close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వారెవా.. వైవా!

వారెవా.. వైవా! 

‘వైవా’ వీడియో యూట్యూబ్‌లో ఒక సంచలనం. ఆ వీడియో కోటి వీక్షణల రికార్డుని అందుకుంటుందనీ, అదో బ్రాండ్‌గా స్థిరపడుతుందనీ, తమకెన్నో అవకాశాల్ని తెస్తుందనీ దాని వెనుకున్నవాళ్లూ వూహించలేదు. చినుకులా వచ్చి తుపానుగా మారిన వైవా కథ ఇది...

బరీష్‌ కండ్రేగుల... వైవా వెనుక కీలకవ్యక్తి. వైజాగ్‌కు చెందిన శబరీష్‌ అక్కడి గీతం యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చేశాడు. హర్ష చెముడు అతడికి బాల్య స్నేహితుడు. స్కూల్‌ రోజుల్నుంచీ శబరీష్‌కు వీడియోలు తీయడం అలవాటు. వాటిలో నటించడానికి హర్ష ఎప్పుడూ ముందుండేవాడు. స్నేహితులతో కలిసి చాలా వీడియోలు తీశారు. ఇంజినీరింగ్‌ చదువుతూనే ఆన్‌లైన్లో ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌లు నేర్చుకున్నాడు శబరీష్‌. కాలేజీ స్థాయిలో లఘు చిత్రాల పోటీల్లోనూ గెలిచాడు. తర్వాత చెన్నై వెళ్లి యాక్సెంచర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరాడు. కానీ అతడికి వీడియోలూ, సినిమాలే గుర్తొచ్చేవి. ఏడాది తిరక్కముందే ఉద్యోగం వదిలేసి వైజాగ్‌ వచ్చేశాడు. ఇంట్లోవాళ్లు పైచదువులకు సిద్ధమవుతాడేమో అనుకున్నారు. కొద్దిరోజులకి కజిన్స్‌తోపాటు స్నేహితులు హర్ష, షణ్ముఖలకు వైవా స్క్రిప్టు వినిపిస్తే బావుందంటే, బావుందన్నారు. కాలేజీ విద్యార్థులకు జరిగే వైవా పరీక్ష నేపథ్యంతో ఉంటుందా కథ. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీలో షూటింగ్‌కు అనుమతి పొంది నాలుగైదు గంటలపాటు షూటింగ్‌ చేశారు. ఎడిటింగ్‌, డబ్బింగ్‌... పూర్తిచేయడానికి మరో రెండు వారాలు పట్టింది. జీరో బడ్జెట్‌లోనే పూర్తిచేసి 2013 జులై 11న 12 నిమిషాల నిడివి ఉండే వైవా వీడియోని యూట్యూబ్‌లో పెట్టారు. రెండు లైకులూ, నాలుగు షేర్లతో మొదలై 24 గంటల్లో రెండు లక్షల వీక్షణలు వచ్చాయి. దాదాపు నెలరోజులపాటు రోజూ లక్షకుపైనే వీక్షణలు నమోదయ్యాయి. స్పందనను చూశాక తమ యూట్యూబ్‌ ఛానెల్‌కూ viva అని పేరు పెట్టారు. వైవా వీడియో వీక్షణల సంఖ్య ఇప్పుడు కోటీ పదిలక్షలు.
హైదరాబాద్‌ నుంచి పిలుపు
‘వైవా చూశావా...’ విద్యార్థులూ, ఉద్యోగులూ, సినిమావాళ్లూ అందరినోటా దాని గురించే చర్చ. కొద్దిరోజుల్లోనే హర్ష, శబరీష్‌ కాస్తా వైవా హర్ష, వైవా శబరీష్‌ అయిపోయారు. స్రవంతి రవికిశోర్‌, నిర్మాత రామ్మోహన్‌, కోన వెంకటü లాంటి సినీ ప్రముఖులు ఫోన్‌చేసి మరీ ప్రశంసించారు. తర్వాత వైవా బృందం మకాం హైదరాబాద్‌కు మారింది. ‘మసాలా’ సినిమాకి వెంకటేష్‌, రామ్‌లతో ప్రత్యేక ప్రచార వీడియోలు చేశారు. ఆపైన హర్షాకి సినిమాల్లో కమెడియన్‌గా అవకాశాలూ వచ్చాయి. కొందరు శబరీష్‌కు దర్శకత్వ అవకాశం ఇస్తామన్నారు. కానీ తానింకా నేర్చుకునే దశలోనే ఉన్నానని చెప్పి శబరీష్‌ వద్దనుకున్నాడు. డాబ్లర్‌, సమోసా లాంటి యువతకు సంబంధించిన ఆప్‌ల ప్రచార ప్రాజెక్టులు చేస్తూనే వైవా తర్వాత ‘ఫేస్‌బుక్‌ బాబా’ వీడియోని తీశారు. దానికీ మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత అడపాదడపా వీడియోల్ని తీస్తూ వచ్చారు.

వైవా న్యూస్‌
వైవా బృందం సామర్థ్యాన్ని గుర్తించిన ముంబయికి చెందిన కల్చర్‌ మిషన్‌(స్టార్‌ మీడియా గ్రూప్‌)సంస్థ గతేడాది ఆగస్టులో వీరితో చేతులు కలిపింది. వారి సాంకేతిక, ఆర్థిక సాయం అందడంతో వైవా బృందం జోరు పెంచింది. కొత్తగా ‘వైవా న్యూస్‌’ సిరీస్‌ని ప్రారంభించారు. వార్తలకు వ్యంగ్యాన్ని జోడించి వీటిని తీస్తుంటారు. వీటిలో హాస్యంతోపాటు, సామాజిక స్పృహ కూడా కనిపిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ ఆరు ఎపిసోడ్లు చేశారు. స్వచ్ఛ భారత్‌ నేపథ్యంలో భారతీయుల్లో పరిశుభ్రత పరంగా మారని తీరుని గురించి చెబుతూ ‘ఇండియాని మీరు మార్చలేరు, ఇండియానే మిమ్మల్ని మార్చేస్తుంది...’ అంటూ ఓ ప్రవాస భారతీయుడి కోణంలో తీసిన వీడియోకి మంచి ఆదరణ వచ్చింది. ఐపీఎల్‌, కార్పొరేట్‌ చదువులు, సింధు ఒలింపిక్‌ పతకం... కాదేదీ వీరి వీడియోలకి అనర్హం. ‘మా హాస్యం జంధ్యాల తరహాలో అన్ని వర్గాలూ నవ్వుకునేటట్లు ఉంటుంది. ఒత్తిడిలో, బిజీ పనుల్లో ఉన్నవారు కొద్ది నిమిషాలు అన్నీ మర్చిపోయి నవ్వుకునేలా చేయడమే మా లక్ష్యం’ అని చెబుతారు శబరీష్‌. తాజాగా వీరు పరీక్షల నేపథ్యంతో తీసిన వీడియోకి నెల రోజుల్లో 35 లక్షల వీక్షణలు వచ్చాయి. త్వరలో ‘అల్లాడిస్తా’ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ తీసుకురానున్నారు. వైవా బృందంలో కొందరికి ఇదే వృత్తికాగా, మరికొందరికి ప్రవృత్తి. వైవా నుంచి తెలుగు పరిశ్రమకి మంచి నటుల్ని పంపాలనేది తమ లక్ష్యాల్లో ఒకటిగా చెబుతారు శబరీష్‌. వీరి బృందం నుంచి హర్ష తర్వాత తాజాగా రాఘవ్‌ (ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌)సినిమాల్లో నటించాడు. వైవా ఛానెల్లో ఇప్పటివరకూ 30 వీడియోలు పెట్టారు. వాటన్నింటికీ 4.5కోట్ల వీక్షణలు వచ్చాయి. అంటే సగటున ఒక్కో వీడియోకి 15 లక్షల వీక్షణలు వచ్చాయన్నమాట. వైవా ఛానెల్‌కు ఆగస్టులో 40వేల మంది చందాదారులుంటే ఇప్పుడా సంఖ్య 3.5 లక్షలకు చేరింది. ఈ ఏడాది చివరికి 10లక్షలకు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైవాకు వెళ్లి కాసేపు నవ్వుకోవాలని తెలుగువారు అనుకోవాలే కానీ అదేం అసాధ్యంకాదు, ఏమంటారు!


 

దైనా రంగు బాగా నచ్చితే ఆ రంగులో ఉన్న ఫోనో, ల్యాప్‌టాపో, బట్టలో కొనుక్కుంటాం. కానీ టూత్‌ బ్రష్‌ నుంచి బెడ్‌ ల్యాంప్‌ వరకూ ఇంట్లో ప్రతి వస్తువూ అదే రంగులో ఉండాలంటే కాస్త కష్టమే. అదీ ఏళ్ల తరబడి కంటికి కనిపించే వస్తువులన్నీ మనసుకు నచ్చిన రెండంటే రెండే రంగుల్లో ఉండేలా జాగ్రత్తపడటమంటే మాటలు కాదు. ఒకే రంగులో ఉన్న అన్ని వస్తువుల్ని వెతికి కొనడం ఒకెత్తయితే, ఇరుగుపొరుగువాళ్ల వింత చూపుల్ని తట్టుకొని ఆ అలవాటుని కొనసాగించడం మరొకెత్తు. బెంగళూరు వాసి సెవన్‌రాజ్‌ తనకెంతో ఇష్టమైన ఆ రెండు రంగుల మధ్యే ఏళ్ల తరబడి జీవిస్తూ స్థానికంగా ఓ చిన్న సెలెబ్రిటీలా మారిపోయాడు. అతడి కుటుంబానికీ ‘రెడ్‌ అండ్‌ వైట్‌ ఫ్యామిలీ’ అన్న ముద్ర పడింది. పదిమందిలోకి ప్రత్యేకంగా కనిపించాలన్న సెవన్‌రాజ్‌ కోరికలోంచి ఈ కొత్త రకమైన జీవనశైలి మొదలైంది.

తల నుంచి కాళ్ల దాకా
మహాత్మా గాంధీని తలచుకోగానే తెల్లని ధోవతి, గుండ్రని కళ్లద్దాలూ, చేతి కర్రా గుర్తొచ్చేస్తాయి. ఎన్టీఆర్‌ ప్రస్తావన వస్తే కాషాయం రంగు దుస్తులు కళ్లముందు మెదుల్తాయి. అలాంటి ప్రముఖుల్లానే తన జీవనశైలి కూడా కొత్తగా ఉండాలనీ, తన పేరు తలచుకోగానే రూపం గుర్తురావాలని చాలా ఏళ్ల క్రితం సెవన్‌రాజ్‌కి కోరిక కలిగింది. దాంతో ప్రత్యేకంగా కనిపించడం కోసం తనకు ఎంతో ఇష్టమైన ఎరుపూ, తెలుపు రంగుల దుస్తుల్నే వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. క్రమంగా తన బైకునీ, కారునీ ఆ రంగుల్లోకి మార్చేశాడు. ఆఫీసునీ, అందులోని సామగ్రినీ కూడా ఆ రంగుల్లోకి తీసుకొచ్చాడు. ఇంటికీ ఎరుపూ, తెలుపు రంగులే వేయించాడు. ఇంట్లోని పాత వస్తువులన్నీ తీసేసి, ఆ రెండు రంగుల్లో ఉన్న వాటినే వెతికి తీసుకొచ్చాడు. పొయ్యీ, మిక్సీ, ఫ్రిజ్‌, ఏసీ, సోఫాలూ, కుర్చీలూ, దిండ్లూ, దుప్పట్లూ, కర్టెన్లూ, కళ్లద్దాలూ...ఇలా ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల నుంచీ ఇంట్లోని వస్తువులదాకా అన్నింటినీ ఆ రెండు రంగుల్లోకి మార్చేశాడు. ఆఖరికి ఎరుపు, తెలుపు రంగుల పూలిచ్చే మొక్కల్నే ఇంట్లో పెంచుతూ వచ్చాడు. మొదట స్థానికులకు ఇదంతా వింతగా అనిపించినా, సెవన్‌రాజ్‌కి మాత్రం తాను కోరుకున్నట్లుగా కావల్సినంత గుర్తింపు వచ్చేసింది. కొత్తలో అతడి భార్యకూ కాస్త ఎబ్బెట్టుగా తోచినా, నెమ్మదిగా అతడి తపనని అర్థం చేసుకుంది. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు ఆమెకు నచ్చిన బట్టలు వేసుకుంటూనే, భర్తతో కలిసి బయటకు వెళ్లినప్పుడు మాత్రం ఎరుపు, తెలుపు చుడీదార్లూ చీరలూ ధరించడం మొదలుపెట్టింది. క్రమంగా వాళ్ల పిల్లలిద్దరికీ అదే అలవాటైంది.
రంగులతో పాటు సెవన్‌రాజ్‌కు ‘7’ అంకె అన్నా విపరీతమైన మోజు. తండ్రికి అతడు ఏడో సంతానం కావడంతో కాస్త చిత్రంగా ‘సెవన్‌రాజ్‌’ అన్న పేరు పెట్టాడు. ఎదిగేకొద్దీ అతడికీ ఆ అంకెపైన ఇష్టం పెరుగుతూ వచ్చింది. అతడి కారు నంబర్‌ ‘7777’. మొబైల్‌ నంబర్‌ ఆ అంకెలతోనే ముగుస్తుంది. కష్టపడి ఏడు భాషలు మాట్లాడటం నేర్చుకున్నాడు. అతడు వేసుకునే ప్రతి చొక్కాపైనా, కోటుపైనా ‘7’ అంకె ముద్రించి ఉంటుంది. ఇలా ఏ పనికైనా ఏడుని ముడిపెడుతూ తన పేరుకి న్యాయం చేస్తున్నాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా తాను సంపాదించే డబ్బుకంటే, తన ప్రత్యేకతలతో సాధించిన గుర్తింపే ఎక్కువ సంతోషాన్నిస్తుందంటాడు ‘సెవన్‌రాజ్‌’. వూరికే అంటారా... ఎవరి పిచ్చి వారికి ఆనందమని!


 

జై ‘జవాన్‌’! 

అనగనగా ఓ వూరు. అవడానికి దేశంలోని పలు గ్రామాల్లాగా అదీ ఓ ఖాదీగ్రామం. కానీ దానికో వెబ్‌సైట్‌, ఫేస్‌బుక్‌ పేజీ, ట్విటర్‌ ఖాతాలున్నాయి. మాజీ కేంద్రమంత్రి శశిథరూర్‌, సినీ నటుడూ దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌, రచయిత విలియం డాల్రింపుల్‌ లాంటి ప్రముఖులు ఈ గ్రామాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు! ఇంతకీ ఏమిటా గ్రామ ప్రత్యేకత?

‘హలో.. నా పేరు హుడ్లీ. నేనో చిన్న గ్రామాన్ని. మీ గూగుల్‌ మ్యాప్‌లో నేను కన్పించకపోవచ్చు. కానీ ఏడువేల మంది జనాభాకి నేనే ఆధారం. ఒక తల్లిగా నా బిడ్డలకు పోషకాహారం అందాలనుకుంటాను. నా పిల్లలు బడిలో ఉండాలనుకుంటాను. గ్రామం మనుషులతో నిండి ఉండాలని కోరుకుంటాను. కానీ ఉపాధి లేక నా బిడ్డలు వూరొదిలి వెళ్లిపోతున్నారు. అది నాకు తీరని వ్యథ. అందుకే ఉద్యోగాలనే వూరికి తేవాలి. దానికి మీ సహాయం కావాలి...’ ఇలా సాగుతుంది ‘ద హుడ్లీ ప్రాజెక్ట్‌’ వీడియో. ‘అంత చిన్న గ్రామానికి వెబ్‌సైట్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఇవన్నీ అవసరమా’ అంటే... ‘ఎందుకు కాదు, కాలానికి తగినట్లుగా మేమూ మారాలిగా మరి’ అంటారా గ్రామస్థులు. ఇంతకీ హుడ్లీకి ఏం కావాలి?

గాంధీజీ సిద్ధాంతాలే ఆధారం
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో హుడ్లీ ఓ చిన్నగ్రామం. 1937లో గాంధీజీ చేతుల మీదుగా ఏర్పడిన ఈ ఖాదీగ్రామంలో ఓ వారం పాటు ఆయన బస చేశారు కూడా. ఖాదీ గ్రామమంటే కుటీర పరిశ్రమలతో విలసిల్లుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించాలి. చాలా కాలం హుడ్లీ కూడా అలాగే ఉండేది. రాను రాను ఉపాధి వెదుక్కొంటూ గ్రామం నుంచి యువతీయువకులు పట్టణాలకు వలస పోవడం మొదలెట్టారు. ఈ పరిణామం పలువురిని ఆలోచింపచేసింది. కానీ దాన్ని ఆపడానికి ఏం చేయాలో కొందరు సాఫ్ట్‌వేర్‌ నిపుణులు కలగజేసుకునేవరకూ వారికి తోచలేదు. అమిత్‌, ప్రణయ్‌, ఆదర్శ్‌... బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసుకుంటున్న యువకులు. సొంతంగా ఏమన్నా చేద్దామన్న ఆలోచనలో ఉన్నవాళ్లు. అమిత్‌ ఓ సారి తాతగారి ఇంటికి బెళగావి వెళ్లాడు. అక్కడ ఓ పచ్చడి సీసా చూడడం, తాత ఆ పచ్చళ్ల గురించి ఎంతో వర్ణించి చెప్పడంతో అతనికి ఆసక్తి పెరిగింది. హుడ్లీ వెళ్లాడు. స్థానికులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకున్నాడు. తిరిగి వచ్చి స్నేహితులతో చర్చించాడు. అందరూ కలిసి హుడ్లీ పచ్చళ్లకు ఈ కామర్స్‌ సైట్‌ రూపొందించాలని నిర్ణయించారు. గ్రామస్థులతో చర్చించగా వారు ఆనందంతో అంగీకరించారు. ముగ్గురూ కలిసి తాము దాచుకున్న డబ్బు ఖర్చు పెట్టి హుడ్లీ ప్రాజెక్ట్‌ డిజిటలైజేషన్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉత్పత్తి వరకూ గ్రామస్తులు చూసుకుంటుండగా, ఈ- కామర్స్‌ నిర్వహణ, ఆర్డర్లు ప్యాక్‌ చేసి పంపడం వీరు చూస్తున్నారు. క్రమంగా అది కూడా గ్రామస్తులకే అప్పజెప్పాలన్నది వారి ఆలోచన.

పచ్చళ్లే ఎందుకంటే...
అన్ని ఖాదీగ్రామాల్లో లాగానే ఇక్కడా ఎలాంటి యంత్రసహాయం లేకుండా నేత వస్త్రాలు, సబ్బులు, అప్పడాలు, అగరుబత్తీలు లాంటి చాలా రకాల ఉత్పత్తులు తయారుచేస్తారు. అలాంటప్పుడు మరి పచ్చళ్లకే ఈ కామర్స్‌ సైట్‌ ఎందుకంటే... మిగతా ఉత్పత్తులను అప్పుడప్పుడూ వాడతారు. అందువల్ల ఎక్కువ కొనరు. దాంతో ఆ పని చేసే వాళ్లు కొంతకాలం నిరుద్యోగులుగా ఉండిపోవాల్సి వస్తుంది. పచ్చళ్లను రోజూ వాడతారు కాబట్టి వాటి తయారీ నిరంతరం జరుగుతుంది. ప్రస్తుతం పాతిక మంది మహిళలు మాత్రమే అక్కడ పచ్చళ్ల తయారీలో పాల్గొంటున్నారు. ఆర్డర్లు పెరిగితే వంద మందికి ఉపాధి కల్పించాలన్నది ప్రణాళిక. వంద మంది స్త్రీలు ఆర్థిక స్వావలంబన సాధిస్తే దాని ప్రభావం వెయ్యి మంది మీద ఉంటుందన్నది వాస్తవం. అందుకే ఈ కామర్స్‌ సైట్‌లో ట్రయల్‌ ప్యాక్‌తో మొదలుపెట్టి ఏడాది, 18 నెలల సబ్‌స్క్రిప్షన్‌ ప్యాకేజీలు రూపొందించారు. దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరాలకు వీరు పచ్చళ్లను సరఫరా చేస్తున్నారు. దేశంలోని మిగతా నగరాలకూ విస్తరించాలన్నది ప్రణాళిక.

ఆ పేరుకీ ఓ కథ
హుడ్లీ గ్రామంలో తయారయ్యే పచ్చళ్లకు ‘జవాన్‌’ అన్న పేరు పెట్టారు. ఖాదీ గ్రామంలో పచ్చళ్ల ఉత్పత్తి ప్రారంభించినపుడు వాటికో పేరు ఉండాలని అధికారులు సూచించారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఇచ్చిన జై జవాన్‌ జై కిసాన్‌ నినాదం ప్రాచుర్యంలో ఉన్న రోజులవి. అయితే కిసాన్‌ అన్న పేరు అప్పటికే మరో సంస్థ వాడుకోవడంతో జవాన్‌ అన్న పదాన్ని తమ పచ్చళ్లకు పెట్టుకున్నారు వీరు. 1970వ దశకంలో పచ్చళ్ల తయారీ మొదలుపెట్టగా అప్పటినుంచీ స్థిరమైన ఆదరణ లభిస్తోంది. ప్రభుత్వ నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ గుర్తింపు ఉంది. విరాళాలిస్తామని కొందరు ముందుకొస్తున్నా హుడ్లీ వాసులు అంగీకరించరు. విరాళాలతో జీవితాలు మారవనీ, స్థిరమైన ఉపాధితోనే అభివృద్ధి సాధ్యమనీ వారు పేర్కొంటారు. మహిళలకు ఉపాధి ప్రధాన లక్ష్యమైతే ఆ తర్వాత వ్యాపారాభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయంతో గ్రామాభివృద్ధికి తోడ్పడతామంటున్నారు హుడ్లీ ప్రాజెక్ట్‌ రూపకర్తలు. తాము ఈ విషయంలో విజయం సాధిస్తే ఇతర ఖాదీ గ్రామాలకూ ఈ విధానం ఆచరణీయమవుతుందని వారు ఆశిస్తున్నారు. వారి ఆశ నెరవేరాలని మనమూ కోరుకుందాం.

 


 

 

వినలేరు, మాట్లాడలేరు... అయితేనేం! 

దిల్లీలోని సత్యానికేతన్‌ ప్రాంతంలో చాలా హోటళ్లుంటాయి. వాటన్నిటిలోనూ ఒకటి మాత్రం ప్రత్యేకంగా కన్పిస్తుంది. అలాగని అదేం పెద్ద స్టార్‌ హోటల్‌ కాదు. మధ్యతరగతి వాళ్లు టిఫిన్లకీ, భోజనానికీ వెళ్లే సాధారణ హోటల్‌. దాని పేరు ‘ఎకోస్‌’. ఆ మాటకు అర్థం ‘ప్రతిధ్వని’ అని. కానీ నిజానికి అక్కడ ధ్వనులేమీ విన్పించవు. చిరునవ్వులు, సంకేతాలు, కొన్ని ప్లకార్డులు, మరికొన్ని రంగు రంగుల బల్బులు... అంతే. పని జరిగిపోతుంది. వినియోగదారులు తృప్తిగా తమకు నచ్చింది తిని బిల్లు చెల్లించి వెళ్లిపోతారు. ఆ హోటల్‌ని నిర్వహిస్తున్న సిబ్బంది అంతా మూగ, చెవిటి వారు.

‘ఎకోస్‌’ లోనికి అడుగుపెడుతూనే ఓ వ్యక్తి నవ్వుతూ ఆహ్వానిస్తాడు. వచ్చినవారు ఇద్దరో, ముగ్గురో చూసి వాళ్లకు సరిపోయే టేబుల్‌ దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెడతాడు. టేబుల్‌ మీద మెనూ ఉంటుంది. పక్కనే ఒక నోట్‌ప్యాడ్‌ కూడా. మీకు కావలసిన పదార్థాలు నోట్‌ ప్యాడ్‌ మీద రాస్తే వెయిటర్‌ వచ్చి తీసుకెళ్తాడు. క్షణాల్లో మీరు కోరుకున్న పదార్థాలు తెచ్చేస్తాడు. భోజనం మధ్యలో మీకు నీళ్లొ, స్పూనో, ఫోర్కో, మరొకటో కావాలి... అప్పుడు వెయిటర్‌ని పిలవడం ఎలా? వారికి విన్పించదు కదా? దానికీ ఓ ఏర్పాటు ఉంది. ప్రతి బల్ల మీద ఒక బల్బు ఉంటుంది. దాని మీట నొక్కితే వెయిటర్‌ వస్తాడు. బల్లమీదే సాధారణంగా మనకు అవసరమయ్యే అంశాలు రాసివున్న కొన్ని ప్లకార్డులు ఉంటాయి. అందులో మనకు కావలసింది తీసి చూపిస్తే చాలు. పని జరిగిపోతుంది.

ఆరుగురి ఆశయం
‘ఎకోస్‌ కెఫే¶’ని ఆరుగురు స్నేహితులు కలిసి ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. సాహిబ్‌ సర్నా, శివాంశ్‌ కన్వర్‌, గౌరవ్‌ కన్వర్‌, సాహిల్‌ గులాటీ, ప్రతీక్‌ బబ్బర్‌, క్షితిజ్‌ బెహల్‌... ఈ ఆరుగురినీ ఒక్కతాటి పైకి తెచ్చింది వారి సామాజిక స్పృహ. అందరూ ఉన్నత విద్యావంతులూ వృత్తి నిపుణులూను. ఎవరి ఉద్యోగాలు వారు చేసుకుంటున్నారు. దాంతో వారు సంతృప్తి చెందలేదు. సామాజిక బాధ్యత కింద ఏం చేయాలన్న మేధోమథనం మొదలైంది. ఆరుగురి ఆలోచనా సమాజంలో అవకాశాలను అందిపుచ్చుకోలేని అంగవికలుర పైకి మళ్లింది. వారికోసమే ఏమైనా చేయాలని నిర్ణయించారు. వైకల్యాన్ని అధిగమించి వారూ సాధారణ జీవనం గడపగలరనీ విధినిర్వహణలో ఎవరికీ తీసిపోరనీ సమాజానికి చూపించాలనుకున్నారు. ఆశయం ఓకే. ఇక ఆచరణ... అందరి దృష్టిలో పడాలంటే ఆతిథ్య రంగమే సరైనదని మిత్రబృందం నిర్ణయించింది. పకడ్బందీగా ప్రణాళిక వేసి స్టార్టప్‌ విభాగం కింద హోటల్‌ ప్రారంభించింది. నోయిడాలోని బధిరుల సంఘానికి వెళ్లి తమకు కావలసిన సిబ్బందిని ఎంచుకుంది సర్నా మిత్ర బృందం. హోటల్‌ నిర్వహణ చూసేవారినుంచీ వంటా, వడ్డనా చేసేవారివరకూ అందరూ బధిరులే. కొద్దిపాటి శిక్షణతో వారు యజమానుల ఆలోచనను అందిపుచ్చుకున్నారు. సాఫ్ట్‌ స్కిల్స్‌ కూడా నేర్చుకుని సమర్థంగా సేవలందిస్తున్నారు.
‘ఎకోస్‌ కెఫె’ మల్టి క్విజిన్‌ రెస్టారెంట్‌. అన్ని రుచులనూ వండి వడ్డిస్తారు. రాజధాని నగరం కావడంతో విభిన్న ప్రాంతాలకూ సంస్కృతులకూ చెందిన ప్రజలుంటారు. అన్ని రుచులూ అందుబాటులో ఉంటేనే హోటల్‌కి త్వరగా పేరొస్తుంది. పైగా దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన పలు కళాశాలలు ఆ చుట్టు పక్కల ఉండడంతో విద్యార్థులూ ఎక్కువగా వస్తారు. అందుకే హోటల్‌ ప్రారంభించడానికి సత్యానికేతన్‌ ప్రాంతాన్ని ఎంచుకున్నారు ‘ఎకోస్‌’ యజమానులు. ఇప్పుడు వారి హోటల్‌కి విద్యార్థులతో పాటు కార్పొరేట్‌ ఉద్యోగులూ, కుటుంబాలతో కలిసి వచ్చేవారూ చాలామందే రెగ్యులర్‌ కస్టమర్లున్నారు.