close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లోపలి మనిషి

లోపలి మనిషి
- శేష చంద్ర

దివారం కాస్త ఎక్కువసేపు పడుకోవాలన్న నా ప్రయత్నానికి గండికొడుతూ ఇంట్లో పాత్రలతో పచ్చడి చేస్తున్నట్లు ఒకటే చప్పుడు వస్తుండటంతో విసుగ్గా లేచాను. బహుశా పనిమనిషి మళ్ళీ డుమ్మా కొట్టినట్లుంది- ఆ కోపాన్నే నా భార్యామణి పాత్రల మీద చూపిస్తుందనుకుని నిద్రకు గుడ్‌బై చెప్పి లాన్‌లో కూర్చున్నాను వచ్చి.పేపర్లో మునిగిపోయిన నాకు గేటు దగ్గర్నుంచి తీయని కంఠస్వరం పిలిచినట్లు అనిపించి తలతిప్పి ఆవైపు చూశాను. ఎవరో ఒకామె గేటు దగ్గర నిల్చుని ఉంది. నడిచి వచ్చిన అజంతా శిల్పంలా ఉందామె. ఎప్పుడూ ఆడవాళ్ళని అంతగా పట్టిచూడని నేను ఆమెను చూస్తూ ‘ఏం కావాలి?’ అని అడగడం కూడా మరచిపోయి అలాగే చూస్తూండిపోయాను. నా చూపులు ఆమెమీద నర్తిస్తుంటే మాట్లాడేందుకు కూడా నోరు సహకరించలేదు.

‘‘అయ్యగారూ, అమ్మగారు లేరా?’’ అని అడుగుతోంది.

నేను ఉందని చెప్పానేమో... దాంతో గేటు తెరుచుకుని లోపలికి వచ్చింది. దగ్గరికి వచ్చిన ఆమెను మరింత పరికించి చూశాను. ఆమె చాలా అందంగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే బాపు బొమ్మ కాస్త ఒళ్ళు చేసినట్లు ఒద్దికగా బొద్దుగా ఉంది. కట్టింది పాతచీరైనా, మెళ్ళొ పసుపుతాడు తప్ప మరో నగ లేకపోయినా, బారెడు జడ కాకపోయినా, వీపును దాటి వచ్చి రింగులు తిరిగిన నల్లని వత్తైన కురులతో... నా చూపులు తనని పట్టిపట్టి చూస్తున్నట్లనిపించి... ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడడంకాక కళ్ళు కోపంతో ఎర్రబడుతుంటే... సంస్కారం మరిచి అలా చూస్తున్నందుకు సిగ్గుపడి చూపులు పక్కకు తిప్పుకుని ‘ఏం కావాలి’ అని అడిగేంతలో నా శ్రీమతి పాత్రలతోనూ చీపురుపట్టి నేలతోనూ యుద్ధంచేసి అలిసిపోయి నిట్టూరుస్తూ బయటికి వచ్చింది.

నా ఎదురుగా ఉన్న ఆమెను చూస్తూ వచ్చి నాపక్కన కూర్చుంది. నా శ్రీమతిని చూసి ఆమె హోమ్‌ డిపార్ట్‌మెంటు అనుకుని కాబోలు నమస్కారం పెట్టింది. ఆపైన ‘‘మాది పక్కనున్న నల్లతుమ్మ చెరువండి. ఈ మద్దెనే ఆడుండలేక, ఈడకి ఒచ్చినాం. నాకో పిల్లోడుండాడు. నా మొగుడు ఆటో నడుపుతాడు...’’ అంటూ చెప్పబోతుంటే-

నా శ్రీమతి ఆమె చెప్పేది పూర్తిగా వినడం ఇష్టంలేనట్లు ‘‘ఇంతకూ ఏం కావాలి నీకు?’’ అని అడిగింది.

దాంతో ఆమె కొద్దిగా తటపటాయించి, తన మాటలను మళ్ళీ కొనసాగించింది. ‘‘మేము ఈ పక్కన దగ్గరనున్న గుడిసెల్లో ఉంటాండాం. వోడు ఆటో తోల్తే వచ్చే పైసలు ఈ పట్నంలో యాడ సరిపోతాయని నాల్గిండ్లలో పనిసేయాలని అనుకుని పని కోసరం అడగను వచ్చినా...’’

అంత అందమైన అమ్మాయి పనిమనిషా? మనసెందుకో అంగీకరించలేదు నాకు.

పనిమనిషి రావడం- వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లనిపించింది నా శ్రీమతికి. లేకపోతే కొత్త పనిమనిషి దొరికేంత వరకూ చాలా ఇబ్బందిపడేది. లోలోపల సంతోషపడుతూనే బయటపడకుండా ‘‘ఇంతకుముందు ఎక్కడన్నా పనిచేశావా?’’ అడిగింది.

‘‘లేదమ్మగోరూ, పల్లెకాడినుంచి ఈమద్దెనే వచ్చినం. యాడా పనిసేయలా. గత్తెంతరం నేకనే పని సేయాలనుకొంటుండా’’ అందామె.

ఆమె నైజమేమిటో తెలుసుకోవాలని నా శ్రీమతి- జీతం ముందిచ్చే ఆమెకన్నా ఓ రెండువందలు తక్కువ చెప్పి, చేయాల్సిన పనులు ఏకరువు పెట్టింది. కాకపోతే రెండుపూటలా భోజనం, టిఫిన్‌ పెడతానంది. దానికి ఆమె ఒప్పుకుంటుందనుకోలేదు.

కానీ, ఆమె ‘‘నాల్గిండ్లలో పాచిపని సేసే బదులు, ఈడ్నే అన్ని పనులు చేసుకునే ఒక ఇల్లు దొరికినాది. పైసల్తోపాటు రెండుపూటలా ఇంత తిండి పెడ్తామంటాండరు. అంతకన్నా ఏం గావాలమ్మా’’ అంది సంతోషంగా.

నా శ్రీమతి జీతం తక్కువ చెప్పినందుకు కొద్దిగా గిల్టీగా ఫీలైనట్లు కనపడింది. నేను బిజినెస్‌ పరంగా డబ్బులు బాగానే వెనకేశాను. ఉన్న ఒక్క కొడుకూ హైదరాబాదులో హాస్టల్లో ఉంటున్నాడు. మాకంటూ ఏ చీకూ చింతా లేవు. అంతేకాదు, నాదీ నా శ్రీమతిదీ ఒకే మనస్తత్వం. సాటివారికి చేతనైనంత సహాయం చేయడం మా అలవాటు. ఆమెను చూస్తుంటే నాలో రేగే అలజడికి నాలో మరోమనిషి దాగి ఉన్నాడన్న నిజం బైటికొచ్చింది. ఆ మరోమనిషి ఆమెను చూసిన కొన్ని క్షణాలకే అంత ప్రభావితమైతే రేపటినుంచీ ఆమె ఇక్కడే పనిచేస్తూ నా ఎదురుగా కనిపిస్తుంటే... నా శ్రీమతి షరతులకు ఆమె ఒప్పుకోకపోయినా లేదూ నా శ్రీమతే వద్దన్నా సరిపోయేది అనుకున్నాను. మళ్ళీ అంతలోనే ‘ఛ, నేనంత బలహీనుణ్ణా’ అని నన్ను నేనే ప్రశ్నించుకుని, నాలో చెడు ఆలోచనలను లేపుతున్న లోపలి మనిషి కోరికల్ని మొగ్గలోనే తుంచేయాలనుకున్నాను.

* * *

ఆమె చేరిన నెలరోజులు సాఫీగానే గడిచిపోయాయి. నేను కూడా ఆమెను గురించి ఆలోచనలను రానీయలేదు. ఆమె నాకు ఎదురైన సందర్భాలూ తక్కువ. బహుశా నా కంటపడకుండా తను జాగ్రత్తపడుతుండటం కావచ్చు. ఇల్లంతా ఎప్పుడూ నీట్‌గా సర్దుతూ ఒకటికి నాలుగు పనులు అందుకుని చేస్తూ, నా శ్రీమతికి చాలా ప్రేమపాత్రమైపోయింది. నేను ఎవరికో తెలియని వ్యక్తికి- టీవీలో వచ్చే వార్త చూసి రక్తదానం చేయడం, చాలామందికి డబ్బులిచ్చి సహాయం చేయడంలాంటి సంఘటనలు తన కళ్ళముందే జరగడంతో నేను చెడ్డవాడినికానని ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్లుంది. అందుకే ఆమె నా ఎదుటపడటం, ఆఫీసు నుంచి వచ్చేటప్పటికి నా శ్రీమతి అందుబాటులో లేకపోతే మంచినీళ్ళు కావాలా అని అడగడం, కాఫీలు ఇవ్వడం చేయసాగింది. వేళకింత తిండి తినడం, నీడపట్టున ఉండటంతోపాటు నా శ్రీమతి ఇచ్చిన చీరల్లో ఆమె మరింత అందంగా కనిపిస్తుంటే, నా లోపలి మనిషి కోరికలతో నేను సతమతమైపోసాగాను.

ఒకరోజు నిద్రలేవగానే పక్క రూములోంచి లోగొంతుకలో ఆమె ఏడుపూ, దాంతోపాటు నా భార్య ఓదార్పూ వినిపించడంతో ఆత్రుతతో అక్కడికి నడిచాను. నన్ను చూసి ఆమె చెంపల మీద నుంచి కారే కన్నీళ్ళను తుడుచుకుంటూ తల దించుకుని ముడుచుకు కూర్చుంది. నా శ్రీమతి ‘‘వాడు మనిషి కాదండీ, పశువు. తాగివచ్చింది చాలక, ఎందుకు అంత తాగుతావు అన్నందుకు ఎలా కొట్టాడో చూడండి’’ అంటూ ఆమె ముఖం పైకెత్తి చూపింది. పెదాలు చిట్లిపోయాయి. నుదుటిమీద చిన్న సైజు నిమ్మకాయంత బుడిపె కట్టింది. ఇక చేతులమీదా వీపుమీదా ఎర్రటి చారలు... నాకు వాడిమీద విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే వాణ్ణి రప్పించి చితకబాదాలనిపించింది.

ఆమె మొగుడికి గట్టిగా వార్నింగ్‌ ఇవ్వాలని- ఆఫీసుకు పోగానే నేను వాణ్ణి రప్పించాను మనిషిని పంపి. వయసు పాతికలోపే అయినా ముప్ఫై దాటినవాడిలా ఉన్నాడు. గడ్డం చిందరవందరగా ఉంది. చిరిగిపోయిన ఖాకీ చొక్కా, మురికిపట్టిన జీన్స్‌ ప్యాంట్‌. వాడి కళ్ళలోకి సూటిగా చూశాను. రాత్రి తాగిన కైపు ఇంకా తగ్గలేదో లేక మళ్ళా వేసుకున్నాడో తెలియదు... కళ్ళు నిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. నావైపు నిర్లక్ష్యంగా ఎందుకు పిలిచారనట్లు చూడసాగాడు.

‘‘నీ భార్య మా ఇంట్లో పనిచేస్తుంది...’’ వాడి ముఖంలో మునుపటి నిర్లక్ష్యం కొద్దిగా తగ్గింది. నావంక సూటిగా చూడలేక కనురెప్పలు కిందికి వాల్చాడు. ‘‘అయినంత మాత్రాన పిలిచి నీకు నీతులు చెప్పాల్సిన అవసరం నాకు కానీ, వినాల్సిన అవసరం నీకుగానీ లేదు. కాకపోతే, నీ భార్య ముఖం చూసి- నీ తాగుడు మానగలిగితే, మీ జీవితం బాగుపడేందుకు ఓ సరుకులు వేసే ట్రాలీ ఆటోను నేను పూచీ ఉండి నీకిప్పిస్తాను. దానికి తగ్గట్టు పనికూడా చూపిస్తాను. మంచిగా బతుకు. లేదూ, నేను మారను మారలేను అంటే, నీ భార్యను కూడా పనిలోంచి తీసేస్తాను. నీ భార్య రోజూ ఏడుస్తూ మా ఇంట్లో పనిచేయడం నాకిష్టంలేదు’’ అన్నాను.

దాంతో వాడు చాలా వినయంగా తాను మారతానని వాగ్దానం చేశాడు. వాడు మాట మీద నిలకడలేని మనిషని ఆమె వద్దంటున్నా, నేను (ఆమెపట్ల ఆకర్షితుడినై సగం, ఒక కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మిగతా సగం), నా భార్య మాటనూ ఆమె మాటనూ బేఖాతరు చేసి వాడికి వెహికల్‌ లోన్‌ ఇప్పించాను. దానికితగ్గ పని కల్పించాను. రెండు నెలల్లో వాడిలో వచ్చిన మార్పువల్ల లోన్‌ కంతు కట్టడంతోపాటు బ్యాంకు అకౌంటు ఓపెన్‌ చేసి సుమారైన మొత్తం అందులో జమ చేయగలిగాడు. దాంతో ఆమె నాపట్ల మరింత అభిమానం చూపసాగింది. ఇంకేముంది, నాలోని లోపలి మనిషి మరింత దిగజారిపోయాడు. పైకి నేనెంత హుందాగా ప్రవర్తించాలనుకుంటున్నా సాధ్యంకాలేక సతమతమైపోసాగాను. ఆమె సాన్నిహిత్యం కోసం లోపలి మనిషి ఉవ్విళ్ళూరుతుంటే, వాడి ఆలోచనలకు వ్యతిరేకంగా నడుచుకునేందుకు విశ్వప్రయత్నం చేయసాగాను. మరో నెల గడిచేసరికి బాగుపడుతున్నామన్న సంతోషం ఆమెకూ, ఒక కుటుంబాన్ని బాగుపరిచామన్న తృప్తి మాకూ లేకుండా వాడు తాగి మళ్ళీ భార్యను కొట్టడం మొదలుపెట్టాడు. నేను వెంటనే మనుషుల్ని పంపి, వాడి దగ్గర్నుంచి ఆటో తెప్పించుకున్నాను. దాంతో వాడు దిమ్మతిరిగి ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇక తాగనని పదేపదే ప్రాధేయపడ్డాడు. మొదటిసారిగా- క్షమించమని ఆమె వేడుకుంది. దాంతో మరోసారి వాడికి అవకాశం ఇవ్వడం కోసం ఆటో తిరిగి ఇచ్చేశాను. నా శ్రీమతి చిరిగిపోయిన వాడి బట్టలు చూసి, జాలిపడి నా బట్టలు ఓ నాలుగు జతలు పాతవి ఇచ్చి పంపింది.

* * *

మా అత్తగారికి బాగోలేదని తెలిసి నా శ్రీమతితో పాటు వెళ్ళిన నేను, అత్తగారి ఆరోగ్యానికి ఢోకా లేకపోయినా నా శ్రీమతి తన తల్లి దగ్గరే ఇంకో రెండు రోజులుంటాననడంతో తనని అక్కడే వదిలి ఒంటరిగానే ఇంటికి వచ్చేశాను. ఇంటికి వచ్చినప్పట్నుంచీ నా మనసులో పనిమనిషి ఆలోచనలు నిండిపోయాయి. ఆమె రూపాన్ని వివిధ కోణాల్లో చూపుతూ నాలోని మనిషి నన్ను రెచ్చగొడుతుంటే వాటిని తొక్కిపెట్టడం నాకు సాధ్యంకాలేదు. విపరీతమైన కోర్కెలు బుసలు కొడుతుంటే ఎప్పుడో మూడింటికి నిద్రపోయాను.

కాలింగ్‌బెల్‌ విని వాకిలి తీసిన నాకు ఆమె అప్సరసలా కనిపించింది చంకలో బిడ్డ ఉన్నా. ఆమె చనువుగా లోపలికి రాబోతుంటే, నన్ను నేను నిగ్రహపరుచుకునే ప్రయత్నంలో ‘‘అమ్మగారు రాలేదు, రెండు మూడు రోజులు నీ అవసరం లేదులే’’ అన్నా నా లోపలి మనిషి గొంతునొక్కి.

నా లోపలి మనిషి నా మాటకు సరేనని ఎక్కడ వెళ్ళిపోతుందోనని తెగ బాధపడుతుంటే, ఆమె ‘‘భలేవారే సారూ మీరు, అమ్మగారు లేకపోతే ఏంది, మీరుండారు గదా. అమ్మగారు లేకుంటే ఇల్లట్లా ఇడిసి సూత్తా యాడుండబుద్దవుద్ది. అమ్మగారున్నా నేకున్నా ఇల్లట్లానే ఉండాలా సుబ్రంగా. అమ్మగారు లేని కొరత ఉండనీయ’’ అంది.

దానికి ద్వంద్వార్థాలు తీసుకున్న నాకు ఆమె ఒక అడుగు ముందుకేసినట్లన్పించింది. నేను వెనక్కి ఒక అడుగు వేశాను ఆమెకు దారిస్తూ.

లోపలికి వచ్చిన ఆమె పిల్లోడ్ని ఓచోట పండబెట్టి ‘‘పెద్దమ్మగోరికి ఎట్టా ఉంది సారూ?’’ అనడిగింది.

తర్వాత మామూలుగా తన పనులు తను చేసుకుపోతూ ఆమె పక్కనే తచ్చాడుతున్న నన్ను అత్తగారింటి దగ్గర విషయాలు అడగసాగింది. ఆమెనలా ఒంటరిగా చూస్తుంటే నాకు మాటలు కరువయ్యాయి. కానీ, ఆమెకు చేస్తున్న పనిమీద తప్ప మరో ఆలోచన ఉన్నట్లు లేదు. నా లోపలి మనిషి ప్రభావంతో నేను మాత్రం స్థిమితంగా ఒకచోట నిలుచోలేక కూర్చోలేకపోయాను. పేపరడ్డు పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతుంటే, ఆమె పాలావిడ రాగానే కాఫీ పెట్టి టిఫిన్‌ రెడీ చేయటం, నాకు బాత్‌రూమ్‌లో టవల్‌ పెట్టడంలాంటివన్నీ రొటీన్‌గా చేసుకుపోసాగింది. కానీ, నా లోపలి మనిషి కామపీడిత జ్వరానికి బలైపోతూ నన్ను కుదిపేయసాగాడు. దాంతో ఆమె నాకు ఎదురుపడి దగ్గరికి వచ్చినప్పుడల్లా నాలోని నిగ్రహం సడలిపోయి ‘ఎప్పుడు ఆమెను పొదవి పట్టుకొని, నా గుండెలకు హత్తుకుంటానా’ అన్న తపనతో, తమకంతో తల్లడిల్లిపోసాగాను. కొద్దిసేపటి తర్వాత పనంతా పూర్తి చేసుకుని ‘‘ఇంకోసారి కాఫీ తాగుతారా సారూ’’ అంటూ నా దగ్గరికి వచ్చింది. నేనున్న పరిస్థితిలో అంత దగ్గరికి వచ్చిన ఆమెను చూసి నిగ్రహించుకోలేక లోపలి మనిషికి పూర్తిగా దాసోహమైన నేను, ఆమెవైపు నేరుగా చూడలేక కళ్ళు మూసుకుని వణుకుతున్న చేతులను ఆమె వైపు చాచాను ఆమె కౌగిలి కోసం. దాంతో ఆమె వచ్చి నా కౌగిల్లో కరిగిపోతుందనుకున్నాను. కానీ, ఆమె నన్ను పట్టుకుని బెడ్‌మీద కూర్చోబెట్టింది. ఆమె బిగువైన మెత్తని వెచ్చని శరీరం నాలో కోరికలు లేపుతుంటే, నా చేతుల్ని ఆమె చుట్టూ మరింత గట్టిగా బిగించబోయాను. ఆమె నా ముఖంలోకి చూస్తూ ‘‘ఎట్టా ఉంది సారూ, డాక్టరును పిలచమంటారా’’ అంది. తర్వాత నా చేతుల్ని సున్నితంగా విడిపించుకుని ఫ్రిజ్‌ దగ్గరికి పరిగెత్తింది మంచినీళ్ళ కోసం.

అప్పటికిగానీ నాకర్థం కాలేదు... నాకేమో అయింది, కింద పడిపోతానేమోనని పట్టుకుందని. ఆమె భయం, కంగారూ, పాలిపోయిన ముఖం, ఆమె మాటలూ... నన్ను కొరడాతో కొట్టినట్లనిపించింది. నా లోపలి మనిషి హస్తాల నుంచి బయటపడ్డాను. అసంకల్పితంగానే ఆమె ఇచ్చిన నీళ్ళు తాగుతూ ‘‘నా..కే..మి... కా..లే..దు’’ అన్నా తొట్రుపాటుతో. కానీ ఆమె బయటికి పోకుండా నా నుదుటిమీద చెయ్యిపెట్టి చూసింది. కామంతో కాగుతున్న శరీరపు వేడిని ఆమె జ్వరమని భ్రమపడి డాక్టరుకు ఫోన్‌ చేస్తాను నంబరు చెప్పమని అడిగింది. నేను ఓపక్క సిగ్గుతో కుంచించుకుపోతున్నా, ఆమె నాపక్కనే ఉంటే నా లోపలి మనిషి వికృత చేష్టలకు నేను గతి తప్పడం తథ్యమనుకుని ‘‘వద్దు, నువ్వెళ్ళు’’ అంటూ కళ్ళు మూసుకున్నా, నా లోపలి మనిషి ఆలోచనల నుంచి నా కళ్ళను తెరిపించుకునేందుకు. ఆమె బయటికి వెళ్ళిపోగానే బాత్‌రూమ్‌లోకి దూరిపోయాను- ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తయారయి ఇంట్లోంచి బయటపడాలని.

* * *

ఉదయం జరిగిన సంఘటన నుంచి ఆఫీసుకు వచ్చినా తేరుకోలేదు. లోపలి మనిషి నన్ను తొక్కేస్తూ నాపై మరింత ఒత్తిడి పెంచుతూ వచ్చిన అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నావని నిందిస్తుంటే వూహలతో కోరికలతో ఆఫీసులో కూర్చోలేకపోయాను. అలాగని ఇంటికి వెళ్ళలేక ఆఫీసులోని రెస్ట్‌రూమ్‌లోకి వెళ్ళిపోయి సాయంత్రం వరకూ బయటికి రాలేదు. నా లోపలి మనిషి నన్ను ఎంతో ప్రభావితం చేస్తున్నా, ఆమెకు దూరంగా ఉండాలని ఆఫీసులోనే తినేసి ఎనిమిది గంటలకు ఇంటికి బయలుదేరాను. నేను ఆఫీసు నుంచి ఇంటికి వస్తుంటే మబ్బులుపట్టి సన్నటి తుంపర రాలసాగింది. కారు లోపలపెట్టి ఇంట్లోకి నడిచేలోగా అది కుండపోతగా మారింది. కరెంటు పోవడంతో సిటీ చీకటి గుయ్యారంలా ఉంది. నేను బాల్కనీలో కూర్చుని మొబైల్లో నా శ్రీమతితో మాట్లాడుతుంటే గేటు తీసిన చప్పుడైంది. తలమీద ప్లాస్టిక్‌ కవరు కప్పుకుని, చంకలో బిడ్డను ఎత్తుకుని లోపలికి వస్తోందామె. క్షణకాలం భయంతోనో కోరికతోనో వూపిరి తీయడం మరచిపోయాను. బాల్కనీలో ఉన్న నన్ను చూసింది ఆమె. కాలింగ్‌బెల్‌ కొట్టే అవసరం లేకుండానే నేనే కిందికి వెళ్ళి వాకిలి తీశాను. పైన ప్లాస్టిక్‌ కవరు, కింద ఆమె తల. ఆ పిల్లవాడు తడవలేదు కానీ ఆమె మొత్తం తడిసిపోయింది. తడిసిపోయి ఒంటికి అంటుకుపోయి బట్టలతో నగ్నంగా బహిర్గతమవుతున్న ఆమె ఎత్తు పల్లాలను నా లోపలి మనిషి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంటే ఆమె నా ముఖం వైపు చూడకుండా లోపలికి రావాలని ప్రయత్నిస్తుంటే నేను అడ్డు తొలిగాను. వెంటనే లోపలికి వచ్చి చంకలో ఉన్న పిల్లోడ్నీ, చేతిలోని పెట్టెనూ నేలమీద పెట్టి వంటగదివైపు వెళ్ళి, తడిసిన చీరెను పిండుకోసాగింది. నా లోపలి మనిషి ఆదేశాలతో నా మనసు ఆవలిపక్కకుపోయీ... అక్కడ ఆమె అందాలను చూడాలని ప్రయత్నిస్తుంటే అక్కడ ఉండలేక గబగబా లోపలికి నడిచాను. ఈ సమయంలో ఆమె రాక నాలో గుబులు రేపుతోంది. కొద్ది క్షణాలు ఫ్యాన్‌ కింద తడి ఆర్పుకుని నా ఎదురుగా వచ్చి తను రావడానికి కారణం చెప్తూ ‘‘మా ఇంటాయన యాడికిపోయిండో ఇంకా రాలేదు సారూ. మేముండే గుడిసె అంతా కారుతుండాది. గుడిసెలోకి మోకాటిలోతు నీళ్ళొచ్చినాయి. బయమేసి ఈడికొచ్చిన సారూ’’ అంది.

డెలివరీ పాయింట్‌కు ఫోన్‌ చేస్తే- వాడు ‘ఆటో టైరు పంక్చరవడంతో చేరాల్సిన చోటికి ఆలస్యంగా చేరాడట. దానికితోడు వర్షం విపరీతంగా పడుతుండటంవల్ల సరుకు అన్‌లోడ్‌ కాలేదనీ, ఉదయాన్నే అవుతుందనీ’ తెలిసి ఆమాట ఆమెకు చెప్పడంతో-

‘‘గుడిసెలోన ఒక్కదాన్నే ఉండలేను. రేతిరికి నేను ఈడ్నే పడుకుంటా సారూ’’ అంది.

నా గుండె ఝల్లుమంది. నోరు తడారిపోయింది.

నేను నేనుగా లేను. నా లోపలి మనిషి సంతోషంతో గంతులేస్తున్నాడు.

* * *

నా రూమ్‌లోకి వచ్చాను కానీ పిచ్చిపట్టినట్లు ఉంది. లోపలి మనిషివల్ల మనసు దహించివేస్తుంటే పరుపుమీద అటూ ఇటూ దొర్లసాగాను. వర్షం తగ్గకపోగా ఉరుములూ మెరుపులూ. దానికి జత కలిపి వాతావరణం నా మనసుకన్నా గందరగోళంగా ఉంది. లోపలి మనిషి నన్ను ఎక్కువసేపు రూములో ఉండనీయలేదు. ఆమె దగ్గరికి నడిపించేందుకు నన్ను ఒత్తిడి చేస్తుంటే మంచంమీద నుంచి లేచాను. అప్పుడే కిందనుంచి అడుగుల చప్పుడు వినిపించింది. ఆమె పైకి వస్తున్నట్లనిపించి, బెడ్‌మీద కూర్చుండిపోయాను. ఆమె వాకిలి దగ్గర నిలబడింది. చేతిలో చాప, పిల్లోడు. ‘‘చమించండి సారూ, పిడుగుల్తోన పిల్లోడు బయపడి లేస్తున్నాడు. నాకు ఒక్కదానికి పడుకోవాలంటే బయమేస్తుండాంది. ఈడ్నే ఓ మూల పడుకుంటా’’ అంది. రోగి అడిగిన పాలే డాక్టరు పథ్యం చెప్పినట్లై నా లోపలి మనిషి సంతోషంతో గంతులేయసాగాడు.

పిల్లోడ్ని పండబెట్టి తాను పక్కకు తిరిగి దుప్పటి కప్పుకుని పడుకుంది. నేను నా లోపలి మనిషివల్ల త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లు బెడ్‌మీద అలాగే కూర్చుండిపోయాను. ఉన్నట్లుండి చెవులు చిల్లులుపడేలా దరిదాపుల్లో ఎక్కడో పిడుగు పడింది. దాంతో ఆమె భయపడుతూ లేచి కూర్చుంది. ఇంకా అలాగే కూర్చుని ఉన్న నన్ను చూసి, ‘‘ఏం సారూ, నిద్దర రాలేదా? వంట్లో బాగోలేదా, కాళ్ళు పట్టేదా’’ అంది.

నేనేమీ సమాధానం చెప్పకపోవటంతో లేచివచ్చి నా కాళ్ళ దగ్గర నేలమీద కూర్చుని నేను చెప్పకముందే నా కాళ్ళు వత్తసాగింది. ఆమె చేతులు నా పాదాలు తాకగానే, నాలో నరాలు జివ్వుమన్నాయి. నన్ను నేను నిగ్రహించుకోవడం కష్టం కాసాగింది. అయినా, చివరి ప్రయత్నంగా నేను నా కాళ్ళను పక్కకు తీస్తుంటే ఆమె బలవంతంగా ‘‘కాళ్ళు పరుపు పైన ఎట్టుకొండి సారూ. నేనొత్తుతుంటే అట్టాగే నిద్దర పడతది’’ అంది.

నేను నా లోపలి మనిషిలోకి ఐక్యమైపోయాను. ఉచ్ఛనీచాలు లేవు. సర్వం ఆమె మయమైపోయింది. ఆమె నా కాళ్ళు తీసి బెడ్‌మీద పెట్టింది. యాంత్రికంగా పడుకున్నా. ‘నా లోపలి మనిషిలాగే ఆమెలో మనిషీ విజృంభిస్తున్నట్లుంది. అందుకే కాళ్ళు వత్తాలన్న నెపంతో దగ్గరికి వచ్చింది. మెల్లగా, కాళ్ళు వత్తేందుకన్నట్లు బెడ్‌ మీద కూర్చుంటుంది. సమయం చూసి ఆమెను అలాగే పైకి లాక్కొని తనివితీరా ఆనందపుటంచుల్లో తేలిపోవాలని’ అనుకుంటూ వూహాలోకంలో విహరించసాగాను. దానికి భిన్నంగా ఆమె పైకి పెట్టిన కాళ్ళను కింద కూర్చునే ఒత్తుతూ ‘‘మీరు దేవుళ్ళు సారూ, మీకు కాళ్ళు పడితే తప్పేంది. పేదోళ్ళన్నా, వాళ్ళ బతుకులు బాగు సేయాలన్నా మీరు సేసే సగాయం సూత్తుంటే దేవుడు గూడ అట్టా సేయడనిపిస్తాంటాది. పనికొచ్చిన దినం మీ సూపులు సూసి కోపమేసినాది. ఈడ యాడ పని సేయగల్నా అనుకొన్నా. అటునుంచి అటే ఎల్లి పోవాలనుకున్నా. కానీ, ఆడికే రెండుదినాలు తిండిలేక పస్తుండినాం. దాన్తోన ఎనిక్కి పోలేకపోయినా. అమ్మగారు పని ఇస్తమనగానే సంబర పడినా, మీతోని కట్టమైతాదనుకొన్న. కానీ, అమ్మగారూ మీరూ నన్ను బిడ్డలాగా సూసుకొంటుంటే- అప్పుడు మీ గురించి చానా తప్పుగా ఆలోచించినా అనుకొన్నా...’’ నా చెంపలు ఛెళ్ళుమన్నట్టయింది ఆ మాటల్తో. నా లోపలి మనిషి అచేతనుడయ్యాడు.

ఆమె చెప్పుకుపోతోంది... ‘‘దేవలంలోకి పోయిన బక్తులు అది గావాలా ఇది గావాలా, మంచి జరగాలా అని కోరికలు కోరుకుంటరు. దానికి దేవుడి దీవెనలకు లెక్క పూజారయ్య దేవుడి కాళ్ళకాడుండే శఠగోపం మన నెత్తిన పెడ్తడు. అది పెట్టంగానే మనిషికి మంచి జరుగుడేంది, కోరికలు తీరడమేంది అనిపిస్తది. నాను అది బ్రెమ అనుకొండినా. దేవుడి శఠగోపం పెట్టినోళ్ళందరికీ మంచి జరుగుతాదో లేదో తెలవదుగానీ శఠగోపం లెక్కన మీలాంటోళ్ళ గొప్పోళ్ళ సేతి సలవ సానా గొప్పది సారూ.’’

బయట ఉరుములూ మెరుపులూ తగ్గిపోయాయి- నాలో అలజడిమల్లే. వేడి తగ్గిపోయి, చెమటలు పట్టసాగాయి. మంచులో ముంచినట్లున్న చల్లని చేతుల్తో నా పాదాలు వత్తుతుంటే అవి స్పర్శ కోల్పోయాయి. నేను లేచి కూర్చున్నాను. అయినా ఆమె నా కాళ్ళు వత్తుతూనే చెప్పుకుపోతోంది. ‘‘మా ఇంటాయన బాగుండాలని మీరు పెద్ద బండి ఇప్పిస్తిరి. వోడు కొద్ది దినాలు బాగుండినా మళ్ళా తాగుడు మొదలుపెట్టిండు. మీరు బండిని ఎనిక్కి తీసుకొన్నాక బయపడి మీతో తాగనని సెప్పినా రోజూ తాగేవోడు. ఒక దినం చొక్కాలు లేవని అమ్మగారిచ్చిన మీ చొక్కా ఏసుకొనిండు. ఇన్ని రోజులు వోటిని గుడ్డలగానే సూస్తిమి. వోటిలో అంత సక్తి ఉండాదని తెలియకపాయే. వోటిని ఏసుకొంటూనే... నా వొంక సూసి... అయ్యగారి గుడ్డలేసుకొన్నాక నా మనసెట్టానో ఉందే అన్నడు. తాగే బీడీ ముక్కను పారేసిండు. వోడికి ఆ గుడ్డలేసుకొన్నాక యట్టాటి ఎదవ ఆలోచన్లు రాలేదంట. రోజూ పీకల్దాక తాగి వచ్చేవోడు పక్కనోళ్ళు ఉద్దరగా తాపిస్తమని సెప్పినా తాగకుండా వచ్చినాడు. ఇంటికి వచ్చి ‘అయ్యగోరు దేవుళ్ళాంటోడే. నేకపోతే ఏంది- ఆయనేసుకున్న చొక్కా ఏసుకుంటానే... నాకెట్టానో ఉందే, నాను ఏ తప్పు సేయలేకపోతుండా... ఆయన ఇడిసేసిన గుడ్డలేసుకొంటేనే ఇంత మంచిగా ఆలోసిస్తానంటే... ఇంక ఆయనెంత గొప్పోడో’ అంటూ పొగిడిండు. ఆ దినం కాడ్నించి తాగుడు, గుట్కా, బీడీ అన్నీ బందు సేసిండు. అట్టాటి దేవుడి కాళ్ళు వత్తుతే పుణ్నెం కానీ...’’ అంటూ నా పాదాలపై ఆమె తల పెట్టబోతుంటే చప్పున నా కాళ్ళను వెనక్కి తీసుకున్నా.

కామపు సుడిగుండంలోకి నన్ను లాగిన లోపలి మనిషి, ఆమెకూ ఆమె భర్తకూ నాపైన ఉన్న గౌరవానికీ నమ్మకానికీ సిగ్గుపడుతూ అపరాధభావంతో మాడిమసైపోయాడు. బెడ్‌ మీద నుంచి కిందకి దిగి ఆమె పాదాలను పట్టుకుని క్షమించమని వేడుకోవాలని లేచి నిలబడ్డాను. నా కళ్ళనిండా నీళ్ళు. అది చూసి ఆమె కంగారుపడుతూ లేచి నిలబడింది. మా శరీరాల మధ్య గాలిదూరే సందు కూడా లేదు. అయినా నాలో ఏ అలజడీ కలగలేదు. నా లోపలి మనిషి లేడు- చచ్చిపోయాడు. ఉన్నది నేనే. ఆప్యాయంగా ఆమె తలమీద చేయి ఉంచాను. నాకిక భయంలేదు. నా లోపలి మనిషి ఇక బతికే అవకాశం లేదు. ఒకవేళ మళ్ళీ బతికితే నా అంత నికృష్టుడు మరొకడుండడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.