close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దివ్యాంగులకు పెళ్లి పెద్దలు ఈ ‘ఆప్‌’లు

దివ్యాంగులకు పెళ్లి పెద్దలు ఈ ‘ఆప్‌’లు 

పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి ఈరోజుల్లో అంతర్జాలమే ఆధారమవుతోంది. సమయం, దూరాభారాలను దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్‌లో చూసి ప్రధాన విషయాలు నచ్చాకే ప్రత్యక్షంగా మాటల్లోకి దిగుతున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నవారే ఇంతగా అంతర్జాలం మీద ఆధారపడుతున్నప్పుడు ప్రత్యేక అవసరాలున్నవారి పరిస్థితి ఏమిటి? ఈ ఆలోచనే కొన్ని ప్రత్యేక ఆప్‌ల సృజనకు దారితీసింది. ప్రత్యేక అవసరాలున్నవారూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారూ ఈ ఆప్‌ల సహాయంతో తగిన భాగస్వాములను ఎంచుకోవచ్చు.

 బెంగళూరుకు చెందిన విజయ్‌కి ఐదేళ్ల క్రితం నోటి క్యాన్సర్‌ వచ్చింది. అప్పుడతని వయసు 30 కూడా దాటలేదు. వెంటనే చికిత్స తీసుకున్నాడు. వ్యాధి పూర్తిగా నయమైంది. తిరిగి సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు. అయితే శస్త్రచికిత్స చేసిన మచ్చలు ముఖం మీద మిగిలాయి. పెళ్లి సంబంధాలు మాట్లాడేటప్పుడు సర్జరీ విషయం చెప్తున్నాడు. కానీ అతనికి చాలాకాలం సంబంధం కుదరలేదు. విజయ్‌ లాంటి వాళ్లు మన సమాజంలో చాలామందే ఉంటారు. వివిధ అనారోగ్యాల కారణంగా జీవిత భాగస్వామి లభించక ఒంటరిగా గడుపుతున్న అలాంటి వారికోసం ఏర్పడిందే ‘డివైన్‌ రిలేషన్స్‌.ఇన్‌’ వెబ్‌సైట్‌.

 కొడుకు పోయిన బాధలో...

వివేక్‌ శర్మ వైద్య పరికరాల మార్కెటింగ్‌ చేస్తుంటారు. పలువురు వైద్యులతో ఆయనకు పరిచయం ఉంది. అలా వారితో మాట్లాడేటప్పుడు విజయ్‌ సమస్య చర్చకు వచ్చింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే పలువురు ఒంటరిగా ఉండిపోతున్నారనీ, సరైన తోడు లభిస్తే వారు సంతోషంగా జీవితం గడపగలరనీ వైద్యులు చెప్పడం వివేక్‌ని ఆలోచింపజేసింది. వివేక్‌ కుమారుడు అమోఘ్‌ అంతు తెలియని అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందాడు. అది తట్టుకోలేక అతని భార్య తీవ్ర కుంగుబాటుకు లోనైంది. ఆ పరిస్థితుల నుంచి తేరుకోవడానికి ఏంచేయాలా అన్న ఆలోచనలో ఉన్న వివేక్‌కి డాక్టర్లు చెప్పిన విషయానికి సంబంధించే ఏదైనా చేయాలనిపించింది. వివేక్‌ స్నేహితుడొకరు కుమారుని పేరు మీద మిక్కీ చారిటబుల్‌ ట్రస్టు నిర్వహిస్తున్నారు. వివేక్‌ అతనితో తన ఆలోచనలు పంచుకున్నారు. ఆ ట్రస్టుని ఇద్దరి కుమారుల పేర్లూ కలిసేలా మిక్కీ అమోఘ్‌ ఫౌండేషన్‌గా మార్చారు. దాని ఆధ్వర్యంలో ‘డివైన్‌రిలేషన్స్‌.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌నీ, ఆప్‌నీ గత ఏడాది నవంబరులో ప్రారంభించారు. ఎవరైనా ఇందులో సులువుగా రిజిస్టర్‌ చేసుకుని తమ ప్రొఫైల్‌ అప్‌లోడ్‌ చేయవచ్చు. తమకు నచ్చిన ప్రొఫైల్స్‌ ఎంచుకుని అవతలివారితో మాట్లాడుకోవచ్చు.

 దివ్యాంగుల కోసం ఇంక్లోవ్‌
వివిధ రకాల వైకల్యాలతో బాధపడుతున్నవారు మన దేశంలో 8 కోట్ల మంది ఉన్నారు. వారిలో ఐదు శాతం మాత్రమే వివాహితులు. మిగిలినవారంతా ఒంటరిగా జీవితాలను నిస్సారంగా గడిపేస్తున్నారు. ఈ పరిస్థితి కల్యాణి ఖోనాను ఆలోచింపజేసింది. నేటి సమాజంలో దివ్యాంగుల కోసం పెళ్లి సంబంధాలు వెదకడం అంత తేలిక కాదనీ అందుకే చాలామంది తోడు లేకుండా ఒంటరిగా మిగిలిపోతున్నారనీ ఆమెకు అర్థమైంది. శంకర్‌ శ్రీనివాసన్‌తో కలిసి ఈ దిశగా కృషి ప్రారంభించిన కల్యాణి ‘ఇంక్లోవ్‌’ పేరుతో ఆప్‌ను తయారుచేశారు. దివ్యాంగులకు వివాహ సంబంధాలు కుదిర్చే మొట్టమొదటి విజయవంతమైన ఆప్‌గా ఇది కొద్ది కాలంలోనే ఆదరణ పొందింది. దివ్యాంగులు తమలాంటి పలువురిని కలుసుకుని తగిన భాగస్వామిని ఎంచుకునే వేదికగా రూపొందింది. ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన ఈ ఆప్‌లో ఇప్పుడు ఏడు వేల మందికి పైగా యాక్టివ్‌ వినియోగదారులున్నారు.

అందరికీ అందుబాటులో...

ప్రస్తుతం గూగుల్‌ ప్లేస్టోర్‌ ద్వారా ఈ రెండు ఆప్‌లూ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. వయసు, ప్రాంతం, జీవనశైలి, వైకల్యం లేదా అనారోగ్యం వివరాలు... తదితరాల ఆధారంగా ఈ ఆప్‌లు తగిన సంబంధాలను సూచిస్తాయి. ఈ మెయిల్‌, ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకునే అవసరం లేకుండా వీటిలోని చాట్‌ ఫీచర్‌ సహాయంతో ప్రాథమిక సంభాషణ జరపవచ్చు. స్క్రీన్‌ రీడర్‌ సహాయంతో దృష్టి సంబంధ సమస్యలున్నవారు కూడా వీటిని వినియోగించుకోవచ్చు. వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతారు. కావలసిన ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, పేరు నమోదు చేసుకున్నాక ప్రొఫైల్‌ తయారుచేసుకోవాలి. అప్పుడు ఇతరుల ప్రొఫైల్స్‌ చూసే అవకాశం లభిస్తుంది. ఎవరిదైనా ప్రొఫైల్‌ నచ్చితే ఆ విషయం అవతలివారికి తెలియజేయాలి. వారూ అంగీకరించినప్పుడే చాట్‌ చేయడానికి అవకాశం లభిస్తుంది. సభ్యులు ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశాన్నీ ఇంక్లోవ్‌ ఆప్‌ కల్పిస్తోంది. సోషల్‌ స్పేసెస్‌ పేరుతో వీరు తరచూ వేర్వేరు నగరాల్లో సమావేశాలు ఏర్పాటుచేస్తారు. ఈ సమావేశాలు ఎక్కడ, ఎప్పుడు జరిగేదీ ఆప్‌ ద్వారా సభ్యులకు ముందుగానే తెలియజేస్తారు. ఈ సమావేశాలకూ మంచి స్పందన వస్తోంది. చేతిలో ఉండే ఫోను ద్వారానే జీవిత భాగస్వామిని వెతుక్కునే అవకాశం లభించడం ప్రత్యేక అవసరాలున్న వారికి వరమే కదా!


 

ఉద్యోగానికి ఇక సిద్ధం! 

విద్యార్హతలున్నా నైపుణ్యం లేక చాలామంది యువతీయువకులు ఉపాధి పొందలేకపోతున్నారు. నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దొరక్క చాలా కంపెనీలు ఉద్యోగుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ఓ అద్భుత కార్యక్రమాన్ని చేపడుతోంది ‘బైరెడ్‌’.

నైపుణ్యంలేక ఎంతో మంది ఉద్యోగాలకు దూరమవుతున్నారు. వ్యాపారాల్లో అడుగు పెట్టాలని ఉన్నా... మార్గనిర్దేశంలేక ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ విషయంలో గ్రామీణ ప్రాంతాల వారిది మరీ వెనుకబాటు. దీనికి పరిష్కారంగా మొదలైందే ‘బ్యాంకర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ అండ్‌ ఆంత్రొప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌(బైరెడ్‌)’. 2007లో మొదలైన బైరెడ్‌ వెనుక ఆంధ్రా బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, అప్పటి స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌లు ఉన్నాయి. ఈ బ్యాంకులు ‘కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ’లో భాగంగా ‘బైరెడ్‌’ను మొదలుపెట్టాయి. దీనికోసం ఇవి నాబార్డ్‌(నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌)తో జట్టుకట్టాయి. బైరెడ్‌ ప్రతిపాదన వచ్చినపుడు అప్పటి రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని అపార్డ్‌ (ప్రస్తుత టీసీపార్డ్‌)కు చెందిన సుమారు 12 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.

 45 రోజుల శిక్షణ
బైరెడ్‌ ప్రధానంగా ఉద్యోగం, స్వయం ఉపాధి విభాగాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తుంది. 45 రోజులపాటు సాగే ఈ శిక్షణ ఏడాదిలో యువకులకు అయిదు విడతల్లో, యువతులకు రెండు విడతల్లో ఉంటుంది. ఎం.ఎస్‌.ఆఫీస్‌, మొబైల్‌ఫోన్‌ రిపేరింగ్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, ఎలక్ట్రీషియన్‌ విభాగాల్లో అబ్బాయిలకూ; బ్యూటీషియన్‌ కోర్సు, అడ్డాన్స్డ్‌ టైలరింగ్‌, జర్దోసి, మగ్గం, ఎం.ఎస్‌.ఆఫీస్‌... తదితర విభాగాల్లో అమ్మాయిలకూ నిపుణులైన అధ్యాపకుల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు అవసరమయ్యే సామగ్రిని ఉచితంగానే అందిస్తారు. కంప్యూటర్స్‌కు సంబంధించిన కోర్సుల్లో శిక్షణ తీసుకునేవారికి శిక్షణ సమయంలో ఉపయోగించేందుకు వీలుగా ఓ ల్యాప్‌టాప్‌ ఇస్తారు. 45రోజుల శిక్షణ ముగిశాక వివిధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడానికి బైరెడ్‌ సంస్థ ప్రతినిధులు తమవంతుగా అభ్యర్థులకు సహకారం అందిస్తారు కూడా. ఇక్కడ శిక్షణ తీసుకున్నవారెవరైనా సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తే బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలోనూ సాయపడతారు. శిక్షణ తర్వాత కూడా దాదాపు రెండేళ్లపాటు మార్గనిర్దేశం చేస్తూ ఏదో ఒక రంగంలో కుదురుకునేంతవరకూ వారిని పర్యవేక్షిస్తారు.

 తక్కువకే ప్రాధాన్యం
బైరెడ్‌లో శిక్షణ పొందాలనుకునేవారు bired.org వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తుల్లో అతి తక్కువ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే ఎక్కువ నైపుణ్యం ఉన్నవాళ్లు ఏదో ఒక ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో భోజన, వసతి సదుపాయాలు ఉంటాయి. ఈ సేవలూ, సదుపాయాలన్నీ పూర్తిగా ఉచితం. శిక్షణ కాలమంతా సంస్థ ఆవరణలోని వసతి గృహాల్లోనే ఉండాలనేది నిబంధన. ఈ సమయంలో వ్యక్తిత్వ వికాస తరగతులూ నిర్వహిస్తారు. రోజూ యోగా శిక్షణ ఉంటుంది. అభ్యర్థుల్ని ఉత్సాహంగా ఉంచడానికి క్రీడా పోటీల్నీ నిర్వహిస్తారు. ‘జీవితంలో స్థిరపడాలనే బలమైన లక్ష్యంతో యువతీయువకులు ఇక్కడికి వస్తారు. వారు తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో మా వంతుగా సాయం అందించడమే మా కర్తవ్యం’ అని చెబుతారు సంస్థ సంచాలకులు యేసేపు. శిక్షణ సమయంలో అభ్యర్థుల ఆరోగ్య సంరక్షణనీ బైరెడ్‌ చూసుకుంటుంది. సత్య సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ‘గతేడాది ఓ యువతికి వైద్య పరీక్షలు చేసినపుడు తీవ్ర ఆరోగ్య సమస్యని గుర్తించారు. వైద్యం కోసం అవసరమైన ఎనిమిది లక్షల రూపాయల్ని సత్యసాయిబాబా సేవా సమితి విరాళాల రూపంలో సేకరించి అందించింది’ అని అంటారు బైరెడ్‌ ఉప సంచాలకులు కె.ఎన్‌.ప్రసాద్‌. శిక్షణ అనంతరం అభ్యర్థులు ఇళ్లకు వెళ్లే సమయంలో దూరాన్నిబట్టి ఛార్జీలనూ సంస్థ సభ్యులే అందిస్తారు.

హైదరాబాద్‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ సంస్థల భాగస్వామ్యంతోనూ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది బైరెడ్‌. ఇటీవల తిరుపతిలో ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మహిళలకు ఆటో నడపడంలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి బ్యాంకుల ద్వారా రుణాలు అందజేసి ఆటోలను ఇప్పించారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌, విశాఖపట్నం జిల్లా గొట్టిపల్లి, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులలో ఈ శిక్షణ కార్యక్రమాలు సాగుతున్నాయి. ‘ఇప్పటివరకూ శిక్షణకు ఏటా 1100 మందిని ఎంపిక చేస్తున్నాం. డిమాండ్‌ పెరుగుతుండటంతో ఇకపైన ఆ సంఖ్యను మరో 500 పెంచనున్నా’మంటారు కె.ఎన్‌.ప్రసాద్‌. సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందినవారిలో 70 శాతం ఉద్యోగులుగా, కొందరు స్వయం ఉపాధి పొందుతూ, మిగిలినవారు వ్యాపారులుగా స్థిరపడ్డారు.

మీకూ చేరాలని ఉందా, ఎవరినైనా చేర్చాలని ఉందా... అయితే, సంస్థ వెబ్‌సైట్‌కు వెళ్లండి మరి!

- వనం సుదర్శన్‌, హైదరాబాద్‌ సిటీ డెస్క్‌
- సూర్యకిరణ్‌, న్యూస్‌టుడే రాజేంద్రనగర్‌

 

ఆఫీసులో వ్యవసాయం 

ఏవండీ... ఆఫీసులో మీరు పండించిన పాలకూర, కొత్తిమీర బాగా పెరిగాయన్నారుగా... సాయంత్రం వచ్చేటపుడు మర్చిపోకుండా కోసుకురండి. రేపు పప్పూ, పచ్చడీ చేస్తా... మామూలుగా అయితే ఉద్యోగానికి వెళ్లేవారికి ఎవరూ ఇలా చెప్పరు. కానీ బెంగళూరు, మాన్యత బిజినెస్‌ పార్కు సంస్థ భవనాల్లో ఉన్న వివిధ కంపెనీల ఉద్యోగులు రోజూ ఇలాంటి మాటలు వింటూనే ఉంటారు. ఎందుకంటే... వాళ్లు కార్యాలయం ఎదురుగా ఉన్న మడుల్లో ఇంటికి కావల్సిన కూరగాయలు పండించుకుంటున్నారు కాబట్టి.

 

కార్పొరేట్‌ సంస్థల్లో కొలువులు. ఏసీ గదుల్లో పనులు. వేలూ లక్షల్లో జీతాలు. అయినా మట్టివాసనను పీల్చినపుడూ పచ్చని మొక్కల మధ్య గడిపినపుడూ దొరికే మానసికానందం కోసం వెతుకులాట ఆగదు. ఆ అనుభవాన్ని పొందాలంటే మొక్కల్ని పెంచుకోవాలి. కానీ నగరాల్లో కాస్త పెద్ద బాల్కనీ ఉన్న ఇల్లు దొరకడమే మహద్భాగ్యం. అందులోకి సూర్యుడి కిరణాలు చొరబడగలగడం ఇంకా గొప్ప విషయం. మరో పక్కేమో ప్రతి కూరగాయనూ కొనుక్కోవాల్సిందే. క్రిమిసంహారక మందుల వాడకం పెరిగిపోవడంతో అంత డబ్బు పోసినా ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నామనే నమ్మకం ఉండదు. బెంగళూరులోని ‘మాన్యత ఎంబసీ బిజినెస్‌ పార్కు’లో హర్టీకల్చర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న కిరణ్‌కీ ఇది అనుభవమే. ఆ పార్కులో 110 ఎకరాల స్థలంలో వివిధ కంపెనీల కార్యాలయాలను నిర్వహించేందుకు ఇరవైకి పైగా బహుళ అంతస్తుల భవనాలున్నాయి. వాటి మధ్యలో అక్కడక్కడా కలిపి దాదాపు పదిహేను ఎకరాల స్థలం వృథాగా ఉండిపోయింది. ఆ స్థలాన్ని చిన్న చిన్న మడులుగా చేసి ఉద్యోగులు సాగు చేసుకునేందుకు ఉచితంగా ఇద్దామనే ప్రతిపాదన తెచ్చాడు కిరణ్‌. అది అందరికీ నచ్చడంతో గతేడాది ‘అర్బన్‌ గ్రీన్‌’ పేరుతో ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. మాన్యత ప్రాంగణంలోని వేరు వేరు భవనాల్లో ఉన్న నోకియా, ఐబీఎమ్‌, కాగ్నిజెంట్‌... లాంటి కంపెనీల్లో వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిని మడులకోసం దరఖాస్తు చేసుకోమని కోరగా చాలామంది ముందుకొచ్చారు. దాంతో మూడు భవనాల ఎదురుగా ఉన్న స్థలాన్ని 170 మడులుగా చేసి, దరఖాస్తు చేసుకున్నవారిలో కొందరికి మూడు నెలలపాటు నచ్చిన కూరగాయలూ ఆకు కూరల్ని పెంచుకునే అవకాశం కల్పించారు అర్బన్‌ గ్రీన్‌ నిర్వాహకులు. కావల్సిన కూరగాయల విత్తనాలను కూడా వాళ్లే ఉచితంగా పంచారు. ఉద్యోగులు ఆఫీసు విరామ సమయంలో వచ్చి విత్తనాలు చల్లుకోవడం, మొక్కలకు నీళ్లు పొయ్యడం లాంటివి చేసుకోవచ్చు. వారికి సాయం చేసేందుకూ వాళ్లు సెలవుల్లో ఉన్నపుడు మొక్కల్ని చూసుకునేందుకూ పనివాళ్లుంటారు. తమకిచ్చిన స్థలంలో కొందరు ఉద్యోగులు పాలకూర, తోటకూర, కొత్తిమీర లాంటివి వేసుకుంటే మరికొందరు టొమాటో, పచ్చిమిర్చి, వంగ, బేబీకార్న్‌ లాంటివాటిని సాగు చెయ్యడం మొదలుపెట్టారు. సొంతంగా పెంచుకున్న మొక్కలూ వాటినుంచి సహజసిద్ధంగా పండే కూరగాయల్నీ చూశాక ఉద్యోగి రైతన్నల ఆనందం మరింత పెరిగింది.

ఎంత బాగుందో...
‘రైతు బిడ్డగా సొంత పొలం నుంచి తెచ్చుకుని వండుకునే కూరగాయల రుచీ ఆ అనుభవం ఎలా ఉంటాయో తెలుసు. ఉద్యోగంలో చేరాక ఆ అవకాశం లేదని ఎన్నోసార్లు బాధపడ్డా. కానీ ఇప్పుడు నాకిచ్చిన మడిలో స్వయంగా పాలకూర, టొమాటోలను పండించి మా ఇంటికి తీసుకెళ్లడంతో పాటు ఆఫీసులో సహచరులక్కూడా ఇస్తున్నా. వాళ్లు పండించినవి నాకూ ఇస్తున్నారు. ఇదంతా ఎంత బాగుందో’ అంటాడు నోకియా సంస్థలో పనిచేసే మల్లిఖార్జున్‌రెడ్డి. ‘ఒకేచోట పనిచేసే ఉద్యోగులకు పక్క పక్క మడుల్ని కేటాయించినపుడు ఒక్కొక్కరం ఒక్కో రకం కూరగాయల్ని పండించుకుంటూ అందరం పంచుకోవడం ఇంకా బాగుంది...’ అంటాడు మరో ఉద్యోగి. ఈ మడుల్ని చూసుకునే సిబ్బంది ఎప్పటికప్పుడు రాలిన ఆకుల్నీ పీకేసిన కలుపు మొక్కల్నీ ఏరి భూమిలో పాతి సేంద్రియ ఎరువుగా మారుస్తారు. దాన్నే ఉద్యోగులు ఆవుపేడతో కలిపి మొక్కలకు వేస్తారు.

ఒత్తిడి దూరం

‘ఉద్యోగులను ప్రకృతిలో మమేకం చేసి, ఒత్తిడిని దూరం చెయ్యడానికి జపాన్‌, బ్రిటన్‌లలో ఇప్పటికే ఆఫీసు సాగుని ప్రోత్సహిస్తున్నారు. మనమూ ఓసారి అలా ప్రయత్నిద్దాం అని అర్బన్‌ గ్రీన్‌ని ప్రోత్సహిస్తున్నాం’ అంటారు మాన్యత ఎంబసీలో సీనియర్‌ కార్పొరేట్‌ మేనేజర్‌గా పనిచేసే గౌరవ్‌ భండారి. నిజమే. ఒకప్పుడు అక్కడి ఉద్యోగులు విరామ సమయాల్లో ఫోన్లు పట్టుకుని అటూ ఇటూ తిరిగేవారు. కానీ ఇప్పుడు ఖాళీ దొరికితే రైతుల అవతారం ఎత్తేస్తున్నారు. దీనివల్ల ఒత్తిడి దూరమవడమే కాదు, ఇతర కంపెనీల్లో పనిచేసేవారితోనూ పరిచయాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఎంబసీలో ఉన్న మూడు భవనాల ముందున్న స్థలాన్నే మూడునెలలకోసారి రొటేషన్‌ పద్ధతిలో కొత్తవారికి కేటాయిస్తున్నారు. మిగిలిన ఇరవై భవనాల ఎదురుగా ఉన్న స్థలం కూడా ఉపయోగంలోకి వస్తే ఒకేసారి ఎక్కువమందికి సాగుచేసుకునే అవకాశం వస్తుందంటారు హార్టీకల్చర్‌ మేనేజర్‌ కిరణ్‌. ఒకప్పుడు మాన్యత బిజినెస్‌ పార్కులోకి అడుగు పెడితే ఎత్తైన భవనాలే కనిపించేవి. కానీ ఇప్పుడు దారికిరువైపులా పెరిగిన కూరగాయల మొక్కలు పొలంలోకి అడుగుపెట్టిన భావనను కలిగిస్తున్నాయి. ఎంత మంచి మార్పు..!


 

విద్యార్థులకు కలెక్టర్‌ ఆహ్వానం..!

పాఠశాలలో జరిగే వేడుకలకు కలెక్టర్‌ను ఆహ్వానించి వారి చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేయించడం చూస్తూనే ఉంటాం. కానీ మణిపూర్‌కు చెందిన కలెక్టర్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ పమె విద్యార్థులనే తన భవనానికి ఆహ్వానిస్తున్నాడు. ‘మణిపూర్‌ మిరకిల్‌ మేన్‌’గా పేరొందిన ఈయన ప్రజలకెంతో అభిమానపాత్రుడయ్యాడు. ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా నలభైలక్షల రూపాయల విరాళాలు సేకరించి, ప్రభుత్వ ప్రమేయం లేకుండా మణిపూర్‌ నుంచి నాగాలాండ్‌, అసోంలకు ‘పీపుల్స్‌ రోడ్డు’ను నిర్మించాడు. ప్రతి శుక్రవారం ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న పదిమంది విద్యార్థులను కలెక్టర్‌ ఆఫీసుకు ఆహ్వానించి జిల్లా యంత్రాంగం పనితీరును దగ్గరుండి చూసే అవకాశం కల్పిస్తున్నాడు. ఆ సాయంత్రం వారికి భోజనం కూడా ఏర్పాటుచేస్తున్నాడు. జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలనే విషయంలోనూ విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నాడు. ఇలా విద్యార్థులను ఆహ్వానించడం వెనుక ఆసక్తికరమైన కథా ఉంది. ఆర్మ్‌స్ట్రాంగ్‌ చిన్నతనంలో డిప్యూటీ కమిషనర్‌ ఆఫీసుకు వెళ్లి అక్కడ జరిగే కార్యక్రమాలను స్వయంగా చూడాలని ఆశపడేవాడట. కానీ అక్కడి అధికారులు అతడిని లోపలికి అనుమతించలేదట. అందుకే కొత్త విషయాలను తెలుసుకోడానికి ఆసక్తిచూపించే వారిని నిరుత్సాహపరచకూడదనే ఉద్దేశంతో ఇలా విద్యార్థులను ఆహ్వానిస్తున్నాడట.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న