close
టిప్‌

టిప్‌
- మహమ్మద్‌ అన్వర్‌

కారు ఓ ఖరీదైన రెస్టారెంట్‌ ముందు ఆగింది. వారాంతం కాకపోవడంవల్ల పెద్ద రద్దీ లేదు- ఫ్లాప్‌ సినిమా ఆడుతున్న థియేటర్‌లా.

అక్కడక్కడా జనం మెరుస్తున్నారంతే! సౌకర్యంగా ఉన్నచోటు చూసుకుని కూర్చున్నాం... నేనూ నా శ్రీమతి. బయట, ఇలా హోటళ్ళలో భోజనం చేయడం మా ఇద్దరికీ పెద్దగా ఇష్టం ఉండదు. మా దృష్టిలో స్పెషల్‌ లంచ్‌ అంటే ఏమిటో తెలుసా..?

ఆరోజు వంట నా స్వహస్తాలతో నేను చేయడం. వంటగది మొత్తం నాకు రాసిచ్చేసి, తాను మాత్రం దర్జాగా టీవీ చూస్తూ, రిమోట్‌ మీటలు నొక్కుతూ... ఉప్పు డబ్బా ఎక్కడో, పోపులపెట్టె ఎక్కడో నాకు చెబుతుంటుంది.

నిజం చెప్పొద్దూ... నేను వండిన కూరలన్నీ తను ఇష్టంగా తింటుంటే, మధ్యమధ్యలో మెరుస్తున్న కళ్ళతో చూస్తుంటే, వయ్యారంగా వంకలు పెడుతుంటే... ఆరోజు నాకు సమ్‌థింగ్‌ స్పెషలే.

ఎప్పుడూ లేనిది... ‘ఈసారి ఏదైనా హోటల్‌కి వెళ్ళి భోంచేద్దాం’ అంది.

దానికి మరో కారణం కూడా ఉంది. ఈరోజు తన పుట్టినరోజు. కనీసం ఈ రోజైనా రుచికరమైన భోజనం తినాలనుకుంటుందన్నమాట. అందుకే నేనూ నవ్వుతూ ఒప్పుకున్నా.

రాగానే తను మెనూ కార్డులో తల దూర్చేసింది. బేరర్‌ కోసం నా కళ్ళు వెదుకుతున్నాయి. పిచ్చిపిచ్చి పేర్లు చూసి నవ్వుకుంటూ ఏ ఐటమ్‌ ఆర్డర్‌ ఇవ్వాలో తెలీక కన్‌ఫ్యూజ్‌ అవుతూ మెనూకార్డు పక్కన పెట్టేసి నావైపు అభ్యర్థనగా చూసింది- ఆ భారం నాపై వేస్తూ.

అప్పటివరకూ విననీ చూడనీ పేర్లు కనిపిస్తుండటంతో ఏ ఐటమ్‌ మీద ప్రయోగం చేయాలో నాకూ అర్థంకాలేదు.

ఇంతలో బేరర్‌ వచ్చాడు ‘‘ఆర్డర్‌ ప్లీజ్‌’’ అంటూ.

ఓ ఇరవై ఏళ్ళుంటాయేమో, చురుకైన కళ్లూ, చెదరని నవ్వూ, అన్నింటికీ మించి తన డ్రెస్సింగ్‌ సెన్స్‌... చూడగానే నచ్చాడు. మా బాధని అర్థంచేసుకున్నాడో ఏమో... ‘‘ట్రిపుల్‌ ఫ్రైడ్‌రైస్‌ ట్రై చేయండి సార్‌... మా రెస్టారెంట్‌లో స్పెషల్‌ అదే’’ అన్నాడు.

‘‘ట్రిపుల్‌ ఫ్రైడ్‌రైస్‌ అంటే... రెండ్రోజులక్రితం వండింది మూడోసారి ఫ్రై చేసి మనకు పెట్టేస్తారేమోనండీ’’ అని గొణుగుతూ నవ్వింది శ్రీమతి.

ఆ మాటలు తన చెవినాపడ్డాయి. ‘‘బిలీవ్‌మీ సార్‌... ఒక్కసారి తింటే, మూడుసార్లు ఆర్డరు చేయాలనిపిస్తుంది’’ అన్నాడు అదే చిరునవ్వుతో.

‘‘సరే’’ అన్నాం ఇద్దరం. ఎందుకంటే బేరర్‌ని నమ్మడంకంటే బెటర్‌ ఆప్షన్‌ లేదు ఆ క్షణంలో.

చెప్పిన ఆర్డరు మా టేబుల్‌పైకి రావడానికి పదిహేను నిమిషాలు పట్టింది. ఈలోపు ఆ కుర్రాడినే చూస్తుండిపోయాను. ఎందుకో తను నాకు నచ్చాడు. కళ్ళతో పలకరిస్తున్నాడు. కస్టమర్లు ఎంత ఇబ్బంది పెడుతున్నా అంతే వినయంగా సమాధానాలు చెబుతున్నాడు. ఇరవై ఏళ్ళ వయసులో ఇంత ఓపిక, పద్ధతి... ఈతరం వాళ్ళలో నేనైతే చూళ్ళేదు.

పద్ధతిగా ఆర్డర్లు సర్వ్‌ చేశాడు. ఇంట్లో అతిథికి వడ్డించినట్లు కొసరి కొసరి వడ్డించాడు. నిజంగానే ట్రిపుల్‌ ఫ్రైడ్‌రైస్‌ మరో మూడుసార్లు తినాలనిపించేలానే ఉంది. ‘థ్యాంక్స్‌’ అన్నట్టు చూశా... ఆ కుర్రాడి వంక.

చూస్తుండగానే రద్దీ పెరుగుతోంది. టేబుళ్ళు ఎక్కువ అవుతున్నాయి. అయినా, ఆ అబ్బాయిలో చలాకీదనం తగ్గలేదు.

‘‘ఈ కుర్రాణ్ణి చూస్తుంటే నాకు మీరే గుర్తొస్తున్నారు’’ అంది మా ఆవిడ ట్రిపుల్‌ ఫ్రైడ్‌రైస్‌ ఆఖరి స్పూను లాగిస్తూ.

హోటల్‌ సర్వర్‌తో నన్ను పోల్చడం నాకేం ఇబ్బందిగా అనిపించలేదు. అదేదో తక్కువస్థాయి అనుకోలేదు. ఎందుకంటే నేనూ ఒకప్పుడు ఇక్కడినుంచే వచ్చా. ఇప్పుడంటే దర్జాగా కారులో రెస్టారెంట్‌కి వచ్చానుగానీ... ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న తొలి రోజుల్లో...ఓ హోటల్లో సర్వర్‌గా కొన్నాళ్ళు పనిచేసినవాడినే. నా ఫ్లాష్‌బ్యాక్‌ అంతా నా శ్రీమతికి తెలుసు. అందుకే వచ్చినప్పటి నుంచీ నా చూపులన్నీ ఆ కుర్రాడిపైనే ఉన్నాయి. మా ఆవిడ కూడా తననే గమనిస్తోందని అర్థమైంది.

ఎందుకో ఓసారి నా పాత రోజులు గుర్తొచ్చాయి.

* * *

కాస్త మర్యాదకు ‘మాది మధ్యతరగతి కుటుంబం’ అని చెప్పుకునేవాణ్ణిగానీ, తిండికి ఇబ్బందిపడిన రోజులు నాకు అలవాటే. ఇంట్లో పరిస్థితులు చూసి, నాన్న పడుతున్న ఇబ్బందులు గమనించి, నా చదువు వాళ్ళకు భారం కాకూడదన్న ఉద్దేశంతో ఏనాడూ ఫీజుల కోసం వాళ్ళముందు చేయి చాచింది లేదు. వేసవి సెలవుల్లో ఏదో ఓ పని చేసుకునేవాణ్ణి. చిన్నదా పెద్దదా అని చూసేవాణ్ణి కాదు. ఫీజులకు సరిపడా డబ్బులొస్తే సరిపోతుందనుకునేవాణ్ణి. కాలేజీ రోజుల్లోనూ పార్ట్‌టైమ్‌ ఉద్యోగినే. అలా ఓసారి రెస్టారెంట్లో బేరర్‌ అవతారం ఎత్తాల్సివచ్చింది. జీతం నెలకు మూడువేలు.

‘మరీ మూడువేలేంట్రా, తక్కువ కదా’ అని ఉద్యోగం ఇప్పించిన స్నేహితుడి ముందు చిన్నబోయా.

‘బేరరంటే ఏంటనుకున్నావ్‌? వాళ్ళకు జీతంతో పనిలేదురా, టిప్పులు తెగ వస్తాయి. డబ్బులే డబ్బులు. ఈసారి నువ్వు సెకండ్‌హ్యాండ్‌ బైక్‌ కూడా కొనుక్కోవచ్చు’ అంటూ నా ఆశలకు బీజం వేశాడు.

‘రోజుకి కనీసం యాభైమంది కస్టమర్లు వచ్చారనుకో... అందులో ఇరవైమంది... తలో పది రూపాయల టిప్‌ చేతిలోపెట్టినా... నెల తిరిగేసరికి మరో ఆరు వేలైనా వస్తాయి’- ఉద్యోగంలో చేరేముందు నా ఆశలు ఇలా సాగాయి. జీతం మూడువేలు, టిప్పులు ఆరువేలు... మొత్తం తొమ్మిదివేలు. నిజంగానే సెకండ్‌హ్యాండ్‌ బైక్‌ కొనుక్కోవచ్చు అనిపించింది. ఇక ఏమాత్రం ఆలోచించకుండా సర్వర్‌ అవతారం ఎత్తేశా.

మొదటిరోజు పని చాలా కష్టం అనిపించింది. ఎవరు ఏ ఐటమ్‌ ఆర్డరు చేస్తున్నారో, ఎవరికి ఏది సప్లై చేస్తున్నానో అర్థమయ్యేది కాదు. వడ్డిస్తున్నప్పుడు చేతులు వణికిపోయేవి. ప్లేట్లూ స్పూన్లూ కిందపడిపోయేవి. నా ఖాతాలో రెండు గాజుగ్లాసులు కూడా ఢమాల్‌. ‘వీడు ఈ పనికి బొత్తిగా కొత్త’ అని అందరికీ చాలా సులభంగా అర్థమైపోయింది.

కొంతమంది నావంక చిరాగ్గా చూసేవారు. ఇంకొందరివి జాలిచూపులు. ‘చదువుకోకుండా నీకెందుకురా ఈ పనులు’ అని సలహా ఇచ్చేవాళ్ళూ కనిపించారు. ఈ మాటలన్నీ మా ఓనర్‌ వింటే, నా పని గోవిందా అనే భయం పట్టుకుంది.

‘టిప్పుల సంగతి దేవుడెరుగు... ఈరోజు ఏదోలా గట్టెక్కేస్తే చాల్రాబాబూ’ అనుకున్నా. తొలిరోజు అతి కష్టమ్మీద ఏదోలా పూర్తయింది.

అవసరం- ఓ పాఠశాల... ఏదైనా నేర్చుకునేలా చేస్తుంది. బాధ్యత- ఓ గురువు... రెండు మొట్టికాయలు వేసి మరీ నేర్పిస్తుంది. నాలుగు రోజుల్లోనే బేరర్‌గా కుదురుకున్నాను. అయితే టిప్పులు మాత్రం రావడం లేదు.

హోటల్‌ బాగా రద్దీగా ఉండేది. కుర్రాణ్ణి కదా... ఎక్కువ టేబుళ్ళు నాకే అప్పజెప్పేవారు. ఎంత బాగా సర్వ్‌ చేసినా ఒక్కడూ టిప్పు ఇచ్చిన పాపానపోలేదు.

మనసులో నాకీ ఉద్యోగం కట్టబెట్టిన నా స్నేహితుణ్ణి ఎన్నిసార్లు తిట్టుకున్నానో నాకే లెక్కలేదు.

‘టిప్పు ఇవ్వర్రా భాయ్‌... అడగాలి’ అన్నాడు ఆ తరవాత. అసలే నాకు మొహమాటం. కానీ అదీ ట్రై చేశా.

‘టిప్పా... ఎందుకివ్వాల్రా... మీ ఓనరు నీకు జీతం ఇవ్వట్లేదా’ అన్నాడొకడు.

‘టిప్పు నీకిస్తే... నా బిల్లు నువ్వు కడతావా’ అని కసిరాడు ఇంకొకడు.

‘మీ హోటల్లో రేట్లు చాలా ఎక్కువ. దానికితోడు టిప్పులు కూడానా’ అంటూ ఒకడు గొడవకు దిగాడు.

ఇక అడగడం మానేశా.

‘అందర్నీ అడక్కూడదురా... రెగ్యులర్‌ కస్టమర్లని గుర్తుపెట్టుకుని వాళ్ళనే అడగాలి’ అంటూ ఇంకో క్లాజ్‌ పొడిగించాడు ఫ్రెండుగాడు.

మా హోటల్‌కి కరీం భాయ్‌ క్రమం తప్పకుండా వచ్చేవాడు. సింగిల్‌ బిర్యానీ, కూల్‌డ్రింక్‌... కరీం భాయ్‌ అనగానే ఆర్డరు తీసుకోకుండానే సప్లయ్‌ చేసేయొచ్చు. ప్రతిరోజూ నా టేబుల్‌ దగ్గరే కూర్చునేవాడు. కానీ టిప్పు మాత్రం అడగలేదు. నేను అడిగితేగిడిగితే... కరీం భాయ్‌నే అడగాలని డిసైడ్‌ అయిపోయి... ధైర్యం చేసి అడిగేశా.

కరీం భాయ్‌ మొహం మారిపోయింది. కళ్ళు పెద్దవి చేస్తూ ‘నీకేమైనా నేను అప్పు పడ్డానా... టిప్పు అడుగుతావ్‌. ఈ హోటల్‌కి రావడమే బేకార్‌. ఏసీ పనిచేయదు, ఫ్యాన్‌ తిరగదు. బిర్యానీలో ముక్క ఉడకదు, సర్వీసు స్పీడు ఉండదు’ అంటూ ఎన్ని మాటలన్నాడో!

కరీం భాయ్‌ గొంతు పెద్దది. కస్టమర్లంతా మావైపే చూశారు.

దాంతో సిగ్గుతో చచ్చిపోయా. ఆ అవమానం చాలా రోజులు మర్చిపోలేదు. అయినా కరీం భాయ్‌ మా హోటల్‌కి రావడం మానలేదు. నా టేబుల్‌ కూడా మార్చలేదు. కానీ, రోజూ ఏదో ఓ కంప్లైంట్‌ చేసి మరీ వెళ్ళేవాడు - టిప్పు అడిగినందుకు శాస్తిగా.

కరీం భాయ్‌ నా అవమానానికి ప్రతీకగా నిలిచిపోయాడు. ఆ సంఘటన నా ఆలోచనలపై చాలా ప్రభావం చూపించింది.

ఒకరి ముందు చేయి చాచడం కంటే కష్టపడి పనిచేయడం, అది కుదరకపోతే పస్తులుండటం మంచిది అనిపించింది.

చేయి చాచడం నేరం కాదుగానీ... అలాంటి పరిస్థితుల్లో ఉండటం మాత్రం తప్పే.

అప్పటినుంచి టిప్‌ గురించి ఆశపడలేదు. ఇచ్చినా తీసుకునేవాణ్ణి కాదు.

ఇంకొంతమంది బిల్లు కట్టకుండా పారిపోయేవాళ్ళు. అది నా అకౌంట్లో పడేది. ‘అన్నా, ఓ పది రూపాయలు తక్కువగా ఉన్నాయి, అడ్జస్ట్‌ చేస్తావా?’ అని అడిగేవాళ్ళూ ఎదురుపడ్డారు.

సర్వర్‌ పని ఈజీ కాదన్న విషయం నాకు త్వరగానే బోధపడింది. ఆ తరవాత చాలా రకాలైన పనులు చేశాగానీ, కరీం భాయ్‌ దయవల్ల హోటల్లో సర్వర్‌ ఉద్యోగం మాత్రం నాకు జీవితానికి సరిపడా అనుభవాన్ని మిగిల్చింది.

నా కష్టమో, దేవుడి దయో తెలీదుగానీ, చదువు పూర్తయింది. మంచి ఉద్యోగం వచ్చింది. జీవితంలో స్థిరపడ్డా. దానికి కొత్త కాంతులు అద్దుతూ... నా శ్రీమతి ప్రవేశించింది. ఇప్పుడు నాకంటూ ఓ స్థాయి ఉంది. పైసా పైసా కూడబెట్టి, నిమిషం నిమిషం శ్రమించి ఓ కంపెనీ స్థాపించా. లాభాలొచ్చాయి. నాకింద రెండొందల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. అయినా నేను నడిచొచ్చిన దారిని ఎప్పుడూ మర్చిపోలేదు. ఇదిగో ఇలా ప్రతిసారీ ఏదో ఓ రూపంలో గుర్తొస్తూనే ఉంది.

* * *

కారు ఇంటివైపు పరుగులు తీస్తోంది.

‘‘మీమీద నాకు కోపంగా ఉంది. మరీ ఇంత పిసినారులైపోతారనుకోలేదు’’ అంది నా శ్రీమతి.

‘ఏం జరిగింది?’ అన్నట్టు చూశా.

‘‘ఆ కుర్రాడు అంత మంచి సర్వీస్‌ చేశాడు కదా, మరి టిప్పు ఎందుకు ఇవ్వలేదు? మీ పాత రోజులు మర్చిపోయారా?’’ అంటూ నవ్వుతూనే నిలదీసింది.

తనెప్పుడూ అంతే, మనసులో ఏమైనా ఉంటే దాచుకోదు. బయటపడిపోవాల్సిందే. కాకపోతే కాస్త తొందరపాటు... ఇప్పుడూ అంతే! తన తొందరపాటుతో నన్ను నిందిస్తూ, కోపంగా కసురుకుంటోంది.

నిజానికి ఆ కుర్రాడికి నేనేం టిప్పు ఇవ్వలేదు. బిల్లు కార్డు రూపంలో చెల్లించడం వల్ల టిప్పు సంగతి గుర్తుకురాలేదు. అంతేగానీ నా గతం మర్చిపోయి కాదు.

‘‘నువ్వు వాష్‌రూమ్‌ కెళ్ళినప్పుడు నా విజిటింగ్‌ కార్డు ఆ కుర్రాడికిచ్చా’’ అన్నా తనని కూల్‌ చేస్తూ.

‘‘అదేదో క్రెడిట్‌కార్డు అన్నట్టు మాట్లాడొద్దు’’ అంది ఈసారి సీరియస్‌గా.

‘‘ముందు చెప్పేది విను. ఆ కుర్రాడి పేరు ఇంతియాజ్‌. ఇంజినీరింగ్‌ చదువుతున్నాడట. చాలా పూర్‌ ఫ్యామిలీ. పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తున్నాడిక్కడ. చదువుకునే పిల్లల చేతిలో పుస్తకాలుండాలి... ప్లేట్లూ కప్పులూ కాదు. పైగా ఆ కుర్రాణ్ణి చూస్తుంటే నేనే గుర్తొచ్చానని చెప్పావ్‌ కదా, అందుకే... విజిటింగ్‌ కార్డు ఇచ్చి రేపు ఆఫీసుకొచ్చి కలవమన్నా. ఇంతియాజ్‌ కాలేజీ ఫీజులు ఇకనుంచీ మనం స్పాన్సర్‌ చేద్దాం’’ అన్నా.

నావంక ప్రేమగా చూసింది. ‘‘థ్యాంక్స్‌, ఇంత మంచి బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చినందుకు’’ అంది నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.

కొన్నాళ్ళ తరవాత...

ఇంతియాజ్‌ ఇంజినీరింగ్‌ పూర్తయింది - మా కంపెనీ స్కాలర్‌షిప్‌తో.

ఓరోజు వాళ్ళ నాన్నని వెంటబెట్టుకుని నా దగ్గరకు వచ్చాడు.

‘‘మావాడ్ని చదివించినందుకు చాలా థ్యాంక్స్‌ సర్‌. ఇప్పుడు వాడికి మంచి ఉద్యోగం వచ్చింది. అంతా మీ దయ’’ అంటూ నా కాళ్ళమీద పడినంత పనిచేశాడు ఇంతియాజ్‌ నాన్న.

అతన్నెక్కడో చూసినట్టు ఉందే అనిపించింది. నిశితంగా చూస్తే... కరీం భాయ్‌ అని తెలిసింది.

తనుమాత్రం నన్ను గుర్తుపట్టలేదు. నేను గుర్తుచేసే ప్రయత్నమూ చేయలేదు.

వయసు ప్రభావం... మనిషి చాలా పీక్కుపోయాడు. బాధ్యతల బరువు మోసీమోసీ అలసిపోయాడు. కానీ, ఈ క్షణం అతని కళ్ళలో సంతోషపు చెమ్మ కనిపించింది. కృతజ్ఞతగా ఆలింగనం చేసుకున్నాడు. అల్లా దీవెనలు ఎప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు.

‘‘భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకండి’’ అని ధైర్యం చెప్పి పంపించా.

కరీం భాయ్‌ని చూస్తే రెండు విషయాలు అర్థమయ్యాయి. ఈ ప్రపంచం చాలా చిన్నది. మనకు ఎదురైన పరిస్థితులూ మనస్తత్వాలూ... మళ్ళీ మనల్ని జీవితంలో ఒక్కసారైనా పలకరిస్తాయి. విధి కూడా బంతిలాంటిదే. దేన్నయితే బలంగా విసిరేస్తామో, దాన్ని అంతే వేగంగా వెనక్కి తిరిగి పంపిస్తుంది. కాలం ముందు చేతులు కట్టుకుని నిలబడాలంతే, కాలర్‌ ఎగరేయకూడదు. ఏమో, రేపటి రోజున అదే పరిస్థితుల్లో మనం ఉంటామేమో!

కరీం భాయ్‌ వెళ్ళిపోతున్నాడు- మరోసారి నాకు కొత్త పాఠం నేర్పుతూ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.