close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మేము చదువుకోనివ్వం

మేము చదువుకోనివ్వం
- జ్యోతి సుంకరణం

‘‘వూరికి దగ్గర్లోనే మంచి కాలేజీ ఉందంటున్నావ్‌, పైగా మీ వాడు కూడా బాగానే చదువుతాడంటున్నావ్‌, మరి అలాంటప్పుడు ఇంత దూరంలో ఇక్కడ హాస్టల్లో పెట్టి చదివించాల్సిన అవసరం ఏముందిరా?’’ తుంచిన ఇడ్లీ ముక్కని కొబ్బరి చట్నీలో ముంచి నోట్లో పెట్టుకుంటూ అడిగాడు విశ్వనాథం స్నేహితుడు భూషణాన్ని.

‘‘నీకు తెలీనిదేం ఉందిరా, పల్లెటూళ్ళలో చదువులు కూడా ఒక చదువులేనా... పైగా అక్కడే ఉంటే వాళ్ళ నాన్నమ్మా, అమ్మా వాడిని అతి గారం చేయడం, వీధుల్లో తోటి పిల్లలతో ఆటలాడటం తప్ప, ఇంకోటి ఉండదు. ఏదో ఇంతవరకూ వంటబట్టిన చదువు కూడా అటకెక్కుతుంది. ఇంటికి దూరంగా హాస్టల్లోపెట్టి చదివిస్తే నాలుగు అక్షరం ముక్కలతోపాటు నాలుగు విషయాలు కూడా తెలుస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా వాడ్ని ఇంజినీరు చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నాన్నేను. నాకు తెలిసినవాళ్ళు ఒకళ్ళిద్దరు వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చే జాయిన్‌ చేశారట. ఇప్పుడు వాళ్ళు ఇంజినీర్లూ, డాక్టర్లూ అయి మంచి పొజిషన్లో ఉన్నారు. నేనెలాగూ అక్కడే ఉండిపోయి ఆ పల్లెటూరికి అంకితమైపోయాను. వీడైనా బాగా చదువుకుని ఇంజినీరయ్యి నా ఆశలు నెరవేర్చాలి. మా కుటుంబంలో కూడా ఒక ఇంజినీరు ఉన్నాడని చెప్పుకోవాలి’’ అన్నాడు భూషణం తాను ఇడ్లీ తినడం పూర్తిచేసి చెయ్యి కడుక్కుంటూ.

‘‘కానీ, ఒకసారి ఆలోచించుకో. మీవాడి ఇష్టాయిష్టాలేమిటో కూడా తెలుసుకున్నావా, వాడు పూర్తి పట్టుదలతో ఈ చదువు చదవాలీ అని ఉంటేనే...’’ అని ఇంకా ఏదో చెప్పబోతున్న విశ్వనాథాన్ని మధ్యలోనే ఆపేసి-

‘‘వాడి ఇష్టమేంటిరా, వాడి మొహం. ఏది చదువుకోమంటే అదే చదువుకుంటాడు. ఇంటికి దూరంగా ఉంటాడు కాబట్టి మొదట్లో కాస్త ఇబ్బందిపడతాడు. తరవాత వాడే అలవాటుపడిపోతాడు. అయినా వాడి భవిష్యత్తు బావుండాలనే కదా ఇదంతా’’ అన్నాడు భూషణం.

‘‘అవునన్నయ్యా, మీరు బాగా చెప్పారు. ఈ వయసులో మంచి చదువులో పెడితే బాగా పైకి వస్తారు. అదే గాలికి వదిలేస్తే అలాగే తయారవుతారు. ఆ వూళ్ళొ ఉంచేస్తే ఏమొస్తాయ్‌... అదే ఇక్కడైతే ఆ స్పీడూ, ఆ కాంపిటీషనూ అన్నీ వస్తాయ్‌. రేపొద్దున్న ఏ ఐఐటీలోనో సీటొచ్చి చదువుకున్నాడంటే మీకెంత గొప్పగా ఉంటుంది. ఆ తరవాత వాడు ఫారెన్‌లో సెటిల్‌ అయ్యాడంటే మీరూ, వదినా కూడా ఎంచక్కా ఫారెన్‌ చెక్కెయ్యొచ్చు, మీ లైఫ్‌స్టైలే మారిపోతుంది’’ అంది విశ్వనాథం భార్య గీత ఉత్సాహంగా చేతిలోని కాఫీ కప్పులని వాళ్ళిద్దరికీ అందిస్తూ.

‘‘మరే... చెల్లెమ్మా, బాగా చెప్పావ్‌. పెద్ద చదువులు చదువుకుని అన్ని దేశాలూ తిరగాలని ఉండేది నాకు. అది ఎలాగూ కుదరలేదు, వీడ్ని అయినా ఇంజినీరుని చేసి ఆ కోరిక తీర్చుకోవాలి. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు, మావాడు ఇంజినీరైతే చాలు’’ అన్నాడు రెట్టించిన ఉత్సాహంతో కాఫీ కప్పుని అందుకుంటూ భూషణం.

‘‘అయితే సరే, నువ్వింత స్ట్రాంగ్‌ నిర్ణయంతో ఉంటే ఇంకేం, నాకు తెలిసిన రెసిడెన్షియల్‌ కాలేజ్‌ ఉంది ఈరోజే వెళదాం’’ అన్నాడు విశ్వనాథం డైనింగ్‌టేబుల్‌ ముందు నుంచి లేస్తూ.

* * *

కాలేజ్‌ వెయిటింగ్‌ హాల్లో కూర్చుని చుట్టూ అంతా చూస్తూ తన పక్కనే కూర్చున్న కొడుకు వైపుకి తిరిగి ‘‘చూడు, అంతా నీ వయసు పిల్లలే ఎంతమంది ఉన్నారో, మా కాలానికి ఇన్ని సదుపాయాలు లేవు. మా పేరెంట్సూ ఇన్ని ఆలోచించేవారు కాదు. మీకలా కాదు, దేనికీ వెనకాడక్కర్లేదు. అంచేత, ఆ వూరి ధ్యాసా, ఆ ఇంటి ధ్యాసా పక్కనపెట్టి శుబ్బరంగా చదువుకో’’ అని బుద్ధులు చెప్పాడు.

అమాయకమైన మొహంతో ఆశ్చర్యంగా పెద్ద కళ్ళేసుకునీ చుట్టూ ఉన్న అందరినీ చూస్తూ ‘‘సరే నాన్నా’’ అన్నాడు వాడు.

‘‘అబ్బా, వాడే చదువుకుంటాడులేరా’’ అని విశ్వనాథం అంటూ ఉంటే, ఈలోగా చేతిలో ఒక జపమాల పట్టుకుని నోటిలో ఏదో గొణుక్కుంటూ వస్తున్న ఒక కుర్రాడూ, వాడి తల్లీతండ్రీ వచ్చి వీళ్ళ పక్కనే కూర్చున్నారు.

ఆ కుర్రాడిని పైనుంచి కిందవరకూ చూసి భూషణం కుతూహలం ఆపుకోలేక ‘‘ఏమిటండీ, మీ అబ్బాయి ఏదో గొణుక్కుంటున్నాడు ఏమిటీ?’’ అడిగాడు ఆరాగా.

‘‘అదీ... మాకు ఒక స్వామీజీ చెప్పారు- మావాడు 108 రోజులు 108సార్లు ఎవరితో మాట్లాడకుండా అలా ‘ఓం ఐఐటీ యాయనమః’ అని మంత్రం జపిస్తే తప్పకుండా సీటొస్తుందనీ, అందుకే ఇలా...’’ అంది కుర్రాడి తల్లి ఒకింత గర్వంతో పొంగిపోతూ వాళ్ళ అబ్బాయివైపు చూస్తూ.

‘‘అవునా!’’ విషయం విని ఆశ్చర్యపోతూ నోళ్ళు తెరుచుకుని అలాగే చూస్తుండిపోయారు భూషణం, విశ్వనాథం.

ఈలోగా లోపలనుండి పిలుపు రావడంతో వెళ్ళారు. వీళ్ళు తీసుకెళ్ళిన సర్టిఫికెట్స్‌ అన్నీ చూసిన ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ ‘‘ఇప్పటివరకూ మార్క్స్‌ అన్నీ బానే వచ్చాయి’’ అని తృప్తిగా తల పంకించి, ‘‘బాబూ, నువ్విట్రా’’ అని భూషణం కొడుకుని పిలిచి, ‘‘ఏదీ నీ రైట్‌హ్యాండ్‌తో నీ లెఫ్ట్‌ చెవి పట్టుకో’’ అన్నాడు. వాడు అలాగే చేశాడు. ‘‘ఈసారి అపోజిట్‌సైడ్‌ చెయ్యి’’ అన్నాడు. వాడు మారుమాట్లాడకుండా అలాగే చేశాడు. ‘‘ఓకే, గుడ్‌. ఇప్పుడు రూమ్‌ బైట గోడ మీద కొన్ని రాసి ఉన్నాయి, వెళ్ళి నేను వన్‌ టూ టెన్‌ నంబర్స్‌ లెక్కపెట్టేటప్పటికి అది కంఠతా పట్టేసి రావాలి’’ అని అంటూనే ‘‘యువర్‌ టైమ్‌ స్టార్ట్స్‌ నౌ... వన్‌, టూ, త్రీ’’ అంటూ నంబర్స్‌ లెక్క పెట్టెయ్యడం మొదలుపెట్టేశాడు. ఆ పిల్లాడు బాణంలాగా బయటికి పరుగెత్తికెళ్ళి పది అంకెలు లెక్కపెట్టేసరికి మళ్ళీ బాణంలాగా వచ్చేశాడు. ‘‘ఓకే, వెరీగుడ్‌. ఇప్పుడు చెప్పు, అక్కడ రాసి ఉన్నదేమిటో’’ అడిగాడు.

వాడు వెంటనే ‘‘శ్రీశ్రీశ్రీ రాజా బహద్దూర్‌ వీర చంద్రశేఖర రాజు గారు ఈ కాలేజీని నైంటీన్‌నైంటీలో స్థాపించారు. ఈ విద్యాసంస్థ నుండి వచ్చిన ఆదాయంతో మరెన్నో విద్యా సంస్థలనూ, చారిటబుల్‌ ట్రస్టులనూ స్థాపించారు. వారు టూతౌజండ్‌ టూలో స్వర్గస్థులైనారు. వారి తదనంతరం వారి కుమారులైన శ్రీశ్రీశ్రీ...’’ అంటూ గడగడా చెప్పుకుపోతున్న వాడ్ని-

‘‘చాలు చాలు చాలు. వెరీగుడ్‌, ఎక్సలెంట్‌’’ అని ఆపేసి ‘‘బావుందండీ, ఎందుకూ ఏమిటీ అని అడక్కుండా ఏది చెయ్యమంటే అది చేసి ఏది కంఠతా పెట్టమంటే అది పట్టేసి...ఎక్సలెంట్‌- మీవాడు మా కాలేజీకి అన్నివిధాలా ఫిట్‌. ఇకపోతే, మా ఫీజు యాభై నుండీ అరవై లక్షలదాకా ఉంటుంది. అది కట్టేసి ఈరోజే జాయిన్‌ చేసెయ్యండి’’ అన్నాడా కాలేజ్‌ ప్రిన్సిపాల్‌.

‘‘ఆఁ యాభైలక్షలా... చాలా ఎక్కువేమో! అంత కట్టాకా సీటు రాకపోతే’’ సందేహం వెలిబుచ్చాడు విశ్వనాథం.

‘‘అవునవును’’ అన్నట్లు బుర్ర వూపాడు భూషణం.

ఆ మాటలకి ఆ ప్రిన్సిపాల్‌ చాలా కూల్‌గా నవ్వేస్తూ ‘‘మాకు తెలుసు సార్‌, మీకా డౌట్‌ వస్తుందనీ. మా దాంట్లో సీట్‌ గ్యారంటీ అని మీకు మాటల్లో కాదు, పదండి... మేము స్టూడెంట్స్‌కి ఏ విధంగా ట్రైనింగ్‌ ఇస్తామో చూపిస్తాను. అప్పుడు మీకే తెలుస్తుంది, మేము రీజనబుల్‌గానే ఉన్నామని’’ అంటూ వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళాడు క్లాస్‌రూమ్స్‌ దగ్గరికి.

ముందుగా పెద్ద హాల్లోకి తీసుకెళ్ళాడు. అందులో వరుసగా కుర్చీల్లో కూర్చుని ఉన్నారు కొందరు. వారికెదురుగా టీపాయ్‌లు ఉన్నాయి. వాటిమీద నిమ్మకాయలున్న బాస్కెట్స్‌ ఉన్నాయి. అప్పటికే అక్కడ భూషణం లాంటి పేరెంట్స్‌ చాలామంది ఉన్నారు. వారినందరినీ ఉద్దేశించి ఆ ప్రిన్సిపాల్‌ ‘‘డియర్‌ పేరెంట్స్‌... చూడండి, ఇక్కడ కూర్చున్న వారందరూ చాలా ఎక్స్‌లెంట్‌ ట్యూటర్స్‌. మీ పిల్లలకి ఇందులో ఎవరు కావాలీ అనేది పూర్తిగా మీ ఇష్టం, మీరే సెలెక్ట్‌ చేసుకోవచ్చు. ఎలా సెలెక్ట్‌ చేసుకోవాలీ అనేది కూడా నేనే చెప్తాను’’ అని అందులో మొదట కూర్చున్న వ్యక్తి దగ్గరికెళ్ళి అతనికెదురుగా ఉన్న బుట్టలోంచి ఒక నిమ్మకాయని తీసిచ్చాడు. అతను దాన్ని తీసుకుని రెండు చేతుల మధ్యా పెట్టుకుని గట్టిగా నొక్కాడు. దానిలోంచి ఒక రెండు చుక్కల రసం పడింది. ఆ తరవాత కూర్చున్న వ్యక్తి దగ్గరికెళ్ళి నిమ్మకాయల్లోంచి ఒకటి తీసిచ్చాడు. అతను కూడా రెండు చేతుల మధ్యా పెట్టి నిమ్మకాయని నొక్కాడు. ముందు తీసినతనికన్నా మరో రెండు చుక్కలు ఎక్కువ పడ్డాయి. అలా వరుసగా అందరి దగ్గరికీ వెళుతూ ఆఖరి వ్యక్తి దగ్గరికొచ్చి నిమ్మకాయ ఇచ్చాడు. అతను నిమ్మకాయని చేతిలో పెట్టుకుని నొక్కగానే సర్ర్‌మని బోలెడంత రసం కారిపోయింది. అంతా ఆశ్చర్యపోయారు. ‘‘చూశారా, ఇతని టాలెంట్‌. మీరు ఎలాంటి నిమ్మకాయనైనా ఇవ్వండి, ఒక్క సెకనులో దానిలోంచి రసం మొత్తం తీసిపారేస్తాడు’’ అన్నాడు ప్రిన్సిపాల్‌ గర్వంగా పేరెంట్స్‌ వైపు చూస్తూ.

భూషణంతో సహా అందరూ సరదాపడి తలా ఒక నిమ్మకాయ ఇచ్చారు. ఎవరెలాంటిది ఇచ్చినా ఒక్క సెకనులో దానిలోని రసంతోపాటూ గుజ్జుని కూడా పిండి పారేస్తున్నాడా ఎక్స్‌లెంట్‌ ట్యూటర్‌.

‘‘ఇప్పుడు మీ పిల్లలకి ఏ ట్యూటర్‌ కావాలో సెలెక్ట్‌ చేసుకోండి’’ అన్నాడు ప్రిన్సిపాల్‌.

అంతా ఆ రసం పిండేసే ట్యూటరే కావాలి అని ఎగబడ్డారు.

దాంతో ఆ ప్రిన్సిపాల్‌ ‘‘అతనే కావాలంటే కచ్చితంగా మీరు ఎక్స్‌ట్రా పే చేయాల్సి ఉంటుంది. సరే పదండి, నెక్స్ట్‌ మీకు మా హాస్టల్‌ రూమ్స్‌ ఏ విధంగా డిజైన్‌ చేయబడ్డాయో చూపిస్తాను’’ అని వాళ్ళని హాస్టల్‌ రూమ్స్‌ వైపుకి తీసుకెళ్ళాడు. అవన్నీ నిజంగానే ప్రత్యేకంగా డిజైన్‌ చేయబడినట్లు గాలీ వెలుతురూ, రాత్రీ పగలూ ఏమీ తేడా తెలీకుండా ఉన్నాయి. వాటిని రూమ్స్‌ అనేకంటే గుహలు అంటే బావుండేటట్లున్నాయి.

‘‘చూశారా వీటిని, ఇందులో కూర్చుని చదువుకుంటే మీవాడికి రాత్రా పగలా అనే ఆలోచనే రాదు. సో, ఎన్ని గంటలైనా చదువుకుంటూ ఉండిపోవచ్చు. ప్లస్‌ నిద్ర టైమ్‌ అయ్యిందీ, ఫుడ్‌ టైమ్‌ అయ్యిందీ అనేది వాళ్ళ మనసుల్లోకి రానివ్వకుండా ఇక్కడ వాచ్‌ అనేది లేకుండా చేస్తాం. ఇన్‌కేస్‌ వాళ్ళకెప్పుడైనా మరీ ఆపుకోలేనంత నిద్ర వచ్చింది అనుకోండి... అప్పుడు వెళ్ళి పడుకోవచ్చు- అదిగో ఆ బెడ్స్‌ మీద. కానీ, ఈ బెడ్స్‌ చూశారా ఎలాగున్నాయో... ఎంత ఒళ్ళు తెలీని నిద్ర వచ్చినా మహా అయితే ఒక గంటో గంటన్నరో మించి దీనిమీద పడుకోలేరు. ఆ విధంగా వీటిని కుట్టించాం’’ అని చెప్పడం ఆపేసి, ఒకసారి చుట్టూ చూస్తూ ‘‘మీకు ఇంకో సీక్రెట్‌ చెప్పనా... ప్రతీ బెడ్‌ మీదా కొన్ని నల్లుల్ని కూడా ఎరేంజ్‌ చేయించాం. హ..హ..హా..’’ అంటూ గుసగుసగా చెప్పి పగలబడి నవ్వేస్తూ ‘‘పదండి, మిమ్మల్ని ఇంకో దగ్గరికి తీసుకెళ్తా’’ అంటూ ముందుకి నడిచాడు. అక్కడ ఉన్న అయిదు నిమిషాల్లోనే ఒళ్ళంతా చమటలు పట్టేయడంతో రుమాళ్ళతో తుడుచుకుంటూ ఆ గదుల్లోంచి బయటపడ్డారు భూషణం, విశ్వనాథం.

ఈలోగా బైట కారిడార్లో ఒక అబ్బాయి ఏడుస్తూ పై ఫ్లోర్‌లోకి పరిగెట్టేస్తున్నాడు. అది చూసి ‘‘ఆ అబ్బాయ్‌ ఎందుకూ అలా పరిగెడుతున్నాడు?’’ కంగారుగా అడిగాడు భూషణం.

‘‘ఆ కుర్రాడు సూసైడ్‌ చేసుకోవడానికి టాప్‌ ఫ్లోర్‌కి వెళుతున్నాడు’’ చాలా ఈజీగా, చాలా కూల్‌గా చెప్పాడా ప్రిన్సిపాల్‌.

‘‘ఓయ్‌, ఏమంటున్నారు మీరు...మరి పట్టుకోండి ఆ కుర్రాడిని’’ ఇద్దరూ ఒకేసారి అంటూ ఆ కుర్రాడు పరిగెట్టే వైపు పరిగెత్తబోయారు.

‘‘హలొ.. హలొ.. కూల్‌ కూల్‌... మాకు ఇలాంటివన్నీ మామూలే. అందుకే మా ఏర్పాట్లలో మేం ఉంటాం. ఒక్క ఫైవ్‌ మినిట్స్‌ వెయిట్‌ చేయండి, వాడే గ్రౌండ్‌ ఫ్లోర్‌లోంచి వస్తాడు’’ అని చెప్పాడు చాలా ప్రశాంతంగా ప్రిన్సిపాల్‌.

అతను చెప్పినట్లుగానే మరో అయిదు నిమిషాల్లో నీరసంగా కింద నుండి మెట్లెక్కి వస్తూ కనిపించాడా కుర్రాడు.

‘‘అదెలాగా, ఆ అబ్బాయికేం కాలేదా?’’ అడిగాడు భూషణం నమ్మశక్యంకాక.

దానికి చిద్విలాసంగా నవ్వుతూ ‘‘మేం వూరికే మీ దగ్గర నుండీ లక్షలు లక్షలు వసూలు చేస్తామటండీ, ఒకసారి ఇలా వచ్చి చూడండి’’ అని బాల్కనీలోంచి కిందకి చూపించాడు. చూసి అవాక్కయిపోయారిద్దరూ. కాలేజ్‌ చుట్టూ బలమైన నెట్స్‌ కట్టేసి ఉన్నాయి అన్ని వైపులానూ.

‘‘చూశారా మాది ఎంత ముందుచూపో, పిల్లలకి ఏం అవ్వకపోగా లైఫ్‌లో గుర్తుండిపోయేలా ఒక మంచి థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కూడా మిగిలిపోతుంది. యామ్‌ ఐ రైట్‌ హ..హ..’’ అంటూ ఆనందంగా నవ్వేస్తూ, వీళ్ళు ఆ షాక్‌లో ఉండగానే కాలేజ్‌ మెస్‌నీ, బాత్‌రూమ్స్‌నీ, ఇంకా వాళ్ళ స్టడీ రూమ్స్‌నీ అన్నింటినీ చూపించాడా ప్రిన్సిపాల్‌.

అన్నిటినీ చూసిన తరవాత ‘‘మొత్తానికి కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోయే అవకాశం లేదన్నమాట ఇందులో జాయిన్‌ చేస్తే’’ రవ్వంత మనసు చివుక్కుమనడంతో భూషణం అన్నాడు ప్రిన్సిపాల్‌తో.

దానికతను ‘‘భలేవారే, మీరు ఏ విధంగానైనా మా పిల్లల్ని ఇంజినీరింగ్‌లోనో మెడిసిన్లోనో సీటు వచ్చే విధంగా చెయ్యండి అని మా దగ్గర జాయిన్‌ చేస్తున్నపుడు, ఇంత ఫీజులు తీసుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టు వంద శాతం న్యాయం చేయాలి కదా మేము. అయినా ఎంత కష్టపడ్డా ఈ రెండేళ్ళే కదా’’ అన్నాడు.

‘‘సరే నిజమే, ఈ రెండేళ్ళే కష్టపడతారు... ఒప్పుకుంటాను. ఇంత శ్రమపడ్డా వీళ్ళకి సీటు రాకపోతే..?’’ సందేహం వెలిబుచ్చాడు విశ్వనాథం.

‘‘చాలా తెలివైన ప్రశ్న’’ మెచ్చుకోలుగా విశ్వనాథం వైపు చూసి అనీ, ‘‘ఈ రెండేళ్ళూ వీళ్ళని నిద్రకీ తిండికీ దూరంచేసి పుస్తకాలు మొత్తం బట్టీపట్టించేది ఒక ఎత్తు అయితే, ఆ తరవాత ఎగ్జామ్స్‌లో ర్యాంక్స్‌ వచ్చేలా చూడటం ఒక ఎత్తు. నిజానికి ఆ ర్యాంక్స్‌ మీకన్నా మాకే ముఖ్యం. అవన్నీ మీకెందుకు... మీరు ఫీజు కట్టి జాయిన్‌ చేసేసి, మీవాడి గురించి మర్చిపోండి. మళ్ళీ ఇంజినీరింగ్‌లో సీటు వచ్చాకే వద్దురు’’ అన్నాడు ధీమాగా ప్రిన్సిపాల్‌.

దానికి విశ్వనాథం ‘‘సరే, మీరు ఎలాగోలాగ సీటిప్పిస్తారు. కానీ, ఏమాత్రం ఆలోచనా అవగాహనా లేకుండా బట్టీపట్టి సీటు తెచ్చుకున్న వీళ్ళు ఆ పైచదువులు చదవలేకపోతే...’’ అనుమానంగా అన్నాడు.

‘‘ఇది మరీ బావుందండీ, మేం ఫీజు తీసుకునేది ఈ రెండేళ్ళకే. పైగా మా కాలేజీ క్యాంపస్‌ దాటిన తరవాత వాళ్ళేమైపోతే మాకేమిటి? వాళ్ళ స్థాయేమిటీ వాళ్ళ భవిష్యత్తు ఏమిటీ అనేది బాధ్యతా తెలివీ కల పేరెంట్స్‌గా మీరు ఆలోచించుకోవాలి... కదా’’ నర్మగర్భంగా నవ్వుతూ అన్నాడా ప్రిన్సిపాల్‌.

* * *

‘‘ఏరా, మీవాడిని ఈరోజు జాయిన్‌ చేసేద్దామా?’’ మర్నాడు ఉదయాన్నే కాఫీ తాగుతూ పేపర్‌ చదువుతూ అడిగాడు విశ్వనాథం భూషణాన్ని.

‘‘ఉహూ... లేదురా, నేను నిజమైన బాధ్యతా, తెలివీ కల తండ్రిగా ఉండదలిచాను. మావాడికి మంచీ చెడూ, కష్టం సుఖం అన్నీ తెలియజెప్పి శక్తిమేరకు వాడేం చదువుకోదలిచాడో వాడి అభిప్రాయాన్ని తెలుసుకుని, ఆపై ఎక్కడ జాయిన్‌ చేయాలో ఆలోచిస్తాను’’ అన్నాడు స్థిరంగా భూషణం.

‘‘అయితే ఇంకేం, శుభస్య శీఘ్రం. బాధ్యత కల తండ్రి చేతిలో మరో మరమనిషి కాకుండా ఎంచక్కని భావిభారత పౌరుడు తయారవ్వబోతున్నాడన్నమాట’’ అని విశ్వనాథం అనడంతో హాయిగా నవ్వేస్తూ వూరికి తిరిగి వెళ్ళడానికి బ్యాగ్‌ సర్దుకోవడానికి సిద్ధమయ్యాడు భూషణం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.