close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వాళ్లకు ‘దంగల్‌’ సినిమా చూపించా

వాళ్లకు ‘దంగల్‌’ సినిమా చూపించా

‘‘సరదాగా విహారయాత్రలకోసం విదేశాలకు వెళ్లడం సహజమే. వాటివల్ల ఆయా దేశాల గురించి ఎంతోకొంత అవగాహన కలుగుతుందన్నదీ నిజమే. కానీ ఆ దేశం గురించీ అక్కడి విధానాల గురించీ ప్రజల గురించీ పూర్తిగా తెలుసుకోవాలంటే కొన్ని రోజులయినా ఆ దేశీయులతో కలిసి ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది’ అంటోంది కృష్ణాజిల్లా పెనమలూరుకి చెందిన కిలారు ఇందు. కల్చరల్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రాంలో భాగంగా నలభై ఐదురోజులపాటు తైవాన్‌లో గడిపిన ఆ విద్యార్థిని అనుభవాలు...

ఐఎస్‌ఇసి(ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్టూడెంట్స్‌ ఇన్‌ ఎకనమిక్‌ అండ్‌ కమర్షియల్‌ సైన్సెస్‌) అనేది యువత నడుపుతోన్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు రకరకాల ప్రాజెక్టులను చేపడుతోంది. అందులో భాగంగానే ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలకు నిర్దేశించిన పదిహేడు సస్టెయినబుల్‌ డెవలప్‌మెంటల్‌ గోల్స్‌ సాధించడంలో విద్యార్థుల పాత్రని గుర్తించి ఆసక్తి ఉన్న సభ్యులను తమవంతు కృషిచేసేలా ప్రోత్సహిస్తోంది. అందులో సభ్యురాలినైన నేను, సంస్థ కార్యకలాపాల్లో భాగంగా ‘నాణ్యమైన విద్య’ అనే ప్రాజెక్టుని తీసుకుని, అధ్యయనం చేసేందుకు తైవాన్‌ దేశాన్ని ఎంపికచేసుకున్నా. ప్రపంచదేశాల్లో తైవాన్‌ భద్రతాపరంగా రెండో స్థానంలో ఉంది.

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో...
తైవాన్‌లోని డాంగ్‌క్సింగ్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు భారతీయ సంస్కృతిని పరిచయం చేయడానికి ఉత్సుకత చూపడంతో నన్ను ఆ పాఠశాలకు ఎంపికచేశారు. అలా ఏప్రిల్‌ నెలలో భారత్‌ నుంచి ఏఐఇఎస్‌ఇసి తరపున తొలి సభ్యురాలిగా తైవాన్‌లో అడుగుపెట్టాను. ఆ స్కూల్లోని విద్యార్థులు కొత్త విషయాలు తెలుసుకోవడానికి చూపించే ఉత్సుకత ఆశ్చర్యం కలిగించింది. అది ప్రభుత్వ పాఠశాలే అయినప్పటికీ మనదేశంలోని కార్పొరేట్‌ పాఠశాలలకి ఎంతమాత్రం తీసిపోదు.

తైవాన్‌ చైనా దేశానికి పశ్చిమంగా పసిఫిక్‌ మహా సముద్రంలో ఉన్న చిన్న ద్వీపం. పచ్చని అడవులూ కొండలతో అలరారుతుంటుంది. అక్కడ వేసవి జూన్‌- సెప్టెంబరు వరకూ ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువే. చలికాలం విపరీతమైన చలి. అందుకే ఆ దేశాన్ని చూడ్డానికి అక్టోబరు- డిసెంబరు మంచి సీజన్‌ అంటారు. కరెన్సీ తైవాన్‌ డాలరు. చైనా, జపాన్‌ల మధ్య జరిగిన యుద్ధం తరవాత తైవాన్‌ జపనీయుల అధీనంలో యాభై సంవత్సరాలపాటు ఉంది. అందుకే అక్కడి ప్రజలమీద జపాన్‌ సంస్కృతి ప్రభావం ఎక్కువ. మా సంస్థ నాకు ఆ పాఠశాలలో మూడో తరగతి చదువుతోన్న మెలడీ చెన్‌ ఇంట్లో వసతి ఏర్పాటుచేసింది. ఒక దేశ సంస్కృతీసంప్రదాయాలు పూర్తిగా అర్థం కావాలంటే అక్కడి ప్రజలతో మమేకం కావాలనేది సంస్థ సిద్ధాంతం. మెలడీ తండ్రి బెంజామిన్‌ చెన్‌, ఆపిల్‌ సంస్థకి విడిభాగాలు సరఫరా చేసే ఫాక్స్‌ కాన్‌ అనే సంస్థలో ఉన్నత పదవిలో ఉన్నారు.

తైవాన్‌ ప్రజలకు ఆంగ్లంలో పట్టు తక్కువ. పాఠశాలలో విద్యార్థులకు తేలికపాటి ఇంగ్లిషు పదాలతోనే పాఠాలు చెప్పమన్నారు. మన సంస్కృతీసంప్రదాయాల గురించి క్లుప్తంగా పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ చేస్తే వాళ్లు ఆసక్తిగా చూశారు. హనుమాన్‌, రామాయణ, మహాభారత పుస్తకాలను పాఠశాలకు బహుమతులుగా తీసుకెళ్లాను. భారతీయ సినిమాల్లో అమీర్‌ఖాన్‌ నటించిన త్రీ ఇడియట్స్‌ చిత్రం వాళ్లకి చాలా ఇష్టమట. వారమంతా పాఠశాలలో బోధన చేయడం, వారాంతంలో మెలడీ కుటుంబంతోనూ, ఇతర విద్యార్థుల కుటుంబాలతోనూ కలిసి అక్కడి ప్రదేశాలను చూడటంతో రోజులు ఇట్టే గడిచిపోయాయి.

తైవాన్‌లో 95 శాతం హాక్కా తెగ వాళ్లే. రాజధాని తైపేలోని సిమ్‌చు ప్రాంతంలో వీళ్ల సంఖ్య చాలా ఎక్కువ. భవన నిర్మాణంలోనూ వాళ్ల సంస్కృతి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఒకరోజు న్యూటైటిల్‌ హౌస్‌ హాక్కా కల్చర్‌ డిస్ట్రిక్ట్‌ అనే ప్రదేశానికి వెళ్లాం. అక్కడ హాక్కా తెగవారి సంప్రదాయ వస్తువులనీ, ఇళ్లనీ చూశాం. మరోరోజు ప్రాచీన చైనాకి చెందిన ఏడు లక్షల వస్తు సముదాయాన్ని సేకరించి ప్రదర్శిస్తోన్న నేషనల్‌ ప్యాలెస్‌ మ్యూజియానికి వెళ్లాం. అక్కడి వస్తువుల గురించి తెలుసుకోవడానికి ఓ ఆడియో ప్లేయర్‌ ఇస్తారు. ఈ మ్యూజియం చైనా వస్తువులకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్దదిగా పేరొందింది.

మిణుగురు పురుగులతో..!
ఇంకోరోజు తైపే టవర్‌కి వెళ్లాం. దీని ఎత్తు సుమారు 509 మీటర్లు. ఇందులోని ఎలివేటర్‌ నిమిషానికి 1,010 మీటర్ల ఎత్తుకి ప్రయాణిస్తుంది. ఐదో అంతస్తు నుంచి 89వ అంతస్తుకి కేవలం 37 సెకన్ల వ్యవధిలో వెళ్లాం. రెప్పపాటులో చేరుకున్న ఆ వేగానికి నేను ఆశ్చర్యపోయాను. ఈ టవర్‌ నిర్మాణానికి వాడిన అద్దాల్ని డబుల్‌ లేయర్డ్‌ గ్లాస్‌ కర్టెన్స్‌ అంటారు. ఇవి వేడి నుంచీ అతినీలలోహిత కిరణాల నుంచీ టవర్‌ని రక్షిస్తాయట. భూకంపాల్ని తట్టుకునేందుకు ఈ టవర్‌లో అతిపెద్ద డాంపర్‌ని ఉపయోగించారు. దీన్ని తయారుచేయడానికి సుమారు 28 కోట్ల రూపాయలు ఖర్చయిందట. టవర్‌కు వాడిన అద్దాలను కెలెడియోస్కోప్‌లా అమర్చారు. సాయంత్రం ఐదారు గంటల మధ్యలో తైపే టవర్‌కు ఎదురుగా ఉన్న ఏనుగుకొండమీద ఈ టవర్‌ నీడ తిరగేసినట్లు కనిపించేలా కట్టడం మరో ప్రత్యేకత.

మరో వారాంతంలో డాంగ్‌క్సింగ్‌ సించు సైన్స్‌ పార్కుకి వెళ్లాం. అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీని ఆదర్శంగా తీసుకుని నిర్మించిన ప్రాంతమిది. ఇక్కడ దాదాపు 520కి పైగా కార్యాలయాలు ఉన్నాయి. దీనికి ఇరువైపులా రెండు జాతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అక్కడ నుంచి సిన్‌చు ఫిష్‌ హార్బర్‌కి వెళ్లాం. దీన్నే నాన్‌లియో హార్బర్‌ అనీ అంటారు. ఈ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ వివిధ రకాల జలచరాలను చూడొచ్చు. నెయ్‌వాన్‌ అనే ప్రదేశానికి వెళ్లాం. 2017 సంవత్సరాన్ని తైవాన్‌ ప్రభుత్వం ఎకోటూరిజం సంవత్సరంగా ప్రకటించి, తైవాన్‌ ప్రజలను ప్రకృతికి దగ్గర చేసే కార్యక్రమాలు చేపట్టింది. నెయ్‌వాన్‌ హిల్‌ స్టేషన్‌. రాత్రి ఏడు గంటల తరవాత కొండమీద చిమ్మచీకటిలో ఎగిరే మిణుగురుల్ని చూడటం అందులో ఒకటి. అక్కడికి అంతా టార్చిలైట్లతో వచ్చి వాళ్లమీద వాలిన మిణుగురులతో ఆనందిస్తారు.

గాల్లో సైకిల్‌ తొక్కాను!

ఆసియాలోనే అమ్యూజ్‌మెంట్‌ పార్కు, సఫారీ రెండూ ఒకేచోట ఉన్న మొదటి ప్రాంతం లియోఫూ గ్రామం. ఇందులో వెల్డ్‌ వెస్ట్‌, సౌత్‌ పసిఫిక్‌, అరేబియా రాజ్యం, ఆఫ్రికన్‌ సఫారీ అనే రకరకాల థీమ్‌లతో కూడిన ప్రదేశాలు ఉన్నాయి. 30కి పైగా రోలర్‌ కోస్టర్లతో ఈ ప్రాంతం చాలా బాగుంది. మ్యూజికల్‌ వాటర్‌ షో ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణ. ఇక్కడి జూలో తెల్లపులి ఉంది. ఈ జూ మొత్తాన్నీ బస్సులోగానీ గాలిలో ఏర్పాటుచేసిన సైకిల్‌ మార్గం ద్వారాగానీ నడిచిగానీ రైల్లో గానీ వీక్షించవచ్చు. గాల్లో ఏర్పాటుచేసిన సైకిల్‌ మార్గంలో మనంతట మనమే తాడుమీద సైకిల్‌ తొక్కుకుంటూ చూడవచ్చు. ఇది థ్రిల్లింగ్‌గా అనిపించింది. తైవాన్‌లోని మరో ఆసక్తికరమైన ప్రదేశం మావోకాంగ్‌ టీ స్టేషన్‌. అక్కడికి కేబుల్‌ కారులోనే వెళ్లాలి. ఆ దారిలో జినన్‌, తైనన్‌ ఆలయాల దగ్గరా తైపే జూ దగ్గరా ఆగుతూ ప్రయాణించాం. అక్కడి టీ స్టేషన్‌లో తైవాన్‌కే ప్రత్యేకమైన టీని చప్పరిస్తూ తైపే నగరాన్ని వీక్షించడం మరువలేని అనుభూతి.

సినిమా చూపించా..!
మరో రోజు సిన్‌చులో బిగ్‌సిటీ మాల్‌కి వెళ్లాం. ఇది తైవాన్‌లోని రెండో అతిపెద్ద షాపింగ్‌మాల్‌. అక్కడ భారతీయ సినిమాలు చాలానే ప్రాచుర్యం పొందాయి. నాకు ఆతిథ్యమిచ్చిన కుటుంబానికి దంగల్‌ సినిమా చూపించాను. వాళ్లకు చాలా నచ్చింది. భారత్‌లో ఆడపిల్లలను అలా చూస్తారా అని ఆశ్చర్యపోయారు. తైవాన్‌కున్న మరో ప్రత్యేకత నైట్‌ బజార్లు. అక్కడ ఖరీదైన వస్తువులు చాలా చౌకగా లభిస్తాయి. తైవాన్‌ సంప్రదాయ ఆహారం బాగా దొరుకుతుందక్కడ. తైపేలో ఉన్న చిసిన్‌ నైట్‌ మార్కెట్‌ చాలా పెద్దది- దాదాపు ఐదు వందల దుకాణాల సముదాయం. పూర్వం ఇక్కడ నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసేవారట. ఈ మార్కెట్టు స్టింకీ బీన్‌ కర్డ్‌ అనే అల్పాహారానికి ఎంతో ప్రసిద్ధి. ఇంకా తైవాన్‌లో పెద్దాచిన్నా కలిపి దాదాపు వందవరకూ నైట్‌ మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడ మన రోడ్డు పక్కనే పానీపూరీలా బబుల్‌ మిల్క్‌ అనే తేనీరు విక్రయిస్తారు. దీన్ని అంతా ఎంతో ఇష్టంగా తాగుతారు.

సాధారణంగా తైవానీయులు సన్నగానే ఉంటారు. ఎక్కడా బొజ్జలు కనిపించవు. అపార్టమెంట్లలో లిఫ్టులు ఎక్కువగా వాడరు. మెట్లెక్కడానికే ఇష్టపడతారు. వర్షం మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. కాలుష్యం అంటే చచ్చే భయం. కొన్ని సెకన్లు వానలో తడిచినా ఆమ్లవర్షంలో తడిసినట్లు బాధపడిపోతారు. అమ్మాయిలకు సౌందర్య పోషణ ఎక్కువే. ఎండలోకి వెళితే నల్లబడిపోతామని భయపడుతుంటారు. తైవానీయులు కష్టజీవులు, తెలివైనవాళ్లు. అక్కడి పిల్లలు కూడా మనవాళ్లలానే బాగా కష్టపడి చదువుతారు. స్కూళ్లలో చిన్నప్పటినుంచీ గణితం, సంగీతం ప్రధానంగా నేర్పిస్తారు. ప్రపంచంలోకెల్లా గణితంలో అత్యధికంగా మార్కులు వచ్చేది వాళ్లకేనట. కొందరు పిల్లలకి అక్కడివాళ్లు కింగ్‌, సర్కిల్‌, లయన్‌ వంటి ఇంగ్లిష్‌ పేర్లు పెట్టడం చిత్రంగా అనిపించింది. పెద్దవాళ్లలో 96 శాతం మంది చదవగలిగిన వాళ్లే. ముఖ్యంగా అక్కడ నాకు నచ్చిందేమంటే వీధుల్లో చెత్తబుట్టలు కనిపించవు. ఇళ్లముందూ ఆఫీసులముందూ కూడా ఉండవు. గంట మోగించుకుంటూ చెత్త ట్రక్కులు వచ్చినప్పుడే ఇళ్లలోనుంచి తీసుకెళ్లి వేస్తారు.

తైవాన్‌ దేశం మొత్తాన్నీ ఆరు గంటల్లో కారులో చుట్టి రావచ్చట. అలా వెళ్దాం అనుకునేంతలోనే అక్కడ వరదలు రావడం, కొండచరియలు విరిగి పడటం జరిగింది. దాంతో పాఠశాలలో వీడ్కోలు తీసుకుని తిరిగి బయల్దేరక తప్పలేదు. విమానాశ్రయంలో నా తోటి ప్రయాణికులు కొందరు తైవానీయులు స్నేహశీలురు అని మెచ్చుకున్నారు. కానీ అస్సలేమాత్రం పరిచయంలేని ఓ వ్యక్తిని కుటుంబసభ్యుల్లో ఒకరిగా చూసుకున్న బెంజమన్‌గారి కుటుంబాన్ని చూశాక, ఆ మాట చాలా చిన్నదిగా అనిపించింది. ఆ కుటుంబంతోబాటు ఉపాధ్యాయులంతా నేను వచ్చాక కూడా తరచూ సంభాషిస్తూనే ఉన్నారు. చైనా నుంచి వేరుపడి, సొంత గుర్తింపుకోసం పోరాడుతున్న తైవాన్‌ ప్రజలు తమ గొప్ప మనసుతో అందరి మనసులనీ గెలుచుకోవడమే కాదు, మళ్లీ మళ్లీ ఆ దేశాన్ని సందర్శించాలనే కోరికను కలిగిస్తారనడంలో కాస్త కూడా సందేహం లేదు. అందుకే తైవానీయులు గొప్ప స్నేహితులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.