close
అంతరంగదర్పణం

అంతరంగదర్పణం
- పసుపులేటి సత్యవేణి

‘‘సాయంత్రం మీరు వచ్చాక మనం షాపింగ్‌కి వెళుతున్నాం’’ అంది భువన.

‘‘ఆర్డరేస్తున్నారా మేడమ్‌’’ నవ్వుతూ అడిగాడు శ్రీరామ్‌.

‘‘మీరలా అనుకుంటే అలానే’’ నవ్వు దాచుకుంటూ అంది.

‘షాపింగ్‌కి సౌమ్యా, నువ్వూ వెళ్ళిరావచ్చు కదా’ అనబోయి మాటలు మనసులోనే నిలిపేశాడు. భువన సౌమ్యతో క్లోజ్‌గా మూవ్‌ అవుతున్నట్లు అనిపించడంలేదు శ్రీరామ్‌కి. ఒకసారి భువనతో మాట్లాడాలి అనుకున్నాడు. ‘‘ఓకే బై సీయూ ఇన్‌ ద ఈవినింగ్‌’’ అన్నాడు భువనతో. తల్లికి కూడా చెప్పి బ్యాంక్‌కి బయలుదేరాడు.

శ్రీరామ్‌, భువనల పెళ్ళయి ఇరవైఆరేళ్ళు. శ్రీరామ్‌ స్టేట్‌బ్యాంకులో మేనేజర్‌. వీళ్ళకి ఒక్కడే కొడుకు. సంతోష్‌. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. శ్రీరామ్‌ తల్లి సావిత్రమ్మ కూడా వీరితోపాటే ఉంటుంది. ఆవిడకు కాస్త నోరెక్కువ. ప్రతీ విషయంలోనూ ఆవిడ జోక్యం ఉంటుంది. ఎవరేం మాట్లాడుకుంటున్నా, ఆవిడకు సంబంధం ఉన్న విషయమైనా, లేని విషయమైనా మధ్యలో కల్పించుకుని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది.

సంతోష్‌ పెళ్ళయి రెండునెలలు కావస్తోంది. సౌమ్య పేరుకు తగ్గట్టుగానే సౌమ్యమైన అమ్మాయి. పెళ్ళయిన నెలలోపు ముహూర్తం ప్రకారం కొత్త కోడలు అత్తారింటి గృహప్రవేశం జరిగింది. సావిత్రమ్మ తోడికోడలు అక్క కూతురు శారద, అల్లుడు ఆనందరావు. వారి అమ్మాయి సౌమ్య. శ్రీరామ్‌ కుటుంబమంటే శారద, ఆనందరావులకు చాలా ఇష్టం. వాళ్ళు పట్టుబట్టి ఖాయం చేసుకున్నారు ఈ సంబంధాన్ని. సౌమ్య అందచందాలతో, వినయవిధేయతలతో అందరి మనసులనూ దోచేసుకోవడంతో సంతోష్‌-సౌమ్యల కళ్యాణఘట్టం కడు కమనీయంగా జరిగింది. సౌమ్య బీటెక్‌ చేసింది. ప్రస్తుతానికి జాబ్‌ చెయ్యట్లేదుగానీ, వీలైతే జాబ్‌ చెయ్యాలనే ఉందని పెళ్ళికిముందు అంది. ‘చూద్దాంలే అమ్మా’ అంది భువన.

భువన చాలా అందంగా ఉంటుంది. ఆ అందంవల్లే ఆమె నాన్నమ్మ ఆమెకు భువనసుందరి అని పేరుపెట్టింది. పెళ్ళిచూపుల్లో నడయాడే వెన్నెల శిల్పంలా ఉన్న ఆమె అందానికి ముగ్ధుడై శ్రీరామ్‌ కన్నార్పకుండా ఆమెవైపు తదేకంగా చూడడం, ఆ విషయం అక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించడం జరిగింది. పెళ్ళయిన తరవాత కూడా శ్రీరామ్‌ కనిపించినప్పుడల్లా భువన కజిన్స్‌ ఈ విషయమై శ్రీరామ్‌ని ఆటపట్టించేవారు. ‘పరిమళించే బంగారుపుష్పం ఎదురుగా ఉంటే ఎవరైనా అలాగే చూస్తారు’ అనేవాడు శ్రీరామ్‌.

భువన సున్నిత మనస్కురాలు. తన పనేదో తనదే తప్ప అనవసర విషయాలలో జోక్యం చేసుకోదు. సావిత్రమ్మకి భువన ప్రవర్తన గర్వంలా అనిపించేది. సావిత్రమ్మ మంచిదేకానీ ‘అత్తగారి పెత్తనం చెయ్యకపోతే కోడలు నెత్తిమీదకెక్కి కూర్చుంటుంది’ అనే సిద్ధాంతాన్ని జీర్ణించుకోవడంవల్ల కోడలి మీద అధికారం చూపించేది. వంటింట్లోనైనా, ఏ ఇతర పనుల్లోనైనా అత్త-కోడలు ఇద్దరూ ఉండేవారు. కానీ పనంతా మాత్రం భువనచేత చేయించేది. ఆవిడ పైపైన అజమాయిషీ చేసేది. మొదట్లో భువన మనసు అత్తగారి అధికారానికి ఎదురుతిరిగేది. కానీ ఆవిడలోని మంచితనం అర్థంచేసుకున్న తరవాత సర్దుకునిపోయింది. అయితే, అత్తగారి సిద్ధాంతం భువనకు తెలియకుండానే ఆమె మనసులో కూడా పాతుకుపోయింది. అత్తకీ కోడలికీ మధ్య ఒక సన్నని గీత మనసులోనే గీసేసుకుంది. కోడలితో చనువుగా ఉంటే లోకువ కట్టేసి మాట వినకుండా అవుతుందేమోననే భ్రమలో ఉండి తెచ్చిపెట్టుకున్న అత్తగారి గాంభీర్యంతో సౌమ్యతో కాస్త గ్యాప్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తోంది.

‘‘అత్తయ్యగారూ, రేపు వదినగారింట్లో సత్యనారాయణస్వామి వ్రతం కదా... నేనూ, ఆయనా సాయంత్రం వెళ్ళి గిఫ్ట్‌గా ఏదైనా వెండివస్తువు తీసుకుంటాం’’ అంది భువన సావిత్రమ్మతో.

‘‘సరేనమ్మా, సుధ దగ్గర ఉన్న వెండి సామాన్లన్నీ నీకు తెలుసు కదా, దాని దగ్గర లేనిదేదైనా తీసుకో’’ అంగీకారంతోపాటు సలహా కూడా ఇచ్చింది సావిత్రమ్మ.

భువనకు ఒక ఆడపడుచు సుధ. అదే వూళ్ళొ ఉంటోంది. ఒక అరగంట పడుతుంది వాళ్ళింటికి. సుధ భర్త జయకృష్ణ గవర్నమెంటు కాలేజీలో లెక్చరర్‌గా చేసి రిటైర్‌ అయ్యాడు. వాళ్ళకి ఇద్దరు కొడుకులు- అర్జున్‌, ఆకాశ్‌. ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. అర్జున్‌ భార్య రవళి, ఆకాశ్‌ భార్య స్వరూప ఇద్దరూ సాఫ్ట్‌వేరే. ఇద్దరు కోడళ్ళూ ఉద్యోగాలు కావడంతో ఇంట్లో సుధ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఇంటిపనులకి పెట్టుకుందిగానీ వంటకు ఎవర్నీ పెట్టుకోలేదు. ఇంటిల్లిపాదికీ తన చేత్తో వండి వడ్డిస్తేనే ఆమెకు తృప్తి.

సావిత్రమ్మకి శ్రీరామ్‌, సుధ ఇద్దరే పిల్లలు. ‘ఆదివారం పూటైనా నీ కోడళ్ళు వంటింట్లోకి వస్తారా లేదా’ గదమాయిస్తున్నట్లు అడుగుతుంది సావిత్రమ్మ కూతుర్ని. ‘అదే నేనయితేనా ఆఫీసు నుండి వచ్చాక అయినా వాళ్ళచేత వంట చేయిద్దును. నువ్వు వాళ్ళకి పనులేమీ చెప్పకుండా బాగా అలవాటు చేసేశావు’ అంటుంది. సుధ తల్లి మాటలకు చిరునవ్వు నవ్వి ‘అమ్మా, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. వంటింట్లోకి ఎందుకు రారమ్మా... నువ్వు మరీను. నా బిడ్డలు నలుగురూ బంగారం’ అంటుంది మురిసిపోతూ.ఇద్దరు కోడళ్ళనూ సొంత కూతుర్లలా అభిమానిస్తుంది.

సావిత్రమ్మ మాటలు వినీవినీ సుధ కోడళ్ళమీద కూడా కాస్త సందేహంగానే ఉంటుంది భువనకు- ‘వదినగారు రవళినీ, స్వరూపనూ సొంత కూతుళ్ళలా చూసుకుంటున్నారు కదా... మరి వాళ్ళు కూడా అత్తగారిని అంతగా ప్రేమిస్తున్నారా లేదా’ అని.

‘సుధ వదినగారి మనసు నిజంగా అమృతమే! ఆవిడ మంచితనం, స్వభావం వల్లనే ఆ కుటుంబం ఆనందనిలయమై విలసిల్లుతోంది’ అనుకుంటూ ఉంటుంది. వారం రోజుల క్రితం జరిగిన విషయం స్మృతిలో మెదిలింది. తను వెళ్ళేసరికి స్వరూప గదిలోని కప్‌బోర్డు సర్దుతూ కనిపించింది సుధ.

‘‘ఏంటి వదినా, మీరు సర్దుతున్నారు? సెలవురోజెపుడో వాళ్ళే సర్దుకుంటారు కదా’’ అంది భువన.

‘‘ఏముందిలే భువనా, ఇది పెద్ద పనేమీ కాదు కదా... నిన్న రవళి కప్‌బోర్డు అయింది, ఇవాళ స్వరూప కప్‌బోర్డు - ఇప్పుడు సర్దేసుకుంటే హాలీడే ఎంజాయ్‌ చేయడానికి టైమ్‌ దొరుకుతుంది. ఇదిగో అయిపోవచ్చింది, మంచి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రా’’ అంది సుధ.

‘కావాలని పని పెంచుకోవడం ఎందుకు, వాళ్ళ పనులు వాళ్ళను చేసుకోనివ్వచ్చు కదా! పుట్టింట్లోలా గారం పెట్టేస్తున్నారు కోడళ్ళకి’ అనుకుంది మనసులో.

తనుమాత్రం కోడలితో ఎక్కువ చనువుగా ఉండదు. అలాగని కటువుగానూ ఉండదు. నార్మల్‌గా ఉంటుంది. ఒకవేళ సౌమ్య కూడా ఉద్యోగానికెళ్ళిపోతే తనుకూడా కోడలి పనులన్నీ చెయ్యాలా అని భయం. అందుకే మొదటినుండీ క్లోజ్‌గా మూవ్‌ అవకూడదని నిర్ణయించేసుకుంది.

ముందుగా అనుకున్నట్లుగానే శ్రీరామ్‌, భువనలు ఆ సాయంత్రం జ్యువెలరీ షాపుకు వెళ్ళారు. కొత్తగా వచ్చిన మోడల్స్‌ ఏమున్నాయా అని చూస్తుండగా పూలసజ్జ సెలెక్ట్‌ చేసింది భువన. అదే షాపులో అర్జున్‌, రవళి కనిపించారు భువనకు. వాళ్ళు భువనని చూడలేదు. బంగారు నెక్లెస్‌లూ, హారాలు ఉన్నవైపు ఉన్నారు. వాళ్ళని పలకరిద్దామని అటు వెళ్ళబోయింది భువన. ఈలోపులో బిల్లు పే చేసి వచ్చాడు శ్రీరామ్‌.

‘‘ఏమండీ, అర్జున్‌ వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళదగ్గరికెళదాం’’ అంది.

ఇపుడెలాగూ వాళ్ళింటికేగా వెళుతున్నాం, అక్కడ కలుస్తాంగా... మీ వదినతో కబుర్లకు నీకసలే టైమ్‌ సరిపోదు’’ అన్నాడు శ్రీరామ్‌. సరేననుకుంటూ సుధ వాళ్ళింటికి బయలుదేరారు. సుధ, జయకృష్ణలకు పట్టుబట్టలు రెండు రోజులక్రితమే కొనేశారు సావిత్రమ్మను కూడా షాపుకి తీసుకువచ్చి.

వెళ్ళేటప్పటికి ఎప్పటిలాగానే సుధ బిజీగానే ఉంది. అప్పుడే వంట పూర్తిచేసిందేమో చిరు అలసట మొహంలో. భువనే కిచెన్‌లోకి వెళ్ళి అందరికీ హార్లిక్స్‌ కలుపుకుని వచ్చింది. కూర్చుని కబుర్లు చెప్పుకుంటూండగానే టైమ్‌ ఎనిమిదయిపోయింది.

‘‘భువనా, రేపు ఉదయం త్వరగా వచ్చేయాలి’’ అంది సుధ.

‘‘అలాగే వదినా’’ అంది భువన.

మర్నాడు సుధ, జయకృష్ణల పెళ్ళిరోజు, షష్ఠిపూర్తి కూడా. శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం పెట్టుకున్నారు.

‘‘టైమ్‌ ఎనిమిది దాటిపోయింది, వీళ్ళెవరూ ఇంకా రాలేదేంటి?’’ అంది భువన. ఈలోపు పోర్టికోలో కార్లు ఆగడం, నలుగురూ ఒకేసారి లోపలకు రావడం జరిగింది.

‘‘ఏమ్మా, ఆఫీసులో లేటయిందా?’’ రవళి వైపు చూస్తూ అడిగింది సుధ. తలూపి చిరునవ్వు నవ్వారు వాళ్ళు.

భువన శ్రీరామ్‌ వైపు చూసింది. ‘చూడండి, వాళ్ళు ఎలా అబద్దం చెపుతున్నారో’ అన్న భావం ఆమె చూపులో అర్థం అవుతోంది శ్రీరామ్‌కి.

‘సరే సరే’ కళ్ళతోటే సమాధానమిచ్చాడు శ్రీరామ్‌ కూడా.

ఇప్పటివరకూ షాపింగ్‌లు చేసుకునివచ్చి కనీసం ఆ మాట కూడా చెప్పట్లేదు వీళ్ళు అత్తగారికి. వదిన వీళ్ళని అంతగా నమ్మింది కానీ వీళ్ళు చేస్తున్నదేమిటి..? ‘లేదత్తయ్యా, షాపింగ్‌కి వెళ్ళాం... ఇవిగో ఇవి కొనుక్కున్నా’మంటే వదిన కూడా సంతోషపడుతుంది కదా. ఇక ఈ చిన్నోళ్ళు... వీళ్ళెక్కడ పెత్తనాలు చేసివచ్చారో ఇప్పటివరకూ... రుసరుసలాడిపోయింది భువన మనసులో.

‘‘సరే వదినా, ఇక మేం బయలుదేరుతాం’’ అంటూ లేచింది భువన.

ఇంటికి వెళ్ళేటప్పటికి సౌమ్య వీరికోసం ఎదురుచూస్తూ కూర్చుంది బాల్కనీలో. తొందరగా వచ్చి అత్తగారి చేతిలోని ప్యాక్‌ అందుకుంది.

‘‘ఏమ్మా, ఇంకా సంతోష్‌ రాలేదా?’’ ఆప్యాయంగా పలకరించాడు శ్రీరామ్‌.

‘‘వచ్చారు మామయ్యగారూ. మీకోసం వెయిట్‌ చేస్తూ ల్యాప్‌టాప్‌లో వర్క్‌ ఏదో చేసుకుంటున్నారు’’ అంది సౌమ్య.

‘‘నువ్వూ, సంతోష్‌ డిన్నర్‌ చేసెయ్యవలసిందమ్మా’’ అన్నాడు శ్రీరామ్‌.

‘‘అమ్మమ్మగారికి టిఫిన్‌ పెట్టేశావా?’’ అడిగింది భువన గొంతులో అధారిటీని తెచ్చిపెట్టుకుంటూ.

‘‘పెట్టేశానత్తయ్యగారూ’’ అంది నెమ్మదిగా.

శ్రీరామ్‌ సౌమ్యతో చాలా ఆప్యాయంగా ఉంటున్నాడు. భువన మాత్రం అత్తగారి అతిశయం చూపిస్తోంది. ఇక సావిత్రమ్మ సౌమ్యకు బాగానే కనెక్ట్‌ అయింది. ఆవిడవైపు చుట్టరికం కదా... పైగా మనవరాలు అవుతుంది.

‘‘మనవరాలా, సాయంత్రం పెసరపప్పు వేసి ఉప్పుడుపిండి చెయ్యి నాకు.’’

‘‘అమ్మాయ్‌, గుత్తివంకాయకూర వెన్నవేసి చెయ్యడం నేర్పిస్తాను నడు’’ అంటూ బాగానే కలిసిపోయింది.

భువనతో మాట్లాడాలంటేనే కాస్త బెరుకుగా ఉంటోంది సౌమ్యకి.

ఆ విషయం గమనించినట్టున్నాడు సంతోష్‌ ‘‘ఎందుకు సౌమ్యా, అమ్మ దగ్గర టెన్షన్‌గా ఉంటున్నావు? అమ్మ అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటుంది, బి కంఫర్టబుల్‌’’ అన్నాడు.

మర్నాడు అందరూ కలసి సుధ వాళ్ళింటికి వెళ్ళారు. సత్యనారాయణస్వామి వ్రతం బాగా జరిగింది. దగ్గరి చుట్టాలూ కొంతమంది ఫ్రెండ్సూ వచ్చారు.

రవళి అందమైన కెంపులహారం అత్తగారి మెడలో అలంకరించింది.

‘‘ఎందుకమ్మా, ఇప్పుడు ఇది’’ ఆప్యాయంగా కోప్పడింది సుధ.

‘‘ఆశీర్వదించండి అత్తయ్యా మమ్మల్ని’’ సుధ, జయకృష్ణల పాదాలపై వాలారు అర్జున్‌, రవళిలు. కొడుకునీ కోడల్నీ ఆశీర్వదించి అక్కున చేర్చుకున్నారు సుధ దంపతులు.

శ్రీరామ్‌ భువనవైపు చూశాడు నిన్నటి నీ ప్రశ్నకి సమాధానం దొరికిందా అన్నట్లుగా.

‘మైగాడ్‌, నిన్న వీళ్ళు ఈ హారమా షాపింగ్‌ చేస్తూ కనిపించారు.’ వీళ్ళు సుధకి ప్రేమతో కానుక కొంటుంటే తను వాళ్ళని అపార్థం చేసుకుంది.

ఇంతలో ఆకాశ్‌ తండ్రి చేతికి బంగారు కడియం తొడిగాడు. జయకృష్ణకి ఆ కానుక చాలా నచ్చిందని అతని మొహంలోని ఆనందమే చెప్తోంది. వాళ్ళని కూడా ఆశీర్వదించి అక్కున చేర్చుకున్నారు.

‘‘చిన్నపిల్లలు మీరు, మీకు మేమివ్వాలి కానీ మీరింతింత ఖర్చుపెట్టి ఈ బహుమతులు తీసుకురావడం ఏమిటి?’’ చిరుకోపం ప్రదర్శించింది సుధ.

‘‘మీరు మామీద చూపించే ప్రేమముందు మీకు ఏమిచ్చినా తక్కువే అత్తయ్యా! మీ అమూల్యమైన ఆప్యాయత ముందు మా కానుకలకు అసలు విలువే లేదు’’ ఆర్తిగా అంది రవళి. కాసేపు అక్కడ అందరి మనసులూ ప్రేమవలయంలో పరిభ్రమించాయి.

భువన ఇన్నాళ్ళూ అనుకుంటూ వచ్చింది ‘సుధ వాళ్ళని అమితంగా ప్రేమిస్తోంది కానీ, వాళ్ళు సుధని అంతగా ప్రేమించడంలేదు’ అని. కానుకలు ఇవ్వడంకంటే వాళ్ళు తమని హృదయపూర్వకంగా అర్పించుకున్న వైనమే భువన మనసులో అపురూప చిత్రమై నిలిచిపోయింది. వాళ్ళ ఇల్లు రెండంతస్తులమేడలా కాకుండా ఒక ప్రేమసౌధంలా కనిపిస్తోంది.

భువనలో అంతర్మధనం మొదలైంది. రాత్రి అక్కడే టిఫిన్స్‌ చేసి ఇంటికి వచ్చేటప్పటికి పది దాటింది. ‘మజ్జిగగానీ పాలుగానీ తాగుతారా’ అని అందర్నీ అడిగింది సౌమ్య. ఎవరూ ఏమీ వద్దన్నారు.

‘చిన్నపిల్లయినా ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తోంది, నా ఆలోచనా విధానమే సరిగ్గా లేదా’ ఆలోచనలతో ఆ రాత్రి కలత నిద్రపోయింది భువన.

ఆ మర్నాడు ఉదయం దగ్గర్లోనే ఉన్న వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళింది. భక్తిగా స్వామిని వేడుకుంది. ఆమె మనసు ద్వైదీభావంతో సతమతమవుతోంది. సౌమ్యని కన్నకూతురిలా ప్రేమించాలనిపించినా ఏదో తెలియని అనుమానం వెనక్కి లాగుతోంది. సుధ విషయంలోనూ భువన మనసులో ఇదే ఆలోచన ఉండేది... సుధ కోడళ్ళిద్దరూ ఆమె ప్రేమను అవకాశంగా తీసుకుని పనులు చేయకుండా తప్పించుకుంటున్నారనీ, ఆమెతో పనులు చేయించుకుంటున్నారనీ. ‘కోడలి కప్‌బోర్డు సర్దినప్పుడు పనినే చూసింది తప్ప కోడలి కప్‌బోర్డు తెరిచి సర్దేంత స్వతంత్రం సుధకు ఉందనీ, ఒక కూతురిపై తల్లికి ఉండే అధికారాలన్నీ ఆమెకు వాళ్ళు ఇచ్చేశారనీ అర్థంచేసుకోలేకపోయింది. శ్రీరామ్‌ కూతురు లేనిలోటు సౌమ్య ద్వారా తీర్చుకుని ఆనందం పొందుతున్నాడు. తనే మూర్ఖురాలిలా అత్త-కోడలు అంటూ అనవసర వ్యవహారం చేస్తోంది’ అనుకుంటూ అన్యమనస్కంగా ఇంటికి వచ్చింది. ఆ రోజంతా ఆలోచనలతోనే గడిపింది. తనతో మాట్లాడుతున్నప్పుడు సౌమ్యలో ఒకలాంటి బెదురుని గమనించిన భువనకు మనసును ముల్లుతో గుచ్చుతున్న భావన కలిగింది.

‘తను చాలా అందంగా ఉంటుందని బంధువులూ, స్నేహితులు చాలామంది ఎప్పుడూ అంటూండేవారు. నిజమే, తను అందంగా ఉండి ఉండొచ్చు. కానీ అది కేవలం బాహ్య సౌందర్యమే. మరి తన అంతరంగం అందంగా ఉందా... తన అంతరంగాన్ని చూపించే దర్పణం ఏదీ...’ ఆలోచిస్తుంటే, ఆ ప్రశ్నకు సమాధానం తనలోనే ఉందని అర్థమైంది. అవును, ఎవరి సౌశీల్యమే వారి అంతరంగదర్పణం. చిక్కుముడులేవో విడిపోతున్నట్టు, భారం అంతా తగ్గి హృదయం తేలికవుతున్నట్లు అనిపించసాగింది భువనకు. సౌమ్యను హృదయపూర్వకంగా ప్రేమించడానికి ఆమె మనసు ఆయత్తమయింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.