close
మ్యాచ్‌ ఆడి వచ్చేసరికి అమ్మలేదు!

మ్యాచ్‌ ఆడి వచ్చేసరికి అమ్మలేదు!

అతడు ప్రకటనల్లో కనిపించడు, వివాదాల్లో వినిపించడు, ఐపీఎల్‌లో ఆడడు... భారతజట్టు టెస్టు క్రికెట్‌ ఆడినపుడు మాత్రం క్రీజులో పాతుకుపోతాడు, బ్యాట్‌ ఝుళిపిస్తాడు, పరుగుల వరద పారిస్తాడు... ఆ క్రికెటర్‌ మరెవరో కాదు చెతేశ్వర్‌ పుజారా. ఇటీవల 50 టెస్టుల మార్కుని దాటిన చెతేశ్వర్‌ భారత టెస్టు క్రికెట్‌లో ఓ కొత్త అధ్యాయం!

చెతేశ్వర్‌కి మూడేళ్లపుడు అతడి బాబాయి ప్లాస్టిక్‌ బ్యాట్‌ కొనిచ్చాడు. దాన్ని పట్టుకొని స్థానిక పార్కులో ఫొటోకి స్టిల్స్‌ ఇచ్చాడు చెతేశ్వర్‌. తర్వాత ఆ ఫొటోల్ని చూసిన తండ్రి అరవింద్‌... చెతేశ్వర్‌ కాళ్ల మునివేళ్లమీద నిలబడి ఆడుతున్నట్టు గమనించాడు. చెతేశ్వర్‌లో ఓ క్రికెటర్‌ ఉన్నాడన్న విషయాన్ని అలా తొలిసారి గుర్తించిన అరవింద్‌... రోజూ చిన్నారి చెతేశ్వర్‌ చేతికి బ్యాట్‌ ఇస్తూ తానే బంతులు విసిరేవాడు. చెతేశ్వర్‌ ఎంతో సులభంగా బంతుల్ని కొడుతుంటే నిజంగానే అతడికి క్రికెట్‌లో భవిష్యత్తు ఉంటుందనిపించింది అరవింద్‌కి. ఒక నిర్ణయానికి వచ్చే ముందు స్నేహితుడు, భారత మాజీ ఆటగాడు, బీపీసీఎల్‌ కోచ్‌ అయిన కర్షణ్‌ ఘవ్రీకి చెతేశ్వర్‌ ఆట చూపాలనుకున్నాడు. కర్షణ్‌కు చెబితే చెతేశ్వర్‌ని తీసుకొని ముంబయి రమ్మన్నారు. దాంతో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నుంచి ముంబయి వచ్చారు అరవింద్‌. ‘పిల్లాడిలో సహజమైన ప్రతిభ ఉంది’ చెతేశ్వర్‌ని చూశాక కర్షణ్‌ అన్నమాటలివి. ఆయన కూడా అదే మాట చెప్పడంతో చెతేశ్వర్‌ని క్రికెటర్‌గా తీర్చిదిద్దాలనుకున్నారు అరవింద్‌. ఏడేళ్లకే చెతేశ్వర్‌కి లెదర్‌ బంతిని అలవాటు చేయించారు. ఒకసారి లెదర్‌బాల్‌తో ఆడటం ప్రారంభించాక రబ్బరు, టెన్నిస్‌ బంతులతో ఆడొద్దనీ, అలా అయితే ఎప్పటికీ క్రికెట్‌ నేర్చుకోలేవనీ చెతేశ్వర్‌కి చెప్పారు. ‘నాకు రబ్బరు, టెన్నిస్‌ బంతులతో ఆడాలని ఉండేది. నాన్న మాత్రం వాటితో అస్సలు ఆడొద్దన్నారు. వేర్వేరు బంతులతో కొట్టాల్సిన షాట్లు వేర్వేరుగా ఉంటాయని చెప్పి మాన్పించారు’ అంటాడు పుజారా.

నాన్నే కోచ్‌
అరవింద్‌ వికెట్‌ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడారు. స్థానికంగా ఉండే వెల్జీ మాస్టర్‌ దగ్గర పాఠాలు నేర్చుకున్నారు అరవింద్‌. తర్వాత ఆయన దగ్గర అసిస్టెంట్‌ కోచ్‌గా పనిచేశారు. ఆపైన రైల్వేలో ఉద్యోగం రావడంతో క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. ఒకనాటి తన అనుభవంతో చెతేశ్వర్‌కి బ్యాటింగ్‌లో ఓనమాలు నేర్పించేవారు. తానే కొడుక్కి బౌలింగ్‌ చేసేవారు. వారుండే రైల్వే కాలనీ మైదానంలో సిమెంట్‌ పిచ్‌ తయారుచేయించి, అక్కడి పిల్లలకూ ఉచిత శిక్షణ ఇచ్చేవారు. చెతేశ్వర్‌ ప్రాక్టీసుకి ఆదివారం, పండగరోజుల్లాంటి సెలవులేవీ ఉండేవి కాదు. రోజూ అయిదింటికే నిద్రలేచి అరగంటలో ప్రాక్టీసుకి సిద్ధమయ్యేవాడు. తొమ్మిది గంటలకు తిరిగి ఇంటికి వచ్చి హోమ్‌ వర్క్‌లు చేసేవాడు. మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి సాయంత్రం అయిదింటివరకూ స్కూల్‌. స్కూల్‌ నుంచి వచ్చాక చీకటి పడేంత వరకూ ప్రాక్టీసు చేసేవాడు. పుజారాని క్రికెట్‌ తప్ప మిగతా ఆటలవైపు పోనిచ్చేవారు కాదు అరవింద్‌. ‘తొలిరోజుల్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు నాన్న. దీపావళికి మతాబులు కాల్చనిచ్చేవారు కాదు. సంక్రాంతికి గాలి పటాలు ఎగరేయనిచ్చేవారు కాదు. నాకు చిన్న గాయమైనా ప్రాక్టీసు ఆగుతుందనేది ఆయన భయం. అవన్నీ ఆటమీద నా ఏకాగ్రత పెరిగేలా చేశాయి’ అంటాడు పుజారా.

వేసవిలో ముంబయికి...
చెతేశ్వర్‌చేత అరవింద్‌ రోజూ ప్రాక్టీసు చేయిస్తూనే ఉన్నారు. ఆట పరంగా ఎన్నో మెలకువలు నేర్చుకున్నాడు చెతేశ్వర్‌. కానీ ప్రాక్టీసు వేరు, మ్యాచ్‌లు ఆడటం వేరు. చెతేశ్వర్‌ అంతర్జాతీయస్థాయికి వెళ్లాలంటే మ్యాచ్‌లు ఆడాల్సిందేనని అరవింద్‌కి తెలుసు. కానీ రాజ్‌కోట్‌లో ఆ వాతావరణం లేదు. అందుకని చెతేశ్వర్‌కి పదేళ్లు వచ్చినప్పట్నుంచీ ఏటా వేసవి సెలవుల్లో ముంబయిలో ఉంటూ మ్యాచ్‌లు ఆడించేవారు. ముంబయిలో ఇంటిని అద్దెకు తీసుకొని ఉండేంత ఆర్థిక స్తోమత ఆ కుటుంబానికి లేదు. దాంతో అక్కడ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఓ పరిచయస్తుడి ద్వారా ఆ కంపెనీ క్వార్టర్స్‌లో ఖాళీగా ఉండే, నిర్మాణం పూర్తికావస్తున్న ఫ్లాట్‌లలో ఉండేవారు. అలా ఏడాదిలో రెండు మూడు నెలలు పుజారా కుటుంబం ముంబయిలో ఉండేది. కర్షణ్‌ తోడ్పాటుతో స్థానికంగా ఉండే ఓ వేసవి శిక్షణ శిబిరంలో చెతేశ్వర్‌కి చోటు దొరికింది. ఆ క్యాంప్‌ నిర్వాహకుడి సహాయంతో ఏ జట్టులోనైనా ఖాళీ ఉంటే తెలుసుకునేవారు అరవింద్‌. ఆడ్డానికి అవకాశం ఉందంటే ఎంత దూరమన్నది ఆలోచించకుండా తండ్రీ కొడుకులు క్రికెట్‌ కిట్‌ పట్టుకొని లోకల్‌ ట్రెయిన్లో వెళ్లిఆ జట్టు మైదానంలో వాలిపోయేవారు. ఇంటి దగ్గర చెతేశ్వర్‌ తల్లి రీనా, మైదానంలో చెతేశ్వర్‌, మైదానం వెలుపల అరవింద్‌... ఆ మూడు నెలలూ వారి పరిస్థితి ఇలానే ఉండేది. అలా వేసవిలో వేర్వేరు పిచ్‌లపైన 20 మ్యాచ్‌ల వరకూ ఆడే అవకాశం వచ్చేది. మూడేళ్లపాటు అలాగే ముంబయి వెళ్లేది పుజారా కుటుంబం. ఒక్క మ్యాచ్‌లో సరిగ్గా ఆడకపోయినా తర్వాత మ్యాచ్‌లో అవకాశం వస్తుందో రాదో తెలీదు, అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ వికెట్‌ ఇచ్చేవాడు కాదు చెతేశ్వర్‌. అదే తర్వాత కూడా అలవాటైంది.

అమ్మ కోరిక తీరింది!
సౌరాష్ట్ర అండర్‌-14 రాష్ట్ర జట్టుకి ఎంపికకావడంతో 13 ఏళ్లపుడు చెతేశ్వర్‌ మ్యాచ్‌ ఆడేందుకు పుణె వెళ్లాల్సి వచ్చింది. మొదటిసారి అమ్మానాన్నల్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసరికి చెతేశ్వర్‌ కంట తడి పెట్టాడట. కానీ ఆ సీజన్లో ట్రిపుల్‌ సెంచరీ చేశాడు. తర్వాత రాష్ట్ర అండర్‌-16, 17 ఏళ్లకే అండర్‌-19 జట్టులకీ ఎంపికయ్యాడు. ప్రతిచోటా భారీస్కోర్లు నమోదుచేశాడు. ఆ దశలోనే ఆస్ట్రేలియాలో శిక్షణ ఇచ్చే బోర్డర్‌- గవాస్కర్‌ స్కాలర్‌షిప్‌కి ఎంపికయ్యాడు. చెతేశ్వర్‌కి అప్పటికి 18 ఏళ్లు నిండలేదు. ఆస్ట్రేలియా బోర్డు మాత్రం 18 ఏళ్లు నిండనివాళ్లకి సంరక్షకుడు ఉండాలని నియమం పెట్టింది. కానీ చెతేశ్వర్‌తో మరొకరిని పంపించడానికి అయ్యే ఖర్చుని భరించడానికి సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం, జాతీయ క్రికెట్‌ అకాడమీలు భరించడానికి ముందుకు రాలేదు. అరవింద్‌కూ ఆ శక్తి లేకపోయింది. దాంతో చెతేశ్వర్‌ ఆస్ట్రేలియా వెళ్లలేకపోయాడు. అందుకు చాలా బాధపడ్డాడు. మెరుగైన అవకాశాల కోసం చెతేశ్వర్‌ని జాతీయ క్రికెట్‌ అకాడమీ ఉన్న బెంగళూరులో ఉంచాలనుకున్నాడు అరవింద్‌. కానీ భార్య రీనా మాత్రం ‘మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వాడు ఇక్కడ ఉన్నా ఇండియాకి ఆడతాడు. ఆందోళన పడకండి’ అంటూ భరోసా ఇచ్చేది. 2005లో భావ్‌నగర్‌లో ఓ మ్యాచ్‌ ఆడి తిరిగి వస్తున్నాడు చెతేశ్వర్‌. తండ్రిని బస్‌స్టాప్‌కి పంపమని అమ్మకి ఫోన్‌ చేశాడు. ఆమె సరేనంది. తండ్రితోపాటు ఇంటికి వచ్చేసరికి మాత్రం ఆమె బతికిలేదు. రీనాను రొమ్ము క్యాన్సర్‌ బలితీసుకుంది. నాల్రోజులపాటు ఆ షాక్‌లో ఉండిపోయాడు చెతేశ్వర్‌. అయిదో రోజున ముంబయితో అండర్‌-19 మ్యాచ్‌కు వెళ్లాల్సి ఉంటే, తనవల్ల కాదన్నాడు. ‘అమ్మ ఉంటే నిన్ను ఆడమనేది’ అరవింద్‌ నోట వచ్చిన ఆ మాటలతో మ్యాచ్‌కు బయలుదేరాడు చెతేశ్వర్‌. కానీ ఏకాగ్రత కుదరక పరుగులు చేయలేకపోయాడు. చెతేశ్వర్‌ పరిస్థితిని గమనించి వారి కుటుంబ గురూజీ దగ్గరకు తీసుకువెళ్లారు అరవింద్‌. ‘అమ్మ నిన్ను భారత జట్టులో చూడాలనుకుంది. ఆమె కోర్కెని నిజం చేయాల్సిన బాధ్యత నీదే’ అన్నారా గురూజీ. ఆరోజు నుంచి దిగులు చెందడం మానేసి మళ్లీ పరుగుల వేట మొదలుపెట్టాడు చెతేశ్వర్‌. తల్లి రీనా చిన్నారి చెతేశ్వర్‌కి ప్యాడ్‌లు కుట్టేది. పూజ, ధ్యానం అలవాటు చేసింది. రోజూ 10-15 నిమిషాలు ధ్యానం చేయడం ఇప్పటికీ మానడు. వాళ్లది శాకాహార కుటుంబం. కొడుకు రోజంతా నిలబడి ఆడాలంటే బలం కావాలి. దానికోసం డ్రైఫ్రూట్స్‌తో చేసిన పదార్థాల్ని ప్రసాదంగా పెట్టేవారు రీనా. ‘అమ్మ ఎదుట లేకపోయినా నా ప్రతి కదలికలో ఆమె ఉంది’ అంటాడు చెతేశ్వర్‌. 2006 అండర్‌-19 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు(349) చేసిన బ్యాట్‌ü్సమన్‌గా గుర్తింపు సాధించిన చెతేశ్వర్‌, 2008లో సౌరాష్ట్ర తరఫున ఆడుతూ దేశవాళీ మ్యాచ్‌లలో మూడు ట్రిపుల్‌ సెంచరీలు చేశాడు. 2010లో పుజారాల కల నిజమైంది. ఆ ఏడాది భారత టెస్టు జట్టులోకి చెతేశ్వర్‌ ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన ఆ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో చెతేశ్వర్‌ 72 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ని గెలిపించాడు. గాయం కారణంగా 2011 మొత్తం క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చినా, 2012లో మళ్లీ టెస్టుజట్టులోకి వచ్చాడు. అప్పట్నుంచీ మూడో స్థానంలో ఆడుతూ ద్రవిడ్‌ను గుర్తుచేస్తున్నాడు.

అమ్మానాన్నా... ఆయనే!
‘నేను ఇంతటివాణ్ని అయ్యానంటే కారణం నాన్ననే చెప్పాలి. తండ్రిగానే కాకుండా కోచ్‌గానూ నా కెరీర్‌ను తీర్చిదిద్దారు. అమ్మ చనిపోయాక నా బాగోగుల్ని ఆయనే చూసుకున్నారు. అప్పట్నుంచీ ఇద్దరికీ క్రికెట్టే ప్రపంచమయింది. నన్ను క్రికెట్‌ నుంచి దృష్టి మరల్చనీయలేదు. ఆయన ఆలోచనలూ ఆటచుట్టూనే ఉండేవి’ అంటాడు చెతేశ్వర్‌. ‘ఏ విద్య అయినా నేర్చుకునేటపుడు గురువుపైన పూర్తిగా నమ్మకం కుదరాలి. చెతేశ్వర్‌ నన్ను పూర్తిగా నమ్మాడు. ఆటలో ఎలాంటి సమస్య ఉన్నా నాతో చర్చించేవాడు. ఇతరులు ఏదైనా సలహా ఇచ్చినా నాతో చెప్పి అభిప్రాయం అడిగేవాడు. ఎంతో క్రమశిక్షణతో ఉంటాడు. దానివల్ల ఏకాగ్రత పెరిగింది’ అంటారు అరవింద్‌. సాధారణంగా తండ్రీకొడుకుల మధ్య కుటుంబ వ్యవహారాలూ, ఆర్థిక వ్యవహారాలూ చర్చకు వస్తాయి. కానీ ఇప్పటికీ అరవింద్‌, చెతేశ్వర్‌ల మధ్య క్రికెట్‌ అంశాలే ప్రధానంగా చర్చకు వస్తాయి. ఇప్పటికీ రోజూ ఆట ముగిశాక పిచ్‌ స్వభావం, బంతి స్వింగ్‌, బౌన్స్‌ కావడం, చెతేశ్వర్‌ ఆడిన తీరు... మొదలైన అంశాల్ని ఫోన్లో చర్చిస్తుంటారు తండ్రీకొడుకులు. ‘ఇదంతా ఆట మెరుగుపర్చుకోవడం కోసమే’నంటారు అరవింద్‌.

జెంటిల్మన్‌...
రెండేళ్ల కిందట శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో చెతేశ్వర్‌ రాణించలేదు. దాంతో రెండో మ్యాచ్‌లో అతడికి విశ్రాంతి ఇచ్చారు. మూడో మ్యాచ్‌లో మరో బ్యాట్స్‌మన్‌కి గాయమైతే ఓపెనర్‌గా వచ్చాడు చెతేశ్వర్‌. తోటి బ్యాట్స్‌మెన్‌లలో కె.ఎల్‌.రాహుల్‌(2), రహానె(8), కోహ్లీ(18), రోహిత్‌ శర్మ(26) తక్కువ పరుగులకే చేతులెత్తేస్తే, పుజారా ఒక్కడే 145 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌ గెలిచి మన జట్టు సిరీస్‌నీ దక్కించుకుంది. అప్పట్నుంచీ భారత్‌ తరఫున చెతేశ్వర్‌ ఆడని టెస్టు లేదని చెప్పాలి. ఈ రెండేళ్లలో పుజారా 23 టెస్టులాడి రెండువేలకు పైగా పరుగులు సాధించాడు. అందులో ఏడు శతకాలున్నాయి. భారత జట్టులో ప్రస్తుతం ఏ ఆటగాడికీ ఇంత గొప్ప గణాంకాలు లేవు. ఈ పరుగుల్లో కొన్ని టీమ్‌ విజయానికి దోహదపడగా, ఇంకొన్ని జట్టుని ఓటమి నుంచి గట్టెక్కించాయి. టెస్టుల్లో తిరుగులేకపోయినా, ఇతర ఫార్మాట్‌లలో మాత్రం చెతేశ్వర్‌ ఉనికి తక్కువ. కారణం అతడి ఆటలో మెరుపులు ఉండవు కానీ, నిలకడ ఉంటుంది. భారీ షాట్లు ఉండవు కానీ, భారీ ఇన్నింగ్స్‌ ఉంటాయి. వినోదం కాకుండా క్రికెట్‌ మాత్రమే కనిపిస్తుంది! ఎందుకంటే, జెంటిల్మన్‌ గేమ్‌ని అదే తరహాలో ఆడతాడీ జెంటిల్మన్‌!

ఇంకొంత 

యాభై టెస్టులాడిన చెతేశ్వర్‌ నాలుగువేలకుపైగా పరుగులు చేశాడు. అందులో 13 సెంచరీలు (వాటిలో రెండు డబుల్‌ సెంచరీలు) ఉన్నాయి.

 
* గతేడాది సొంతూరు రాజ్‌కోట్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడినపుడే మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్‌లో చెతేశ్వర్‌ని మైదానంలో ఉండగా చూశారు అరవింద్‌. ఆ మ్యాచ్‌లో పుజారా సెంచరీ చేశాడు.

* మూడేళ్ల చెతేశ్వర్‌ బ్యాట్‌తో కొడుతున్న స్టిల్‌నీ, ఓ టెస్టు మ్యాచ్‌లో అదే తరహా షాట్‌ ఆడుతున్న స్టిల్‌నీ ఫ్రేమ్‌ కట్టించి ఇచ్చాడో అభిమాని. అది వాళ్లింట్లో ఉంటుంది.

* రాజ్‌కోట్‌కే చెందిన పూజాను పెళ్లి చేసుకున్నాడు.

* రాజ్‌కోట్‌లో క్రికెట్‌ అకాడమీని ప్రారంభించి ఉచిత శిక్షణ ఇస్తున్నాడు.

* ప్రస్తుతం ఇంగ్లిష్‌ కౌంటీల్లో ఆడుతున్న ఏకైక భారతీయ క్రికెటర్‌.

* అయిదు వన్డేలు మాత్రమే ఆడాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.