close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మీ ఇంటికొస్తాం... నట్టింటికొస్తాం..!

మీ ఇంటికొస్తాం... నట్టింటికొస్తాం..!  

ఏడాదిలో ఎప్పుడో ఒకటీ రెండు సినిమాలు విడుదలైతేనే పెద్ద హీరోల అభిమానులకు పెద్ద పండుగ వచ్చినంత సంబరం. అలాంటిది వాళ్లు ప్రేక్షకులకు మరింత దగ్గరగా టీవీల్లో సరికొత్తగా కనిపిస్తుంటే ఆ సంబరాలు అంబరాన్ని దాటిపోవూ..! జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా చేస్తున్న బిగ్‌బాస్‌ షో ప్రతి ప్రోమో యూట్యూబ్‌లో విడుదలైన ఒకటీ రెండు రోజుల్లోనే లక్షల వ్యూస్‌ సాధించిందంటేనే ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నంబర్‌ వన్‌ యారీతో రానా కూడా మరోవైపు దుమ్ము దులిపేస్తున్నాడు. ఇలా పెద్ద హీరోలు బుల్లితెరమీదికి రావడం ఇప్పుడో ట్రెండ్‌ అయిపోయింది. ఆ కథేంటో చూద్దామా మరి..!

బిగ్‌ ‘బాస్‌’ ఎన్టీఆర్‌

హాలీవుడ్‌లో ‘బిగ్‌ బ్రదర్‌’గా ప్రాచుర్యం పొంది బాలీవుడ్‌కి వచ్చిన బిగ్‌బాస్‌ షో అక్కడ పదకొండేళ్లుగా వీక్షకులను టీవీలకు కట్టిపడేసేలా చేసింది. కొంతమంది సెలెబ్రిటీలను 70 రోజులపాటు ఓ ఇంట్లో ఉంచి వారి దినచర్యను వీక్షకులకు చూపించేలా లోపలంతా సీసీ కెమేరాలు పెడతారు. ఆ ఇంట్లోకి టీవీ, ఫోన్‌, ల్యాప్‌టాప్‌ లాంటి వేటినీ అనుమతించరు. అంటే వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధమూ ఉండదు. తెలుగులో త్వరలో వస్తున్న ఈ షోకి వ్యాఖ్యాతగా జూనియర్‌ ఎన్టీఆర్‌ తొలిసారి బుల్లితెరమీద కనిపించబోతున్నారు. సినిమాల్లోనే కాదు, మామూలుగా కూడా ఎన్టీఆర్‌ మాట్లాడేటపుడు సందర్భానికి తగ్గట్లూ పంచ్‌ డైలాగులూ జోకులతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక, యంగ్‌ టైగర్‌కి అభిమానుల్లో ఉన్న ఇమేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే, బిగ్‌బాస్‌ని విజయవంతం చేసే బాధ్యతను ఈ హీరోకి అప్పగించారు మా టీవీ నిర్వాహకులు. ఎన్టీఆర్‌ కూడా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేస్తున్న ఈ షోకి సంబంధించిన ప్రోమోలన్నీ లక్షల వ్యూస్‌ సాధించి ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి.

తమిళంలో బాస్‌ కమల్‌ హాసన్‌

యాభై ఏళ్ల నుంచి సినిమాల్లో నటిస్తున్న కమల్‌ హాసన్‌ని తొలిసారి టీవీ తెరమీదికి తీసుకొచ్చిన ఘనత కూడా బిగ్‌బాస్‌ షోదే. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఎంతోమందికి అభిమాన నాయకుడైన కమల్‌ తమిళులకు ఆరాధ్యదైవం లాంటి వాడు. అక్కడ బిగ్‌బాస్‌ షోకి ప్రాచుర్యం తీసుకురావాలంటే ఆయనే కరెక్ట్‌ అని భావించింది స్థానిక విజయ్‌ ఛానెల్‌ యాజమాన్యం. అందుకు తగ్గట్లే కొన్నిరోజుల కిందట ప్రారంభమైన తమిళ బిగ్‌బాస్‌కు ఓ స్థాయిలో రేటింగ్స్‌ తెచ్చిపెడుతున్నాడు కమల్‌హాసన్‌. ‘ఇప్పుడు ప్రపంచం అంతా స్మార్ట్‌ తెరల చుట్టూనే తిరుగుతోంది. అందుకే మూడు గంటలుండే సినిమా కన్నా రోజూ టీవీల్లో వచ్చే కార్యక్రమాలూ వీడియోలూ ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ కారణంతోనే మరింత ఎక్కువమందికి చేరువవ్వాలనే ఉద్దేశంతో బిగ్‌బాస్‌కి ఒప్పుకున్నా. ఇప్పుడు ప్రతి శనివారం కొన్ని కోట్లమంది ముందుకు రాగలగుతున్నా. అదే బుల్లితెరకున్న ప్రత్యేకత’ అంటారు కమల్‌హాసన్‌.

కండల వీరుడే ఆ షో హీరో

దకొండేళ్లుగా హిందీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ భారత్‌లో ఎంతగానో ప్రాచుర్యం పొందిన షోలలో ఒకటి. మొదట దీనికి అర్షద్‌ వార్సి, శిల్పాశెట్టి, అమితాబ్‌ బచ్చన్‌, సంజయ్‌ దత్‌ వ్యాఖ్యాతలుగా చేశారు. 2012 నుంచి సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ బిగ్‌బాస్‌ని సూపర్‌గా నడిపిస్తున్నారు. అందుకే, కలర్స్‌ ఛానల్‌ ఈ హీరోకి ఒక్కో ఎపిసోడ్‌కీ దాదాపు రూ.8కోట్ల పారితోషికాన్ని చెల్లిస్తోందట.

కన్నడలో బిగ్‌హిట్‌

టీవీ కన్నడలో 2013లోనే ప్రారంభమైన బిగ్‌బాస్‌ షో దక్షిణాదిలోనే నంబర్‌ వన్‌ రియాలిటీ షోగా రికార్డుకెక్కింది. దీనికి వ్యాఖ్యాత ఎవరో తెలుసా ఈగ సినిమా నటుడూ శాండల్‌ వుడ్‌ సూపర్‌ స్టార్‌ సుదీప్‌. ఈ హీరో మీద కన్నడిగులకు ఎంత అభిమానం ఉందంటే బిగ్‌బాస్‌ మొదలైనప్పట్నుంచీ ఇప్పటివరకూ అతడే దీనికి వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. ఈటీవీ తర్వాత స్టార్‌ సువర్ణ, కలర్స్‌ కన్నడ ఛానళ్లలో ప్రసారమైన ఈ షోకి వ్యతిరేకంగా స్థానిక నిర్మాతలు ఆమధ్య నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. ఎందుకంటే బిగ్‌బాస్‌ షోకి మరీ ప్రాచుర్యం రావడంతో అక్కడ సినిమాలు కూడా సరిగా ఆడటం లేదట మరి.

నంబర్‌ వన్‌ యారీ...

దేశవ్యాప్తంగా, ఇతర దేశాల్లోనూ మారుమోగిపోయిన బాహుబలి సినిమాలో హీరో పాత్రకు దీటైన మరో పాత్ర భల్లాల దేవుడిది. ఈ సినిమాతో రానాకి పెరిగిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అలాంటి నటుడు బుల్లి తెరమీద షో చేస్తున్నాడంటే అభిమానులకు పండుగలా ఉండదూ... జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ‘నంబర్‌ వన్‌ యారీ’లో సెలెబ్రిటీ స్నేహితుల ముచ్చట్లూ సినీతారల వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర విషయాల్నీ ప్రేక్షకులముందుకు తెస్తున్నాడు రానా.

ఇది బిగ్‌ బీ షో..!

కౌన్‌బనేగా కరోడ్‌పతి... భారతదేశ టీవీ షోల చరిత్రలోనే ఓ ప్రభంజనం. బ్రిటన్‌లో ప్రాచుర్యం పొందిన ‘హూ వాంట్స్‌ టు బీ ఏ మిలియనీర్‌’ ఆధారంగా 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ షో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ని టీవీ తెరమీదికి తీసుకొచ్చింది. అప్పట్నుంచి ఇప్పటి వరకూ పదిహేడేళ్లలో ఒక్క సీజన్‌కి మినహా అన్నిటికీ బిగ్‌ బీనే వ్యాఖ్యాత. ఆ షో ప్రారంభమైందంటే మిగిలిన ఛానెళ్లలో ప్రోగ్రామ్‌ల రేటింగులు వైకుంఠపాళీలో పాము మింగినంత వేగంగా కిందికొచ్చేస్తాయంటారు. అమితాబ్‌ క్రేజ్‌ అలాంటిది. మధ్యలో 2007లో అమితాబ్‌కి ఆరోగ్యం బాగా లేకపోవడంతో మూడో సీజన్‌ని షారూఖ్‌ ఖాన్‌తో చేయించారు. కానీ అది ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దాంతో నాలుగో సీజన్‌కి మళ్లీ అమితాబ్‌ తెరమీదకి వచ్చారు. ఈ ఆగస్టులో తొమ్మిదో సీజన్‌ ప్రారంభం కాబోతోంది. దీనికీ వ్యాఖ్యాత ఆయనే.

‘మెగా’ సందడి

ఖైదీ నం.150తో నూటయాభయ్యో సినిమాలోనూ తన పవరేంటో నిరూపించారు మెగాస్టార్‌ చిరంజీవి. తెలుగు ప్రేక్షకులకు ఆయన నటనంటే అంత మక్కువ మరి. అందుకే, నాగార్జున తర్వాత ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోని నడిపించేందుకు చిరంజీవిని రంగంలోకి దించింది స్టార్‌ మా యాజమాన్యం. అలా తొలిసారి బుల్లితెర మీద కనిపించి తనలోని వ్యాఖ్యాతను కూడా అభిమానులకు పరిచయం చేశాడు మెగాస్టార్‌.

తొలి అడుగు మన్మథుడిదే!

తెలుగులో పెద్ద తారలు వ్యాఖాతగా బుల్లితెరమీద కనిపించడం నాగార్జునతోనే మొదలైంది. టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో ఒకడైన నాగ్‌కి మహిళా ప్రేక్షకులూ మాస్‌ వైపు నుంచి కూడా అభిమానులున్నారు. దాంతో హిందీలో ఎంతో ప్రాచుర్యం పొందిన ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ తెలుగు వెర్షన్‌కి వెండితెర మన్మథుడిని వ్యాఖ్యాతగా బుల్లితెరకు పరిచయం చేశారు ఆ షో నిర్మాతలు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్‌ షో మొదటి సీజన్‌ని నాలుగు కోట్లమందికి పైగా చూశారంటేనే ఆ ప్రయత్నం ఫలితం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాగార్జున చేసిన రెండు మూడు సీజన్‌లు కూడా విజయవంతంగా నడిచాయి.

ఆ ముగ్గురూ...

మిళ ఛానల్‌ స్టార్‌ విజయ్‌లో 2012లో ప్రారంభమైన కౌన్‌ బనేగా కరోడ్‌పతి కూడా అక్కడి పెద్ద హీరోల్ని టీవీ తెరమీదికి తెసుకొచ్చింది. ‘నీంగలుమ్‌ వెల్లలామ్‌ ఒరు కొడి(మీరూ గెలవొచ్చు కోటి రూపాయలు)’ పేరుతో అక్కడ ప్రసారమవుతున్న ఈ షో మొదటి సీజన్‌కు హీరో సూర్య, తరవాత ప్రకాష్‌ రాజ్‌ మూడో సీజన్‌కు అరవింద్‌ స్వామి వ్యాఖ్యాతలుగా వచ్చారు. తమ నటనతో తమిళంతో పాటు తెలుగులో బాలీవుడ్‌లో కూడా అభిమానులను సంపాదించుకున్న ఈ ముగ్గురూ ఆ షోని విజయవంతంగా నడిపించారు. సూర్య సినిమాలతో బిజీగా ఉండడంతో రెండో సీజన్‌ని ప్రకాష్‌ రాజ్‌ చేశాడు. ఇక, గతేడాది వచ్చిన అరవింద్‌ స్వామి వ్యాఖ్యాతగా చేసిన మూడో సీజన్‌ మొదటి ఎపిసోడ్‌ని యాభై లక్షలమంది చూశారంటేనే అతడికున్న క్రేజ్‌ అర్థం చేసుకోవచ్చు.

అదండీ సంగతి... ఈ ట్రెండ్‌ ఇలానే కొనసాగితే ముందు ముందు మహేష్‌, ప్రభాస్‌, పవన్‌ కళ్యాణ్‌ లాంటి స్టార్లను కూడా టీవీ తెరమీద చూడొచ్చేమో.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.