close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అనుబంధానికో అందమైన రాఖీ..!

అనుబంధానికో అందమైన రాఖీ..!

మారిన జీవనశైలిలో భాగంగా పలకరింపుల్లో తేడాలు వచ్చి ఉండొచ్చు, ఒకరినొకరు నేరుగా చూసుకోలేనంత దూరాలూ పెరిగి ఉండొచ్చు. కానీ ఆప్యాయతానురాగాల్లో మాత్రం కొంచెం కూడా తేడా లేదు. అవునుమరి, అది రక్తసంబంధం... అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధం. ఆ అనుబంధాన్ని మరింత గాఢంగా ముడివేస్తూ ఏడాదికోమారు శ్రావణమాసంలో జరుపుకునే అపురూపమైన వేడుకే రాఖీపౌర్ణమి లేదా రక్షాబంధన్‌. ఆ రోజున చంద్రుడికో నూలుపోగులా అన్నదమ్ముల శ్రేయస్సును కోరుకుంటూ వాళ్ల ప్రేమ తమకు చిరకాలం ఉండేలా ఆకాంక్షిస్తూ రక్షరేకును చుట్టిన పసుపు, ఎరుపు దారాలను వాళ్ల చేతికి అక్కాచెల్లెళ్లు కట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఆ దారాలే నేడు అనేక వెరైటీల్లో దొరుకుతూ కట్టేవారి, కట్టించుకునేవారి మనసును దోచుకుంటున్నాయి.

వజ్రాల రాఖీలు!
భవిష్య పురాణం ప్రకారం- బాలి అనే రాక్షసరాజును సంహరించేందుకు విష్ణుమూర్తి సలహామేరకు శచీదేవి పూజించిన ఓ నూలుదారాన్ని భర్త చేతికి కట్టి పంపించిందనీ, ఆ యుద్ధంలో ఇంద్రుడు గెలిచి రావడంతో కదనరంగానికి వెళ్లేముందు తమ భర్తలకీ అన్నలకీ మహిళలు పవిత్ర దారాన్ని రక్షాబంధనంలా కట్టడం వాడుకలోకి వచ్చిందనీ, అదే సోదరసోదరీప్రేమకు ప్రతీకగా మారిందనేది పురాణ కథనం. కైకేయ(పౌరవ)సామ్రాజ్యాన్ని పాలించిన పురుషోత్తమచక్రవర్తికి అలెగ్జాండర్‌ భార్య రొక్సానా ఓ పవిత్ర దారాన్ని పంపించి, తనను సోదరిలా భావించి, తన భర్తను చంపవద్దని కోరిందట. అది కట్టుకున్న కారణంగానే ఆ చక్రవర్తి, యుద్ధంలో అలెగ్జాండర్‌ను అవకాశం వచ్చినా చంపలేదన్నది చారిత్రక కథనం. అందుకే రక్తసంబంధీకులనే కాదు, పరాయి స్త్రీ, పురుషులమధ్య ఉండే సోదరసోదరీ ప్రేమను సూచిస్తూ ఈ వేడుకను చేసుకుంటారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, తోటిఉద్యోగులు, విద్యార్థులు... ఇలా తమకు రక్షగా నిలిచే వాళ్లందరికీ అమ్మాయిలు రాఖీలు కట్టడం అలా పుట్టుకొచ్చినదే. దాంతో ఒకప్పుడు తమ అన్నదమ్ములకోసం స్వయంగా చేసుకునే ఆ రక్ష రేకులు, నేడు బంగారం, వెండి, వజ్రాలు, నవరత్నాలతో చేసిన అందమైన ఆభరణాల రూపంలో కనువిందు చేస్తున్నాయి. కొన్ని నగల దుకాణాలయితే, ఆ రోజు కోసం ఒక్కోటీ యాభై లక్షల రూపాయల విలువచేసే ఖరీదైన వజ్రాల రాఖీలను సైతం రూపొందిస్తున్నాయి. అంతేకాదు, బ్రొ, భాయ్‌... వంటి పదాలను చెక్కిన బంగారు రాఖీలూ, తెల్లరాళ్లను పొదిగిన వెండి బంధనాలూ నవరత్నాల లాకెట్లతో చేసిన ఆభరణాల్లాంటి రాఖీలు ఈతరాన్ని అలరిస్తున్నాయి. అంత ధరలు పెట్టలేనివాళ్లకోసం సహజాతి రత్నాలను పొదిగి వెండి, బంగారు పూత పూసినవీ చేస్తున్నారు. ఇక, జర్దోజి, దారం ఎంబ్రాయిడరీలూ రాళ్లూ రుద్రాక్షలూ క¹లిపి రూపొందించే డిజైనర్‌ రాఖీలు టీనేజర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

చిన్నారి రక్ష!
ఇవన్నీ ఒక ఎత్తయితే, పిల్లలకోసమే ప్రత్యేకంగా బ్యాట్‌మన్‌, స్పైడర్‌మ్యాన్‌, పోకెమాన్‌, మిక్కీ, మిన్నీమౌస్‌ల్లాంటి కార్టూన్‌ క్యారెక్టర్లూ; ఛోటాభీమ్‌, హనుమాన్‌, శ్రీకృష్ణ... వంటి పౌరాణిక పాత్రల రాఖీలూ వస్తున్నాయి. చిట్టిచెల్లెళ్లు కట్టే ఆ రాఖీలను పదేపదే చూసుకుంటూ మురిసిపోతున్నారు ఆ చిన్నారి అన్నలూ తమ్ముళ్లూనూ. తండ్రి తరవాత తండ్రిలా ఆలనాపాలనా పట్టించుకునే అన్నకి కట్టి, అమ్మ తరవాత అమ్మలా తమ బాగోగుల్ని చూసుకునే వదినమ్మకి కట్టకపోతే ఏం బాగుంటుందన్నట్లు ఈమధ్య అన్నావదినలిద్దరికీ రాఖీ కట్టడం ఆనవాయితీ అయింది. భయ్యాభాభీ సెట్స్‌ పేరుతో వస్తోన్న ఈ రాఖీలు ఆన్‌లైన్‌లో తెగ సందడి చేస్తున్నాయి. ఈ రెండింటికీ మరో రెండు చిట్టి రాఖీలను జోడించిన కుటుంబ రక్షాబంధన్‌ సెట్లూ దొరుకుతున్నాయి. అయితే రాఖీల్లో ఎన్ని రకాల డిజైన్లు వస్తున్నా ఇప్పటికీ పూల డిజైన్లదే హవా. సిల్కుదారాలతో అల్లిన కృత్రిమపూలూ బంగారుపూలూ చొప్పించి చేతినిండుగా అందంగా కనిపించేలా రాఖీలు తయారుచేస్తున్నారు. ఆయా వ్యక్తుల పేర్లూ, ఫొటోలతో రూపొందించిన పర్సనలైజ్డ్‌ రాఖీలూ వస్తున్నాయి. అన్నదమ్ముల ఫొటోలతోనూ, తమ అన్యోన్యతను సూచించే ఫొటోలతోనూ రాఖీలు చేయిస్తున్నారు. చూశారుగా... తమకు జీవితాంతం రక్షగా నిలిచే అన్నదమ్ముల శ్రేయస్సును కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ, ఏటా శ్రావణపౌర్ణమినాడు వాళ్ల ముంజేతికి అక్కచెల్లెళ్లు ఎంతో ఆప్యాయంగా కట్టే ఆ రక్షాబంధనాల్లో ఎన్ని రకాలు వస్తున్నాయో. అందరికీ రాఖీ శుభాకాంక్షలతో..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.