాల అంశాలపైన డజనుకుపైగా పుస్తకాలను రాసిన మోదీ, ప్రధాని అయ్యాక కూడా ఆ వ్యాపకాన్ని వదలకపోవడం విశేషం.

* స్వతహాగానే మంచి పుస్తక ప్రియుడైన మోదీ, ఆ అలవాటే తనను రచయితగా మార్చిందంటారు. కుర్రాడిగా ఉన్నప్పుడు ‘బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌’ జీవిత చరిత్ర తనని బాగా ప్రభావితం చేసిందంటారు. వివేకానందుడిని ఆరాధించే మోదీ, ఆయన రచనలతో పాటు, అరొబిందో రచనల్నీ, ప్రముఖుల జీవిత చరిత్రల్నీ, ఆధ్యాత్మిక పుస్తకాల్నీ ఎక్కువగా చదువుతారు. ప్రతి సమస్యనీ సానుకూల దృష్టితో చూసే ఓ పిల్లాడి జీవితం గురించి తెలిపే ‘పాలీ యానా’ అనే ఇంగ్లిష్‌ నవలని చదవమని విద్యార్థులకు సూచిస్తారు. జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం, తెలివితేటలూ పుస్తకాల ద్వారానే అబ్బుతాయని తాను నమ్ముతానంటారు. ఆ ధైర్యాన్ని విద్యార్థులకు పంచేందుకే తన కొత్త పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ఆయన చెబుతారు. గతేడాది ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో మాట్లాడినప్పుడే ఈ పుస్తకానికి సంబంధించిన ఆలోచన వచ్చిందంటారు మోదీ. అచ్చవనున్న కాపీల సంఖ్య ద్వారా విడుదలకు ముందే కొత్త రికార్డుకి శ్రీకారం చుట్టిన మోదీ పుస్తకం, మార్కెట్లోకి వచ్చాక ఇంకెన్ని సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి..!


 

పేద పిల్లలకు పోలీసు బడి..!

న్యాయాన్ని కాపాడటం, అన్యాయాన్ని రూపుమాపడం, శాంతి భద్రతల్ని నెలకొల్పడం... ఎక్కడైనా పోలీసుల విధులివే. కానీ ఆ పోలీసులు వీటితోపాటు పేద పిల్లల చదువు బాధ్యతనూ తీసుకున్నారు. పోలీసు కార్యాలయం ఆవరణలోనే పాఠశాలను నడుపుతూ వందలమందికి నాణ్యమైన చదువు చెప్పించి జీవితాన్నిస్తున్నారు. అదే ఖమ్మం జిల్లా పోలీసు అధికారుల ప్రత్యేకత.

సంవత్సరం... 1995. ఖమ్మం జిల్లా పోలీసు ఉన్నతాధికారి పాత కార్యాలయ భవనం ఖాళీగా ఉంది. దాన్నేం చెయ్యాలీ అనుకుంటున్న సమయంలో అప్పటి ఎస్పీ ఉమాపతికి గతంలో తను పనిచేసిన విజయనగరంలో పోలీసు బెటాలియనే ఓ పాఠశాలను నిర్వహిస్తున్న విషయం గుర్తుకొచ్చింది. ఆ తరహాలోనే ఖమ్మంలోనూ పోలీసుల ఆధ్వర్యంలో క్రమశిక్షణతో చదువు చెప్పే ఓ మంచి పాఠశాల నడిపితే చుట్టుపక్కల పేద పిల్లలతో పాటు డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగుల పిల్లలకూ నాణ్యమైన విద్యనందించొచ్చు... అనుకున్నారు. అదే విషయాన్ని అక్కడ పనిచేసే మిగిలిన సిబ్బందితోనూ చర్చించారు. అందరూ తమవంతు సహకారాన్ని అందించడానికి ముందుకురావడంతో పై అధికారుల అనుమతి తీసుకున్నారు. అలా ఆ ఏడాదే ఖాళీగా ఉన్న పాత కార్యాలయంలో డెబ్భైఅయిదు మంది విద్యార్థులతో ‘కృష్ణప్రసాద్‌ మెమోరియల్‌’ పాఠశాల వూపిరిపోసుకుంది. గతంలో ఖమ్మంలో పనిచేసి 1992లో హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన కృష్ణప్రసాద్‌ ఐపీఎస్‌ గౌరవార్థం బడికి ఆ పేరు పెట్టారు. జిల్లా సాయుధ దళం ఆధ్వర్యంలో ప్రారంభమైన దీన్లో మొదట్లో ఒకటి నుంచి నాలుగో తరగతి వరకూ బోధించేవారు. ఉమాపతి తర్వాత జిల్లాకు ఎస్పీగా వచ్చిన ప్రతి అధికారీ ఈ విద్యాలయం అభివృద్ధికి తమవంతు కృషి చేశారు. గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా పోలీసు పరేడ్‌ మైదానానికి వచ్చే జిల్లా కలెక్టర్లనూ ప్రజాప్రతినిధుల్నీ పాఠశాల అభివృద్ధికి సాయం చేయాలని కోరేవారు. వారు స్పందించి మంజూరు చేసిన ప్రభుత్వ నిధులూ చేసిన ఆర్థికసాయంతో కొద్దికాలంలోనే అత్యాధునిక వసతులతో మరో భవనం రూపుదిద్దుకుంది. నిజానికి ఈ భవనంలో ఆరుగదుల్ని నిర్మించేందుకే మొదట నిధులున్నాయి. కానీ పోలీసు శాఖలో పనిచేసే మేస్త్రీలూ కార్పెంటర్లూ ఎలక్ట్రీషియన్లూ తమవంతు సాయంగా ఎవరు చేయగలిగిన పనిని వారు ఉచితంగా చేసిపెట్టడంతో డబ్బు మిగిలి, పది గదుల భవనాన్ని కట్టగలిగారు. అలా ఎందరో మంచి మనుషుల సహకారంతో పాఠశాలను అంచెలంచెలుగా పదోతరగతి వరకూ పొడిగించడంతో పాటు, ఆంగ్ల మాధ్యమాన్నీ ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 678 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో ప్రభుత్వ సహకారంతో పుస్తకాలనూ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

ఫీజులు ఉండవు
వేర్వేరు తరగతుల విద్యార్థులకు పాఠాలను బోధించేందుకు నైపుణ్యంగల 29 మంది ఉపాధ్యాయుల బృందం పనిచేస్తోందిక్కడ. పోలీసు శాఖలో బీఈడీ లేదా ఇతర ఉన్నత విద్యల్ని చదివిన హోంగార్డులు కొందరితో పాటు ప్రైవేటుగానూ టీచర్లను ఎంపిక చేస్తుంది పాఠశాల నిర్వహణ కమిటీ. ఈ ఉపాధ్యాయులకు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆంగ్లమాధ్యమంలో బోధన గురించి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తారు. పాఠశాల నిబంధనల విషయానికొస్తే ఎవరైనా ఇక్కడ చదవొచ్చు. ఈ ఏడాది 67మంది సొంత శాఖ ఉద్యోగుల పిల్లలుండగా మిగిలిన వారంతా చుట్టుపక్కల ప్రాంతాలూ గ్రామాల పిల్లలే. ఫీజులు కట్టాలనే నిర్బంధం కూడా ఉండదు. ‘మీకివ్వాలనిపిస్తే ఎంతో కొంత ఇవ్వండి’ అంటారు నిర్వాహకులు. ఇక్కడ చదివేవాళ్లు చాలామంది పేద విద్యార్థులే. దాంతో కొద్దిమంది మాత్రం ఏడాదికి ఎంతో కొంత ఇస్తుంటారు. వీటితోపాటు స్వచ్ఛంద సంస్థలూ పోలీసు ఉన్నతాధికారులూ ఇచ్చే విరాళాలను ప్రైవేటు ఉపాధ్యాయులకూ పాఠశాలలో పనిచేసే ఇతర సిబ్బంది జీతాలకోసమూ ఉపయోగిస్తారు. హోంగార్డు కేడర్‌లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రభుత్వమే జీతాల్ని ఇస్తుంది. పాఠశాల నిర్వహణకు అవసరమైతే పోలీసు సంక్షేమ నిధి డబ్బునీ వాడుతుంది కమిటీ. ఈమధ్యే లయన్స్‌ క్లబ్‌, రోటరీ క్లబ్‌లు 100 బల్లలనూ ప్రవాస భారతీయుల ఫౌండేషన్‌ డిజిటల్‌ పాఠాల బోధనలకు రెండు టీవీలనూ అందజేశాయి.

కార్పోరేటుకి దీటుగా
ప్రస్తుతం రాష్ట్ర సిలబస్‌తో నడుస్తున్న ఈ పాఠశాలలో వచ్చే ఏడాది నుంచీ సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాదే తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సును కూడా ప్రారంభించారు. త్వరలోనే డిజిటల్‌ తరగతుల్నీ ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. పోలీసు శాఖ గ్రంథాలయంలోనే ఓ పక్కన విద్యార్థులకు అవసరమైన రకరకాల పుస్తకాలతో చిన్న గ్రంథాలయం ఉంటుంది. ఇలా ఇక్కడ పిల్లలకు కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉంటాయి. 2003 నుంచీ కృష్ణప్రసాద్‌ మెమోరియల్‌ పాఠశాల ఎప్పుడూ వందశాతం ఉత్తీర్ణతను సాధిస్తోందంటేనే ఈ పాఠశాల పనితీరు ఎలా ఉందో చెప్పొచ్చు. ఇక్కడ చదివిన ఎంతోమంది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌తో పాటు ఆయన భార్య జెబా ఖానమ్‌ సారథ్యంలోని పాఠశాల నిర్వహణ కమిటీ వందశాతం తరగతుల డిజిటలైజేషన్‌, సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధన, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతుల నిర్వహణకు కృషిచేస్తోంది అంటారు ప్రధానోపాధ్యాయుడు శేషగిరిరావు.

వందలమంది పేద పిల్లలకు విద్యాదానం చేస్తోన్న ఖమ్మం పోలీసులకు హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే.

- గోపయ్య మాడుగుల,ఈనాడు, ఖమ్మం డెస్కు
ఫొటోలు: ఆళ్ల శేషవర్దన్‌రెడ్డి

 

హోటల్‌ భోజనం ఇంటికే!

అవకాశాన్ని సరైన సమయంలో అందిపుచ్చుకోవడం విజయానికి తొలిమెట్టు. చేతికందిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం మలి మెట్టు. ఆ రెండు మెట్లనూ సమర్థంగా అధిరోహించిన ముగ్గురు యువకుల విజయ రహస్యం... స్విగ్గీ.

నుకోకుండా ఇంటికి అతిథులు వచ్చారు. వారితో కబుర్లు చెబుతూ అప్పటికప్పుడు భోజన ఏర్పాట్లు కూడా చేయాలంటే కుదరదు. అలాగని వారిని తీసుకుని హోటల్‌కీ వెళ్లలేం. ఏం చేస్తారప్పుడు?

రోజంతా సమావేశాలు, చర్చలు... ఆఫీసు పనితో అలసి సొలసి ఇంటికొచ్చాక వంట చేసే ఓపిక లేదు. ఏమిటి మార్గం..?

ఇలాంటి సందర్భాల్లో... హోటల్‌ వంటలనే ఇంటికి తెప్పించుకోవచ్చు! ఏ హోటల్‌ నుంచి, ఎలాంటి ఆహారపదార్థాలు తెప్పించుకోవాలో మీరే ఎంచుకోవచ్చు. అడుగు బయట పెట్టనక్కరలేకుండా అరగంటలోనే కోరుకున్న పదార్థాలు వేడి వేడిగా ఇంటికి వస్తే అంతకన్నా ఆనందమేముంటుంది? ఆ అవసరాన్నీ ఆనందాన్నీ అర్థం చేసుకున్నందునే ఈ యువ వ్యాపారస్తుల బృందం స్విగ్గీని విజయపథంలో నడిపిస్తోంది.

ఈ ఆగస్టుకి స్విగ్గీని ప్రారంభించి మూడేళ్లు. అతి తక్కువ సమయంలోనే ఫుడ్‌ డెలివరీ రంగంలో తనదైన ముద్ర వేసిన స్విగ్గీ ఇటీవల ఎకనమిక్‌టైమ్స్‌ నుంచి స్టార్టప్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును అందుకుంది. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్‌, దిల్లీ తదితర ఎనిమిది నగరాల్లో సేవలందిస్తోంది. ఆయా నగరాల్లో 12వేల రెస్టరెంట్లతో ఒప్పందం చేసుకుంది స్విగ్గీ. వినియోగదారులు కోరుకున్న ఆహారపదార్థాలను వారి ఇంటికే తెచ్చి అందిస్తూ నెలకు 40లక్షలకు పైగా ఆర్డర్లను చేరవేస్తోంది.

ముగ్గురు కలిసి...
మాజేటి శ్రీహర్ష, నందన్‌ రెడ్డి... బిట్స్‌ పిలాని విద్యార్థులు. శ్రీహర్ష ఐఐఎంలో ఎంబీయే కూడా చేశాడు. నందన్‌ ఎంఎస్‌సి ఫిజిక్స్‌ చదివాడు. వీరిద్దరినీ కలిపింది ఆహారం పట్ల వీరి అభిరుచే. ఖరగ్‌పూర్‌ ఐఐటీ విద్యార్థి అయిన రాహుల్‌ జైమిని స్విగ్గీకి చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నాడు. స్విగ్గీ కన్నా ముందు శ్రీహర్ష, నందన్‌ రెడ్డి ఓ వైఫల్యాన్నీ చవిచూశారు. వీరిద్దరూ తొలుత బండిల్‌ టెక్నాలజీస్‌ పేరుతో ఓ సంస్థను పెట్టారు. అది విఫలమైంది. తర్వాత ఏమిటని ఆలోచిస్తున్న క్రమంలో ఫుడ్‌ డెలివరీ రంగంలో మంచి అవకాశాలు కన్పించాయి. తొలి యత్నంలో విఫలమైన అనుభవంతో పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. రాహుల్‌తో కలిసి 2014 ఆగస్టులో బెంగళూరులో 25 రెస్టరెంట్లతో ఒప్పందం కుదుర్చుకుని, ఆరుగురు డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌తో స్విగ్గీని ప్రారంభించారు. రాహుల్‌ మింత్రాలో ఉద్యోగం నుంచి బయటకు వచ్చి కొత్త అవకాశాలకోసం వెదుకుతున్న క్రమంలో ఈ ముగ్గురికీ పరిచయమైంది.

స్విగ్గీ... ఏమిటిది?
స్విగ్గీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఫుడ్‌ డెలివరీ ఆప్‌. ఫోన్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మనకు కావలసిన రెస్టరెంట్‌ నుంచి ఆహారపదార్థాలను ఆర్డరిస్తే నిమిషాల్లో వేడి వేడిగా వాటిని మన ఇంటికి చేరుస్తారు స్విగ్గీ సిబ్బంది. ఈ వ్యవహారమంతా నడపడానికి స్విగ్గీ సొంతంగా తయారుచేసుకున్న ఆప్‌లు ఉన్నాయి. ఆహారపదార్థాల డెలివరీ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న రెస్టరెంట్లకూ, సిబ్బంది ఆర్డర్లను డెలివరీ చేయడానికీ, వినియోగదారులు ఆర్డర్లు ఇవ్వడానికీ... వేర్వేరు ఆప్‌లు ఉన్నాయి.

వినియోగదారు పదార్థాలు ఆర్డరు చేయగానే సంబంధిత రెస్టరెంట్‌కీ, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కీ కూడా సమాచారం వెళ్తుంది. ఆర్డర్‌ తీసుకున్న రెస్టరెంట్‌ సిబ్బంది ఆ పదార్థాలను సిద్ధం చేస్తారు. ఏ హోటల్‌నుంచి పదార్థాలు తీసుకెళ్లి ఎక్కడ ఇవ్వాలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కి తెలుస్తుంది. అతను హోటల్‌కు చేరుకుని నిర్ణీత సమయంలో ఆహారపదార్థాలను వినియోగదారుకు చేరవేస్తాడు. ఈ పని వల్ల స్విగ్గీకేమిటి లాభం అంటే... అటు రెస్టరెంట్లనుంచి కమిషనూ ఇటు వినియోగదారులనుంచి డెలివరీ చార్జిలనూ సంస్థ వసూలు చేస్తుంది.

‘చౌకగా, వేగంగా, సమర్థంగా... పనిచేస్తూ ఫుడ్‌ డెలివరీ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తేవడమే స్విగ్గీ లక్ష్యం. దేశంలో ఆతిథ్య రంగం చాలా వేగంగా విస్తరిస్తోంది. ఫుడ్‌ డెలివరీ ఆప్‌లు ఇప్పటికే కొన్ని ఉన్నాయి. ఇంకా వస్తాయి కూడా. అయితే సొంత డెలివరీ సిబ్బంది ఉన్న స్విగ్గీ వాటన్నిటికన్నా భిన్నంగా, సమర్థంగా సేవలందించడంలో ముందుంటుంది...’ అంటారు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీహర్ష.

స్విగ్గీలో ప్రస్తుతం 20 వేలమంది డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్యను లక్షకు పెంచాలన్నది సారథుల ఆశయం. సంస్థ నిర్వహణకు నిధులను వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల నుంచి సేకరించారు. ఆహార పదార్థాలకు సంబంధించిన స్టార్టప్‌లు నిధుల సేకరణలో ఎప్పుడూ చివరివరసలో ఉండేవి. కానీ స్విగ్గీకి పెద్ద ఎత్తున నిధులు అందడం సంస్థ విశ్వసనీయతను చాటుతోంది. త్వరగా అభివృద్ధి చెందాలన్న ఆత్రుతతో పలు కంపెనీలు చేసే పొరపాటు సేవల నాణ్యతపై దృష్టిపెట్టకపోవడం. స్విగ్గీ ఆ పొరపాటు చేయలేదు. అందుకే 80 శాతం వినియోగదారులు మళ్లీ మళ్లీ సేవలందుకోడానికి ముందుకొస్తున్నారు. స్విగ్గీ ఆప్‌ పది లక్షల డౌన్‌లోడ్లతో దూసుకుపోతోంది. భవిష్యత్తులో హోటళ్లూ, రెస్టరెంట్లలో మామూలు విక్రయాలకన్నా ఆన్‌లైన్‌ విక్రయాలే ఎక్కువ ఉంటాయన్న మార్కెట్‌ నిపుణుల అంచనా నేపథ్యంలో స్విగ్గీకి ఉజ్వల భవిష్యత్తు కన్పిస్తోంది కదూ!


 

గూగుల్‌ అసలు పేరు ఏంటంటే...

గూగుల్‌, యాహూ, బ్లాక్‌బెర్రీ, పెప్సీకో... ఇలా వివిధ రంగాల్లో మనకు సుపరిచితమైన సంస్థలు చాలానే ఉన్నాయి. కానీ వాటిని మొదలుపెట్టినప్పుడు మాత్రం ఆ సంస్థల పేర్లు వేరు. మరి ఆ సంస్థల అసలు పేర్లేంటి, ఇప్పుడున్న పేరు ఎలా వచ్చిందిలాంటి విషయాలపై ఓ లుక్కేద్దాం!

గూగుల్‌-బ్యాక్‌రబ్‌
గూగుల్‌... సెర్చ్‌ ఇంజిన్‌ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న ఈ సంస్థపేరు తెలియని వారుండరు. కానీ గూగుల్‌ మొట్టమొదటి పేరు మాత్రం ఇది కాదట. దీని వ్యవస్థాపకులు లారీ పేజ్‌, సర్గీబ్రిన్‌లు సెర్చ్‌ఇంజిన్‌ ప్రోగ్రామింగ్‌ మీద స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సీటీలో కలిసి పనిచేస్తున్నప్పుడు దాని పనితీరును బట్టి తమ సంస్థకు బ్యాక్‌రబ్‌ అని పేరు పెట్టారట. అంటే ఒక వెబ్‌సైట్‌ ఎంత ప్రధానమైనదీ, ఇలాంటి వేరే వెబ్‌సైట్ల లింకులు ఏమిటీ లాంటి బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ చేసేదట వీళ్ల ప్రోగ్రామింగ్‌. కాబట్టి స్టాన్‌ఫోర్డ్‌లో ‘బ్యాక్‌రబ్‌’ పేరుతో ఓ సెర్చ్‌ ఇంజిన్‌ను నడిపారట కూడా. ఏడాది తర్వాత తమ సంస్థ చేసే పనులు విస్తరిస్తుండటంతో ఆ పేరు దీనికి సరిపడలేదని భావించి అక్కడి విద్యార్థులతో మేధోమథన కార్యక్రమం నిర్వహించి, ఒకటి తర్వాత 100 సున్నాలు అని అర్థమొచ్చే గణిత పదం గూగోల్‌ నుంచి గూగుల్‌.కామ్‌ అని వెబ్‌సైట్‌కు పేరు పెట్టారు.

పెప్సి - బ్రాడ్స్‌ డ్రింక్‌
శీతల పానీయాల సంస్థల్లో బాగా పేరుపొందిన, దాదాపు మనందరం రుచి చూసిన పెప్సి డ్రింక్‌ తయారీ సంస్థ మొదటి పేరు బ్రాడ్స్‌ డ్రింక్‌. ఒక డ్రగ్‌ కంపెనీలో దీన్ని తయారు చేసిన వ్యక్తి కాలెమ్‌ బ్రాడ్‌హామ్‌ తన పేరు మీదుగా ఈ పానీయాన్ని అమ్మడం మొదలు పెట్టాడట. తొలుత తన దుకాణానికి వచ్చే వినియోగదారులను ఆకర్షించేందుకు ఎండాకాలంలో దీన్ని తయారు చేసినా, తర్వాత తర్వాత ఆ పానీయం కోసమే జనం రావడం మొదలు పెట్టారట. ఐదేళ్లు గడిచే సరికి ఈ పానీయంలో తను అనుకున్న రిఫ్రెష్‌మెంట్‌ని మించి ఇంకా ఏదో ఉందని నమ్మిన బ్రాడ్‌ దీని పేరు మార్చాలనుకున్నాడు. ఈ పానీయాన్ని కోలా గింజల సారం, వెనీలా, కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలను కలిపి తయారు చేశారట. కడుపుబ్బరం తదితర లక్షణాలను డిస్‌పెప్సియా అని పిలుస్తారు. కోలా గింజల సారంతో చేసే ఈ ద్రావణం కడుపుబ్బరాన్ని తగ్గించడానికి కూడా సాయపడుతోంది కాబట్టి దీనికి పెప్సి అనే పేరును పెట్టారట.

నైక్‌ - బ్లూరిబ్బన్‌
ప్రముఖ బహుళజాతి సంస్థ నైక్‌ మొట్టమొదటి పేరు బ్లూరిబ్బన్‌ స్పోర్ట్స్‌. 1964లో మొదలైన ఈ సంస్థ తొలుత జపాన్‌ షూ కంపెనీ ఒనిట్సుకా టైగర్‌కు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసేది. కాలం గడిచే కొద్దీ సంస్థల మధ్య సఖ్యత తగ్గడంతో బ్లూరిబ్బన్‌ అక్కడి నుంచి వైదొలగి గ్రీకు దేవత పేరు మీదుగా విజయం అనే అర్థం వచ్చేలా నైక్‌ అనే సొంత పేరుతో ఉత్పత్తిని మొదలు పెట్టింది.

సోనీ - టోక్యో సుషిన్‌ కోగ్యో
సోనీ సంస్థ మొట్టమొదట టోక్యో దగ్గరి ఓ వూళ్లొ 1946లో రేడియోలు బాగు చేసే షాపుగా మొదలైంది. దాని పేరు టోక్యో సుషిన్‌ కోగ్యో. మసారు ఇబుకా, అకియో మోరిటాలు స్థాపించిన ఈ సంస్థ తర్వాత జపాన్‌లోనే మొట్టమొదటి ట్రాన్సిస్టర్‌ రేడియో, ట్రాన్సిస్టర్‌ టీవీలను తయారు చేసింది. 1958లో తమ సంస్థకు లాటిన్‌లోని సోనస్‌ అనే పదం నుంచి శబ్దం అనే అర్థం వచ్చేలా సోనీ అనే పేరును పెట్టుకున్నారు.

పానాసోనిక్‌-మాత్‌సుషీత ఎలక్ట్రానిక్స్‌
ఎలక్ట్రానిక్స్‌ సంస్థ పానాసోనిక్‌ పేరు 2008 వరకూ మాత్‌సుషీత ఎలక్ట్రిక్‌ ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్‌గానే ఉంది. ఆ సమయంలో కూడా కొన్ని రకాల ఉత్పత్తుల్ని పానాసోనిక్‌ అనే పేరుతోనే విక్రయించేదీ సంస్థ. అయితే 2008 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థకు సంబంధించిన ఉత్పత్తులన్నింటికీ ఒకే పేరు ఉండాలన్న ఉద్దేశంతో పానాసోనిక్‌ను తమ సంస్థ పేరుగా మారుస్తున్నట్టు ప్రకటించారు.

బ్లాక్‌బెర్రీ - రీసెర్చ్‌ ఇన్‌ మోషన్‌
చాలా మందికి ఫేవరెట్‌ ఫోన్‌ అయిన బ్లాక్‌బెర్రీ సంస్థ మొదటి పేరు రీసెర్చ్‌ ఇన్‌ మోషన్‌. తమ సంస్థ తయారు చేసే ఫోన్ల మీటలు బ్లాక్‌బెర్రీ పండులోని ఉబ్బెత్తు భాగాల్ని తలపిస్తాయన్న ఆలోచనతో కంపెనీ పేరునే బ్లాక్‌బెర్రీగా మార్చుకున్నారు. 2013 సంవత్సరం దాకా ఈ సంస్థ పేరు రీసెర్చ్‌ ఇన్‌ మోషన్‌గానే ఉంది. అయితే మార్కెట్లో ఉన్న విపరీతమైన పోటీని తట్టుకునేందుకు ఉత్పత్తితో పాటూ జనాన్ని ఆకర్షించేందుకు ఇలా పేరును మార్చుకుందీ సంస్థ.

ఇవేకాదు, తమ సంస్థ పేర్లను వివిధ కారణాల వల్ల మార్చుకున్న పేరున్న సంస్థలు ఇంకా చాలానే ఉన్నాయి. ప్రఖ్యాత సెర్చ్‌ ఇంజిన్‌ యాహూ మొదటి పేరు జెర్రీ అండ్‌ డేవిడ్స్‌ గైడ్‌ టు ద వరల్డ్‌ వైడ్‌ వెబ్‌, బెస్ట్‌ బై పాత పేరు సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌, ఈబేకు ఇంతకు ముందు పేరు ఆక్షన్‌వెబ్‌, స్నిక్కర్స్‌ వెనకటి పేరు మారథాన్‌, మాస్టర్‌కార్డ్‌ తొలి పేరు మాస్టర్‌ ఛార్జ్‌, ఐబీఎమ్‌ పాత పేరు కంప్యూటింగ్‌ టేబ్యులేటింగ్‌ రికార్డింగ్‌ కార్పొరేషన్‌, ప్లేబాయ్‌కి మొదట్లో స్టాగ్‌పార్టీ అనే పేరూ ఉండేవి.


ఇంకా..

జిల్లా వార్తలు