close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వానాకాలం కబుర్లు..!

వానాకాలం కబుర్లు..! 

వర్షాన్ని మొదటిసారి చూసినపుడు పిల్లలు ఆశ్చర్యంగా ‘ఆకాశంలో నుంచి నీళ్లెలా పడుతున్నాయమ్మా’... అని అడిగితే... ‘పైనున్న దేవుడు స్నానం చేస్తున్నాడమ్మా...’ అని సరదాగా వారికి అర్థమయ్యే భాషలో చెప్పేవాళ్లు ఇదివరకటి అమ్మలు. కానీ విచిత్రం ఏంటంటే... వాన గురించి మనక్కూడా తెలియని ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి.  

సంవత్సరమంతా వర్షం పడటం చూడాలంటే హవాయిలోని కవాయి ద్వీపానికి వెళ్లాల్సిందే. అక్కడి ‘వయలెఎలె’ పర్వతం మీద దాదాపు 350 రోజులూ వాన కురుస్తుందట.

* భూమధ్య రేఖకు దగ్గర్లో ఉన్న ప్రాంతాల్లో రోజూ సాయంత్రం నాలుగ్గంటలకు కొద్దిపాటి వర్షం కురుస్తుందట. దీన్ని ‘ఫోర్‌ ఓ క్లాక్‌ రెయిన్‌’ అంటారు. దీనిక్కారణం ఆయా ప్రాంతాల్లో మధ్యాహ్నం అయ్యేసరికి సూర్యుడి కిరణాలు నిట్టనిలువుగా పడటంతో వేడి తీవ్రత బాగా పెరిగి నీరు ఎక్కువ స్థాయిలో ఆవిరవుతుంది. సూర్యుడి తీక్షణత తగ్గేసరికి ఆ ఆవిరంతా ద్రవీభవించి వర్షంలా పడుతుంది.
* క్యూబాలో వర్షం ఎప్పుడూ మధ్యాహ్నానికీ సాయంత్రానికీ మధ్యలో పడుతుందట. థాయ్‌లాండ్‌లో ఎవరిపనికీ ఇబ్బంది కలిగించకుండా రాత్రిపూట మాత్రమే కురుస్తుంది.
* ప్రపంచంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యేది అంటార్కిటికాలో. అక్కడ ఏడాది మొత్తమ్మీదా కురిసే వర్షం కేవలం 166 మిల్లీమీటర్లే.
* సిహాయోలోని వేన్స్‌బర్గ్‌లో ఏటా జులై 29న కచ్చితంగా వర్షం పడుతుంది. వందేళ్ల కిందట ఓ వ్యక్తి ఈ విషయాన్ని గమనించి స్థానికులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. అప్పట్నుంచీ ఆ లెక్క తప్పలేదు. అందుకే, ఆ రోజుని స్థానికులు పండుగలా చేసుకుంటారు.
* వాన చుక్కా మామూలు నీటి బిందువులానే ఉంటుందనుకుంటాం. కానీ చినుకు చాక్లెట్‌ చిప్‌ ఆకారంలో ఉంటుందట. బాగా చిన్న చినుకులైతే గుండ్రంగా ఉంటాయి.
* కుండపోతగా వర్షం కురుస్తున్నపుడు ఆ చినుకులు మనల్ని కొడుతున్నట్లు అనిపిస్తాయి కదా... నిజానికి చినుకులు సగటున గంటకు 22 మైళ్ల వేగంతో దూసుకొస్తాయట. భూమ్మీద ఉన్న వాతావరణం కారణంగా కిందికొచ్చేసరికి ఆ వేగం చాలా తగ్గుతుంది. లేదంటే వర్షంలో తడిచిన ప్రతిసారీ మనకు వాతలే మిగిలేవేమో.
* ఎడారుల్లో వర్షం పడుతున్నా తడవమట. అక్కడున్న వేడి గాలుల వల్ల పడే చినుకులు నేలమీదకు చేరకుండానే ఆవిరైపోతుంటాయి మరి. ఈ తరహా వానను దెయ్యం వాన (ఫాంటమ్‌ రెయిన్‌)అంటారు. అందుకే, అలాంటి చోట్ల వర్షం పడుతున్నా కొన్నిసార్లు చూసేవారికి తెలియదు.
* మామూలుగా మనం మొక్కల మీద నీళ్లు పోసినప్పటికన్నా వర్షం పడినపుడు ఆకులు ఎక్కువ పచ్చగా కనిపిస్తాయి. వాన నీటిలో ఉండే నైట్రోజన్‌ మొక్కకూ ఆకులకూ సహజ ఎరువులా పనిచేసి దాన్ని ఆరోగ్యంగా చెయ్యడమే అందుక్కారణం.
* వర్షం పడినపుడు మట్టిలో నుంచి ఒకరకమైన మంచి వాసన వస్తుంటుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మొక్కలు భూమిలోకి విడుదల చేసే నూనెలు వర్షం పడినపుడు నేలలోని బ్యాక్టీరియా విడుదలచేసే జియోస్మిన్‌ అనే పదార్థంతో కలవడం వల్ల ఆ మట్టి వాసన వస్తుందట.
* మనకు కాసుల వర్షం అన్న పేరు ఎలా వచ్చిందో కానీ బోట్స్‌వానాలో ఏకంగా కరెన్సీనే వర్షం పేరుతో పిలిచేస్తున్నారు. ‘పులా’ అంటే స్థానిక భాషలో వర్షం అని అర్థం. ఆ పేరునే వారి కరెన్సీకి పెట్టారు... మనం ‘రూపాయి’ అంటాం కదా, అలా అన్నమాట.
* ఆఫీసుకు బయలుదేరగానే వాన కురిస్తే మనమైతే ఏ గొడుగో, రెయిన్‌కోటో వేసుకుని ఎలాగోలా వెళ్తాం. కానీ పోర్చుగీస్‌లో వర్షం వస్తే ఎవరైనా ఆఫీసుకు వెళ్లడం మానేయొచ్చట. మిగిలిన ఐరోపా దేశాలతో పోలిస్తే అక్కడ ఎండలు ఎక్కువగానే ఉంటాయి. కానీ వర్షం మొదలైతే మాత్రం అప్పటికపుడు భారీగా కురుస్తుంది. ఆ చినుకులు కూడా చాలా చల్లగా ఉంటాయట. అందుకే, ప్రభుత్వం వాన పడితే సెలవు తీసుకోవచ్చని అధికారికంగా ప్రకటించింది.
* ఎంత పెద్ద ఉరుములు వచ్చినా ఉగాండా ప్రజలు భయపడరట. అక్కడ ఉరుములు సాధారణమైన విషయం మరి. ఏడాదికి కొన్ని వందల సార్లు ఆకాశం గర్జిస్తుంది.
* పదికోట్ల మందిలో ఒకరికి ‘వాన అలర్జీ’ ఉండే అవకాశం ఉంది. చినుకు ఒంటి మీద పడగానే వారి చర్మం ఎర్రగా కందిపోయి ఉబ్బిపోతుందట. ఇది ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైన వ్యాధి.
* ఎండా వానలు ఒకేసారి వచ్చినపుడు పూర్వం కుక్కానక్కా పెళ్లి చేసుకుంటున్నాయి అనేవారు. ఎలా ప్రాచుర్యం పొందిందో తెలియదు కానీ ఆఫ్రికా, జపాన్‌, బంగ్లాదేశ్‌లాంటి దేశాల్లోనూ ఇదే చెబుతారు. మరికొన్ని దేశాల్లో దెయ్యాలు పెళ్లి చేసుకుంటున్నాయనీ, కోతులూ, ఎలుగుబంట్ల పెళ్లనీ, దుప్పులూ, హైనాలూ పిల్లల్ని కంటున్నాయనీ... ఇలా చాలా కథలే వాడుకలో ఉన్నాయి.

వానలో తడిస్తే బట్టలు ఎర్రగా అయిపోవడం ఎప్పుడైనా చూశారా... కానీ కేరళ వాసులకి అలాంటి అనుభవమూ ఎదురైంది. అక్కడి కొట్టాయం ప్రాంతంలో ఎర్రటి వర్షం కురుస్తుంటుందట మరి. దీనికి గాలిలో ఉన్న ఒకరకమైన ఆల్గేనే కారణమట. ఇలాగే ప్రపంచవ్యాప్తంగా కొన్నిచోట్ల పసుపు, ఆకుపచ్చ, నలుపు వర్షాలు కూడా పడినట్లు చెబుతారు.

ప్రపంచంలో బాగా భారీ వర్షాలు కురిసే ప్రాంతం ఎక్కడ ఉందో తెలుసా... మనదేశంలోనే. మేఘాలయలోని మాసిన్రామ్‌ గ్రామంలో ఏడాదికి 11,873 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందట. దగ్గర్లోని హిమాలయ శిఖరాలు వర్షపు మేఘాలను అడ్డుకోవడం వల్లే ఇక్కడ వర్షాలు బాగా కురుస్తున్నాయట. అందుకే, ఈ ప్రాంతం నదులూ జలపాతాలకు నిలయంలా ఉంటుంది. ఇక్కడకు దగ్గర్లోనే ఉన్న చిరపుంజి పేరుమీద కూడా గొప్ప రికార్డు ఉంది. ఇప్పటివరకూ భూమ్మీద ఒక్క ఏడాదిలో అతి ఎక్కువ వర్షపాతం నమోదైంది అక్కడే. 1860 ఆగస్టు- 1861 జులై మధ్యకాలంలో చిరపుంజిలో 26,461 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

 

ముప్ఫై ఏళ్లకిందట బంగ్లాదేశ్‌లోని గోపాల్‌గంజ్‌లో కిలో బరువు ఉన్న వడగండ్లతో వర్షం పడింది. ఆ దెబ్బలకు 92మంది చనిపోయారు. అతి బరువైన వడగండ్లుగా ఇవి గిన్నిస్‌ రికార్డులకూ ఎక్కాయి.

ర్షం అంటే... ఆకాశంలో నుంచి నీరే పడుతుందనుకుంటే పొరబడినట్లే. కొన్నిచోట్ల చేపల వర్షం కూడా కురుస్తుంది. హొండురస్‌లోని యొరొ నగరంలో శతాబ్ద కాలంగా ఏటా మే, జూన్‌లలో ఈ తరహా వర్షం పడుతోంది. వర్షం ఆగిపోయాక అక్కడ దొరికే చేపల్ని తీసుకెళ్లి స్థానికులు వండుకుని తింటారట. దీనికి గుర్తుగా వాళ్లు ఏటా ‘రెయిన్‌ ఆఫ్‌ ఫిష్‌ ఫెస్టివల్‌’ అని ఓ వేడుకను కూడా జరుపుకుంటున్నారు. ఆమధ్య మన దగ్గర కూడా గుంటూరులో చేపల వర్షం పడిందని కథనాలు వచ్చాయి. మిస్సోరీ, గ్రీస్‌, బ్రిటన్లలో వర్షంతో పాటు ఆకాశంలో నుంచి కప్పలు పడినట్లూ ఆధారాలున్నాయి.

ప్పుడప్పుడూ వర్షం తరవాత ఆకాశంలో ఇంద్రధనుస్సు కొంత సేపు కనిపిస్తుంది. అది సహజమే. కానీ 1994లో బ్రిటన్‌లోని షెఫీల్డ్‌లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం మూడు గంటలవరకూ హరివిల్లు కనిపించింది. అదే సుదీర్ఘకాలం కనిపించిన ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సులు ఒకేసారి రెండూ మూడు కూడా ఏర్పడతాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.