close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వాళ్లంతే - వీళ్లింతే

వాళ్లంతే - వీళ్లింతే
- పాగోలు చంద్రికా శేఖర్‌

కూతురు ఇంటిముందు ఆటో దిగింది అనసూయమ్మ. ఆటోవాడికి డబ్బులిచ్చి ఇంట్లోకి నడిచింది. హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న సుమతి ‘‘అమ్మా, ఏంటి సడెన్‌గా వచ్చావు, ఫోనన్నా చేయలేదు’’ అంటూ పలుకరించింది.

ఉస్సూరని సోఫాలో కూలబడుతూ ‘‘ఏమో తల్లీ, మీ అన్నయ్య సడెన్‌గా క్యాంపుకి వెళ్ళాడు. మీ వదినగారేమో పుట్టింటికి చెక్కేసింది. ఒంటరిగా ఉండలేక నేనిలా వచ్చాను. కొంచెం మంచినీళ్ళు ఇవ్వు, నోరు ఎండిపోతోంది’’ చెప్పింది అనసూయమ్మ.

తల్లికి మంచినీళ్ళిస్తూ ‘‘అన్నయ్యని కారులో బస్టాండ్‌లోనన్నా దింపమనకపోయావా?’’ అడిగింది సుమతి.

‘‘ఏమో తల్లీ, వాడికి ఎప్పుడూ హడావుడి పనులే. నన్ను దింపడానికి తీరుబడి ఉండదుగానీ, పెళ్ళాంతో షికార్లు కొట్టడానికి మాత్రం తీరుబడి ఉంటుంది’’ ముక్కు చీదింది అనసూయమ్మ.

‘‘అది సరే, నువ్వు వస్తున్నావని ఫోన్‌ చేస్తే కనీసం ఆయనను బస్టాండ్‌కి పంపేదాన్ని కదా!’’ చెప్పింది సుమతి.

‘‘అయ్యో, అల్లుడిగారినా... ఇంకా నయమే- ఆయనకు పాపం ఆఫీసులో ఎన్నో ముఖ్యమైన పనులుంటాయి. ఆయన్ని విసిగించకు. పిల్లలకు బడి ఒక్కపూటేగా, ఇప్పుడొచ్చేస్తారా...’’ అంటుండగానే పింకీ, బంటీ ‘‘అమ్మమ్మ వచ్చింది’’ అని ఎగురుతూ వచ్చి ఆమె మీద పడ్డారు. బంటీ గబగబా ‘‘అమ్మమ్మా, మాకేం తెచ్చావు?’’ అంటూ సంచీ బోర్లించాడు.

‘‘ఏయ్‌, ఏమిటది తప్పు కదూ... అమ్మమ్మ బ్యాగ్‌ అలా తీయొచ్చా’’ గద్దించాడు వారిని తీసుకువచ్చిన శ్రీనివాస్‌.

‘‘అల్లుడుగారూ బాగున్నారా! చిన్నపిల్లలు వారినేం అనకండి’’ అంటూనే క్రితంరోజు కొడుకు తీసుకువచ్చిన స్వీటూ హాటూ ప్యాకెట్‌లు తీసి వారికి ఇచ్చింది. అవి తీసుకుని వాళ్ళు పరిగెత్తారు.

భోజనం చేసి శ్రీనివాస్‌ ఆఫీసుకి వెళ్ళిపోయాడు. కాసేపు కునుకుతీసి లేచిన తల్లీ, కూతురు టీ తాగుతూ హాల్లో కూర్చున్నారు. పిల్లలు బయట ఆటలకి వెళ్ళారు.

మరోగంటకి శ్రీనివాస్‌ కూడా వచ్చాడు. అందరూ టీవీ చూస్తూ కూర్చున్నారు. ‘‘సుమతీ, వంటేం చేస్తావు, కూరలు ఉన్నాయా?’’ అని అడిగాడు శ్రీనివాస్‌.

‘‘ఇప్పుడు వంటా గింటా నావల్ల కాదు బాబూ! అసలే నాలుగురోజుల నుండీ పనిమనిషి రాక నానా అవస్థా పడుతున్నా. బండెడు అంట్లు తోమలేక, ఇల్లు శుభ్రం చేయలేక నా నడుము పడిపోతోంది. అందరికీ టిఫిన్‌ తీసుకురండి’’ చిరాగ్గా అంది సుమతి.

‘‘అరెరె, ఎంత పని జరిగింది తల్లీ... పనిమనిషి రావట్లేదా!? ఇంటెడు చాకిరీ నువ్వే చేసుకుంటున్నావా..? అందుకేనా వారానికే ఇంత చిక్కిపోయావు. అల్లుడుగారూ, ముందు అర్జంటుగా వేరే పనిమనిషిని చూడండి. మా సుమతికి ఈ చాకిరీ అలవాటు లేదు’’ బాధగా అంది అనసూయమ్మ.

‘‘పనివాళ్ళు త్వరగా దొరకట్లేదు అత్తయ్యగారూ. నేనూ చూస్తూనే ఉన్నాను. అయినా నాలుగురోజులకే మీ అమ్మాయి ఏం అరిగిపోదులెండి. కాస్త ఒళ్ళు అన్నా తగ్గుతుంది’’ వెటకారంగా అన్నాడు శ్రీనివాస్‌.

కోపంగా చూసింది సుమతి. ‘‘ఆఁ ఏదో పొడవుగా ఉండేసరికి కాస్త ఒత్తరిగా కనిపిస్తుందిగానీ, అదీ ఒక ఒళ్ళేనా!’’ సమర్థిస్తూ అంది అనసూయమ్మ.

ఈలోగా పక్కింటి సుబ్బలక్ష్మిగారు వచ్చింది. ‘‘సుమతీ, కొద్దిగా తోడుకి మజ్జిగ ఉంటే ఇవ్వమ్మా’’ అంటూనే, అనసూయమ్మగారిని చూసి ‘‘బాగున్నారా, ఎప్పుడొచ్చారు?’’ అని పలుకరించింది. సుమతి వంటింట్లోకి నడిచింది.

‘‘బాగానే ఉన్నాను, కూర్చోండి’’ అంది అనసూయమ్మ. సోఫాలో కూర్చుంటూ ‘‘మీ అబ్బాయీ, కోడలూ బాగున్నారా?’’ అడిగింది సుబ్బలక్ష్మి.

‘‘ఆఁ ఏం బాగులేమ్మా, మావాడటు క్యాంపుకు వెళ్ళగానే ముసలిదాన్ని ఒంటరిగా ఉంటానని కూడా లేకుండా పుట్టింటికి చెక్కేసింది. ప్రతివారం పుట్టింటికి వెళ్ళవలసిందే. వీడు వూళ్ళు పట్టుకు తిరుగుతూ కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటే ఈవిడగారు డబ్బులన్నీ పనిమనుషులకు ధారపోస్తుంది. ఇంట్లోనే ఉంటుంది, ఆ మాత్రం పనిచేసుకోలేదూ. అంట్లకి ఒక మనిషి, బట్టలకు ఒక మనిషి’’ ఈసడింపుగా అంది అనసూయమ్మ.

‘‘మీ కోడలికి పాపం వెంటవెంటనే రెండు కాన్పులనుకుంటా. రెండూ ఆపరేషన్లేనేమో కదా!’’ సానుభూతిగా అంది సుబ్బలక్ష్మి.

‘‘ఆఁ అయితే... మేం నలుగురిని కని కూడా చాకిరీ చేసుకోలేదూ మరీ సుకుమారం కాకపోతే. మావాడి అలుసు చూసుకునే ఇదంతా’’ అక్కసుగా అంది అనసూయమ్మ. ఈలోగా సుమతి మజ్జిగ తెచ్చింది.

‘‘సుమతీ, అడగడం మర్చిపోయాను... నిన్న మీరు బయటకు వెళ్తుంటే చూశాను- నీ చీర చాలా బాగుంది, కొత్తదా?’’ అడిగింది సుబ్బలక్ష్మి.

‘‘అవునాంటీ, పెళ్ళిరోజని మావారు రెండువేలు పెట్టి కొన్నారు’’ ఆనందంగా అంది సుమతి.

‘‘కొన్నానా... పోరుపెట్టి కొనిపించావా?’’ కసిగా పళ్ళు నూరుతూ గొణిగాడు శ్రీనివాస్‌.

‘‘సరేనండీ, ఇంక వెళ్ళొస్తా’’ అంటూ పక్క పోర్షన్‌లోకి నడిచింది సుబ్బలక్ష్మి.

‘‘అమ్మా, స్నానంచేసి రెడీ అవ్వు. కుందన సిస్టర్స్‌లో కిలోల లెక్కన చీరలు అమ్ముతున్నారంట, వెళ్దాం’’ హుషారుగా చెప్పింది సుమతి.

‘‘ఇప్పుడెందుకు దండగ, మొన్ననేగా రెండువేలు తగలబెట్టి చీర కొనిపించావు’’ కోపంగా అన్నాడు శ్రీనివాస్‌.

‘‘అయ్యో, అదేమిటండీ అల్లుడుగారూ, వచ్చే నెలలో పండుగ ఉందిగా, కొనుక్కోనివ్వండి. ఈ వయసులో కాకుంటే ఎప్పుడు కట్టుకుంటుంది. అమ్మా సుమతీ, నేను ఇంట్లోనే ఉండి వంటపనీ పిల్లలనీ చూసుకుంటానుగానీ, మీరిద్దరూ సరదాగా వెళ్ళిరండి’’ చెప్పింది అనసూయమ్మ.

‘‘త్వరగా రెడీ అవ్వండి’’ హడావుడిగా అంది సుమతి. తప్పనిసరై తిట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు శ్రీనివాస్‌.

కూతురునీ అల్లుడినీ సాగనంపడానికి గుమ్మందాకా వచ్చింది అనసూయమ్మ. పక్క ఇంటిలోనుండి బయటకు వచ్చింది సుబ్బలక్ష్మి- ‘‘షాపింగ్‌కి వెళ్తున్నారా?’’ అంటూ.

‘‘అవును’’ ఆనందంగా చెప్పింది అనసూయమ్మ.

‘‘మీ వూళ్ళొ బట్టలు ఎక్కడ బాగుంటాయండీ?’’ మాటవరసకి అంది సుబ్బలక్ష్మి.

అనసూయమ్మ ముఖంలో చకచకా రంగులు మారాయి. ‘‘ఆఁ నేనెప్పుడన్నా వెళ్ళి ఛస్తేగా, నన్నెవరు తీసుకువెళ్తారు. వాళ్ళు టింగురంగామని కారులో బజారుకి వెళితే నేను పనిమనిషిలా ఇంట్లో ఉండి, వంటపనీ పిల్లల పనీ చూడాలి. ఏడాదికి ఓసారి ఒక ముష్టిచీర తెచ్చి నా ముఖాన పడేస్తారు. నచ్చినా నచ్చకున్నా తీసుకోవాలి. ఏం చేస్తాం, ఖర్మ. మా కోడలు మహారాణి మాత్రం ఠంచనుగా ప్రతి పండగకీ చీర కొనుక్కోవలసిందే’’ గబగబా దండకం చదివింది అనసూయమ్మ.

‘‘పోనీలెండి, ఈ వయసులో కాకుంటే ఇంకెప్పుడు కట్టుకుంటారు’’ అంది సుబ్బలక్ష్మి.

‘‘ఆఁ ఇప్పుడు సంపాదిస్తున్నామని ఒళ్ళూపై తెలియకుండా డబ్బులు తగలబెడితే రేపటి మాటేమిటి? అయినా ప్రతి పండగకీ చీర కొనుక్కోవాలని రూలుందా ఏమిటి?’’ చేతులు తిప్పుతూ అంది అనసూయమ్మ.

మాట మారుస్తూ ‘‘వాళ్ళు వచ్చేసరికి లేటవుతుందేమో, వంట చెయ్యాలా?’’ అడిగింది సుబ్బలక్ష్మి.

‘‘అబ్బే, వాళ్ళు టిఫిన్‌ తిని మాకు తెస్తామన్నారు. ఏమైనా మా అల్లుడు బంగారం. సుమతి చెప్పినట్లు వింటాడు. నా కూతురు చాలా అదృష్టవంతురాలు’’ సంబరంగా చెప్పింది అనసూయమ్మ.

‘‘మీ అబ్బాయి కూడా మంచివాడేలెండి’’ ఓదార్పుగా అంది సుబ్బలక్ష్మి.

‘‘నా కొడుకు మంచివాడేనమ్మా, ఆ మహాతల్లే వాడినలా మార్చేసింది. వాడికి పెళ్ళాం మాటే వేదం. ఆడంగివాడు, పెళ్ళాం చెప్పినట్టల్లా ఆడతాడు. పోనీ, వంటన్నా కమ్మగా చేస్తుందా అంటే... వారంలో నాలుగు రోజులు టిఫిన్లూ కూరలూ బయటనుండే. ప్రతివారం పుట్టింటికి వెళ్ళాల్సిందే’’ ఉక్రోషంగా అంది అనసూయమ్మ.

ఏ మాట ఎత్తినా టాపిక్‌ కోడలి దగ్గరకే వెళ్తుండటంతో ‘‘సరే, కాసేపు మా ఇంట్లోకి రండి’’ ఆహ్వానించింది సుబ్బలక్ష్మి.

‘‘మళ్ళీ వారం వచ్చినపుడు వస్తాలెండి, పిల్లలు ఒక్కరే ఉన్నారు. ప్రతి వారం రాకపోతే మా అమ్మాయి బెంగపెట్టుకోదూ’’ చిద్విలాసంగా నవ్వుతూ లోపలికి నడిచింది అనసూయమ్మ.

*  *  *

పిల్లలను తీసుకుని ఆటో దిగింది శిరీష. పెద్దవాడి చేయి పట్టుకుని చిన్నవాడిని ఎత్తుకుని, బ్యాగుతో లోపలకు వస్తున్న శిరీషకు ఎదురువస్తూ ‘‘ఏంటమ్మా, సడెన్‌గా వచ్చావు?’’ చంటివాడిని చేతిలోకి తీసుకుంటూ సంబరంగా అంది కాత్యాయని.

‘‘ఆయన క్యాంప్‌కెళ్ళగానే మా అత్తగారు కూతురింటికి పోతుందిగా. అందుకే ఇలా వచ్చాను. అయినా అన్నయ్య చెప్పలేదా, నేను ఫోన్‌ చేశానని’’ శిరీష విసురుగా అంది.

‘‘ఆఁ వాడు కొంపలో ఎక్కడుంటాడు. అత్తగారింటికి పోయాడుగా’’ నిరసనగా అంది కాత్యాయని.

‘‘అయినా, ఎంత ఒకే వూరైతే మాత్రం ప్రతివారం వెళ్ళాలా, నిన్ను ఒంటరిగా వదిలేసి?’’ కోపంగా అంది శిరీష.

‘‘ఆ ఎప్పుడూ ఉండే భాగోతమేగా. ఈవిడ శనివారం వెళ్తుంది, వీడు సాయంత్రం ఆఫీసవగానే పిల్లిలా అటే పోతాడు. అది సరేగానీ, ఏంటమ్మా అలా చిక్కిపోయావు? క్రితం వారం బాగానే ఉన్నావుగా!?’’ ప్రశ్నించింది కాత్యాయని.

‘‘ఆ ఏం బాగులే, ఇద్దరు చంటిపిల్లలతో అవస్థపడలేక పనిమనుషులను పెట్టుకున్నానని మా అత్తగారు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది. మా ఆయన సంపాదనంతా నేను తగలేస్తున్నానట. కూతురికి మాత్రం ఒక్కరోజు పనిమనిషి రాకుంటే అల్లాడిపోతుంది. ఎప్పుడో ఒకసారి ఇద్దరం సరదాగా బయటకు వెళితే ఇక రోజల్లా సణుగుతుంది. ఆవిడ ప్రతివారం కూతురిని చూడాలి, నేను పుట్టింటికి వస్తే మాత్రం ఓర్వలేదు. మొన్న పండగకి చీర కొంటే ఎంత రాద్ధాంతం చేసిందని! ఆవిడకు ఏడాదికి ఒక్క చీరే ఎక్కువ, బీరువాలో చీరలన్నీ మురిగిపోతున్నాయి. అప్పటికీ కొన్ని కూతురికి చేరవేస్తుంది. ఆ మాట అన్నానని ఒకటే గొడవ. ఆవిడతో చచ్చిపోతున్నాననుకో’’ గుక్కతిప్పుకోకుండా చెప్పింది శిరీష.

‘‘సరేలే, బట్టలు మార్చుకో... భోజనాలు చేద్దాం’’ అంటూ శిరీషకి కొత్త కాటన్‌ చీర ఇచ్చింది కాత్యాయని.

‘‘బాగుందమ్మా, ఎక్కడిది?’’ అడిగింది శిరీష.

‘‘మొన్న పండగకి అన్నయ్య తెచ్చాళ్ళే, నువ్వు తీసుకో. ఇంకో రెండు చీరలు కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్ళు’’ చెప్పింది కాత్యాయని. తలూపింది శిరీష.

పిల్లలకు అన్నం పెట్టి, వాళ్ళు పడుకున్నాక తల్లీ కూతుళ్ళు అన్నాలకు కూర్చున్నారు.

‘‘ఎందుకమ్మా, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చేశావు శ్రమపడి’’ తింటూ అడిగింది శిరీష.

‘‘ఆ ఏదో నోరు బాగోలేదు, మీరు కూడా వచ్చారని చేశాను. మేం ఇంటికూరలు తినేది రెండు రోజులేగా, వారంలో నాలుగు రోజులు ఒంట్లో బాగోలేదనో ఇంకేదో అనో వంకపెట్టి బయటనుండే కూరలూ టిఫిన్లూ తెప్పిస్తుంది డబ్బులు తగలేసి’’ అక్కసుగా అంది కాత్యాయని.

‘‘మరి, అన్నయ్య ఏం అనడా?’’ కోపంగా అడిగింది శిరీష.

‘‘వాడేమంటాడు, ఆడంగి వెధవ. పెళ్ళాం తానా అంటే వాడు తందానా! దానిపై ఈగ వాలనివ్వడు’’ చేతులు తిప్పుతూ చెప్పింది కాత్యాయని.

‘‘అది సరేగానీ, క్యాంపు నుండి అల్లుడిగారిని ఇటే రమ్మనకపోయావా, రెండ్రోజులు ఉండి వెళ్ళొచ్చు’’ చెప్పింది కాత్యాయని.

‘‘నేను చెప్పక్కర్లేదు, ఎల్లుండి ఆయన ఇటే వస్తారు. నన్ను వదిలి ఆయన రెండ్రోజులు కూడా ఉండరు. అంతేకాదు, నేను ఎక్కువ శ్రమ పడటం ఆయనకు ఇష్టం ఉండదు. రోజూ రాత్రిపూట కూరలూ, ఉదయం టిఫినూ బయటనుండే తెస్తారు. మధ్యాహ్నం మాత్రమే నేను వంట చేసేది. మా అత్తగారు గొణిగినా పట్టించుకోరు తెలుసా!’’ గర్వంగా అంది శిరీష.

‘‘నా తల్లే! నా అల్లుడు బంగారమమ్మా’’ మెటికలు విరుస్తూ అంది కాత్యాయని.

*  *  *

అదండీ సంగతి!

ఆ కోడలూ ఒకింటి కూతురే, ఈ కోడలూ ఒకింటి కూతురే! కానీ, ఇద్దరు కూతుళ్ళూ కూడా ఒక అత్తకు కోడళ్ళే!

అత్తలది పాతతరం, వాళ్ళలో మార్పు రాదు!

కోడళ్ళది కొత్త తరం, వీళ్ళు కూడా మారరు!

తరతరాలుగా ఈ ఇంటింటి భాగోతాలు ఇలాగే సాగిపోతున్నాయి.

ఏం చేస్తాం వాళ్లంతే - వీళ్లింతే!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.