close
పాతికవేల మందికి... అన్నీ తానై...

పాతికవేల మందికి... అన్నీ తానై... 

మధురమైన బాల్యమూ కంటికి రెప్పలా కాపాడే అమ్మానాన్నల ప్రేమా భద్రమైన భవిష్యత్తు గురించిన కలలూ... ఏవీ ఆయనకు గుర్తులేవు. అసలు చదువు పూర్తయి ఉద్యోగంలో చేరేదాకా రెండు పూటలా కడుపునిండా పట్టెడన్నం తిన్న సందర్భమే లేదు. బాల్యం గురించి జీవితకాలం వెంటాడే చేదు జ్ఞాపకమది. ఆ పరిస్థితి మరే గిరిపుత్రుడికీ రావద్దన్నది ఆయన సంకల్పం. అనుభవాలే మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయంటారు, డాక్టర్‌ అచ్యుత సామంత అనుభవాలు మాత్రం కొన్ని వేల మంది గిరిపుత్రుల తల రాతలను తిరగరాస్తున్నాయి.

డిశాలోని భువనేశ్వర్‌లో ఉన్నాయి కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ. ఒకటి పాతిక వేల మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యావసతీ భోజన సదుపాయాలూ కల్పిస్తోంటే మరో సంస్థ పాతిక వేల మందికి వివిధ రంగాల్లో అత్యున్నత ప్రమాణాలతో ఉన్నత విద్యను అందిస్తోంది. దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ సంస్థల వెనక ఉన్నది ఒక్క వ్యక్తేనన్నది నమ్మలేని నిజం. ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన ఆ వ్యక్తి... అచ్యుత సామంత. ‘నేను చాలా ఆనందంగా ఉన్నాన’ని తృప్తిగా చెప్పే ఆయన, ఆ ఆనందానికి కారణాన్ని వివరించారిలా...

‘నాకు యాభైఏళ్లు దాటాయి. ఈ వయసులో బహుశా నా అంత ఆనందంగా ఇంకెవరూ ఉంటారనుకోను. పాతిక వేలమందికి కడుపునిండా తిండి పెట్టి విద్యావంతుల్ని చేయగలుగుతున్నాను- ఒక్క మాటలో చెప్పాలంటే జీవితాన్ని ఇవ్వగలుగుతున్నాను. నా సంస్థనుంచీ ఓ చిన్నారి టెడ్‌ ప్రసంగం చేసింది. మరెందరో చదువుకుని డాక్టర్లూ ఇంజినీర్లూ అయ్యారు. క్రీడాకారులయ్యారు. నేను ధనవంతుణ్ని కాదు, వ్యాపారవేత్తను అంతకన్నా కాదు. అయినా ఇదెలా సాధ్యమైందీ అంటే... కేవలం సంకల్పంతో. నాలాగా మరెవరూ బాధపడకూడదని దీక్ష పూనాను. సాధించాను. అది అంత తేలిగ్గా జరగలేదు. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనీ అనుకున్నా. కానీ నా మొహం చూసి బ్యాంకు మేనేజరు ఇచ్చిన రుణం ఈ విజయప్రస్థానానికి పునాది వేసింది. సంకల్పం మంచిదైతే సహకారం అదే వస్తుందని అర్థమైంది. దిక్కూ మొక్కూ లేని నిరుపేద స్థాయి నుంచి ఎందరికో పెద్ద దిక్కైన నేటివరకూ నా ప్రయాణం గురించి చెప్పాలంటే...

మాది ఒడిశా రాష్ట్రం కటక్‌ జిల్లాలోని మారుమూల ప్రాంతం. బాల్యం నాటి జ్ఞాపకమంటే నాకు గుర్తొచ్చేది... ఒడిలో నెల రోజుల పసిబిడ్డతో అమ్మ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న దృశ్యం. నాకప్పుడు నాలుగేళ్లు. నాన్న రైలు ప్రమాదంలో చనిపోయారు. ఏడుగురు సంతానంలో నేనొకణ్ని. అందరికన్నా పెద్ద అన్నకి 17 ఏళ్లు. నా తర్వాత మరో ఇద్దరు. జంషెడ్‌పూర్‌లోని ఓ కంపెనీలో నాన్న చిరుద్యోగి. ఆయన సంపాదనతో ఒక్కపూటైనా మా కడుపులు నిండేవి. నాన్న మృతితో మమ్మల్ని తీసుకుని అమ్మ సొంతూరికి వచ్చేసింది. కానీ ఎనిమిది మంది కడుపు నింపడం తన వల్ల కాలేదు. దాంతో పెద్ద వాళ్లను బంధువుల ఇళ్లకు పంపింది. నన్నూ, చెల్లినీ తన దగ్గర ఉంచుకుంది. ఓవైపు చదువుకుంటూనే అమ్మకు సాయంగా పనులూ చేసేవాణ్ని. అంత దుర్భర పరిస్థితుల్లోనూ రెండు రూపాయలు సంపాదిస్తే రూపాయిన్నర ఇంట్లో ఇచ్చేవాణ్ని. మరో అర్థరూపాయిని నాతో పాటు చదువుకునే పేద పిల్లలు నలుగురికి టీ తాగమని ఇచ్చేవాణ్ని. గ్రామంలోని వారందరికీ అవసరమైన సాయం చేస్తూ తలలో నాలుకలా ఉండేవాణ్ని. ఒకరికి సాయం చేయడంలో ఆనందం పొందే ఆ అలవాటు ఎలా వచ్చిందో తెలియదు కానీ ఒక కొత్త ఆర్థిక విధానానికి ఆనాడే బీజం పడిందని ఇప్పుడనిపిస్తోంది. పేదరికాన్ని ఎదుర్కొనగల ఏకైక ఆయుధం చదువేనని నేను నమ్ముతాను. అందుకే అప్పుడు నేను చదువుకున్నా. ఇప్పుడు సాటివారినీ చదివిస్తున్నా.

ఉద్యోగమున్నా... మనశ్శాంతి లేదు
ఉత్కళ విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ చేశాను. లెక్చరరుగా ఉద్యోగం వచ్చింది. సంపాదన ఉంది. కడుపు నిండా తినగలుగుతున్నా... కానీ మనశ్శాంతి లేదు. ఏదో చెయ్యాలి... అస్పష్టంగా ఏవేవో ఆలోచనలు. చాలా మంది టెన్త్‌ తర్వాత చదువు మానేస్తారు. అసలు చదువుకోనివారికన్నా ఇలా సగం చదివిన వారు సమాజానికి చాలా ప్రమాదకరం. అటు కాయకష్టం చేయలేరు, ఇటు వారికి తగిన ఉద్యోగమో ఉపాధి మార్గమో చూపే మార్గదర్శకులుండరు. సంఘవిద్రోహ శక్తుల చేతికి చిక్కేది ఇలాంటివారే. ఆడపిల్లల అక్రమ రవాణాకీ కారణం ఈ పరిస్థితే. దీన్ని మార్చాలంటే విద్యారంగంలోనే కృషి చేయాలి. ఆలోచనలో స్పష్టత వచ్చింది. మరి ఆచరణ?
చేతిలో ఐదువేలున్నాయి. స్నేహితులనడిగాను. ఎవరు ఎంత ఇవ్వగలిగితే అంత చేబదులుగా తీసుకున్నాను. 1992లో ఒక అద్దె భవనంలో కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ(కిట్‌) సొసైటీని రిజిస్టర్‌ చేసి మొదట ఐటీఐని ప్రారంభించాను. 12 మంది చేరారు. నెమ్మదిగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. మరో పక్క 15 లక్షల అప్పు. అందరూ డబ్బు తిరిగి ఇవ్వమని అడుగుతున్నారు. బ్యాంకు లోను తీసుకుందామంటే నా దగ్గర తనఖా పెట్టడానికి ఏమున్నాయని! ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్యే శరణ్యమనుకున్నా. సరిగ్గా ఆ సమయంలో ఓ బ్యాంకు మేనేజరు కేవలం నా పట్టుదల చూసి లోను ఇచ్చాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పులన్నీ తీర్చేసి క్రమ పద్ధతిలో సంస్థను అభివృద్ధిచేస్తూ వచ్చాను. 1997లో ‘కిట్‌’లో బీటెక్‌ను ప్రారంభించాం. 2002లో యూజీసీ గుర్తింపు లభించింది. ఇప్పుడు ‘కిట్‌’లో ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, సోషల్‌ సైన్సెస్‌, మేనేజ్‌మెంట్‌, బయోటెక్నాలజీ లాంటి మొత్తం 27 కోర్సులున్నాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో అగ్రస్థానాన నిలుస్తోంది. పిన్నవయసులో నేను యూనివర్శిటీ ఛాన్సలర్‌నయ్యాను.

అదే ‘కిస్‌’ లక్ష్యం
‘కిస్‌’ అంటే కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌. ఇది పూర్తిగా పేద పిల్లల కోసం. కేజీ నుంచి పీజీ వరకూ ఉచితంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తూ చదువు చెప్పించాలన్నది ప్రణాళిక. ‘కిట్‌’ ప్రారంభించిన ఏడాదికే దీన్నీ ప్రారంభించాను. చుట్టుపక్కల జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో నేనూ నా బృందమూ ఇల్లిల్లూ తిరిగాం. ‘పిల్లల్ని పంపించండి, చదువు చెప్పిస్తా’మన్నాం. కానీ తల్లిదండ్రుల్లో ఎన్నో భయాలు. తమ పిల్లల్ని అమ్మేస్తామేమో, వారి శరీర భాగాలు అమ్ముకునే దొంగలమేమోనని భయపడ్డారు. వారికి నచ్చజెప్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మరో అద్దె భవనంలో 125 మంది పిల్లలతో ‘కిస్‌’ ప్రారంభమైంది. సంస్థ పనిచేయడం మొదలెట్టాక నోటి మాట ప్రచారంతోనే తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి చేర్పించడం మొదలెట్టారు. అలా ఇప్పుడు 25 వేల మందికి పైగా పిల్లలున్నారు. వారిలో 15 వేల మంది ఆడపిల్లలే. ప్రపంచంలో గిరిజన విద్యార్థుల కోసం పనిచేస్తున్న అతి పెద్ద సంస్థ ఇదే. ఇప్పటివరకూ దాదాపు పదివేల మంది చదువు ముగించుకుని వెళ్లారు. మొత్తం పాతిక వేలమందికీ ఇక్కడే భోజనం, వసతి ఏర్పాట్లు ఉంటాయి. వేసవి సెలవుల్లో మాత్రం తల్లిదండ్రుల్ని చూడడానికి వెళ్తారు. అందరూ కచ్చితంగా తిరిగి వస్తారు. డ్రాపవుట్‌ రేట్‌ మా సంస్థలో జీరో. పది, పన్నెండు తరగతుల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధిస్తున్నాం. ఇక్కడ చదువుకున్న పిల్లలు సివిల్స్‌కి అర్హత సాధిస్తున్నారు. లెక్చరర్లయ్యారు. 43 మంది పీహెచ్‌డీ ఫెలోషిప్‌ సాధించారు. ‘అర్హులైన ‘కిస్‌’ పిల్లల కోసం కిట్‌’లోని అన్ని కోర్సుల్లోనూ 5 శాతం సీట్లు ఉచితంగా కేటాయిస్తున్నాం. చదువే కాకుండా క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పిల్లల ఆసక్తిని బట్టి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. మా పిల్లలు రగ్బీ వరల్డ్‌ కప్‌ మూడు సార్లు గెలుచుకున్నారు. పలువురు జాతీయ జట్లలో స్థానం పొందారు. కామన్‌వెల్త్‌, ఏషియన్‌, ఒలింపిక్‌ గేమ్స్‌కి క్వాలిఫై అయ్యారు.

ఆ దృశ్యం అపురూపం
విశాల ప్రాంగణంలో పూర్తిగా సొంత భవనాల్లో మా సంస్థలు పనిచేస్తున్నాయి. ‘కిస్‌’లో 25 వేల మంది ఒకేసారి ప్రార్థన చేస్తుంటే ఆ దృశ్యం చూసి తీరాల్సిందే. అత్యాధునిక వంటగది, విశాలమైన భోజనశాలలూ, బయోగ్యాస్‌ ప్లాంట్‌, సోలార్‌ పవర్‌ ప్లాంట్‌, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, సిబ్బందికి క్వార్టర్లు, పిల్లల వసతి గృహాలూ, కంప్యూటర్‌ ల్యాబ్‌, గ్రంథాలయం లాంటివన్నీ మా క్యాంపస్‌లో ఉన్నాయి. మా కిచెన్‌ గురించి నేషనల్‌ జియోగ్రఫిక్‌ ఛానల్‌ ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. వెయ్యిమందికి పైగా సిబ్బంది ఉన్నారు. 12 మంది నోబెల్‌ గ్రహీతలు మా సంస్థను సందర్శించారు.

ఆర్ట్‌ ఆఫ్‌ గివింగ్‌
సమాజం నుంచి మనం తీసుకుంటున్నప్పుడు సమాజానికి తిరిగి ఇవ్వాలన్నది పిల్లలకు తెలియజెప్పాలి. అందుకే ఆర్ట్‌ ఆఫ్‌ గివింగ్‌ అనే సంస్కృతిని అలవరుస్తున్నాం. 2013 నుంచీ ఏటా మే 17వ తేదీని ఆర్ట్‌ ఆఫ్‌ గివింగ్‌ డేగా జరుపుతున్నాం. ‘కిట్‌’ సొసైటీ తీర్మానం ప్రకారం సంస్థ టర్నోవర్‌లో 5 శాతం సామాజిక బాధ్యత కింద ‘కిస్‌’కి ఇవ్వాలి. అలాగే ‘కిట్‌’ సిబ్బంది కూడా తమ వేతనాల్లో 3 శాతం తప్పకుండా ‘కిస్‌’కి చెల్లించాలన్నది నియమం. ‘కిట్‌’ గ్రూప్‌ సంస్థల కాంట్రాక్టర్లూ సామగ్రి సరఫరా చేసేవారూ తమ లాభాల్లో 3 శాతం వరకూ చెల్లిస్తారు. కేవలం విరాళాలతో సంస్థ నడవడం కష్టం. అందుకే ఈ ఏర్పాటు. పిల్లలకు వృత్తి విద్యల్లోనూ శిక్షణ ఇస్తాం. పిల్లలు తయారుచేసిన ఉత్పత్తులను అమ్మగా వచ్చిన ఆదాయంలో సగం వారికే ఇస్తాం. వాళ్లు తల్లిదండ్రులకు పంపుతారు. మిగతా సగం సంస్థకు చెందుతుంది. సంస్థల నిర్వహణ, ఆర్థిక విధానాల్లో మేం పాటిస్తున్న పారదర్శకతకు కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి ప్లాటినం సర్టిఫికెట్‌ లభిస్తోంది.
విద్యాభివృద్ధే కాదు, భాషా సంస్కృతీ వారసత్వాలను ముందుతరాలకు భద్రంగా అందించడం కూడా మన విధేే. అందుకే కాదంబిని మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఆ పని చేస్తున్నా. ‘కాదంబిని’ పేరుతో కుటుంబ సాహిత్య పత్రికనూ ‘కునికథ’ పేరుతో బాలల పత్రికనూ ప్రచురిస్తున్నాం. మా సంస్థ ఆధ్వర్యంలో తీసిన పలు చిత్రాలు అవార్డులు గెలుచుకున్నాయి. న్యూస్‌ ఛానల్‌ కూడా నిర్వహిస్తున్నాం.
‘కిస్‌’ విజయం ప్రణాళికకర్తలనూ పాలకులనూ కూడా ఆలోచింపచేసింది. ఇప్పటికే దిల్లీలో ‘కిస్‌’ శాఖ పనిచేస్తోంది. ప్రస్తుతం ఒడిశాలోని అన్ని జిల్లాల్లోనూ శాఖలను ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పలు కార్పొరేట్‌ సంస్థలు సహాయం చేయడానికి ముందుకొచ్చాయి. మరో పది రాష్ట్రాల్లోనూ, పది దేశాల్లోనూ ‘కిస్‌’ శాఖలు పెట్టాలన్నది నా సంకల్పం. ప్రభుత్వాలు సహకరిస్తే తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్టడానికి మేం సిద్ధంగా ఉన్నాం.
ఒక విద్యార్థి చదువుకుని తన కాళ్ల మీద తాను నిలబడితే పరోక్షంగా ఆ కుటుంబం లబ్ధి పొందుతుంది. నా దగ్గర 25 వేల మంది పిల్లలున్నారంటే సమాజంలో పాతికవేల కుటుంబాల పరిస్థితి మెరుగుపడినట్లే కదా! అదే నా ఆశయం. నా జీవితంలోని తొలి పాతిక సంవత్సరాలూ పట్టెడన్నం కోసం పోరాటంతో గడిచింది. మలి పాతిక సంవత్సరాలూ వేలాది పిల్లలకు అన్నం పెట్టడమే ఆశయమైంది. ‘ఆర్ట్‌ ఆఫ్‌ గివింగ్‌’లోని ఆనందాన్నే నేనిప్పుడు అనుభవిస్తున్నాను. అందరికీ ఆ ఆనందం విలువ తెలియజెప్పడమే నా ఆశయం.’


ఒంటరినే...

నా తోబుట్టువులంతా పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడ్డారు. నేను పెళ్లి చేసుకోలేదు. ఆశయం నుంచి దృష్టి మళ్లడం నాకిష్టం లేదు. అమ్మ ఉన్నంతకాలం పెళ్లి చేసుకోమని పోరింది. అన్ని కష్టాలు పడినా చదువుకుని పైకొచ్చిన మమ్మల్ని చూసి మురుసుకున్న అమ్మ నా గురించి ఆ ఒక్క అసంతృప్తితో గత ఏడాదే ఈ లోకం వదిలివెళ్లిపోయింది. అది బాధనిపించినా నా ఒక్కడి పట్టుదల వల్ల ఇన్నివేల మంది పిల్లల బతుకులు బాగుపడుతున్నప్పుడు నా నిర్ణయంలో తప్పులేదనిపిస్తుంది. నాకు వ్యక్తిగత ఆస్తులేమీ లేవు. రెండు గదుల అద్దె ఇంట్లో ఉంటున్నా. మా వూరు కలరబాంకను అన్ని సౌకర్యాలతో స్మార్ట్‌ విలేజ్‌గా తీర్చిదిద్దాను. టెలి మెడిసిన్‌ సౌకర్యంతో వంద పడకల ఆస్పత్రి, ఉచిత వైఫై సౌకర్యం, రక్షిత తాగునీరు, ఏటీఎం ఉన్న బ్యాంకు, యువతకూ మహిళలకూ ప్రత్యేకంగా కమ్యూనిటీ భవనాలు, వూరంతా ఎల్‌ఈడీ దీపాలు, కాంక్రీటు రహదారులు, సౌరవిద్యుచ్ఛక్తి ప్లాంటు... అన్నీ ఏర్పాటుచేయించాను.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.