close
కురులకు రంగేళీ!

కురులకు రంగేళీ!

ది వరకు జనం... ‘ఎంత చక్కగా హుందాగా తయారైతే అంత బాగుంటాం అందరికీ నచ్చుతాం’ అనుకునేవారు. కానీ ఇప్పుడు నచ్చడం అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో లైకులు రావడమే. అవేమో అందంగానూ అందరిలానూ ఉంటే రావాయే. వీలైనంత వింతగా, నవ్వొచ్చేంత వెర్రిగా ఉండాలి. ఇంకేముందీ, రోజుకో క్రేజీ ఫ్యాషన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రంగప్రవేశం చేస్తోంది. అలాంటిదే ఈ ‘రెయిన్‌బో హెయిర్‌ కార్వింగ్‌’ ట్రెండ్‌. అరంగుళం కన్నా తక్కువున్న జుట్టుని రకరకాల ఆకారాల్లో కత్తిరించి, ఆయా రూపాలకు తగిన రంగులు అద్దడం ఈ తలకట్టు ప్రత్యేకత. జుట్టు ఎంత నల్లగా ఒత్తుగా ఉంటే అంత అందం అన్న దగ్గర్నుంచి ఎన్ని రంగులూ కత్తిరింపులూ ఉంటే అంత ఫ్యాషన్‌ అన్నంత వరకూ మారిపోయాయన్నమాట రోజులు.


పిల్లికి ఆయా కావలెను... జీతం రూ.14 లక్షలు

ని ఒత్తిడి ఉండదు. అసలు పనే చెయ్యనక్కర్లేదు. ఓ పిల్లిని ఒళ్లొ పెట్టుకుని నిమురుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ హాయిగా సేదతీరొచ్చు. పిల్లిమీద మరీ ప్రేమ కలిగితే దాన్ని హత్తుకుంటూ ఎత్తుకుంటూ ఆడుకోనూవచ్చు. ‘ఇలా ఉండడం మీకూ ఇష్టమా, అయితే, ఏడాదికి రూ.14 లక్షల రూపాయల జీతం ఇస్తాం రండి’ అంటోంది ఐర్లాండ్‌లోని డబ్లిన్‌కి చెందిన ‘జస్ట్‌ క్యాట్స్‌ వెటర్నరీ క్లినిక్‌’ యాజమాన్యం. దీనికి ప్రత్యేకమైన విద్యార్హతలు కూడా అక్కర్లేదు. పిల్లులను ప్రేమించే స్వభావం ఉంటే చాలట. పిల్లి రోగుల కోసం ‘క్యాట్‌ కడ్లర్స్‌ కావాలి’ అంటూ ఈమధ్యే ఉద్యోగ ప్రకటనను ఇచ్చింది ఆ పిల్లుల ఆసుపత్రి. మీరు కలగంటున్న ఉద్యోగం ఇదేనా... మరి, ఆలస్యం ఎందుకు..? (miaow@justcats.ie) వెబ్‌సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోండి.


ఇది పువ్వులు పూయని తోట..!

‘రంగు రంగుల పూల తోట ఎంత బాగుందో...’ ఈ చిత్రాన్ని చూసి మీరూ ఇలాగే అనుకుంటున్నారా... అయితే పొరబడినట్లే. అవును మరి, ఇక్కడ కనిపిస్తున్నవేవీ పువ్వులూ కాదు, మొక్కలూ కాదు. అన్నీ ప్లాస్టిక్‌ బాటిళ్లే. పర్యావరణానికీ జీవజాతి మనుగడకూ ప్లాస్టిక్‌ ఎంతో హాని చేస్తుందని అందరికీ తెలుసు. కానీ వాటి వాడకం ఏమాత్రం తగ్గడం లేదు. పర్యటకులు ఎక్కువగా వచ్చే గోవాలో అయితే, గత కొంతకాలంగా ఎటు చూసినా ప్లాస్టిక్‌ గుట్టలే దర్శనమిస్తున్నాయట. ఈ సమస్యను పర్యటకకోణంలోనే కళ్లకు కట్టాలనుకున్నాడు స్థానికంగా ఉండే వైద్యుడూ కళాకారుడూ అయిన సుబోధ్‌ కేర్కర్‌. గోవాలోని బీచ్‌లూ హోటళ్ల నుంచి లక్షాయాభైవేల ప్లాస్టిక్‌ బాటిళ్లను సేకరించి, వాటి అడుగు భాగాన్ని పూల రేకుల్లా కత్తిరించి, రకరకాల రంగులేసి కొన్ని మీటర్ల పొడవున భూమిలో పాతాడు. గోవా వెళ్లే దార్లో సలిగావో గ్రామంలో రోడ్డు పక్కన అచ్చం పూల తోటలా కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని చూసేందుకు ఇప్పటికే ఎంతోమంది అక్కడికి రావడం మొదలుపెట్టారు. ‘ఒక్క ప్రాంతంలో అన్ని బాటిళ్లను సేకరించామంటే ఎంత ప్లాస్టిక్‌ పేరుకుపోతోందో చూసినవారికి అర్థంకాకుండా ఉంటుందా, మార్పు రాకుండా పోతుందా...’ అదే నా లక్ష్యం అంటారు సుబోధ్‌.


పళ్లూ వెలుగుతాయ్‌

క ప్రకటనలో... కరెంటు పోగానే కొంతమంది పళ్లను చూపించడం మొదలుపెడతారు. అవేమో ట్యూబ్‌లైట్లలా కాంతులీనుతూ వెలుగునిస్తాయి. టీవీలో కాబట్టి సరిపోయింది గానీ చీకట్లో ఎవరైనా మన ఎదురుగా నుంచుని అలా నవ్వితే హడలిపోమూ..! ప్రస్తుతం జపాన్‌లో చాలామంది పరిస్థితి ఇదేనట. స్థానికంగా ఉండే ఇద్దరు టెక్‌ నిపుణులు ఓ బట్టల దుకాణానికి సంబంధించిన వెలిగే పళ్ల ప్రకటనను చూసి, ‘ఎల్‌ఈడీ స్మైల్స్‌’ అనే ఓ పరికరాన్ని రూపొందించారట. పళ్లకు వేసుకునే క్లిప్పులా రూపొందించిన దీన్లోపల ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. వాచ్‌లలో ఉండేలాంటి చిన్న బ్యాటరీలతో పనిచేసే వీటిని పళ్లకు పెట్టుకుని రిమోట్‌తో ఆన్‌ చేస్తే నోరు టార్చ్‌లైట్‌లా వెలిగిపోతుందట. మనకు వెర్రిగా అనిపించినా జపాన్‌లో ప్రస్తుతం ఇదో క్రేజ్‌ అయిపోయింది.


హాయైన హంస నావలోనా...

పక్కన ప్రకృతి అందాలూ మరో పక్క మంచుతో మెరిసిపోతూ కనిపించే ఫుజి పర్వతమూ ఆ మధ్యలో నీటిలో సాగిపోతున్న హంస నావ... ఈ దృశ్యాన్ని చూస్తుంటే వెంటనే అక్కడ వాలిపోవాలనీ బాహుబలి సినిమాలోలా ‘హాయైన హంసనావలోనా...’ అని పాడుకోవాలనీ అనిపిస్తోంది కదూ... జపాన్‌లోని ‘యమనకకొ’ సరస్సు దగ్గరికి వెళ్తే మన కోరిక తీరినట్లే. యమనకకొ అంటే ‘హంసల సరస్సు’ అని అర్థమట. ఫుజి పర్వతానికి దగ్గర్లో ఉన్న ఈ సరస్సులో పర్యటకులు హంసల్లా ఉన్న నౌకలూ పడవల్లో విహరించొచ్చు. ఎంతో అందంగా చూడచక్కగా తీర్చిదిద్దిన వాటిని దూరం నుంచి చూస్తుంటే పెద్దా చిన్నా హంసలు నీటిలో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కేవలం ఈ పడవలను చూడ్డానికీ వాటిలో ఎక్కడానికే ఎందరో పర్యటకులు అక్కడికి వస్తుంటారట.


నాన్‌వెజ్‌ పువ్వులు

‘పూల బొకేలు పాతవైపోయాయి. పండ్లూ, చాక్లెట్లూ, బొమ్మల బొకేల ట్రెండూ తెర వెనక్కి వెళ్లిపోతోంది. మరి బొకేలు కాస్త కొత్తగా ఇంకాస్త వింతగా ఉండాలంటే ఏం చెయ్యాలి..?’ ఏ చికెన్‌ ముక్క తింటుండగా ఎవరి మెదడులో ఈ వెరైటీ ఆలోచన మెరిసిందో గానీ ఉప్పూ కారం మసాలా దట్టించి గ్రిల్‌ చేసిన మాంసం పువ్వుల్ని గులాబీ కాడలకు పూయించడం మొదలుపెట్టారు. ఇక్కడ పూల వేజుల్లోనూ బొకేల్లోనూ అందంగా కనిపిస్తున్న పువ్వులు అవే. మాంసాహార ప్రియులు పార్టీ అంటే చికెనో మటనో కావాలంటారు. అందుకే, ప్రత్యేక సందర్భాల్లో ఇలా కోడి మాంసాన్ని పువ్వుల ఆకారంలోకి మలచి, బొకేల్లా చేసి ఇవ్వడం ఈమధ్య ఓ ట్రెండ్‌ అయిపోయింది. వీటి తయారీ గురించి యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలే కాదు, అమ్మకానికి ఆన్‌లైన్‌లో ఎన్నో షాపింగ్‌ సైట్లు కూడా ఉన్నాయి.


మనసుంటే దాహం తీరుతుంది!

డాదికేడాదికీ వేసవిలో ఎండలు పెరుగుతున్నాయి. వేడికి అడవుల్లో ఉన్న కొలనులూ చెలమలు కూడా ఇంకిపోతున్నాయి. దాంతో దాహం తీర్చుకోలేక జంతువులు అల్లాడిపోతున్నాయి. ఎడారిలా ఉండే కెన్యాకు చెందిన సావొ ఈస్ట్‌ జాతీయ పార్కులో అయితే పరిస్థితి ఇంకా దారుణమట. స్థానికంగా ఏనుగుల సంరక్షకుడైన పాట్రిక్‌ కిలొంజొ అక్కడి మూగజీవుల కష్టాన్ని చూసి కరిగిపోయాడు. వెంటనే పన్నెండువేల లీటర్లు పట్టే ట్యాంకర్‌లో నీటిని నింపుకుని రెండు మూడు రోజులకోసారి అడవిలోని కుంటల్లో నింపడం మొదలు పెట్టాడు. నీటి జాడ కనిపెట్టి ఎక్కడెక్కడి నుంచో అడవి దున్నలూ జీబ్రాలూ దుప్పులూ ఏనుగులూ వచ్చి తాగడం ప్రారంభించాయి. మైళ్ల దూరం నుంచి ఒక్కో ట్యాంకర్‌తో నీటిని చేరవెయ్యడానికి పదిహేను వేలకు పైగా ఖర్చు పెట్టడం అతడి స్తోమతకు మించిన పనే. అయినా వెనకడుగు వెయ్యలేదు. ఈ విషయం సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసింది. దాంతో దాదాపు మూడువేల మంది క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా సుమారు కోటి రూపాయలను సమకూర్చి ప్యాట్రిక్‌కు ఇచ్చారు. ఒక్కడి వల్ల ఏం అవుతుంది... అని అతడు అనుకుంటే ఈరోజు ఆ మూగ జీవాల దాహం తీరేది కాదు, ప్రాణం నిలిచేది కాదు. ఏమంటారు..?

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.