close
పూరకం

పూరకం
- అరుణ పప్పు

‘‘ఏమిటో, అసలు పెళ్ళంటేనే పెద్ద కన్ఫ్యూజన్‌ అనుకుంటా. ఏదీ స్పష్టంగా తెలిసి చావటంలేదు. మరి అందరూ అన్నన్ని పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటున్నారో!’’ అంది మనవరాలు.

వద్దంటున్నా జారే ముంగురుల్లా చిన్న విసుగు దోబూచులాడింది ఆ అమ్మాయి మొహంలో. అమ్మమ్మ దాన్ని గమనించింది. జీవితంలో కొన్ని రంగుల్ని చూసిన ఆవిడకు ఆ పిల్ల సమస్య వింటుంటే నవ్వొచ్చింది.

‘‘అన్నన్ని పెళ్ళిళ్ళు... అంటే ఎన్నెన్నేమిటీ? ఒక్కోరూ ఒక్కొక్కటే కదా చేసుకుంటున్నది’’ అడిగిందావిడ తమాషాగా.

‘‘నీతో అదే ఇబ్బంది అమ్మమ్మా. ఒక్క పెళ్ళితోనే వేగలేక చస్తున్నారు జనాలు, ఇంకా ఎన్ని చేసుకుంటారేవిటీ?’’

‘‘మరిప్పుడు నువ్వేగా బోల్డు పెళ్ళిళ్ళన్నది, నువ్వన్న మాట నీకే గుర్తుండకపోతే ఎలా?’’

‘‘నన్ను చంపకు అమ్మమ్మా...’’

‘‘ఏమిటీ, ప్రతి మాటకూ చావుచావంటావు... అదో వూతపదమా ఏమిటి? శుభమా అని పెళ్ళి ప్రయత్నాలు మొదలెడుతుంటే అలా మాట్లాడతావేం. సరిగ్గా చెప్పనిదే నాకేం తెలుస్తుంది?’’

ఇంటి ముందున్న చిన్న జాగాలో ఓ ఆకాశమల్లి, ఓ పారిజాతం, కొన్ని గులాబీమొక్కలూ వేసుకుని దాన్నే పెద్ద నందనవనంగా పెంచుకుంటోందావిడ. అక్కడ మొక్కలకు నీళ్ళు పోస్తూ మెట్ల మీద కూర్చున్న మనవరాలి హావభావాలను ఓ కంట కనిపెడుతోంది.

‘‘అదికాదు అమ్మమ్మా, పెళ్ళివల్ల డిపెండెన్సీ పెరిగిపోకూడదని అమ్మ అంటోంది. ఇండివిడ్యువాలిటీ వదులుకోవద్దని నాన్న అంటున్నారు. ఎవరి ఉద్యోగం వాళ్ళకు, ఎవరి సంపాదన వాళ్ళకూ ఉంటే సంసారం హాయిగా సాగుతుందట.’’

అదొక రకంగా నవ్వింది ఆవిడ. ‘‘వాళ్ళ మొహంలే... ఇంకా ఏం చెప్పారేమిటీ?’’

‘‘వాళ్ళేకాదు, చదువుకునేప్పుడు స్నేహితులూ అలాగే అనేవాళ్ళు. మన ఉద్యోగం మనకుంటే ఒకరి పెత్తనం ఉండదూ అని. కాలేజీలో లెక్చరర్లంతా పదేపదే చెప్పేవాళ్ళు... ‘మీరంతా మీ కాళ్ళమీద నిలబడాలమ్మా’ అని. అందుకే కదా, అంత కష్టపడి చదివి, అంత పోటీలో నెగ్గి ఉద్యోగాల్లో చేరడం. ఇక ఆఫీసులో కొలీగ్సూ అదేమాట అంటారు. మొన్నీమధ్య మాకు మోటివేషనివ్వడానికి ఒకాయన వచ్చాళ్ళే. ఆయన కూడా అదేమాట. ప్రతి మనిషీ శక్తిమంతుడేట. ఏం కావాలన్నా సాధించుకోగలడట. ఎవరిమీదా ఆధారపడనవసరంలేదట...’’

నవ్వొచ్చింది అమ్మమ్మకు. ఏవైపు నడిపిస్తున్నారు యువతరాన్ని ఈ మాటలతో?

‘‘మరింకేం, ఎవరి పని వాళ్ళకు ఇచ్చేస్తే చాలు కదా... ఎవరికివారు ఆ కంప్యూటర్ల ముందు టిక్కూటిక్కూ లాడించుకుంటూ పనిచేసుకుంటారు. టీములూ టీమ్‌ స్పిరిట్లూ ఇవన్నీ అనవసరం కదా? ఎవడి బాక్సు వాడు తినేసి ఇంటికొచ్చేస్తే సరి. అంతా మీ నాన్న పద్ధతిలోనే వెళుతోంది ప్రపంచం...’’

మనవరాలికి కోపం వచ్చింది. ‘‘నువ్వు మా నాన్నను అంటున్నావా, ప్రపంచాన్ని తిడుతున్నావా?’’ అంటూ అమ్మమ్మ మొహంలో చిలిపిదనం చూసి తనూ నవ్వేసింది. ‘ఏవిటో ఈవిడ స్పందన... దేనికైనా చిత్రంగానే ఉంటుంది’ అనిపించింది ఆమెకి.

‘‘నా సంగతి ఎందుగ్గానీ, వాళ్ళందరూ అలా ఉంటే నువ్వు ఏమనుకుంటున్నావు?’’ అడిగింది అమ్మమ్మ.

‘‘ఏంటమ్మమ్మా నువ్వు? ఏదీ సరిగ్గా సమాధానం చెప్పవు’’ ఈసారి మనవరాలి మొహంలో విసుగు స్పష్టంగానే కనిపించింది.

కిందపడిన ఆకాశమల్లె పువ్వులను ఏరి వెదురుబుట్టలో వేస్తూ ‘‘సమాధానాలు రెడీమేడ్‌గా ఉండవు తల్లీ, మనకు నచ్చే, నప్పే సమాధానాలు మనమే వెతుక్కోవాలి. ఇంతకూ నీకేమనిపిస్తోందో చెప్పడం లేదు నువ్వు’’ అందావిడ అదే నవ్వుతో.

‘‘వాళ్ళందరు చెప్పేదీ సరిగానే ఉందనిపిస్తోంది. కానీ, ఏదో లాజిక్‌ మిస్సవుతోందమ్మమ్మా. అదేమిటో తెలియడం లేదు.’’

‘‘అవునా? ఇంతకూ మీ అత్త ఇంట్లో నాలుగు రోజులుండొచ్చావు కదా, అక్కడేం చూశావో చెప్పు. చిన్నప్పుడు నీ పాదాలు కిందపెడితే కందిపోతాయేమో అన్నట్టుగా చూసేదిమీ అత్త నిన్ను. ఇప్పుడూ అలాగే చూసిందా?’’ అడిగింది అమ్మమ్మ.

‘‘నాకేదో అర్థమయీ కానట్టుంది వాళ్ళ వ్యవహారం. మా ఇంట్లో ఉన్నంత హడావుడేం లేదు. ఏదో చాదస్తం మనుషుల్లా ఉన్నారు చూడబోతే...’’

‘‘చాదస్తమంటే? ఏమిటో వివరంగా చెప్తే కదా తెలిసేది.’’

ఏరిన పూలబుట్ట పక్కన పెట్టేసి మనవరాలి చేతులకు గోరింట పెట్టడం మొదలుపెట్టింది ఆవిడ.

‘‘నీకు మా మేనత్త, మావయ్యలు తెలియదా... మళ్ళీ నన్ను చెప్పమంటావేం?’’ కస్సున లేచింది మనవరాలు.

అమ్మమ్మకి నవ్వొచ్చింది. తన కూతురి ఆడపడుచు కుటుంబం తనకు తెలియకపోవడమేం... తెలుసు. కానీ, తనకు అర్థమైన తీరు వేరు. ఈ కాలం పిల్లకు వాళ్ళెలా అర్థమయ్యారో తెలుసుకోవాలి.

‘‘ఏమిటో అమ్మమ్మా, నేనొకరోజు బీరకాయ కూర చేశాను. ‘మీ అత్త చేసిందే కూర- ఇంకెవ్వరు చేసినా అలా రాదు’ అంటాడు మామయ్య. దానికావిడ ముసిముసిగా నవ్వుతుంది. నాకు చాలా చిరాకేసేదిలే. ఆయనేమిటో, అన్ని పనుల్లోనూ వేలు పెడుతుంటాడు, వెనకవెనకే తిరుగుతుంటాడు. వంటింట్లో అత్త పాలు కాస్తుంటే ఈయన డికాక్షన్‌ వేస్తాడు, ఈలోగా కూరగాయలు కోస్తాడు. వాషింగ్‌మెషిన్‌ వేసి అత్త స్నానానికి వెళ్ళిపోతుందా... ఈయన ఆ బట్టలన్నీ తీసి ఆరేస్తాడు. మళ్ళీ వంటలో రెడీ... ఏం వండాలీ, ఎలా వండాలీ, ఆ డిస్కషనంతా ఏదో పెద్ద అమెరికా ఎన్నికల్లాగా పెద్ద తంతు. ఇక భోజనాల దగ్గర చూడాలి వాళ్ళ వాలకం... ప్రతిదానికీ వంద రుచులు చెప్పుకుంటూ ‘ఆహా ఓహో’ అనుకుంటూ... తినడమే ఒక పెద్ద వ్రతంలాగా చేస్తారు. ఏదో ఆకలికి ఇంత తిని లేచామని కాకుండా అంత టైమ్‌ వాళ్ళు తిండిమీద వేస్ట్‌ చేస్తుంటే మండిపోయిందనుకో...’’

‘‘అవునా?’’

‘‘ఏమాటకామాటే చెప్పుకోవాలి కానీ అమ్మమ్మా... అత్త బీరకాయ తొక్కు పచ్చడి చేసినా అమృతమేననుకో! ఎంత తినేదాన్నో... అయినాసరే, అంత టైమెందుకూ తిండిమీద?’’

‘‘అందరూ అన్ని పనులూ చేసేది ఆ తిండి గురించే కదమ్మా. మీ అమ్మానాన్నల్లాంటివాళ్ళు బతకడం కోసం ఏదో ఇంత కుక్కుకుని బయటపడతారు. నీలాంటి పిల్లలకూ అదే అలవాటు చేస్తున్నారు. వాళ్ళు తింటూ బతుకుతున్నారు. అది సరేలే, మీ అత్త ఎలా ఉంది?’’

‘‘బాబోయ్‌, అత్త గురించి అడక్కు అమ్మమ్మా. ఆవిడకీ చదువుంది ఎందుకూ... ఉద్యోగం సద్యోగం ఏం లేదు. ఎంతసేపూ మామయ్యకిష్టం అని పచ్చళ్ళు చేయడం, వడియాలు పెట్టడం, ఆయనవైపు వాళ్ళొస్తే వండిపెట్టడాలూ, వాళ్ళకీ వీళ్ళకీ పెళ్ళి సంబంధాలు చూడటం అంతే. సరేలే ‘ఎవరి లైఫ్‌స్టైల్‌ వాళ్ళది’ అని వూరుకున్నా. చాలా రోజుల తర్వాత వాళ్ళింటికొచ్చానని షాపింగని తీసుకెళ్ళారా... అక్కడ వాళ్ళ పబ్లిక్‌ డిస్‌ప్లే ఆఫ్‌ అఫెక్షన్‌ అవసరమా చెప్పు? ఎంతసేపటికీ మామయ్యకీ ఆకుపచ్చరంగు నచ్చదేమోనే, ఆయనకీ డిజైన్‌ ఇష్టం అంటుంది అత్త. ఆయనేమో నీకు కనకాంబరం రంగు చీర ఇష్టం కదా అంటాడు. ప్రతిదీ మీద వేయించి, తను చూసిగానీ సెలెక్ట్‌ చేయడు. టీనేజ్‌ లవర్స్‌లాగా కళ్ళతోనే మెచ్చుకోళ్ళు. మామయ్యని పెళ్ళి చేసుకున్నాక అత్త బొత్తిగా వెన్నెముకలేని మనిషి అయిపోయిందంటూ ఉంటాడుగా మా నాన్న!’’

‘‘ఆ మాట నిజమనిపించిందా నీకు?’’ అల్లరిగా అడిగింది అమ్మమ్మ.

‘‘కొంచెం చిరాకేసిందనుకో, కానీ పూర్తిగా కోపం రాలేదెందుకో మరి!’’

‘‘మరి వాళ్ళబ్బాయి? అదే, మీ బావ ఎలా ఉన్నాడేమిటీ?’’

‘‘అంత చదువుకుని అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాడా... అన్నిటికీ మా అమ్మగారూ మా నాన్నగారూ అంటాడు. నేనే నయం... నచ్చిన బట్టలు కొనుక్కుని వస్తాను. అతను మాత్రం ఒక్క టీషర్ట్‌ కొనడానికి ‘ఇది బాగుందా, ఇది బాగుందా’ అని పదిసార్లు అడుగుతాడు. ఇక చేసుకోబోయే పిల్ల గురించి ఎన్నిసార్లు అడుగుతాడో ఏమిటో?’’ విరగబడి నవ్వింది మనవరాలు.

‘‘మొత్తమ్మీద నీకు నచ్చలేదన్నమాట. బావని కాకుండా- విదేశీ, మల్టీనేషనల్‌, కార్పొరేట్‌ ప్రొఫెషనల్‌నే పెళ్ళి చేసుకుంటావన్నమాట’’ ఉడికించింది పెద్దావిడ.

‘‘అదికాదు అమ్మమ్మా, మనింట్లో ఏదో ఉంది, వాళ్ళింట్లో ఏదో ఉంది - కొన్నిసార్లు ఇది బాగున్నట్టనిపిస్తోంది, కొన్నిసార్లు అది బాగున్నట్టు అనిపిస్తోంది. అదేమిటో అర్థంకావడం లేదు’’ అంటున్న మనవరాలి మనసును చదవగలిగిందావిడ. కానీ, మనసుకు హత్తుకునేట్లు ఈ పిల్లకు చెప్పడమెలా? ఎలాగోలా చెప్పాలి. కూతురు పోగొట్టుకున్న జీవితం మనవరాలు పోగొట్టుకోకూడదు.

‘‘అదిసరే, ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లో అంతంతసేపు ఏం చేస్తుంటావు నువ్వు?’’

‘‘షేరింగ్‌ అమ్మమ్మా. మనం ఎక్కడకెళ్ళినా, ఏం తిన్నా, ఏం చేసినా ఫ్రెండ్స్‌తో షేర్‌ చేస్తాం. వాళ్ళకవి నచ్చితే లైకులు కొడతారు, కామెంట్లు పెడతారు.’’

‘‘దాంతో ఏమొస్తుంది?’’

‘‘అదేమిటమ్మమ్మా అలాగంటావు. మనం షేర్‌ చేస్తే, వాళ్ళు చూసి సంతోషిస్తే మనకూ సంతోషం కదా...’’

‘‘వాళ్ళ సంతోషం కోసమే నువ్వు షేర్‌ చేస్తున్నట్టన్నమాట.’’

‘‘ఛీ చీ... అలా ఎందుకు చేస్తాం? మనకు నచ్చినవే చేస్తాం. కానీ, మన ఫ్రెండ్స్‌తో పంచుకుంటే, వాళ్ళకీ నచ్చితే, వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెబితే బాగుంటుంది కదా?’’

‘‘మరి, మీ అత్త చీర కొనేముందు మామయ్యకి చూపిస్తే, మీ బావ టీషర్టు బాగుందా అని వాళ్ళ అమ్మానాన్నలను అడిగితే, చేసిన వంట బాగుందా లేదా అని ఒకరికొకరు చెప్పుకుంటే అదంతా షేరింగ్‌ కాదా?’’

మనవరాలు నిశ్శబ్దమైపోయింది. ఏదో అర్థమవుతున్నట్టుగా ఉంది ఆమెకి.

‘‘చూడు తల్లీ, భార్యాభర్తలు ఒకరిమీద మరొకరు ఆధారపడటం తప్పన్నది మీ నాన్న సిద్ధాంతం. ఏ సంఘటనలు ఆయనలో ఆ భావాన్ని నాటాయో మనకు తెలియదు. పెళ్ళయిన కొత్తలోనైనా కలిసి ఒక సినిమా చూసేవారు కాదు. హోటల్‌కెళితే ఎవరికి నచ్చిన ఐటమ్‌ వాళ్ళు ఆర్డర్‌ చేసుకోవాలి. తనకు నచ్చిన బట్టలు తాను కొనుక్కుంటాడు. మీ అమ్మకు నచ్చినవి మీ అమ్మను కొనుక్కోమనేవాడు. ఎవరి కారు వాళ్ళది, ఎవరి ఉద్యోగం వాళ్ళది, ఎవరి జీతాలు వాళ్ళవి, ఎవరి ఇన్‌స్టాల్‌మెంట్లు వాళ్ళవి. వెళ్ళేదారి ఒకటే అయినా సరే, కలిసి వెళ్ళడానికి ఆయన ఇష్టపడడు. ఒకసారి దింపితే మరోసారి అలవాటైపోయి అడుగుతారని అట! ఇంట్లో పనులంటావా, ఆయన బట్టలు ఆయన ఉతుక్కుంటాడు, వండి డైనింగ్‌ టేబుల్‌ మీద పెడితే తనకు నచ్చినప్పుడు తింటాడు. ఇద్దరూ కూర్చుని తినడం నేనైతే ఇప్పటిదాకా చూడలేదు. ఏదో పరుగుపందెంలో వెనకబడిపోకూడదన్నట్టు పరుగెత్తడమే అతని పని. తనతోపాటు మీ అమ్మనీ పరుగెత్తమన్నాడు.’’

‘‘అదంతా నిజమే అయినా, మా నాన్న గురించి నువ్వలా చెబుతుంటే నాకెందుకో నచ్చడం లేదు అమ్మమ్మా. మరి అమ్మ కూడా అలానే ఉంటుందిగా...’’

‘‘ముందు అలా ఉండేదికాదు. తనకి నచ్చినవన్నీ అతనికి చెప్పాలనీ అతనికి నచ్చినట్టు తానుండాలనీ ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుని, వండుకుని, తిని, తిరిగి... ఇలా ఏవో తియ్యటి వూహలుంటాయి కదా... అవేవీ లేవని కొన్నాళ్ళు బాధపడింది. ‘హాస్టల్లో రూమ్మేట్లతో ఉన్నట్టుగా ఉందిగానీ, కుటుంబమంటూ ఒకటి ఉన్నట్టు లేదమ్మా’ అంటూ చెప్పుకుని ఏడ్చేది. కానీ, అలా మెలగకపోతే బంధమే తెగిపోతుందని నెమ్మదిగా మీ అమ్మ కూడా ఆయన దారిలోనే నడిచింది. నెలజీతం రాగానే లాక్కుని ఖర్చులకు ఐదువందలు చేతిలోపెట్టే మగవాళ్ళకన్నా, దొంగతనంగా ఫోన్లు చెక్‌చేసేవాళ్ళకన్నా, మాసిపోయిన బట్టలు బాత్‌రూముల్లో పడేసేవాళ్ళకన్నా, వంటకు వెయ్యారు వంకలు పెట్టి తిట్టేవాళ్ళకన్నా ఈ పద్ధతి కాస్త నయమేలెమ్మని సర్దుకుపోయింది.’’

‘‘మరి, అంతా బాగానే ఉందిగా?’’ అడిగింది మనవరాలు.

అడిగాక తన ప్రశ్నలో వెలితేమిటో మెరుపు మెరిసినట్టు తెలిసింది ఆమెకి.

‘‘ఒక వయసు తర్వాత జీవితం కొంత బాధ్యతను మోపుతుంది అమ్మలూ. దానికోసమే తోడు అంటూ పెళ్ళి చేసుకునేది. ఆ ప్రయాణంలో మంచీచెడూ, కష్టం సుఖం, ఇష్టం అయిష్టం- అన్నిటినీ చెరిసగం పంచుకుంటే ఎంత బాగుంటుందో వూహించి చూడు. ఒంటరిగా లాగలేమా అంటే లాగుతాం. కానీ, అదెంత కష్టమో ఆలోచించు. ‘ఇంటర్‌డిపెండెన్సీ ఈజ్‌ హయ్యర్‌ వాల్యూ దేన్‌ ఇండిపెండెన్సీ’ అని అర్థంచేసుకుంటే బాగుంటుంది కదా. ఒకరితో కలవకుండా, ఒకరి సాయం లేకుండా బతుకు వెళ్ళడం అయ్యేపనేనా? ప్రపంచమట్లా నడవగలదా చెప్పు?’’

‘‘అదికాదు అమ్మమ్మా, వాళ్ళిద్దరూ తోకల్లాగా ఒకరివెనక ఒకరు తిరుగుతుంటారు అస్తమానం. ఎందుకు బోర్‌ కొట్టదో మరి? కాస్తయినా స్పేస్‌ లేకుండా ఉండటమా పెళ్ళంటే?’’

‘‘నేను అలాగనడం లేదు. ప్రతి బంధంలోనూ స్వేచ్ఛ ఉండాలి, స్పేస్‌ ఉండాలి. అప్పుడే అది ఆరోగ్యంగా ఎదుగుతుంది. భార్యాభర్తలే కాదు, ఎవరైనా ఇద్దరు మనుషులు కలిసుండాలంటే- అభిరుచుల్లో తేడాలను గుర్తించి గౌరవించాలి. అందుకే మీ అత్తకిష్టమైనది కొనుక్కోమని మామయ్యా, మామయ్యకు నచ్చినదే చెయ్యాలని అత్తయ్యా ఆలోచిస్తున్నారు. అది స్వేచ్ఛ కాదంటావా? అంతేగానీ, ఎప్పటికీ ఎవరిష్టం వారిదేనంటూ రైలుపట్టాల్లా కలవకపోవడాన్ని స్పేస్‌ అంటారా? అసలు స్వేచ్ఛ, ఆధారపడటం- రెండూ వ్యతిరేక విషయాలని ఎందుకు అనుకుంటున్నావు? తీపీ పులుపూ, ఉప్పూ కారం- ఇవన్నీ ఒకదానికొకటి వ్యతిరేకాలా? పూరకాలు అని ఎందుకనుకోవు. ఒకటి ఇంకోదాన్ని తగ్గించదు అమ్మలూ- బ్యాలెన్స్‌ చేస్తుంది. అవి సరైన నిష్పత్తిలో పడితే బతుకు పండుతుంది. ఆ రెసిపీని మనమే జాగ్రత్తగా తయారుచేసుకోవాలి.’’

ఎందుకో అమ్మమ్మ కళ్ళ నుంచి రెండు నీటిబొట్లు జారి మనవరాలి చేతులమీద పడ్డాయి.

అది చూసి మనవరాలి కళ్ళల్లోనూ నీళ్ళూరాయి.

‘‘ఇందాక అన్నావే షేరింగ్‌ అని... మీ నాన్నకు ఆ రుచి తెలియదు. మీ అత్తామామలకు తెలుసు. కొడుక్కీ దాన్ని నేర్పించారు. పరుగెత్తి పాలు తాగేకన్నా, ప్రతి క్షణాన్నీ పదిలపరుచుకోవడం ముఖ్యమనుకుంటే మీ బావను పెళ్ళి చేసుకో. నీ డబ్బూ నీ ఇల్లూ నీ ఈఎమ్‌ఐలూ అనుకుంటావా... ఇవాళా రేపూ అలాగనుకునే కుర్రాళ్ళు బోలెడుమందున్నారు, ఆపైన నీ ఇష్టం’’ కళ్ళు తుడుచుకుని చెప్పింది అమ్మమ్మ.

గజిబిజిగా ఉన్న లెక్కల సూత్రమేదో విడిపోయినట్టు తేటగా నవ్వింది మనవరాలు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.