close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మనిషి మరణించలేదు

మనిషి మరణించలేదు
- జంధ్యం వెంకటేష్‌ బాబు

నాన్న అప్పటికి హాస్పిటల్‌లో జాయినై వారంరోజులైంది. లివర్‌ పూర్తిగా పాడైపోయింది. మరో రెండు మూడు రోజులు మించి బతకరని డార్టర్లు తేల్చేశారు.

మొదటి రెండురోజులు ఆ ఐసీయూ గదిలోకి వెళ్ళడానికి నాకు ఇబ్బందిగా అనిపించలేదు. కానీ, నాన్నకు నేను ప్రామిస్‌ చేశాక, ఇప్పుడు ఆ గదిలోకి వెళ్ళాలంటే మాత్రం భయమేస్తోంది. కానీ తప్పదు. మెల్లగా ఆ గదిలోకి వెళ్ళాను.

ఆ స్థితిలోనూ నాన్న నావంక బేలగా చూశారు. ఆయన కళ్ళల్లో ఒక్కటే ప్రశ్న- ‘నువ్వు చేయగలవా?’

పెదవులు బిగబట్టాను. ‘మాట ఇచ్చినప్పుడు చాలా సులభం అనిపించింది... ప్రయత్నం ప్రారంభించగానే ఎంత కష్టమో అర్థమైపోయింది...చేయగలనన్న నమ్మకం నాకు మెల్లగా తగ్గిపోతోంది.’

‘మరో రోజో... రెండురోజులో..! నేనెంతో ఇష్టపడే నాన్న- నన్ను... వూహు... ఈ లోకమే వదిలి వెళ్ళిపోతారు.’

డాక్టర్లు ఆ విషయం తేల్చి చెప్పేశారు.

నాన్న నాకు జీవితంలో అన్నీ సమకూర్చి ఇచ్చారు. కానీ, ఏనాడూ ఏదీ అడగలేదు. చనిపోతానని తెలిశాక ఒక్క కోరిక... ఒకే ఒక్క కోరిక కోరారు.

‘‘ఏరా నవీన్‌, నేను చనిపోతే నా శవాన్ని, మీ అమ్మ సమాధి పక్కనే ఖననం చేయగలవా?’’

అది ఆయన కోరినప్పుడు చాలా చిన్న కోరికలా అనిపించింది. అందుకే దానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా ‘‘అలా అనకు నాన్నా... మీకేం కాదు’’ అంటూ తనకు బతుకు మీద భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాను.

‘‘నాకు ఇప్పుడేమవుతుందో, రేపేమవుతుందోనన్న భయం లేదురా... ఎప్పుడు, ఎలా జరిగినా చివరికి అక్కడికి చేరుకోవాలనే కోరిక మాత్రమే మిగిలింది. నేను వెళ్ళిపోయాక నాకేం కావాలో నిన్నడుగుతున్నాను... నాకు కావలసింది చేయగలవా?’’

‘‘తప్పకుండా చేస్తాను నాన్నా.’’

మూడురోజుల క్రితం నాన్నకు మాటిచ్చాను.

మర్నాటి నుంచీ ఆయన నన్ను మరింత పరిశీలనగా చూడటం మొదలుపెట్టారు. రెండోరోజు నా ముఖంలో నిరాశ కదలాడటం ఆయన గమనించినట్టున్నారు. అందుకే అడిగేశారు ‘‘నేను అడిగింది చేయగలవా?’’

‘‘ఆ ప్రయత్నంలోనే ఉన్నాను నాన్నా.’’

ఆయనకు విషయం కొంతవరకూ అర్థమైనట్టుంది. మౌనంగా ఉండిపోయారు. కానీ, నాకేసి ఆర్తిగా చూడటం మానలేదు.

ఒకవైపు ప్రాణాలు పోబోతున్నాయని తెలుస్తూనే ఉంది. మనిషి అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్ళి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ, కాసింత తెలివి వచ్చినా, నాకేసి అలా ప్రశ్నకు జవాబు కోసమే ఎదురుచూస్తున్నారు.

ఐసీయూలో నుంచి నెమ్మదిగా బయటకు నడిచాను. కారిడార్‌లో నా కోసమే ఎదురుచూస్తున్న ప్రమద్వర నా ముఖం చూసి అడిగింది ‘‘ఏంటీ, ఆయన అడిగినదాని గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నారా?’’

అవూనూ కాదూల మధ్య తలాడించాను.

ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుందన్నట్టు ఆమె అంది... ‘‘చేస్తానన్నారు కదా... చేస్తాననే చెప్పండి. అదే భ్రమలో ఆయనను పోనివ్వండి. పోయాక ఏం జరింగిందన్నది ఆయనకు తెలియదు కదా! మనం ఆ దహన సంస్కారాలేవో ఇక్కడే చేద్దాం.’’

నేను మా ఆవిడకేసి నిరాభావంగా చూశాను. మనుషుల్ని మోసం చేయడం అలవాటైపోయింది. చివరికి శవాలను కూడా మోసం చేయడం!?

నేనేం మాట్లాడకపోయేసరికి తను కాస్త ఈసడింపుగా తల పక్కకు తిప్పుకుని తన పిల్లల దగ్గరకెళ్ళి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది.

నిన్నటి నుంచీ చేసిన నా ప్రయత్నాలను గుర్తుచేసుకుంటూ అలా నిలబడిపోయాను.

* * *

విన్నప్పుడు చాలా చిన్న విషయంలా అనిపించింది... శవాన్ని ఓ పల్లెకు చేర్చి ఆయన కోరుకున్న చోట పూడ్చిపెట్టడం!

అది నాన్న మాస్టారుగా ఉద్యోగం చేసిన వూరు. నేను పుట్టి పెరిగిందీ ఆ పల్లెలోనే! ఆరేళ్ళక్రితం వరకూ నాన్న, అమ్మతో కలసి ఆ వూళ్ళొనే ఉండేవారు. అమ్మ చనిపోయాక తనను ఒంటరిగా ఉంచడం ఇష్టంలేక హైదరాబాద్‌ తీసుకొచ్చేశాను.

ఆ వూరు సిటీకి ఆరువందల కిలోమీటర్ల దూరంలో ఉంది. అంబులెన్స్‌లో ఆ వూరికి శవాన్ని తీసుకెళ్ళడం పెద్ద కష్టం కాదు. కానీ, శవాన్ని తిన్నగా స్మశానానికి తీసుకెళ్ళలేం. అలా చేయకూడదని శాస్త్రం చెబుతోంది. ఏదో ఇంట్లో దించి అక్కడినుండి వూరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్ళాలి.

ఒకప్పుడు ఆ వూళ్ళొ మాకు బంధుమిత్రులు ఎక్కువగానే ఉండేవారు. కానీ నేను హైదరాబాద్‌ వచ్చేశాక వాళ్ళతో రిలేషన్స్‌ మెయిన్‌టైన్‌ చేయలేకపోయాను. అందులోనూ దూరపు వరసైనా... పెదనాన్న, పిన్ని అంటూ వరుసలు కలిపి ఆప్యాయంగా మాట్లాడుకున్న ఆ తరంవాళ్ళు వెళ్లిపోయారు. ఇప్పుడు పొరుగింటితో కూడా సంబంధం అవసరంలేదనుకుని టీవీ, మొబైల్‌ ఫోన్‌లతో గడిపే మనుషులు ఎక్కువైపోయారు. ఇలాంటి పరిస్థితిలో శవాన్ని తమ ఇంటినుండి సాగనంపేవాళ్ళెవరు!?

ఆ వూళ్ళొ నాకున్న బంధుమిత్రులను గుర్తుచేసుకున్నాను. వాళ్ళలో నాకు మొదటగా గుర్తొచ్చింది... మా బాబాయి కొడుకు వీరమోహన్‌.

ఈమధ్య కాలంలో వాడికి కనీసం ఫోన్‌ కూడా చేయలేదు. రెండేళ్ళక్రితం వాళ్ళ అమ్మాయి పెళ్ళికి పిలవడానికి వచ్చాడు. బాగా బిజీగా ఉండటంతో పెళ్ళికి వెళ్ళలేకపోయాను. బిజీ... మనుషులతో అనుబంధాలను కాపాడుకోవడంకన్నా ఇతరత్రా బిజీలు మనిషికి ఎక్కువైపోయాయి. నేనూ అందుకు అతీతుణ్ణి కాను.

అందుకే వాడికి ఫోన్‌ చేయాలంటే కాస్త ఇబ్బందిగా అనిపించింది. కానీ తప్పదు కాబట్టి చేశాను. ‘‘నాన్న ఒకే ఒక ఆఖరి కోరిక చెప్పి తన మరణానంతరం అక్కడికి తీసుకొస్తానన్నాను. మీ ఇంటి నుంచి నాన్నను సాగనంపుదాం’’ అని అడిగాను.

‘‘ఒక అరగంట ఆగి ఫోన్‌ చెయ్యి’’ అన్నాడు వాడు.

అరగంటాగి ఫోన్‌ చేశాక, అప్పటికే కుటుంబసభ్యులతో మాట్లాడాడేమో, విషయం వివరించాడు. ‘‘సారీ అన్నయ్యా, ఈ వారంలోనే మా పెద్దమ్మాయీ, అల్లుడూ ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం అంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు. అందులోనూ అమ్మాయికి సంవత్సరం బాబు... ఏమనుకోకు’’ అన్నాడు.

జీవితంలో ఏ విషయంలోనూ తిరస్కారం భరించలేనిస్థితి నాదని నా ఉద్దేశం. నన్ను నేను కంట్రోల్‌ చేసుకుంటూ దీర్ఘంగా విశ్వసించాను.

తిరస్కారం తాలూకు అవమానాన్ని మించిన భయం మొదటిసారి కలిగింది. నేను సులభంగా చేయగలననుకున్నది చేయడం చాలా కష్టమా? ఆ వూళ్ళొ వాడొక్కడే కాదు...నేను పుట్టి పెరిగిన వూళ్ళొ నాన్నను తమ ఇంటినుంచి స్మశానానికి సాగనంపడానికి నాకంటూ ఎవరూ లేరా? ఆలోచించసాగాను... ఇలా ఆలోచించవలసిన అవసరం చాలామందికి రాదేమో! ఒక్కసారి ఆలోచిస్తే, అంచనా వేస్తే మనకంటూ ఎవరైనా మిగిలి ఉన్నారో లేదో అర్థమవుతుంది.

అలా ఆలోచిస్తుంటే నాకు నా ఫ్రెండ్‌ రఘు గుర్తుకొచ్చాడు.

మా నాన్నను వాడి ఇంటినుంచి స్మశానానికి సాగనంపడానికి వాడు ఒప్పుకుంటాడనే అనుకున్నాను.

వాడికి ఫోన్‌ చేసి విషయం చెప్పాను.

వాడు ‘సారీ’ అంటూ, అలా అనడానికి గల కారణాలు వివరించాడు- ‘‘ఒక ఇంటినుంచి శవాన్ని తరలిస్తే ఆ ఇంటికి అంటిన మైల శుద్ధి చేయాలి. పంతులుగారి చేత శాంతిపూజలు చేయించాలి. అంతేకాదు, శవాన్ని తరలించేటప్పుడు వెలిగించిన దీపం పెద్దకర్మ వరకూ వెలుగుతుండాలి. పెద్దకర్మ కూడా ఆ ఇంటిలోనే చేయాలి. ఇదంతా చాలా కష్టం నవీన్‌.’’

సాటిజీవిని ఇష్టంగానైనా, కష్టంగానైనా భరించగలిగే మనిషి, పార్థివదేహాన్ని ఏవిధంగానూ భరించలేడన్న నిజం నాకర్థమయింది.

చాలా బాధగా అనిపించింది. బాధకన్నా కర్తవ్యం నన్ను భయపెట్టసాగింది.

ఎలా..? ఎలా..?

* * *

ఆయన బేలచూపులే నాకు గుర్తుకొస్తున్నాయి.

ఎంతో గొప్ప స్థితిలో ఉన్నాననుకున్న నేను, నాన్న కోరిన ఆఖరి చిన్న కోరికను తీర్చలేకపోవడమా?... బాధగా ఉంది...భయమేస్తోంది... నామీద నాకే జాలి కలుగుతోంది.

అలా ఆలోచిస్తుంటే రామ్మోహన్‌ గుర్తుకొచ్చాడు. తను నాకు క్లాస్‌మేటేగానీ ఎప్పుడూ అంత క్లోజ్‌గా ఉండలేదు. కాకపోతే తను సేవా కార్యక్రమాలలో చురుగ్గా ఉంటాడని తెలుసు.

రామ్మోహన్‌కి ఫోన్‌ చేశాను. ఒక విధంగా అతడిని బ్రతిమలాడుకుంటున్నట్టుగా మాట్లాడాను. ‘‘ఇది నాన్నగారి ఒకే ఒక కోరిక రామ్మోహన్‌! చాలా చిన్న కోరికే అనుకున్నాను. కానీ, అది చాలా పెద్ద కోరిక అనీ, నా శక్తికి మించినదనీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మర్చిపోయిన పుట్టిన వూరి మట్టిలో కలవడం ఎంత కష్టమో అర్థమవుతోంది. ఇందులో నాన్న తప్పేంలేదు. నేనే బలవంతంగా ఆ వూరితో ఆయనకు సంబంధాలు తెంచేశాను. ఇల్లు అమ్మొద్దన్నా, ‘మనం ఆ వూరు వెళ్తామా ఏంటి?’ అంటూ అవసరంలేకున్నా ఇంటిని అమ్మేశాను. కొత్త రిలేషన్స్‌ మధ్య పాత బంధుమిత్రులను పట్టించుకోవటం మానేశాను. ఇప్పుడు ఆ పల్లె జ్ఞాపకాలే తప్ప ఏవిధమైన బంధం లేకపోయింది. చివరికి నాన్నను సంప్రదాయబద్ధంగా సాగనంపడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.’’

నా మాటకు వాడు కదిలిపోయినట్టున్నాడు. ‘‘సరే, ఓ పని చేస్తాను. వూరి ప్రెసిడెంట్‌ని అడిగి కాసేపు శవాన్ని పంచాయితీ ఆఫీసులో ఉంచుదాం. అక్కడినుంచి లాంఛనాలతో... అదే పాడె కట్టి వూరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్దాం.’’

అంతకుమించి మరోమార్గం లేదు. ప్రముఖ నాయకులను పార్టీ కార్యాలయంలో కాసేపు ఉంచినట్టు... అలా ఆయనను సాగనంపాలి.

తను కోరుకున్న చోటుకు చేరబోతున్నానని ఎలా తెలిసిందో... అరగంట తర్వాత డాక్టర్‌ మా దగ్గరకు వచ్చి డెత్‌ కన్‌ఫర్మ్‌ చేశాడు.

* * *

అంబులెన్స్‌ పల్లెను సమీపిస్తోంది.

వెనుకే కారులో నా కుటుంబంతో నేను ఫాలో అవుతున్నాను.

హైదరాబాద్‌లో ఉన్న నా సర్కిల్‌ నుంచి ఫోన్స్‌ వస్తూనే ఉన్నాయి.

‘‘ఇప్పుడే విషయం తెలిసింది... ఎలా జరిగింది? సారీ, అంత దూరం రాలేకపోతున్నాను. ఇక్కడికి రాగానే ఇంటికొచ్చి కలుస్తాను.’’

కమ్యూనికేషన్‌ పెరిగిన ఈ కాలంలో ఈ తరహా ఓదార్పుకు మించి ఎక్కువ ఆశించడం అత్యాశే!

అంబులెన్స్‌ పంచాయితీ ఆఫీసు సమీపించింది. అప్పటికే అక్కడ నేను ఎప్పుడూ పట్టించుకోని బంధుమిత్రులు పదిమంది వరకూ ఉన్నారు.

వాళ్ళలో ఒకరిద్దరు అంబులెన్స్‌ దగ్గరకొచ్చి ఫ్రీజర్‌ని కిందికి దించడానికి ప్రయత్నిస్తున్నారు.

అప్పుడు...అప్పుడు ముందుకొచ్చాడు...రమేష్‌!

‘‘ఆగండి...’’

అందరం అతడికేసి చూశాం.

‘‘మాస్టార్ని ఇక్కడ దించొద్దు.’’

‘‘ఎ... ఎందుకని?’’ నా గొంతు వణికింది.

‘‘ఏ పార్థివ దేహమైనా ఇంటినుంచి లాంఛనాలతో శ్మశానం చేరుకోవాలి. కేవలం అనాధశవాలు మాత్రమే మార్చురీ నుంచో, పంచాయితీ ఆఫీసుల నుంచో శ్మశానానికి చేరుకుంటాయి.’’

నాలో... భయం, బాధ, దుఃఖం, కోపం కలగలిసిన నిస్సహాయత. ‘మా నాన్న దగ్గర చదువుకున్న వీడు... చివరికి ఆయనను అనాధశవంలా కూడా సాగనంపకుండా అడ్డుపడుతున్నాడా?’

నేనేదో అనబోయేంతలో రామ్మోహన్‌ వాడిని అడిగాడు ‘‘అయితే ఇప్పుడేమంటావ్‌?’’

‘‘ఆయన నాకు చదువు చెప్పారు. ‘తల్లీ తండ్రీ గురువూ దైవం’ అన్నారు. తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యత ఉంటుందో, గురువు పట్ల కూడా అంత బాధ్యత చూపించడం ధర్మం. అందుకే ఆయన పార్థివ దేహాన్ని మా ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను.’’

అక్కడున్న వాళ్ళందరూ వాడికేసి నమ్మలేనట్టు చూశారు.

నాకు మాత్రం అదో అద్భుతంలాగే అనిపించింది. అంతకుమించి ‘మనిషి మరణించలేదు’ అనుకున్నాను. ఎందుకంటే, ఏ రక్త సంబంధమూ లేకుండా శవాన్ని తన ఇంటినుంచి సాగనంపే మానవత్వం ఎందరికుంటుంది.

శవం రమేష్‌ ఇంటికి చేరుకుంది.

అప్పటివరకూ పట్టుమని పదిమంది లేరు. కానీ, శవం శ్మశానానికి బయలుదేరగానే వూరు వూరంతా వెనుక నడిచొచ్చింది.

నా స్థితీ, హోదాల కారణంగా వారెవరూ రాలేదు.

అది మా నాన్న చేసుకున్న పుణ్యం!

మనిషి బతికుండగా ఇష్టమైన ప్రదేశాలు చూడాలని యాత్రలు చేస్తాడు. కానీ, మరణం సమీపించాక తనకిష్టమైన చోటే తనువు ఆగిపోవాలని ఆశిస్తాడు. అయితే చాలా కొద్దిమందికే ఆ కోరిక తీరుతుంది, తనకత్యంత ఇష్టమైనచోట శాశ్వత విశ్రాంతి తీసుకునే అవకాశం లభిస్తుంది.

మా నాన్న ఆ విధంగా అదృష్టవంతుడు!

* * *

కర్మకాండలన్నీ పూర్తిచేసుకుని హైదరాబాద్‌ తిరిగొచ్చాం.

ఆ రాత్రి ప్రమద్వర నా భుజంమీద తల వాల్చి, గుండెల మీద చెయ్యేసింది. ఆ చేతి స్పర్శలో మునుపెన్నడూ లేనంత ఆప్యాయత కనిపించింది.

‘‘ఏమండీ...’’

‘‘వూ...’’

‘‘నేను చనిపోతే మీరు నన్ను వదిలి వెళ్ళిపోరుగా! అత్తయ్యగారి పక్కన మామయ్య ఉన్నట్టు మీరూ నా పక్కనే ఉంటారుగా...’’

ఒక సంఘటన ఎందరికో ఉత్తేజాన్నిస్తుంది. ‘నాన్న శవాన్ని అమ్మ దగ్గరకు చేర్చనవసరంలేదన్న’ ఆమె, మరణించాక కూడా నాతో కలసి గడపాలనుకుంటోంది.

నేను తనచుట్టూ చేతులేసి ‘‘అలాగే’’ అన్నాను.

* * *

ఆ రాత్రి నాకో కల వచ్చింది...

అమ్మ నిద్ర లేచింది. పక్కనే పడుకుని ఉన్న నాన్నను నిద్ర లేపుతోంది. ‘‘ఏమండీ... ఏమండీ...’’

నాన్నకు మెలకువ వచ్చింది. ‘‘సారీ జానకీ, శాశ్వత నిద్ర కదా...త్వరగా మెలకువ రాలేదు.’’

‘‘ఫరవాలేదులెండి... ఏదో పక్కనే ఉన్నారు కనుక మిమ్మల్ని పిలవగలిగాను... అదే ఎక్కడో దూరంగా ఉంటే ఏం చేసేదాన్ని. ఏదో మన పుణ్యం కొద్దీ ఇద్దరం ఒక్కచోటే ఉండే అదృష్టం దక్కింది.’’

‘‘మనిద్దరం కలిసే ఇకపై మన పిల్లల్ని దీవించొచ్చు’’ నాన్న ఆనందంగా అన్నాడు.

వాళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోసాగారు.

నాకు మెలకువ వచ్చింది. మనసంతా ఏదో తెలియని ఆనందం.

అరవై ఏళ్ళు కలసి జీవించి ఆరేళ్ళుగా దూరమైన ఆ తనువులు... ఒకేచోట మట్టిలో కలసిపోవడం... బిడ్డలు తలచుకుంటే సాధ్యమేనేమో!

నాకు జీవితంలో గొప్ప విజయం సాధించిన సంతృప్తి లభించింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.