close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గోరంత రంగు... చెయ్యంత అందం!

గోరంత రంగు... చెయ్యంత అందం!

ఈతరం అమ్మాయిలకు సరికొత్త ఫ్యాషన్‌ దుస్తుల్నీ స్టైలిష్‌ చెప్పుల్నీ ధరించడం ఎలానో గోళ్లకి రకరకాల రంగులు వేసుకోవడం కూడా అలానే. అందుకే ఆ నెయిల్‌పాలిష్‌లు కూడా రోజుకోరకం కొత్త ఫీచర్‌తో మార్కెట్లోకి వస్తూ అమ్మాయిల వార్డ్‌రోబ్‌లో అందంగా కొలువుదీరుతున్నాయి. ఆ రంగుల్లోని కథేంటో చూస్తే పోలా..!

మాల్‌కి వెళ్లి ‘ఎరుపు గోళ్ల రంగు కావాలి’ అని అడిగితే చిత్రంగా చూసే రోజులివి. అలా అడిగే ముందే ఆ రంగులో మీకే రకం కావాలో కూడా చెప్పాలి. ప్రాథమిక రంగుల్లో మాత్రమే దొరికే ఒకనాటి గోళ్లరంగు, వందల రంగులూ షేడ్‌ల స్థాయిని ఏనాడో దాటేసింది... మ్యాట్‌, క్రీమ్‌, షీర్‌, పెరల్‌, మెటల్‌, మిర్రర్‌, శాండ్‌, గ్లిట్టర్‌... ఇలా రకరకాల కొత్త ఫినిషింగులతో అమ్మాయిల్ని ఆకట్టుకుంటోంది. అంతేనా... గోళ్లను ఆరోగ్యంగా పెరిగేలా, సువాసనలు వెదజల్లేలా, చీకట్లో మెరిసేలా, రంగులు మార్చేలా చేసే సరికొత్త ఫార్ములాలతో మగువల మనసు దోచుకుంటోంది.

 


మ్యాట్‌ ఫినిషింగ్‌...

సాధారణంగా క్రీమ్‌, పెరల్‌, షీర్‌... రకం నెయిల్‌పాలిష్‌లు కాంతిపడితే నున్నగా పారదర్శకంగా మెరుస్తుంటాయి. వీటన్నింటికీ భిన్నంగా ఎలాంటి మెరుపూ లేకుండా చిక్కని రంగు వేసినట్లుగా ఉండేదే మ్యాట్‌ పాలిష్‌. లిప్‌స్టిక్కుల్లో మాదిరిగానే ఈ మెరుపులేని రంగుల్ని వేసుకోవడం కాలేజీ పిల్లల తాజా ఫ్యాషన్‌.


ఫర్‌ కోటులా...

చలికాలంలో ధరించే రకరకాల స్వెట్టర్లూ ఫర్‌ కోట్లకు మ్యాచయ్యేలా ఫజ్జీ నెయిల్‌పాలిష్‌లను రూపొందిస్తోంది శాలీహాన్సెన్‌ కంపెనీ. గోళ్లకు సైతం చలికోటు వేసుకున్నట్లుగా ఉండే ఈ నెయిల్‌ పాలిష్‌లు కూడా అనేక రంగుల్లో దొరుకుతూ ఫ్యాషన్‌ ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి.


వానల్లో నియాన్‌

వేసుకునే దుస్తులూ వెళ్లే పార్టీని బట్టే కాదు, కాలాన్ని బట్టి కూడా గోళ్లరంగుల్ని మార్చేయాల్సిందే. అలా వర్షాకాలంలో వేసుకోగలిగేవే నీలం, పసుపు, గులాబీ, ఆకుపచ్చ, నారింజ, పసుపురంగు నియాన్‌ పాలిష్‌లు. కాస్త లక్క కలిపి రూపొందించే ఈ నియాన్‌ రంగులు గోళ్లమీద ప్రకాశవంతంగా మెరుస్తుంటాయి.


అందమై... అద్దమై...

గోరేనా లేక అద్దమా అన్నట్లు మెరిసేలా చేస్తున్నవే మిర్రర్‌ క్రోమ్‌ నెయిల్‌ పెయింట్‌లు. అచ్చంగా బంగారం లేదా వెండి పూతనో పూసినట్లూ లేదా రాగి రేకును అతికించినట్లుగా ఉండే ఈ రకమైన పెయింట్లలోనూ రకరకాల రంగులు వస్తున్నాయి. అచ్చంగా అద్దంలా మెరిసేంత నున్నగా ఉండే ఈ రంగుల్లో మన మొహమూ ప్రతిబింబిస్తుందనడంలో సందేహం లేదు.


ఖరీదైన రంగు

ఓఎస్‌ఐ, చైన్‌గ్లేజ్‌, ఎస్సీ, రెవ్‌లాన్‌, బాబీ బ్రౌన్‌, ఆర్‌జిబి... వంటి ఖరీదైన బ్రాండెడ్‌ రంగులు ఎన్ని ఉన్నా ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన నెయిల్‌పాలిష్‌ మాత్రం అజాచర్‌ బ్లాక్‌ డైమండ్‌ నెయిల్‌పాలిష్‌. 267 క్యారెట్ల నల్ల వజ్రాలతో రూపొందించిన ఈ బాటిల్‌ ఖరీదు సుమారు రూ.కోటీ అరవై లక్షలు.


గోళ్ల మీద గుడ్లు..!

ఈతరానికి గోళ్లకు రంగు వేసుకోవడం రోజువారీ ఫ్యాషన్‌ మాత్రమే కాదు, అదో అందమైన కళ కూడా. అందులోభాగంగా వస్తున్నవే కెవియర్‌(చేపగుడ్లు)నెయిల్‌ పాలిష్‌ సెట్స్‌. సన్నని గుండ్రని పూసల్ని అతికించినట్లుగా ఉండే ఈ పాలిష్‌కోసం ముందుగా మనకు కావలసిన రంగు వేసుకుని ఆపై ఈ పూసల్ని అతికించి, వాటిమీద మరోసారి టాప్‌కోట్‌ వేయాల్సి ఉంటుంది.


చమ్కా చమ్కా చమ్కీరే...

సీక్వెన్లూ, రాళ్లూ, అద్దాల ఎంబ్రాయిడరీ దుస్తులు ధరించినప్పుడు గోళ్లను మాత్రం అలాగే వదిలేస్తే ఎలా? అందుకే వాటినీ చమ్కీలతో మెరిపించేవే గ్లిట్టర్‌ నెయిల్‌పాలిష్‌లు. వీటిల్లో కాపర్‌, రోజ్‌గోల్డ్‌, గోల్డ్‌, సిల్వర్‌, నీలం, ఆకుపచ్చ... ఇలా ఏకరంగులే కాదు, సప్తవర్ణాలనూ గోటికెక్కించే మల్టీకలర్‌ గ్లిట్టర్లూ ఉన్నాయి. ఇంకా గుండ్రని, చతురస్రం, షడ్భుజి... ఇలా అనేక రేఖాగణిత డిజైన్లతో ఉండే ఈ చమ్కీ పాలిష్‌ను వేసే ముందు అడుగున అదేరంగు నెయిల్‌పాలిష్‌ వేస్తే అది మరింతగా మెరుస్తుంది. అలాగే మిగిలిన నెయిల్‌పాలిష్‌ల మాదిరిగా ఒకటీరెండో కాకుండా మూడునాలుగు కోట్‌లు వేస్తే గోరంతా చమ్కీలు చక్కగా పట్టి ఉంటాయి.


మారిపోతుంటాయి..!

చేతుల్లో చల్లని ఐస్‌క్రీమ్‌ ఉన్నప్పుడు ఒక రంగులో, వేడి కాఫీ కప్పు ఉంటే మరో రంగులో కనిపించేలా చేసేవే మూడ్‌ ఛేంజింగ్‌ లేదా రంగులు మారే పాలిష్‌లు. ఇవి శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నప్పుడు లేతరంగులోనూ ఏమాత్రం పెరిగినా ముదురురంగులోకీ మారిపోతుంటాయి. వీటిల్లో చేతుల్ని వేడినీళ్లలో పెడితే పూర్తిగా మరో రంగులోకి మారేవీ వస్తున్నాయి.


గోటిమీద తారాతీరం

అందని ఆ తారాతీరాన్ని సైతం గోటిమీద నిలబెట్టేస్తున్నాయి కాస్మిక్‌ నెయిల్‌పాలిష్‌లు. అంతరిక్షంలోని పాలపుంతల్నీ సౌరకుటుంబాల్నీ గ్రహాలూ ఉపగ్రహాల్నీ... ఇలా మనకు నచ్చినవాటిని గోళ్లమీద కొలువుదీరేలా చేయవచ్చు. వీటిల్లోనూ రకరకాల రంగులున్నప్పటికీ మిణుకుమిణుకుమనే తారలతో కూడిన బ్లాక్‌ కాస్మిక్‌కే నేటి అమ్మాయిల ఓటు.


చీకట్లో మెరిసేలా...

రాత్రివేళల్లో వెళ్లే పబ్‌లూ క్లబ్‌ పార్టీల్లో చీకటివెలుగులు దోబూచులాడుతుంటాయి. అలాంటి పార్టీలకోసమన్నట్లు రూపొందించినవే ఈ గ్లో ఇన్‌ ద డార్క్‌ నెయిల్‌ పాలిష్‌లు. ఫ్లోరసెంట్‌ రంగులతో రూపొందించే ఈ రకం గోళ్లరంగు, వెలుగులో ఉన్నప్పుడు సాధారణ గోళ్ల రంగులా మాత్రమే కనిపిస్తుంది. కానీ చీకట్లోకి వెళ్లగానే కాంతిమంతంగా మెరుస్తూ హ్యాండ్‌ టార్చ్‌ మాదిరిగానూ పనిచేస్తుంది.


నఖ సుగంధం

కొందరికి పరిమళాలంటే ఎంతో ఇష్టం. ఒంటి నుంచే కాదు, చేతిలో పట్టుకునే రుమాలు నుంచి వేలిగోళ్ల వరకూ సుగంధం వెదజల్లాలని కోరుకుంటుంటారు. అలాంటివాళ్లకోసమే అన్నట్లు రెవ్‌లాన్‌ కంపెనీ అటు గోళ్లకు అందాన్నీ ఇటు మనసుకు గంధాన్నీ అందించేలా పర్‌ఫ్యూమరీ నెయిల్‌పాలిష్‌లను రూపొందిస్తోంది. బాల్సామ్‌ ఫిర్‌, లావెండర్‌ సోప్‌, ట్రాపికల్‌ రెయిన్‌... వంటి పరిమళాలను వెదజల్లే ఈ సెంటెడ్‌ పాలిష్‌లు భిన్న రంగుల్లో గోళ్లరంగు ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి.



ఇవే కాదు, గోళ్లు మరీ పలుచగా ఉండి, విరిగిపోకుండానూ త్వరగా పెరిగేందుకూ కొన్ని కంపెనీలు నెయిల్‌ గ్రోత్‌ పాలిష్‌లనూ రూపొందిస్తున్నాయి. ఈ రకమైన రంగుల్ని రెండుమూడు రోజులకోసారి వేస్తూ ఉంటే అందులోని ప్రొటీన్లు గోళ్ల పెరుగుదలకు తోడ్పడతాయి. అలాగే ఇంటిపనీ వంటపనీ చేస్తున్నప్పుడు ఎంతటి బ్రాండెడ్‌ నెయిల్‌ పాలిష్‌లయినా అంచులదగ్గర చిట్లినట్లుగా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే శాలీహాన్సన్‌, స్మిత్‌ అండ్‌ కల్ట్‌... వంటి కంపెనీలు రూపొందించే మిరకిల్‌ జెల్‌, షెల్లాక్‌ నెయిల్‌ పాలిష్‌లు వేసుకుంటే కనీసం ఓ వారం నుంచి రెండు వారాల వరకూ చెక్కుచెదరకుండా ఉంటాయి. వీటిల్లోనూ బేస్‌కోట్‌, టాప్‌కోట్‌లతో పనిలేని ఆల్‌ ఇన్‌ వన్‌ గోళ్లరంగులదే హవా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.