close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అక్కడి పాఠశాలల్లో చదరంగం తప్పనిసరి!

అక్కడి పాఠశాలల్లో చదరంగం తప్పనిసరి! 

‘ఆకాశాన్ని తాకుతున్నట్లుండే అరారత్‌ పర్వతశ్రేణినీ, పురాతన కాలం నుంచీ మనుషులు నివసిస్తోన్న గులాబీ నగరాన్నీ, ప్రపంచంలోనే క్రైస్తవాన్ని అధికారికంగా తీసుకున్న తొలి దేశాన్నీ, మొట్టమొదటి చర్చి నిర్మాణాన్నీ, చదరంగాన్ని పాఠ్యాంశంగా బోధించే స్కూళ్లనీ ప్రత్యక్షంగా చూడాలంటే అర్మేనియాను సందర్శించి తీరాల్సిందే’ అంటున్నారు ఆ దేశాన్ని ఈమధ్యే సందర్శించిన దుబాయ్‌ నివాసి రాజేష్‌ వేమూరి.

 

హైదరాబాద్‌లోని అబిడ్స్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా... ఏడో నిజాం కాలంలో అర్మేనియాకి చెందిన ఆల్బర్ట్‌ అబిద్‌ అనే వ్యక్తి అక్కడ ఓ దుకాణం నడపడంతో ఆ ప్రాంతాన్ని అబిద్‌ షాపు అని పిలిచేవారట. అదే కాలక్రమంలో అబిడ్స్‌గా మారింది. ఆవిధంగా మన తెలుగునేలతోనూ కొంత అనుబంధం ఏర్పరచుకున్న ఆ అర్మేనియాని చూడాలని దుబాయ్‌ నుంచి ప్రయాణమై, ఆ దేశ రాజధాని నగరమైన యెరవాన్‌కి చేరుకున్నాం. ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో యెరవాన్‌ ఒకటి. 2800 ఏళ్ల చరిత్రను నింపుకున్న ఈ నగరం ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది. ముందుగా అక్కడ ఉండటానికి అవసరమైన వీసా ఫీజు చెల్లించి, కరెన్సీని అర్మేనియా డ్రాముల్లోకి మార్చుకుని, ట్రావెల్‌ ఏజన్సీ ఏర్పాటుచేసిన మినీ బస్సులో బయలుదేరాం.

ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అర్మేనియా జనాభా ప్రస్తుతం 30 లక్షలు కాగా, అందులో సగం నగరంలోనే నివసిస్తున్నారు. చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో నివసించే అర్మేనియన్ల సంఖ్య 80 లక్షలు. ఆదినుంచీ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కోవడంతో ఈ దేశం నుంచి ప్రజలు దఫదఫాలుగా వలస వెళ్లిపోయారు. మన అబిడ్స్‌ వాసి కూడా అలా వచ్చినాయనే.

బైబిలు ప్రకారం- జలప్రళయం సమయంలో నోవా అనే పెద్దాయన కొన్ని ప్రాణులను నౌకలో ఉంచి రక్షించగా, ఆ నౌక అరారత్‌ కొండల్ని చేరిందని అర్మేనియన్లు నమ్ముతారు. అలా అప్పటినుంచీ అక్కడ నివసిస్తోన్న అర్మేనియన్లు ఓ ప్రత్యేక సంతతిగా గుర్తింపు పొందారు. ఆ దేశంలో 97 శాతం మంది అర్మేనియన్లే. మిగిలిన కొద్దిశాతంలో కుర్దులూ, రష్యన్లూ, ఉక్రెయినీలు ఉన్నారు. అందుకే ఒకే తెగకు చెందిన దేశం ప్రపంచంలో ఇదొక్కటే. అరారత్‌ పర్వతాల ఒడిలో ఉన్నట్లు ఉండే అర్మేనియా దేశానికి తీర ప్రాంతం లేదు. టర్కీ, జార్జియా, ఇరాన్‌, అజర్‌బైజాన్‌ దేశాల మధ్యలో ఉన్న ఈ దేశానికి అక్కడి పర్వత ప్రాంతాల్లో దొరికే రాగి, బంగారం, తగరం... వంటి ఖనిజాలే ప్రధాన ఆదాయ వనరులు. ఒకప్పుడు దేశంలో భాగంగా ఉండి, జాతీయ చిహ్నంగా ఉన్న అరారత్‌ పర్వతాలు ప్రస్తుతం టర్కీలో ఉన్నాయి. కానీ ఇప్పటికీ అర్మేనియన్లు వాటినే తమ జాతీయ చిహ్నంగా భావిస్తారు.

 

గులాబీ నగరంలో..!
విమానాశ్రయం నుంచి మా బస్సు నగరంవైపు ప్రయాణిస్తోంది... అక్కడి ఇళ్లన్నీ గులాబీ, లేత పసుపురంగులో ఉన్నాయి. అక్కడ దొరికే టాఫ్‌ అనే ప్రత్యేకమైన రాయితోనే ఇళ్లూ కట్టడాలూ నిర్మిస్తారని బస్సులోని గైడ్‌ చెప్పింది. అగ్నిపర్వత లావాలోనుంచి ఏర్పడిన ఈ రాయి, ఆ రెండు రంగుల్లోనే ఎక్కువగా లభిస్తుందట. ఆది నుంచీ ఈ రాయినే నిర్మాణానికి వాడుతున్నారు. భారీ కర్మాగారాల నుంచి చిన్న ఇళ్లవరకూ సిమెంట్‌గానీ సున్నంగానీ వేయరు. రాళ్లను వరసగా పేర్చి అవి అతుక్కోవడానికి మాత్రమే సిమెంటుని వాడతారు. వేసవిలో చల్లగా చలికాలంలో వెచ్చగా ఉండటం ఈ రాయి ప్రత్యేకతట. భవంతులన్నీ ఎక్కువగా గులాబీ రంగులో ఉండటంతో యెరవాన్‌కి గులాబీ నగరం అని పేరు.అలా ప్రయాణిస్తూ యెరవాన్‌ రైల్వేస్టేషన్‌కీ, తరవాత రిపబ్లిక్‌ స్క్వేర్‌కీ చేరుకున్నాం. అప్పటికే సాయంత్రం కావడంతో కూడలి ఎంతో సందడిగా ఉంది. దీని నిర్మాణం 1926నుంచి 1977 వరకూ కొనసాగిందట. మొదట్లో దీన్ని లెనిన్‌ స్క్వేర్‌గా పిలిచేవారు. సోవియట్‌ నుంచి స్వతంత్రం లభించాక అక్కడి లెనిన్‌ విగ్రహాన్ని తొలగించి కూడలికి పేరు మార్చారు. నగరంలో తిరిగే కార్లూ టాక్సీలూ అన్నీ పాతవే. చిన్న కార్లే. విలాసవంతమైనవీ పెద్దవీ ఎక్కడా కనిపించవు. తరవాత విక్టరీ పార్కుకి తీసుకెళ్లారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో అర్మేనియా దళాలు రష్యా తరపున యుద్ధం చేశాయి. దాంతో ఆ గెలుపునకు గుర్తుగా ఈ ఉద్యానవనాన్ని నిర్మించారు. అక్కడ పలు యుద్ధాల్లో భర్తలకు సహకరించిన అర్మేనియా మహిళలకు గుర్తుగా ‘మదర్‌ ఆఫ్‌ అర్మేనియా’ విగ్రహాన్నీ ప్రతిష్ఠించారు. అప్పటికే చలిగాలులతో సన్నటి వర్షం మొదలవడంతో ఆరోజు పర్యటన ముగించుకుని కాస్కన్‌ అనే హోటల్‌కి వెళ్లిపోయాం.

కొండమీద కొలను!
మర్నాడు ఉదయం లేక్‌ సెవాన్‌ అనే మంచినీటి సరస్సుకి చేరుకున్నాం. ఇది సముద్రమట్టానికి 6,250 అడుగుల ఎత్తులో ఉన్న రెండో అతిపెద్ద మంచినీటి సరస్సు. మొదటిది లాటిన్‌ అమెరికాలోని టిటికాకా సరస్సు. ఇది బొలీవియాలో ఉంది. యెరవాన్‌ నుంచి సెవాన్‌కి 80 కిలోమీటర్లు. దాదాపు రెండు గంటల ప్రయాణం. ఉష్ణోగ్రత 10 డిగ్రీలు ఉండటంతో చల్లగా ఉంది. మేం ప్రయాణించిన రెండు గంటల్లోనే చలి, వర్షం, ఎండ... ఇలా వెంటవెంటనే వాతావరణం మారిపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. అక్కడ వేసవి జూన్‌ నుంచి సెప్టెంబరు. అప్పుడు కూడా ఉష్ణోగ్రతలు 22 - 36 డిగ్రీల సెల్సియస్‌కి మించవు. యెరవాన్‌ నుంచి సెవాన్‌కి మీటర్‌గేజ్‌ రైలు సౌకర్యం కూడా ఉంది. అది చాలా పెద్ద సరస్సు కావడంతో గాలుల తాకిడికి సముద్రంలో మాదిరిగా అలలు వస్తున్నాయి. బస్సు దిగేసరికి చలిగాలి తీవ్రంగా ఉండటంతో ఓ రెస్టరెంటులోకి వెళ్లి కూర్చున్నాం. కాసేపటికి ఆ గాలుల ధాటికి రెస్టరెంటు అద్దాలు భళ్లున పగిలిపోయాయి. అదృష్టవశాత్తూ ఆ అద్దాలపక్కన అప్పుడెవరూ లేరు.

ఆ సరస్సు ఎదురుగా కొండపైన ఓ పురాతన చర్చి ఉంది. అక్కడినుంచి సరస్సు మొత్తం కనిపిస్తుందట. కానీ మా బాబు పసివాడు కావడంతో మేం అక్కడికి వెళ్లే సాహసం చేయలేదు. గాలి ఉద్ధృతి తగ్గాక సరస్సు ముందు ఫొటోలు తీసుకున్నాం. చలికాలంలో ఇది గడ్డకట్టుకుపోతుందట. అక్కడి చేపల వనరుకి ఈ సరస్సే ప్రధాన ఆధారం. భోజన సమయానికి అక్కడే ఉన్న మరో రెస్టరెంట్‌కి వెళ్లాం. సెవాన్‌ సరస్సులో అనేక రకాల చేపలు దొరుకుతాయి. వాటిల్లో సెగా అరుదైనది. అది చాలా రుచిగా ఉంటుందని మా గైడ్‌ చెప్పడంతో దాన్ని రుచి చూశాం. నిజంగానే వాసన లేకుండా ఎంతో బాగుంది.

గార్ని... ఓ పురాతన ఆలయం!
తరవాత సెవాన్‌కి 75 కిలోమీటర్ల దూరంలోని గార్ని అనే పట్టణానికి వెళ్లాం. ఇది అర్మేనియా రాజుల వేసవి విడిది. అక్కడే క్రీ.పూ. నాటి అర్మేనియా దేవాలయం ఉంది. 2100 సంవత్సరాలనాటి ఆ నిర్మాణాన్ని చూడాలంటే మాత్రం 2 డాలర్ల రుసుము చెల్లించాలి. ఆ దేశంలో మిగిలిన ఏ సందర్శనీయ స్థలానికీ రుసుము లేదు, యునెస్కో గుర్తింపు ప్రదేశాలకు తప్ప. ఆలయం లోపల ఓ రాతిపీఠం మాత్రం ఉంది. ఈ నిర్మాణం చుట్టూ ఉండే 24 స్తంభాలు 24 గంటలని సూచిస్తాయట. ఆ దేశంలో గ్రీకు, రోమన్‌ శైలిలో నిర్మించిన ఏకైక నిర్మాణం ఇది. దొరికిన ఆధారాల ప్రకారం క్రీ.పూ. 77వ సంవత్సరంలో నిర్మించారనేది ఓ అంచనా. అయితే ఇది ఆలయం కాదనీ కేవలం సమాధి మాత్రమే అన్న మరో చారిత్రక వాదనా ఉంది. దీనికి పక్కనే నేలమాళిగలో రోమన్‌ పవిత్ర స్నానానికి సంబంధించిన గదులు ఉన్నాయి. వాటిని కూడా చూశాక, గెగార్డ్‌ అనే చర్చికి వెళ్లాం. కానీ ఇందులో మూడు వేర్వేరు చర్చిలు ఉన్నాయి. చిత్రంగా ఇవన్నీ ఒకే రాతిలో తొలిచిన నిర్మాణాలు. వెలుతురుకోసం వెంటిలేటర్లనీ నిర్మించారు. అక్కడ నుంచి బయటకు వస్తుంటే డ్రైనట్స్‌ని ఒకలాంటి హల్వాలో ముంచి తయారుచేసిన సుజుక్‌ అనే క్యాండీలని అమ్ముతున్నారు. మంచి పోషకభరితమైన ఈ క్యాండీలని యుద్ధ సైనికులు వెంట తీసుకెళ్లేవారట. మర్నాడు మా బృందంలో కొందరు అరారత్‌ పర్వతాల దగ్గరకు వెళితే, అక్కడ నివసిస్తున్న మా మిత్రులు ఏర్పాటుచేసిన ట్యాక్సీలో మేం నగర పర్యటనకు బయలుదేరాం.

క్రీస్తు ప్రధాన శిష్యులైన దాడియస్‌, బొర్లోలోమేవ్‌ల ప్రభావంతో క్రీ.శ. 301 సంవత్సరంలోనే అర్మేనియన్లు క్రైస్తవమతాన్ని స్వీకరించారు. తద్వారా ప్రపంచంలోనే మొదటి అధికారిక క్రైస్తవ మత దేశంగా ఇది గుర్తింపు పొందింది. మేం బస చేసిన హోటల్‌ నుంచి యెరవాన్‌ నగరం మీదుగా గంట ప్రయాణించి గతంలో పాగన్‌ దేవాలయం ఉన్న వాఘర్‌షపత్‌ అనే ప్రాంతంలో కట్టిన ఎచమియాజిన్‌ క్యాథెడ్రల్‌ను చూడ్డానికి బయలుదేరాం. ఇది ప్రపంచంలోనే తొలి క్రైస్తవ ప్రార్థనామందిరం. అక్కడకు కొద్దిదూరంలోనే మరో చారిత్రక క్యాథెడ్రల్‌ కూడా చూసి, నగరం మధ్యలో నేలమాళిగలో ఉన్న ఓ అత్యాధునిక రెస్టరెంట్‌లో భోజనం చేశాం.

అతిపెద్ద మానవ హననం!
తరవాత జెనోసైడ్‌ మ్యూజియానికి వెళ్లాం. 16వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకూ అర్మేనియాలో కొంత భాగం ఒట్టోమన్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. దీన్ని టర్కిష్‌ అర్మేనియా అనేవారు. ఆ సమయంలో రష్యా-పర్షియా యుద్దాలు జరుగుతుండేవి. వాటిల్లో కొందరు రష్యన్లకు అనుకూలంగా ఉన్నారనే నెపంతో 1895-1920 వరకూ దఫదపాలుగా టర్కీ పాలకులు అక్కడివారిని మట్టుబెట్టారు. అత్యధికంగా 1915-20 కాలంలో దాదాపు 15 లక్షల మందిని చంపేశారు. అందులో భాగంగా సిరియా ఎడారిలో లక్షల మందిని నడిపించి చంపేశారట. ఆనాటి హత్యల ఆనవాళ్లుగా శవాలూ, పుర్రెల ఫొటోలూ వీడియోలను మ్యూజియంలో భద్రపరిచారు. ప్రపంచంలో రికార్డు చేసిన జాతి హత్యల ఘటనలో అర్మేనియా జెనోసైడ్‌ మొదటిది. ఆ వూచకోత తరవాత అర్మేనియా రష్యా పాలనలోకి వెళ్లిపోయింది. సోవియట్‌ యూనియన్‌ పతనానంతరం ఇది స్వతంత్ర దేశంగా అవతరించింది. తరవాత ఎత్తైన కొండమీద ఉన్న ఖోర్‌ విరాప్‌ అనే క్రైస్తవాశ్రమానికి వెళ్లాం. అక్కడ నుంచి చూస్తే అరారత్‌ పర్వతాలు ఆకాశాన్ని తాకుతున్న దృశ్యం కనువిందు చేస్తుంది. ఈ ఖోర్‌ విరాప్‌ చుట్టూ అన్నీ పంటపొలాలూ పచ్చికబయళ్లూ ఉన్నాయి. కొంత దూరంలో ఫెన్సింగ్‌ వేసిన టర్కీ సరిహద్దు కనిపించింది. అక్కడ నుంచి నగరంలోని దల్మాఆల్‌ అనే షాపింగ్‌మాల్‌కి వెళ్లాం.

అర్మేనియాలో వైద్య విద్య చదవడానికయ్యే ఖర్చు మనతో పోలిస్తే చాలా తక్కువ. అలాగే పాఠశాలల్లో చదరంగం తప్పనిసరి పాఠ్యాంశం. అందుకే నగరంలో టైగ్రన్‌ పెట్రోసియన్‌ చెస్‌ హౌస్‌లో తరచూ అంతర్జాతీయ స్థాయి పోటీలు జరుగుతూనే ఉంటాయి. అర్మేనియన్ల భోజనంలో లవష్‌ అనే బ్రెడ్డు తప్పనిసరి. నమిలినట్లుగా తినే దీన్ని నేలమాళిగలో ఏర్పాటుచేసిన టోనిర్‌ అనే ఓవెన్‌లో ప్రత్యేక పద్ధతిలో తయారుచేస్తారు. అందుకే ఇది ఏడాదిపాటు నిల్వ ఉంటుందట. ఆ విధంగా వేల సంవత్సరాల నుంచీ నివాసప్రాంతంగా ఉన్న పురాతన నగరాన్ని చూశామన్న అనుభూతితో వెనుతిరిగాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.