close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాన్నకి ప్రేమతో

నాన్నకి ప్రేమతో
- గోపాలుని అమ్మాజీ

కాలింగ్‌బెల్‌ శబ్దం విని ‘ఇంత ఉదయమే ఎవరై ఉంటారు?’ అనుకుంటూ వెళ్ళి డోర్‌ ఓపెన్‌ చేశాడు జయచంద్ర.
‘‘గుడ్‌ మార్నింగ్‌ సార్‌’’ ఎదురుగా చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు కొరియర్‌ బాయ్‌. అతని చేతిలో పెద్ద పార్శిల్‌ ఉంది.
జయచంద్ర కూడా అతన్ని విష్‌ చేసి ‘‘ఏంటది?’’ అనడిగాడు, అతని చేతిలో ఉన్న పార్శిల్‌ వంక చూస్తూ.
‘‘వైజాగ్‌ నుంచి వచ్చింది సార్‌. ఆదిత్య మీకు పంపారు’’ అన్నాడు అతను.
ఆ మాట వినగానే జయచంద్ర ముఖం ఆనందంతో వెలిగిపోయింది. పార్శిల్‌ అందుకోటానికి చేతులు ముందుకు చాపాడు.
‘‘చాలా వెయిట్‌ ఉంది సార్‌, నేనే లోపల పెడతాను’’ అంటూ, జయచంద్ర దారివ్వటంతో లోపలికి వెళ్ళి టీపాయ్‌ మీద పార్శిల్‌ ఉంచి మళ్ళీ గుమ్మం బయటకి వచ్చి నిలబడ్డాడు కొరియర్‌ బాయ్‌.
జయచంద్ర అతనికి ‘థ్యాంక్స్‌’ చెప్పాడు అభిమానంగా.
కొరియర్‌ బాయ్‌ జయచంద్ర దగ్గర సైన్‌ తీసుకుని, వెళ్ళేముందు ‘‘హ్యాపీ ఫాదర్స్‌ డే సార్‌!’’ అన్నాడు అదే చిరునవ్వుతో.
అప్పుడు అర్థమైంది జయచంద్రకి కొడుకు ఆ పార్శిల్‌ ఎందుకు పంపాడో!

* * *

ఉదయం టీ తాగుతూ టీవీలో మార్నింగ్‌ న్యూస్‌ చూస్తున్నాను. నా సెల్‌కి మెసేజ్‌ వచ్చింది- నాన్నకి పార్శిల్‌ డెలివరీ అయినట్టు.
ఈపాటికి నాన్న పార్శిల్‌ ఓపెన్‌ చేసి, పైన కవర్‌లో ఉన్న నా లెటర్‌ చదువుతూ ఉండి ఉంటారు.
నాన్నకి లెటర్స్‌ అంటే చాలా ఇష్టం. క్యాంపుకి వెళ్ళినప్పుడు కూడా అమ్మకి సరదాగా లెటర్స్‌ రాసేవారు. లెటర్‌ రాయటంలో కూడా నాన్నకి ఓ ప్రత్యేకత ఉండేది. అందులో ఇంటికి సంబంధించిన విషయాలేమీ ఉండేవి కాదు. సరదా కబుర్లూ, తను చదివిన పుస్తకాల్లోని కోట్సూ, తనకి నచ్చిన పాయింట్సూ ఎంతో అద్భుతంగా రాసేవారు. నేను మెడిసిన్‌ చదివిన ఐదేళ్ళూ నాన్న దగ్గర్నుంచి నెలకి రెండు లెటర్స్‌ తప్పకుండా వచ్చేవి. వాటినుంచి ఎన్నో విషయాలు తెలిసేవి. లెటర్‌లో నాన్న పంపే జోక్స్‌ ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకుని అందరం బాగా ఎంజాయ్‌ చేసేవాళ్ళం.
అందుకే నాన్న మీద నాకున్న ప్రేమని లెటర్‌ రూపంలో తెలియజేయాలనుకున్నాను. నాన్న రాసినంత అందంగా రాయలేకపోయినా నా భావాన్ని వ్యక్తపరచటానికి ప్రయత్నించాను. నేనెలా రాసినా నాన్న దాన్ని బాగానే అర్థంచేసుకోగలరు.
లెటర్‌ చదవటం పూర్తయ్యేసరికి నేను పంపిన గిఫ్ట్‌ ఏంటో నాన్నకి అర్థం అయిపోయుంటుంది.
ఇంతకీ నాన్నకి పంపిన గిఫ్ట్‌ ఏంటో చెప్పలేదు కదా! ఆయనకి ఇష్టమైన చార్లెస్‌ డికెన్స్‌ పుస్తకాలు. నాన్న చాలాసార్లు చార్లెస్‌ డికెన్స్‌ రాసిన నవలల గురించి ప్రస్తావించేవారు. ఆయన రచనలు మనుషుల జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయని చెప్పేవారు. నాన్నకి అన్నింటికన్నా చాలా ఇష్టమైన విషయం పుస్తకాలు చదవటం. కేవలం చదవటమే కాదు, అందులోని విషయాల్ని చక్కగా విశ్లేషించేవారు. పుస్తకాలనే కాదు, ఏ విషయాన్నైనా చాలా బాగా ఎనలైజ్‌ చేయటం నాన్నకి ఉన్న టాలెంట్‌.
అక్కనీ నన్నూ ఇంజినీరింగ్‌ చదివించాలని నాన్నకి బాగా ఉండేది. అక్క టెన్త్‌ అయ్యాక కాలేజీలో చేర్పించేటప్పుడు తనేం చదవాలనుకుంటోందో, తనకి ఏ సబ్జెక్టు అంటే ఇంట్రెస్ట్‌ ఉందో అడిగారు నాన్న. అక్క ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేస్తానని చెప్పింది. మళ్ళీ రెండేళ్ళ తర్వాత నేను కాలేజీలో జాయిన్‌ అయేప్పుడు కూడా నన్నూ అలాగే అడిగారు. నాకు డాక్టర్‌ అవ్వాలని ఉందని చెప్పాను. రెండుసార్లూ నాన్న అప్‌సెట్‌ అయ్యారు. కానీ మాటమాత్రంగా కూడా ఆ విషయం మాతో అనలేదు. మేమెందుకు ఆ కోర్సు చేయాలనుకుంటున్నామో, వాటి గురించి మాకెంత వరకు అవగాహన ఉందో, మాకా కేపబిలిటీ ఉందా లేదా అన్న దానిమీద చాలాసేపు మాతో డిస్కస్‌ చేశారు. అందులో ఉండే పాజిటివ్‌ అంశాలేమిటో ఇబ్బందులేమిటో ఉదాహరణలతో సహా వివరంగా చెప్పారు. ఆ తర్వాతే మమ్మల్ని ఆ కోర్సుల్లో జాయిన్‌ చేశారు.
చాలామంది పేరెంట్స్‌లాగా ఆయన తన భావాల్ని మామీద రుద్దటానికి ప్రయత్నం చేయలేదు. మా భవిష్యత్తు గురించి భయపడనూ లేదు.
నేను మెడిసిన్‌ చదువుతాననగానే అమ్మ నాన్నతో అంది ‘మెడిసిన్‌ అంటే మాటలు కాదు, చాలా ఖర్చుతో కూడిన చదువు. మనవల్ల అవుతుందా’ అని.


‘అది మన బాధ్యత, రేపు వాళ్ళకి మనమెంత ఆస్తులిచ్చాం అన్నది కాదు ముఖ్యం. జీవితంలో వాళ్ళు సాధించాలనుకున్న దానికి మనం ఎంతవరకూ సపోర్ట్‌ ఇచ్చాం అన్నదే వాళ్ళకి గుర్తుండేది. ‘జీవితంలో ఇది సాధించలేకపోయాం’ అన్న అసంతృప్తి వాళ్ళకెప్పుడూ కలగకూడదు’ అన్నారు నాన్న.
ఈపాటికి నాన్న పుస్తకాలన్నీ తీసి వాటిని పరిశీలిస్తూ ఉండి ఉంటారు. ఆ పని పూర్తయిన తర్వాతే నాకు కాల్‌ చేస్తారు. అందుకే ఆయన్నుంచి వెంటనే ఫోన్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు నేను. ఆయన ఎప్పుడూ తన ఎమోషన్స్‌ని అంత చప్పున బయటపెట్టరు. చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటారు.
మెడిసిన్‌ సెకండ్‌ ఇయర్లో ఉండగా నేను చేసిన తప్పుకి నాన్న మా ప్రిన్సిపాల్‌ ముందు తలొంచుకుని కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది.
చాలా కాలేజీల్లో లాగానే నేను చదివే కాలేజీలో కూడా కులపిచ్చి ఒక అంటువ్యాధిగా తయారైంది. ఫలితంగా స్టూడెంట్స్‌ మధ్య తరచూ గొడవలు జరిగేవి. తెలిసీ తెలియని వయసు కావటంతో హీరోయిజం చూపించాలనే ఉబలాటంతో ఆ గొడవల్లో కొంచెం ఎక్కువ ఉత్సాహం ప్రదర్శించాను. దాంతో ప్రిన్సిపాల్‌కి కంప్లైంట్‌ వెళ్ళింది. ఆయన నాన్నని కాలేజీకి పిలిపించారు.
‘మీ అబ్బాయి మీద చాలా కంప్లైంట్స్‌ వస్తున్నాయి. అనవసరమైన గొడవల్లో తలదూరుస్తున్నాడు. అది కాలేజీకీ మంచిది కాదు, మీ అబ్బాయి ఫ్యూచర్‌కీ మంచిది కాదు. ఈసారికి వార్నింగ్‌తో వదిలేస్తున్నాం. రిపీట్‌ అయితే సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది’ అన్నారు ప్రిన్సిపాల్‌ నాన్నతో.
అప్పుడు కూడా నాన్న ముఖంలో ఏ రకమైన భావం నాకు కనిపించలేదు.
అంతా విన్నాక ‘జరిగినదానికి క్షమాపణ కోరుతున్నాను. అసలేమి జరిగిందో మా వాడితో కూడా మాట్లాడి మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను’ అని చెప్పి వచ్చేశారు.
నాతోపాటు గొడవల్లో ఉన్నారని తెలిసిన నా ఫ్రెండ్స్‌ కొందరిని సాయంత్రం నా రూమ్‌కి పిలిపించి నాన్న మా అందర్నీ కూర్చోపెట్టి మాట్లాడారు.
‘చదువు- మనిషిలో ఆలోచనా శక్తిని పెంచాలేగానీ మూర్ఖుణ్ణి చేయకూడదు. మీ అందరూ రేపు కాబోయే డాక్టర్లు. ప్రాక్టీసు పెట్టాక కూడా మీరు ఈ కులపిచ్చితోనే పేషెంట్స్‌కి వైద్యం చేస్తారా?’ అని అడిగారు మా అందర్నీ ఉద్దేశించి.
ఆయన అడిగిన ప్రశ్నకి మా ఎవరి దగ్గరా సమాధానం లేదు.
‘అసలు మీకు నిజంగా కులం అంటే ఏంటో, దాని చరిత్ర ఏంటో తెలుసా?’ అడిగారు మళ్ళీ.
ఇప్పుడు కూడా మౌనమే మా సమాధానం అయింది. రెండు నిమిషాల తర్వాత ఆయనే చెప్పారు.
‘మొదట కులాన్నిబట్టి వృత్తులా లేక వృత్తుల్నిబట్టి కులాలా అన్న దానిమీద చర్చలు తెగ జరిగేవి. తర్వాత్తర్వాత అందరూ వృత్తుల గురించి ఆలోచించటం మర్చిపోయి కులాన్ని మాత్రం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తమ స్వార్థానికి వాడుకోవటం మొదలుపెట్టారు. మీలాంటి యువత కూడా ఎవరో చెప్పిన మాటలు విని రెచ్చిపోయి తన్నుకుంటున్నారు. మనం ఇప్పుడు సాంకేతిక యుగంలో బతుకుతున్నామన్న విషయం కూడా మీరు మర్చిపోతున్నారు. ఇవాళ సమాజంలో ఎన్నో సమస్యలు మనుషుల్ని కుదిపేస్తుంటే మీలాంటి యువత వాటిని వదిలేసి, ఇంకా కులాల పేరుతో కొట్టుకుంటున్నారంటే మీ మెచ్యూరిటీ లెవల్స్‌ ఏంటో అర్థం అవుతోంది. అంతేకాదు, మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారో కూడా అర్థంచేసుకోలేనంత బాధ్యతారహితంగా ఉన్నారు మీరు’
ఆ మాటలు చెపుతున్నప్పుడు నాన్న గొంతులో కోపంగానీ ఆవేశంగానీ లేవు. గంభీరమైన హెచ్చరిక మాత్రం ఉంది.
మర్నాడు నాన్న వూరెళుతూ నా భుజం మీద చేయివేసి చెప్పారు- ‘నీకు చిన్నప్పుడే కులం గురించి చెప్పుండాల్సిందేమో. కానీ, మనింట్లో ఆ అవసరం రాదనుకున్నాను’ అన్నారు. నేను సిగ్గుతో తలొంచుకున్నాను.
నాన్న చెప్పిన మాటలు అందరిమీదా కాకపోయినా మా ఫ్రెండ్స్‌లో కొందరి మీదన్నా ప్రభావం చూపించాయి. అందులో నేనూ ఉన్నాను.
నాన్న వెళ్ళిపోయాక రూమ్‌లో ఒంటరిగా కూర్చున్న నాకు ఎందుకో సడెన్‌గా నేను హైస్కూల్‌ చదువులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఒకటి గుర్తొచ్చింది.
నాకు యాన్యువల్‌ ఎగ్జామ్స్‌ దగ్గరపడ్డాయి. అప్పుడే హారీపోటర్‌ ఫస్ట్‌ పార్ట్‌ రిలీజ్‌ అయింది. నాకు హారీపోటర్‌ చూడాలని బాగా ఉంది. నాన్న ‘ఎగ్జామ్స్‌ అయాక అందరం కలిసి చూద్దాం’ అన్నారు. కానీ ఎగ్జామ్స్‌ అయిన వెంటనే నాకు బాగా ఫీవర్‌ వచ్చింది. ఫీవర్‌ వచ్చిన మూడోరోజు నాన్న ఆఫీసు నుంచి ఎర్లీగా వచ్చారు. వస్తూనే ‘అందరం హారీపోటర్‌కి వెళ్తున్నాం. త్వరగా రెడీ అవ్వండి’ అన్నారు అమ్మతో.
అమ్మ ఆశ్చర్యపోయి ‘వాడికి నూటొకటి ఉంది జ్వరం. ఇప్పుడు సినిమాకేంటి?’ అంది.
‘ఫర్వాలేదు, నేను కేర్‌ తీసుకుంటాను. సినిమా ఈరోజే లాస్ట్‌ డే అట. టికెట్స్‌ కూడా తెచ్చాను. త్వరగా రెడీ అవ్వండి’ అంటూ నాకు స్వెట్టర్‌, మంకీక్యాప్‌, షూస్‌ అన్నీ వేసి, ఫీవర్‌ మెడిసిన్‌ కూడా జేబులో పెట్టుకుని వచ్చారు నాన్న. సినిమా చూస్తున్నంతసేపూ నాన్న చేతులు రెండూ నా భుజాల చుట్టూనే ఉన్నాయి- నన్ను ప్రొటెక్ట్‌ చేస్తూ. ఆ స్పర్శ ఇంకా నాకు గుర్తుంది.
నిన్న నాన్న మాటలు వింటున్నంతసేపూ నాకు అలాంటి అనుభూతే కలిగింది. మమ్మల్ని ఎప్పుడు, ఎలా ప్రేమించాలో, ఎలా ప్రొటెక్ట్‌ చేయాలో నాన్నకి బాగా తెలుసు. నాన్న ప్రేమలో ఒక బాధ్యత కూడా ఉంటుంది.
టైమ్‌ చూసుకున్నాను. ఇంకో పదిహేను నిమిషాల్లో నాన్న కాల్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చనిపించింది. ఈపాటికి నేను పంపిన పుస్తకాలు చూసి, నాన్న ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉంటుంది.
నాన్నకి ఇంట్లో ఒక చిన్న సొంత లైబ్రరీ ఉండాలని కోరిక. కానీ మా ఆర్థిక పరిస్థితికి పుస్తకాలు కొని, చదివే వెసులుబాటు లేక నాన్న లైబ్రరీ నుంచి తెచ్చుకుని చదివేవారు. ఇంట్లో ఎప్పుడూ ఏదో పైఖర్చు ఉంటూనే ఉండేది. నానమ్మా, తాతయ్యలకి నాన్న పెద్దకొడుకు కావటంతో పండుగలకీ, సెలవలకీ బాబాయిలూ, అత్తలూ తరచూ మా ఇంటికే వచ్చేవారు. దాంతో ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండేవి. అయినా అమ్మగానీ, నాన్నగానీ ఎప్పుడూ ఫీలవలేదు. నాన్నకి కుటుంబ వ్యవస్థ అన్నా, బంధుత్వాలన్నా చాలా ఇష్టం. అక్కడే మనల్ని మనం తీర్చిదిద్దుకోవటం నేర్చుకోవాలని అంటారు. ముందు ప్రేమగా మాట్లాడి, వెనకాల విమర్శించే లక్షణం నాన్నకి అసలు నచ్చేదికాదు. ఆయనెప్పుడూ అలా మాట్లాడేవారు కాదు. అలాంటి బంధాలు కేవలం కాలక్షేపం కోసమేగానీ, నమ్మకాన్నీ ప్రేమనీ ఇవ్వలేవనేది నాన్న నమ్మకం. అందుకే బంధువులందరికీ నాన్నంటే చాలా ఇష్టం. ‘పెద్దవాళ్ళు పిల్లలకిచ్చే ఆస్తుల్లో బంధుత్వాలు కూడా ఒకటి’ అంటారు నాన్న. ఒక తండ్రిగా నాన్న మాకన్నీ ఇచ్చారు.
ఇవ్వటం అనగానే ఒక తమాషా సంఘటన గుర్తొస్తుంది. అప్పుడు నేను ఇంటర్‌ ఫస్టియర్‌లో ఉన్నాను. బంధువులెవరికో బట్టలు కొనాలని అమ్మా నాన్నా షాపుకెళుతుంటే నేనూ వాళ్ళతో వెళ్ళాను. షాపులో నాకొక పూలపూల షర్ట్‌ బాగా నచ్చింది. కొనుక్కుంటానని అమ్మనడిగాను. బహుశా డబ్బులు లేవనుకుంటాను. అమ్మ ఆ మాట చెప్పకుండా ‘కాలేజీకి ఇలాంటి పూలచొక్కాలు వేసుకెళితే డీసెంట్‌గా ఉండదు, వద్దు’ అంది. వెంటనే నేను ముఖం మాడ్చేసుకున్నాను.
రెండునెలల తర్వాత మా ఫ్యామిలీ అంతా టూర్‌కి వెళ్ళాం. హోటల్‌ రూమ్‌లో అందరం హడావుడిగా రెడీ అవుతున్నాం- సైట్‌సీయింగ్‌కి వెళ్ళాలని. నేను స్నానంచేసి వచ్చి బట్టల కోసం సూట్‌కేస్‌ ఓపెన్‌ చేశాను. అంతే... నాకు పిచ్చి ఆనందం, ఆశ్చర్యం కలిగేట్టు ఆరోజు షాపులో చూసిన పూలచొక్కా మడతపెట్టి నా సూట్‌కేసులో ఉంది. నాన్న వంక చూసి ‘ఎప్పుడు కొన్నావు నాన్నా?’ అనడిగాను. నాన్న నాకు దగ్గరగా వచ్చి ‘మర్నాడే కొన్నాలే. కాలేజీకి వేసుకెళితే డీసెంట్‌గా ఉండదుగానీ, ఇలా టూర్‌కి వచ్చినప్పుడు వేసుకోవచ్చు. ఫర్వాలేదు. దీని సంగతి ఇంకా మీ అమ్మకి తెలీదు’ అన్నారు, ఏదో రహస్యం చెప్తున్నట్టు చిన్నగా. కానీ అమ్మకి చెప్పకుండా నాన్న ఏ పనీ చేయరని నాకు తెలుసు.
నాన్న ప్రేమనే కాదు, కోపాన్ని కూడా రుచిచూసిన సంఘటన ఒకటుంది. నాకు టెన్త్‌లో మ్యాథ్స్‌ సబ్జెక్ట్‌ కొంచెం కష్టంగా ఉండేది. అందుకని పరీక్షలింకా మూడు నెలలు ఉన్నాయనగా నాన్న ట్యూషన్‌లో చేర్పించారు. ట్యూషన్‌ ప్రతిరోజూ సాయంత్రం ఒక గంట. ఆదివారం మాత్రం ఉదయం మూడు గంటలు ఉండేది. ఆదివారం రివిజన్‌, ఏమన్నా డౌట్స్‌ ఉంటే క్లియర్‌ చేయటం చేసేవారు. ఇంకో ఇరవై రోజుల్లో పరీక్షలనగా ట్యూషన్‌ ఫ్రెండ్స్‌ కొందరు సినిమాకెళ్దాం అన్నారు. షారుక్‌ఖాన్‌ సినిమా. అప్పటికే నాన్న నాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు- పరీక్షలయిపోయేదాకా ఎటువంటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వద్దని. ఒకవైపు ఇంట్లో అడగాలంటే భయం, మరోవైపు ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూడాలనే దురద. జీవితంలో మొదటిసారి ఫ్రెండ్స్‌ మాటలు విని ఇంట్లో చెప్పకుండా ట్యూషన్‌ ఎగ్గొట్టి సినిమాకెళ్ళాను. నా ఖర్మకాలి మా ట్యూషన్‌ మాస్టారు నాలుగురోజుల తరవాత ఎక్కడో నాన్న ఎదురైతే ఆ విషయం చెప్పారట. అంతే, ఇంటికొచ్చాక నాన్న నా దవడ పగిలేట్టు కొట్టిన దెబ్బ ఇప్పటికీ మర్చిపోలేను. ‘ఒక్కసారి నమ్మకం పోగొట్టుకుంటే జీవితమంతా అనుమానంతోనే బతకాల్సి ఉంటుంది. ఈరోజు సినిమా, రేపు ఇంకోటి. అబద్ధం మనిషిని ఎంత పతనానికైనా తీసుకెళ్తుంది. గుర్తుంచుకో’ అన్నారు. నాన్న ప్రేమ ఎంత మృదువుగా ఉంటుందో కోపం కూడా అంతే తీవ్రంగా ఉంటుందని నాకర్థం అయింది.
నాన్నని తల్చుకోగానే ఇలాంటి జ్ఞాపకాలెన్నో మనసులో దొర్లుతూనే ఉంటాయి.
నా అంచనా ప్రకారం నాన్న దగ్గర్నుంచి ఇంకొద్ది నిమిషాల్లో కాల్‌ వస్తుంది. ఈరోజు నాన్న కాల్‌ కోసం ఇలా ఎదురుచూడటం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. మొదటిసారి నాన్నకి ఎంతో ఇష్టమైన గిఫ్ట్‌ ఇవ్వగలగటమే ఇందుకు కారణం అయి ఉండచ్చు.


ఎప్పటికప్పుడు మనం పెద్దవాళ్ళమయ్యాం, ఇక స్వతంత్రంగా ముందుకు నడవగలం అనుకుంటాం. కానీ, నాన్న వేలందించినప్పుడుగానీ తెలీదు మన గురించి ఆయనే బాగా ఆలోచించగలరనే విషయం.
మెడిసిన్‌ ఫోర్త్‌ ఇయర్‌లో ఉండగా నా క్లాస్‌మేట్‌ లిఖితతో ప్రేమలోపడ్డాను. మా ఇద్దరి ప్రేమ ఒక సంవత్సరం బాగానే నడిచింది. నా ప్రేమ విషయం ఇంట్లో చెప్పటానికి చాలా సందిగ్ధంలో పడ్డాను. తిట్టే తల్లిదండ్రులయితే ఫర్వాలేదు, నాలుగు తిట్లు తిని భరించొచ్చు. కానీ, మనల్ని మనకి అద్దంలో చూపిస్తేనే భరించటం కష్టం. అద్దంలో కనిపించే నిజాల్ని కాదనలేం కదా. నా ఆలోచనలు ఇలా వూగిసలాడుతుండగానే మా ప్రేమ విషయం తెలిసి లిఖిత వాళ్ళింట్లోవాళ్ళు అర్జంటుగా ఆమెకి పెళ్ళి ఫిక్స్‌ చేశారు. కులం, ఆస్తి, సోషల్‌ స్టేటస్‌... ఒకటి కాదు, అన్నీ మా పెళ్ళికి ఆటంకాలే అయ్యాయి. లిఖిత పెళ్ళి దగ్గరపడుతున్నకొద్దీ నన్ను నేను ఓదార్చుకోవటం కష్టం అయింది. స్నేహితులు ఎంత ఓదార్పుగా మాట్లాడినా నాకు మాత్రం అమ్మతో నా బాధ పంచుకోవాలనిపించింది. నాకు నిజమైన ఓదార్పు దొరికేది అక్కడే. అందుకే పదిరోజులు సెలవు పెట్టి ఇంటికొచ్చాను. వెంటనే అమ్మకి చెప్పటానికి ఏదో తెలీని ఇన్ఫీరియారిటీ. అందుకే చెప్పలేకపోయాను. కానీ ఆమె అమ్మ కదా! నేను చెప్పేదాకా వెంటపడుతూనే ఉంది- ఎందుకలా ఉన్నావంటూ. విషయం చెప్పి అమ్మ ఒళ్ళొ తల పెట్టుకుని భోరుమన్నాను.
మర్నాడు భోజనాల దగ్గర నాన్నే లిఖిత ప్రస్తావన తెచ్చారు. ‘ఆ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు?’ అని అడిగారు. చెప్పాను.
అక్క పెద్దగా నవ్వి ‘పోన్లేరా, డోంట్‌వర్రీ. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో ఐశ్వర్యారాయ్‌ వస్తుందిలే’ అంది. అమ్మా, నాన్నా కూడా నవ్వారు అక్క మాటలకి. అక్క నన్ను కొంచెం హ్యాపీగా ఉంచటానికే అలా అందని నాకు తెలుసు.
‘ఇది కొంచెం సెన్సిటివ్‌ ఇష్యూ. సో, మేము టేకిట్‌ ఈజీ అని చెప్పలేం. ఎందుకంటే, అది నీ పర్సనల్‌. నీ ఫీలింగ్స్‌, ఎమోషన్స్‌ గురించి మేం మాట్లాడకూడదు. కానీ, ఒకటిమాత్రం నిజం. టీనేజ్‌ లవ్‌ సక్సెస్‌ అవటం అనేది చాలా కష్టం. బికాజ్‌ దేర్‌ ఆర్‌ సో మెనీ ఫ్యాక్టర్స్‌ బిహైండ్‌ ఇట్‌’ అని చెప్పారు నాన్న. కొంచెం గ్యాప్‌ తీసుకున్నాక మళ్ళీ నాన్నే అన్నారు- ‘ఓకే, అసలే డిస్ట్రబ్డ్‌గా ఉన్నావు. ఇప్పుడు ఆ విషయం గురించి మేమందరం మాట్లాడటం అంత కరెక్ట్‌ కాదు. ఇంకో వారంరోజులు సెలవులున్నాయి కాబట్టి, అందరం కలిసి ఎక్కడికన్నా ట్రిప్‌కి వెళ్ళి వద్దాం. కొంచెం నీ మనసుకి మార్పు ఉంటుందని అమ్మ, అక్క ఈ ప్రపోజల్‌ పెట్టారు.’
నాన్న నామీద కోపం తెచ్చుకుని క్లాసు పీకలేదు. అలా అని నన్ను ఓదార్చనూ లేదు. ‘నీ పర్సనల్‌’ అన్న ఒక్క మాటతో నా గురించి నేను ఆలోచించుకునే అవకాశం ఇచ్చారు. అంతేకాదు, ఆ పరిస్థితిలో నన్ను పూర్తిగా వదిలేయలేదు. ట్రిప్‌ ప్లాన్‌ చేసి ఫ్యామిలీ అంతా వారం రోజులు నా వెంటే ఉన్నారు.
ఇదంతా జరిగి ఐదేళ్ళయింది.
నేను టీ తాగటం పూర్తయింది. ‘ప్రపంచంలో అన్నింటికన్నా వేగంగా ప్రయాణించేది మనసు’ అని చెప్పిన వాళ్ళెవరోగానీ నిజంగా మేధావులే. ఎందుకంటే ఒక కప్పు టీ తాగటం పూర్తయ్యేసరికి నా మనసు ముప్ఫైయేళ్ళ గతంలోకి వెళ్ళి రాగలిగింది.
చేతిలో ఉన్న ఖాళీ కప్పుని టీపాయ్‌ మీద పెడుతున్న నాకు మళ్ళీ నాన్న జ్ఞాపకమే. నేను జాబ్‌లో చేరినప్పుడు నాన్న గిఫ్ట్‌గా ఇచ్చిన కప్పు అది. దానిమీద అందంగా రాసిన ‘కోట్‌’ ప్రతిరోజూ నాన్నని మరింత దగ్గర చేస్తున్నట్టు ఉంటుంది.
'You will outgrow my lap
but never my heart' - Dad.
యస్‌. నేను వూహించినట్టే నాన్న దగ్గర్నుంచి కాల్‌ వచ్చింది.
‘హలో’ అని నాన్న గొంతు కోసం రెండు క్షణాలు ఎదురుచూశాను. ‘‘హలో చిన్నా, హౌ ఆర్‌ యూ’’ అడిగారు నాన్న.
‘‘ఫైన్‌ నాన్నా, హ్యాపీ ఫాదర్స్‌డే’’ నాన్న మీద నాకున్న ప్రేమంతా గొంతులోకి తెచ్చుకుని చెప్పాను.
‘‘థ్యాంక్యూ. థ్యాంక్యూ ఫర్‌ ఎవ్రీథింగ్‌’’ అన్నారు నాన్న. గొంతులో చిన్న వణుకు-ఆనందంతో కూడిన ఉద్వేగం కావచ్చు.
జీవితంలో మొదటిసారి నాన్నని అంత ఎమోషనల్‌గా చూడటం.
జీవితంలో మాకెన్నో ఇచ్చిన నాన్న, ఈరోజు నేనిచ్చిన చిన్న గిఫ్ట్‌కే ఎంత ఎమోషనల్‌ అయిపోయారు? బహుశా బంధాలకి విలువిచ్చే నాన్నలందరూ అంతేనేమో.
నాన్నకి నేనివ్వాలనుకుంటున్న అసలైన గిఫ్ట్‌ ఇదికాదు, వేరే ఉంది.
ఇన్నాళ్ళూ జీవితంలో ప్రతి మలుపు దగ్గరా ‘నేనున్నాను’ అంటూ నాన్న మాకిచ్చిన భరోసానే ఇప్పుడు నేను నాన్నకి ఇవ్వాలనుకుంటున్నాను. రకరకాల కారణాలతో ఎన్నో ఏళ్ళుగా నాన్న వాయిదా వేసుకుంటూ వచ్చిన కోరికలన్నీ తీర్చి, వేలు పట్టుకుని ఆయన్ని ప్రేమగా పదిలంగా ముందుకు నడిపించాలని నా కోరిక. అదే నాన్నకి నేనివ్వాలనుకుంటున్న అసలైన గిఫ్ట్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.