close
కాంభోజ రాజ్యానికి వెళ్లొచ్చాం..!

కాంభోజ రాజ్యానికి వెళ్లొచ్చాం..!

‘‘మహోన్నత ఖ్మేర్‌ శిల్పకళా చాతుర్యానికీ హిందూ సాంస్కృతిక వైభవానికీ ప్రత్యక్ష నిదర్శనమే కంబోడియాలోని అంకోర్‌వాట్‌ దేవాలయం. అందుకే ఆ ఆలయాన్ని ప్రత్యక్షంగా చూసి రావాలన్న కోరికతో ఆ దేశానికి ప్రయాణమయ్యాం’’ అంటూ తమ పర్యటన విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన మత్స్యరాజ హరగోపాల్‌.

హైదరాబాద్‌ నుంచి హాంకాంగ్‌ మీదుగా ఆ దేశ ముఖ్యనగరాల్లో ఒకటైన సియాంరీప్‌కు చేరుకున్నాం. ఒకనాటి కంబోడియా సంస్కృతీసంప్రదాయాలకూ ఆచారవ్యవహారాలకూ నిలువెత్తు నిదర్శనంగా నిలిచే చూడచక్కని పట్టణమే సియాంరీప్‌. ఇప్పటికీ దీని చుట్టుపక్కల గ్రామాల్లో సందర్శకులకోసం ప్రాచీన ఖ్మేర్‌ సామ్రాజ్యకాలంనాటి చెక్క ఇళ్లను యథాతథంగా పరిరక్షిస్తున్నారు. కంబోడియాలో నివసించే ప్రత్యేక జాతి ప్రజల్నీ వాళ్లు మాట్లాడే భాషనీ ఖ్మేర్‌ అని పిలుస్తారు. ఆగ్నేయాసియా దేశమైన కంబోడియాను పూర్వం కంపూచియాగానూ కాంభోజ రాజ్యంగానూ పిలిచేవారు.

విశ్వవిఖ్యాత అంకోర్‌వాట్‌ ఆలయం సియాంరీప్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అందుకే ఆ ఆలయాన్ని సందర్శించేవాళ్లంతా ఈ నగరంలోనే బస చేస్తుంటారు. మేం కూడా అక్కడే ఉండి, మర్నాడు ఉదయాన్నే అంకోర్‌వాట్‌కు బయలుదేరాం. ఖ్మేర్‌ భాషలో అంకోర్‌ అంటే రాజధాని, వాట్‌ అంటే ఆలయం అని అర్థం. అందుకే దీన్ని ‘టెంపుల్‌ సిటీ’ లేదా ‘సిటీ ఆఫ్‌ టెంపుల్స్‌’ అనీ పిలుస్తున్నారు.

పర్వతాలను పూజించడం హైందవ సంప్రదాయం. అందుకే ఆలయాలను పర్వతాలను పోలి ఉండేలా నిర్మిస్తుంటారు. ముఖ్యంగా దేవతల నివాసమైన మేరుపర్వతాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. అంకోర్‌వాట్‌ ఆలయంలో ఈ విధానం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మేరు పర్వతం చుట్టూ చిన్న చిన్న పర్వతాలు ఉన్నట్లే ప్రధాన ఆలయం చుట్టూ అనేక ఆలయ గోపురాలు ఉంటాయి. మేరు పర్వతానికి ఐదు శిఖరాలు ఉన్నట్లే ప్రధాన ఆలయానికీ ఐదు గోపురాలు ఉంటాయి.

అదృష్ట సంఖ్య!
దాదాపు 402 ఎకరాల ప్రాంగణంలో ఐదు ముఖద్వారాలతో విరాజిల్లుతున్న అంకోర్‌వాట్‌ ఆలయ నిర్మాణం క్రీ.శ. 12వ శతాబ్దంలో రెండో సూర్యవర్మ నుంచి ఏడో జయవర్మ కాలం వరకూ కొనసాగింది. సూర్యవర్మ అప్పటివరకూ ఉన్న శైవారాధనకు భిన్నంగా వైష్ణవాలయంగా దీన్ని నిర్మించాడు. ప్రధాన ఆలయంలోని శ్రీమహావిష్ణుమూర్తి ఎత్తైన విగ్రహం చూపరులను అచ్చెరువొందిస్తుంది. పూర్వం దీన్ని ‘వరహ విష్ణులోక’ అని పిలిచేవారట. ఆపై రాజ్యాన్ని చేపట్టిన ఏడో జయవర్మ మహాయాన బౌద్ధంలోకి మారడంతో అంకోర్‌వాట్‌లో బౌద్ధ ఆలయాలు వెలశాయి.

 

ఆరువందల మీటర్ల పొడవున్న ఆలయ కుడ్యాలమీద రామాయణ, మహాభారత, భాగవత ఇతివృత్తాలన్నీ చెక్కి ఉన్నాయి. మొదటి అంతస్తులో దాదాపు రెండు వేల భంగిమల్లో కొలువుదీరిన అప్సరసల బొమ్మలు చూపరుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఆలయ ప్రవేశం దగ్గర ఉన్న ఏడు పడగల నాగదేవత శిల్పం భక్తితో కూడిన భయాన్నీ కలిగిస్తుంది. అది దాటగానే ఆనాడు తవ్విన సరస్సు తామరపుష్పాలతో ఆహ్వానం పలుకుతుంది. ఇప్పటికీ కంబోడియా వాసులు ఒకటి నుంచి తొమ్మిది వరకూ ఉన్న అంకెల్లోని బేసి సంఖ్యలను అదృష్ట సంఖ్యలుగా భావిస్తారట. అందుకే ఏడు పడగల నాగదేవత, ఏడు రంగుల ఇంద్రధనుస్సులను అదృష్టదేవతలకు ప్రతిరూపాలుగా భావించి పూజిస్తారు.

ఈ ఆలయమంతా తిరగడానికే కనీసం ఓ పూటయినా పడుతుంది. దీని పరిసరాల్లో ఆనాటి హిందూ, బౌద్ధ ఆలయాలెన్నో ఉన్నాయి. వాటిల్లో చాలావరకూ శిథిలావస్థకు చేరుకున్నాయి. అంకోర్‌వాట్‌లో తప్పక చూడదగ్గవి సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు. సాధారణంగా ఆలయాలన్నీ తూర్పుదిశగా ఉంటాయి. కానీ పశ్చిమముఖంగా నిర్మించడంతో సంధ్యా సమయాల్లో ఆలయాన్ని కెమెరాలో బంధించడం కష్టం. చీకటిగా కనిపిస్తుంది. సూర్యుడు నడినెత్తికి వచ్చాక అంటే మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల సమయంలో ఫొటోలు బాగా వస్తాయి.

క్రీ.శ.13- 14 శతాబ్దాల మధ్యకాలంలో అంకోర్‌వాట్‌లోని విష్ణువు, త్రిమూర్తుల విగ్రహాలను ముందు భాగంలోకి మార్చి, అక్కడ బుద్ధుని ప్రతిమలను ప్రతిష్ఠించారు. ఆ తరవాత 17-19 శతాబ్దాల మధ్యకాలం- అంటే దాదాపు రెండు వందల యాభై సంవత్సరాలపాటు అంకోర్‌వాట్‌ నిర్లక్ష్యానికి గురైంది. 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని సందర్శించిన ఓ పోర్చుగీసు సాధువు ప్రపంచంలోనే వర్ణించనలవికాని అద్భుత నిర్మాణంగా దీన్ని కొనియాడాడు. క్రీ.శ. 1860లో ఈ ప్రాంతాన్ని పాలించిన ఫ్రెంచ్‌వారు ఆలయాలను పునరుద్ధరించారు. కానీ 1975-79 మధ్యకాలంలో ఈ దేశాన్ని పాలించిన పోల్‌పాట్‌ జరిపిన అకృత్యాలవల్ల చాలావరకూ నాశనమయ్యాయి. మిగిలిన శిథిలాలను ప్రస్తుతం ఇక్కడి నేషనల్‌ మ్యూజియంలో భద్రపరిచారు.

అంకోర్‌థామ్‌లో...
తరవాత సమీపంలోని ఏడో జయవర్మ నిర్మించిన అంకోర్‌థామ్‌కి వెళ్లాం. ఇక్కడి బేయన్‌ ఆలయంలో మూడు తలల దైవ విగ్రహం సందర్శకులను ఎంతో ఆకర్షిస్తుంది. ఆలయం గోడలమీద చెక్కిన పనితనం చూస్తే ఇది రాయా లేదా చెక్కా అన్న సందేహం కలగకమానదు. దీనికి దగ్గర్లోనే బేయన్‌ శైలిలో నిర్మించిన ‘త ప్రోహామ్‌’ అనే ఆలయానికి వెళ్లాం దీన్ని ‘రాజవిహార’ అనీ అంటారు. నాడు బౌద్ధ విశ్వవిద్యాలయంగా వెలుగొందింన ఈ ఆలయంలోకి పశ్చిమ ద్వారం గుండా ప్రవేశించి, తూర్పు ద్వారం గుండా బయటకు రావాలి. ఇండో-కంబోడియన్‌ ప్రాజెక్టు ద్వారా ఈ ఆలయాన్ని కూడా పునరుద్ధరిస్తున్నారు. మర్నాడు సియాంరీప్‌ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాంటే స్రెయ్‌ ఆలయానికి వెళ్లాం. అంకోర్‌వాట్‌ కన్నా ముందే పదో శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పకళ కూడా చూపరులను కట్టిపడేస్తుంది. అక్కడనుంచి ప్రేరుప్‌ అనే ప్రదేశానికి వెళ్లాం. వర్ణాలు మారుతూ నింగిలోకి ఒరిగిపోతున్న అక్కడి సూర్యాస్తమయ సౌందర్యాన్ని చూసి తీరాల్సిందే.

తరవాతిరోజు అక్కడికి 60 కి.మీ.దూరంలోని అభయారణ్యంవైపు వెళ్లాం. దీన్ని కులెన్‌ జాతీయ ఉద్యానవనంగా పిలుస్తారు. ఆ మార్గం పచ్చని చెట్లతో ఆహ్లాదభరితంగా కనువిందు చేస్తుంటుంది. ఇక్కడ శయనభంగిమలోని బుద్ధుని విగ్రహం ఆకట్టుకుంటుంది. అక్కడకు దగ్గరలోనే ఉన్న నదిలో వేయి శివలింగాలు ఉన్నాయి. చుట్టూ అడవి, పరవళ్లు తొక్కుతోన్న నదీప్రవాహం... ఇవన్నీ కలిసి ఆ ప్రదేశానికి ఒకలాంటి ఆధ్యాత్మిక భావనను కలిగిస్తాయి. మేం ఆ పరిసరాలను గమనిస్తూ చాలాసేపు ఉండిపోయాం. ఆ తరవాత దగ్గర్లోనే ఉన్న జలపాతంలో తనివితీరా స్నానం చేశాం. ఆ సాయంత్రానికి అంకోర్‌వాట్‌ ఆలయానికి చేరుకుని అక్కడి సుందర సూర్యాస్తమయ దృశ్యాన్ని చూస్తూ ఆనందించాం. రాత్రికి భోజనం చేసి మార్కెట్‌లో కాసేపు షాపింగు చేశాం. అక్కడ నైట్‌ మార్కెట్‌లో రకరకాల వస్తువులు కొనుక్కోవచ్చు. బేరాలు ఆడితే తగ్గిస్తారు.

మర్నాడు సియాంరీప్‌ నుంచి విమానంలో గంటన్నర ప్రయాణించి కాంబోడియా రాజధాని ఫునమ్‌ ఫెన్‌ చేరుకున్నాం. కాసేపు విశ్రాంతి తీసుకుని రాయల్‌ ప్యాలెస్‌ దగ్గరకు వెళ్లాం. అక్కడి సిల్వర్‌ పగోడా చూడదగ్గ విశేషం. తరవాత దగ్గర్లోని జాతీయ మ్యూజియంలో కంబోడియా దేశ పురాతన శిల్పకళాఖండాలను చూశాం. ఈ ప్రదర్శనశాలను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. సాయంత్రం మేకాంగ్‌ నది దగ్గరకు వెళ్లాం. దీన్ని స్థానికులు టోనిక్‌ స్పా అని పిలుస్తారు. అందులో షికారు చేయడానికి పడవలు ఉంటాయి. అక్కడే ఉన్న భారతీయ రెస్టరెంట్‌లో భోజనం చేసి, దానికి పక్కనే ఉన్న నైట్‌ మార్కెట్‌లో షాపింగ్‌ చేశాం. అక్కడ టీ షర్టులూ, చిన్నపిల్లల దుస్తులూ చౌక. అవన్నీ స్థానికంగా తయారైనవే. కానీ ఎంతో నాణ్యంగా ఉన్నాయి. మర్నాడు నగరానికి వెలుపల ఉన్న ఆనాటి కిల్లింగ్‌ ఫీల్డ్స్‌కి వెళ్లాం.

క్రూర నియంత!
ఇరవయ్యో శతాబ్దం డెబ్భైలలో కంబోడియాను పాలించిన పోల్‌పాట్‌ అత్యంత క్రూరుడు, కిరాతకుడు, నరహంతకుడుగా చరిత్రకెక్కాడు. ఆయన పాలనలో లక్షల మంది సామాన్యులు బలయిపోయారు. ఎదురు తిరిగిన వాళ్లందరికీ మరణదండన ఖాయం. ఈ కిల్లింగ్‌ ఫీల్డ్స్‌కు తీసుకువచ్చి నిర్దాక్షిణ్యంగా చంపించేవాడు. ఇప్పటికీ అక్కడ వందలాది పుర్రెలు కనబడతాయి. ఆనాటి భీకర దృశ్యాల గురించిన సమాచారాన్ని అక్కడ ఉన్న ఆడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు. సందర్శకులందరికీ ఇయర్‌ఫోన్లు ఇస్తారు. అవి పెట్టుకుని ఒక్కో ప్రదేశానికి వెళుతుంటే ఆ స్థలంలో జరిగిన మారణకాండకు సంబంధించిన వివరాలు తెలుస్తుంటాయి. అవి వింటుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. పోల్‌పాట్‌ కాంబోడియా సాంస్కృతిక కళాఖండాలను కూడా ధ్వంసం చేశాడు. అవన్నీ విని బరువైన హృదయాలతో మధ్యాహ్నానికి స్థానిక రష్యన్‌ మార్కెట్‌కు చేరుకున్నాం. తరవాత అక్కడినుంచి వాండన్‌ ప్రాంతంలోని బౌద్ధదేవాలయాన్ని సందర్శించాం. భోజనం తరవాత మళ్లీ మేకాంగ్‌ నదికి వెళ్లి కాసేపు పడవలో షికారు చేశాం.

తరవాత మజిలీ కంబోడియా సముద్రతీరంలోని సిహనాక్‌ విల్లే. ఇక్కడ అన్నీ బీచ్‌లే. ఓట్రెస్‌ బీచ్‌లో ఈతకొడుతూ ఆనందంగా గడిపాం. మర్నాడు ఇక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా ఫెర్రేలో దాదాపు గంటసేపు ప్రయాణించి కోహ్‌రాంగ్‌కి వెళ్లాం. ఇదో అందమైన దీవి. తీరంలో తెల్లని ఇసుకా స్పటికంలా మెరిసే సముద్రజలాలూ ఎంతసేపు చూసినా తనివితీరదు. సాయంత్రం వరకూ ఆ దీవిలో హాయిగా గడిపి రాత్రికి సియాంరీప్‌కు చేరుకున్నాం. ఇక్కడి స్టార్‌ హోటళ్లలో యాత్రికులకు స్థానికంగా పండే పండ్లరసంతోబాటు అక్కడ రూపొందించిన రంగుల స్కార్ఫ్‌లను ఇచ్చి ఆహ్వానిస్తారు. హోటల్‌ గదిలో ఓ పండ్ల బుట్టను ఎల్లప్పుడూ ఉంచుతారు. మేం బస చేసిన రిసార్టు నిండుగా రకరకాల పండ్లూ పూల చెట్లు కనువిందు చేశాయి. కంబోడియాలోని లావాదేవీలన్నీ అమెరికన్‌ డాలర్లలోనే జరుగుతాయి. స్థానిక కరెన్సీ ఉంటుంది కానీ ఎవరూ ఎక్కువగా వాడరు. ఆ మర్నాడు మరోసారి అంకోర్‌వాట్‌ను సందర్శించి, ఆ రోజు మధ్యాహ్నానికి విమానాశ్రయానికి చేరుకుని హాంకాంగ్‌ మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నాం.