close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జీరోదా... విజయ గీతిక!

జీరోదా... విజయ గీతిక!

నితిన్‌ కామత్‌, నిఖిల్‌ కామత్‌... ఇద్దరూ అన్నదమ్ములు. ఇద్దరూ వేర్వేరు స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థల్లో పనిచేశారు. ఆ అనుభవానికి తమ ఆలోచనల్ని జోడించి ‘జీరోదా’ అనే స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీని సొంతంగా ప్రారంభించి విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు.

దరంగంలో బాగా రాణిస్తుండటంతో పదో తరగతి తర్వాత చదువుకి విరామం ఇచ్చి ఏడాదిపాటు జాతీయ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలపైన దృష్టి పెట్టాడు నిఖిల్‌. ఆపైఏడాది కూడా చెస్‌లోనే కొనసాగాడు. మరోవైపు ఖాళీ దొరికినప్పుడల్లా అన్నయ్య నితిన్‌ దగ్గర స్టాక్‌ బ్రోకింగ్‌ గురించి తెలుసుకునేవాడు. తర్వాత ఓ కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేస్తూ ట్రేడింగ్‌ చేసేవాడు. ఆపైన ఇండియాబుల్స్‌ సెక్యురిటీస్‌ కంపెనీలో మనీ మేనేజర్‌గా ఏడాదిపాటు అనుభవం సంపాదించి, 2007లో స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థ ‘వే2వెల్త్‌’ బెంగళూరు విభాగ సారథిగా పనిచేశాడు.

అక్కడి లాభాలతోనే
నితిన్‌ తండ్రి కెనరాబ్యాంక్‌ ఉద్యోగి, తల్లి సంగీతం టీచర్‌. తల్లిదండ్రుల ఒత్తిడితో ఇంజినీరింగ్‌లో చేరినప్పటికీ అతడి మనసు స్టాక్‌ మార్కెట్‌పైనే ఉండేది. 18 ఏళ్లప్పట్నుంచీ షేర్లు కొనడం, అమ్మడం మొదలుపెట్టాడు నితిన్‌. 2000-01 ప్రాంతంలో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేసేవాడు. 2002 నాటికి తన దగ్గరున్న నాలుగు లక్షల రూపాయలూ పోగొట్టుకున్నాడు. కానీ అంతకంటే విలువైన అనుభవాన్ని సంపాదించాడు. తర్వాత ఓ కాల్‌ సెంటర్లో రాత్రిళ్లు పనిచేస్తూ పగటి పూట ట్రేడింగ్‌ చేసేవాడు. అదో వ్యసనంలా మారింది నితిన్‌కి. 2005 ప్రాంతంలో ఓ పరిచయస్తుడికి స్టాక్‌ మార్కెట్‌లో నితిన్‌కు ఉన్న అవగాహనపై నమ్మకంతో రూ.25 లక్షలిచ్చి తన వంతుగా పెట్టమన్నాడు. మర్నాడే ఉద్యోగానికి రాజీనామా చేసిన నితిన్‌ పూర్తిస్థాయి బ్రోకర్‌గా మారాడు. 2006లో స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థ ‘రిలయన్స్‌ మనీ’ ప్రారంభమైనపుడు ఆ సంస్థ సబ్‌ బ్రోకర్‌గా ఉన్నాడు. ఆ సంస్థకు 1000 మంది సబ్‌ బ్రోకర్లుంటే వారిలో 999మంది చేసిన వ్యాపారంకంటే ఎక్కువ చేసేవాడు నితిన్‌. మార్కెట్‌ నష్టాల్లోకి వెళ్లినపుడు ఎక్కువ పెట్టుబడి పెడితే లాభాలు బాగా వస్తాయనేది నితిన్‌ నేర్చుకున్న అనుభవ పాఠం. 2008లో మార్కెట్‌ బాగా నష్టాల్లోకి వెళ్లినపుడు పెట్టుబడి పెట్టి ఏడాది తర్వాత 800-900 శాతం లాభాలు పొందాడు. ఆ డబ్బు చేతికి వచ్చాక నితిన్‌ బ్రోకరేజీ నుంచి విరామం తీసుకుని నిఖిల్‌కి ఆ బాధ్యతలు అప్పగించాడు. అదే సమయంలో ఆన్‌లైన్‌ బ్రోకరేజ్‌ వ్యాపారాన్ని నిర్వహించే సంస్థ ప్రారంభం దిశగా అడుగులు వేశాడు నితిన్‌.

బెదిరింపులూ వచ్చాయ్‌
నితిన్‌, నిఖిల్‌ వ్యవస్థాపకులుగా 2010లో బెంగళూరు కేంద్రంగా జీరోదా ప్రారంభమైంది. స్టాక్‌ మార్కెట్లతోపాటు కరెన్సీ, కమొడిటీ ట్రేడింగ్‌లలో ఉన్న జీరోదాని స్థాపించడానికి షేర్లలో సంపాదించిన, స్నేహితుల నుంచి తీసుకున్న కొంత డబ్బు తప్పించి ఇతర పెట్టుబడిదారుల నుంచి కామత్‌ సోదరులు ఎలాంటి మొత్తాన్నీ తీసుకోలేదు. జీరో, రోదా... ఈ పదాల కలయికే జీరోదా. ‘అడ్డంకుల్లేని’ అనే అర్థంలో కంపెనీకి పేరుపెట్టారు. స్టాక్‌ మార్కెట్‌లో డబ్బులు పెట్టడం క్లిష్టమైన వ్యవహారమన్న సంగతి తెలిసిందే. అందుకే స్టాక్స్‌ ఎంపిక, ట్రేడింగ్‌... మొదలైన అంశాల్లో తమ అనుభవానికి సాంకేతికతను జోడించి జీరోదా ద్వారా ఆ పనిని సులభతరం చేశారు కామత్‌ సోదరులు. బ్రోకరేజీ వ్యాపారంలో పారదర్శకతని తీసుకొచ్చి పోటీ సంస్థలకు సవాలుగా నిలిచారు. దళారిగాకంటే కూడా సాంకేతిక సాయం అందించే విలువైన కంపెనీగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఎలాంటి దాపరికం లేకుండా బ్రోకరేజీ ఛార్జీల్ని ముందే స్పష్టంగా చెప్పేవారు. ట్రేడింగ్‌ చేయడానికి రూ.20 లేదంటే ట్రేడ్‌ విలువలో 0.1 శాతం ఏది తక్కువైతే ఆ మొత్తం వసూలు చేయడానికి నిర్ణయించారు. ఉద్యోగులకు బ్రోకరేజ్‌ లక్ష్యాలంటూ పెట్టకపోవడంద్వారా ఖాతాదారులచేత బలవంతంగా కొనుగోలు చేయించే సంప్రదాయానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. తరచూ వచ్చేవారి నుంచి ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయకపోవడం లాంటి మార్పులు తీసుకొచ్చారు. వీటన్నిటినీ వీరు ఎక్కడా ప్రచారం చేయకున్నా కూడా ఖాతాదారుల నోటిమాటగా జీరోదా గురించి అందరికీ తెలిసింది. ‘మీవల్ల మాకు నష్టాలు వస్తున్నాయి. రేట్లు పెంచండి’ అంటూ అప్పటికే మార్కెట్‌లో ఉన్న స్టాక్‌ బ్రోకర్లు నితిన్‌ను బెదిరించేవారు కూడా. పారదర్శకతతోపాటు ట్రేడింగ్‌లోని లోటుపాట్లు, స్టాక్‌మార్కెట్‌ నియమ నిబంధనల గురించి పెట్టుబడి పెట్టేవాళ్లకి ‘జీరోదా వర్సిటీ’, ‘జెడ్‌ కనెక్ట్‌’ పేర్లతో విలువైన సమాచారాన్నీ ఇస్తోంది జీరోదా. ట్రేడింగ్‌ చేసుకోవడానికి ఎంతో సులభమైన వెబ్‌సైట్‌, ఆప్‌లను రూపొందించారు.

వ్యాపారంలో వచ్చిన ఆదాయాన్ని మెరుగైన సాంకేతికత కోసం ఖర్చుచేయడానికి కామత్‌ సోదరులు వెనకాడలేదు. ‘రెయిన్‌మేటర్‌’ పేరుతో ఫిన్‌టెక్‌ విభాగంలోని స్టార్టప్‌ కంపెనీలకు తమ ఆఫీసులోనే ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటుచేశారు. దీనికోసం రూ.35కోట్లు కేటాయించారు. కొన్ని కంపెనీల్లో వాటాలూ కొన్నారు. ప్రస్తుతం దేశంలో 30 లక్షల మంది స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ సంఖ్యను 30 కోట్లకు చేర్చే లక్ష్యంతో పనిచేస్తోంది జీరోదా.

ప్రస్తుతం వీరికి మూడు లక్షలమంది ఖాతాదారులున్నారు. అయిదుగురితో మొదలైన కంపెనీలో ఇప్పుడు 600మంది ఉద్యోగులున్నారు. ఆరు శాతం స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు వీరి నుంచే జరుగుతున్నాయి. ఈ గణంకాలే జీరోదా విజయానికి నిదర్శనం.


 

ఇది తిరస్కారాల ‘గోడ’

మధ్య కారుణ్యపు గోడలు పలు చోట్ల వెలుస్తున్నాయి. అవసరంలో ఉన్న వారికి సహాయపడడానికి ప్రారంభించిన ఈ సంప్రదాయం త్వరగానే వ్యాపిస్తోంది. ఇదిలా ఉండగా సిడ్నీ టెక్నాలజీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడు నిక్‌ హాప్‌వుడ్‌ మరో కొత్త గోడ ప్రారంభించాడు. దాని పేరు వాల్‌ ఆఫ్‌ రిజెక్షన్‌... అంటే తిరస్కారాల గోడ. నిక్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పత్రికలకు బోలెడన్ని పరిశోధక వ్యాసాలు రాశాడు. ఇతర పరిశోధకులతో కలిసి పుస్తకాలు ప్రచురించాడు. అయితే అంతటి పరిశోధకుడికీ ఉద్యోగాల్లోనూ, పరిశోధనకి గ్రాంటుల మంజూరులోనూ, వ్యాసాల ప్రచురణలోనూ తిరస్కారాలు చాలానే ఎదురయ్యాయట. ఆ లేఖలన్నిటినీ భద్రంగా దాచుకున్న నిక్‌ తన కార్యాలయంలో ఓ గోడపై వాటిని ప్రదర్శించాడు. ఆ ఫొటోని ట్విటర్‌లో పెట్టేశాడు. ఇంకేముంది... ఆ ఐడియా చాలా మందికి నచ్చేసింది. ఈరోజుల్లో అవకాశాల కన్నా తిరస్కారాలే ఎక్కువ కదా, మేమూ ఏర్పాటుచేసుకుంటాం ఈ గోడ- అంటూ పలువురు స్పందించారు. ‘గోడ సరిపోదు... నాకైతే కారిడార్‌ మొత్తం కావాలి’, ‘అయ్యో మా ఆఫీసులో అంత పెద్ద గోడ లేదే..’ అంటూ కొందరు వ్యాఖ్యానించారు. కొందరు నిజంగానే చేసి మరీ ఆ ఫొటోలను పెట్టారు! రిజెక్షన్‌ లెటర్‌ని అవమానంగా భావించి దాచుకోకుండా దాని గురించి నలుగురితో చర్చించే వాతావరణం యూనివర్శిటీల్లో ఉండాలంటాడు నిక్‌. సున్నిత మనస్కులు తిరస్కరణ వల్ల నైౖతిక స్థైర్యం కోల్పోతారంటాడు. తిరస్కరణ అందరికీ ఎదురయ్యే అనుభవమేననీ, గొప్పవారూ దానికి అతీతులు కారనీ అందరికీ చెప్పడానికే నిక్‌ ఈ పని చేపట్టాడట. వైఫల్యాలను చర్చించడం వల్ల మనసు తేలిక పడి త్వరగానే మళ్లీ మరో ప్రయత్నానికి సిద్ధమవుతారన్నది నిక్‌ వాదన. దీనికి వస్తున్న స్పందన చూస్తుంటే నిక్‌ ఆలోచన నూటికి నూరుపాళ్లూ నిజమేననిపిస్తోంది కదూ.


 

రైతన్నా... నీకు మేమున్నాం!

పగలనకా రేయనకా ఎండనకా వాననకా ఆరుగాలం కష్టపడి రైతు పంట సాగు చేస్తే కానీ జనం నోట్లోకి మెతుకు వెళ్లదు. అందరి ఆకలి తీర్చి, ప్రాణం పోసే ఆ రైతు మాత్రం అప్పులపాలై అష్టకష్టాలూ పడుతున్నాడు. ఆత్మహత్యతో తనువు చాలిస్తున్నాడు. అలాంటి అన్నదాత కుటుంబాలను ఆదుకోవడానికి నేనున్నానంటూ ముందుకొస్తోంది రైతు స్వరాజ్యవేదిక.

రక పట్టినప్పటి నుంచీ పంట చేతికొచ్చి, అమ్ముడుపోయే వరకూ రైతుకి రోజూ ఓ గండమే. ఎంతో ఆశతో దుక్కి దున్ని నాట్లు వేశాక, వర్షాలు పడకపోతే ఓ కష్టం. భారీ వర్షాలు కురిస్తే మరో నష్టం. కలుపు మొక్కలు, చీడపీడ బాధలు మరోవైపు. ఎలాగోలా గట్టెక్కాం, పంట చేతికొచ్చింది, ధాన్యాన్ని అమ్ముకుందామనేసరికి దళారుల మోసాలూ గిట్టుబాటు ధరలు లేకపోవడం... ఇలా అడుగడుగునా ఎదురయ్యే అవాంతరాలు అన్నం పెట్టే రైతన్నలను అప్పుల పాలు చేస్తున్నాయి. దాంతో ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక, అసలే కష్టాల్లో ఉండి, ఆ పైన పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబాల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సమస్యలపై పోరాడేందుకు 2010లో హైదరాబాద్‌కి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త డా.జి.వి రామాంజనేయులు, కన్నెగంటి రవి, సామాజిక వేత్త విస్సా కిరణ్‌కుమార్‌లు జాతీయ స్థాయిలో కిసాన్‌ స్వరాజ్‌ యాత్రను ప్రారంభించారు. అందులో భాగంగా పుట్టుకొచ్చిందే ‘రైతు స్వరాజ్య వేదిక’. తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఈ సంస్థ ద్వారా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల అవసరాన్ని బట్టి బియ్యాన్ని పంపిణీ చెయ్యడం, వారి కుటుంబాల్లో పిల్లల చదువాగిపోకుండా ఆర్థికసాయం చెయ్యడం... లాంటివి చేస్తుంటారు. ఇంటర్‌ చదువుతుంటే ఏడాదికి రూ.అయిదువేలూ డిగ్రీ చదువుతుంటే మూడు సంవత్సరాలపాటు ఏటా నాలుగు వేల రూపాయల చొప్పున ఇస్తూ ఇప్పటివరకూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల జిల్లాల్లోని ఎంతోమంది విద్యార్థుల చదువుకు సాయం చేసింది రైతు స్వరాజ్యవేదిక. ఒక్క కడపలోనే దీనికోసం రూ.14.50 లక్షల రూపాయలను ఖర్చుపెట్టారు.

 

ఎన్నో సంస్థల తోడుగా...
తాము చేసే సేవాకార్యక్రమాల్లో వేరు వేరు స్వచ్ఛంద సంస్థలూ కార్పొరేట్‌ సంస్థల్ని కూడా భాగస్వాములుగా చేస్తోంది ఈ సంస్థ. అందులోభాగంగానే గటికింటెట్సు ఎక్స్‌ప్రెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సహకారంతో రెండేళ్ల కిందట నూటయాభై కుటుంబాలకు 75కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చెయ్యగా, గతేడాది ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొన్ని కుటుంబాలకు కుట్టు మెషీన్లను ఉచితంగా ఇచ్చారు. కేరింగ్‌ సిటిజన్‌ కలెక్టివ్‌ సంస్థ తరఫున 60 కుటుంబాలకు రూ.అయిదు వేలూ 18 కుటుంబాలకు రూ.10వేలూ, ఐఫోర్‌ఫార్మర్స్‌ సంస్థ సాయంతో 28 కుటుంబాలకు రూ.10వేల చొప్పున అందజేశారు. ఇలాగే, తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం, హైదరాబాద్‌లోని సెయింట్‌ పాయిస్‌ మహిళా పీజీ కళాశాల... లాంటి సంస్థలూ ఆర్థికసాయాన్ని అందించాయి.

 

ఎవరైనా సాయం చేయొచ్చు
ఇక, రైతు కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందే సాయం కోసం దరఖాస్తులు ఎలా నింపాలీ ఎక్కడ ఇవ్వాలీ అనేవాటి మీద కూడా అవగాహన కల్పిస్తారు స్వరాజ్యవేదిక సభ్యులు. వ్యవసాయదారులు బయటి అప్పుల జోలికి పోకుండా బ్యాంకులు వారికిచ్చే రకరకాల రుణాలూ వాటిని చెల్లించే విధానాల గురించీ వివరిస్తారు. బ్యాంకు అధికారులను కలసి పేదరికంలో ఉన్న రైతు కుటుంబాలకు అదనంగా రుణం ఇప్పించేందుకూ సాయపడుతుంటారు. రైతులకు వ్యవసాయ అనుబంధ రంగాలపట్ల ఆసక్తి ఉంటే రాయితీ పథకాలు వర్తింపజేసేందుకూ కృషి చేస్తున్నారు. అంతేకాదు, గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి లాభసాటి వ్యవసాయం ఎలా చెయ్యాలనే విషయంపైన మెలకువలు నేర్పించడం, వ్యవసాయపరంగా గ్రామాల్లో ఎదురయ్యే ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం... లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతులకు అండగా నిలుస్తోంది రైతు స్వరాజ్యవేదిక.

ఈ సంస్థ అనుబంధ సంఘం ‘పిలుపు’ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు చెందిన పిల్లలకు కంప్యూటర్‌ శిక్షణ అందిస్తున్నారు. ‘వ్యాపార సంస్థలూ స్వచ్ఛంద సంస్థలే కాదు, తాముగా ఎవరైనా మంచి మనసుతో రైతు స్వరాజ్యవేదిక తరఫున సాయం చేయాలనుకున్నా చెయ్యొచ్చు. అలా పిల్లల చదువుకు ఆర్థిక సాయం చెయ్యడం, వారి బస్సు పాసులకు డబ్బు కట్టడం లాంటివి చేస్తున్నారు కొందరు’ అంటారు ఆదిలాబాద్‌ జిల్లా రైతుస్వరాజ్యవేదిక అధ్యక్షుడు సంగెపు బొర్రన్న. వ్యవసాయదారులు నిత్యం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు రైతు స్వరాజ్యవేదిక ప్రత్యేక సెల్‌ను కూడా ఏర్పాటు చేసింది. సాగు నీరు, తాగు నీరు, పశుగ్రాసం, పశువుల తాగునీటికి ఇబ్బంది ఉన్నా టోల్‌ఫ్రీ నెంబరు 18004255193కి ఫోన్‌ చేసి సమస్యను వివరిస్తే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం విషయంలో ఆలస్యం జరగడం లేదా ఇతర సమస్యలుంటే 8106318135, 9490881404 నంబరుకి ఫోన్‌ చేస్తే అవసరమైన సలహాలనూ సాయాన్నీ అందిస్తారు.

అన్నంపెట్టే రైతన్నకు అండగా నిలబడుతున్న రైతు స్వరాజ్యవేదికకు జేజేలు పలకాల్సిందే..!

- మంద రామచంద్రం, ఈనాడు, ఆదిలాబాద్‌ డెస్కు
పొటోలు: లక్ష్మణ్‌, ఇచ్చోడ

 

ఇది పిల్లలకు నచ్చే బడి!

వాళ్లు కథలూ నవలలూ రాస్తారు, గోడలమీద పెయింటుతో చూడచక్కని బొమ్మలు వేస్తారు, రకరకాల కళాకృతులను తయారు చేసి గదుల్ని అలంకరిస్తారు, ఇటుకల్ని పేర్చి సిమెంటుతో అరుగుల్ని కడతారు, అప్పుడప్పుడూ గరిటె కూడా పడతారు... ఇంకా చాలా బాగా చదువుతారు. ఇంతకీ వాళ్లెవరు అంటారా... విజయవాడలోని అభ్యాస విద్యాలయం విద్యార్థులు. అసలైన అభ్యాసం ఇదీ... అని నిరూపిస్తున్న ఆ పాఠశాల గురించి చెప్పాలంటే ఇలాంటి ప్రత్యేకతలు ఇంకెన్నో.

దేనికైనా పునాది బాగుండాలంటారు. అలాగే బాల్యంలో మనం ఏం నేర్చుకున్నాం, ఎన్ని మంచి అనుభవాలున్నాయన్నదానిమీదే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకే, అందులో చదువుతో పాటు ప్రపంచజ్ఞానం ఆటలూ పాటలూ సరదాలూ అన్నీ ఉండాలి... కానీ ఇప్పటి విద్యావిధానం అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతోంది. దాంతో పిల్లలు చిన్నవయసులోనే మానసికంగా శారీరకంగా కుంగిపోతున్నారు. తనవంతుగా ఆ పరిస్థితిలో కొంతైనా మార్పు తేవాలనే ఉద్దేశంతో విజయవాడకు చెందిన కనపర్తి జ్యోత్స్న నడుపుతున్నదే అభ్యాస విద్యాలయం. ఆమె తన కూతురు దీప జ్ఞాపకార్థం స్థాపించిన ‘దీప మెమోరియల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ ఆధ్వర్యంలో 1993లో దీన్ని ప్రారంభించారు. ప్రిన్సిపల్‌ వై.వి.కృష్ణ దీనికి మూలస్తంభం వంటివారు. విజయవాడలో పచ్చదనం అద్దినట్లుండే గుణదల కొండపై, రణగొణ ద్వనులకు దూరంగా ఉండే అభ్యాస పాఠశాలలో పదోతరగతి వరకూ ఉంది. ఆరు నుంచి ఎస్‌సీఈఆర్‌టీ సిలబస్‌ ఉండే ఇక్కడ ఒకటి, రెండు, మూడు... అంటూ ప్రత్యేకంగా తరగతి గదులుండవు. సైన్స్‌ గది, లెక్కల గది, తెలుగు గది... ఇలా ఒక్కో పాఠ్యాంశానికీ ఓ పరిశోధనశాల ఉంటుంది. ప్రతి తరగతిలోని విద్యార్థులూ గంట గంటకూ ఓ గదికి వచ్చి పాఠాలు ప్రయోగపద్ధతిలో నేర్చుకుంటారు. లెక్కల గదిలో కిరాణా కొట్టులో ఉండే సామగ్రీ హోటల్లో ఇచ్చే మెనూ కార్డులూ తూనికలూ కొలజాడీల్లాంటివి కనిపిస్తాయి. వందరూపాయలకు ఎన్ని సరకులు వస్తాయి, రాయితీపై ఎలా కొనుగోలు చెయ్యొచ్చు... ఇలా రకరకాలుగా లెక్కలు చేయిస్తారు. దాంతో పిల్లలు ఆడుకున్నంత తేలికగా నేర్చుకుంటారు. ఇక, తెలుగు గదిలోకి వెళ్తే చిన్నారులు రాసిన కథలు అచ్చైన పుస్తకాలు ఎన్నో దర్శనమిస్తాయి. ఇక్కడ ఒకటో తరగతి నుంచే ఓ చిన్నారి తనకు వచ్చిన కల గురించి కథ రాస్తుంది, మరో పిల్లాడు కుటుంబం గురించి రాస్తాడు. ఒక్కోసారి ఉపాధ్యాయులు సగం కథ చెప్పి వదిలేసి, మిగతా సగం సొంతంగా రాయమంటారు. ఇలా పిల్లలు నాలుగో తరగతికి వచ్చేసరికి నవలలూ పాటలూ నాటకాలు కూడా రాయడం విశేషం. ‘పరిసరాల విజ్ఞానం అంటే గదిలో కూర్చుని నేర్చుకునేది కాదు, మొక్క గురించి తెలుసుకోవాలంటే గింజను నాటి అది మొక్క ఎలా అవుతుందో చూపించాలి’ అన్నది అభ్యాస నినాదం. వారానికి ఓసారి పాఠశాలలో పిల్లలతో కలసి చిన్న చిన్న వంటకాలు కూడా చేస్తారు ఉపాధ్యాయులు.

 

బంగరు భవితకు...
‘పిల్లలు ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. ఆవైపు వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్తును గొప్పగా మలుచుకునే అవకాశం ఇచ్చినవాళ్లమవుతాం. అందుకే, మేం ఆటలూ, పాటలూ, కథలూ, నాటకాలూ, కళలు... లాంటి ఎన్నో విషయాల్లో పిల్లలు ప్రావీణ్యం పొందేలా తీర్చిదిద్దుతాం. ఇవి మనసును ఉత్తేజంగానూ ఉంచుతాయి. మా పాఠశాలలో గోడలమీద కనిపించే బొమ్మలు పిల్లలు వేసినవే. బడి బయట సిమెంటు అరుగులు చిన్నారులు కట్టినవే. తరగతి గదుల్లో అలంకరించిన కళాకృతులు విద్యార్థుల సృజనకు అద్దాలు. ఏమో ఎవరికి తెలుసు... భవిష్యత్తులో చదువైపోయాక ఇప్పుడు కట్టిన చిన్న అరుగులు వారిని మేటి ఇంజినీర్లుగా చేసే పునాదులు కావొచ్చు. రాసిన చిట్టి చిట్టి కథలు వారిని గొప్ప రచయితలుగా మార్చొచ్చు. లేదు, చదివిన చదువుతో ఏదైనా సంస్థను స్థాపిస్తే అన్ని అనుభవాలూ కలగలసి పనికిరావొచ్చు’ అంటారు ప్రిన్సిపల్‌ కృష్ణ(ఫోన్‌ నం. 9440579922). ఈ విద్యాలయం హోంవర్కుల సంస్కృతికీ విరుద్ధం. విద్యార్థుల పుస్తకాలన్నీ బడిలోనే ఉంటాయి. ఇక, ర్యాంకుల గోల, అసూయను పెంచే పోటీలూ, శిక్షించడంలాంటివీ ఇక్కడ కనిపించవు. అయినా విద్యార్థులు పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. ఎన్‌ఐడి, ట్రిపుల్‌ ఐటి లాంటి విద్యా సంస్థల్లో సీట్లు సంపాదిస్తున్నారు. ‘అభ్యాస విద్యాలయం’ ఫేస్‌బుక్‌ పేజీ వారి ప్రతిభను కళ్లకు కడుతుంది.

 

యాభై శాతం మందికి ఉచితం
పేద పిల్లలకు కూడా ఉత్తమ విద్యాబోధన అందాలనే ఉద్దేశంతో విద్యార్థుల్లో 50శాతం మందికి ఫీజుల్ని దీప మెమోరియల్‌ ట్రస్ట్‌ సేకరించిన విరాళాలతో చెల్లిస్తున్నారు మేనేజింగ్‌ ట్రస్టీ జ్యోత్స్న. మిగతా పిల్లల నుంచి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి వసూలు చేస్తారు. పాఠశాల నిర్వహణకు ఇవే ఆధారం. ‘మరింత ఎక్కువ మందికి ఉచితంగా విద్యనందించాలని ఉన్నా నిధుల కొరత వల్ల చెయ్యలేకపోతున్నాం. ఉపాధ్యాయుల కొరత కూడా వేధిస్తోంది’ అంటారు జ్యోత్స్న.

చిన్నారులకు ఇంత మంచి విద్యను అందిస్తున్న వీరిని మెచ్చుకుని తీరాల్సిందే కదూ..!

- మరిసెర్ల.జగదీష్‌ కుమార్‌, ఈనాడు, అమరావతి
ఫొటోలు: బి.మరిడయ్య

 

ఒక్క అడుగు... తీరాన్ని తీర్చిదిద్దే దిశగా..!

ఒక్క అడుగు... పరిశుభ్రతవైపు... అనేది ప్రభుత్వ నినాదం. కానీ తన సొంత ఆలోచనలతో వేల అడుగుల్ని పరిశుభ్రత దిశగా నడిపించాడు ముంబయికి చెందిన అఫ్రోజ్‌ షా. ఏళ్లతరబడి వ్యర్థాల గుట్టగా ఉన్న అక్కడి రెండున్నర కిలోమీటర్ల పొడవైన బీచ్‌ను ఆహ్లాదకరంగా మార్చేశాడు. ఇటీవలే ప్రధాని మన్‌కీబాత్‌లో ప్రస్తావించిన ఈ ముందడుగు గురించి తెలుసుకోవలసిన స్ఫూర్తిదాయక విషయాలెన్నో ఉన్నాయి.