close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వలపు వాకిట

వలపు వాకిట
- డా॥ తాళ్ళూరి లక్ష్మ

‘‘మీరు... మీరు... హేమంతేనా?’’ సన్నగా వీణమీటినట్లున్న పలకరింపు వినబడి చివాలున బుక్‌షెల్ఫ్‌ నుంచి తలతిప్పి పక్కకి చూశాడు హేమంత్‌. ఎదురుగా చిరుమందహాసంతో ప్రౌఢ వయసులో ఉన్న యువతి. వెనువెంటనే గుర్తుపట్టలేకపోయాడు. మరి చూసి దాదాపు పాతికేళ్ళపైనే అయిందాయె. గుర్తుకొచ్చేసరికి గుండె ఒక్కసారిగా లయ తప్పినట్టయింది.

‘‘మీరు... మధుమిత కదూ?’’ ఆనందం, ఆశ్చర్యం ముప్పిరిగొన్న కంఠంతో పలకరించాడు హేమంత్‌.

ముఖాన అదే చిరుదరహాసం. వయసుతోపాటు కొద్దిగా ఒళ్ళు చేసినట్టుంది కానీ మనిషిలో ఆ ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు. కోలముఖాన కనబడీ కనబడనట్టు దోసకాయ గింజంత బొట్టూ, కొటేరు లాంటి నాసిక మీద ఉన్నావా లేదా అన్నట్లు మెరుస్తున్న ముక్కుపుడక, కలువపూల లాంటి వెడల్పయిన కళ్ళూ, చామనఛాయరంగు, ఒంటిని మరింత ఆకర్షవంతం చేస్తూ లేత నీలంరంగు సిల్కుచీరె, అక్కడక్కడా నెరసిన బాబ్డ్‌హెయిర్‌ మనిషికి ఒక విధమైన హూందాతనం తీసుకొచ్చింది.

‘‘అమ్మయ్య, గుర్తుపట్టావన్నమాట’’ కళ్ళప్పగించి చూస్తున్న హేమంత్‌ని ఈ లోకంలోకి తీసుకువచ్చింది ఆమె గొంతు. ఆ గొంతులో ఎంతో రిలీఫ్‌ తనని గుర్తుపట్టాడని. తన వూహ సరయ్యేసరికి బహువచనంలోంచి ఏకవచనంలోకి మార్చేసింది సంభోదనను.

‘‘అదేమిటి, వసంతాగమనాన్ని ఎవరైనా గుర్తించకుండా ఉండగలరా?’’ ఎంతో మార్దవంగా అన్నాడు హేమంత్‌.

‘‘ఓహో, అందుకనే కామోసు, దొంగచాటుగా పారిపోయి ఇన్నేళ్ళు మొహం చాటేసింది’’ నిష్ఠూరంగా అంది.

‘‘ఇక్కడేమిటి, ఇలా హఠాత్తుగా ప్రత్యక్షమయ్యావు?’’ మాటమారుస్తూ అన్నాడు.

‘‘ఆ మాట అడగాల్సింది నేను’’ ఒకప్పటి మాటకారితనం ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ ప్రశ్నకి బదులుగా మరోప్రశ్న వేసింది.

‘‘అనుకోకుండా నాకు రాక్‌ఫెల్లర్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌లో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా మూణ్ణెళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశం దొరికింది. కిందటి నెలలో వచ్చాను. వచ్చే నెల్లో ఇండియాకి తిరిగి వెళ్ళిపోతాను. ఈ మాల్‌లోని బుక్‌స్టోర్‌లో మంచి పుస్తకాలు దొరుకుతాయంటే చూసి కొందామని వచ్చాను. మరి, నీ మాటేమిటి?’’

‘‘నేనా... బి.ఇ. పాసయ్యాక ఇక్కడికొచ్చి ఎమ్మెస్‌ చేశాను. జాబ్‌ కూడా ఇక్కడే దొరికింది. తరువాత పెళ్ళి చేసుకుని, ఆయన డి.ఎమ్‌. పూర్తయ్యాక పూర్తిగా ఇక్కడే స్థిరపడిపోయాం. నాలుగైదుసార్లు ఇండియాకి రావడం తప్పించి, అక్కడి బంధుత్వాలూ బంధాలూ అన్నీ దాదాపు తెగిపోయాయి. షాపింగ్‌కని ఈ మాల్‌కి వచ్చాను.’’

‘‘పిల్లలా?’’

‘‘ఔను. ఒక అమ్మాయి. కాలేజీకి వెళుతోంది. మరీ నీ మాటేమిటి, పెళ్ళయిందా?’’

‘‘ఆఁ... అయింది.’’

‘‘పిల్లలా?’’

‘‘వూహు... లేరు’’ ముక్తసరిగా చెప్పాడు.

‘‘ఈ మాటలకేంగానీ చాలా ఏళ్ళ తరవాత కలిశాం. ఓ కప్పు కాఫీయేనా ఇప్పిస్తావా?’’ అదే చిలిపితనం, దబాయింపు.

ఇద్దరూ కేఫ్‌టేరియాకెళ్ళి కూర్చున్నారు- చెరో కప్పు కాఫీ తాగుతూ, పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ. మాటల మధ్యలో మధుమిత ఉన్నట్టుండి అడిగింది ‘‘అలా చెప్పాపెట్టకుండా ఉన్నట్టుండి ఎందుకు పారిపోయావు హేమంత్‌?’’ అని.

ఏ క్షణాన్నైనా మధుమిత నుంచి ఆ ప్రశ్న వినాల్సి వస్తుందని తెలిసినా కూడా తను అలా అంత తొందరగా, ఆకస్మికంగా అడిగేసరికి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు హేమంత్‌. మనసు అలా అలా గతంలోకి వెళ్ళిపోయింది.

* * *

హేమంత్‌ యూనివర్శిటీ కాలేజీలో ఇంజినీరింగ్‌ చదువుతున్న రోజులవి. ఆ ఏడే ఫైనలియర్‌లోకి అడుగుపెట్టాడు. ఆరోజే కాలేజీ రీఓపెనింగ్‌. తనెప్పుడూ బస్సెక్కే బస్టాప్‌- విద్యార్థినీ విద్యార్థులతో ఎంతో సందడిగా ఉంది. అన్నీ తెలిసిన ముఖాలే అవడంతో ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటున్నారు. హేమంత్‌ కూడా తన మిత్రులతో బాతాఖానీ చేస్తూ బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. అంతలో ఒక మెరుపు మెరిసినట్టయింది. మెరుపుతీగె లాంటి ఒక అందమైన అమ్మాయి మరో అమ్మాయితో కలసి బస్టాప్‌ దగ్గరకు వచ్చి నిలుచుంది. గులాబీరంగు పరికిణీ, అదే రంగు ఓణీ వేసుకుని అచ్చతెలుగు అమ్మాయిలా సింగారించుకుంది. సల్వారు కమీజులూ, జీన్స్‌ప్యాంట్లూ వేసుకుని ఉన్న మిగతా అమ్మాయిల గుంపులో క్రోటన్‌ మొక్కల మధ్యన విరబూసిన ముద్దమందారంలా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. పదహారు, పదిహేడేళ్ళ ప్రాయం ఉండొచ్చు. కోలముఖం, చామనఛాయ రంగు, పెద్దపెద్ద కళ్ళు... కొంచెం బొద్దుగా, కొంచెం ముద్దుగా ఉండి కళ్ళు తిప్పుకోనీయటం లేదు. సభ్యతకాదని తెలిసినా హేమంత్‌ ఆ అమ్మాయి మీది నుంచి దృష్టి మరల్చుకోలేకపోయాడు. ఇంతలో బస్సు రావటంతో విద్యార్థులందరూ బిలబిలమంటూ బస్సెక్కేశారు.

ఇంజినీరింగ్‌ కాలేజీ బస్టాప్‌లోనే ఆ అమ్మాయి కూడా దిగడంతో హేమంత్‌ హృదయం ఎగిరి గంతులేసింది. ఆ అమ్మాయెవరో తెలుసుకోవడానికి తన వెనకే నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ అమ్మాయి కాలేజీ బిల్డింగ్‌లో ప్రవేశించి తిన్నగా ఆఫీసు వైపు వెళ్ళింది. ఆఫీసులో ఎవరూ కనిపించకపోవడంతో అటూఇటూ చూస్తూ అక్కడే తచ్చాడుతున్న హేమంత్‌ని చూసి ‘‘సార్‌, ఫస్టియర్‌ క్లాసెస్‌ ఎక్కడవుతా’’యని అడిగింది.

హేమంత్‌ మనసు ఒక్కసారి ఆనందంతో పరవళ్ళు తొక్కింది. ఆ అమ్మాయిని వాళ్ళ క్లాస్‌దాకా దిగబెట్టి ‘‘అయామ్‌ హేమంత్‌. ఫైనలియర్‌ స్టూడెంట్‌ని. మే ఐ నో యువర్‌ గుడ్‌ నేమ్‌ ప్లీజ్‌’’ అన్నాడు స్టైల్‌గా. ఆ అమ్మాయి పెదవులు విడీవిడని విధంగా చిన్నగా నవ్వి తన పేరు చెప్పింది. హేమంత్‌కి ఆ విధంగా తెలిసింది ఆ మెరుపుతీగ పేరు మధుమిత అని.

అలా మొదలైంది హేమంత్‌ మధుమితారాధన. ఆ రోజల్లా ఏ పనిచేస్తున్నా మధుమిత రూపమే కళ్ళముందు దోబూచులాడసాగింది. లెక్చరర్స్‌ చెబుతున్న పాఠాలు బుర్రకెక్కలేదు. సాయంత్రం కాలేజీ వదిలాక కూడా ఆ అమ్మాయి కోసం వేచిచూస్తూ ఎన్నో బస్సులు ఎక్కకుండా వదిలేశాడు. చివరకు మధుమిత వచ్చాక ఆమె ఎక్కిన బస్సులోనే ఎక్కి ఆమె దిగినచోటే దిగాడు. అయితే, స్వభావతా బిడియస్థుడు కావడంతో ఆమెతో పరిచయం ఎలా పెంచుకోవాలో తెలియక తన ఇంటిదారి పట్టాడు ఆమెను వదిలేసి.

ఇంటికెళ్ళాక కూడా హేమంత్‌ ఏ పనిమీదా మనసు లగ్నం చేయలేకపోయాడు. రాత్రంతా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా... మధుమితని ఎప్పుడు చూడ్డానికి వీలవుతుందా అని ఆలోచించడంతోనే సరిపోయింది. మర్నాటి పొద్దుట మామూలుకంటే అరగంటముందే బస్టాప్‌ చేరుకున్నాడు- మధుమితని ఎక్కడ మిస్సవుతానో అనుకుంటూ. అయితే, ఎన్ని బస్సులు వచ్చి వెళ్ళిపోయినా మధుమిత జాడలేదు. చివరకు మిత్రులందరూ కలిసి బలవంతం చేస్తే ఓ బస్సెక్కి కాలేజీకి వెళ్ళాడు. కాలేజీలో ఆ రోజంతా దిగాలుగానే గడిపాడు. ఒకటి రెండుసార్లు ఫస్టియర్‌ క్లాస్‌ చుట్టూ ప్రదక్షిణలు చేశాడు మధుమిత ఎక్కడైనా కనిపిస్తుందేమోనని. అయితే, ఆ రోజంతా ఆ అమ్మాయి దర్శనమే కాలేదు.

మూడోరోజు సెలవు రోజైనా స్పెషల్‌ క్లాస్‌ ఉండటంతో పొద్దుటే బయల్దేరి బస్టాప్‌ చేరుకున్నాడు- ఆరోజు మధుమిత ఎలానూ కలవదన్న నిస్పృహతో. అయితే అనుకోకుండా బస్టాప్‌లో మధుమిత కనిపించింది మరో ఇద్దరు నడివయసు ఆడవాళ్ళతో కలసి మాట్లాడుతూ. తలంటు పోసుకున్న కురులతో, నీలిరంగు పట్టు పరికిణీ పావడాలతో, మెళ్ళొ నెక్లెస్‌తో... స్పెషల్‌గా తయారై ఎంతో ముచ్చటగా అనిపించింది. ఏదో శుభకార్యానికి వెళుతున్నట్టుంది, బాగా ముస్తాబయింది. హేమంత్‌ వాళ్ళకి కొద్దిదూరంలో నుంచున్నాడు బస్‌ కోసం ఎదురుచూస్తూ, ముఖాన్ని మరోపక్కకి తిప్పి.

అంతలో ‘‘హేమంత్‌గారూ, కాలేజీకి వెళుతున్నారా? ఇవాళ సెలవు కదా?’’ అని వినిపిస్తే పక్కకి తిరిగి చూశాడు... మధుమిత! తననే అడుగుతోంది. కలా నిజమా అని చెయ్యి గిల్లుకున్నాడు. ‘‘మిమ్మల్నే హేమంత్‌గారూ, ఈరోజు కాలేజీ ఉందా?’’ అని మధుమిత మళ్ళా అడగడంతో ఈ లోకంలోకి వచ్చి-

‘‘ఆఁ... లేదు.. లేదు.. కాలేజీకి సెలవే కానీ, మాకు స్పెషల్‌ క్లాస్‌ ఉంది’’ అని తడబడుతూ చెప్పాడు.

మధుమిత గలగలా నవ్వుతూ ‘‘ఎందుకు అంత కంగారుపడుతున్నారు?’’ అంది.

అప్పటికి తేరుకున్న హేమంత్‌ ‘‘మీరు నిన్న కాలేజీకి రాలేదేమిటి?’’ అని అడిగాడు.

‘‘ఓహో! నేను రాలేదని గమనించారన్నమాట. ఏమీలేదు, వూర్నించి మా అత్తయ్య వచ్చింది. అందుకే నిన్న కాలేజీకి రాలేకపోయాను. అదిగో అక్కడ గళ్ళ పట్టుచీరెలో ఉందే... ఆవిడే మా అత్తయ్య. పక్కనున్నది మా అమ్మ. మన కాలేజీకి దగ్గర్లోని ఓ కాలనీలో మా బంధువుల ఇంట్లో ఏదో ఫంక్షన్‌ ఉంటే అక్కడికి వెళుతున్నాం. రండి మావాళ్ళకి పరిచయం చేస్తాను’’ అని వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళింది. ‘‘అమ్మా, అత్తయ్యా... ఈయన హేమంతని నా సీనియర్‌. ఫైనలియర్‌ చదువుతున్నారు మా కాలేజీలోనే’’ అని పరిచయం చేసింది.

అలాగ పెరిగిన పరిచయంతో హేమంత్‌, మధుమితల మధ్య సాన్నిహిత్యం క్రమంగా ఎక్కువైంది. ‘మీరు’ నుంచి ‘నువ్వు’ అని సంభోదించుకునేదాకా ఎదిగింది. బస్టాప్‌లో పలకరింపులూ, కాలేజీలో ముచ్చట్లతోపాటు ఇద్దరి అభిరుచులు కూడా కలవడంతో బాగా చేరువయ్యారు. హేమంత్‌ స్వతహా భావుకుడు కావడంతో అతనికి మధుమిత చేసే ప్రతి పనీ ఎంతో ఆకర్షణీయంగా కనిపించేది. ఒక్కోరోజు ఒక్కో వస్త్రాలంకరణతో కొత్తకొత్తగా కనిపించేది. ఒకరోజు ముద్దమందారాన్ని తలపిస్తే, మరోరోజు అరవిచ్చిన గులాబీపువ్వుని గుర్తుకుతెచ్చేది. ఆమెని చూడగానే ఆమని రాకకి పులకరించిపోతున్న కోయిలలాగా, చిరుజల్లులకు పరవశిస్తూ పురివిప్పి నాట్యం చేస్తున్న మయూరిలాగా హృదయం ఆనందంలో ఓలలాడేది. ఆమె ఒకరోజు ముగ్ధలాగ కనిపిస్తే, మరోరోజు నెరజాణలాగా అనిపించేది. వయసు మహత్యమో, సామీప్యతో తెలీదుగానీ ఆమె అంటే ఒక విధమైన ఇష్టం, అనురాగం కలగసాగాయి. ఆమెని ఏ ఒక్కరోజు చూడలేకపోయినా లోకమంతా శూన్యంగా అనిపించేది. మధుమిత చలాకీతనం, మాటకారితనం, ఎప్పుడూ గలగలా మాట్లాడే తత్వం హేమంత్‌ని ఎంతగానో ఆకర్షించాయి. అలాగే, భిన్నధృవాలు ఆకర్షించుకుంటాయి అన్నట్టు హేమంత్‌లోని భావుకత్వం, బిడియం, మితభాషిత్వం మధుమితని ఎంతగానో అకట్టుకున్నాయి.

కాలేజీ మొదలైన రెండో నెలకో, మూడో నెలకో హేమంత్‌ నాన్నగారికి అనుకోకుండా ఢిల్లీకి ట్రాన్స్‌ఫరై వెనువెంటనే వెళ్ళిపోవలసి వచ్చింది కుటుంబంతో సహా. దాంతో హేమంత్‌కి నివాసం ఒక ప్రశ్నార్థకంగా తయారైంది. హాస్టల్‌కి మారవచ్చుకానీ దాని వలన మధుమిత సాహచర్యం కోల్పోతాడు. అందుకని మధుమిత ఇంటి దగ్గరే ఏదైనా గది అద్దెకు తీసుకుని ఉందామనుకున్నాడు. అదేమాట మధుమితతో అంటే దానికామె ‘‘మా ఇంట్లోనే ఔట్‌హౌస్‌ ఖాళీగా ఉంది. నీకు నచ్చితే మా నాన్నగారికి చెప్పి ఇప్పిస్తాను’’ అంది. రొట్టె విరిగి నెయ్యిలోపడ్డ చందమైంది హేమంత్‌ అదృష్టం. వెంటనే తన అంగీకారం తెలిపి ఆ ఔట్‌హౌస్‌కి మారిపోయాడు.

మధుమిత వాళ్ళ నాన్నగారు విపరీతమైన ప్రాక్టీసు ఉన్న లీడింగ్‌ లాయరు. భారీ పర్సనాలిటీతో, గంభీరమైన స్వరంతో నటుడు ఎస్వీ రంగారావుని తలపుకు తెచ్చేవారు. మధుమిత వారి ఏకైక సంతానం. నాన్నగారి గారాలపట్టి. వారిల్లు ఎప్పుడూ బంధుమిత్రులతో కళకళలాడుతుండేది. మధుమిత వాళ్ళమ్మగారైతే ఆతిథ్యంలో అన్నపూర్ణమ్మనే మించిపోయేవారు. అటువంటి వాతావరణంలో పెరిగిన మధుమిత మంచితనానికే ప్రతీకగా ఉండేది. హేమంత్‌ పేరుకే ఔట్‌హౌస్‌లో నివసించే స్టూడెంట్‌ కానీ, అతని భోజనాదులన్నీ అధికభాగం మధుమిత వాళ్ళింట్లోనే జరిగేవి. మధుమిత కూడా రోజులో ఎక్కువభాగం హేమంత్‌తోనే గడుపుతుండేది. కంబైన్డ్‌ స్టడీస్‌ చేస్తూనో, రాని పాఠాలు చెప్పించుకుంటూనో, కబుర్లు చెబుతూనో లేదా రేడియోలో సంగీతం వింటూనో. కాదేదీ కవిత కనర్హమన్నట్టు వాళ్ళు మాట్లాడుకునే స్వీట్‌ నథింగ్స్‌కి- సీతాకోకచిలుకల రంగుల నుంచి విమెన్స్‌ లిప్‌ మూవ్‌మెంట్‌దాకా, జోగ్‌ఫాల్స్‌ నుంచి నయాగరా ఫాల్స్‌ వరకూ, పెద్ద బాలశిక్ష నుంచి అభిజ్ఞాన శాకుంతలందాకా పనికిరాని విషయమనేదే ఉండేదికాదు. హేమంత్‌, మధుమితలిద్దరూ వాళ్ళ హద్దులో ఉంటున్నా కూడా ఒకరిమీద ఒకరు పెంచుకుంటున్న ఇష్టం, అనురాగం వారి కళ్ళల్లో మాటల్లో నడవడికలో ప్రస్ఫుటంగా కనబడేది.

మధుమిత సాంగత్యంలో ఫైనలియర్‌ ఇట్టే గడిచిపోయినట్టయింది హేమంత్‌కి. చూస్తూ చూస్తూనే ఫైనల్‌ పరీక్షలు కూడా అయిపోయాయి. అయితే వెంటనే ఇల్లు ఖాళీచేసి ఢిల్లీలో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళబుద్ధి కాలేదు హేమంత్‌కి- ఎక్కడ మధుమిత సాహచర్యం కోల్పోతానో ఏమో అని. అందుకనే ఏవో సాకులు చెబుతూ చాలా రోజులదాకా ప్రయాణాన్ని వాయిదా వేశాడు.

ఒకరోజు రాత్రి భోజనం కానిచ్చి ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చున్న సమయాన ఎవరో తలుపు తట్టినట్లయితే వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా మధుమిత నాన్నగారు. అందరూ లైట్లార్పేసి పడుకుని ఉన్నట్టున్నారు. బయటంతా చీకటిగా ఉంది. ‘‘లోపలికి రావచ్చా హేమంత్‌?’’ అంటూ ఆయన లోపలికి వచ్చారు. ఆ సమయంలో ఆయనెందుకు వచ్చారో అంతుపట్టలేదు హేమంత్‌కి.

‘‘కూర్చోండి అంకుల్‌’’ అంటూ కుర్చీ చూపి పక్కనే నిలబడ్డాడు హేమంత్‌.

ఆయన ‘‘నువ్వు కూడా కూర్చో హేమంత్‌’’ అనడంతో పక్కనే ఉన్న మంచంమీద కూర్చున్నాడు.

ఆయన ఉపోద్ఘాతం అదీ ఏమీ లేకుండా నేరుగా మాట్లాడటం మొదలెట్టారు.

‘‘చూడు హేమంత్‌, నాది చల్లకొచ్చి ముంత దాచే తత్వం కాదు. చెప్పదలచుకున్నదేదైనా ముఖాముఖి చెప్పేయడం అలవాటు. సంవత్సరంగా నిన్నూ, మధునీ గమనిస్తున్నాను. మీ ఇద్దరి నడవడికలో ఎటువంటి పొరబాట్లూ లేనప్పటికీ, మీరిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టం పెంచుకుంటున్నట్టు అనిపించింది. ఈ ఇష్టం శాశ్వతమైన ప్రేమా లేక ప్రాయంలో మొలకెత్తే ఆకర్షణా అనే విషయం పక్కనబెడితే, నీకొక విషయం తెలియజేయడం మధుమిత తండ్రిగా నా బాధ్యత అనుకుంటున్నాను. మధుమిత పుట్టగానే మా కుటుంబంలో అందరూ అనుకున్నది సాకేత్‌కి భార్య పుట్టిందని. సాకేతంటే నా మేనల్లుడు. నా ఒక్కగానొక్క చెల్లెలి కొడుకు. ప్రస్తుతం స్టేట్స్‌లో మెడిసిన్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నాడు. మధు చదువైపోగానే ఇద్దరికీ వివాహం చేద్దామనుకుంటున్నాం. మధు కూడా ఎప్పుడూ సాకేతంటే అయిష్టతగానీ, అతడితో వివాహానికి విముఖతగానీ చూపలేదు. అట్లాగే సాకేత్‌ కూడా. అయితే, ఇప్పుడు నీపట్ల పెంచుకుంటున్న ఈ ఇష్టం కారణంగా ముందుముందు మధు సాకేత్‌ పట్ల అయిష్టత పెంచుకుంటుందేమోనని భయంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుండీ అనుకుంటున్న ఈ వివాహం ఆగిపోతే మా కుటుంబాలలో అల్లకల్లోలం, అశాంతి చెలరేగుతాయి. అందరూ విపరీతంగా బాధపడతారు. నీ విషయానికి వస్తే, మధుతో నీ సాహచర్యం కేవలం ఒక పది మాసాలది. మరచిపోడానికి కొద్దిరోజులు బాధపడ్డా, క్రమేణా జీవితాన్ని సరైన బాటలో మలచుకునే కార్యక్రమంలో ఆ బాధ వెనకబడిపోతుంది. మధు విషయంలో కూడా అదే జరుగుతుంది. జీవితం, కుటుంబం, అనుబంధాలు- ఇవన్నీ తాత్కాలిక ఇష్టాయిష్టాలకంటే ఎంతో విలువైనవి. చదువుకున్నవాడివి, సంస్కారవంతుడివి. నీకింతకన్నా చెప్పడం నాకిష్టం లేదు. దయచేసి మధు జీవితంలోనుంచి నువ్వు తప్పుకుంటావని ఆశిస్తున్నాను.’’

ఆపైన హేమంత్‌ సమాధానానికి కూడా వేచి చూడకుండా ఆయన వెళ్ళిపోయారు.

హేమంత్‌ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. మధుమిత మీద పెంచుకున్న తన అనురాగాన్నీ, వాళ్ళ కుటుంబం ఆమె మీద పెట్టుకున్న ఆశలూ, నమ్మకాల్నీ రాత్రంతా తరాజు వేస్తూనే ఉన్నాడు. చివరకు ఒక నిర్ణయానికొచ్చాడు. మళ్ళీ పొద్దుటే మధుమిత ముఖం చూస్తే తన నిర్ణయం ఎక్కడ సడలిపోతుందో అని, తెల్లవారుజామునే ఎవరూ లేవకమునుపే తన సామానంతా సర్దుకుని, తన వూరు వెళ్ళిపోతున్నానని మధుమిత నాన్నగారి పేర లేఖ రాసిపెట్టి, ఒక ఆటో తీసుకుని వూర్లోనే ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే ఫ్లైట్‌లో ఢిల్లీకి వెళ్ళిపోయాడు. తిరిగి మధుమితని చూడ్డం కానీ, కలవడం కానీ ఈరోజే!

* * *

‘‘ఎంతసేపలా ఆలోచిస్తూ కూర్చుంటావు సమాధానం చెప్పకుండా?’’ మధుమిత భుజం తట్టుతూ పలకరించేసరికి వూహల్లోనుంచి ఒక్కసారి బయటపడ్డాడు హేమంత్‌. ‘‘సమాధానం చెప్పకపోతే పోనీలే. ఎలానూ గడచిపోయిన రోజులు తిరిగిరావుగా. కనీసం ఇప్పుడైనా కొద్దిసేపు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ గడుపుదాం.’’

‘అదీ మధుమితలోని గొప్పతనం. ఏ విషయాన్నీ ఎదుటివారికి ఇబ్బంది కలిగించేదాకా లాగదు’ నిట్టూరుస్తూ అనుకున్నాడు హేమంత్‌.

మరికొద్దిసేపు పాత స్మృతులు నెమరేసుకున్నాక ‘‘ఇక బయల్దేరుదామా?’’ అని మధుమిత అనేసరికి ఇద్దరూ మాల్‌ నుంచి బయటపడ్డారు. మధుమిత తన కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్ళిపోయింది. హేమంత్‌ ఒక టాక్సీ ఎంగేజ్‌ చేసుకున్నాడు తన నివాసానికి వెళ్ళడానికి.

టాక్సీలో వెళుతుండగా అనుకున్నాడు హేమంత్‌- ‘మధుమితకి తనమీద ఇంకా కోపం పోయినట్టు లేదు. ఇంటికి రమ్మని కూడా పిలవలేదు. ఫోన్‌ నంబరైనా ఇవ్వలేదు, తీసుకోలేదు. అవును, ఎలా క్షమిస్తుంది, అంత దారుణంగా మొహం చాటేశాక. తను పచ్చి మోసగాడు అనుకుని ఉంటుంది. అందుకే దేవుడు తనకి సరైన శిక్ష వేశాడు- పెళ్ళయిన రెండేళ్ళకే తన భార్యని తన దగ్గర నుండి తీసుకొనిపోయి, తనని ఒంటరిని చేసి. ఆ మాట చెబితే తనెక్కడ బాధపడుతుందో అని పెళ్ళి విషయంలో ముక్తసరిగా జవాబిచ్చాడు.’

అదే సమయంలో చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ అనుకుంటోంది మధుమిత ‘యూ ఆర్‌ గ్రేట్‌ హేమంత్‌! ఇప్పటికీ మారలేదు- ఎవరినీ ద్వేషించలేని, నిందించలేని నీ మనస్తత్వం. మనం విడిపోడానికి మా నాన్నగారే కారణమని నాకు తెలియదనుకుంటున్నావు. పెళ్ళయిన మూడేళ్ళకే యాక్సిడెంట్‌లో సాకేత్‌ మరణించి, నా జీవితం చిందరవందరైపోతే, తను చేసిన పనికి కుంగిపోతూ నాన్నగారే ఆరోజు నీ గదిలో చోటుచేసుకున్న సంఘటన నాకు చెప్పారని నీకు తెలియదు. ఇప్పుడు నిన్ను ఇంటికి ఆహ్వానిస్తే మోడువారిన నా జీవితం చూసి నువ్వెంత బాధపడతావో నాకు తెలుసు. అందుకే నిన్ను ఇంటికి రమ్మని కూడా పిలవలేకపోయాను హేమంత్‌.’

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.