close
మనోజ్‌, నేనూ తప్పిపోయాం!

మనోజ్‌, నేనూ తప్పిపోయాం!

సినీ పరిశ్రమలో ‘నేను హీరో’ అని చెప్పుకోవడానికి ఇష్టపడేవాళ్లే ఎక్కువ. కానీ ఆ గుర్తింపు ఉన్నప్పటికీ తనని నటుడిగా పిలిపించుకోవడానికే ఇష్టపడతానంటున్నాడు ఆది పినిశెట్టి. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడే ఆది. ‘సరైనోడు’లో స్టైలిష్‌ విలన్‌గా మెప్పించి, ఇటీవల ‘మరకతమణి’తో అలరించిన ఆది... త్వరలో ‘నిన్ను కోరి’తో సందడి చేయబోతున్నాడు. ఈ సందర్భంగా తన సినీ ప్రస్థానాన్ని వివరిస్తున్నాడిలా...

ల్లిదండ్రులు చేసే ఉద్యోగం, వృత్తికి సంబంధించిన విషయాలు పిల్లలకూ అప్రయత్నంగానే తెలుస్తాయి. అదే తరహాలో నాపై సినిమా ప్రభావం పడింది. నాకు వూహ తెలిసేటప్పటికే నాన్నగారు దర్శకుడు. దాంతో ఇంట్లోనూ ఎప్పుడూ సినిమా వాతావరణమే కనిపించేది. తరచూ సహాయ దర్శకులూ, నటులూ వస్తుండేవారు. వాళ్లు మాట్లాడుకునే మాటలు నా చెవిన పడుతూనే ఉండేవి. నేను అటువైపు ఆకర్షితమైంది మాత్రం లేదు. కాకపోతే అందరు పిల్లల్లాగే ఏదైనా సినిమా చూసినపుడు ‘ఇందులో హీరోలా మనం కూడా ఫైట్లూ డాన్సులూ చేయాలి’ అని మాత్రం అనిపించేది. అదీ సినిమా చూసి బయటికొచ్చిన ఆ కాసేపే. ఆ తర్వాత మళ్లీ మర్చిపోయేవాణ్ని. నాన్నగారు కూడా మమ్మల్ని సినిమా సెట్స్‌కి ఎక్కువగా తీసుకెళ్లేవారు కాదు. మహా అయితే ఆయనతో నాలుగైదు సార్లు వెళ్లుంటానేమో! చదువుపైనే దృష్టిపెట్టమని చెప్పేవారు. దాంతో అన్నయ్య, స్నేహితులు, స్కూలు... వీటిచుట్టూ తిరిగేది నా జీవితం.

అన్నయ్య వల్ల కష్టాలు
చిన్నపుడు అల్లరి ఎక్కువగా చేసేవాణ్ని. అలాగని అందరి దగ్గరా కాదు. నన్ను బాగా దగ్గరగా చూసిన వాళ్లకే ఆ విషయం తెలిసేది. కొత్తవాళ్లకి బుద్ధిమంతుడిలా కనిపించేవాణ్ని. అన్నయ్యా(సత్య ప్రభాస్‌), నేనూ చీటికీమాటికీ గొడవ పడేవాళ్లం. తనతోనే ఉండేవాణ్ని కాబట్టి అన్నయ్యే నా అల్లరిని భరించేవాడు. కాస్త వూహ తెలిశాక మాత్రం ఒకరికోసం ఒకరమయ్యాం. అన్నయ్యని ఎవరైనా ఏమన్నా అంటే వూరుకునేవాణ్ని కాదు. నా విషయంలో అన్నయ్యా అంతే. తను ఎప్పుడూ స్కూల్‌ ఫస్ట్‌ వచ్చేవాడు. ఆటల్లోనూ ముందుండేవాడు. కొన్నాళ్లు లండన్‌లో చదివాడు. అక్కడ కూడా ఫస్టే. అన్నయ్యని పలకరించిన ప్రతివారూ ‘నీకెన్ని మార్కులు వచ్చాయ’ని నన్నూ అడిగేవారు. దానివల్ల పుస్తకాలతో కాస్త ఎక్కువ కుస్తీ పట్టేవాడిని. నేను పెద్ద సైజు అద్దాలు పెట్టుకొని అదే పనిగా చదవడం చూసిన నాన్న ‘మరీ ఎక్కువగా కష్టపడొద్దులేరా, అన్నయ్య ఎలా చదువుతున్నాడో చూసి నేర్చుకో’ అనేవారు. దాంతో ‘అవును... నాన్న చెప్పింది నిజమే, మరీ అంత కష్టపడి ఎందుకు చదవడం’ అనుకునేవాణ్ని. అన్నయ్యలా నాకెపుడూ ఫస్ట్‌ రాలేదు కానీ, మంచి మార్కులు మాత్రం వచ్చేవి. చెన్నైలోనే ఇంజినీరింగ్‌ పూర్తిచేశా.

పైలట్‌ అవుదామనుకున్నా
నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు చూడాలనీ, అక్కడి సంస్కృతీ, సంప్రదాయాలూ, ఆహారపుటలవాట్లూ తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటుంది. పైలట్‌ అయితే ఇంకా ఎక్కువగా ప్రయాణాలు చేయొచ్చనుకొని అమెరికాలోని పనామా యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకున్నా. అదే సమయంలో నాన్న ఒకరోజు దాసరి నారాయణరావు గారిని కలిసొచ్చి ‘నువ్వు సినిమా చేస్తున్నావు. వెళ్లి గురువుగారిని కలువు’ అన్నారు. ‘నాకు నటన తెలియదు, నేను సినిమా చేయడమేంటి నాన్నా’ అని చెప్పినా ‘నేర్చుకో, అదే వస్తుంది’ అన్నారు. దాంతో నేను దాసరిగారిని కలిశాక ‘ఒక విచిత్రం’ సినిమాలో చేయమన్నారు. ఆ సినిమా ప్రారంభానికి ముందు వైజాగ్‌లో సత్యానంద్‌ గారి దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాను. చిన్నప్పుడు అందరూ సరదాగా ‘పెద్దయ్యాక అన్నయ్య హీరో, నువ్వు డైరెక్టర్‌ అవుతారు’ అనేవారు. ఎందుకంటే, అన్నయ్య నాకంటే అందగాడు. కానీ చిత్రంగా నేను తెర పైకివచ్చా. నేనైనా స్కూల్లో అప్పుడప్పుడూ స్టేజ్‌ షోలు చేసేవాణ్ని. అన్నయ్యకి మొదట్నుంచీ నటనంటే ఇష్టం లేదు.

గుర్తింపు తెచ్చిన సినిమాలు
తేజాగారి దర్శకత్వంలో ‘ఒక విచిత్రం’ చేశా. ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు కానీ నటుడిగా మాత్రం నాకు చాలా విషయాల్ని నేర్పింది, సినిమాని ఎంతగా ప్రేమించి చేయాలనేది ఆయన్ని చూసి నేర్చుకున్నా. ఆ సినిమా బాగా ఆడకపోయేసరికి మళ్లీ పైలట్‌ అవ్వాలనే లక్ష్యంపైన దృష్టిపెట్టా. పనామా యూనివర్సిటీలో సీటు కూడా వచ్చింది. అంతలో మళ్లీ అనుకోకుండా ‘మృగం’లో నటించే అవకాశం వచ్చింది. ఎయిడ్స్‌ నేపథ్యంతో తీసిన ఆ సినిమా కథ బాగా నచ్చింది, అదే సమయంలో ‘ఇది నేను చేయగలుగుతానా?’ అనే సందేహమూ కలిగింది. కానీ ఒక సవాలుగా తీసుకొని ఆ సినిమా చేయాలనిపించింది. సినిమా తర్వాత పైలట్‌ కోర్సు చేద్దామనుకొని వెంటనే ఓకే చెప్పా. ఆ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా చాలా మారాల్సి వచ్చింది. తొలి సగభాగం కోసం బరువు పెరిగి, మలి భాగం కోసం 20 కిలోలు తగ్గాను. చెప్పులు కూడా లేకుండా తిరుగుతూ, మృగంలాంటి మనిషిలా కనిపించడం కోసం చాలా కష్టపడ్డా. ఫలితం కూడా అందుకు తగ్గట్టుగానే వచ్చింది. తమిళంతో పాటు, తెలుగులోనూ బాగా చూశారా సినిమాని. అక్కడైతే ‘మరో మంచి నటుడొచ్చాడు’ అని అభినందించారు. నాక్కూడా ‘మనలో ఏదో ప్రత్యేకత ఉంది’ అనే నమ్మకం కలిగింది. స్పష్టత లేనప్పుడే బాగా చేశానంటే, మరింత కష్టపడ్డానంటే ఇంకా బాగా పేరు తెచ్చుకోగలను కదా అనుకున్నా. ‘మృగం’ చేస్తున్నప్పుడూ, ఆ సినిమా పూర్తయ్యాకా వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ పాత్రలో లీనమైన ప్రభావం వల్లనేమో, బయట కూడా దురుసుగా మాట్లాడేసేవాణ్ని. శారీరకంగా, మానసికంగా ఆ సినిమా కోసం అంతగా నన్ను నేను మార్చుకున్నా. కొద్దిమంది స్నేహితులు కూడా ‘హీరో అయ్యాక వీడు మారిపోయాడ్రా’ అంటూ నాకు దూరమయ్యారు. ‘వైశాలి’లో పాత్రకి తగ్గట్టుగా నన్నూ, నా నటనా శైలినీ మార్చడానికి ఆ చిత్ర దర్శకుడు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ‘నీలో మంచి నటుడు ఉన్నాడు’ అంటూ, ‘వైశాలి’ కోసం నాలోని నటుణ్ని మరింత బాగా బయటకు తీసుకొచ్చాడా దర్శకుడు.

ప్రత్యేకమైన ‘మలుపు’
‘ఏకవీర’, ‘గుండెల్లో గోదారి’, ‘మలుపు’ చిత్రాలు కూడా నటుడిగా చాలా సంతృప్తినిచ్చాయి. గుండెల్లో గోదారి షూటింగ్‌కి నది దగ్గరికి వెళ్తే, ‘నిన్న ఇక్కడే ఇద్దరు నీళ్లలో మునిగి చనిపోయారు’ అన్నారొకరు. ఆ నీళ్లలోనే దిగి ఈత కొట్టాలి. నా గుండె కొట్టుకునే వేగం అమాంతం పెరిగిపోయింది. అలాగని వెనక్కి వెళ్లిపోలేదు. ‘మలుపు’ నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. నిజంగా జరిగిన సంఘటన నేపథ్యంతో అన్నయ్య ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. నాకు నటుడిగానూ మంచి అనుభవాన్నిచ్చిందా సినిమా. అన్నయ్య అమెరికా వెళ్లి దర్శకత్వంలో శిక్షణ తీసుకున్నాడు. సెట్‌లో నటులతో మాట్లాడుతూ, వాళ్లకు స్వేచ్ఛనిస్తూ సహజంగా నటనని రాబట్టుకునే అన్నయ్య శైలి నాకు బాగా నచ్చుతుంది. ఇంట్లోనే ఇద్దరు దర్శకులున్నారు కాబట్టి, వాళ్ల సలహాలు కచ్చితంగా తీసుకుంటా. పాత్రల విషయంలో అంతిమ నిర్ణయం మాత్రం నాదే. సంప్రదాయానికి భిన్నంగా ఒక్క పాటా, ఫైటూ లేకుండా ఇటీవల వచ్చిన ‘మరకతమణి’కి మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. ఇలాంటి విజయాలు మరిన్ని ప్రయోగాలు చేయడానికి ఉత్సాహాన్నిస్తాయి.

ప్రతినాయకుడిగా...
నన్ను నేను ఓ కథానాయకుడిగా కంటే నటుడిగా చెప్పుకోవడానికే ఇష్టపడతా. నటుడనేవాడు ఎలాంటి పాత్రలతోనైనా మెప్పించగలగాలి. తమిళంలో కూడా నన్ను నేను కథానాయకుడిగా అనుకోను. అక్కడ కథానాయకుడి పాత్రలు చేస్తున్నప్పటికీ ప్రేక్షకులు నన్ను ఓ నటుడిగానే చూస్తారు. నా సినిమాల్ని గమనిస్తే ఏ రెండు కథలకీ, ఏ రెండు పాత్రలకీ మధ్య అసలు పోలికలు ఉండవు. అలా విభిన్నమైన పాత్రలు చేస్తేనే నాకు కిక్‌ ఉంటుంది. అందులో భాగంగానే తెలుగులో ప్రతినాయక ఛాయలున్న పాత్రల్నీ చేస్తున్నా. ‘సరైనోడు’లో ‘వైరం ధనుష్‌’ పాత్రకి ప్రత్యేకంగా ఓ సిద్ధాంతం ఉంటుంది. కథానాయకుడి సిద్ధాంతానికీ, ప్రతినాయకుడి సిద్ధాంతానికీ మధ్య జరిగే పోరుతోనే ఆ చిత్రం సాగుతుంది. అలా ఓ సిద్ధాంతం ఉన్న పాత్రల్నే చేస్తాను తప్ప, అసాంఘిక చర్యలకే పరిమితమై సాగే పాత్రల్ని మాత్రం చేయను. నానీతో చేస్తున్న ‘నిన్ను కోరి’, రామ్‌చరణ్‌తో ‘రంగస్థలం’, పవన్‌ కల్యాణ్‌ - త్రివిక్రమ్‌ కలయికలో తెరకెక్కుతున్న చిత్రంలోని పాత్రలు నటుడిగా నాకు మరింత పేరును తెస్తాయి.

త్వరలోనే పెళ్ళి
మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే నా ముందున్న లక్ష్యం. మంచి ఆలోచన వచ్చి సినిమా చేయాలనిపిస్తే భవిష్యత్తులో కచ్చితంగా దర్శకత్వం చేస్తా. ప్రస్తుతానికి దృష్టి పెట్టిన విషయం అంటే... పెళ్లి. నాకు సింపుల్‌గా ఉండే అమ్మాయిలు నచ్చుతారు. అంతే తప్ప, ఎవరినీ ప్రేమించిందైతే లేదు. ప్రేమ గురించి తెలీదు కానీ, స్నేహం గురించైతే ఎంతైనా చెబుతాను. నాకు స్నేహితులూ తక్కువే. కానీ ఉన్న కొద్దిమందితో బంధం బలంగా ఉంటుంది. మంచు మనోజ్‌, నేనూ చిన్నప్పట్నుంచీ దోస్తులం. కరాటే క్లాస్‌లో మేం పరిచయమయ్యాం. జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి. నాకలా పది జ్ఞాపకాలు ఉంటే వాటిలో అయిదారు మనోజ్‌తో ముడిపడినవే. మనోజ్‌లాంటి ఒక్క స్నేహితుడుంటే చాలు... వెయ్యి మంది స్నేహితులతో సమానం. మేం ఎప్పుడు కలిసినా చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకొని నవ్వుకుంటుంటాం. నాన్న, మోహన్‌బాబు అంకుల్‌ కలిసి చేసిన ఓ సినిమా షూటింగ్‌ కోసం యూనిట్‌ ఫ్రాన్స్‌ వెళ్తుంటే, వారితోపాటు మా రెండు కుటుంబాలూ వెళ్లాయి. అక్కడో రోజు అందరూ షూటింగ్‌ పనిలో ఉండగా మనోజ్‌, నేనూ ఓ బస్సెక్కి ఎటో వెళ్లిపోయాం. కాసేపటి తర్వాత అక్కడికి తిరిగొచ్చి చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. మా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. మాకు ఫ్రెంచ్‌ రాదు. ఇంగ్లీషు కొంచెం కొంచెం వచ్చినా అక్కడ ఎవ్వరూ ఇంగ్లీషులో మాట్లాడరు. సినిమా బృందాన్ని చూశారా అంటూ మేం సైగలు చేసి ఎంత అడిగినా ఎవ్వరూ సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. ఇక చేసేదేం లేక నది పక్కన ఇద్దరమూ టోపీలు ముందు పెట్టుకొని తెలుగు పాటలు పాడుతూ కాసేపు బిచ్చగాళ్ల అవతారమెత్తాం. కొంతమంది డబ్బులేశారు. వాటిని తీసుకొని మళ్లీ బస్సెక్కాం. దారిలో ఓ చోట జనం గుమికూడి ఉండటం చూసి అక్కడ దిగాం. చూస్తే అక్కడ నాన్నావాళ్లు ఉన్నారు. హమ్మయ్యా అనుకొన్నాం. ఇలాంటి క్రేజీ విషయాలు మా జీవితాల్లో చాలా ఉన్నాయి.


పర్యటనలు ఆగలేదు

నా అసలు పేరు సాయి ప్రదీప్‌.
* అమ్మ... రాధారాణి. నేను ఆఫీసులో కూర్చునే ఉద్యోగం చేయాలని కోరుకునేది.
* ప్రపంచంలో వీలైనన్ని ప్రాంతాలు చుట్టి రావాలనేది నా ఆశ. ఇప్పటివరకూ స్విట్జర్లాండ్‌, ఫిలిప్పీన్స్‌, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, మలేషియా, అమెరికా, కెనడా, న్యూజిలాండ్‌ తిరిగొచ్చా. ఇంకా చాలా దేశాలు వెళ్లాలి. మనతో పాటు చివరివరకూ ఉండేది ఈ ప్రయాణ అనుభూతులే.
* సినిమాలు చూడటం, వ్యాయామాలు చేయడం నా హాబీ.
* చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌గారు మా ఇంటికి వచ్చిన రోజులు నాకు బాగా గుర్తు. ఇప్పుడు పవన్‌తో కలిసి నటిస్తుండడం ఓ మంచి అనుభవం. పవన్‌ చిత్రంలో ఓ యువ వ్యాపారిగా కనిపిస్తా.
* రామ్‌చరణ్‌తో కలిసి ‘రంగస్థలం’లో నటిస్తున్నా. ఆ సినిమా షూటింగ్‌ కోసం గోదావరి జిల్లాలకు వెళ్లినప్పుడల్లా తాతగారిని చూడటానికి పాలకొల్లు వెళుతున్నట్టే ఉంటుంది. తాతయ్య శ్రీరామమూర్తి. ఆయన నాటకాలు రాసేవారు. అల్లు రామలింగయ్య గారు, రేలంగి గారు.. ఇలా చాలామంది ఆయన రాసిన నాటకాల్లో వేషాలు వేశారు.
* చదువుకున్నది తమిళ మీడియంలో... కానీ సెలవుల్లో పాలకొల్లు, అమ్మమ్మవాళ్ల వూరు గుంటూరు వెళ్లినపుడు అన్నయ్యా, నేనూ తెలుగు రాయడం, చదవడం నేర్చుకున్నాం.
* సినీ పరిశ్రమలో నాకున్న మరో మంచి మిత్రుడు నాని. తక్కువ కాలంలోనే మేం మంచి స్నేహితులమయ్యాం.

- నర్సిమ్‌ ఎర్రకోట

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.