close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఓడి గెలిచారు!

ఓడి గెలిచారు! 

మనకు విజేతల్లా కనిపించే చాలామంది ప్రముఖుల జీవితాల్లో బోలెడన్ని వైఫల్యాలూ, వాళ్ల సుఖాల వెనక ఎవరికీ తెలీని కష్టాలు, ఆ పేరు ప్రతిష్ఠల వెనక ఎన్నో తిరస్కరణలూ దాగున్నాయి. ఆ ఓటముల గురించి తెలిస్తే, వారి గెలుపు మరింత స్ఫూర్తినిస్తుంది. సమస్యలన్నీ తాత్కాలికమే అని అర్థమవుతుంది.


అమితాబ్‌ బచ్చన్‌ 

ముందు:
గొంతు మరీ గంభీరంగా ఉందనీ, అది అస్సలు బాలేదనీ అమితాబ్‌కి ఆల్‌ ఇండియా రేడియోలో ఉద్యోగం ఇవ్వలేదు. అతడు నటించిన తొలి పన్నెండు చిత్రాలూ ఫ్లాపులే.

తరవాత:
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జీవించి ఉన్న అత్యుత్తమ నటుల్లో ఒకరిగా అమితాబ్‌కి పేరుంది. కోటి గొంతుకల మధ్యలోనూ ఆయన స్వరాన్ని భారతీయులంతా గుర్తించగలరు.


 

ధీరూభాయ్‌ అంబానీ 

ముందు:
పదహారేళ్ల వయసులోనే చదువుకి దూరమై యెమెన్‌ అనే చిన్న దేశంలో పెట్రోల్‌ బంకుల్లో పనిచేశాడు.

తరవాత:
పరిచయం అక్కర్లేని రిలయన్స్‌ సామ్రాజ్య వ్యవస్థాపకుడు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన వారసులూ ఉన్నారు.


 

నవాజుద్దిన్‌ సిద్ధిఖీ 

ముందు:
సినిమాల్లో అవకాశాల కోసం వెతుకుతూ వాచ్‌మేన్‌గా పనిచేసేవాడు. నటుడిగా మంచి పాత్ర కోసం పన్నెండేళ్లు ఎదురుచూశాడు.

తరవాత:
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే సహాయ నటుడు.


 

హేమా మాలిని

ముందు:
అందంగా లేదనీ, మరీ పీలగా ఉందనీ తమిళంలో తొలి సినిమా ఆడిషన్‌ నుంచి బయటకు పంపించారు.

తరవాత:
భారతీయ సినిమా రంగంలో డ్రీమ్‌ గాళ్‌గా ముద్ర వేయించుకొని, ఇప్పటికీ తన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది.


 

బ్రియన్‌ ఆక్టన్‌ 

ముందు:
ఎనిమిదేళ్ల క్రితం ట్విటర్‌, తరవాత ఫేస్‌బుక్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూ దశ దాటలేకపోయాడు.

తరవాత:
స్నేహితుడితో కలిసి ఆక్టన్‌ నెలకొల్పిన వాట్సాప్‌ సంస్థని ఫేస్‌బుక్‌ దాదాపు లక్ష కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసింది.


 

జె.కె.రౌలింగ్‌ 

ముందు:
భర్తకు దూరమై డిప్రెషన్‌తో బాధపడుతూ ఆత్మహత్యా ప్రయత్నాలు చేసింది. ఉద్యోగం దొరక్క కూతురిని పోషించడానికి నానా ఇబ్బందులు పడింది. తొలి హారీపాటర్‌ పుస్తకం పన్నెండు ప్రచురణ సంస్థల తిరస్కరణకు గురైంది.

తరవాత:
ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సంపన్న రచయిత్రి. ఆమె రాసిన హారీ పాటర్‌ సిరీస్‌ పుస్తకాలు ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడయ్యే టాప్‌ 10 పుస్తకాల జాబితాలో ఉన్నాయి.


 

జాక్‌ మా 

ముందు:
హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదవడానికి పదిసార్లు దరఖాస్తు చేసి విఫలమయ్యాడు. ఉద్యోగ ప్రయత్నాల్లోనూ ముప్ఫయి సార్లు ఫెయిలయ్యాడు.

తరవాత:
ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు. ప్రపంచ సంపన్నుల్లో ఆయన స్థానం 23.


 

ఫ్లాయిడ్‌ మేవెదర్‌

ముందు:
విద్యుత్‌ సదుపాయం కూడా లేని ఇంట్లో పెరిగాడు. తల్లిదండ్రులిద్దరూ మత్తు పదార్థాలకు బానిసలై జైలుకెళ్లారు.

తరవాత:
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన క్రీడాకారుడు. ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లో కనీసం ఒక్కసారి కూడా ఓటమిని రుచిచూడని వీరుడు.


 

కుర్రాళ్లకి రూ.6.5లక్షల కోట్లు!

ఓయో రూమ్స్‌, హైక్‌, ఓలా, స్నాప్‌డీల్‌, హౌసింగ్‌, పేటిఎం, గ్రోఫర్స్‌... కొన్నేళ్లుగా దేశ మార్కెట్‌లో దూసుకెళ్తున్న స్టార్టప్‌లివి. తమ సేవల్ని ఆదరిస్తున్నందుకు ప్రజలకే కాదు, జపాన్‌ వ్యాపార దిగ్గజం మసాయోషి సన్‌కి కూడా ఈ సంస్థ యజమానులంతా రుణపడి ఉంటారు. ఇలాంటి పేరున్న ఎన్నో భారతీయ సంస్థల్లో తొలి దశలో పెట్టుబళ్లు పెట్టి ముందుకు నడిపించింది ఆయనే మరి.
 

రూ.25వేల కోట్లు... ఇప్పటిదాకా జపనీస్‌ సంస్థ ‘సాఫ్ట్‌ బ్యాంక్‌’ భారతీయ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడుల విలువ. రూ.65వేల కోట్లు... దేశంలో ఆ సంస్థ మొత్తంగా పెట్టనున్న పెట్టుబడుల విలువ. దేశంలోని ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమకూర్చుకోవడానికి భారతీయ సంస్థలు తంటాలు పడుతున్న సమయంలో, జపాన్‌ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మసాయోషి సన్‌ తానున్నానంటూ ముందుకొచ్చారు. ఇక్కడి కుర్రాళ్ల నైపుణ్యం, సామర్థ్యం మీద అపార నమ్మకంతో తన దేశం కాకపోయినా వేల కోట్ల రూపాయలను సమకూర్చడానికి సిద్ధమయ్యారు. దేశ స్టార్టప్‌ల రంగంలో తమదైన ముద్రవేస్తూ ఓయో, పేటీఎం, హౌసింగ్‌, హైక్‌ లాంటి ఎన్నో సంస్థలు దూసుకెళ్తున్నాయంటే, దానికి ఎంతోకొంత తన ‘సాఫ్ట్‌బ్యాంక్‌’ ద్వారా సన్‌ పెట్టిన పెట్టుబడులే కారణం.

* జపాన్‌లోని అత్యంత సంపన్నుల్లో సన్‌ ఒకరు. ప్రపంచంలోని అతిపెద్ద టెలికాం రంగ సంస్థల్లో ఆయనకు చెందిన ‘సాఫ్ట్‌ బ్యాంక్‌’ ఒకటి. ఆ సంస్థ ద్వారా లాభాలు అందుకుంటున్నా, ఆ ఆదాయం మళ్లీ పదిమందికీ ఉపయోగపడాలన్నది సన్‌ ఆశ. అందుకే ‘సాఫ్ట్‌బ్యాంక్‌ క్యాపిటల్‌’ పేరుతో కొంత నిధిని ఏర్పాటు చేసి పదిహేనేళ్ల క్రితం నుంచే జపాన్‌లోని చిన్న చిన్న స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. ఆ తరవాత వాటిని చైనా, అమెరికా, భారత్‌ లాంటి ఇతర దేశాలకూ సన్‌ విస్తరించారు.
* ఒకటీ రెండూ కాదు, ప్రపంచ వ్యాప్తంగా రెండొందలకుపైగా సంస్థల్లో సన్‌కి వాటాలున్నాయి. ఆ సంస్థలు కష్టాల్లో ఉన్నప్పుడూ, వాటికి నిధులు అవసరమైనప్పుడూ సన్‌ ఆదుకున్నారు. వాటి అభివృద్ధిని అందరికంటే ముందే అంచనా వేసి వేల కోట్ల రూపాయల్ని అందించారు. ఓలా, హౌసింగ్‌, ఓయో, ఇన్‌మొబీ లాంటి భారతీయ సంస్థలే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అలీబాబా, బజ్‌ఫీడ్‌, హఫింగ్టన్‌ పోస్ట్‌, యాహూ లాంటి అనేక పేరున్న కంపెనీలు తొలిరోజుల్లో సాఫ్ట్‌బ్యాంక్‌ సాయంతోనే నిలదొక్కుకున్నాయి. ప్రపంచాన్ని మార్చే శక్తి టెేక్నాలజీకి మాత్రమే ఉందన్నది సన్‌ నమ్మకం. అందుకే ఇరవై ఏళ్లుగా కొత్త సాంకేతికతతో ముందుకొచ్చే సంస్థల్లోనే ఆయన పెట్టుబడులు పెడుతున్నారు.
* రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మంచి భవిష్యత్తున్న టెక్‌ కంపెనీల్ని గుర్తించి వాటికి పెట్టుబడులు సమకూర్చాలని సాఫ్ట్‌బ్యాంక్‌ నిర్ణయించింది. దానికోసం ఏకంగా ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలతో ‘విజన్‌ ఫండ్‌’ పేరుతో సన్‌ ఓ నిధిని ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా ప్రపంచంలో ఇదే అత్యధిక స్టార్టప్‌ ఫండ్‌. అందులో పదో వంతు అంటే దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలను భారతీయ కంపెనీలకే అందించాలని ఆయన నిర్ణయించారు. చెప్పినట్టుగానే ఇప్పటికే దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలను మంచి స్టార్టప్‌లు పెట్టిన మన కుర్రాళ్లకు అందించారు. ఈ మధ్యే అత్యధికంగా దాదాపు రూ.9వేల కోట్లను పేటీఎంకు సమకూర్చారు. ఓలాకి రూ.2వేల కోట్లు, గ్రోఫర్స్‌కి రూ.770 కోట్లు, హౌసింగ్‌.కామ్‌కి రూ.700 కోట్లు, ఓయో రూమ్స్‌కి రూ.643 కోట్లు... ఇలా వందల కోట్ల రూపాయలను ఆయన భారతీయ స్టార్టప్‌ల చేతిలో పెట్టారు.

* భవిష్యత్తులోనూ సాఫ్ట్‌బ్యాంక్‌ నుంచి భారత్‌కు పెట్టుబడుల వర్షం కురిసే అవకాశాలు పుష్కలం. దానికి కారణం సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌కి సీయీవోగా వ్యవహరిస్తున్న రాజీవ్‌ మిశ్రా అనే భారతీయుడు. వ్యాపార రంగంలో ‘క్రియేటివ్‌ జీనియస్‌’గా పేరున్న మిశ్రా ఐఐటీ దిల్లీ పట్టభద్రుడు. ‘నేను పనిచేసేది విదేశీ సంస్థకైనా, దానివల్ల నేరుగా దేశానికి సాయపడే అవకాశం దొరికింది’ అంటాడు మిశ్రా. ఆయన ఉన్నన్నాళ్లూ భారత్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్టుబడులకు ఢోకా లేదన్నది ఇన్వెస్ట్‌మెంట్‌ నిపుణుల అంచనా.

* తాను పెట్టుబడులు పెట్టిన సంస్థలను పరిశీలించడానికి గతేడాది భారత్‌కి వచ్చిన సన్‌, ప్రధాని మోదీతో మాట్లాడినప్పుడు ‘క్లీన్‌ ఎనర్జీ’ రంగంలో ప్రభుత్వం చూపిస్తున్న ఆసక్తి గురించి తెలుసుకున్నారు. దాంతో తన వంతుగా భారత్‌లో కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తానని ప్రధానికి మాటిచ్చారు. చెప్పినట్టుగానే మరో సంస్థతో కలిసి మొదట ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో 350మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ని సాఫ్ట్‌బ్యాంక్‌ నిర్మించింది. నిర్దేశిత గడువుకంటే యాభై రోజుల ముందుగానే అది పూర్తయి, వినియోగంలోకి వచ్చింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు మరో ప్రయత్నంగా తాను ప్రధాన పెట్టుబడిదారుగా ఉన్న ఓలా క్యాబ్స్‌ని రానున్న రోజుల్లో పూర్తిగా ఎలక్ట్రిక్‌ కార్లతో నడిపించాలనుందని సన్‌ చెప్పారు. ‘మేకిన్‌ ఇండియా’లో భాగంగా ఆ కార్లను కూడా భారత్‌లోనే తయారు చేయడానికి ప్లాంట్‌ ఏర్పాటు చేస్తానని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు కింద కొన్ని ఓలా ఎలక్ట్రిక్‌ కార్లను హైదరాబాద్‌ నుంచే మొదలుపెట్టడం విశేషం. పరిస్థితులు అనుకూలిస్తే రాబోయే రోజుల్లో భారత్‌లోని ఓలా డ్రైవర్లకు పదిలక్షల ఎలక్ట్రిక్‌ కార్లను ఉచితంగా ఇవ్వాలన్నది సన్‌ కోరిక. ఇప్పటికే మన వ్యాపారాల్లో, అభివృద్ధిలో భాగమైన సన్‌, మన పర్యావరణానికీ మేలు చేయాలనుకోవడం గొప్ప విషయమే!


 

వహ్వా... వంటల బ్లాగ్‌!

వృత్తి ప్రవృత్తుల గురించి నలుగురికీ చెప్పుకోవడానికీ, వ్యాపారమైతే ప్రచారం చేసుకోవడానికీ సామాజిక మాధ్యమాలదే ఇప్పుడు కీలక పాత్ర. ఫొటోలూ వీడియోలూ షేర్‌ చేసే అవకాశం ఉండడంతో ఫేస్‌బుక్‌నే ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. అయితే మనదేశంలో ఇటీవల ఒక సంస్థ అధ్యయనం చేసి ఫేస్‌బుక్‌లో వీక్షకుల ఆదరణను అత్యధికంగా అందుకున్న వీడియోల జాబితాను తయారుచేసింది. ఆశ్చర్యం... అందులో తొలి రెండు స్థానాలనూ వార్తల వెబ్‌సైట్లు గెలుచుకోగా మూడో స్థానంలో నిలిచింది ఓ వంటల వెబ్‌సైట్‌! ఆ వీడియో బ్లాగ్‌ యజమాని ఎవరో ఎవరికీ తెలియకపోవడం కొసమెరుపు.
 

ఫేస్‌బుక్‌ చూస్తుంటారు... అకస్మాత్తుగా ఓ వీడియో ప్రత్యక్షమవుతుంది. పొయ్యి మీద మూకుడు పెట్టడంతో మొదలుపెట్టి చకచకా రకరకాల పదార్థాలను అందులో వేస్తూ గరిటెతో కలుపుతూంటుంది ఓ చెయ్యి... పక్కనే ఆంగ్లంలో వేస్తున్న పదార్థం పేరూ మోతాదూ కన్పిస్తుంటాయి. మనమలా చూస్తుండగానే నిమిషంలో నోరూరించే వంటకం తయారైపోతుంది. నేపథ్యంలో సంగీతం మినహా మరేం విన్పించదు. వంటల పట్ల ఏ మాత్రం ఇష్టం లేనివారికి కూడా ఆసక్తి కలిగేలా ఉంటాయి ఆ వీడియోలు. ఫేస్‌బుక్‌లో అత్యంత ఆదరణ పొందిన వీడియోల్లో మూడోస్థానం పొంది పది కోట్ల వ్యూస్‌ దిశగా సాగిపోతున్న ‘హెబ్బార్స్‌ కిచెన్‌’ విశేషాలు చూద్దామా?

‘హెబ్బార్స్‌ కిచెన్‌’లో అచ్చంగా సంప్రదాయ దక్షిణ భారత శాకాహార వంటకాలు మాత్రమే ఉంటాయి. ఒక్కో వంటకం గురించీ ఒకటి, రెండు నిమిషాల అతి తక్కువ సమయంలోనే అర్థమయ్యేలా వివరించడమూ, ఆకర్షణీయంగా చూపించడమూ ఈ వీడియోల ప్రత్యేకత. ఇంతగా ఆదరణ పొందుతున్న ఈ వీడియో బ్లాగ్‌ సొంతదారు ఎవరా అని చూస్తే... ఆ వెబ్‌సైట్లో ఎవరి పేరూ, ఫొటో లేవు. అసలు ‘మా గురించి‘ (ఎబౌట్‌ అజ్‌) అన్న కాలమ్‌ కన్పించదు. దాంతో మరింత ఆసక్తి పెరిగి బ్లాగ్‌లో ఉన్న ఈ మెయిల్‌ ద్వారా ప్రయత్నించగా తెలిసిన విషయాలివి.

తెర వెనుకే ఉండి...
ఈరోజుల్లో వంటలకు సంబంధించి బ్లాగులు నిర్వహిస్తున్న చాలామంది సెలెబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. కానీ హెబ్బార్స్‌ కిచెన్‌ నిర్వహిస్తూ అతి తక్కువ సమయంలోనే విపరీత ఆదరణ పొందిన అర్చన మాత్రం తనకు పబ్లిసిటీ ఏమాత్రం ఇష్టం లేదంటారు. ప్రచారం ప్రభావం వ్యక్తిగత జీవితం మీద పడకూడదనే తన ఫొటో ప్రచురించడానికి ఇష్టపడరట ఆమె. ఇంతకీ ఆమె ఎక్కడ ఉండి ఈ బ్లాగ్‌ నిర్వహిస్తున్నారో తెలుసా? ఆస్ట్రేలియాలో. ‘హెబ్బార్‌’ అనేది కన్నడ సంప్రదాయ బ్రాహ్మణుల్లో ఒక శాఖ. ఉడుపి, మంగళూరు ప్రాంతంలో ఉండే వీరు ఆ ప్రాంతంలో పండే కూరగాయలతోనే వివిధ రకాల వంటలు చేసుకుంటారు. అలాంటిది ఆస్ట్రేలియాలో ఉండీ ఈ వంటల ప్రత్యేకతను ఆమె ఎలా ప్రతిబింబించగలుగుతున్నారంటే..

ఉడుపిలో పుట్టి పెరిగిన అర్చన మూడేళ్ల క్రితం వరకూ కర్ణాటకలోనే ఉండేవారు. భర్త సుదర్శన్‌ ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియా వెళ్లారు. అర్చన శిక్షణపొందిన సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ నిపుణురాలు. వంటలంటే మొదటినుంచీ ఆసక్తి. ఓ పక్క ఉద్యోగ వేట కొనసాగిస్తూ కాలక్షేపంకోసం 2015లో హెబ్బార్స్‌ కిచెన్‌ పేరుతో ఫుడ్‌ బ్లాగ్‌ ప్రారంభించారు. మొదట్లో వంటలన్నీ ఫొటోలు తీసి పోస్ట్‌ చేసేవారు. బజ్‌ఫీడ్‌ టేస్టీ వీడియోస్‌కి లభిస్తున్న ఆదరణ చూశాక తానూ వీడియోలు పోస్ట్‌ చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. 2016లో వీడియోలు పెట్టడం మొదలెట్టారు. కొద్దికాలంలోనే ఈ వీడియోలకు మంచి ఆదరణ లభించడం మొదలైంది.

సంప్రదాయ వంటలే ఆకట్టుకునేలా...
ఇంతగా ఆదరణ పొందిన హెబ్బార్స్‌ కిచెన్‌లో ఎంతో అద్భుతమైన ఆధునిక వంటకాలు ఉంటాయనుకుంటే పొరపడినట్లే. పూర్తి సంప్రదాయ వంటకాలు మాత్రమే ఉంటాయి. పైగా సాంబార్‌, రసం తదితర పొడులన్నీ పద్ధతిగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో; దోసెపిండీ, ఇడ్లీ పిండీ ఎలా తయారుచేసుకోవాలో కూడా ఇందులో చూపిస్తారు. అర్చనకు కొత్త వంటలు ప్రయత్నించడమంటే ఇష్టం. ఇతర వంటల బ్లాగులతో పోలిస్తే తన బ్లాగు అంత గొప్పగా ఏమీ ఉండదనే ఆమె, అభిమానులు కోరినవి ఇవ్వడానికి ప్రయత్నిస్తానంటారు. ఎలాంటి వంటయినా సరే తయారీ విధానాన్ని ఆమె దశలవారీగా క్లుప్తంగా వివరిస్తారు.

అభిరుచిని హాబీగా మార్చుకుంటే ఇప్పుడదే అర్చనకి ఎంతో ఇష్టమైన పూర్తి స్థాయి వృత్తిగా మారిపోయింది. కొత్తలో ఐఫోన్‌తో, సెల్ఫీ స్టిక్‌ సాయంతో వీడియోలు తీసి పెట్టేవారట. ఆదరణ పెరగడంతో అర్చన భర్త ఆమెకు డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాతో పాటు వీడియో ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేరూ కంప్యూటరూ బహూకరించారు. దాంతో వీడియోలు నాణ్యంగా వస్తున్నాయి. గూగుల్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ల భాగస్వామ్యంతో హెబ్బార్స్‌ కిచెన్‌ ఆమెకిప్పుడు మంచి సంపాదన తెచ్చిపెడుతోంది. తప్పనిసరిగా రోజూ ఓ కొత్త వంట పోస్ట్‌ చేసే అర్చన తద్వారా అభిమానుల సంఖ్యను స్థిరంగా కొనసాగించగలుగుతున్నానంటారు. ఆహారం తాజాగా రుచిగా ఉంటే అదే ఇంట్లోవారి ఆరోగ్యానికీ అనుబంధానికీ శ్రీరామరక్ష అవుతుందంటారు అర్చన.


 

ఈ ఆప్‌ చిన్నారుల కోసం!

చిన్నారుల పెదాలపైన చిరునవ్వులు... కన్నవారి కళ్లల్లో మెరుపులు. వారు పలికే తొలి మాటలు... అమ్మానాన్నలు ఎప్పటికీ గుర్తుంచుకునే మధుర జ్ఞాపకాలు. కానీ పిల్లలు నవ్వాల్సిన వయసులో నవ్వకుంటే, ‘అమ్మ...’ అని పలకడం ఆలస్యమవుతుంటే... సందేహాలు మొదలవుతాయి. ఆ సందేహాల్ని నివృత్తి చేసుకోవడంలో సాయపడుతుంది ‘మై ఛైల్డ్‌’ ఆప్‌.

పిల్లలకి మూడో నెల వచ్చేసరికే నవ్వుతుండాలి, 7-10 నెలల వయసులో పాకడం మొదలుపెట్టాలి, తొమ్మిదో నెలకి వారి నోట అమ్మ, తాత లాంటి పదాలు రావాలి... ఓ నెల అటూఇటుగా అలాంటి మార్పులు కనిపించకపోతే మాత్రం వారిని పరీక్షించాల్సిందే. మీ ఫోన్లో ‘మై ఛైల్డ్‌’ ఆప్‌ ఉంటే ఆ పరీక్ష ఇపుడెంతో సులభం.

ఇలా గుర్తించవచ్చు
ఎదిగే పిల్లల్లో నరాలూ, మెదడు పనితీరుకు సంబంధించిన సమస్యల్ని నెలల వయసులోనే గుర్తించే విధంగా మై ఛైల్డ్‌ ఆప్‌ని అభివృద్ధి చేశారు హర్ష్‌ సోంగా, అతడి బృందం. నెల నుంచి 24 నెలల వయసుండే పిల్లల ఎదుగుదలలో సమస్యల్ని గుర్తించేందుకు ఈ ఆండ్రాయిడ్‌ ఆప్‌ సాయపడుతుంది. దీన్లో మొదట పిల్లల వయసు, ఎత్తు, బరువు లాంటి వివరాల్ని నమోదుచేయాలి. ఆ తర్వాత సాధారణంగా పిల్లల్లో ఆయా నెలల్లో వచ్చే మార్పుల గురించి కొన్ని ప్రశ్నలు వేస్తారు. వాటికి ‘ఔను/కాదు’ అన్న సమాధానం ఇవ్వాలి. ఆప్‌లోని కృత్రిమ మేధ సాయంతో వాటన్నిటినీ పరిశీలించిన మీదట ఏవైనా సమస్యలు ఉన్నదీ లేనిదీ మనకి తెలుస్తుంది. పిల్లల వయసు మూడు నెలలు అయితే... నవ్వుతున్నారా, మెడ నిలుపుతున్నారా, బోర్లా పడుతున్నారా... లాంటి ప్రశ్నలు అడుగుతారు. వీటికి తల్లిదండ్రులు ఇచ్చే సమాధానాన్నిబట్టి ఫలితం సెకెన్ల వ్యవధిలోనే తెలుస్తుంది. తర్వాత ప్రతి నెలా పిల్లల బరువు, ఎత్తులలో మార్పుల్ని నమోదు చేస్తూ ఆయా నెలలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబు ఇస్తుంటే వారి హెల్త్‌ రిపోర్ట్‌ వస్తుంది. పిల్లల ఎదుగుదలలో ఏదైనా అనుమానం ఉంటే ఈ ఆప్‌ద్వారా దాన్ని నివృత్తి చేసుకోవచ్చు. అనుమానం లేకపోయినా పిల్లల ఎదుగుదల సాధారణంగా ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికీ ఈ ఆప్‌ను ఉపయోగిస్తున్నవారూ ఉన్నారు. పిల్లలకు సంబంధించిన ఆరోగ్య సమాచారాన్నీ, రికార్డుల్నీ ఈ ఆప్‌లో భద్రం చేసుకోవచ్చు. దీని ద్వారా తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్య సంరక్షణ, పెంపకానికి సంబంధించిన సమాచారాన్నీ అందిస్తారు. ఇంకా పిల్లలకు సంబంధించి - అన్ని రకాల వైద్య నిపుణుల సమాచారాన్నీ దీన్లో పొందవచ్చు. కావాలనుకుంటే అందులోంచే డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌నీ తీసుకోవచ్చు.

ఒకనాటి బాధితుడు...
సొంత అనుభవం నుంచి ఈ ఆప్‌ని అభివృద్ధి చేయాలనే ఆలోచన వచ్చిందంటాడు హర్ష్‌. అతడికి చిన్నపుడు డిస్‌ప్రేక్సియా(మెదడు, శరీర భాగాల మధ్య సమన్వయ లోపం) సమస్య ఉండేది. పిల్లలు రెండేళ్ల వయసులో ఉన్నపుడే దీన్ని గుర్తించవచ్చు. కానీ అతడికి 11ఏళ్లు వచ్చాక గానీ తల్లిదండ్రులు ఆ సమస్యని గుర్తించలేదు. ఆ తర్వాత చికిత్స తీసుకుని మామూలు మనిషి అయ్యాడు. ‘ప్రతి ఆరుగురిలో ఒకరు నాలాంటి సమస్యతో బాధపడుతున్నట్టు చదివాను. వారిలో చాలామందికి పదేళ్లు వచ్చేవరకూ ఆ సమస్యని గుర్తించి చికిత్స తీసుకున్నది లేదు. ఈ సమస్యకి పరిష్కారం చూపించాలనుకున్నాను. ఓ పక్క చదువుకుంటూనే రెండేళ్లపాటు దీని మీద పరిశోధన చేశాను’ అని చెబుతాడు హర్ష్‌. 16 ఏళ్ల వయసులో కంప్యూటర్‌ కోడింగ్‌ నేర్చుకున్న అతడు, ఆ నైపుణ్యంతో పిల్లల్లో సమస్యల్ని ఆప్‌ ద్వారా గుర్తించగలిగేలా సాంకేతికతను అభివృద్ధి చేశాడు. 2015 జనవరిలో ఈ ఆప్‌ని అందుబాటులోకి తెచ్చిన హర్ష్‌ తర్వాత కూడా అప్‌డేట్‌ చేస్తూ వస్తున్నాడు. దీని అభివృద్ధిలో వైద్యుల సాయాన్నీ తీసుకున్నాడు. ఈ ప్రయాణంలో అతడికి మొదట ఆఫ్రీన్‌ అన్సారీ తర్వాత వీరిద్దరి స్నేహితురాలు శ్రేయా శ్రీవాస్తవ తోడయ్యారు. హర్ష్‌, ఆఫ్రీన్‌ ఇద్దరూ 19 ఏళ్ల వయసులో బీసీఏని మధ్యలోనే వదిలి పెట్టేసి ఆప్‌ అభివృద్ధిపైన దృష్టి పెట్టారు. దీనికోసం తమ కార్యాలయాన్ని భోపాల్‌ నుంచి బెంగళూరుకి మార్చుకున్నారు.

మై ఛైల్డ్‌ ఆప్‌ ఆలోచన నచ్చి చాలామంది యువ పెట్టుబడిదారులు వీరి కంపెనీలో పెట్టుబడులకు ముందుకు వచ్చారు. ‘ఈ ఆప్‌ద్వారా కొద్ది శాతం పిల్లల్లో మార్పు తీసుకురాగలిగినా దాని ప్రభావం ప్రత్యక్షంగా ఆయా కుటుంబాల్లో, పరోక్షంగా ప్రపంచంపైనా చాలా ఉంటుంది’ అని చెబుతారు పెట్టుబడిదారుల్లో ఒకరైన పల్లవ్‌. అంకుర సంస్థల్ని ప్రోత్సహించడానికి ఫేస్‌బుక్‌ ప్రారంభించిన ‘ఎఫ్‌బీస్టార్ట్‌’ కార్యక్రమానికి హర్ష్‌ ఆలోచన ఎంపికవడంతో ప్రారంభంలో ఆ సంస్థ నుంచి మార్గనిర్దేశం, సాంకేతిక సహకారం లభించాయి కూడా. ఫేస్‌బుక్‌ సీవోవో షెరిల్‌ శాండ్‌బర్గ్‌ తన బ్లాగ్‌లో మై ఛైల్డ్‌ ఆప్‌ గురించి ప్రస్తావించడంతో ఈ ఆప్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

ఈ ఆప్‌ని ఇప్పటివరకూ 135 దేశాలకు చెందిన 10వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. డౌన్‌లోడ్ల సంఖ్య ప్రతి నెలా 20 శాతం పెరుగుతోంది. 2025నాటికి 5 కోట్ల మంది తల్లిదండ్రుల్ని చేరాలన్నది వీరి లక్ష్యం. అందులో మీరూ ఉంటారేమో!


 

‘దశ’ దిశలా...

మామూలుగా లెక్కలంటే చాలా మందికి బోర్‌. కానీ ఆ పదీ ఎక్కువ అమ్ముడు పోయినవట. ఈ పదీ ఖరీదైనవట. అక్కడ బంగారం నిల్వలు వేల టన్నుల్లో ఉన్నాయట... ఇలా కొన్నిటి గురించి చెప్పే లెక్కల్ని చూస్తే కళ్లు పెద్దవి చేసుకుని మరీ చదివేస్తుంటారు. అలా ఆశ్చర్యంగానూ ఆసక్తికరంగానూ అనిపించే టాప్‌ టెన్‌ కబుర్లే ఇవి.

మనవాళ్లే సుందరీమణులు

ఇప్పటివరకూ ప్రపంచ సుందరి కిరీటాన్ని భారత్‌ అయిదుసార్లు గెలుచుకుంది. వెనిజులా తర్వాత ఆ ఘనత సాధించిన దేశం మనదే. మిస్‌ యూనివర్స్‌ని కూడా మనదేశం రెండుసార్లు కైవసం చేసుకుంది. ఈ రెండిటినీ కలిపితే మొదటి పది స్థానాల్లో ఉన్న దేశాలివి.

ఎక్కువ ప్రయాణాలు ఫ్రాన్స్‌కే! 

విదేశీ పర్యటకుల్ని ఎక్కువగా ఆకర్షించే దేశాల్లో ఫ్రాన్స్‌దే గత కొన్నేళ్లుగా పై చేయి. ఈ వరుసలో భారత్‌ది 40వ స్థానం. ఏటా మనదేశాన్ని సందర్శించే విదేశీ పర్యటకుల సంఖ్య సుమారు 89 లక్షలు ఉంటే ఫ్రాన్స్‌కి వెళ్లేవాళ్లు ఎనిమిది కోట్ల మందికి పైనే. ఈ లిస్టులో తరవాతి పది దేశాలూ ఏవేంటో చూడండి.