close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వూరు మారినా ఉనికి మారునా...

వూరు మారినా ఉనికి మారునా...
- శ్రీమతి చంద్రికాశేఖర్‌

మయం 11 గంటలు కావస్తోంది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏసీ గదిలో మెత్తని పక్కమీద దొర్లుతున్న వీరయ్యకు అసహనంగా ఉంది. గది చాలా చల్లగా, పక్క మెత్తగా ఉన్నా, ఆయనకి స్థిమితంగా లేదు. కాసేపు అటూఇటూ దొర్లి విసుగ్గా లేచి ఏసీ ఆఫ్‌ చేసి బాల్కనీలోకి నడిచాడు. అక్కడున్న కుర్చీలో కూర్చుని దృష్టి కిందకి సారించాడు. హైదరాబాద్‌లోని ఒకానొక పోష్‌ ఏరియాలో అతి రద్దీగా ఉండే మెయిన్‌రోడ్‌ అది. అక్కడ ఉన్న అనేక అపార్ట్‌మెంటుల్లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నాలుగో ఫ్లోరులోని ఫ్లాట్‌ అది. సకల సౌకర్యాలున్న ఆ ఫ్లాట్‌ని కొడుకు రవీంద్ర, కోడలు యామిని ఏడాదికిందట కొనుక్కున్నారు.

రోజులో సగభాగం వీరయ్య గడిపేది అక్కడే. కిందకి చూస్తే చీమలబారుల్లా జనం, అతి వేగంగా వెళ్లే వాహనాలు. మొదట్లో ఆయనకి చాలా గాభరాగా ఉండేది. ఇప్పుడు కొద్దిగా అలవాటుపడ్డాడు. కానీ, ఇక్కడ ఎవరి జీవితాలు వారివి, ఎవరి దినచర్య వారిది. కాలంతోపాటుగా సాగాలంటే ఆ ఉరుకులు, పరుగులు తప్పవు మరి! చిన్నగా నిట్టూర్చాడతను. కొడుకూ కోడలు కూడా అంతే, ఉదయం 9 గంటలకు ఎవరి కారులో వారు వెళ్ళిపోతారు. సాయంత్రం రవీంద్రే ముందుగా వస్తాడు. యామిని ఆఫీసు చాలా దూరం. ఆమె ఇంటికి వచ్చేసరికి 8 గంటలు దాటుతుంది.

అప్పుడు ఓపికగా ఉంటే వంట చేస్తుంది, లేదా ఫుడ్‌ సెంటర్‌కి ఆర్డరిచ్చి పుల్కాలు తెప్పించుకుంటారు. తనకు వూళ్ళొ మూడుపూటలా సుష్ఠుగా అన్నమే తినడం అలవాటు. కానీ, తన ఒక్కడి కోసం అన్నం వండమని అడగలేడు. ఒక గంట కూర్చున్నాక వేడిగా అనిపించి హాల్లోకి నడిచి టీవీ ఆన్‌ చేశాడు. ఛానెల్స్‌ అన్నీ మారుస్తున్నా, అతనికి ఏదీ చూడాలనిపించడం లేదు. అతనికి టీవీ చూడటం పెద్దగా అలవాటు లేదు. ఇంట్లో టీవీ ఉన్నా తన భార్యే ఎక్కువగా చూస్తూండేది. అతని ఆలోచనలు వూరి మీదకు మళ్ళాయి. వూళ్ళొ ఉంటే ఈసరికి తమ పొలంలో ఉండేవాడు. పాలేర్లకు పనులు పురమాయిస్తూ, తనూ పనిచేస్తుంటే సమయమే తెలిసేది కాదు. అటునుండి మధ్యాహ్నానికి కొబ్బరితోటకు చేరుకునేవాడు. అలివేలు క్యారేజీ తీసుకువచ్చేది. అందరూ కలిసి కబుర్లాడుకుంటూ భోజనం చేసేవారు. అసలు తనకు ఏ రోజూ ఖాళీగా కూర్చోవడమే తెలియదు. అలాంటిది ఈ నెలరోజుల నుండీ ఖాళీగా తిని కూర్చోవాలంటే ప్రాణం మీదకి వచ్చినట్లుగా ఉంది. పని చేస్తూంటేనే తనకు హుషారుగా ఉంటుంది. ఖాళీగా ఉంటే నీరసంగా ఉంటుంది.

పొద్దున్నే లేచి పశువుల పాలు పితికి, స్నానంచేసి, చద్దన్నం తిని, పొలానికి వెళితే మళ్ళీ చీకటిపడ్డాకే ఇల్లు చేరడం. మళ్ళీ స్నానం చేసి రాత్రివేళ అలా సర్పంచ్‌ రాఘవయ్య ఇంటివైపు వెళితే అక్కడ ఆయన ఇంటి అరుగులమీద స్నేహితులంతా చేరేవారు. అందరూ కలిసి లోకాభిరామాయణంలో మునిగిపోతే టైమే తెలిసేది కాదు. సర్పంచ్‌ కూడా తన మిత్రుడే, చిన్నప్పటి నుండి తమతో కలిసి పెరిగినవాడే. అలా ఓ రెండు గంటలు గడిపి ఇల్లు చేరేసరికి, అలివేలు పని ముగించుకుని నవ్వుతూ ఎదురొచ్చేది. ఇద్దరూ కలిసి వేడివేడి అన్నం తిని, ఇంటిముందు మామిడిచెట్టు కింద మంచాలు వాల్చుకుని కబుర్లు చెప్పుకుంటూ ఏ జాముకో నిద్రపోయేవారు. అలివేలు హఠాత్తుగా మరణించడంతో తన జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఒంటరిగా మిగిలిపోయాడు.

టైమ్‌ ఒంటిగంట కావస్తోంది. ఆకలిగా అనిపించి డైనింగ్‌టేబుల్‌ దగ్గర కూర్చుని భోజనం వడ్డించుకున్నాడు. ముద్ద గొంతులోకి దిగడం లేదు. కోడలు వంట బాగానే చేస్తుంది కానీ, సిటీలో పెరిగిన పిల్ల కావడంతో ఉప్పూకారాలూ, మసాలాలూ చాలా తక్కువగా వాడుతుంది. తనకేమో మొదటినుండీ గొడ్డుకారాలు అలవాటు. కానీ ఏ రోజూ ఆరోగ్య సమస్య రాలేదు. రవీంద్రకీ, యామినికీ ఇద్దరికీ గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ ఉంది. తమ వూరినుండి తెచ్చుకున్న పచ్చళ్ళు అయిపోయాయి, కోడలు పచ్చళ్ళు చేయదు.

కూర సహించక పక్కకు నెట్టి సాంబారు పోసుకున్నాడు. ‘ఇంకా కొద్దిగా పోసుకోండి, సరిగ్గా తినండి, ఏమిటా తిండి?’ పక్కన కూర్చుని అలివేలు దబాయిస్తున్నట్లే ఉంది. తను తింటూంటే కొసరికొసరి వడ్డించేది. కళ్ళు చెమర్చాయి. ఇక తిండి సహించక పెరుగు వేసుకుని తిని లేచాడు. చెయ్యి కడుక్కుని బెడ్‌రూమ్‌లోకి నడిచి మంచంమీద వాలాడు.

ఒంటరితనం అతన్ని దహించి వేస్తోంది. పల్లెటూళ్ళొ పదిమంది మధ్య మాట్లాడుతూ తిరిగే వీరయ్యకు సడెన్‌గా మూగవాడైనట్లు అనిపిస్తోంది. మనసారా మాట్లాడటానికి తహతహలాడుతున్నాడు. సాయంత్రం వచ్చాక ‘నాన్నా, భోజనం చేశావా... మామయ్యా, టీ తాగారా?’ లాంటి రొటీన్‌ ప్రశ్నలు తప్ప వారికి వీరయ్యతో మాటలేం ఉంటాయి! డిన్నర్‌ చేస్తూ కూడా వారిద్దరూ ఆఫీసు విషయాలే చర్చించుకుంటారు. సెలవురోజు వస్తే ఎవరి ల్యాప్‌టాప్‌లో వారు తలదూరుస్తారు. చుట్టూ ఉన్న ఫ్లాట్‌లలో ఎవరు ఉంటారో కూడా వీరయ్యకి తెలియదు. వారితో మాట్లాడదామనుకున్నా, కొడుకు తలుపు తీసి బయటకు రావద్దని గట్టిగా చెప్పాడు. ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు వీరయ్య.

వీరయ్యది గోదావరి జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరు. వూహ తెలిసిననాటి నుండీ అతనికి ఆ వూరు తప్ప వేరే వూరు తెలియదు. తల్లిదండ్రులకు అతనొక్కడే సంతానం. ఆ వూరి గవర్నమెంటు స్కూలులో పది వరకూ చదివి, ఆపై తండ్రితోపాటు పొలానికి వెళుతూ పనిలోని మెలకువలు నేర్చుకున్నాడు. అతనికి 20 ఏళ్ళు నిండేసరికి వ్యవసాయాన్ని పూర్తిగా తన చేతిలోకి తీసుకుని తండ్రికి విశ్రాంతి ఇచ్చాడు. ప్రయోజకుడైన కొడుక్కి తమ దూరపు బంధువులమ్మాయి అలివేలునిచ్చి పెళ్ళిచేసి, ఒకరి తర్వాత ఒకరు ఇద్దరూ తనువు చాలించారు. 16 ఏళ్ళ వయసులో అతని జీవితంలో అడుగుపెట్టిన అలివేలు, వీరయ్యకు అన్నీ తానే అయింది. వారిద్దరి బంధువులూ ఆ వూళ్ళొనూ చుట్టుపక్కలానే ఉన్నారు. అందుకనే ఎప్పుడో ఎరువులు కొనడానికి తప్ప పట్నం వెళ్ళేపని కూడా లేదు. అతని జీవితం మొత్తం పల్లెతోనే ముడిపడిపోయింది.

తండ్రి అతనికి మిగిల్చిన ఆస్తి పాత వసారా ఇల్లు, మూడెకరాల పొలం, కొబ్బరితోట. వాటితోనే వారి జీవితం ఆనందంగా గడిచిపోయేది. అలివేలు కూడా ఉన్నదాంట్లో సంతోషంగా సర్దుకుపోయేది. పెళ్లైన ఆరేళ్ళకు రవీంద్ర కడుపులోపడ్డాడు. కాన్పు సమయంలో తలెత్తిన సమస్య వలన అలివేలుకి ఇక పిల్లలు కలగరని డాక్టర్లు తేల్చారు. రవీంద్రే వారి జీవితాలకు వెలుగు అయ్యాడు. తను పెద్దగా చదువుకోకున్నా, వీరయ్యకి చదువంటే చాలా ఇష్టం. రవీంద్రని బాగా చదివించాలని అతని చిన్నప్పుడే నిర్ణయించుకున్నాడు.

వారి ఆశలకు తగ్గట్టుగానే రవీంద్ర చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. గవర్నమెంట్‌ స్కూలులో టెన్త్‌ మంచి మార్కులతో పాస్‌ అయిన రవీంద్రను స్కూలు టీచర్ల సలహా మేరకు టౌనులోని కార్పొరేట్‌ కాలేజీలో చేర్పించాడు వీరయ్య. అలా అంచెలంచెలుగా ఇంజినీరింగ్‌, ఎంబీఏ పూర్తిచేసిన రవీంద్రకి హైదరాబాద్‌లోని పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీలోనే కష్టించి పనిచేసి మూడేళ్ళలోనే మంచి స్థాయికి చేరుకున్నాడు రవీంద్ర. వూరివారంతా రవీంద్రను పొగుడుతుంటే సంతోషంగా పొంగిపోయారు అలివేలు, వీరయ్య. స్థిరపడిన కొడుక్కి పెళ్ళి చేయదలిచారు. నెమ్మదిగా తన కొలీగ్‌ అయిన యామినిని ప్రేమిస్తున్న విషయం వారి చెవినవేశాడు రవీంద్ర. కొడుకు సంతోషమే తమ సంతోషంగా భావించిన వారు ఆనందంగా వారి పెళ్ళి చేశారు. యామిని కుటుంబం ఎన్నో ఏళ్ళక్రితం బొంబాయిలో స్థిరపడిపోయారు. ఆమె పుట్టిపెరిగింది అంతా అక్కడే. అయినా కూడా ఆమె అత్తమామలతో చక్కగా కలిసిపోయింది.

పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో కాపురం పెట్టారు రవీంద్ర, యామిని. వారి కోరిక మేరకు హైదరాబాద్‌ వెళ్ళి 15 రోజులు వారితో గడిపివచ్చారు వీరయ్య దంపతులు. యామిని కూడా వారిని సొంత తల్లిదండ్రుల్లాగే ఆదరించింది. రోజులు ఆనందంగా సాగిపోతుంటే సడెన్‌గా ఏదో విషజ్వరం వచ్చి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూండగానే విషమించి అలివేలు కన్నుమూసింది. ఒంటరిగా మిగిలిన తండ్రిని తమతో తీసుకువచ్చారు రవీంద్ర దంపతులు.

* * *

సాయంత్రం 5 గంటలకు పనిపిల్ల కాలింగ్‌బెల్‌ కొడుతుంటే వీరయ్యకి మెలకువ వచ్చింది. ఒళ్ళంతా నొప్పులుగా, తలంతా భారంగా ఉన్నట్లు తోచింది. నెమ్మదిగా లేచి తలుపుతీసి హాల్లో కూర్చున్నాడు. పనిపిల్ల గిన్నెలు కడిగేసి, బట్టలు మడతేసి, టీ పెట్టి వీరయ్యకు ఇచ్చి తాను కూడా తాగి వెళ్ళింది. టీ తాగాక తలభారం కాస్త తగ్గినట్లనిపించింది. తలుపులు వేసి హాల్లోనే సోఫాలో పడుకున్నాడు.

ఏడున్నరకు వచ్చిన రవీంద్ర, తలుపు తీసిన తండ్రిని చూస్తూనే ‘‘ఏం నాన్నా, నీరసంగా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా?’’ అంటూనే నుదుటి మీద చేయివేసి చూశాడు. ఒళ్ళు వేడిగా ఉంది. ‘‘అయ్యో, జ్వరంగా ఉన్నట్లుంది’’ అంటూనే, తండ్రిని పడుకోబెట్టి తన రూమ్‌లోకి వెళ్ళి టాబ్లెట్‌ తెచ్చి వేశాడు. అలాగే గదిలో ముడుచుకుని పడుకున్నాడు వీరయ్య. ఫ్రెషప్‌ అయి వచ్చిన రవీంద్ర హాల్లోనే టీవీ చూస్తూ కూర్చున్నాడు. పది నిమిషాలకు ఒకసారి గదిలోకి వెళ్ళి తండ్రిని పలకరిస్తూనే ఉన్నాడు. గంట తర్వాత వచ్చిన యామిని విషయం విని గదిలోకి వచ్చింది.

‘‘ఎలా ఉన్నారు మావయ్య, జ్వరం తగ్గిందా’’ ఆదుర్దాగా నుదుటిపై చేయి వేస్తూ అడిగింది యామిని.

‘‘ఫర్వాలేదమ్మా, తగ్గింది’’ నీరసంగానే అన్నాడు వీరయ్య. ఆ రాత్రి వీరయ్యకు వేడివేడి ఇడ్లీపెట్టి కాసిని పాలు తాగించింది యామిని. జ్వరం తగ్గింది కానీ వీరయ్యకు మనసంతా బెంగగా, దిగులుగా ఉంది. రవీంద్ర తన దగ్గరే పడుకుంటానన్నా వద్దని వారించాడు. పదేపదే తన వూరూ, తన ఇల్లూ, తనవాళ్ళూ గుర్తొస్తున్నారు వీరయ్యకు. భార్యా వియోగం ఆయనని బాగా బాధిస్తోంది. ఏరోజూ కంటనీరు పెట్టని వీరయ్య ఆ రాత్రంతా భార్యను తలచుకుని ఏడుస్తూనే ఉన్నాడు. ‘అలివేలూ, నన్ను ఒంటరిగా వదిలి ఎందుకు వెళ్ళావు, నన్ను కూడా నీ దగ్గరకు తీసుకుపో’ అంటూ రోదించాడు. తెల్లవారుజాముకి మళ్ళీ జ్వరం ఎక్కువైపోయింది వీరయ్యకి.

తెల్లవారింది. 7 గంటలకు లేచి మామగారి గదిలోకి వచ్చిన యామిని అదిరిపడింది. జ్వర తీవ్రతతో, అపస్మారకంలో మూలుగుతున్నాడు వీరయ్య. గబగబా రవీంద్రను లేపింది యామిని. తండ్రి పరిస్థితి చూసి వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళితే మంచిదనుకున్నాడు రవీంద్ర. వెంటనే తన ఫ్రెండైన డాక్టర్‌ ఆనంద్‌కి ఫోనుచేసి అంబులెన్స్‌ పంపమని అడిగాడు. పావుగంటలో అంబులెన్స్‌ వచ్చింది. వారు వెళ్ళేసరికి ఆనంద్‌ కూడా వచ్చాడు. ఐసీయూలో అడ్మిట్‌చేసి ట్రీట్‌మెంట్‌ మొదలుపెట్టారు.

యామినిని లీవ్‌ పెట్టవద్దని, తానే దగ్గరుండి తండ్రిని చూసుకుంటానని చెప్పి పంపేశాడు రవీంద్ర. గంటలో వీరయ్యకి జ్వరం కంట్రోల్‌ అయింది. హమ్మయ్య, ఇక ఫర్వాలేదు అనుకుని ఇంటికి వెళ్ళి, ఫ్రెషప్‌ అయి మళ్ళీ హాస్పిటల్‌కి వచ్చాడు రవీంద్ర. అప్పటికి వీరయ్యకి బాగా మెలకువ వచ్చింది.

‘‘ఎలా ఉంది నాన్నా’’ తండ్రి చేయి పట్టుకుని ప్రేమగా అడిగాడు రవీంద్ర. బదులుగా చిన్నగా నవ్వి, నీరసంగా తలూపాడు వీరయ్య. ఆ రోజల్లా తండ్రిని కనిపెట్టుకుని హాస్పిటల్లోనే ఉండిపోయాడు రవీంద్ర. యామిని కూడా సాయంత్రం నేరుగా అక్కడికే వచ్చింది. ఇక ఫర్వాలేదు, రేపు సాయంత్రం డిశ్చార్జి చేసేస్తాను అన్నాడు ఆనంద్‌. కానీ, మళ్ళీ ఆ రాత్రి వీరయ్యకు తీవ్రంగా జ్వరం వచ్చింది. అపస్మారకంలోకి వెళ్ళి ఏదేదో కలవరిస్తున్నాడు. రవీంద్రకి ఏమీ పాలుపోవడం లేదు. వెంటనే ఇంజక్షన్స్‌ చేశాడు ఆనంద్‌. రవీంద్రకి ధైర్యం చెప్పాడు. తండ్రి చేతిని పట్టుకుని పక్కనే కూర్చున్నాడు రవీంద్ర. అతనికి వూహ తెలిశాక తండ్రిని ఎప్పుడూ ఆ పరిస్థితిలో చూడలేదు. కడుపునిండా తినడం, కష్టపడి పనిచేయడం మాత్రమే తెలుసు అతనికి. ఎప్పుడన్నా ఏ జలుబో, జ్వరమో వచ్చినా ఒక్కపూట మాత్రం విశ్రాంతిగా ఉండేవాడు. మళ్ళీ వెంటనే లేచి పొలానికి వెళ్ళిపోయేవాడు.

నర్స్‌ మధ్యలో వచ్చి చూస్తూనే ఉంది. అర్ధరాత్రి అయింది, అంతా నిశ్శబ్దంగా ఉండటంతో తండ్రి మాట ఇప్పుడు కొద్దిగా స్పష్టంగానే వినపడుతోంది రవీంద్రకి. ‘‘రాఘవయ్యా, సర్పంచ్‌వి అయి ఉండీ, ఆ రోడ్లు గురించి పట్టించుకోవేమిటయ్యా? ఈసారి మన వూరికి రోడ్డు మంజూరయ్యేలా ఎమ్మెల్యేగారితో గట్టిగా మాట్లాడాలి. ఏం నరసయ్య బావా, తమ్ముడితో ఆస్తి గొడవలటగా... చిన్నవాడు, అతనికి తెలీకుంటే మనమే సర్దిచెప్పాలి. ఏరా, వెంకన్నా, ఆరోగ్యం బాగాలేదుట, ఇప్పుడెలా ఉంది? ఇదుగో అలివేలూ, రాజారావుగారి అబ్బాయి రేపు హైదరాబాద్‌ వెళుతున్నాడట, అరిసెలూ, సున్నుండలూ చెయ్యి- అబ్బాయికి పంపుదాం. ఆ వెళ్ళేది గొవిందం కదూ, ఓరోరి పట్నంవెళ్ళి భలేగా మారిపోయాడే’’ ఇలా పొంతనలేకుండా సాగుతున్నాయి కలవరింతలు.

నిశ్చేష్టుడై వింటున్నాడు రవీంద్ర. తండ్రి మనసేమిటో అతనికి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. అతనిలో పశ్చాత్తాపం మొదలయింది. తను ఎంత పొరపాటు చేశాడు, తండ్రిని బాగా చూసుకోవాలనే తాపత్రయంలో ఆయన మనసును అర్థంచేసుకోకుండా ఆ వూరి నుండీ, ఆప్తుల నుండీ దూరంచేసి ఆయనను అనారోగ్యం పాలుచేశాడు. తన వివేకం ఏమయింది? ఆ వూరితో ఆయనకున్న అనుబంధాన్ని అర్థం చేసుకోకుండా, తన దగ్గర పంజరంలో బంధించి ఎంత కష్టపెట్టాడు! ఆయనను తన దగ్గరే ఉంచుకుని చూసుకోవడం తన బాధ్యత అనుకున్నాడేగానీ, ఆయన సంతోషం ఎక్కడ ఉందో అర్థంచేసుకోలేకపోయాడు. ఆయనకు ఆ వూరు తప్ప వేరే ప్రపంచం తెలీదు. భార్యకు దూరమై బాధపడుతున్న ఆయనను ఆ వూరికి కూడా దూరం చేశాడు. మొక్కను అది సహజంగా భూమి నుండి మొలిచినచోటే నీళ్ళుపోసి పెంచాలి. దాని వేర్లు పీకి వేరొకచోట నాటి, నీళ్ళుపోసినా అది వాడిపోదూ! రాత్రంతా ఆలోచించిన రవీంద్ర ఒక నిర్ణయానికి వచ్చాడు.

కాసేపటికి వీరయ్య జ్వరం తగ్గి నిద్రలోకి జారుకున్నాడు. ఒక గంట పడుకుని లేచాడు రవీంద్ర. ఆసరికి తెల్లవారవస్తోంది. సెల్‌ తీసుకుని బాల్కనీలోకి నడిచి యామినితో అరగంట మాట్లాడాడు. ఆ తరువాత తమ వూరిలోని కొందరు బంధువులతోనూ, సర్పంచ్‌తోనూ కూడా మాట్లాడాడు. అందరూ అతని నిర్ణయాన్ని హర్షించారు.

మరో రెండురోజులు హాస్పిటల్లోనే ఉండి డిశ్చార్జ్‌ అయ్యాడు వీరయ్య. ఇంటినుండి ఆయన బట్టలు తెప్పించి కారు డిక్కీలో సర్దించాడు రవీంద్ర. నెమ్మదిగా వీరయ్యను తీసుకువచ్చి కారు వెనుక సీట్లో పడుకోబెట్టాడు. తలకింద దిండు ఎత్తుపెట్టి, విండోస్‌ క్లోజ్‌ చేసి బయలుదేరాడు. కొడుకు తనను ఎక్కడికో తీసుకెళ్తున్నాడని అర్థమైంది వీరయ్యకి. కారు మధ్యాహ్నానికి విజయవాడ చేరింది. అక్కడ ఒక హోటల్‌ దగ్గర ఆపి తండ్రికి ఇడ్లీ పెట్టించి, గ్లాసు పాలు తాగించాడు. తర్వాత తాను కూడా భోజనం చేసి తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు.

కారు ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు మీదుగా ప్రయాణించి సిద్ధాంతం బ్రిడ్జిని దాటి రావులపాలెంలోకి ప్రవేశించి అక్కడి నుండి ర్యాలీ వెళ్ళే రోడ్డుకు తిరిగింది. ఆ రోడ్డులో 2 కిలోమీటర్లు ప్రయాణించాక ఎడమవైపుకి తిరిగింది. పచ్చని అరటిచెట్లూ, దట్టమైన కొబ్బరితోటల మధ్యలోని వూబలంక వారి వూరు. అప్పటికే నిద్రలేచిన వీరయ్య కిటికీలో నుండి బయటకు చూస్తున్నాడు. ఆ పరిసరాలు గుర్తుపడుతూనే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మిర్రర్‌లో నుండి తండ్రి ముఖంలో కనపడే మార్పులను గమనిస్తున్నాడు రవీంద్ర.

వూరిలోకి ప్రవేశించిన కారు పంచాయితీ ఆఫీసు, స్కూలు దాటి కుడివైపుకి మలుపు తిరిగి రామాలయం దాటి సరాసరి ఆ రోడ్డుకు చివరనున్న విశాలమైన పెంకుటింటి ముందు ఆగింది. ఆసరికి టైము 8 గంటలు కావస్తోంది. చల్లగాలికి వాకిళ్లలో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నవారంతా ఆ కారుని ఆసక్తిగా చూస్తున్నారు. కారు ఇంటిముందు ఆగుతూనే జనం బిలబిలా చుట్టుముట్టారు. సర్పంచ్‌ రాఘవయ్య, పక్కింటి కాంతం పిన్ని, వీరభద్రం బాబాయ్‌, ఎదురింటి సుబ్బాయమ్మ అత్త, పూజారి శేషాచార్యులుగారు, ఆయన భార్య, ఇంకా తండ్రి స్నేహితులు, దూరపు బంధువులు అందరూ ఉన్నారు. కారు దిగిన రవీంద్ర బ్యాక్‌డోర్‌ తీసి వీరయ్యని నెమ్మదిగా దింపాడు. పాలేరు వెంకన్న ముందుకు వచ్చి వీరయ్యను జాగ్రత్తగా పట్టుకుని లోపలకు నడిపించాడు.

కాలు నేలమీద మోపుతూనే వీరయ్యకు ఒళ్ళు పులకరించింది. తను మళ్ళీ ఈ ఇంటికి వస్తాననుకోలేదు. ఈ మట్టిని చూడకుండానే తాను మట్టిలో కలిసిపోతాననుకొన్నాడు. కళ్లలో నీళ్ళు తిరిగాయి వీరయ్యకి. తాము వస్తున్నట్లు రవీంద్ర ముందే ఫోన్‌ చేయడంతో ఇల్లంతా శుభ్రంచేసి ఉంచింది కాంతం పిన్ని. వసారాలో ఉన్న మంచంపైన తండ్రిని కూర్చోబెట్టాడు రవీంద్ర.

‘‘ఏం వీరయ్య బావా, అలా అయిపోయావు, అసలేమిటి అనారోగ్యం? అయ్యగారు వూరిమీద బెంగపెట్టుకున్నారా?’’ రకరకాల ప్రశ్నలు. రవీంద్రే అందరికీ సమాధానం చెబుతున్నాడు. వీరయ్య చిరునవ్వుతో అందరినీ చూస్తూ మౌనంగా కూర్చున్నాడు. కాసేపు మాటలు అయ్యాక, విశ్రాంతి తీసుకోమని చెప్పి అందరూ వెళ్ళిపోయారు.

ఈలోగా కాంతం పిన్ని వేడిగా ఫలహారం తీసుకొచ్చింది. ‘‘కాళ్ళూ చేతులూ కడుక్కుని టిఫిన్‌ తిని పడుకోండి రవిబాబూ, అలసిపోయున్నారు. పొద్దున్నే వస్తాను’’ అంటూ కాంతమ్మ పిన్ని వెళ్ళిపోయింది.

‘‘మీరు వెళ్ళి పడుకోండి నాన్నా, తలుపులు వేసి వస్తాను’’ అంటూ వాకిట్లోకి వెళ్ళాడు రవీంద్ర.

పడకగది దగ్గరకు నడిచిన వీరయ్య నెమ్మదిగా తలుపు తోసుకుని లోపలికి అడుగుపెట్టాడు. చుట్టూ పరికించి చూశాడు. ఆయన జీవితంలోని ఎన్నో ముఖ్యమైన జ్ఞాపకాలు ఆ గదితోనే ముడిపడి ఉన్నాయి. పందిరిమంచం మీద పడుకున్న వీరయ్యకి స్వర్గంలో అడుగుపెట్టినట్లే ఉంది. కిటికీలోనుండి చల్లని పైరగాలి పరామర్శిస్తున్నట్లు తాకింది. కిటికీ పక్కన మల్లెతీగ పలకరిస్తున్నట్లుగా చూస్తోంది. గోడమీద దండవేసి ఉన్న ఫోటోలో నుండి అలివేలు ‘వచ్చేశారా’ అని పలుకరిస్తున్నట్లుగా నవ్వుతోంది.

భార్య ఫొటోవైపే చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు వీరయ్య. లోపలకు వచ్చిన రవీంద్ర ప్రశాంతంగా నిద్రపోతున్న తండ్రిని చూశాడు. ‘రెండు రోజులక్రితం ఇదే సమయానికి ఎంత ఆందోళనగా ఉన్నాడు, ఈరోజున ముఖంలో ఎంత నిశ్చింత. ఇక తన తండ్రి ఆరోగ్యానికేం ఢోకాలేదు’ అనుకుంటూ పక్కనే మరో మంచం వాల్చుకున్నాడు రవీంద్ర. రోజల్లా డ్రైవ్‌చేసి ఉన్నాడేమో ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు రవీంద్ర.

పక్కింటివారి కోడి బిగ్గరగా కూయడంతో ఉలిక్కిపడి లేచాడు. సెల్‌లో టైమ్‌ చూస్తే 8 గంటలు అయింది. తండ్రి మంచంకేసి చూశాడు పక్క ఖాళీగా ఉంది. ‘నాన్న అప్పుడే లేచాడన్నమాట’ అనుకుంటూ బయటకు నడిచాడు రవీంద్ర. వసారాలోకి రాగానే అతనికి మనోహరమైన దృశ్యం కనిపించింది.

ఇంటి ముందున్న మామిడిచెట్టు అరుగుల మీద కూర్చుని ఉన్నాడు వీరయ్య. అతని పక్కనా, ఎదురుగానున్న కుర్చీలలో సర్పంచ్‌, మరికొందరు వూరివారు కూర్చుని ఉన్నారు. కాంతం పిన్ని అందరికీ కాఫీలు అందిస్తోంది. ఆ కాఫీగ్లాసు అందుకుంటూ ఏదో బిగ్గరగా అన్నాడు రాఘవయ్య. అంతే అందరూ పగలబడి నవ్వారు. కన్నార్పకుండా తండ్రినే చూస్తున్నాడు రవీంద్ర. కాస్త నీరసంగా, బలహీనంగా కనిపిస్తున్నా చాలా సంతోషంగా ఉన్నాడు ఆయన. చిన్నపిల్లాడిలా మనసారా నవ్వుతున్నాడు. తండ్రివైపే చూస్తూ కొబ్బరిచెట్ల కిందకి నడిచాడు. సెల్‌ తీసి యామినికి కాల్‌ చేశాడు.

‘‘హలో రవీ, క్షేమంగా చేరారా, మావయ్య ఎలా ఉన్నారు?’’ అడిగింది యామిని.

‘‘బాగున్నారు యామినీ, చాలా బాగున్నారు. మళ్ళీ ఇదివరకటి నాన్నని చూస్తున్నాను’’ సంతోషంగా అన్నాడు రవీంద్ర.

‘‘మరి మావయ్యని అక్కడే ఉంచేస్తారా?’’ సంశయంగా అడిగింది యామిని.

‘‘అవును యామినీ, ఇక ఆయన ఇక్కడే ఉంటారు. ఆయన జీవితపు చివరిదశలో ప్రశాంతంగా, ఆనందంగా గడుపుతారు. ఈ వూరు ఆయనకి ప్రాణం. ఆయన సంతోషం ఇక్కడే ఉందని అర్థమయింది. పొలం కౌలుకిస్తాను. కొబ్బరి, అరటితోటలు పాలేరు వెంకన్న జాగ్రత్తగా చూసుకుంటాడు. వాటిమీద వచ్చే ఆదాయం ఆయనకు చాలు. అంతేకాదు, వెంకన్న మనకి బాగా నమ్మకస్తుడు. చిన్నతనం నుండీ మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు. వెంకన్ననీ, అతని భార్యనీ వెనకవైపున రెండు గదులలో ఉండి నాన్నకి వండిపెడుతూ, ఆయన మంచిచెడులు చూడమన్నాను. అందుకుగానూ జీతం ఏర్పాటుచేస్తానని చెప్పాను. వారు అందుకు ఆనందంగా అంగీకరించారు. ఇంకో వారం రోజులుండి నాన్న బాగా కోలుకోగానే ఆయనకు ఇక్కడ అన్ని ఏర్పాట్లూ చేసి వస్తాను. ఆయనకి ఒక సెల్‌ కూడా కొని ఇస్తున్నాను, రోజూ మనతో మాట్లాడటానికి’’ అన్నాడు రవీంద్ర.

‘‘సరే, నీ ఇష్టం రవీ! నువ్వు అన్నీ బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటావు. మావయ్య జాగ్రత్త’’ మనస్ఫూర్తిగా అంది యామిని.

‘‘బై యామినీ, ఇక ఉంటాను’’ సెల్‌ ఆఫ్‌ చేస్తూ ఇటువైపు తిరిగాడు రవీంద్ర. అప్పుడే కొడుకు వైపు చూసిన వీరయ్య నవ్వుతూ అతన్ని రమ్మన్నట్లుగా చేయూపాడు.

సెల్‌ జేబులో పెట్టుకుంటూ తండ్రివైపు నడుస్తోన్న రవీంద్రకి గుడిలో నుండి మోగుతున్న గంటలు మృదుమధురంగా వినిపిస్తున్నాయి... అతని నిర్ణయాన్ని హర్షిస్తున్నట్లుగా!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.