close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రారా కృష్ణయ్యా..!

రారా కృష్ణయ్యా..!

మనుషుల పుట్టిన రోజు ఆ కుటుంబానికి వేడుకయితే, కన్నయ్య పుట్టిన రోజు ప్రపంచానికే వేడుక. చిన్ననాడు తన అల్లరితో గోకులాన్నంతా ఒక్కచోటికి తెచ్చిన కన్నయ్యే, పెద్దయ్యాక బతుకు రాతంతా గీతలోనే ఉందంటూ మనుషులందర్నీ ఒక్క చోటికి చేర్చాడు. అందుకే ఆయన పుట్టిన రోజంటే వూరూ వాడా సంబరమే. (రేపే శ్రీకృష్ణాష్టమి)

‘ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు... తిద్దరాని మహిమల దేవకీ సుతుడు...’ అన్నాడు అన్నమయ్య చిన్ని కృష్ణుడి మీద అమితమైన ప్రేమతో. ఆయనే, ‘చేరి యశోదకు శిశువితడు... దారుణి బ్రహ్మకు తండ్రియు నితడూ...’ అనీ ఆశ్చర్యంతో పాడాడు. దేవకీ సుతుడూ, యశోదా నందనుడూ అయిన కన్నయ్య ప్రేమ స్వరూపి. అందుకే ఆయనంటే అందరికీ అంత ఇష్టం. కృష్ణస్వామి పుట్టగానే చెరసాలలో వేయి కాంతులు విరిశాయట, నందుడి ఇంటైతే నిత్యమూ ఓ ఉత్సవమే. కృష్ణయ్య మనుగడే అలాంటిది. ఆయనున్న చోట ప్రేమ చిరుగాలి దొంతరల్లా తారాడుతూ ఉంటుంది. అధరం మధురం... వదనం మధురం...నయనం మధురం... హసితం మధురం... మధురాధిపతి సకలమూ మధురమే. అందుకే ఆ మధురామృత ధారల్ని మన ఇంటా కురిపించాలని ఆయన్ని ‘రా కృష్ణా... మా ఇంటికి రావూ...’ అని ఆహ్వానిస్తాం. మన పిల్లల్నీ కృష్ణయ్యా, గోపికల్లా అలంకరిస్తాం.

భువికేతెంచె...
త్రేతాయుగంలో కంసాది రాక్షసుల భారం మోయలేక భూదేవి బ్రహ్మాదిదేవతలకు మొరపెట్టుకుందట. అప్పుడే విష్ణుమూర్తి కృష్ణావతారం దాల్చి భూమి మీద జన్మించాడు. దేవకీ వసుదేవులకు ఎనిమిదో సంతానంగా చెరసాల్లో పుట్టాడు కృష్ణుడు. పురాణాల ప్రకారం శ్రీముఖనామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమినాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు కృష్ణుడు. కృష్ణాష్టమిని నిర్ణయించేప్పుడు కొందరు తిథికీ, మరికొందరు నక్షత్రానికీ ప్రాధాన్యమిస్తారు. తిథి మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగానూ, నక్షత్రం కూడా కలిస్తే శ్రీకృష్ణజయంతిగానూ వ్యహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అందులోనూ సోమవారం కానీ, బుధవారంకానీ అయితే మరింత విశేషమని ధర్మసింధు గ్రంథం ద్వారా తెలుస్తోంది. ఈ రోజు స్వామిని అర్చిస్తే చతుర్విధ పురుషార్థాలు ప్రాప్తిస్తాయనీ, అన్ని పనుల్లో జయం కలుగుతుందనీ నమ్మకం.

కన్నయ్య అడుగులు...
చేత వెన్నముద్ద చెంగల్వపూదండ
బంగారు మొలతాడు పట్టుదట్టి
సందె తాయెతులు సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణా నిన్ను చేరి కొలుతు...

చిన్ని కన్నయ్యను యశోద ఎంత చక్కగా ముస్తాబు చేసేదో అచ్చం అలాగే ఆయన్ను అలంకరిస్తారు భక్తులు కృష్ణాష్టమి రోజున. ఉత్తరాదిన చాలా మంది భక్తులు ఈ పండక్కి ముందు రోజు ఉపవాసం చేస్తారు. ఆ రాత్రికి జాగరణ చేస్తారు. కృష్ణుడు అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి ఆ సమయంలో కృష్ణప్రతిమకు మంగళస్నానం చేయించి, పట్టుబట్టలు కట్టి, ఆభరణాలతో అలంకరిస్తారు. స్వామికి నైవేద్యాలు సమర్పించి, వూయల సేవ చేస్తారు. తర్వాత ప్రసాదం తీసుకుని ఉపవాసం ముగిస్తారు (కొంతమంది మర్నాడూ ఉపవాసం ఉంటారు). తర్వాతి రోజు ఇంటి ముందు ముగ్గులేసి, బియ్యప్పిండితో వాకిట్లో నుంచి ఇంట్లోకి కృష్ణుడి పాదాలను వేస్తారు. ఆయనకిష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడలను పండ్లతో పాటూ నివేదిస్తారు. దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఈ వేడుకలు ఘనంగా జరుపుతారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రానికి పాలు, పెరుగు, వెన్న, మీగడలను స్వామికి నివేదన చేస్తారు. సాయంత్రానికి పిల్లా పెద్దా వీధుల్లో చేరి ఉట్ల పండగలో నిమగ్నమవుతారు. అష్టమి రోజు కృష్ణపూజ ఎలా చేయాలి అన్నది సాక్షాత్తూ బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడని బ్రహ్మాండపురాణంలో ఉంది. మధుర, ద్వారక, బృందావనం, ఉడుపి, పూరీ, గురువాయూరు, తిరుమల తదితర క్షేత్రాల్లో కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా జరుపుతారు. కృష్ణుడు పాలించిన నగరం ద్వారకలో జరిగే సంబరాల్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడి ఆలయాన్ని నిజమందిరం, జగన్మందిరంగా పిలుస్తారు. 2,500 సంవత్సరాల క్రితం కృష్ణుడి మనుమడు వజ్రనాభుడు ఈ గుడిని కట్టాడని చెబుతారు. కృష్ణాష్టమి రోజు లక్షల జనం వస్తారిక్కడికి. కర్ణాటక ఉడుపిలోని విగ్రహమూర్తి అయితే సాక్షాత్తూ రుక్మిణీదేవితో పూజలందుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి.

తిరుమలలో...
తిరుమల శ్రీవారి సన్నిధిలో బాలకృష్ణుడి విగ్రహం ఉంటుంది. అందుకే అష్టమినాడు తిరుమలలో ‘గోకులాష్టమీ ఆస్థానా’న్ని నిర్వహిస్తారు. ఆ రోజు కృష్ణుడు సర్వభూపాల వాహనం మీద మాడవీధుల్లో వూరేగుతాడు. పండితులు భాగవతంలోని ఘట్టాలనూ, అందులోని కన్నయ్య లీలలనూ శ్రావ్యంగా చదివి వినిపిస్తారు. శిక్యోత్సవం పేరుతో ఉట్ల పండగ చేస్తారు. మహారాష్ట్రలో కూడా ఘనంగా కృష్ణజయంతిని జరుపుతారు. అక్కడ ‘దహీహండీ’ పేరుతో ఉట్ల పండగను అట్టహాసంగా నిర్వహిస్తారు. ఈ పూజలూ వేడుకలన్నీ కన్నయ్యను మన దగ్గరికీ, మనింట్లోకీ ఆహ్వానించడానికే. కిలోల బంగారానికి తూగని వాడు ఒక్క తులసీదళానికే తేలిపోయాడు. ఆ తత్వం మనకూ బోధపడితే కన్నయ్య మనవాడే... మనందరివాడే!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.