close
కాఫీ తాగేద్దాం... కప్పు తినేద్దాం..!

కాఫీ తాగేద్దాం... కప్పు తినేద్దాం..!

శాండ్‌విచ్‌, చాక్లెట్‌, కప్‌కేకు... ఇలా ఏది తినాలన్నా దానిమీద ఉన్న ప్లాస్టిక్‌ రేపర్‌ తీయాల్సిందే. చెత్తబుట్టలో పారేయాల్సిందే. అదే రేపర్‌ని కూడా తినేయగలిగితే, ఐస్‌క్రీమ్‌ కోన్‌ మాదిరిగానే కాఫీ తాగాక ఆ కప్పునీ చప్పరించేస్తే... భూమినిండా ప్లాస్టిక్కు చెత్తా పేరుకోదు, పర్యావరణానికి హానీ కలగదు. సరిగ్గా ఆ కారణంతోనే కొన్ని కంపెనీలు ఒకే దెబ్బకు రెండు ప్రయోజనాలు చేకూరేలా తినగలిగే కవర్లనీ వస్తువుల్నీ రూపొందిస్తున్నాయి. వాటి కథాకమామీషు..!

కరకరలాడే కాఫీ కప్ప

చూడ్డానికి అచ్చంగా అట్టముక్కలాంటి ప్లాస్టిక్కుతో చేసినట్లే ఉంటాయి. కానీ బిస్కట్టుతో తయారైన స్కోఫీ కప్పులివి. కేఎఫ్‌సీ రూపొందించిన ఈ కప్పులపైన పంచదార కాగితాన్నీ లోపల వేడికి కరిగిపోని వైట్‌ చాకొలెట్‌ పూతనీ పూయడంతో కాఫీ వేడిగా ఉంటుంది. అది తాగాక కప్పుని బిస్కట్ల మాదిరిగా కొరికీ తినొచ్చు. ఇదేతరహాలో పండ్లరసాల్నీ చల్లనిపానీయాల్నీ అందించేందుకు అగర్‌అగర్‌ అనే సముద్ర నాచుతో గాజుని తలపించే జెల్లో గ్లాసుల్నీ తయారుచేస్తున్నారు. అందులోని పానీయాన్ని తాగేశాక ఎంచక్కగా ఆ గాజుని కొరుక్కుని తినేయొచ్చు.

 

కొవ్వొత్తి కరిగిపోతోంది..! 

పుట్టినరోజు, పెళ్లిరోజు... వేడుక ఏదైనా ఇటీవల కేకు మీద అలంకరించేవన్నీ దాదాపుగా తినేవాటితోనే తయారుచేస్తున్నారు. మరి, దానిమీద పెట్టే క్యాండిల్‌ను మాత్రం మైనంతో ఎందుకూ... దాన్నీ ఎంచక్కగా చప్పరించేస్తే ఎంత బాగుంటుందీ అనుకుంది శాండ్లర్‌ లోరీ అనే మహిళ. ఆలోచన రావడమే ఆలస్యం... ‘లెట్‌ దెమ్‌ ఈట్‌ క్యాండిల్స్‌’ పేరుతో ఈ చాక్లెట్‌ కొవ్వొత్తులను తయారుచేసింది. మైనం కన్నా త్వరగా కరిగిపోయే ఈ చాక్లెట్‌ కొవ్వొత్తులను, కేకుతోపాటు చప్పరించొచ్చు.

 

బ్రెడ్డు గిన్నెలు 

హోటల్‌కి వెళ్లి సూపో సలాడో ఆర్డరు చేస్తాం. లేదా అన్నం పప్పూ అడుగుతాం. అప్పుడు బేరర్‌ బ్రెడ్డు గిన్నెల్లో సలాడ్‌నీ పప్పునీ అన్నాన్నీ కూరనీ అందంగా సర్ది లేదా సూపుని నింపి తీసుకొస్తాడు. తమాషా అనుకునేరు, అమెరికాలోని కొన్ని రెస్టరెంట్లలో ఈ బ్రెడ్డుగిన్నెల సర్వింగ్‌ ఓ ఫ్యాషన్‌గా మారింది. పూర్వకాలంనాటి మట్టికుండల్ని తలపించే ఈ బ్రెడ్డు గిన్నెల్ని మొదట్లో ఎవరో సరదాకోసమే తయారుచేసినా క్రమంగా ఈ బ్రెడబుల్‌ గిన్నెలు ఆహారప్రియుల్ని చవులూరిస్తున్నాయి. అందులో ఉన్న సూపు తాగేసి, ముడిధాన్యంతో చేసిన ఆ గిన్నెని ఏ కూరతోనో సలాడ్‌తోనో కలిపి ఎంచక్కా కొరికి తినేయొచ్చు.

 

బుడగలు ఎంతో రుచి 

ఒక్క పిల్లలనేముందీ, చాలామంది పెద్దవాళ్లకు కూడా సోప్‌ బబుల్స్‌ను వూదడమంటే భలే ఇష్టం. కానీ ఒక్కోసారి వాటిని వూదుతుంటే ఆ సబ్బునీళ్లు పిల్లల నోట్లోకి వెళ్లిపోయి ఎక్కడ ఉక్కిరిబిక్కిరి అయిపోతారోనని భయం. ఇకనుంచీ ఆ భయం లేకుండా ఆ బుడగల్ని మధ్యమధ్యలో నోట్లో వేసుకుని మరీ చప్పరించవచ్చు. పైగా వీటిల్లో మనకి ఎప్పుడు ఏ ఫ్లేవర్‌ ఇష్టమైతే అది వూదుకోవచ్చు. ఎందుకంటే ఒక ఎడిబుల్‌ బబుల్స్‌ కిట్‌లో లెమన్‌, ఆరెంజ్‌, సోడా... ఇలా ఆరు రకాల ఫ్లేవర్లు ఉంటాయి. సబ్బు బుడగలనే కాదు, లండన్‌లోని స్కిప్పింగ్‌ రాక్స్‌ ల్యాబ్‌ ‘వూహో బబుల్స్‌’ పేరుతో ప్లాస్టిక్కుతో పనిలేని మంచినీళ్ల బుడగల్ని రూపొందించింది. సముద్రనాచుతో తయారుచేసిన ఈ బుడగలపై ఉండే సంచుల్ని నీటితో సహా మింగినా సరే, లేదా పారేసినా భూమిలో కలిసిపోతాయి. దాంతో ఈ తరహా ప్యాకింగుని శీతలపానీయాలకీ వాడాలనుకుంటున్నారు.

 

‘కప్‌’ కేకు... కెవ్వు కేక... 

రకరకాల రుచుల్లో నోరూరించే కప్‌ కేకులే కాదు, వాటి రేప¾ర్లూ చవులూరించేలా తయారుచేస్తున్నారు. డాక్టర్‌ ఓట్కర్‌ అనే కంపెనీ రూపొందిస్తోన్న ఈ ‘ఎడిబుల్‌ వేఫర్‌ కప్‌ కేక్‌ కేసెస్‌’ ఉంటే బేక్‌ చేయడానికి ప్రత్యేకంగా ప్లాస్టిక్‌ లేదా కాగితం కప్పుల అవసరం లేదు. ఈ కప్పుల్లో కేకు మిశ్రమాన్ని నింపేసి, నేరుగా బేక్‌ చేసేసి దాంతోపాటుగానే ఆ కేకుని ఆస్వాదించవచ్చు. పైగా ఈ కప్పులను పూర్తిగా శాకాహార పదార్థాలతోనే రూపొందించామనీ కాబట్టి వెజ్‌ కేకులు మాత్రమే తినేవాళ్లు సైతం నిరభ్యంతరంగా వాడుకోవచ్చనీ అంటున్నారు తయారీదారులు.

 

ప్లాస్టిక్కు కాదు, ప్రొటీన్‌ రేపర్‌ 

షాపుకి వెళ్లి స్వీటు తిన్నా క్యాండీ కొన్నా అన్నింటికీ పలుచని పారదర్శక ప్లాస్టిక్‌ రేపర్లు ఉంటాయి. లోపలున్న పదార్థం పాడవకుండా ఉండేందుకే వాటిని చుట్టినప్పటికీ అది పర్యావరణానికి కలిగించే హాని అంతా ఇంతా కాదు, పైగా అందులోని రసాయనాలు సైతం ఆ పదార్థంలోకి వెళ్లి, ఆరోగ్యానికీ ఎంతో కొంత హాని కలిగిస్తాయి. అందుకే అమెరికన్‌ వ్యవసాయ విభాగం పాలల్లోని కేసిన్‌ అనే ప్రొటీన్‌తో ప్లాస్టిక్‌ను పోలిన పలుచని కాగితాన్ని రూపొందించింది. ఇది లోపలున్న పదార్థం పాడవకుండా చేయడంలో ప్లాస్టిక్‌ కన్నా ఐదు వందల రెట్లు ప్రభావవంతంగా పనిచేస్తుందట. అదేసమయంలో ఆ స్వీటుతో సహా దీన్ని కూడా తినేయొచ్చు. ఈ ప్రొటీన్‌ ప్లాస్టిక్కే కాదు, మరికొన్ని ఫాస్ట్‌ఫుడ్‌ ఛెయిన్లు సైతం బర్గర్లూ శాండ్‌విచ్‌లను తినే రైస్‌ పేపర్లను చుట్టి అందిస్తూ తాము సైతం పర్యావరణ ప్రియులమేనని చాటుకుంటున్నాయి.

 

తినే పెన్నూ పెన్సిలూ..! 

ఏదో ఆలోచిస్తూ రాస్తుంటే ఆటోమేటిగ్గా చేతిలోని పెన్ను నోట్లోకి వెళ్లిపోతుంటుంది. అలా వెళ్లినప్పుడల్లా పెప్పర్‌మింట్లలా ఒకదానిమీద ఒకటిచొప్పున అతికించిన క్యాండీని చప్పరించేయొచ్చు. ఇలా దాదాపు 22 క్యాండీలతో చేసిన ఈ పెన్నుల్ని వాటిలోపల నింపిన ఇంకుతోసహా తినేయొచ్చు. చివరగా మిగిలి ఉండే మెటల్‌ టిప్పుని మాత్రం వూసేయాల్సిందే. పైగా ఈ క్యాండీలను మన చేతులకి అతుక్కోకుండా కరిగిపోకుండా ఉండేలా తయారుచేస్తున్నారు. అలాంటివే క్రేయాన్లూ వస్తున్నాయి. పిల్లలు బొమ్మలేసుకుంటూ ఒక్కోసారి ఆ రంగు పెన్సిళ్లను నోట్లో పెట్టుకుంటుంటారు. అందుకే పండ్లరసాలూ తినేరంగులూ పంచదారతో తయారుచేసిన ఈ రంగుపెన్సిళ్లని తిన్నా ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలగదు.

 

గోళ్లరంగు భలే రుచి 

పిల్లలకు లిప్‌స్టిక్కులూ గోళ్లరంగులూ అంటే మహా ఇష్టం. కానీ వాళ్లు తరచూ పెదాలను తడుపుకోవడం, వేళ్లను నోట్లో పెట్టుకోవడం చేయడంతో ఆ రంగులూ తద్వారా అందులోని రసాయనాలూ నోట్లోకి వెళ్లిపోతాయి. కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్లూ మరిచిపోయి అలా చేస్తుంటారు. ఆ సమస్య లేకుండా ఉండేందుకే ఇటీవల కొన్ని కంపెనీలు కోకో లిప్స్‌, కిడ్‌ లిక్స్‌... వంటి ఎడిబుల్‌ లిప్‌స్టిక్కుల్నీ గోళ్లరంగుల్నీ తయారుచేస్తున్నాయి. కొందరు షెఫ్‌లు సైతం మౌల్డ్స్‌ ద్వారా రకరకాల పండ్లరసాలతోనూ లిప్‌స్టిక్కుల్ని చేసేస్తున్నారు. సో, ఇవిగానీ వేసుకుంటే ఆయా ఫ్లేవర్‌ని బట్టి మధ్యమధ్యలో పెదాలను తడుపుకుంటూ చాక్లెట్‌నో పండునో చప్పరించిన అనుభూతినీ పొందవచ్చు.

 

తింటూ ఆడదామా... 

పెద్దవాళ్లు పిండి కలుపుతుంటే మాకూ కావాలని గొడవ చేస్తుంటారు పిల్లలు. దాంతో వాళ్లకి ఆడుకోవడానికి పాలిమర్‌ క్లేని ఇస్తుంటారు. అయితే ఆకర్షణీయమైన రంగుల్లో కనిపిస్తోన్న ఆ ప్లాస్టిక్‌ మట్టిని గభాల్న నోట్లో పెట్టుకుంటే ప్రాణాలకే ప్రమాదం. అందుకే మార్ష్‌మాలోలతో చేసే ఈ ‘ఎడిబుల్‌ ప్లే డవ్‌’ల వాడకం బాగా పెరిగింది. పంచదార, జెలాటిన్‌, నీటితో తయారయ్యే మార్ష్‌మాలోలు స్పాంజిల్లా ఉంటాయి. వీటిల్లో నూనె, తినే రంగులు, కార్న్‌స్టార్చ్‌లు కలిపి ఈ రంగురంగుల పిండిముద్దల్ని రూపొందిస్తున్నారు. వీటితో పిల్లలు పండ్లూ కేకులూ బిస్కెట్లూ బొమ్మలూ చేస్తూ ఆడుకోవడమే కాదు, తిన్నా పర్లేదు.

చూశారుగా, ఎన్ని రకాల తినే వస్తువులో... ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగాలనీ, ప్లాస్టిక్కుకి చరమగీతం పలికేరోజు త్వరలోనే రావాలనీ ఆశిద్దాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.