close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందాలకీ... అద్భుతాలకీ... చైనా!

అందాలకీ... అద్భుతాలకీ... చైనా!

‘శ్రమైక జీవనసౌందర్యానికి చిరునామాగా నిలిచినా జలవనరుల సంరక్షణ కోసమే ఓ విశ్వవిద్యాలయాన్ని నిర్మించినా, ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆనకట్టను కట్టి, లక్షలమందికి పునరావాసం ఏర్పాటు చేసినా అది చైనీయులకే సాధ్యం’ అంటున్నారు శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్‌ కె.వి.ఎన్‌.చక్రధరబాబు. ఇటీవల భూసేకరణ విధివిధానాలకోసం భారత ప్రభుత్వం తరపున ఆ దేశంలో పర్యటించిన అధికారుల్లో ఒకరైన ఆయన తన అనుభవాలను ‘ఈనాడు ఆదివారం’తో పంచుకున్నారిలా...

హైదరాబాద్‌లోని ‘అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా’ దేశం నలుమూలలనుంచి 18మంది అధికారులను ఎంపికచేసి, భూసేకరణ విధానాలపై అధ్య యనం చేసేందుకు చైనాకు పంపించింది. నాతోబాటు పశ్చిమగోదావరి జేసీ కోటేశ్వరరావు, విజయనగరం జేసీ శ్రీకేశ్‌లాట్కర్‌, రంపచోడవరం ఐటీడీఏపీఓ దినేశ్‌కుమార్‌ ఉన్నారు. మేమంతా హైదరాబాదు నుంచి కాథే పసిఫిక్‌ విమానంలో బయలుదేరి, హాంకాంగ్‌ మీదుగా నాంజింగ్‌కు చేరుకున్నాం.

నాంజింగ్‌ పురాతన నగరం. నగరం చుట్టూ గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా మాదిరిగానే గోడ నిర్మితమై ఉంది. ఓ పక్క పురాతన సంస్కృతితోనూ మరోపక్క ఆధునిక హంగులతోనూ అలరారుతుంటుంది. నదుల్లో షికారు చేయడానికి క్రూయిజ్‌ పడవలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పడవలే రవాణా సాధనాలు. నాంజింగ్‌లోని హోహాయ్‌ యూనివర్సిటీలోనే మాకు తరగతులు నిర్వహించారు. హోహాయ్‌... జలవనరులకోసమే ఏర్పాటయిన విశ్వవిద్యాలయం. హో అంటే నది, హాయ్‌ అంటే సముద్రం... ఈ రెండూ స్ఫురించేలా దీనికా పేరు పెట్టారు. ఈ తరహా యూనివర్సిటీ ప్రపంచంలో మరెక్కడా లేదు. నీటిసంరక్షణ, నీటిపారుదల... వంటి అనేక అంశాల్లో ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు. భారీ ఆనకట్టలు, వంతెనలు... డిజైన్‌ చేయడమే కాకుండా నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ రీసెటిల్మెంటు (ఎన్‌ఆర్‌సీఆర్‌) అనే ప్రత్యేక విభాగం ద్వారా పునరావాస నిర్మాణాలగురించీ బోధన తరగతులు నిర్వహిస్తారు. ఇందులో డిగ్రీ నుంచీ పీహెచ్‌డీ వరకూ చదువుకోవచ్చు. 50వేల మంది ఉద్యోగులతో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్న రీ సెటిల్మెంట్‌ బ్యూరో అనే జాతీయసంస్థ కూడా ఉంది. అన్ని రకాల ప్రాజెక్టులకూ ఈ సంస్థ రీసెటిల్మెంట్లు చేస్తుంది. విశ్వవిద్యాలయం, ఎన్‌ఆర్‌సీఆర్‌, రీసెటిల్మెంట్‌ బ్యూరో.. ఈ మూడూ ఆ దేశంలోని ప్రాజెక్టులకు వూతంగా నిలుస్తాయి. యాంగ్జే నది చైనాకు ఎప్పుడెప్పుడు ఎంత నష్టం కలిగించింది, అంత పెద్ద ఆనకట్టను ఎందుకు కట్టాల్సి వచ్చింది, దానికి సంబంధించిన డిజైన్లూ, ప్రణాళిక, పునరావాసం... వంటి విషయాలన్నింటితో త్రీగార్జెస్‌ ప్రాజెక్టు గురించి పవర్‌పాయింటు ప్రజెంటేషన్‌ ద్వారా చూపించారు.

నాంజింగ్‌ నగరంలో చైనీస్‌ ఆహారం మాకస్సలు సహించలేదు. బాతు నాలుక వేపుడు అక్కడ ఓ ప్రత్యేక వంటకం. కాళ్ల గోళ్లతో సహా వండేస్తారు. అలాగే ఆక్టోపస్‌, కప్పలసూపు, బీఫ్‌, పోర్కు... ఇలా ఇరవై రకాలకు పైగా వంటకాలు ఉన్నాయి. మాంసాహారులకూ ఏం తినాలో తెలీక తలపట్టుకున్నారు. వాళ్ల అవస్థని గ్రహించి కోడి, చేపల వంటకాలు చేశారు. మా బృందంలో నలుగురం మాత్రమే శాకాహారులం. మాకోసం కూరగాయలు, నల్ల పుట్టగొడుగులు, కొత్తిమీర, ఆకుకూరలు, దుంపలతో భారతీయ వంటకాలను పోలిన రకాలను వండిపెట్టారు. రెండురోజులపాటు నగరమంతా తిరిగి కర్ణాటకకు చెందిన రమేష్‌ నిర్వహిస్తోన్న రెస్ట్టరెంటుని వెతికి పట్టుకుని బతుకుజీవుడా అనుకున్నాం.

కన్‌ఫ్యూషియస్‌ ఆలయం!
నాంజింగ్‌లో సిటీవాల్‌ చూశాక కన్‌ఫ్యూషియస్‌ ఆలయానికి వెళ్లాం. కన్‌ఫ్యూషియస్‌ అనే వ్యక్తి బోధించినదే కన్‌ఫ్యూషియనిజం. చైనాలో రెండే ప్రధాన మతాలు. బుద్ధిజం, కన్‌ఫ్యూషియనిజం. ఇస్లాం, క్రైస్తవం చాలా తక్కువ. ఆలయంలో గుండ్రంగా తిరిగే గంటలు ఉన్నాయి. అక్కడ మూడు అడుగుల పొడవున్న అగర్‌బత్తులు వెలిగిస్తారు. కొబ్బరికాయలు కొట్టరుగానీ భక్తులు సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. పూజారులు ఉండరు, ఎవరికి వాళ్లు ప్రార్థనలు చేసుకుని వెళతారు. మర్నాడు స్టార్టప్‌లకీ పరిశోధనలకీ వేదికగా ఉన్న నాంజింగ్‌ జియాంజింగ్‌ ఝిజిన్‌ హైటెక్‌ ఇన్నోవేషన్‌ జోన్‌లోకి వెళ్లాం. ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యుబేషన్‌ కేంద్రం ఇది. దాదాపు 8 వేలకు పైగా సంస్థలు ఉన్నాయక్కడ. ఈ టెక్నాలజీ పార్కులో త్రీడీ ప్రింటింగూ తక్కువ బడ్జెట్‌లో రోబోలనూ కార్లనూ తయారుచేయడం... వంటివన్నీ చూడొచ్చు.

బుల్లెట్‌ రైల్లో ప్రయాణం!
తరవాతిరోజు నాంజింగ్‌ నుంచి హుహాన్‌ వెళ్లాం. ఇదో పురాతన కౌంటీ. 800 కి.మీ. దూరాన్ని కేవలం రెండున్నర గంటల్లో చేరుకున్నాం. దారి పొడవునా ఎన్నో సొరంగాలూ, మరెన్నో లోయలూ... రైలు పట్టాలకు ఇరువైపులా ఫెన్సింగులాంటిది నిర్మించారు. పశువులూ, మనుషులూ పట్టాలమీదకి రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. అక్కడి రైల్వేస్టేషనులోనూ ఎస్కలేటర్లూ చెకింగులూ... ఇలా విమానాశ్రయానికి ఏమాత్రం తగ్గకుండా అన్ని హంగులూ ఉన్నాయి. చైనా అంతటా అన్ని ప్రావిన్సులకూ హైస్పీడ్‌ బుల్లెట్‌ రైళ్లు ఉన్నాయి. యాంగ్జే రివర్‌ వాటర్‌ కన్సర్వెన్సీ కమిషన్‌ కార్యాలయం ఈ నగరంలోనే ఉంది. ఇది 50 అంతస్తుల భవనం. ఇక్కడ ప్రతి నదికీ ఈ రకమైన కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ఆ నదిలో లభ్యమయ్యే నీటిని ఏయే నగరాలకు పంపిణీ చేయాలి, తాగునీటికీ సాగుకీ ఎంతెంత నీరివ్వాలి, విద్యుత్తు ఉత్పత్తికి ఎంత పంపిణీ చేయాలి... ఇలా అన్ని అంశాలనూ ఈ కమిషన్‌ పర్యవేక్షిస్తుంటుంది. ఈ భవనంలోనే మాకు త్రీడీ మోడల్స్‌తో త్రీగార్జెస్‌ నిర్మాణంలోని అన్ని దశల గురించీ చూపించారు. హుహాన్‌ నగరంలో సైకిళ్ల వాడకం ఎక్కువ. వీటికోసం ఓ ప్రత్యేక ఆప్‌ ఉంది. మొబైల్‌లో బుక్‌ చేసుకుంటే సైకిల్‌పై ఉండే బార్‌ కోడ్‌ వస్తుంది. ఆ కోడ్‌కి మ్యాచ్‌ అయిన సైకిల్‌ను తీసుకుని, నిర్దేశిత ప్రదేశానికి చేరుకున్నాక అక్కడి పార్కింగు స్థలంలో పెట్టేస్తే ఆటోమేటిగ్గా అది లాక్‌ అయిపోతుంది. సిటీ అంతటా సైకిళ్లూ బాటసారులూ కార్లూ ట్రామ్‌లూ... ఇలా వేటికవి ప్రత్యేక లైన్లలో వెళ్లేలా రోడ్లను డిజైన్‌ చేశారు.

ముఖ్యంగా అక్కడి ప్రజల జీవనవిధానంలో కనిపించే క్రమశిక్షణ, పనిపట్ల నిబద్ధత చకితుల్ని చేస్తాయి. అక్కడ పాఠశాలలనుంచి కార్యాలయాల వరకూ అన్నీ ఎనిమిది గంటలకే తెరుస్తారు. పెద్దాచిన్నా అంతా ఉదయం ఆరుగంటలకే తయారయిపోతారు. సాయంకాలం 5.30 కల్లా అన్నీ కట్టేయాల్సిందే. వ్యవసాయ క్షేత్రాల్లోని పనివేళలూ ఇదే పద్ధతిలో ఉంటాయి. రైతులు వ్యవసాయం చేయడంతోబాటు కోళ్లూ, పశువులూ వంటివి పెంచుతుంటారు. మధ్యాహ్నం అరగంట మాత్రమే భోజన విరామం. సా. 6.30- 7.30లోగానే రాత్రి భోజనం చేసేసి ఎనిమిది గంటలకే నిద్రకు ఉపక్రమిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హోటల్స్‌ అన్నీ రాత్రి ఏడున్నరకే మూసేస్తారు. దాదాపు 9 గంటలపాటు నిరంతరాయంగా కష్టపడతారు. సూర్యోదయంతో మొదలెట్టి, సూర్యాస్తమయంలోపు చేసే పనిని సమర్థంగా చేయగలమనీ అదే అభివృద్ధికి కారణమనీ వాళ్లు భావిస్తారు. ఈ పనీ ఆ పనీ అన్న తేడా లేకుండా పురుషులతో సమానంగా స్త్రీలూ అన్ని రంగాల్లోనూ కష్టపడతారు. అక్కడ చూద్దామన్నా వూబకాయులు కనిపించరు. అంతా సన్నగా ఉంటారు. ఆహారపుటలవాట్లతోబాటు పని, నిద్రవేళల్ని తు.చ.తప్పక పాటించడమే ఇందుకు కారణం.

అవతార్‌ చిత్రీకరణ ఇక్కడే...
ఆ తరవాతిరోజు హుహాన్‌ నుంచి ఇషాంగ్‌కు బస్సులో బయలుదేరి 420 కి.మీ.దూరాన్ని కేవలం మూడు గంటల్లో చేరుకున్నాం. గైడు అన్నీ వివరిస్తూ తీసుకెళ్లాడు. కొండలమధ్య నుంచి వేసిన ఈ రహదారిలో సొరంగాలన్నీ కనీసం 6 కి.మీ పొడవున్నాయి. ప్రతి 30 అడుగులకు ఆక్సిజన్‌ సిలిండర్లూ అయిదు అడుగులకు రెండు విద్యుత్తు దీపాలూ ఏర్పాటుచేశారు. గాలి వెళ్లేందుకు వీలుగా నిర్మాణాలు ఉన్నాయి. వర్షం వచ్చినా ఈ మార్గంలో బస్సులు ప్రయాణిస్తూనే ఉంటాయి. కొండ చరియలు విరిగిపడకుండా తగిన చర్యలు చేపట్టారు. ఇక్కడ కొండలమీద వెదురు, ఎత్తైన పైన్‌, సైకస్‌ చెట్లు కనిపిస్తాయి. అవతార్‌ సినిమాను ఇక్కడే చిత్రీకరించారట. ఆరోజు మధ్యాహ్నానికి త్రీగార్జెస్‌ యూనివర్సిటీకి చేరాం. అక్కడ అన్నీ త్రీగార్జెస్‌ పేరుతోనే ఉన్నాయి. మేమున్న హోటల్‌ పేరు కూడా త్రీగార్జెస్సే. పునరావాసంలో వాళ్లు తీసుకున్న విధివిధానాల గురించి తరగతులు ఇచ్చారు. తరవాత డ్యామ్‌ సైట్‌కు తీసుకెళ్లారు. ఆనకట్టకు పైన పునరావాస కాలనీలు ఉన్నాయి. అక్కడ ఉన్న బూట్ల కంపెనీలో 80 శాతం మంది ప్రాజెక్టు నిర్వాసితులే. రీబక్‌తో సహా పేరొందిన అన్ని రకాల షూలకూ నకిలీలను తయారుచేస్తారక్కడ. ప్రపంచంలోని అన్ని రకాల ఉత్పత్తుల నకిలీలూ చైనాలో తయారవుతుంటాయి. తరవాత ఆరెంజ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కి వెళ్లాం. మొత్తం 13లక్షలమంది నిర్వాసితులకోసం చైనా 136 సంస్థలను నెలకొల్పి, ఉపాధి అవకాశాలు కల్పించింది. 1993 నుంచి 2006 వరకు ప్రాజెక్టు నిర్మాణంలో ఆవాసం కోల్పోయిన వారికి కాలనీల్లో 2013ల వరకు పునరావాసం కల్పిస్తూనే ఉన్నారు. భూమి పోయినందుకూ సొంత వూరు విడిచి వచ్చినందుకూ కాస్త బాధ ఉన్నప్పటికీ దేశ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకోసం వాటిని వదులుకోవడం మాకు గర్వకారణమే అంటున్నారక్కడి ప్రజలు.

త్రీగార్జెస్‌... మహాద్భుతం..!
చైనాలోకెల్లా పొడవైన యాంగ్జే నదిమీద నిర్మించిన ఆనకట్టే త్రీ గార్జెస్‌. ఇక్కడ హై సెక్యూరిటీ జోన్‌గా కొంత ప్రాంతాన్ని కేటాయించి, దానికి పక్కనే పర్యటకులకోసం నిర్మించారు. హైసెక్యూరిటీ జోన్‌లో పవర్‌ప్లాంట్లు ఉన్నాయి. ఈ ఆనకట్టను రెన్యువబుల్‌ ఎనర్జీ మోడల్‌గా చూపిస్తున్నప్పటికీ దీని నిర్మాణం వెనకున్న ప్రధానోద్దేశం వరదల్ని అరికట్టడమే. యాంగ్జే నదికి ప్రతి పదిహేనేళ్లకీ వరదలొచ్చి భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగేది. ఈ ఆనకట్టతో వాటిని అడ్డుకోగలిగారు. వరద నియంత్రణ, విద్యుత్‌ ఉత్పత్తి, జలరవాణాకు అనుకూలంగా త్రీగార్జెస్‌ను అద్భుతంగా నిర్మించారు. ఏకకాలంలో ఆరు భారీ ఓడలు రాకపోకలు సాగించేలా ఈ ఆనకట్టను డిజైన్‌ చేశారు. పరిశ్రమలకు ముడిసరుకు తీసుకెళ్లేందుకు ఈ రవాణాను వినియోగిస్తున్నారు. వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు హైస్పీడ్‌ లిఫ్ట్‌ విధానాన్ని కూడా వాడుకోవచ్చు. అంటే లిఫ్ట్‌లో కేవలం 40 సెకన్లలో 6 వేల టన్నుల సామర్థ్యం ఉన్న నౌక పైకి వెళ్లి అవతల వైపునకు దాటేస్తుంది.

త్రీగార్జెస్‌ సందర్శనతో మా 15 రోజుల కోర్సు పూర్తయినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. కృతజ్ఞతలు చెప్పి లోకల్‌ రైల్లో బయలుదేరాం. అర్ధరాత్రి 12 గంటలకు షాంగై చేరాం. నాంజింగ్‌రోడ్డు, బీజింగ్‌ రోడ్డు... ఇలా చైనా దేశంలోని అన్ని ప్రావిన్సులూ నగరాల పేర్లూ షాంగై నగరంలో కనిపిస్తాయి. ఒకరకంగా దేశం మొత్తం ఇక్కడ ప్రతిబింబిస్తుందన్నమాట. జాతీయ భావం కల్పించడానికి వ్యాపారపరంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చినవాళ్లు వాళ్ల ప్రాంతాలను మరిచిపోకుండా ప్రతి వీధికీ ప్రతి రోడ్డుకీ కూడా చైనాలోని ఇతర నగరాల, ప్రావిన్సుల పేర్లు పెట్టిన విధానం అబ్బురపరిచింది. మర్నాడు ఉదయం ఆరు గంటలకు విమానంలో తిరుగు ప్రయాణమై హాంకాంగ్‌కు చేరుకున్నాం. అక్కడ ట్రాన్సిట్‌ వీసా తీసుకుని సాయంత్రం వరకు తిరిగి ముంబాయి మీదుగా విశాఖకు చేరుకున్నాం.

- అడ్డాల రామకృష్ణ, ఈనాడు, శ్రీకాకుళం

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.