close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కలసి భోంచేద్దాం రండి

కలసి భోంచేద్దాం రండి

పండగైనా మరో సందర్భమైనా ఇంటికి విందుకు ఎవరిని పిలుస్తాం? బంధువులనూ స్నేహితులనూ. కానీ ఈ జంట మాత్రం సందర్భం ఏమీ లేకుండానే, పూర్తిగా అపరిచితుల్ని తమ ఇంటికి విందుకి ఆహ్వానిస్తుంది. ఇద్దరూ కలిసి వంటలు చేసి వచ్చిన వారికి ఆప్యాయంగా వడ్డిస్తారు. ఏడాదిన్నరగా వారు చేస్తున్న ఈ విందుల వల్ల ఇప్పుడు వారికి వూరంతా స్నేహితులయ్యారు. ఇంతకీ అమందా, హుస్సేన్‌ సాబ్‌ల జంట ఎందుకిలా చేస్తోంది?

అమందా... అమెరికాలోని మిషిగాన్‌లో నివసిస్తున్న ముస్లిం వనిత. వృత్తి రీత్యా సోషల్‌ వర్కర్‌. ప్రవృత్తి బ్లాగర్‌. వంటలు చేయడమంటే చాలా ఇష్టం. హిజాబ్‌(తలకు స్కార్ఫ్‌) ధరించి మాస్టర్‌షెఫ్‌ పోటీల్లో పాల్గొన్న తొలి అభ్యర్థి ఆమే. అయితే గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు ఆమెను ఆలోచింపజేశాయి. ప్రజల్లో పెరుగుతున్న ‘ఇస్లామోఫోబియా’(ముస్లింల పట్ల భయం)ని పోగొట్టడానికి తన వంతుగా ఏమైనా చేయాలనుకుంది. ఎవరికి వారు గిరి గీసుకుని ఉండిపోతే మనుషుల మధ్య అంతరాలు పెరుగుతాయే కానీ తగ్గవు. అందుకే ఆతిథ్యంతో ఆ హద్దులు చెరిపేయాలని నిర్ణయించింది. భర్త హుస్సేన్‌ సాబ్‌ ఆమె ఆలోచనలతో ఏకీభవించాడు. ఇద్దరూ కలిసి 2016 జనవరి నుంచీ ‘డిన్నర్‌ విత్‌ యువర్‌ ముస్లిం నైబర్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ఆహ్వానాన్ని చూసి ఎంత మంది స్పందించి వస్తామని తెలిపితే అంతమందికీ ఇంట్లోనే వంట చేస్తారు. వచ్చిన వారందరూ తమను తాము పరిచయం చేసుకుంటారు. చక్కగా కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేస్తారు. ఇద్దరూ ఉద్యోగస్తులే కావడంతో వారాంతాల్లో ఈ విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఇతరులూ ఇలాంటి విందులు ఏర్పాటుచేయడానికి మార్గదర్శకత్వం వహించేందుకు గాను యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ సహకారంతో ఆన్‌లైన్‌ టూల్‌కిట్‌ను కూడా అమందా దంపతులు డిజైన్‌ చేశారు.


ఆ హోటల్లో భోంచేయాలంటే...
మూణ్నెల్లు ఎదురు చూడాలి!

ప్రారంభించిన ఏడేళ్లకే ప్రపంచ ఉత్తమ రెస్టరెంట్ల జాబితాలో ఏడో స్థానం సంపాదించడం సాధ్యమేనంటే నమ్ముతారా? నమ్మలేకపోతే గగన్‌ ఆనంద్‌ గురించి మీకు తెలియదన్నమాటే! 38 ఏళ్ల ఈ భారతీయ షెఫ్‌... ఉద్యోగం కోసం బ్యాంకాక్‌ వెళ్లి, అక్కడ సొంతంగా రెస్టరెంట్‌ పెట్టి ప్రపంచవ్యాప్తంగా భోజనప్రియులకు నోరూరిస్తున్నారు. ఆసియాలో నంబర్‌ వన్‌ షెఫ్‌గా పేరొందిన గగన్‌ ఆనంద్‌ భవిష్యత్‌ ప్రణాళికలేమిటో తెలుసా?

నేను కోల్‌కతాలో పుట్టిన పంజాబీని. చిన్నప్పుడు రాక్‌స్టార్‌నవ్వాలని కలలు కంటూ డ్రమ్స్‌ వాయించేవాడిని. కెరీర్‌ నిర్ణయించుకోవాల్సి వచ్చేసరికి - టీవీలో చూసిన చైనీస్‌ కుకరీ షో గుర్తొచ్చింది. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఎంచుకున్నా. తాజ్‌ గ్రూప్‌లో ట్రెయినీగా పనిచేశాను. హోటల్‌లో వంటకి కొత్తదనం పనికిరాదు. ఆరేడేళ్లు చాలా చోట్ల పని చేశా. పేరూ డబ్బూ వచ్చాయి కానీ తృప్తి లేదు. వివాహం విఫలమైంది. 27 ఏళ్ల వయసులో దేశం విడిచి దూరంగా వెళ్లాలని 500 డాలర్లు, నాలుగు జతల దుస్తులతో బ్యాంకాక్‌ వెళ్లాను. రెండు మూడేళ్లు హోటళ్లలో పనిచేశా. కానీ, ఏదైనా కొత్తగా చేస్తే ఎవరికీ నచ్చేది కాదు. దాంతో విసుగెత్తి సొంతంగా నా పేరుతోనే రెస్టరెంట్‌ ప్రారంభించాలనుకున్నా.

* 2010 డిసెంబరులో బ్యాంకాక్‌లో ‘గగన్‌’ పేరుతో రెస్టరెంట్‌ను ప్రారంభించా. మూడేళ్లకే అంటే... 2013లో ఆసియాలో 50 ఉత్తమ రెస్టరెంట్లలో పదో స్థానమూ ప్రపంచంలో టాప్‌ 100లో 66వ స్థానమూ లభించింది. అది వూహించని విజయం. నమ్మలేకపోయా. అమ్మకి ఫోన్‌ చేశా. ఆ రాత్రంతా కన్నీళ్లు ఆగలేదు. ఏటా ఆ జాబితాల్లో కొనసాగుతూ వస్తున్న ‘గగన్‌’ ఈ ఏడాది ఆసియాలో ప్రథమ స్థానంలో, ప్రపంచంలో ఏడో స్థానంలో నిలవడమే కాక టాప్‌ 50లో స్థానం పొందిన ఏకైక భారతీయ రెస్టరెంట్‌ అయింది. ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి కాబట్టి ఇక నేను దేశదేశాల్లో గొలుసు రెస్టరెంట్లు ప్రారంభించేస్తానని అందరూ అనుకుంటున్నారు. నాకు అలాంటి ప్రణాళికలేవీ లేవు. పాకశాస్త్రం ఓ కళ అయితే నేను కళాకారుడిని. వ్యాపారస్తుణ్ని కాను. ఈ మధ్యే మాస్టర్‌షెఫ్‌ అవకాశాన్నీ తిరస్కరించా. 2020లో ఈ రెస్టరెంట్‌ను మూసేస్తాను. వారాంతాల్లో మాత్రమే తెరచివుండే ఓ చిన్న హోటల్‌ను జపాన్‌లో ప్రారంభిస్తా. అక్కడ పదే సీట్లుంటాయి. కొత్త రుచులను ఆస్వాదించే స్నేహబృందాలకే చోటు.
* నా మటుకు నాకు కొత్త వంటకాలు రుచి చూడడమైనా, వండడమైనా... మూడ్‌ వచ్చిందంటే ఆగే ప్రశ్నే ఉండదు. ఏ దేశంలోనో ఓ మంచి హోటల్‌లో ఓ వంటకం తినాలనిపిస్తే వెంటనే టికెట్‌ కొనుక్కోవడం, ఫ్లైట్‌ ఎక్కేయడమే. వంట చేసేటప్పుడూ అంతే. అదో ప్రపంచం. కొత్త ఆలోచన వస్తే ఇంకేం జ్ఞాపకం ఉండదు. నూటికి నూరుపాళ్లూ లీనమై చేస్తా. మా రెస్టరెంట్లో 18 దేశాలకు చెందిన షెఫ్స్‌ ఉన్నారు. మూణ్ణెల్లకోసారి మెనూ మారుస్తాం. గగన్‌లో విందు చేయాలంటే మూడునెలల వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంటుంది. రోజూ కనీసం 500 మంది సీటు రిజర్వ్‌ చేసుకుంటారు.
* వంటలపరంగా భారతీయులకు గొప్ప వారసత్వమున్నా కాలానికి తగినట్లుగా ఆధునికీకరించడం లేదు. అభిరుచుల్లోనూ భారతీయుల వైఖరి మారాలి. ఇండియాలో హోటల్‌ పెట్టాలన్న ఆలోచన ఉంది. నగరం, మెనూ ఆలోచించాలి. నా రెస్టరెంట్‌లో నేను రూపొందించిన ప్రత్యేకమైన మెనూ మాత్రమే ఉంటుంది. బయట దొరికేవన్నీ ఉండవు. నేను చాలా త్వరగా ఈ రంగంలో ఉన్నత స్థానానికి వచ్చేశాను. అంతే త్వరగా పడిపోవడం నాకిష్టం లేదు. అందుకే ఆచితూచి నిర్ణయం తీసుకుంటా. అంతెందుకు, ఇప్పుడున్న రెస్టరెంట్‌ భారత్‌లో ఉంటే ఇంత పేరు వచ్చేదని నేననుకోను. ప్రయోగాలు చేయడానికి ఇష్టంలేని చోట సృజన రాణించదు. మా విజయానికి కారణం సృజనశీలతే.


నాకు ‘రొటీన్‌’ ఇష్టం ఉండదు. అన్నం, నూడుల్స్‌కి తోడు కారంగా నోరూరించే థాయ్‌ పీతల కూర వండుతాను. వైట్‌ చాక్లెట్‌ పానీపూరీ అనే వంటకం మీరు వూహించగలరా? నేను చేస్తాను.
* రుచుల్ని ఆస్వాదించాలంటే మనలాగే ఇష్టంగా తినే స్నేహితులుండాలి. నా భార్య అలాంటి స్నేహితురాలే. తను థాయ్‌లాండ్‌ అమ్మాయి. మాకో పాప. ఇండియా వస్తే ఇద్దరం స్ట్రీట్‌ ఫుడ్‌ బాగా ఎంజాయ్‌ చేస్తాం. ట్యాబ్లెట్లు వెంటపెట్టుకుని మరీ వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి తింటాం.
* రాత్రి పది రకాల వంటకాలతో సుష్టుగా తిని పడుకున్నా అర్థరాత్రి లేచినపుడు తినడానికి ఏమైనా ఉండాల్సిందే. మా పడక గది అల్మారా నిండా రకరకాల తినుబండారాలు ఉంటాయి. ఫ్రిజ్‌లో భారతీయ, థాయ్‌, జపాన్‌ పచ్చళ్లు ఉంటాయి.
* ఫ్రెండ్స్‌ నన్ను రాక్‌స్టార్‌ షెఫ్‌ అంటారు. టైమ్‌ మ్యాగజైన్‌ ‘ద కెప్టెన్‌ కిర్క్‌ ఆఫ్‌ క్విజిన్‌’ అని రాసింది.
* ఒకసారి బ్యాంకు ఉద్యోగులు ముగ్గురు మా రెస్టరెంట్‌కి వచ్చారు. బిల్లు రూ. 96 వేలు అయితే మరో 94 వేలు టిప్‌ ఇచ్చారు. బిల్లులో 15 శాతం టిప్‌ ఇవ్వడం పద్ధతి. అందుకే పొరపాటున ఇచ్చారేమోనని ఫోన్‌ చేశాను. ఇంకా ఎక్కువే ఇవ్వాల్సిందనీ, తక్కువ ఇచ్చామనీ, తమకు ఫుడ్‌ అంత నచ్చిందనీ చెప్పారు.


రారండోయ్‌ వేదం నేరుద్దాం!

హిందూ సంస్కృతీ సంప్రదాయాలూ నమ్మకాలకు వేదం ప్రాణం. ఆలయాల్లో పూజలే కాదు, వేద మంత్రాలు చదవందే సంప్రదాయబద్ధంగా జరిగే ఏ క్రతువూ పూర్తవదు. పవిత్రమైన ఆ వేదాలను బోధించేందుకు ఉచిత వసతి సౌకర్యాలతో పాఠశాలలను ఏర్పాటు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. అలా పశ్చిమ గోదావరిలోని అయి భీమవరంలో ప్రారంభమైన శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల స్థానికంగా ఉండే వారితోపాటు ఎంతోమందికి వేదాన్ని నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

తెలతెలవారుతుండగా పల్లెల్లో అడుగు పెడితే పక్షుల కిలకిలా రావాలు మనసుకు హాయిని కలిగిస్తాయి. కానీ ఆ పల్లెలో ప్రకృతి అందాలతో పాటు ముక్తకంఠంతో వందలమంది పలికే వేదాలు శరీరంలోని అణువణువునీ ఉత్తేజితం చేస్తాయి. అదే పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు మండలం అయి భీమవరం ప్రత్యేకత. 2011 నవంబరులో తితిదే ఆధ్వర్యంలో ప్రారంభమైన ఇక్కడి వేద పాఠశాలను మొదట్లో కళ్యాణ మండపంలో నిర్వహించేవారు. రెండేళ్ల కిందట అత్యాధునిక సౌకర్యాలతో తరగతి గదుల భవనం, పుష్కరిణి, యాగశాల, గోశాల, విద్యార్థులకూ ఉపాధ్యాయులకూ వసతి గృహాలూ నిర్మించగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వీటిని ప్రారంభించారు.

విద్యార్థికి మూడు లక్షలు
ప్రస్తుతం వందమందికి పైగా విద్యార్థులు రుగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను ఇక్కడ అభ్యసిస్తున్నారు. ఎక్కడైనా చదువుకోవాలంటే విద్యార్థులు డబ్బు చెల్లించాలి. కానీ ఈ పాఠశాలకు వచ్చే పిల్లలకు తితిదే సంస్థే ఎదురు డబ్బులు ఇస్తుంది. అవును, ప్రతి విద్యార్థికీ పాఠశాలలో చేరిన వెంటనే వారి బ్యాంకు అకౌంట్‌లో మూడు లక్షల రూపాయలను జమ చేస్తారు. చదువు పూర్తైన తర్వాత వడ్డీతో సహా ఆ మొత్తాన్నీ అందజేస్తారు. అంతేనా, వారికి ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు దుప్పట్లు, తలగడ, కంచం, నూనె, వ్యాసపీట, ఏడాదికి నాలుగు జతల దుస్తులు, పుస్తకాల్లాంటి వాటిని కూడా తిరుపతి దేవస్థానమే అందిస్తుంది. ప్రతిరోజూ ఉదయం పాలు, ఉప్మా, ఇడ్లీ, పూరీలాంటి వాటితో అల్పాహారం, మూడు నాలుగు కూరలతో మధ్యాహ్నం, రాత్రి భోజనాన్నీ, సాయంత్రం పాలూ పండ్లను అందిస్తారు. అధర్వణ వేదం తప్ప, మిగిలిన వేదాలను కనీసం పన్నెండేళ్లు చదవాల్సుంటుంది. మరీ ప్రతిభ ఉన్నవారైతే పన్నెండేళ్ల కోర్సును ఆరేడేళ్లలోనూ పూర్తి చెయ్యగలరు. అధర్వణ వేదాన్ని అయిదేళ్లలో పూర్తిచేయొచ్చు.

వేద పాఠశాలలో విద్యార్థులు ఉదయం 4.30 గంటలకు లేస్తారు. 5.30కి వేంకటేశ్వరుని సుప్రభాతం పాడతారు. యోగా సూర్యనమస్కారాలూ, సంధ్యా వందనం పూర్తయ్యాక తరగతులు మొదలవుతాయి. ఇక్కడ వేదాన్ని అభ్యసించాలంటే కనీసం ఎనిమిదేళ్ల వయసు నిండి, ఉపనయనం అయి ఉండాలి. పాఠశాలలో చేరాక త్రికాల స్నానం, త్రికాల సంధ్యావందనం, శిఖ అంగ వస్త్రధారణ, యజ్ఞొపవీతం తప్పనిసరి. విబూధితో కానీ తిలకంతో కానీ నామాలను పెట్టుకోవాలి. ఇతర బడుల్లోలా ఈ పాఠశాలలో శని, ఆదివారాల సెలవులు ఉండవు. పాడ్యమి, అష్టమి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో సెలవులుంటాయి. విద్యార్థులకు ఆట విడుపుగా ఉండేందుకు మధ్యమధ్యలో తిరుమలతో పాటు వివిధ ప్రాంతాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు విహారయాత్రలక్కూడా తీసుకెళ్తారు.

పాఠశాల ఏర్పాటుకు మూలం
మాజీ తితిదే అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు సొంత గ్రామమైన అయి భీమవరంలో ఈ పాఠశాలకు పునాది పడటానికి ఆయన కృషి ఎంతో ఉంది. 25 ఏళ్ల కిందటే ఆయన తమ వూరిలో వేద పాఠశాలను నిర్మించమని అప్పటి తితిదే ఛైర్మన్‌ సుబ్బిరామిరెడ్డిని కోరారు. కానీ అనుకోకుండా ఆ పని వాయిదా పడుతూ వచ్చింది. చివరికి బాపిరాజు తితిదే ఛైర్మన్‌ అయ్యాక బడి మంజూరైంది. దీనికి స్వయంగా ఆయనే కోటి రూపాయల విలువైన భూమిని ఇవ్వడంతోపాటు, గ్రామస్థుల నుంచి మరి కొంత భూమిని సేకరించి ఇచ్చారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకునే ఇక్కడి విద్యార్థుల ప్రతి పుట్టినరోజునీ బాపిరాజు దంపతులు ప్రత్యేకంగా జరుపుతారు. ఆరోజు విద్యార్థికి శాలువా కప్పి సత్కరిస్తారు కూడా. అన్నట్లూ ఈ వేద పాఠశాలలో ఓ గోశాల కూడా ఉంది. కృష్ణుడు మేపినట్లూ చెప్పే గిర్‌జాతి ఆవులను గోపూజ కోసం గుజరాత్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. వసతి గృహానికి అవసరమయ్యే పాలు, పెరుగులకూ ఈ ఆవులే ఆధారం. మన సంస్కృతీ సంప్రదాయాలకు మూలమైన వేదాలను నేర్పించేందుకు తితిదే ఇలా అత్యాధునిక వసతులతో ఉచిత సౌకర్యాలతో పాఠశాలను నిర్వహించడం నిజంగా గొప్ప విషయమే కదూ!

- బీవీఎస్‌ సాయిబాబు, ఈనాడు, భీమవరం
ఫొటోలు: నోబుల్‌, ఆకివీడు


‘కవర్‌’తో దోచేసుకుంటున్నారు!

ఒకప్పుడు శాస్త్రీయ సంగీతం... లేదంటే సినీ సంగీతం. ఇప్పుడో... పాప్‌, ర్యాప్‌, మాషప్‌, హిప్‌హాప్‌, కంట్రీ, జాజ్‌, పంక్‌, మెటల్‌, ఫోక్‌, సైకడెలిక్‌... ఇంకా బోలెడన్ని. అయితే ఇన్ని రకాల సంగీతం అందుబాటులో ఉన్నా పాత, కొత్తల అంతరాల్ని అధిగమించే ఓ ప్రయత్నం కూడా యువతరంలోనే జరగడం విశేషం. సరికొత్తగా శ్రోతల ముందుకు వస్తున్న యువ గాయనీ గాయకులంతా పాత పాటలనూ, కొత్తగా వచ్చిన సామాజిక మాధ్యమాలనూ పెనవేసి విజయానికి వంతెనగా చేసుకుంటున్న తీరు ఆసక్తికరం.

విద్యా అయ్యర్‌ వోక్స్‌... చెన్నైలో పుట్టి అమెరికాలో పెరిగిన ఈ చిన్నది ఇంగ్లిష్‌, మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, ఫ్రెంచ్‌ భాషల్లో అలవోకగా పాడేస్తుంది. కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందిన విద్య రెండేళ్ల క్రితం యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. తొలుత భజనలతో, ఆ తర్వాత మాషప్‌లతో లక్షలాది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఆంగ్ల పాటలకు బాలీవుడ్‌ హిందీ పాటలను కలిపేసి విద్య చేసే ‘మాషప్‌ కవర్‌’లంటే అభిమానులు చెవికోసుకుంటారు.

విద్య, జోనిటా గాంధీ, అర్మాన్‌ మాలిక్‌, శ్రద్ధా శర్మ, ఆకాశా సింగ్‌, సందీప్‌ ఠాకూర్‌, సనా మొయిదుట్టి, అర్జున్‌... వీరంతా ఇప్పుడు యూట్యూబ్‌ సెన్సేషన్లు. లక్షలాది అభిమానులు వీరి సొంతం. వారి హృదయాల్ని కొల్లగొట్టడానికి వీరెంచుకున్న మార్గం ఒకటేే! ఆణిముత్యాల్లాంటి పాత పాటల్ని తమదైన శైలిలో అద్భుతంగా పాడి వీడియో రికార్డు చేయడం, యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయడం... అంతే. వాటితోనే గొప్ప పేరూ సంపాదనతో పాటు ప్రముఖ బ్యాండుల్లో, సినిమాల్లో పాడే మంచి అవకాశాలనూ అందిపుచ్చుకుంటున్నారు. ఏ దేశంలో ఉన్నారూ, ఎక్కడ పనిచేస్తున్నారన్నది ఇప్పుడు ప్రశ్నే కాదు. ఇంట్లో ఉండి కవర్లు చేస్తారు. ఒక దేశమెళ్లి కచేరీలో పాడతారు. మరో దేశంలో సినిమా పాట రికార్డు చేస్తారు. దేశదేశాల్లో తిరిగేస్తూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు.

* ‘కిక్‌ 2’, ‘ఓకే బంగారం’, ‘24’ సినిమాల్లో పాటలు పాడి మెప్పించిన జోనిటా గాంధీ కెనడాలో స్థిరపడిన దిల్లీ అమ్మాయి. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’తో సినీ సంగీతంలోకి ప్రవేశించిన జోనిటా బాలీవుడ్‌లో, దక్షిణాది భాషల్లో ఎన్నో పాడింది. వీటన్నిటికన్నా ఎక్కువగా ఆమెకు పేరు తెచ్చింది యూట్యూబ్‌ కవర్సే. ‘లగ్‌ జా గలే..’ లతా మంగేష్కర్‌ పాడిన హిట్‌ పాట గుర్తుందా? ఆ పాటని జోనిటా తన మధురమైన గొంతుతో పాడుతుంటే అభిమానులు ఆనందంతో వూగిపోతారు. ఇంగ్లిష్‌, తమిళం, తెలుగు, హిందీ భాషల పాటలతో కవర్స్‌, ఒరిజినల్స్‌, మాషప్స్‌ ఎక్కువగా పాడుతుంటుంది జోనిటా.
* కవర్స్‌ అంటే పాత పాటల్ని పాత బాణీలోనే కొత్తగా పాడడం. ఒరిజినల్‌ü్స అంటే సొంతంగా పాట రాసుకుని, బాణీ కట్టి పాడడం. ఇందులో మళ్లీ సింగిల్స్‌, మరో గాయకుడితో లేదా బ్యాండ్‌తో కలిసి పాడేవీ ఉంటాయి. రెండు మూడు భాషల పాటల్ని వినసొంపుగా కలిపేసి పాడేయడమే మాషప్‌. ఒకే భాషలో పాటలు లేదా ఒకే సినిమా పాటలు, ఒకే ఆల్బమ్‌లోని పాటలు... కలిపి కూడా మాషప్స్‌ చేస్తారు. ఇప్పుడు యూట్యూబ్‌ సంగీతాన్ని ఈ కవర్లూ మాషప్‌లే ఉర్రూతలూగిస్తున్నాయి. సినిమా పాటల కన్నా ఎక్కువ వ్యూస్‌ సంపాదిస్తున్నాయి. ఆ రకంగా సంగీతం - సామాజిక మాధ్యమాలు పరస్పరం లబ్ధి పొందుతున్నాయి.
* ముంబయిలో స్థిరపడిన కేరళ కుట్టి సనా మొయిదుట్టి. సనా కర్ణాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాల్లో శిక్షణ పొందింది. మొహెంజొదారో, 24, మేరీ ప్యారీ బిందు లాంటి చిత్రాల్లో పాడింది. 8 భారతీయభాషల్లో, ఇంగ్లిష్‌లో పాటలు పాడే సనాకి కవర్స్‌తో పాటు సింగిల్స్‌ చేయడమంటే ఇష్టం. ‘సనమ్‌’ బ్యాండ్‌తో కలిసి కూడా పలు పాటలు పాడింది సనా. అర్మాన్‌ మాలిక్‌... ఈ పేరు వింటే చాలు టీనేజర్లు ఎగిరి గంతేస్తారు. అర్మాన్‌ వాణిజ్య ప్రకటనలతో మొదలుపెట్టి బాలీవుడ్‌లో అరంగేట్రం చేసి నేపథ్య గాయకుడిగా ఇప్పటికే దక్షిణాది భాషల్లోనూ బోలెడు పాటలు పాడాడు. పాశ్చాత్య సంగీతంతో కవర్స్‌ చేసి అభిమానుల మనసు దోచుకుంటున్నాడు అర్మాన్‌.
* ఏఆర్‌ రెహమాన్‌ లాంటి వారికి వయొలిన్‌ సహకారం అందించిన సందీప్‌ ఠాకూర్‌ పాటల్ని వయొలిన్‌పై వాయిస్తూ మ్యూజిక్‌ కవర్స్‌ చేస్తాడు. శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉండి కూడా యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన మరో గాయని డెహ్రాడూన్‌కి చెందిన శ్రద్ధా శర్మ. ‘సనమ్‌ తేరీ కసమ్‌’ చిత్రంలో ‘ఖీచ్‌ మేరీ ఫొటో...’ అంటూ యువ హృదయాలను కొల్లగొట్టిన ఆకాశా సింగ్‌ని ‘బోర్న్‌ సోషల్‌ మీడియా స్టార్‌’ అంటారు అభిమానులు. శ్రీలంకలో పుట్టి లండన్‌లో స్థిరపడిన తమిళుడు అర్జున్‌. ‘వై దిస్‌ కొలవెరి డీ..’ పాటకి కవర్‌ వెర్షన్‌తో యూట్యూబ్‌ సంచలనమైన అర్జున్‌తో టి సిరీస్‌ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.

‘కవర్లూ, మాషప్‌లూ త్వరగా ప్రాచుర్యం పొందడానికి పనికొస్తాయి. ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవాలంటే ఒరిజినల్స్‌ పాడాలి. అప్పుడే వ్యక్తిగత ప్రతిభ పూర్తిగా ప్రదర్శించవచ్చు’ అంటున్నారు వీరు.


 

అన్నార్తుల సేవలో.. భక్తి వేదాంత ఆశ్రమం!

‘అడగందే అమ్మయినా పెట్టదు’ అంటారు. కానీ అమ్మకన్నా మిన్నగా ఆకలితో అలమటించే పేద ప్రజలను గుర్తించి, అడగకుండానే వాళ్ల ఆకలి తీరుస్తూ బతుకుమీద ఆశను చిగురింపజేస్తోంది విజయనగరానికి చెందిన భక్తి వేదాంత ఆశ్రమం. ఆ వివరాల్లోకి వెళితే...