close
తిరిగిచ్చేయడానికే పోలీసునయ్యా

తిరిగిచ్చేయడానికే పోలీసునయ్యా

అతడు అడుగుపెట్టాడు... అనంతపురంలో ఫ్యాక్షనిజం అదుపులోకి వచ్చింది. విశాఖ పట్టణంలో అడవిలోని అన్నలు జనంలోకి వచ్చారు. వరంగల్‌ పల్లెల్లో ఎంతోమంది ఉసురు తీసిన గుడుంబా ఉనికిని కోల్పోయింది. హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల మాఫియా వూపిరిపీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది... అతడే తెలంగాణ ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అకున్‌ సబర్వాల్‌. డ్రగ్స్‌ దందా గుట్టు రట్టు చేసి జనం మనసులు గెలిచిన ఈ హీరో పోలీస్‌ తన గురించి ఎన్నో విశేషాలను పంచుకున్నారిలా...

మాజంలో ఏం జరుగుతోందో పూర్తిగా అర్థమయ్యేవరకూ నాకు పోలీస్‌ అవ్వాలనే ఆలోచన రాలేదు. అందుకే, డాక్టర్‌ అవ్వాలని ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ(బీడీఎస్‌)’ చదవడానికి పటియాలాలోని గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలో చేరా. అప్పట్లో పంజాబ్‌లో ఇంకా తీవ్రవాదం కాస్త ఉంది. మరోవైపు చూస్తే మా కాలేజీలో చదివిన వాళ్లలో అరవై డెబ్భై శాతం మంది చదువైపోయాక విదేశాలకు వెళ్లి స్థిరపడేవారు. థర్డ్‌ ఇయర్‌లో ఆ విషయాల గురించి ఫ్రెండ్స్‌ ముగ్గురు నలుగురం మాట్లాడుకుంటున్నపుడు అనిపించింది సమాజానికి నా వంతుగా కొంత తిరిగివ్వాలని. నాన్న ఎయిర్‌ఫోర్స్‌లో ఆఫీసర్‌. తాత ఆర్మీలో పనిచేశారు. అలాగే నేను పోలీస్‌ అవ్వాలనుకున్నా. బీడీఎస్‌ ఫైనలియర్‌ చదువుతూనే సివిల్స్‌కీ చదవడం మొదలుపెట్టా. మా కాలేజీ ప్రిన్సిపల్‌, నాన్నా ఒకే స్కూల్లో చదివారు. దాంతో నేను ఫైనలియర్‌ చదువుతున్నపుడే ఫేషియల్‌ సర్జరీలు బాగా చేస్తున్నాననీ ఇంకా బాగా నేర్చుకునేందుకు స్విట్జర్లాండ్‌ పంపిద్దామనీ నాన్నకు చెప్పారు. అందులోభాగంగానే ఇంటర్న్‌షిప్‌ కోసం నన్ను దిల్లీ పంపించారు. దిల్లీలో ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండడంవల్ల ప్రమాదాలు బాగా జరిగేవి. అలాంటపుడు కళ్ల కింద ఉండే పలుచటి ఎముకకు చిన్న దెబ్బ తగిలినా విరిగిపోతుంది. ఆసుపత్రిలో నాకు ఆ సర్జరీ చేసే పని అప్పగించేవారు. ఉదయం 8గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం రెండు గంటలవరకూ మూడు నాలుగు ఆపరేషన్లు చేసేవాడిని. ఆ తర్వాత ఖాళీనే. ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చేసి నాలానే అక్కడికి వచ్చిన ఆనంద్‌రెడ్డీ నేనూ ఒకే గదిలో ఉండేవాళ్లం. అతనికి డ్యూటీ సాయంత్రం. ఇద్దరం కలసి సివిల్స్‌కు చదవాలనుకున్నాం. ఒకే నోట్సు రాసుకుని ఒకే పుస్తకాలను ఒకరు ఉదయం, ఒకరు సాయంత్రం చదివేవాళ్లం. మొదటి ప్రయత్నంలోనే 33వ ర్యాంకు వచ్చింది. ఐపీఎస్‌ అయ్యి నా ఆశయంలో మొదటి విజయం సాధించా. తర్వాత నా స్నేహితుల్లో కొందరూ సివిల్స్‌కి ఎంపికయ్యారు. కానీ, మా క్లాస్‌లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కలిపి 150మంది ఉంటే అందులో వందమందికి పైగా ప్రస్తుతం కెనడా, అమెరికా, బ్రిటన్‌లలో ఉన్నారు.

బాల్యం ఎంతో మధురం
నేను పుట్టింది పంజాబ్‌లోని పటియాలాలో. నాన్న ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌ కావడంతో చిన్నతనం అంతా పుణె, దిల్లీ, లద్దాఖ్‌, వూటీ, అసోం... ఇలా ఒక్కోచోట గడిచింది. నగరాలు మారినప్పుడల్లా నన్నూ తమ్ముడినీ అక్కడున్న కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లోకి మార్చేవాళ్లు. నా చదువు మొత్తంలో ప్రైవేటు పాఠశాలలో చదివింది రెండేళ్లు మాత్రమే. మామూలుగానే నేను కొంచెం సైలెంట్‌. దానికి తోడు అమ్మ మా స్కూల్లో టీచర్‌గా చేసేది. ఇక, అల్లరి చెయ్యడానికి అవకాశం ఎక్కడ ఉంటుందీ... అలా అని చదవమని తను మరీ ఒత్తిడి కూడా చేసేది కాదు. నేనే బాగా చదివేవాడిని. మెడికల్‌ కాలేజీలో చదివేటపుడూ అంతే. ప్రిన్సిపల్‌ నాన్న స్నేహితుడు కాబట్టి, అల్లరి పనులు చేసే అవకాశమే దొరకలేదు. కానీ చిన్నతనంలో నాకు మరచిపోలేని అనుభూతులు ఎన్నో ఉన్నాయి. లద్దాఖ్‌లో ఉన్న రోజులైతే మరీ ప్రత్యేకం. ‘త్రీ ఇడియట్స్‌’ సినిమాలో ఆఖరి సీన్‌లో ఓ సరస్సు కనిపిస్తుంది కదా... అది లద్దాఖ్‌లోని పెంగాంగ్‌ లేక్‌. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. శని, ఆదివారాలు వస్తే చాలు, నాన్న జిప్సీలో నన్నూ తమ్ముడినీ అక్కడకు తీసుకెళ్లేవారు. సరస్సు ఒడ్డున టెంట్‌ వేసుకుని గడిపేవాళ్లం. అక్కడ ఎత్తుగా ఓ శిఖరం కనిపించేది. ‘ఎప్పటికైనా నేను దానిపైకి ఎక్కుతా’... అని అమ్మకు కనీసం ఏడెనిమిది సార్లు చెప్పుంటా. అప్పుడేమో చాలా బక్కగా చిన్నగా ఉండేవాడిని. దాంతో నా డైలాగులు విని అమ్మ నవ్వేది. నాన్న ఉద్యోగరీత్యా ఎక్కువగా దూరంగా ఉండటం వల్ల అమ్మతోనే బాగా సాన్నిహిత్యం ఉండేది. అన్నీ తనతోనే పంచుకునేవాడిని. మిజోరంలో మేం ఉండే ప్రాంతంలో క్రైస్తవులు ఎక్కువగా ఉండడంతో క్రిస్మస్‌ సీజన్‌లో రోడ్డు మొత్తం సెలెబ్రేషన్స్‌ జరిగేవి. ఎయిర్‌బేస్‌ నుంచి అదంతా చూస్తుంటే చాలా బాగుండేది. ఇక, ఎయిర్‌ఫోర్స్‌ క్యాంపులో ఉన్నపుడు అదో మినీ ఇండియాలా ఉండేది. ఇటు పంజాబీ అటు మరాఠీ పైన బెంగాలీ... ఒకరింట్లో ఒకరం తినేవాళ్లం. పిల్లలందరం ఒకే బడికి వెళ్లేవాళ్లం. ఇలా దేశంలోని ఒక్కోచోటుకి తిరుగుతున్నపుడు ఒక్కో కొత్త అనుభవం, అనుభూతి.

ఉద్యోగం... పెళ్లి...
2001లో ఐపీఎస్‌ అధికారిగా సర్వీసులో చేరా. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ నా భార్య. ఇద్దరం ఒకే బ్యాచ్‌. తనకు మొదటి ప్రయత్నంలోనే నాలుగో ర్యాంకు వచ్చింది. బ్యాచ్‌లో మేమిద్దరం అందరికన్నా చిన్న వాళ్లం. స్మిత బ్యాచ్‌లో చాలా అందమైన అమ్మాయి కూడా. హలో హాయ్‌తో మొదలైన మా పరిచయం తర్వాత స్నేహంగా మారింది. నేనే సైలెంట్‌ అంటే తను నాకన్నా సైలెంట్‌గా ఉండేది. దాదాపు రెండేళ్లు మామూలుగానే ఫోన్లో మాట్లాడుకున్నాం. ఓరోజు మాటల్లో ‘నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా’ అని అడిగా. ‘ఇష్టం ఉంది కాబట్టేగా ఇన్ని రోజుల్నుంచీ మాట్లాడుతున్నా...’ అంది. స్మిత వాళ్లది బెంగాలీ కుటుంబం. వాళ్ల నాన్న ఆర్మీ ఆఫీసర్‌, అమ్మ టీచర్‌. అందుకే, చిన్నప్పుడు తను కూడా నాలానే చాలా నగరాలు మారాల్సొచ్చింది. తర్వాత వాళ్ల కుటుంబం సికింద్రాబాద్‌లో స్థిరపడింది. ఇద్దరి కుటుంబ నేపథ్యాలూ చాలా భిన్నమైనవైనా నాన్న వెళ్లి వాళ్ల నాన్నగారితో మాట్లాడ్డంతో పెళ్లికి ఒప్పుకున్నారు. 2003లో హైదరాబాద్‌లోనే మా పెళ్లైంది. మాకు ఇద్దరు పిల్లలు. బాబు నానక్‌, పాప భువిస్‌. ఏడో తరగతీ, ఐదో తరగతీ చదువుతున్నారు.

పోస్టింగ్‌లో చేరాక ట్రెయినింగ్‌ హైదరాబాద్‌లో అయింది. ప్రస్తుతం ఇక్కడి కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ మహేందర్‌ రెడ్డి సర్‌ అప్పుడు నా ట్రెయినర్‌. ఇప్పటికీ ఆయన నాకు గురువే. శిక్షణ తర్వాత మొదటి రెండేళ్లూ అసోంలో పనిచేశా. పెళ్లైన తర్వాత ఏడెనిమిది నెలలకు అనంతపురంలో పోస్టింగ్‌ ఇచ్చారు. స్మిత అప్పుడు కడపలో చేసేది. సరిగ్గా నేను జాయిన్‌ అవడానికి వెళ్లిన రోజే పరిటాల రవి హత్య జరిగింది. డీజీ స్వరణ్‌జిత్‌ సేన్‌ సర్‌ని కలవడానికి వెళ్లేసరికి ఆయన టీవీలో హత్యకు సంబంధించిన విజువల్స్‌ని చూస్తున్నారు. నన్ను చూసి, ధర్మవరానికి వెళ్లు అన్నారు. నాకేమీ అర్థం కాలా. బయటకొచ్చి స్మితకు ఫోన్‌ చేసి ధర్మవరం అంటున్నారు, అదెక్కడ... అని అడిగా. నేను ధర్మవరం వెళ్లేసరికి 30 బస్సుల్ని కాల్చేశారు. పరిస్థితి అంతా హింసాత్మకంగా ఉంది. ఇంకో ఐపీఎస్‌ ఆఫీసర్‌, నేనూ నాలుగైదు నెలలు ఇంచుమించు అక్కడ రోడ్డు మీదే ఉన్నాం. అనంతపురం వెళ్లినపుడు నాకు ఒక్కముక్క తెలుగు రాదు. దాంతో పరిటాల సునీతగారితో మాట్లాడ్డానికీ చాలా ఇబ్బంది అయ్యేది. తర్వాత నేర్చుకున్నా. అనంతపురం తర్వాత వరంగల్‌లో పనిచేశా. ఈ డ్రగ్స్‌ కేసుల వల్ల ఇప్పుడు నా గురించి బయటికొచ్చింది కానీ... నాకు ఎక్కువ సంతృప్తి ఇచ్చిన విషయం మాత్రం వరంగల్‌లో గుడుంబాను అరికట్టడమే. చాలామందికి తెలియనిది ఏంటంటే... వరంగల్‌, ఖమ్మంలలో గుడుంబా ఎప్పట్నుంచో పాతుకుపోయి ఉంది. చాలా గ్రామాల్లో అది ఉపాధి కూడా. అలా గుడుంబా తయారుచేసేవాళ్లు దాన్ని ఎక్కువగా తాగడం వల్ల అక్కడ కొన్ని వూళ్లలో మగాళ్లే లేకుండా చనిపోయారు. అది తట్టుకోలేకపోయాను. మా బృందం అంతా కలసి ఆయా ప్రాంతాల్లో గుడుంబా తయారీని చాలావరకూ నిర్మూలించాం. ప్రజలకు మంచి జరగాలనే అదంతా చేశాం. కానీ వాళ్లు ఉపాధిని కోల్పోయారు. ఆ విషయం చెబితే తెలంగాణ ప్రభుత్వం రూ.160 కోట్లు మంజూరు చేసింది. గేదెలు కొనుక్కోవడానికీ దుకాణాలు పెట్టుకోవడం లాంటి వాటికీ ఒక్కో కుటుంబానికీ రూ.రెండు లక్షల చొప్పున 7,800 కుటుంబాలకు సాయం అందించాం. ఇప్పటికీ ఎప్పుడైనా అక్కడికి వెళ్తే జనం వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పు గురించి ఎంతో సంతోషంగా చెబుతారు. అదే నాకు గొప్ప సంతృప్తి.

వైజాగ్‌లో ఎస్పీగా మూడేళ్లు పనిచేశా. ఆ సమయంలో మేం చేసిన ప్రయత్నాల వల్ల నక్సల్స్‌ చాలామంది లొంగిపోయారు. ఇప్పుడు మావోయిస్టు సమస్య తెలుగు రాష్ట్రాల్లో దాదాపు లేదనే చెప్పాలి. హైదరాబాద్‌కి వచ్చాక ఏసీబీలోనూ, డిప్యూటీ కమిషనర్‌ సెంట్రల్‌, డిప్యూటీ కమిషనర్‌ సౌత్‌... ఇలా వేరు వేరు హోదాల్లో పనిచేశా. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ఉస్మానియా దగ్గర ఉద్రిక్తతలు లేకుండా చూడడం కత్తిమీద సాము లాంటిదే. అప్పుడున్న మా టీమ్‌ చాలా బాగా పనిచేసింది. హైదరాబాద్‌ సౌత్‌జోన్‌లో పనిచేశాక నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో కొత్తగా చేరే పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు రమ్మన్నారు. అక్కడ హెడ్‌ ఆఫ్‌ అవుట్‌డోర్‌ ట్రెయినీగా పనిచేసిన మూడేళ్లలో నాలుగు బ్యాచ్‌లకు కలిపి 600 మంది ఐపీఎస్‌ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చా. దేశంలో ఎక్కడికెళ్లినా వాళ్లలో ఎవరో ఒకరు కనిపిస్తారు. కొందరైతే శిక్షణ సమయంలో ఏడ్చేవాళ్లు కూడా. కానీ ఇప్పుడు నన్ను దేవుడిలా చూస్తుంటారు. మేం కూడా మా ట్రెయినర్‌ని అలాగే ఆరాధిస్తాం. ఐపీఎస్‌ సర్వీసులో ట్రెయినర్‌కి అంత విలువ ఉంటుంది.

తనే నా బెస్ట్‌ ఫ్రెండ్‌
స్మిత గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తన మీద ఎవరైనా నమ్మకం పెడితే వమ్ముకానివ్వదు. ఇంట్లో అయినా బయట అయినా అంతే. ఎవరైనా వచ్చి ‘ఈ కష్టం ఉందమ్మా’ అని అడిగితే ఆ సమస్యను తీర్చే వరకూ దాని గురించే ఆలోచిస్తుంది. తన మొదటి పోస్టింగ్‌ మదనపల్లి. కరీంనగర్‌లో కలెక్టర్‌గా చేస్తున్నపుడు ఒక్కోసారి రాత్రి కూడా గ్రామాల్లోనే ఉండిపోయేది. తన వల్ల కరీంనగర్‌, సిద్ధిపేట్‌ ప్రాంతాల్లో చిన్న చిన్న ఆసుపత్రులక్కూడా అన్ని సౌకర్యాలూ వచ్చాయి. స్మితకు వంట రాదు. ఎప్పుడైనా ఆమె వంట గది వైపు వెళ్తుంటే... ‘సరే నేను వూరెళ్తున్నా’ అని జోక్‌ చేస్తుంటా. కానీ ఎవరైనా వంట కోసం పెళ్లి చేసుకోరు కదా... యాభై అరవయ్యేళ్లపాటు మనకు నచ్చిన వ్యక్తితో కలసి బతకడానికి చేసుకుంటాం. ఆ విషయమే తనతో చెప్తుంటా. మేమిద్దరం భార్యాభర్తల్లా కన్నా ఎక్కువగా స్నేహితుల్లా ఉంటాం. స్మితానే నా బెస్ట్‌ ఫ్రెండ్‌.

డ్రగ్స్‌ సమస్యను బయటకు తేవాలని ఇంతకుముందు కూడా ప్రయత్నించారు. కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఆ క్రెడిట్‌ నా ఒక్కడిదే కాదు, మా టీమ్‌ అంతా చాలా కష్టపడుతున్నారు. మీడియాలో సినిమా వాళ్ల గురించి ఎక్కువ వస్తోంది

కానీ... భవిష్యత్తు తరాలని కాపాడాలన్నదే మా అసలు ప్రయత్నం. మాదకద్రవ్యాలు లేని హైదరాబాద్‌ని చూడాలన్నదే మా ధ్యేయం.

ఇంకొంత...

నాపేరుని అకుంత అని పెట్టారు తాత గారు. కానీ మిగిలినవాళ్లు అకున్‌ అని వినేసి రిజిస్టర్‌లో అలానే రాయించారు. ఆ పదాన్ని భీష్ముడిని ఉద్దేశించి వాడతారు. అంటే బాగా జ్ఞానం కలిగినవాడని అర్థం.

* ఫిట్‌నెస్‌ కోసం రోజూ రెండు గంటలు జిమ్‌ చేస్తా. ఏడాదికి రెండుమూడు సార్లు మారథాన్‌కి వెళ్తుంటా. వీలైనప్పుడల్లా హార్స్‌ రైడింగ్‌, సైక్లింగ్‌, బైక్‌ రైడింగ్‌కీ వెళ్తా. 

* పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా లద్దాఖ్‌లోని ఆ శిఖరం ఎక్కుతా అని అమ్మకు చెప్పా. కానీ తనిప్పుడు లేదు. కొన్ని నెలల కిందే చనిపోయింది. ఆ లోటు ఇంకెవరూ తీర్చలేనిది. ఆ శిఖరాన్ని ఎక్కాలని ఈమధ్య ప్లాన్‌ చేసుకున్నా. సెలవు దొరకలేదు. వచ్చే ఏడాది తప్పకుండా వెళ్తా.

- యార్లగడ్డ మధులత

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.