close
స్పైస్‌జెట్‌ వెనక ఒకేఒక్కడు!

స్పైస్‌జెట్‌ వెనక ఒకేఒక్కడు!

రెండున్నరేళ్ల కిందటి మాట... అప్పుల వూబిలో కూరుకుపోయిన స్పైస్‌జెట్‌, మరో కింగ్‌ఫిషర్‌ కానుందని భావించారందరూ. అలాంటి పరిస్థితి నుంచి బయటపడి ప్రస్తుతం 200 విమానాల కొనుగోలుకు ఆర్డరు ఇచ్చిందా సంస్థ.
‘మా విమానాలు కొనుగోలు చేస్తూ మా దేశంలో ఉపాధి కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసల్నీ అందుకుంది. రెక్కలు తెగిన స్పైస్‌జెట్‌ని ఫినిక్స్‌లా మార్చి మళ్లీ ఎగిరేలా చేసిన ఆ వ్యక్తి, శక్తి... సంస్థ ఛైర్మన్‌ అజయ్‌ సింగ్‌.

మీరు స్పైస్‌జెట్‌ను తీసుకుంటారా..?2014 సెప్టెంబరులో స్పైస్‌జెట్‌ ప్రధాన వాటాదారు, సన్‌గ్రూప్‌ ఛైర్మన్‌ కళానిధి మారన్‌... సంస్థలో నాలుగున్నర శాతం వాటా ఉన్న అజయ్‌ సింగ్‌కు ఫోన్‌చేసి అడిగిన ప్రశ్న. ‘మీరు స్పైస్‌జెట్‌ను తీసుకోండి. లేదంటే అది దివాలా తీస్తుంది’ అన్న మారన్‌ మాటలకు... ‘నాకు కొంత సమయం కావాల’ని బదులిచ్చారు సింగ్‌. అప్పటికే స్పైస్‌జెట్‌ రుణ భారం గురించి వింటున్న సింగ్‌, మరింత లోతుగా అధ్యయనం చేయాలనుకున్నారు. సింగ్‌కు మారన్‌ ఫోన్‌ చేయడం వెనుక ఒక చారిత్రక కారణం ఉంది. 1996కి ముందు కొన్నాళ్లు విమానాలు నడిపి తర్వాత సేవల్ని నిలిపివేసిన ‘రాయల్‌ ఎయిర్‌వేస్‌’ సంస్థను మరికొందరితో కలిసి సింగ్‌ 2004లో కొన్నారు. రూ.50కోట్లు పెట్టి సంస్థలో 20 శాతం వాటా పొందారు సింగ్‌. సంస్థకు ‘స్పైస్‌జెట్‌’ పేరును సూచించిందీ ఆయనే. ప్రారంభంలో ‘ఆపరేషన్స్‌ హెడ్‌’గా సంస్థ రోజువారీ నిర్వహణ వ్యవహారాలను చూసుకునేవారు. 2005 మేలో సేవలు ప్రారంభించింది స్పైస్‌జెట్‌. ‘ఎంతో ఉత్సాహంతో ప్రారంభించిన ప్రాజెక్టు అది. ప్రచారానికి మా దగ్గర డబ్బు కూడా లేదు. కానీ టికెట్ల బుకింగ్‌ తెరిచిన మొదటిరోజే అన్నీ అయిపోయాయి’ అని గుర్తుచేసుకుంటారు సింగ్‌. 2008నాటికి ఆ సంస్థ లాభాల బాట పట్టింది. 2010నాటికి సుమారు రూ.800 కోట్ల లాభాల్లో ఉంది. అదే సంవత్సరం సంస్థలో అత్యధిక శాతం వాటాని మారన్‌ కుటుంబం కొంది. తర్వాత నాలుగేళ్లపాటు స్పైస్‌జెట్‌ నిర్వహణ బాధ్యతను ఆ కుటుంబమే చూసుకుంది. ఆ వ్యవధిలో తన వాటాని 4.5 శాతానికి తగ్గించుకున్నారు సింగ్‌.

ఫోన్ల స్ఫూర్తితో విమానాలు
స్పైస్‌జెట్‌ నిర్వహణ బాధ్యతల నుంచి బయటకు వచ్చాక ‘డేవూ మోటార్స్‌’ భారతీయ విభాగాన్ని కొన్నారు సింగ్‌. కానీ ఆ వ్యాపారం అంత విజయవంతం కాలేదు. తర్వాత కొన్ని అంకుర సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ప్రచారసారథుల్లో ఒకరిగా ఉన్నారు. ‘అబ్‌కీ బార్‌ మోదీ సర్కార్‌’ అన్న నినాదం ఆయనదేనంటారు కొందరు. సింగ్‌ మంచి కార్యదక్షుడు. 1996 ప్రాంతంలో 30 ఏళ్ల వయసులోనే దిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. అప్పటికి ఆ సంస్థ 300 బస్సులూ, 40వేల మంది ఉద్యోగులతో నష్టాల్లో నడిచేది. బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరాన్ని గుర్తించి అందుకు అవసరమైన నిధుల్ని సమీకరించారు సింగ్‌. ఉద్యోగులచేత ఉత్సాహంగా పనిచేయించి రెండున్నరేళ్లలో సంస్థ ఆరువేల బస్సుల్ని నడిపే స్థాయికి వెళ్లేలా చేశారు. ఆ సమయంలోనే అప్పటి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ దృష్టిని ఆకర్షించారు సింగ్‌. ఆయన్ని దూర్‌దర్శన్‌కు తీసుకొచ్చారు మహాజన్‌. సింగ్‌ సలహాతోనే డీడీ స్పోర్ట్స్‌, డీడీ న్యూస్‌ ఛానెళ్లు వచ్చాయి. తర్వాత మహాజన్‌తోపాటు టెలీ కమ్యునికేషన్స్‌ విభాగంలో పనిచేశారు. అప్పుడే భారతీయులు అవసరంకంటే కూడా ధర గురించి ప్రధానంగా ఆలోచిస్తారని ఆయనకు అర్థమైంది. ఎందుకంటే, ఫోన్‌ కాల్స్‌ రేట్లని కొద్దిగా తగ్గించినపుడు దేశంలో మొబైల్‌ ఫోన్ల సంఖ్య 40 రెట్లు పెరిగింది. అలాంటి అవకాశమే విమానయానంలోనూ ఉందని గ్రహించి స్పైస్‌జెట్‌తో అటువైపు అడుగులు వేశారు. నయా భారత్‌, యువ భారత్‌కు ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ రైలు ధరల్లోనే విమాన సేవలు అందించవచ్చని నమ్మారు సింగ్‌.

మళ్లీ ఫోన్‌ వచ్చింది
2014 నవంబరు... మళ్లీ మారన్‌ నుంచి సింగ్‌కు ఫోన్‌... ‘వెంటనే ఏదో ఒకటి చెప్పండి. లేదంటే ఈ క్షణమే సర్వీసులు నిలిపేస్తాం’ అన్నది మారన్‌ మాట. అప్పటికే గోల్డ్‌మేన్‌ శాక్స్‌ సంస్థ స్పైస్‌జెట్‌కు దివాలా సంస్థగా రేటింగ్‌ ఇచ్చింది. దాదాపు రూ.3000కోట్ల రుణాలు, వాటిలో సగం మేరకు తక్షణమే చెల్లించాల్సిన రుణాలు. ఇక సమయంలేదని గ్రహించిన సింగ్‌ స్పైస్‌జెట్‌ను తీసుకుంటానని మారన్‌కి చెప్పారు. ప్రథమంగా నిధుల సమీకరణ చేసి ప్రయాణ సేవల్ని కొనసాగించడం, ఆపైన రుణ విముక్తి కల్పించడం... లక్ష్యాలుగా పెట్టుకున్నారు. 2014 డిసెంబరు చివరినాటికి సంస్థ నిర్వహణ బాధ్యతలు సింగ్‌ చేతికి వచ్చాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే మారన్‌ల వాటా సింగ్‌ పేరున మారింది. ఈరోజు సగానికిపైగా వాటా సింగ్‌ పేరున ఉంది.

నష్టాలెందుకంటే...
మారన్‌ల కాలంలో స్పైస్‌ జెట్‌ పోటీ సంస్థలకు తగ్గట్టు ధరల్ని ఎప్పటికప్పుడు మార్చేది కాదు. విమానసేవల్ని విస్తృతం చేసింది, కానీ ఫ్రీక్వెన్సీని మాత్రం తగ్గించింది. ఒకచోటుకి వెళ్లిన విమానాలు కొన్నిసార్లు మర్నాడుగానీ తిరిగి వచ్చేవి కాదు. దాంతో అవి అధిక సమయం నిరుపయోగంగానే ఉండేవి. దానికి తోడు ప్రకటనలకు అధికంగా ఖర్చుచేశారు. అన్నింటికంటే ముఖ్యంగా యాజమాన్య శూన్యత ఏర్పడింది. సంస్థ ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంటే, మారన్‌లు మాత్రం చెన్నైలో ఉండేవారు. ‘అత్యంత పోటీ ఉండే ఈ రంగంలో యజమానులు రోజువారీ విధుల నుంచి తప్పుకోలేరు’ అని చెబుతారు అజయ్‌ సింగ్‌. ఈ పరిణామాలతో స్పైస్‌జెట్‌ మారన్‌ల చేతుల్లోకి వెళ్లిన ఏడాదికే నష్టాలు మొదలయ్యాయి. విమానాల రద్దు నిత్యకృత్యంగా మారింది. విమానాల్ని లీజుకు ఇచ్చిన సంస్థల్లో కొన్ని తమ విమానాల్ని వెనక్కి తీసుకున్నాయి. స్పైస్‌జెట్‌ పరిస్థితిని గమనించిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) నెల రోజులకు మించి ముందస్తు టికెట్లను అమ్మొద్దని ఆ సంస్థకు నిబంధన పెట్టింది. అది ఆదాయంపైన ప్రభావం చూపింది. చివరకు ఉద్యోగులకు జీతాలూ ఇవ్వలేని పరిస్థితి. ఈ పరిణామాలతో 2014 డిసెంబరు 17న స్పైస్‌జెట్‌ సర్వీసులన్నీ నిలిచిపోయాయి. ఆ నెలలో మొత్తం 2000 సర్వీసుల్ని సంస్థ రద్దుచేసింది. పరిస్థితి అలాగే కొనసాగితే మొదటికే మోసమని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుకొచ్చారు సింగ్‌. ‘నేను సృష్టించిన బ్రాండ్‌ కనుమరుగవడం నాకు రుచించలేదు. ఇది రక్షించాల్సిన సంస్థ కూడా అనిపించింది’ అంటూ తాను రంగంలోకి దిగడానికి వెనుక కారణం చెబుతారాయన.

రూపాయికే విమానయానం
సంస్థను గట్టెక్కించడానికి విమానయాన రంగంలో ప్రాథమిక వ్యాపార సూత్రాలను అనుసరిస్తూ స్వల్ప వ్యవధిలోనే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు సింగ్‌. వాటిలో... తక్కువ రద్దీ ఉండే మార్గాల్లో విమానాల్ని రద్దు చేయడం, సకాలంలో విమానాల్ని నడపడం, కొన్ని మార్గాల్లోనే ఎక్కువ ఫ్రీక్వెన్సీతో, తక్కువ ధరకు సేవల్ని అందించడం మొదలైనవి ఉన్నాయి. మొత్తంగా 70 శాతం షెడ్యూల్‌ని మార్చారు. రుణాలు చెల్లించడానికి రూ.2000 కోట్లు తక్షణం అవసరమవగా... కొత్త అప్పులకోసం రాననీ, పాత అప్పులు చెల్లించడానికి కొంత సమయం ఇవ్వమనీ ఆయా సంస్థల్ని అడిగారు. అందుకు వాళ్లూ సహకరించారు. ఎందుకంటే వారందరూ సింగ్‌తో ఇదివరకు పనిచేశారు. ఇంధనం, ఉద్యోగుల జీతాలు మొదలైన తక్షణ అవసరాలకు వెయ్యి కోట్లను వివిధ మార్గాల్లో సమీకరించారు. ‘విమాన సర్వీసు రద్దు’ అనే మాట వినిపించకుంటే, అంతా సర్దుకుంటుందని ముందు ఆ ప్రయత్నం చేశారు సింగ్‌. 2010లో తాను బయటకు వెళ్లాక సంస్థను వీడి వెళ్లిన వాళ్లలో కీలక వ్యక్తుల్ని మళ్లీ రప్పించారు. వార్షిక వేతనం రూ.2కోట్లకు మించి ఉన్న సీనియర్‌ మేనేజర్లను తొలగించి వారి స్థానాల్లో కొత్తవాళ్లని నియమించి ఆయనే నేరుగా పర్యవేక్షించేవారు. అలా వార్షిక జీతాల్లో రూ.20 కోట్లు తగ్గించగలిగారు. లాభాల్లోకి వచ్చేంతవరకూ తాను జీతం తీసుకోరాదని నిర్ణయించుకున్నారు. వీటికితోడు విమానాలు సకాలంలో ప్రయాణించేలా చేయడం, భద్రత, శుభ్రతలో రాజీ లేకుండా నడుపుతూ ప్రయాణికుల్ని సంతోషపరచడమే లక్ష్యంగా మార్పులు తెచ్చారు. ముఖ్యంగా ధరల విషయంలో మధ్య తరగతిని సైతం ఆకర్షించగలిగారు. 2015 జులైలో ‘ఎంపిక చేసిన సర్వీసుల్లో రూపాయికే విమానయానం’ అవకాశం కల్పిస్తూ లక్ష టికెట్లను అందుబాటులోకి తెచ్చింది స్పైస్‌జెట్‌. ఈ మార్పులు స్వల్పవ్యవధిలోనే సత్ఫలితాల్ని ఇచ్చాయి. సింగ్‌ వచ్చిన మూడు నెలల్లోనే చమురు సంస్థలూ, విమానాశ్రయాలూ, విమాన నిర్వహణ సంస్థలకు చెల్లించాల్సిన బాకీలను సంస్థ చెల్లించింది. స్పైస్‌జెట్‌ 2014లో రోజుకు రూ.2.8 కోట్ల నష్టాన్ని చవిచూస్తే 2015లో రోజూ రూ.కోటి లాభాల్ని పొందేది. ఆ సమయంలో ఇంధన ధరలు తగ్గడం కూడా కలిసొచ్చింది.

సమయపాలనలో ముందు!
‘ఒకే పనిని రెండోసారి చేసే అవకాశం అందరికీ రాదు. కానీ, నాకు వచ్చింది. దాంతో నాకంటే ముందు సంస్థను నడిపిన వారి తప్పుల్ని సరిదిద్దడంతోపాటు నేను మొదటిసారి చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకున్నాను. కింగ్‌ఫిషర్‌ దివాలాతో ఏ ఒక్కరికీ లాభం జరగలేదు. అలాంటివి పునరావృతం కారాదని ప్రభుత్వం కొంత చేయూతనిచ్చింది’ అంటారు సింగ్‌. 90 రోజులవరకూ టికెట్లని రిజర్వేషన్‌ చేసుకునే వెసులుబాటుని కల్పించడం, ప్రభుత్వ రంగంలోని విమానాశ్రయాలూ, ఇంధన సంస్థల బకాయిలు తీర్చడానికి సమయం ఇవ్వడంలాంటి అంశాల్లో ప్రభుత్వం సహకరించింది. ‘వీటన్నిటికంటే ముఖ్యంగా వినియోగదారులు తక్కువ ఛార్జీలు వసూలుచేసే స్పైస్‌జెట్‌కి దూరంకాలేదు. మా సేవలు మెరుగవ్వగానే ప్రయాణికులు రావడం మొదలుపెట్టారు. ఏజెంట్లూ, భాగస్వాములూ అడ్వాన్స్‌లు ఇవ్వడానికి ముందుకువచ్చారు. దాంతో మొదటి త్రైమాసికంలోనే మార్పు వచ్చింది. ఇప్పటికీ పోటీ సంస్థలు మాకంటే ఎక్కువగానే ఛార్జ్‌ చేస్తున్నాయి’ అంటారు సింగ్‌. 2014లో ఆరేడు శాతంగా ఉన్న స్పైస్‌జెట్‌ మార్కెట్‌ ప్రస్తుతం 13 శాతానికి పెరిగింది. సింగ్‌ వచ్చిన ఆరు నెలల నుంచి నేటివరకూ స్పైస్‌జెట్‌లో 92 శాతం సీట్లు నిండుతున్నాయి. స్పైస్‌జెట్‌ విమానాలు ప్రయాణికుల్ని సకాలంలో చేర్చడంలో అందరికంటే ముందున్నాయి. ప్రయాణికులకు వేడివేడి ఆహారం అందిస్తోంది ఈ సంస్థ. ప్రీమియం ఎకానమీలో సీట్ల మధ్య మిగతావారికంటే ఆరు అంగుళాల స్థలం అదనంగా ఇస్తున్నారు.

అమెరికాకు చెందిన విమాన తయారీ సంస్థలు బోయింగ్‌, బొంబార్డియర్‌లతో పదేళ్లలో వివిధ విడతల్లో రూ.1.69 లక్షల కోట్ల విలువైన 200 విమానాల్ని కొనడానికి ఒప్పందం కుదుర్చుకుంది స్పైస్‌జెట్‌. ఈ అంశంలోనే ఈ సంస్థని ట్రంప్‌ ఇటీవల కొనియాడారు. 2014 సెప్టెంబరు నాటితో పోల్చితే సంస్థ షేరు ధర ఎనిమిది రెట్లు పెరిగింది. ఈ ఏడాది జనవరితో పోల్చితే రెట్టింపు అయింది. ఇదంతా అజయ్‌ సింగ్‌ ఒక్కరివల్లే సాధ్యం కావడం విశేషం.

ఇంకొంత

ఐటీ దిల్లీలో ఇంజినీరింగ్‌, అమెరికాలోని కార్నెల్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చేశారు.
* కుటుంబానికి చెందిన స్థిరాస్తి, ఫ్యాషన్‌ యాక్సెసరీస్‌ వ్యాపారంలో కొన్నాళ్లు ఉన్నారు. ప్రస్తుతం భార్య శివానీ, కుమార్తె అవని ఈ వ్యాపారాన్ని చూస్తున్నారు.

* దిల్లీలోని సెయింట్‌ కొలంబాస్‌ స్కూల్‌ క్రికెట్‌, హాకీ జట్లకి కెప్టెన్‌. ఆ సమయంలో షారుక్‌ ఖాన్‌ క్రికెట్‌ జట్టుకి వికెట్‌ కీపర్‌.

* ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో దిల్లీలో లోఫ్లోర్‌ బస్సులు నడుపుతున్నారు.

* బాలీవుడ్‌ సినిమాలు తరచూ చూస్తారు.

* ప్రస్తుతానికి దేశ జనాభాలో మూడు శాతం మాత్రమే విమానాల్లో ప్రయాణిస్తున్నారనీ దేశవ్యాప్తంగా 300లకు పైగా పట్టణాలూ, చిన్న నగరాల్లో విమానాశ్రయాలు వినియోగంలోకి వస్తే విమానయానం మరింత ఆకర్షణీయంగా ఉంటుందనీ చెబుతారు.

* స్పైస్‌జెట్‌ విలువ రూ.8000 కోట్లని అంచనా. సంస్థ విమానాలకు మింట్‌, కొరియాండర్‌, పెప్పర్‌ అని పేర్లు ఉంటాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.